కుంతీదేవి | kunti devi story | Sakshi
Sakshi News home page

కుంతీదేవి

Published Sun, Jul 19 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 5:45 AM

కుంతీదేవి

కుంతీదేవి

ఐదోవేదం: మహాభారత పాత్రలు - 8
శూరుడు శ్రీకృష్ణుడికి తాతగారు. ఆ యాదవ శ్రేష్ఠుడికి శ్రీకృష్ణుడి తండ్రి అయిన వసుదేవుడు పుట్టిన తరువాత, పృథ అనే అందమైన అమ్మాయి పుట్టింది. మిత్రుడూ మేనత్త కొడుకూ అయిన కుంతిభోజుడికి సంతానం లేకపోతే పృథను అతనికి దత్తతిచ్చాడు. చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడే, ఆమె తన పుట్టింటి చల్లని ఒడిని విడిచిపెట్టి, ఏ పిల్లజెల్లల సందడీ లేని కుంతిభోజుడి ఖాళీగృహాన్ని ఆనందంతో నింపింది గనకనే పృథాదేవి మూర్తీభవించిన వైరాగ్యమని చెబుతారు. కుంతిభోజుడామెకు ‘కుంతీదేవి’ అని పేరు పెట్టుకొన్నాడు.
 
పెంపుడు తండ్రిగారింట్లో అతిథులు తరచుగా వస్తూండేవాళ్లు. వాళ్లను సేవించడానికి ఆయన కుంతిని నియోగించేవాడు. ఓసారి కోపానికి మారుపేరైన దూర్వాసుడు అతిథిగా వచ్చాడు. అతను ఉన్నన్నాళ్లూ కుంతి చాలా ఓర్పుగా, అతనికి ఏ రకమైన ఇబ్బందీ లేకుండా, కోపంతో కసిరినా చిరాకుపడకుండా శాయశక్తులా సేవించింది. దానికి సంతోషిస్తూ, ‘నీకు నీ జీవితంలో అవసరం అవుతుంది గనక దివ్యశక్తుల్ని వశంలో తెచ్చుకోగలిగే మంత్రం ఒకటి చెబుతాను. నువ్వు కాదనడానికి వీల్లేదు’ అంటూ దూర్వాసుడు ఆమెకు ఆ ఆభిచారిక మంత్రాన్ని ఉపదేశించాడు. ఈ కారణంగానే వైరాగ్యం ద్వారా దివ్యత్వాన్ని ఆహ్వానించగలిగే శక్తికి కుంతి ప్రతీక అయింది. ‘కుణ’ అనే క్రియకు పిలవడమని అర్థం.
 
మంత్రాన్ని అందుకోగానే కౌమార చపలత్వం కొద్దీ కుంతి అది నిజమా కాదా అని పరీక్షిద్దామనుకొంది. అప్పుడు ఎదురుగా నింగిలో సూర్యుడు వెలుగుతూ పిలవడానికి నేనున్నానన్నట్టుగా అవుపించాడు. అతన్నే ఆ మంత్రంతో పిలిచింది. అంతే, సూర్యుడు ఒక యోగమూర్తిగా రానే వచ్చాడు. కన్నెపిల్ల కంగారుపడిపోయింది. ‘మంత్రాన్ని పరీక్షించడానికి మాత్రమే నిన్ను పిలిచాను. అంతే. నువ్వు వెళ్లిపోవచ్చు’ అని అన్నా, సూర్యుడు ఆమె మాటను కాదంటూ, ‘ఈ మంత్ర మహిమను మనం ఆపలేం. నీకు కొడుకొకడు కలుగుతాడు. అయినా నీ కన్నెతనానికేమీ ముప్పు రాదులే’ అని వరమిచ్చి వెళ్లిపోయాడు.

బంగారు కవచ కుండలాల వసువుతో (ధనంతో) ఒక పిల్లాడు పుట్టాడు. కుంతి సమాజానికి భయపడి, ఆ పసికుర్రాణ్ని ఒక పెట్టెలో పెట్టి నదీజలాల్లో విడిచిపెట్టింది. ఆ పెట్టె నీళ్ల ప్రవాహంలో సాగుతూ పోయి రాధ భర్త అయిన అదిరథుడికి దొరికింది. అపరంజి కిరణాల సేనతో పుట్టాడు గనక, అతన్ని వసుషేణుడని పిలుచుకొన్నారు ఆ దంపతులు. తరవాత అతనే కర్ణుడయ్యాడు. బుద్ధికి ప్రతీక అయిన పాండురాజుతో ఇంకా సంబంధం కుదరని కాలంలో ఈ కర్ణుడు పుట్టాడు గనక, అతను భౌతికమైన ఇంద్రియాల మొగ్గుదలల ప్రభావంలో ఉంటూ అధర్మానికి మరో పేరైన దుర్యోధనుడివైపే జేరాడు.
 
ఆ మీద కుంతిభోజుడు కుంతికి స్వయంవరం చాటించాడు. వచ్చిన రాజుల్లో పాండురాజును ఆవిడ వరించింది. శల్యుడి చెల్లెలు మాద్రి ఆవిడకు సవతి అయింది. భర్తతో వన విహారంలో కాలాన్ని సరదాగా గడుపుతూండగా, ఒకరోజున మృగరూపంలో ఉన్న ముని దంపతుల్ని చంపిన దోషానికి పాండురాజు స్త్రీ సుఖానికి దూరంగా ఉండవలసి వచ్చింది. సంతానం లేకపోవడం వల్ల స్వర్గద్వారాలు తెరిచి ఉండవని తెలుసుకున్న పాండురాజు మహర్షుల ప్రబోధం మేరకు తాను ఎలాగైతే తన నాన్నగారి క్షేత్రమైన అంబాలికకు వ్యాసమహర్షి వల్ల పుట్టడం జరిగిందో... అలాగే తానూ ప్రయత్నం చేయాలనుకొన్నాడు.

కుంతితో ఆ విషయాన్నే ప్రస్తావించాడు. ఆవిడ తనకు దివ్యశక్తుల్ని పిలిచి యమధర్మరాజు ద్వారా యుధిష్ఠిరుణ్ని, వాయువు ద్వారా భీముణ్ని, ఇంద్రుడి ద్వారా అర్జునుణ్ని కని కుంతి, పాండురాజును సంతానవంతుడిగా చేసింది. అంతేకాదు, భర్త కోరిన మీదట మాద్రికి కూడా ఆ మంత్రాన్ని చెప్పి నకుల సహదేవులను కలిగేలాగ చేసింది.
 
మాద్రితో సహా వనంలోకి వెళ్లిన పాండురాజు కామాంధుడై చావును కొని తెచ్చుకోవడంతోనూ మాద్రి అతనితో సహగమనం చేయడంతోనూ కుంతి ఐదుగురు పిల్లల్నీ వెంటబెట్టుకొని రుషుల సాయంతో హస్తినాపురానికి చేరుకొంది. అప్పటినుంచి కుంతికి ఇక కష్టాలే కష్టాలు. ధృతరాష్ట్రుడికి గుడ్డితనం వల్ల రాజ్యం రాకపోయినా పాండురాజు చనిపోవడంతో అతని చేతిలోనే రాజ్యం ఉండిపోయింది. అతని కొడుకుల్లో పెద్దవాడైన దుర్యోధనుడు మహా అసూయాపరుడు. భీముడి పొడ అసలు గిట్టేది కాదు. అతను తననూ తన తమ్ముళ్లనూ కుస్తీపట్లలోనూ ఇతరమైన ఆటల్లోనూ ఓడిస్తున్నాడని ఒకటే గుర్రు. భీముడికి వాళ్లు విషం పెట్టారు; గాఢనిద్రలో ఉన్నప్పుడు అతన్ని గంగలోకి విసిరేశారు. అయితే, భీముడి ప్రాణం చాలా గట్టిది. అతను వాటినన్నిటినీ దాటేశాడు.
 
యుధిష్ఠిరుడు పెద్దాడు గనక ధృతరాష్ట్రుడు అతన్ని యువరాజుగా చేయడమైతే చేశాడు గానీ దుర్యోధనుడి పోరు మాత్రం ఇంతింతగాదు. కొడుకు మాటను నెగ్గించడానికి కుంతితోసహా పాండవుల్ని వారణావతానికి పంపించి, లక్క ఇంట్లో సజీవ దహనం చేద్దామన్న కుటిల ప్రయత్నం చేశాడు ధృతరాష్ట్రుడు. విదురుడి ఆలోచనల వల్ల ఆ కష్టం నుంచి బయటపడి, ఐదుగురు పిల్లల్నీ పెట్టుకొని అజ్ఞాతంగా కొన్నాళ్లు బతకవలసివచ్చింది కుంతి. ఏకచక్రపురంలో తమకు నివాసాన్ని కల్పించిన బ్రాహ్మణుడికి వచ్చిన కష్టాన్ని తీర్చడానికి భీముణ్నే బకాసురుడి దగ్గరికి పంపడానికి ముందుకొచ్చింది ఆవిడ. దీనికి కారణాలు రెండు అవుపిస్తాయి: తన కొడుకు బలం మీద ఆవిడకున్న నమ్మకం మొదటిది; తామెంత కష్టాల్లో ఉన్నాసరే, ఇతరుల కష్టాన్ని తీర్చడానికి తమను తాము సమర్పించుకోవాలన్న సేవాభావాన్ని పిల్లలకు నేర్పడం రెండోది. లేకపోతే, ఏ తల్లైనా తను కన్న పిల్లవాణ్ని వధ్యశిలకు పంపించడం జరుగుతుందా?
 
అక్కణ్నించి దక్షిణ పాంచాల దేశానికి బ్రాహ్మణులతో సహా వెళ్లి, ఒక కుమ్మరివాని ఇంట్లో బస చేశారు. స్వయంవర మంటపానికి వెళ్లి, మత్స్యయంత్రాన్ని ఛేదించి, బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడు ద్రౌపదిని గెలుచుకొన్నాడు. కోలాహలం అవుతూంటే, ధర్మరాజు నకుల సహదేవులిద్దరితోనూ బసకు వచ్చేశాడు. అక్కడ రాజులందరూ భీమార్జునులను బ్రాహ్మణులనే తలపుతోనే అడ్డుకొన్నారు. భీమార్జునులు వాళ్లందర్నీ ఓడించి ద్రౌపదితో సహా బసకు వచ్చి, ‘భిక్షను తెచ్చామమ్మా!’ అని సరదాగానే అన్నారు. లోపలి గదిలో ఉన్న కుంతి వాళ్లను చూడకుండానే, రోజూ సాధారణంగా బిచ్చం తెచ్చుకొన్నప్పుడేమంటుందో అదే తరహాలో ‘మీ అందరూ కలసి దాన్ని పంచుకోండి’ అని యథాలాపంగా అంది.

ఇంతలో ఇవతలకు వచ్చి ద్రౌపదిని చూసి నాలిక్కరుచుకొంది. ‘ఛ ఛ ఎంత అనుచితమైన మాటనన్నాను’ అని చాలా నొచ్చుకొంది. చాలామందికి ఒకత్తె భార్యగా ఉండటం అధర్మమనిపిస్తుంది. అయితే, గురువు చెప్పిన మాటనే ధర్మమని అంటారు. తల్లేమో గురువుల్లో కల్లా గురువు. అంచేత, ఆవిడన్నమాటనే ధర్మంగా తీసుకోవాలని యుధిష్ఠిరుడు నిర్ణయించాడు. ద్రౌపది క్రితం జన్మలో పెళ్లికాక, శివుణ్ని గురించి తపస్సు చేసి అతను ప్రత్యక్షమైనప్పుడు ‘నాకు పతి చేకూరేలాగ చెయ్యి’ అని ఐదుసార్లు అంది అని చెబుతూ, వ్యాసుడు కూడా దాన్నే సమర్థించాడు.

అలాగ కుంతి వాక్శుద్ధి కొద్దీ పాండవులైదుగురికీ ద్రౌపది భార్య అయింది. దుర్యోధనుడి తరఫున శకుని ఆడిన మోసపు జూదంలో ఓడిపోయి, పన్నెండేళ్ల వనవాసమూ ఒక ఏడాది అజ్ఞాతవాసమూ చేయడానికి పాండవులు వెళ్లినప్పుడు, కుంతి ధృతరాష్ట్రుడి పంచనే ఉండి కష్టపడింది. ద్రౌపది పాండవులతో కలసి వనవాస కష్టాలూ అజ్ఞాతవాస కష్టాలూ పడి బయటపడ్డ తరవాత, తమ రాజ్యాన్ని తిరిగి ఇమ్మంటే, దుర్యోధనుడు ససేమిరా అన్నాడు. ఇక పోరు తప్పనిసరి అయింది. అప్పుడు తన మొట్టమొదటి కొడుకు కర్ణుడు అటువైపు ఉండటం కుంతికి మింగుడుపడలేదు. ఏకాంతంగా అతన్ని కలసి జరిగిన సంగతి చెప్పింది: ‘నువ్వు సూతకులంలో పుట్టినవాడివి కావు, నా కొడుకువి.

క్షత్రియకులంలో పుట్టినవాడివి. నువ్వు పాండవులవైపుకు వచ్చి, యుధిష్ఠిరుడికి అన్నగారివై రాజ్యాన్ని పాలించు. కర్ణార్జునులకు బలరామకృష్ణులకుమల్లే అసాధ్యమేమీ ఉండదు’ అని. కుంతి మాటను సూర్యుడు బలపరుస్తున్నట్లుగా బిట్టుగా ప్రకాశించాడు. అయినా సరే, కర్ణుడు దానికి ఒప్పుకోలేదు. ‘నన్ను అన్నివిధాలా సత్కరిస్తూన్న దుర్యోధనుణ్ని వదిలిపెట్టలేను. అందులోనూ యుద్ధకాలంలో ఆ పని నేను చేయను. అతనికోసం నీ కొడుకులతో యుద్ధం చేస్తాను. అయితే, ఒక్క అర్జునుణ్ని తప్ప, మిగతా నలుగుర్నీ నేను చంపను’ అని కర్ణుడన్న మాటను విని నిరాశగా కుంతి వెనుదిరిగి వచ్చింది. కానీ ఆ పెద్దకొడుకు గురించి ఆమె చివరిదాకా లోలోపల కుమిలిపోతూనే ఉంది.
 
ఇలాగ కుంతి జీవితం పొడుగునా కష్టాలు అనుభవిస్తూనే ఉంది. కానీ ఆవిడ వైరాగ్యానికి మరోపేరు గనక వాటన్నింటినీ చాలా ఓర్పుగా శ్రీకృష్ణుడి మీద భక్తితో సహిస్తూ వచ్చింది. ఆవిడ భక్తి చాలా గొప్పది. ఆమెకు శ్రీకృష్ణుడు మేనల్లుడే; కలసినప్పుడల్లా అతను ఆవిడ పాదాలకు మొక్కేవాడు. అయినా ఆవిడ అతన్ని దేవుడిగా ఎరిగి శరణాగతిని పొందింది. పాండురాజు పోయిన దగ్గర్నుంచీ ఆవిడకు అన్నీ కష్టాలే. అన్ని ఆపదల్లోనూ శ్రీకృష్ణుడు కాపాడుతూనే వచ్చాడు. అతని మహాదయను తలచుకొంటూ కుంతి చేసిన ప్రార్థన మన అందరికీ కనువిప్పు కావాలి: ‘విపదస్సన్తునః శశ్వత్తత్ర తత్ర జగద్గురో! భవతో దర్శనం యత్ స్యాదపునర్భవదర్శనమ్!!’

(భాగవతం 1-8-25): ‘ప్రభూ! మా జీవితంలో ఎప్పుడూ విపత్తులే వస్తూ ఉండనీ! ఎందుకంటే, విపత్తుల్లోనే కచ్చితంగా నీ గుర్తు వచ్చింది, నీ రూపం ఆ కన్నీళ్లలో ప్రతిబింబించి అవుపిస్తుంది. లోపల నీ దర్శనమైతే ఇంకేముంది? చావు పుట్టుకల చక్రం నుంచి బయటపడిపోవడం ఖాయమవుతుంది. యోగేశ్వరుడా! యాదవుల మీదా పాండవుల మీదా నాకున్న అతి మక్కువ అనే పాశాన్ని తెగ్గోసి, నిన్నే నేనెప్పుడూ తలచుకొంటూ ఉండేలాగ దీవించు!’ అనే ఆవిడ మాటలు మనమెప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి.
-డాక్టర్ ముంజులూరి నరసింహారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement