జరాసంధుడు
ఐదోవేదం: మహాభారత పాత్రలు - 28
జరాసంధుడు రెండు సగాలుగా పుట్టిన రాజకుమారుడు. ఆ సగాలను ‘జరా’ అనే రాక్షసి సంధించగా అతను జరాసంధు డయ్యాడు. ‘జరా’ అంటే, ముసలితనం. అది మార్పులకు పరాకాష్ఠ. జరాసంధుడి తండ్రి మగధనేలిన బృహద్రథుడు. అతనికి ఇద్దరు భార్యలు. వాళ్లు కాశిరాజుకి పుట్టిన కవల కూతుళ్లు. ‘మిమ్మల్నిద్దర్నీ ఒకే తీరుగా ప్రేమిస్తాను’ అని బృహద్రథుడు భార్యలిద్దరికీ మాట ఇచ్చాడు.
అయితే ఎన్ని మంగళ కార్యాలు, హోమాలు చేసినా అతనికి పిల్లలు పుట్టలేదు. ఒకసారి చండకౌశికుడనే ముని వీరి రాజ్యానికి వచ్చాడు. పుత్రుణ్ని ప్రసా దించమని రాజు ఆ మునిని ప్రార్థించాడు. ముని ధ్యానంలో కూర్చున్నాడు. కొంత సేపటికి, ఓ మామిడి పండు ముని ఒడిలోకి వచ్చి పడింది. దాన్ని మంత్రించి రాజు చేతికిచ్చాడు. అతడా పండును తీసుకువెళ్లి పెళ్లాల చేతిలో పెట్టాడు. భార్యల్ని సమానంగా చూస్తానన్న మాటను బట్టి వాళ్లు ఆ పండును రెండు సగాలు చేసి తిన్నారు. అయితే ఇద్దరు పిల్లలు పుట్టలేదు; రెండు శరీర శకలాలు పుట్టాయి. అవి ముక్కలే అయినా బతికే ఉన్నాయి.
తల్లులు తల్లడిల్లిపోయారు. దాదుల్ని పిలిచి బయట పడేసి రమ్మని పంపించారు. రోడ్ల కూడలిలో విసిరేసిన ఆ ముక్కల్ని ‘జరా’ అనే రాక్షసి తిందామనుకుని రెండిటినీ దగ్గరికి చేర్చింది. అప్పుడు ఆ రెండూ కలసి ఒక వీర కుమారుడిగా తయారయ్యాయి. ఆ రాక్షసి క్రూరమైనది కాదు. ఆ ఊళ్లో ఆవిడను గృహేశ్వరిగా చెప్పుకొనేవాళ్లు. ఆమె ఏమైనా తింటే, మంగళమవుతుందని ఆ ఊరివాళ్ల భావన. పిల్లవాడి కోసం అర్రులు చాచి చూస్తున్న రాజు కొడుకును చంపకూడదని అనుకుంది ఆ రాక్షసి. ఒక మానుష స్త్రీ రూపాన్ని దాల్చి, ఆ అబ్బాయిని రాజుగారి దగ్గరికి తీసుకొని వెళ్లింది. రాజు కృతజ్ఞతతో ఆ కుర్రాడికి ‘జరాసంధుడు’ అని పేరు పెట్టుకున్నాడు.
జరాసంధుడు ఎంత బలసంపన్ను డైనా, ఎదురుపడిన అందరి తేజస్సునూ హరించేవాడైనా, ఏ శస్త్రాలతోనూ చావని హంసడింభకులనే వీరులు అతని సహా యకులైనా, కంసుడంతటి బలవంతుడు అల్లుడిగా ఆసరాగా ఉన్నా, శిశుపాలుడు సేనాపతిలాగ సాయంగా ఉన్నా కూడా కలపబడిన ఒంటిముక్కలతో ఏర్పడ్డాడు గనక అతడు భీముడి చేతిలో చచ్చిపోవలసి వచ్చింది.
జరాసంధుడికి అస్తీ, ప్రాస్తీ అనే ఇద్దరు కూతుళ్లున్నారు.
వాళ్లను కంసుడికిచ్చి పెళ్లి చేశాడు. కంసుడు తన చెల్లెలు దేవకి కడుపున పుట్టే ఎనిమిదో సంతానం వల్ల చచ్చిపోతానన్న భయంతో ఆవిడకు పుట్టిన పిల్లలను వరసగా చంపడం మొదలు పెట్టినా, అతనికి సందిగ్ధత కలగడానికి ఏడోసారి గర్భాన్ని రోహిణికి బదలా యించడమూ, ఆ తర్వాత పుట్టిన కృష్ణుణ్ని యశోద పక్కలో పడుకోబెట్టి, అక్కడ పుట్టిన ఆడపిల్లను ఇక్కడకు తేవడమూ, ఆ అమ్మాయిని చంపబోతే గాలిలోకి ఎగిరి పోతూ ‘నిన్ను చంపేవాడు’ పుట్టేశాడని చెప్పడమూ కంసుడి భయాన్ని పెంచాయి.
పుట్టిన పిల్లలనందర్నీ చంపమని పూతన, శకటాసురుడు, తృణావర్తుడు మొదలైన చాలామందినే పంపాడు. అతను పంపిన వాళ్లంతా కృష్ణుడి చేతిలో చచ్చిపోయారు. అక్రూరుణ్ని పంపించి, బలరామకృష్ణుల్ని ధనుర్యాగం చూడడమనే మిషను పెట్టి, ‘చావు’ను తన దగ్గరికే పిలిపించుకున్నాడు. వాళ్లు మథురకు వస్తూనే ఆ వింటిని విరగ్గొట్టారు. భూవలయానికే అలం కారమని పేరుపొందిన కువలయా పీడ మనే బలిష్ఠమైన ఏనుగును మీదకు ఉసి గొలిపితే, దంతాలూడబెరికి దాన్ని చంపేశారు; కండలు తిరిగిన మల్ల యోధులు చాణూర ముష్టికుల్ని ఉపయోగించి చంపుదామనుకుంటే, వాళ్లనూ చంపేశారు.
ఆ మీద కృష్ణుడు, కంసుడు కుస్తీపట్లను చూడ్డానికి ఎక్కి కూర్చొన్న మంచె మీదకు లంఘించి... అతని జుట్టు పట్టుకొని కిందకు పడేసి తానూ అతని మీదకు ఉరికి చంపి నేలమీద ఈడ్చేశాడు. దాంతో అస్తి ప్రాప్తులిద్దరూ ఒకేసారి విధవలైపోయారు. తండ్రి దగ్గరికి చేరి, ‘మా భర్తను చంపిన వాణ్ని చంపి ప్రతీకారం తీర్చ’మని అతన్ని ప్రేరేపించారు. దాంతో జరాసంధుడికి కృష్ణుడితో వైరం ప్రారంభమైంది. తన గదను తొంభై తొమ్మిదిసార్లు తిప్పి తిప్పి తన ఊరు గిరివ్రజం నుంచి మథురవైపు విసిరితే, తొంభై తొమ్మిది యోజనాలు దూరంలో ఉన్న మథుర దగ్గర పడింది. ఆ ప్రదేశం ‘గదావసానం’గా ప్రసిద్ధికెక్కింది.
జరాసంధుడు యుద్ధానికి వెళ్తే ఎదుటి వాళ్ల తేజస్సును హరించే శక్తి ఉన్నవాడు గనక చాలామంది రాజుల్ని అలవోకగానే జయించాడు. జయించడమే గాక, వాళ్లను రుద్రయజ్ఞంలో బలి ఇద్దామని ఇరవై వేల పైచిలుకు మంది రాజుల్ని తన నగరం గిరి వ్రజంలో ఖైదు చేసి ఉంచాడు. మథురలో ఉన్న కృష్ణుణ్ని కూడా అంత సులువుగానూ జయించాలని ఇరవై మూడు అక్షౌహిణీల సైన్యాన్ని తీసుకొని దండెత్తాడు. బలరామ కృష్ణులు ఆ అక్షౌహిణీలనన్నిటినీ సంహ రించి, జరాసంధుణ్ణి మాత్రం చంపకుండా వదిలి పెట్టారు.
దానికి కారణం ఉంది. అతగాడు మళ్లీ మళ్లీ అంతంత సైన్యాన్నీ తెచ్చుకొని వస్తాడు గనక, భూభారాన్ని కొంతలో కొంత మథుర సీమలోనే తగ్గించ వచ్చు అని. ఇలా అతను పదిహేడుసార్లు ప్రతి తూరీ ఇరవై మూడు అక్షౌహిణీలతో వచ్చి తాను ఒక్కడే తిరిగి వెళ్తూండేవాడు. పదిహేడో యుద్ధంలో హంసుడనే ఒక యోధుడు బలరాముడి చేతిలో చనిపోతే, తన సహ సేనాపతే పోయాడని డింభకుడు గూడా బాధతో యమునాప్రవాహంలోకి ఉరికి చచ్చిపోయాడు. డింభకుడు ఈ విధంగా ఒక అబద్ధపు చావు విని పోవడం చూసి, హంసుడు నిజంగానే ఆ యమున లోకి దుమికి ప్రాణాల్ని వదిలేశాడు.
ఇలా ఏ శస్త్రానికీ చావని హంస డింభకులు ఒక్క సారిగా చచ్చిపోయి జరాసంధుడికి గొప్ప బాధనే మిగిల్చారు. పద్దెనిమిదోసారి, బలరామకృష్ణులు అతన్ని మోసగించ డానికి పరిగెత్తుతూ పారిపోతూన్నట్టు నటించి, ఎప్పుడూ ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉండే ప్రవర్షణ పర్వతం మీదకు ఎక్కారు. జరాసంధుడు ఆ కొండ చుట్టూ ఎండు కట్టెలు పేర్పించి నిప్పంటించాడు. వాళ్లిద్దరూ కొండమీంచి ఉరికి బయటపడి వెళ్లిపోయారు. జరా సంధుడు మాత్రం బలరామకృష్ణులిద్దరూ ఆ మంటల్లో కాలిపోయారనే దిలాసాతో గిరివ్రజానికి తిరిగి వెళ్లిపోయాడు.
మథురలో ఉంటే ఇలా అస్తమానూ జరాసంధుడు దండెత్తుతూనే ఉంటాడని, సముద్రంలో ఉన్న ద్వారకకు రాజధానిని మార్పించాడు శ్రీకృష్ణుడు. అక్కడికి దండెత్తి వెళ్లడం కష్టం గనక, జరాసంధుడి దాడులూ ఆగాయి. కానీ అతని కోపం మాత్రం చల్లారలేదు. ధర్మరాజు రాజ సూయయాగం చేయడానికి ఉపక్రమిస్తూ, శ్రీకృష్ణుడు తనకు మార్గదర్శకుడిగా ఉండా లని ప్రార్థిస్తూ వర్తమానం పంపాడు. ఆ వర్తమానం వచ్చేముందే, జరాసంధుడు చెరసాలలో పెట్టిన రాజుల నుంచి రహ స్యంగా ఒక దూత వచ్చి, వాళ్లను విడి పించి కాపాడాలని విన్నవించాడు. రెండు పనులూ ఒకేసారి ఎలా జరుగుతాయి? అప్పుడు ఉద్ధవుడు కృష్ణుడితో ‘ధర్మరాజు రాజసూయం చేయాలంటే, రాజులందర్నీ జయించాలి.
ఆ దిగ్విజయానికి పెద్ద అడ్డు జరాసంధుడే. అంచేత అతన్ని మట్టు బెట్టడం అవసరం. అతను చావగానే చెర సాలలో ఉండే రాజులందరూ ముక్తులవు తారు. కనక జరాసంధుణ్ని చంపేందుకు పథకం వేస్తే రెండు పనుల్నీ ఒకేసారి సాధించవచ్చు’ అని సలహా ఇచ్చాడు. ఈ పనుల్ని ఒకేసారి చేయడానికి ముందు ధర్మరాజు దగ్గరికే వెళ్లాడు కృష్ణుడు. ధర్మరాజుతో జరాసంధుణ్ని చంపడం గురించి మంతనాలు చేశాడు: ‘జరా సంధుణ్ని రణంలో చంపడమన్నది సురా సురులందరూ కలసినా అయ్యే పని గాదు.
అతన్ని బాహుయుద్ధంలోనే జయించాలి. నాలో నీతీ భీముడిలో బలమూ అర్జు నుడిలో మమ్మల్నిద్దర్నీ రక్షించగలిగే శక్తీ ఉన్నాయి. బలం గుడ్డిది; దానికి మాలో ఉన్న విచక్షణ అవసరం. అంచేత నామీద నమ్మకం ఉంచి భీమార్జునులిద్దర్నీ నా చేతిలో పెట్టావంటే, జరాసంధుణ్ని చంపి తిరిగి వస్తాను’ అన్నాడు. నయమూ జయమూ బలమూ కలసి విక్రమిస్తే సిద్ధి తథ్యమని యుధిష్ఠిరుడు ఆ ముగ్గుర్నీ గిరివ్రజానికి పంపించాడు. ముగ్గురూ మూడు అగ్నుల్లాగ తేజస్వంతులైన బ్రాహ్మ ణుల వేషాలు వేసుకొని బయలుదేరారు. విపులగిరీ వరాహగిరీ వృషభగిరీ ఋషిగిరీ చైత్యగిరీ అనే ఐదు గిరులు ఒకదానితో ఒకటి ఒరుసుకుంటూ కలసి గిరివ్రజాన్ని చుట్టి రక్షిస్తున్నాయి.
సూర్యచంద్రాగ్నుల్లాటి ఆ ముగ్గురూ ముఖద్వారాన్ని వదిలిపెట్టి, ఎత్తయిన చైత్యక పర్వతం మీదుగా గిరి వ్రజానికి చేరుకున్నారు. అక్కడ ఎద్దు రూపంలో వచ్చిన ఋషభుడనే రాక్షసుణ్ని జరాసంధుడి తండ్రి బృహద్రథుడు చంపి, ఆ రాక్షసుడి మాంసంతో మూడు భేరీలను మోగించినప్పుడు దివ్యపుష్ప వర్షం పడుతూ ఉండేది. ఆ మూడు భేరీలనూ ఈ ముగ్గురూ బద్దలుగొట్టి చైత్యశిఖరాన్ని తమ బాహుబలంతో విరగ్గొట్టి, గిరివ్రజంలోకి చొరబడ్డారు. జరాసంధుడి దగ్గరికి చేరారు. బ్రాహ్మణులకు పూజ చేయడం అతని వ్రతం. కృష్ణుడొక్కడే మాట్లాడుతూ ‘మా తోటి వాళ్లిద్దరూ అర్ధరాత్రి దాటితేనే గానీ మాట్లాడరు’ అని చెబితే, వాళ్లను యజ్ఞశాలలోనే ఉండమని, రాత్రి తిరిగి వస్తానని చెబుతూ జరాసంధుడు రాజభవనానికి వెళ్లిపోయాడు.
బ్రాహ్మణులంటే ఎంతో గౌరవం గనకనే మాట ప్రకారం అర్ధరాత్రి తిరిగి వచ్చాడు. వాళ్లను నిశితంగా చూసి క్షత్రి యుల్లాగ ఉన్నారని పసిగట్టి నిలదీశాడు. కృష్ణుడు దానికి ‘మేము బ్రాహ్మణులం కాము. నేను కృష్ణుణ్ని. వీళ్లిద్దరూ మా మేన బావలైన భీమార్జునులు. మాతో యుద్ధం చెయ్యి. ఆ రాజులనందర్నీ విడిచి పెట్టు, లేదా యముడి దగ్గరికి పో!’ అన్నాడు.
‘నేను ఆ రాజులనందర్నీ దేవతా బలికోసం తెచ్చి ఎందుకు విడిచిపెట్టాలి? మన సేనలతో గానీ, మీలో ఒకడితో గానీ ఇద్దరితో గానీ ముగ్గురితోనూ గానీ నేను పోరాడతాను, రండి’ అని, కొడుకైన సహదేవుడికి పట్టంగట్టి, యుద్ధం చేయడానికి వచ్చాడు జరాసంధుడు. భీముడు జరాసంధుణ్ని పైకి లేవనెత్తి వేగంగా తిప్పడం మొదలుపెట్టాడు. తిప్పి తిప్పి మోకాళ్లతో వీపును విరిచి, శరీరాన్ని పిప్పిపిప్పిగా నలుపుతూ గర్జించాడు. ఒక చేత్తో జరాసంధుడి ఒక కాలు పట్టుకొని, రెండో కాలిమీద తన కాలు ఉంచి, అతన్ని రెండు ముక్కలుగా చీల్చేశాడు.
అలా రెండు సగాలుగా పుట్టినవాణ్ని రెండు సగాలుగానే చేసి యమలోకానికి పంపాడు. తన ఎక్కువతనాన్ని నిలబెట్టు కోవడానికి అతిక్రూరంగా చేద్దామనుకొన్న రుద్రయజ్ఞం చెయ్యకుండానే చచ్చి పోయాడు తానే అందరికన్నా అధికుణ్నను కున్న జరాసంధుడు. శ్రీకృష్ణుడు అతని చెరసాలలో ఉన్న రాజులందర్నీ విడిపించి, వాళ్లందరిచేతా ధర్మరాజుకు కప్పం కట్టించాడు. ఆ విధంగా మహాభారత యుద్ధానికి అంకురం లాంటి రాజసూయ యాగాన్ని నిర్విఘ్నంగా నడిపించడానికి శ్రీకారం చుట్టాడు శ్రీకృష్ణుడు.
- డా॥ముంజులూరి నరసింహారావు