విరటుడు | Mahabharat characters - 30 | Sakshi
Sakshi News home page

విరటుడు

Published Sun, Jan 10 2016 3:49 AM | Last Updated on Sun, Sep 3 2017 3:23 PM

విరటుడు

విరటుడు

ఐదోవేదం : మహాభారత పాత్రలు - 30
విరటుడు మత్స్యదేశానికి అధిపతి. పాండవులు పన్నెండేళ్ల వనవాసం పూర్తి చేసుకొని, ఎవరికీ తెలియకుండా గడప వలసిన పదమూడో ఏడాదిని మారు వేషాల్లోనూ మారుపేర్లతోనూ ఈ విరాట రాజు కొలువులో గడిపారు. భౌతికమైన కోరికలు అలవాట్లుగా స్థిరపడి, మనిషిని పూర్తిగా వశం చేసు కున్నప్పుడు, ఆ అలవాట్లనే దొంగరాజుల పాలన నుంచి తన శరీర రాజ్యాన్ని విడి పించడానికి, కనీసం పన్నెండేళ్లైనా వ్యవధి పడుతుంది సాధకుడికి.

శారీరకమూ మాన సికమూ అయిన మార్పులకూ... మంచి అలవాట్లను అలవర్చుకుని, వాటిని దృఢంగా నిలుపుకోడానికీ అథమపక్షం ఒక పుష్కర సమయం కావాలి. పోయిన శరీర రాజ్యాన్ని తిరిగి పొందడానికి వివేక గుణబలగాలు, ఆ బలాన్ని సమాధి యోగానుభవంలో స్థిరమూ దృఢమూ చేసుకోవాలి. అలా వివేక బలాల్ని నిలుపు కొంటూ శరీరం గుండా, ఇంద్రియాల గుండా వాటిని రూఢీగా ప్రకాశింప జేయగలగాలి.

అలా తమ సామర్థ్యాన్ని నిరూపించుకొన్న తరవాత, అవి శారీరక రాజ్యాన్ని తిరిగి తమ అధీనంలోకి తీసు కోవడానికి చేయవలసిన ఆధ్యాత్మిక యుద్ధానికి సిద్ధంగా ఉంటాయి. వన వాసాన్ని పాండవులు తమ ఆధ్యాత్మిక శక్తుల్ని దృఢపరుచుకోడానికి ఉపయో గించారు. పన్నెండేళ్లు వాళ్లు తమ తమ వివేక బలగాల్ని దిట్టపరుచుకొని, విరటుడి కొలువుకి పదమూడో ఏడాదిని అజ్ఞాతంగా గడపడానికి చేరుకున్నారు.
 
‘విరాట’ అనే మాటను ‘వి’, ‘రాజ్’ అనే రెండింటి అర్థాల్ని కలిపి రాబడతారు. ‘వి’ అనేది ఒక ఉపసర్గః. దానికి ‘విశేషంగానూ, వివిధంగానూ’ అనే అర్థాలున్నాయి. ‘రాజ్’ అంటే, పరిపాలించడమూ ప్రకాశించడమూ అనే అర్థాలు ఉన్నాయి. విశేషంగానూ వేరు తీరులోనూ పరిపాలించడమంటే, సామాన్యమైన మానుషచైతన్యంతో కాకుండా, సమాధి ధ్యానంలో అనుభవానికి వచ్చే దివ్య చైతన్యంతో పరిపాలించడమని అర్థం. అంచేతనే విరాటరాజు పరిపాలన  మరోలా ఉంటుంది.

కీచకుడనే సేనాపతి బావమరిది ద్వారానే అతని పాలన సాగుతూన్నట్టనిపిస్తుంది. త్రిగర్తరాజు సుశర్మని, సాల్వ దేశస్థుల్ని కీచకుడు తన బంధుసేనలతో ఆక్రమించి చాలాసార్లు సతాయించాడు. విరటుడి పరిపాలన ఇలా ఉండడం, ‘విరటుడు’ సమాధి తాలూకు తాత్కాలికమైన దివ్య యోగ స్థితులకు ప్రతీక అని చెప్పడానికి సరిపడుతుంది. సవికల్ప సమాధిలో సాధకుడు, విశేషంగా ఆత్మలో మునిగిపోయి, బయటి విషయాల్ని తెలియని స్థితిలో ఉంటాడు.
 
విరాటరాజు కొలువులో మహారాజైన ధర్మరాజు తోటిరాజు దగ్గర సేవకుడిగా పనిచేయడానికి కంకుభట్టనే బ్రాహ్మ ణుడిగా మారువేషం వేసుకున్నాడు. ఆ రాజును సంతోషపెట్టడానికి అతనితో పాచికలాడుతూ ఉండేవాడు. భీముడు వలలుడనే వంటవాడిగా ఉంటూ, తన శారీరక బలాన్ని చూపిస్తూ మల్లయుద్ధాలు చేస్తూ రాజును సంతోషపెట్టేవాడు. ఊర్వశి ఇచ్చిన శాపాన్నే వరంగా మలచుకొని బృహన్నలై అర్జునుడు రాచకూతురు ఉత్తరకు నాట్యగాన పాఠాల్ని నేర్పుతూ కాలాన్ని నెట్టుకొచ్చాడు.

నకుల సహ దేవులు గుర్రాల్నీ ఆవుల్నీ సాకుతూ పశువుల శాలల్లో గడిపారు. ఆ ఏడాది చివరికి వస్తూన్నప్పుడు కీచకుడి బెడద వచ్చిపడింది. విరాటరాజు కీచకుడికి ఎదురు పలకలేడన్న విషయం అప్పుడే మనకు బయటపడింది. సైరంధ్రిగా ఉన్న ద్రౌపదిని అమర్యాదగా వెంటాడుతూ సభకు వచ్చిన కీచకుణ్ని పల్లెత్తు మాటైనా అనలేకపోయాడు విరటుడు. పైగా, ‘మీ ఇద్దరిమధ్యా ఇంతకుముందు ఏ కీచులాటలు జరిగాయో నాకు తెలియవుగా’ అంటూ తప్పించుకోడానికే చూశాడు.

కామం పెచ్చరిల్లినప్పుడు, దాన్ని బయట పడనీయకుండా అదుపులో ఉంచుతూ గుట్టుచప్పుడు గాకుండానే నాశనం చేయ డానికి ప్రాణక్రియల్ని ముమ్మరం చేయాలి. అదే విషయాన్ని భీముడనే ప్రాణ క్రియా శక్తి కీచకుడనే కామశక్తిని నాశనం చేసినట్టు కథారూపేణా చెబుతారు. ప్రతికూలమైన ఇంద్రియాల మొగ్గుదలలు నూరూ ఇంద్రియాల శక్తులు ఐదూ అదమలేని మనస్సు ఒకటీ వెరసి నూటారు. ఆ నూటారుగురే కీచకుడూ ఉపకీచకులూను.
 
ఏడాది ఇక కొన్ని రోజుల్లో పూర్తి కాబోతూండగా దుర్యోధనుడికి కీచకవధ గురించి అనుమానం వేసింది. కానీ దాన్ని కర్ణుడూ దుశ్శాసనుడూ మాట్లాడిన తీరును బట్టి బలం లేకుండా చేశారు. ‘పాండవులు బాగా గుప్తమైన స్థానంలో దాక్కొనైనా ఉండవచ్చు; లేకపోతే, సముద్రానికి అవ తల ఒడ్డుకు వెళ్లైనా ఉంటారు. లేక వాళ్లను మహారణ్యంలో క్రూరమృగాలు గానీ కొండచిలువలు గానీ మింగేసి ఉండవచ్చు. అదీ కాకపోతే విషమాతి విషమ పరిస్థితుల్లో పడి పూర్తిగా నాశనమైపోయి ఉంటారు’ అంటూ దుర్యోధనుడి ముందు తన పాప భావాల పర్యవసానాన్ని ప్రకటించాడు దుశ్శాసనుడు.

భీష్ముడు వాళ్లను వెదకాలంటే ఎలాగో కొన్ని లక్షణాల్ని సూచించాడు. ధర్మరాజు ఉన్నచోట గోవులు ఎక్కువగా ఉంటాయి; అవి దుర్బలంగా ఉండనే ఉండవు; మంచి రస వంతమైన పాలూ పెరుగూ నెయ్యీ అనే హోమద్రవ్యాలు పుష్కలంగా దొరుకు తాయి ఆ చోట. దృశ్యాలన్నీ ప్రసన్నంగా ఉంటాయి. అతనున్నచోట ప్రజలు సంప్రీతిమంతులై ఉంటారు. ఈ లక్షణాలన్నీ చారుల కథనాన్ని బట్టి మత్స్య దేశంలో అవుపించాయి.
 
అది అదనుగా తీసుకొని, సభలో ఉన్న సుశర్మ కీచకుడి మీద తనకున్న కోపాన్ని తీర్చుకోడానికి వేళ దగ్గర పడిందని అనుకుంటూ, దుర్యోధనుణ్ని మత్స్యదేశం మీద దండెత్తడానికి పురి గొలిపాడు. ‘ఇప్పుడు కీచకుడు లేడు గనక, విరటుడు నిరాశ్రయుడు; దర్పం కాస్తా పూర్తిగా అణిగిపోయి ఉంటుంది; అప్పటి ఉత్సాహమూ ఉండవు. ఆ దేశంలో చాలా గోసముదాయముంది. ఆ పశుసంపదను మీరూ మేమూ కలిసి హరిద్దాం.

మేము ఒకవైపు నుంచీ మీరు మరొకవైపు నుంచీ దాడిచేసి ఉక్కిరిబిక్కిరి చేస్తే వాళ్లను సులువుగానే వశపరచుకోవచ్చు’ అని దుర్యోధనుడి లోపల ఏర్పడుతూన్న ఉద్దేశానికి ఆజ్యం పోశాడు సుశర్మ. దానికి తోడు త్రిగర్తుడి మాటలకు కర్ణుడు ‘సై’ అన్నాడు. ‘అర్థమూ బలమూ పౌరుషమూ హీనమైపోయి మూడు వంతులు నష్టమై పోయి ఉన్న పాండవులతో మనకేం పని? విరాటరాజును ముట్టడించి అక్కడి గో సంపదను మన హస్తగతం చేసుకోవ డంలో నిమగ్నమవుదాం’ అని కర్ణుడు కూడా అనడంతో దుర్యోధనుడు మత్స్య దేశాన్ని ముట్టడించడానికి సైన్యాన్ని సిద్ధం చేశాడు.

ముందు రోజు సుశర్మను దక్షిణం వైపు నుంచి ముట్టడించమని పురమా యించి, ఆ మీద భీష్మద్రోణకర్ణాదులతో కలిసి తాము ఉత్తరం వైపు నుంచి దాడి చెయ్యాలని పథకం వేశారు.
 ఈ ప్రణాళిక సిద్ధమయ్యేసరికి పద మూడో ఏడాది నిజానికి పూర్తైయింది. సుశర్మ దక్షిణ గోగ్రహణానికి తన సేనల్ని మత్స్యదేశం వైపుకు నడిపాడు.

ఇది తెలియగానే విరటుడు యుద్ధానికి తన పెద్దకొడుకు శంఖుణ్నీ తమ్ముళ్లు శతానీక మదిరాక్షుల్నీ తీసుకొని వెళ్తూ, కంకుభట్టునీ వలులుణ్నీ దామగ్రంథినీ తంతిపాలుణ్నీ కూడా అనురూపమైన కవచాలు ధరించి యుద్ధం చెయ్యడానికి రమ్మనమని ఆహ్వా నించాడు. ఎప్పుడైనా సరే, తామున్న దేశానికి కష్టం వచ్చినప్పుడు, తాము కూడా యథాశక్తి సాయం చేయడం విధా యకంగా నమ్మినవాళ్లు గనక వెంటనే బయలుదేరారు. అయితే, ఆ యుద్ధంలో సుశర్మ విరటుణ్ని బందీగా పట్టుకొని తీసు కొనిపోతూ ఉంటే, యుధిష్ఠిరుడు భీముణ్ని పంపి విరటుణ్ని విడిపించేలా చేశాడు. సుశర్మను ఆ విధంగా ఓడించి, యుధిష్ఠిరుడి సలహా ప్రకారం చంప కుండానే వదిలేశారు.

త్రిగర్తమంటే మూడు రథాలని అర్థం. మూడు రథాలూ మనిషికుండే మూడు శరీరాలు: స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. ఈ మూడింటి నుంచీ విడివడితేనే ఏ సాధకుడికైనా పూర్తి ముక్తి దొరుకుతుంది. వాటికి సాధకుడు లొంగిపోవడమే విరటుడు త్రిగర్తుడైన సుశర్మకు పట్టుబడడంలోని ఆంతర్యం.
 
అయితే, భీముడనే ప్రాణాయామ శక్తి ఆ మూడు శరీరాల పట్టు నుంచీ సాధ కుణ్ని విడిపించగలుగుతుంది. విరటుడు ఆ నలుగురు పాండవుల పరాక్రమంతోనూ ముక్తుడు కావడంతో చాలా సంతోషిస్తూ వాళ్లను పదేపదే సమ్మానించాడు. ఆ రాత్రికి శిబిరంలోనే ఉంటూ రాజపట్ట ణానికి రాజుగారి విజయవార్తను దూతల ద్వారా చేరవేశారు. ప్రణాళిక ప్రకారం అటు విరటుడు త్రిగర్తుడితో యుద్ధానికి వెళ్లగానే, ఇటు దుర్యోధనుడు ఉత్తరం వైపు నుంచి మత్స్యదేశాన్ని ముట్టడించాడు.

భీష్ముడూ ద్రోణుడూ కర్ణుడూ కృపుడూ అశ్వత్థామా శకునీ దుశ్శాసనుడూ వివింశతీ వికర్ణుడూ చిత్రసేనుడూ దుర్ముఖుడూ దుశ్శలుడూ వగైరా మహారథులు చాలా మందితో కౌరవులు ముమ్మరంగా దాడి చేశారు. ఆ సమయంలో రాజధానిలో ఉన్న వాడు ఉత్తరుడనే విరాటరాజు రెండో కొడుకు మాత్రమే. అతనికి సైరంధ్రి చెప్పగా బృహన్నలను సారథిగా చేసుకొని యుద్ధానికి బయలుదేరడానికి సాహసం చేశాడు. తీరా సముద్రంలా ఉన్న విశాల మైన కౌరవ సైన్యాన్ని చూసి బెంబేలుపడి పారిపోతూ ఉంటే, అతన్ని ఆపి, తానే రథికుడై బృహన్నల వాళ్లతో భీకరంగా పోరాడాడు.

చివరికి సమ్మోహనాస్త్రంతో ఆ హేమాహేమీలనందర్నీ మూర్ఛలో మునిగి పోయేలాగ చేసి, గోసంపత్తిని వెనక్కి మళ్లించాడు అర్జునుడు. విరటుడు ఆ విజయం తన కొడుకుదే అని ఉబ్బిపోయాడు. ఆ సంతోషంలో కంకుభట్టుతో పందెం వేస్తూ పాచికలాటకు దిగాడు. తన కొడుకు గురించి చెబు తూంటే, ధర్మరాజు ‘బృహన్నల సారథిగా ఉంటే వాళ్లను గెలవడం ఏమంత గొప్పేమీ కాదు’ అని పదే పదే బృహన్నల గొప్ప తనమే చెబుతూ ఉంటే, భరించలేక విరటుడు ధర్మరాజు ముఖమ్మీదకు పాచికలను గట్టిగా విసిరాడు.

ధర్మరాజుకు దెబ్బతగిలి ముక్కుల్లోంచి రక్తం కారబో తూంటే, దాన్ని చేతులతో ఆపుతూ పక్కనే ఉన్న సైరంధ్రి వైపు చూశాడు. ఆవిడ తటా లున ఒక గిన్నెపట్టి ఆ రక్తాన్ని నేలమీద పడకుండా చేసింది. ఆ రక్తమే గనక నేల మీద పడితే, రాష్ట్రంతో సహా విరటుడు నాశనమైపోయేవాడు.
 
అప్పుడే ఉత్తరుడూ బృహన్నలా యుద్ధభూమి నుంచి తిరిగి వచ్చారు. ఉత్తరుడు వస్తూనే ‘ఎవరీ పాపాన్ని చేశారు?’ అంటూ ధర్మరాజువైపుకు వెళ్లాడు. ‘నేనే’ అని తండ్రి చెప్పగా ‘ఎంత తప్పు చేశారు! నిజానికి ఈ యుద్ధమంతా బృహన్నలే చేశాడు. అతనెవరో కాదు... సాక్షాత్తూ అర్జునుడు’ అంటూ నిజం చెప్పాడు. తన తప్పును సరిదిద్దు కోడానికి అర్జునుడికి తన కూతురునిచ్చి పెళ్లి చేద్దామనుకున్నాడు విరటుడు. ‘శిష్యురాలు కూతురుతో సమానం. కోడలిగా చేసు కుంటాను. ఉత్తరను మా అబ్బాయి అభి మన్యుడికిచ్చి పెళ్లి చేయండి’ అని ఒడం బరిచాడు అర్జునుడు.                      
 - డా॥ముంజులూరి నరసింహారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement