దుష్టచతుష్టయం | Dr. Munjuluri Narasimha Rao | Sakshi
Sakshi News home page

దుష్టచతుష్టయం

Published Sat, Oct 31 2015 10:53 PM | Last Updated on Sun, Sep 3 2017 11:47 AM

దుష్టచతుష్టయం

దుష్టచతుష్టయం

ఐదోవేదం: మహాభారత పాత్రలు - 22
దుష్టచతుష్టయమంటే నలుగురు చెడ్డవాళ్లు: దుర్యోధనుడూ దుశ్శాసనుడూ శకునీ కర్ణుడూను. దుర్యోధనుడంటే చురుకైన కోరిక; దుశ్శాసనుడేమో పట్టరాని కోపం; శకుని అంటే అత్యంతమైన మోహం; కర్ణుడంటే ఏది తనకిష్టమో, ఏది తనకు సుఖకరమో దాన్నే చేద్దామనుకొనే లోభమున్నవాడు. కోరికా కక్కుర్తీ అనేవి మూడూ నరకానికి తెరిచిన ద్వారాలని చెబుతారు. మనిషిలో కిందికి దిగివచ్చిన చైతన్యాన్ని దివ్య చైతన్యంగా లేవనెత్తడానికి మూలాధారంలో ఉన్న కుండలినీశక్తిని మెదడులో ఉన్న సహస్రారానికి నడపాలి. ఆ పనికి కామమూ క్రోధమూ లోభమూ మోహమూ అనే నాలుగు దుష్టశక్తులూ పెద్ద ఆటంకాలు.

దుర్యోధనుణ్ని కలి అనీ శకునిని ద్వాపరుడనీ చెబుతారు. కలి అంటే కలహానికి మారు పేరు; ద్వాపర మంటే అనిశ్చితీ సందేహమూను. పాచికలాట మొదలుపెడితే చాలు ఎవరి బతుకైనా సందేహంలో పడిపోతుంది. రాజసూయ యాగ సమయంలో వచ్చిన రత్నసంచయాన్ని చూసి దుర్యోధనుడు వెర్రెత్తిపోయాడు. ఆ డబ్బంతా తనదై పోవాలనుకున్నాడు. ఆ పవిత్రయాగ ధూమంతో సుగంధిలమైన ద్రౌపది జుట్టును పట్టుకొని కోపంతో సభలోకి ఈడ్చుకొని వచ్చాడు దుశ్శాసనుడు. చాలామందికి భార్య గనక ఆవిణ్ని వేశ్య అంటూ, సభలోకి ఏకవస్త్రగా వచ్చినా వివస్త్రగా వచ్చినా ఫరవాలేదంటూ కర్ణుడు వస్త్రాపహరణానికి బీజం వేశాడు.
 
కలిరూపమైన క్రియాశీలకమైన కోరికతో యుద్ధం చేయడం చాలా కష్టం. లోకంలో అవుపించే విషయాల్ని తలచు కుంటూ ఉంటే, వాటితో మనకు తగులు బాటు కలుగుతుంది. మాట వరసకు, ఓ పువ్వును చూశామనుకోండి. బావుందని అనుకోడంతోబాటు, అది త్వరలోనే వసి వాడిపోతుందని తెలిసినా, లోభంతో దాన్ని కోసుకొని మన దగ్గర పెట్టుకుందా మన్న కోరిక పుడుతుంది. అక్కడ పువ్వుల్ని కోయకూడదన్న ఆంక్ష ఉందనుకోండి. అది ఆ కోరికకు గొడ్డలిపెట్టులాగ ఉంటుంది. కోరికకు అడ్డంకి రాగానే చిరాకు పుడు తుంది. చిరాకు రాగానే ఏం చేస్తున్నామో తెలియని మూఢత్వం కమ్ముకుంటుంది. ‘నా అంతటివాడి మాటను ఖాతరు చేయవా’ అంటూ జుట్టు పట్టుకుంటాడు. ఆ భ్రాంతి మోసంలో పడేసి, తానెవరో మరచిపోయేలాగ చేస్తుంది.

ఆవిడ వదిన, తల్లిలాంటిది అనే మాట గుర్తుకురాదు. మరపురాగానే వివేకం బొత్తిగా అడుగంటుతుంది. బుద్ధి పోగానే మంచి ప్రవర్తన మాసిపోతుంది. వదిన అన్న మాట విస్మరించి బట్టల్ని ఊడదీయడానికి సిద్ధమైపోతాడు. అది నిండుసభ అనే మాట కూడా గుర్తు ఉండదు. ఈ దుష్టచతుష్టయం పుట్టించే గందరగోళంలో మనిషిలోని కుండలినీ ప్రాణశక్తి దుర్వినియోగానికి గురి అయి, కలహాన్నీ అశాంతినీ కలిగిస్తుంది. నిండు కొలువులో ద్రౌపది అనే మహారాణి తన శీలాన్ని కాపాడుకోవడం కోసం అటూ ఇటూ పరుగులు పెట్టింది.
 
ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడికి సరిపోయిన తండ్రి. దుర్యోధనుడు పైకే తన కుచ్చితాన్ని చూపిస్తాడు గానీ ధృత రాష్ట్రుడు లోపల అంత కుచ్చితంగానూ ఆలోచిస్తూ ఉంటాడు. పాండవుల ఉన్నతి చూసి, ధృతరాష్ట్రుడు అసూయపడుతూ ‘ఏం చేయాలి నేను?’ అంటూ కణికుడనే రాజనీతిజ్ఞుణ్ని పిలిచాడు. ‘అగ్నిహోత్రమూ యజ్ఞమూ చేస్తూ కాషాయబట్టల్ని కట్టుకొని జడలూ మృగచర్మమూ ధరించి ముందు అందరికీ విశ్వాసాన్ని కలగ జెయ్యాలి. ఆమీద తోడేలులాగ శత్రువుల మీదపడి నాశనం చేయాలి. శత్రువును ఈ విధంగా చంపలేకపోతే వాడున్న ఇంటికి నిప్పు పెట్టాలి’ అని పాఠం చెబుతూ ఒక గుంటనక్క కథను చెప్పాడు కణికుడు.
 
స్వార్థపండితుడైన ఒక నక్క పులీ ఎలుకా తోడేలూ ముంగిసా అనే తన నేస్తాలతోబాటు ఒక అడవిలో ఉంది. ఒకరోజున అందరూ కలిసి లేళ్ల సర్దారును చూసి లొట్టలేశాయి. అయితే దాని వేగం ముందు వీళ్ల ప్రయత్నాలు ఎందుకూ కొరగాలేదు. అప్పుడు నక్క ఒక పథకాన్ని వేసింది. అది పడుకొన్నప్పుడు మన ఎలుక దాని పాదాల్ని కొరికినట్టయితే దాని వేగం తగ్గుతుంది. అప్పుడు పులి దాన్ని పట్టి చంపగలుగుతుంది. సరే అని అందరూ ఆ పన్నాగాన్ని అమలుపరిచారు. ‘మీరంతా స్నానాలు చేసి రండి. నేను ఈ మృగ దేహాన్ని కాపలా కాస్తూ ఉంటాను’ అని నక్క, వాళ్లందర్నీ పంపించింది. స్నానం చేసి మొదట పులి వచ్చింది. అయితే, నక్క ఏదో చింతలోపడ్డట్టు ముఖం పెట్టింది.

‘ఏమిటి సంగతి?’ అని పులి వాకబు చేస్తే, ‘ఎలక మీ గురించి అన్నమాటను విని నేను చింతలో పడ్డాను: నావల్లనే ఈ మృగం చచ్చింది. పులిరాజు బలం దీంట్లో ఎక్కడుంది? నా బాహుబలాన్ని ఆశ్ర యించుకొని అతను తన ఆకలిని తీర్చు కోనీ అంటూ ఈసడించుకుంటూ వెళ్లి పోయింద’ని నక్క చెప్పింది. ‘నా బలంతో సంపాయించుకొనే తింటానులే’ అంటూ పులి వెళ్లిపోయింది. ఇంతలో ఎలుక వచ్చింది. ‘ఎలుకా! ముంగిస ఏమందో తెలుసునా? నాకు ఈ మృగమాంసం గీంసం పడవు. నేను ఎలుకను తినడానికి ఇష్టపడతాను’ అని నక్క చెప్పడమే తడవు, అది తుర్రుమని పారిపోయింది. తరవాత తోడేలు వచ్చింది.

దానితో, ‘పులి ఎందు కనో నువ్వంటే గుర్రుగా ఉంది. పెళ్లాన్ని తీసుకొని వస్తానని వెళ్లింది’ అని చెప్పే సరికి, అది ఠకీమని పారిపోయింది. చివరికి ముంగిస వచ్చింది. ‘నా సొంత బలంతో వాళ్లనందర్నీ జయించాను. నువ్వు కూడా నాతో యుద్ధం చేసి గెలిచి ఈ మాంసాన్ని తిను’ అనేసరికి అది తోక ముడుచుకొని పారిపోయింది. నక్కే ఆ మాంసమంతా కడుపునిండా ఆరగించింది. ఇలాగ తక్కువ చేసో బెదిరించో భయ పెట్టో బామాలో శత్రువును నిర్మూలించు కోవాలంటూ కణికుడు పాఠం చెప్పాడు.
 
ఈ కణికనీతి ధృతరాష్ట్రుడికి బాగా ఒంటపట్టింది. ‘కానీ అలా చేస్తే బాగుం డదు; ఏదో ఒకటి చేయకపోతే నేను కుమిలిపోతున్నాను’ అంటూ ద్వైదీ భావంలో ఊగిసలాడడం మొదలు పెట్టాడు. సరిగ్గా అప్పుడే దుష్టచతుష్టయం పెద్ద పన్నాగాన్ని పన్నుతున్నారు. ఏదో విధంగా పాండవుల్ని దూరంగా పంపిం చకపోతే ‘నాకు రాజ్యం రానేరాదు. ప్రజ లందరూ ధర్మరాజునే రాజుగా కోరుకుం టున్నారు’ అని నాన్న లోపలి ఆలోచన అనే నిప్పుకు ఆజ్యం పోశాడు. ‘నాదీ అదే అభిప్రాయం. కానీ అది పాపపుటాలోచన అని నేను బయటపెట్టడం లేదు. భీష్ముడూ మొదలైన పెద్దలకు ఎలాగ నచ్చజెప్పాలి?’ అంటూ మనస్సులో మాట చెప్పాడు తండ్రి. ‘భీష్ముడు ఎప్పుడూ మధ్యస్థుడే; అశ్వత్థామ నా పక్షానే ఉంటాడు.

కొడుకెక్క డుంటే ద్రోణుడు అక్కడే ఉంటాడు. కృపా చార్యుడేమో బావామేనల్లుళ్లు ఉన్నచోటే ఉంటాడు. ఒక్క విదురుడే ఎదురు. అతనొక్కడూ దీన్ని ఆపలేడు’ అని దుర్యో ధనుడు తాము నలుగురూ చేసిన లక్క ఇంటి ఆలోచనను బయటపెట్టాడు. ధృతరాష్ట్రుడు పాండవులతో వారణావత నగర రమ్యత్వం గురించి కొంతమంది చేత పదే పదే చెప్పించి, వాళ్లకు అక్కడికి వెళ్లాలనే కోరికను లేవదీశాడు. ఆ మీదట ‘మీరు వెళ్దామనుకుంటున్నారటగా! శుభం వెళ్లిరండి’ అని పాండవుల్ని వారణావతం పంపించాడు. కానీ ఆ ఒక్క విదురుడూ వీళ్ల పన్నాగాన్ని విఫలం చేసేశాడు.
 
దుర్యోధనుడి కన్ను ధర్మరాజుకున్న ధన సంపదల మీద పడింది. అతగాడికి ఆ డబ్బంతా తనదిగా చేసేసుకోవాలన్న కోరిక ఉవ్వెత్తున లేచింది. దానికి తోడు  మయసభలో తిరుగుతూ నేలను చూసి నీళ్లూ నీళ్లను చూసి నేలా అని భ్రాంతిపడ్డ అతన్ని చూసి, భీముడు కిసుక్కుమని నవ్వాడు. ఆ మీద ద్రౌపదితో సహా ఆడ వాళ్లందరూ గలగలా నవ్వారు. దుర్యో ధనుడికి ఒంటి నిండా తేళ్లూ జైలూ పాకినట్టయింది. ఇంటికొచ్చి, మనస్సులో గుచ్చుకొన్న ముల్లును తీయడానికి దార్లను వెదకడం మొదలుపెట్టాడు.
 
శకుని మామ మోసానికి ప్రతిరూపం. అతని ఆయుధాలు పాచికలు. జూదపీఠమే రణరంగం. మోసమే అతని చతురంగ బలం. పాచికలాటే మాయాక్రీడ. అది చాలా రంజుగా ఉంటుంది. ఆ రంధిలో పడి మనిషి తన శరీర రాజ్యాన్ని, తన ఆత్మానందశక్తిని, మోసానికి ఒడిగడు తూన్న ఇంద్రియాల మాటల్లో పడి, పందెంగా ఒడ్డి పోగొట్టుకుంటాడు. తెలిసుండీ ధర్మరాజు, జూదం ఆటకు, సరదా జూదం అని చెప్పి పెదనాన్న పిలిస్తే వెళ్లాడు. దీనికి కారణం రాజసూయ యాగం తరవాత వచ్చే కలహానికీ నాశ నానికీ తాను కారణం కాకూడదనే. అతను రాజసూయంలోనూ దిగ్విజయంలోనూ వచ్చిన కప్పాల్నీ కట్నాల్నీ ఒడ్డి పోగొట్టు కున్నా, శకుని ‘నీకింకా నీ తమ్ముళ్లున్నారు గదా, నువ్వున్నావుగా, నీ భార్య ఉందిగా’ అని పురిగొలుపుతూ అమంగళప్పక్షిలాగే పనిచేశాడు.

శకుని అంటే పక్షి అని అర్థం కూడా ఉంది. కొన్ని పక్షుల కూతలు నష్టాన్నీ హింసనీ కలిగిస్తాయి. తీతువుపిట్ట ఇటువంటిదే. శకుని అటువంటి అప శకునప్పక్షి. ధర్మరాజు జూదం మొదలు పెట్టక ముందు ‘జూదం ఒక రకంగా మోసమూ పాపమూను. దీనిలో క్షత్రి యుడికి తగిన పరాక్రమం చూపించడం ఉండదు; దీనికి ఒక నిశ్చితమైన నీతీ లేదు. ధర్మానికి అనుకూలమైన విజయం యుద్ధంలోనే దొరుకుతుంది. క్షత్రియులకు యుద్ధమే శ్రేష్ఠం, జూదం కాదు. కుటిల త్వమూ మోసమూ లేని సంగ్రామమే సత్పురుషుడు చేసే యుద్ధం. జూదగాళ్లకు మోసమన్నా, కపటత్వమన్నా వల్లమాలిన గౌరవం. మంచివాళ్లు జూదాన్ని పొగడరు.

నువ్వు క్రూరుడిలాగ అనుచితమైన మార్గంలో మమ్మల్ని జయించాలని చూడకు’ అని అన్నాడు. శకుని దానికి జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు: ‘ఒక వేద విజ్ఞాని మరో వేద విద్వాంసుణ్ని ఓడించడానికి ఏదో మారుమూల విషయాన్ని ఉపయోగించి మోసంతోనే జయిస్తూ ఉంటాడు. తెలిసినవాడు తెలియనివాణ్ని ఓడిస్తే అది మోసం ఎలాగవుతుంది? పాచికలాట బాగా ఎరిగిన నాబోటిగాడు ఆ ఆటలో చెయ్యి తిరగనివాణ్ని ఓడించడం జరుగుతుంది. దాన్ని మోసమంటే, అస్త్రాల్ని వెయ్య గలిగినవాడు ఆ నేర్పులేని వాణ్ని జయిస్తే అదీ మోసమే అవుతుంది. బలవంతుడు బలహీనుణ్ని జయించడం ఒక రకమైన మోసమే గానీ దాన్నీ మోసమని అనరు.

ఇది మోసం అనుకుంటే నువ్వు వెళ్లిపో వచ్చు’. ‘పిలిచిన తరవాత వెళ్లిపోవడం నా వ్రతానికి విరుద్ధం. నేను ఇక్కడ ఎవరితో ఆడాలి?’ అని యుధిష్ఠిరుడు అనగానే దానికి దుర్యోధనుడి జవాబే జరగ బోతూన్న మోసాన్ని ఎదురుగుండా చూపించింది: ‘నేను డబ్బు పెడతాను. నా తరఫున శకునిమామ ఆడతాడు’. ‘ఒకడి కోసం మరొకడు ఆడడం విషమం’ అని అంటూనే ధర్మరాజు జూదానికి దిగాడు. నలుగురు దుష్టులూ తమ రొట్టె విరిగి నేతిలో పడిందనే ఆనందించారు. వెనక సింహాసనం మీద కూర్చొన్న ధృతరాష్ట్రుడికీ అదే ఆనందం.            
- డా॥ముంజులూరి నరసింహారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement