దుర్యోధనుడు | story about Duryodhana | Sakshi
Sakshi News home page

దుర్యోధనుడు

Published Sun, Aug 9 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 7:03 AM

దుర్యోధనుడు

దుర్యోధనుడు

ఐదోవేదం: మహాభారత పాత్రలు - 11
ధృతరాష్ట్రుడి పిల్లల్లో ఆరోవంతు మంది పేర్లకు ముందు ‘దుః’ అనే మాట ఉంది. ‘దుః’ అంటే, కష్టమనే గాక, ‘చెడ్డ’ అనే అర్థం కూడా ఉంది. దుర్యోధనుడంటే ‘ఇతనితో యుద్ధం చేయడం అతికష్టం’ అనేగాక, ‘ఇతని యుద్ధం అతి చెడ్డది’, ‘ఇతను బహు చెడ్డ యోద్ధ’ అనే అర్థాలు కూడా వస్తాయి. మనందరికీ మినహాయింపేమీ లేకుండా ఎవరితో పోరాడటం కష్టం? ఎవరి పోరాటం చెడ్డది? అంటే ఒకే ఒక్క జవాబు వస్తుంది లోకంలో... ‘కోరిక’ అని. అందరితోనూ ఏదోవిధంగా దెబ్బలాడవచ్చునేమో గానీ కోరికతో కొట్లాడటం మాత్రం అతికష్టం.

అది అందితే మెడకో అందకపోతే కాలికో మెలిక వేస్తూనే ఉంటుంది. ఒకటి పోతే మరో కోరిక దాని స్థానే ఎడతెగని ప్రవాహంలాగ వస్తూనే ఉంటుంది. కోరిక రజోగుణం నుంచి పుట్టింది; బాగా తిండిపోతు; అతి పాపిష్ఠిది. అది నిప్పులాంటిది. నిప్పులో ఎన్ని ఎండుపుల్లలేసినా, ఎంత నెయ్యి పోసినా అది కాదనదు; తింటూనే ఉంటుంది, మండుతూనే ఉంటుంది. నిప్పుకు ‘అనలం’ అనే పేరు అందుకనే వచ్చింది. ‘అలం’ అంటే ‘చాలు’ అని అర్థం. ‘అనలం’ అంటే చాలనే మాటను అననే అనదని అర్థం.

కోరిక నిప్పు నార్పాలంటే, ఒకే ఒక్క దారి: వస్తువుల మీద ఉన్న ఆసక్తి అనే నేతినీ విషయాలతో పూసుకొని తిరగడమనే కట్టెపుల్లల్నీ వేయడం మానెయ్యాలి. ‘దుర్యోధనుణ్ని’ చంపడాని క్కూడా అదే దారి: విదురుడు ధృతరాష్ట్రుడికి పదే పదే చెప్పిన దారి: ‘వాణ్ణొక్కణ్ణీ వదిలిపెడితే మొత్తం శరీర రాష్ట్రానికీ మనస్సనే క్షేత్రానికీ క్షేమమూ శాంతీ వస్తాయి; లేకపోతే, జీవితం పొడుగునా ఉపద్రవమే ఉపద్రవం. మనం అందరం ధృతరాష్ట్రులం గనకనే అంతర్వాణి అయిన విదురుడు పదే పదే చెప్పే ఈ మాటను వినాలని అనుకోం. కోరికను పెద్దకొడుకన్నట్టుగా కావలించు కొని కూర్చుంటాం.

వాడు కలిలాగ నెత్తికెక్కి కూర్చున్నాడని అనుకోం. కలి నెత్తికెక్కినప్పుడు పరీక్షిత్తులాంటి భాగవతుడు కూడా నిష్కారణంగా ఏ పాపమూ చేయని సాధువు భుజంమీద చచ్చిన పామును పడేసి చెప్పరానంత ముప్పును కొనితెచ్చుకొంటాడు.
 
‘కలేరంశస్తు సంజజ్ఞే భువి దుర్యోధనో నృపః! దుర్బుద్ధిర్దుర్మతిశ్చైవ కురూణామయశస్కరః!!’ (ఆదిపర్వం 67-87). కలి అంశమే దుర్యోధనుడు; దుర్బుద్ధీ దుర్మతీ అతని లక్షణాలు. పనిని కుశలంగా చేద్దామనుకొనే వంశానికి అపయశస్సును తెచ్చే మచ్చ ఇతను. కలి అంటే, తమోగుణం ఎక్కువగా ఉన్నవాడు. తమోగుణమంటే నిద్రా ఆలస్యమూ ప్రమాదమూ (అజాగర్తా) మొహమూ మొదలైనవి.

‘కలిః శయానో భవతి’ అని ఐతరేయ బ్రాహ్మణంలో చెబుతారు: కలి అంటే ‘నిద్ర’లో మునిగిన వాడని అర్థం. ‘నిద్ర’ అంటే, మనం మామూలుగా అనుకొనే నిద్రగాదు: ‘నిద్ర’ అంటే, జీవశక్తి అంతా ఇంద్రి యాల ద్వారానూ ఇతరమైన అవయవాల గుండానూ బయటికి పోతూ ఖర్చైపోవడం. మెలకువ తెచ్చు కోడమంటే, ఆ ప్రాణశక్తిని వెనక్కి మలిపి మెదడు దిక్కుగా పంపడమని అర్థం. కోరికకూ పైన చెప్పిన ‘నిద్ర’కూ అవినాభావ సంబంధం ఉంది.
 మనకు సినిమాలు దుర్యోధనుడంటే అభిమాన ధనుడని చెబుతాయి.

సినిమాల్లో అతి గొప్పగా చెప్పడానికి కారణం, మనమం దరమూ కోరికను పగవాడిగా తెలుసు కోలేకపోవడం వల్లనే. కోరిక లేకుండా బతకడమెలాగ అని మనమంటాం. మనను మనం ఉద్ధరించుకోవాలనే కోరికను వద్దని ఎవడూ అనడు. కానీ మన కోరికలన్నీ ఇతరులని చూసి వాతపెట్టు కుందామన్న మూర్ఖత్వంతో ప్రబలినవే. దుర్యోధనుడు పుట్టినప్పుడు నక్కలాగ అమంగళంగా అరిచాడని సినిమాలు చెప్పవు.

అతను భీముణ్ని ఎదిరించడం తెలియక విషం పెట్టాడు. అతనికి అధికారం లేకపోయినా కర్ణుడికి ‘అంగ’ రాజ్యాన్ని కట్టబెట్టి అర్జునుణ్ని ఎదిరించడానికి అతన్ని, తన ‘ఉప్పు’ తిన్నవాడిగా చేసు కొన్నాడు. ఎదురుగుండా ఎదిరించ డానికి దమ్ములేకపోవడం వల్లనే ఆకతాయిగా పాండవుల్ని వేరే ఊరు పంపించి, వాళ్లున్న ఇంటిని కాల్చడానికి ప్రయత్నించాడు. రాజసూయయాగంలో పాండవుల డబ్బును చూసి అతనికి కన్నుకుట్టింది.

మయసభలో నేలా నీళ్ల మధ్య తేడా తెలుసుకోలేని మతి లేని వాడై, ‘నేల’లో మునిగి, ‘నీళ్ల’ మీద బొక్కబోర్లా పడి కముకు దెబ్బతిన్నాడు. మయుడి మాయే జూదమనే మాయకు తెర తీసేలాగ చేసింది. తనకు జూద మాడటం చేతగాకపోయినా బోళా ధర్మ రాజును ముగ్గులోకి దించి, తనకు బదులుగా శకుని మామ చేత ఆడించాడు.
 
విదురుడి మాట విని, ద్రౌపదికి వరం ఇచ్చి ధృతరాష్ట్రుడు పాండవుల దాస్యాన్ని పోగొడితే, మళ్లీ ఇంతలోనే మరో ప్రణాళిక వేసి, పన్నెండేళ్ల వనవాసమూ ఓ ఏడాది అజ్ఞాతవాసమూ అనే విలక్షణమైన పందేన్ని వేయించే జూదాన్ని తిరిగి ఆడేలాగ నిర్బంధపెట్టాడు దుర్యోధనుడు. పదమూడేళ్లు రాజ్యానికి దూరంగా ఉంటే, ధర్మరాజంటే ఇష్టపడే ప్రజలందర్నీ తనవైపునకు తిప్పుకోవచ్చుననుకొన్నాడు. వనవాసం చేస్తున్నప్పుడు దూర్వాసుణ్ని పంపించి, అతని కోపానికి పాండవుల్ని గురిచేద్దామని పథకం వేశాడు.

అక్షయ పాత్ర ఆ రోజు ఇవ్వవలసిన గ్రాసం ఇచ్చేసింది. ద్రౌపది కడిగేసిన పాత్రలో ఒక మెతుకు మిగిలి ఉందని వాళ్లకు తెలి యదు. దాన్ని నోట్లో వేసుకొని, సర్వ భూతాల కడుపుల్నీ ఒకే కాలంలో నిండి పోయేలాగ శ్రీకృష్ణుడు చేయడంతో, స్నానం చేయడానికి వెళ్లిన దూర్వాసుడూ అతని పదివేల మంది శిష్యులు అందరూ కడుపులు ఉబ్బరించి అక్కణ్నించే పారి పోయారు. ఈ పన్నాగం దెబ్బతినడంతో, పాండవుల్ని అవమానం పాలు చేద్దామన్న దుర్భుద్ధితో మందీమార్బలంతోనూ అతి పటాటోపంతోనూ దుర్యోధనుడు పాండ వుల పక్కనే గుడారాలు వేయించాడు.

అక్కడ ఓ గంధర్వుడితో గిల్లికజ్జా పెట్టు కొని గొంతుమీదికి తెచ్చుకొన్నాడు. సమయానికి ధర్మరాజు భీమార్జునుల్ని పంపించకపోతే దుర్యోధనుడి పని అంతటితో సమాప్తమైపోయి ఉండేది. ఇలాగ ఎప్పుడూ తాను వేసిన రాయి తిరిగొచ్చి తన నెత్తిమీదనే పడుతున్నా కళ్లు తెరుచుకోవడాన్ని ఇతను ఎరుగడు.
 
కీచకుడు చచ్చిపోయిన తీరు చూసి, మూడు వంతులు పాండవులు విరాట నగరంలో అజ్ఞాతవాసం చేస్తూ ఉండవచ్చు నని అంచనా వేశాడు దుర్యోధనుడు. కానీ ఇదంతా గడువైపోయింతరవాతనే. ఐదైదేళ్లకు రెణ్ణెలలు అధికంగా వస్తూ ఉంటాయి చాంద్రమానంలో. పదమూడేళ్లయ్యేసరికి అటువంటి ఐదు నెలలు గడిచిపోతాయని లెక్కవేసుకోలేదు ఈ ఆత్రగాడు. పసిగట్టి అజ్ఞాతవాసాన్ని భంగం చేసి, తిరిగి పన్నెండేళ్ల పాటు అడవిబసకు పంపిద్దామని వేసిన పథకం మళ్లీ పెద్ద అవమానాన్నే తెచ్చిపెట్టింది.

విరాట నగరం దక్షిణాన ఉన్న గోసంపత్తిని పట్టుకోడానికి సుశర్మ మొదలైనవాళ్లను పంపి, కొంత ఎడంగా, ఇటు ఉత్తరాన ఉన్న గోధనాన్ని కొల్లగొట్టడానికి, తాను, భీష్ముడూ ద్రోణుడూ కర్ణుడూ మొదలైన హేమాహేమీలతో బయలుదేరాడు. అంచనా వేసినట్టుగానే విరాటరాజుతో సహా అందరూ దక్షిణానికి యుద్ధం చేయడానికి వెళ్లారు. ఉత్తర గోగ్రహణాన్ని ఆపడానికి బృహన్నలను తీసుకొని, కోటకు కాపుగా ఉండటానికి మిగిలిన ఉత్తరకుమారుడొక్కడే వచ్చాడు. బృహన్నల కాలం లెక్కపెట్టుకొనే వచ్చాడు.

ఎదురుగుండా గాండీవాన్ని పట్టి అర్జునుడే వచ్చేసరికి రొట్టె విరిగి నేతిలో పడిందని సంబరపడిపోతూ ‘పాండవుల బండారం బయటపడింది’ అని గెంతు లెయ్యబోయాడు దుర్యోధనుడు. కానీ భీష్ముడు అధిక మాసాల లెక్కచెప్పి గాలి తీసేశాడు.
 మాద్రికి అన్నగారైన శల్యుడు పాండవుల వైపున పోరాడదామని వస్తూ ఉంటే, అతనికి తెలియకుండా, అతని దారి పొడుగునా సకల సౌకర్యాలనూ అందించి, చివరికి ‘ఎవరబ్బా ఇంత చేస్తున్నాడ’ని విస్తుపోయే సమయంలో ఎదుటపడి దణ్నం పెట్టి, అతనిచేత ‘నీకేం కావాలి?’ అనిపించుకొని, తనవైపు యుద్ధం చేసేలాగ వక్రంగానే వరాన్ని పొందాడు.
 
ఇలాగ అన్నీ కుచ్చితమైన పనులనే చేశాడు దుర్యోధనుడు. ఒక గొప్ప యోద్ధ చేయవలసిన పని ఒక్కటీ చేయలేదు. రాయబారానికి వచ్చిన కృష్ణుణ్ని బంధిద్దామని వెర్రి ప్రయత్నం కూడా చేసిన మూర్ఖుడు ఇతను. అతిబలవంతుడైన వృత్రుడు కూడా. ఇలాగ ‘అయోద్ధ’లాగే ప్రవర్తించాడని ఋగ్వేద సూక్తమొకదానిలో (1-32-6) మనకు అవుపిస్తుంది. అసలు వృత్రుడంటే, మన జ్ఞాన సూర్యుడికి అడ్డుగా వచ్చే అవిద్య అనే మబ్బు. దుర్యోధనుడు ‘కోరిక’కు ప్రతి రూపంగనకనే అతనూ ‘అయోద్ధ’ లాగానే భారతం పొడుగునా ప్రవర్తించాడు.

తనది కాని రాజ్యాన్ని కోరుకొన్నవాడు, ఎదుటపడి అమీ తుమీ తేల్చుకొనే యుద్ధం చేసి, విజయమో వీరస్వర్గమో వరించాలి. అతనెప్పుడూ శకునినీ భీష్ముణ్నీ ద్రోణుణ్నీ కృపాచార్యుణ్నీ అశ్వత్థామనీ జయద్రథుణ్నీ కర్ణుణ్నీ అడ్డుపెట్టుకొని వాళ్ల దన్నుతోనే యుద్ధం చేయడానికి చూశాడు. చిట్టచివరికి తన పాలు వచ్చేసరికి నీళ్లల్లోకి వెళ్లి దాక్కున్నాడు. బయటికి వచ్చి ‘గదా’ యుద్ధానికి భీముడితో తలపడ్డప్పుడు, అతను మొదట్నుంచీ చివరిదాకా చేసిన ‘దగా’నే ఎదుర్కోవలసివచ్చింది. దెబ్బతీద్దామని పెకైగిరినప్పుడు, భీముడి గద అతని తొడలను పగలగొట్టింది. ‘గద’ బుద్ధికి ప్రతీక.

దుర్యోధనుడి ‘గద’ ఎప్పుడూ ‘దగా’ చేద్దామనే ప్రయత్నించింది. ఇతన్ని ‘సుయోధనుడ’ని కొన్నిసార్లు పిలుస్తూ ఉంటారు. ‘సు’ అంటే ఇటువంటిచోట ‘మంచి’ అని అర్థంగాదు. ‘అతి’ అని అర్థం. ‘సుదారాచారుడ’నే ఒక ప్రయోగం భగవద్గీతలో అవుపిస్తుంది: దాని అర్థం ‘అతిదురాచారుడ’ని. అలాగే, ‘సుయోధనుడ’న్నా అతియుద్ధం చేసేవాడని అర్థం. అంటే, యుద్ధ నియమాలను తుంగలోకి తొక్కి యుద్ధం చేసేవాడని.

ఏదోవిధంగా గెలవాలనే యావ తప్ప, ‘కోరిక’ ఎప్పుడూ సజావుగా ప్రవర్తించదు. ఏదోలాగ కబ్జాచేసి, తన పబ్బం గడుపుకుందామని చూస్తుంది. అభిమానం కాదు ఇతని ధనం, మోసమూ దగాను. పెద్దవాళ్లంటే ఏ కోశానా భయమూ లేదు భక్తీ లేదు. పిన్నా పెద్దా గురువూ తాతా అందరూ ‘కోరిక’ మాట వినవలసినవాళ్లే; దాని బలిపీఠమ్మీద చావవలసినవాళ్లే. కోరికను గెలిచినవాడే నిజమైన యోద్ధ. నిజమైన శూరుడు.
- డాక్టర్ ముంజులూరి నరసింహారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement