kunti devi
-
కుంతీపుత్రుడు: 27 ఏళ్ల తర్వాత కన్నతల్లిని చేరుకుని..
తన తప్పు లేకుండా జన్మించిన బిడ్డను నీట వదిలేసింది ఆనాటి కుంతీ. కామాంధుడి దాహార్తికి పుట్టిన బిడ్డను విధివశాత్తూ వదిలించుకుంది ఈనాటి కుంతీ. కానీ, ఆనాటి కర్ణుడిలా ఈ అభివన కర్ణుడు ఊరుకోలేదు. 27 ఏళ్ల తర్వాత తన తల్లి ఆచూకీ వెతుక్కుంటూ వెళ్లాడు. ఆ తర్వాత ఏం చేశాడో ఈ వాస్తవ గాథ చదివితే తెలుస్తుంది. సుమారు 27 ఏళ్ల కిందట.. ఉత్తర ప్రదేశ్ బరేలీలో ఘోరం జరిగింది. తన సోదరి ఇంట్లో ఉంటున్న మైనర్‌ను.. బలవంతంగా ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు అన్నదమ్ములు. అది ఒక్కసారి కాదు.. పలుమార్లు. నిందితులిద్దరూ ఆమె కుటుంబానికి పరిచయస్తులే. పైగా బయటకు విషయం చెబితే చంపుతామని బెదిరించారు కూడా. ఈలోగా ఆ మైనర్ గర్భం దాల్చడం.. ప్రాణంమీదకు రావడంతో ఆమె బిడ్డను కనడం జరిగిపోయాయి. దత్తత మీద ఆమె కుటుంబం బిడ్డను వదిలించుకుని.. రాంపూర్‌కు వలస వెళ్లింది. అప్పుడామె వయసు 12 ఏళ్లు. కొన్నేళ్లకు ఆమెకు వివాహం కాగా.. ఆమె అత్యాచారానికి గురైందన్న విషయం తెలిసి పదేళ్ల తర్వాత ఆ భర్త ఆమెకు విడాకులు ఇచ్చాడు. దీంతో.. ఆ మానని గాయంతో అలా ఒంటరిగానే మిగిలిపోయింది. ► కాలం గిర్రున తిరిగింది. ఆ దత్తపుత్రుడికి తాను ఉన్నచోటు తనది కాదని తెలిసింది. తన కన్నతల్లి కోసం వెతుకులాట ప్రారంభించాడు. 2021 మొదట్లో.. ఎట్టకేలకు ఆ బిడ్డ తన తల్లిని కలుసుకున్నాడు. తన తండ్రి ఎవరో చెప్పాలని నిలదీశాడు. ఆమె తెలిసీతెలియని వయసులో తనకు జరిగిన అన్యాయం గురించి కొడుకు వద్ద ఏకరువు పెట్టుకుంది. దీంతో రగిలిపోయిన ఆ కొడుకు.. పోరాటానికి ఆమెను సిద్ధం చేశాడు. షాహ్‌జహాన్‌పూర్ పీఎస్‌కు వెళ్లి 1994లో తన తల్లిపై జరిగిన అఘాయిత్యం గురించి ఫిర్యాదు చేశాడు. మూడు దశాబ్డాల కిందటి ఘటన కావడంతో పోలీసులు షాక్ తిన్నారు. ఫిర్యాదు తీసుకోవడానికి తటపటాయించారు. అయితే.. కోర్టు జోక్యంతో ఎట్టకేలకు కేసు నమోదు అయ్యింది. ► 2021, మార్చ్ 4వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఈ లోపు బాధితురాలి న్యాయం చేసేందుకు ప్రత్యేక బృందం ఈ కేసు విచారణ చేపట్టింది. చాలా ఏళ్ల కిందటి కేసు కావడం.. నిందితుల పేర్లూ పూర్తిగా తెలియకపోవడంతో దర్యాప్తునకు ఆటంకంగా మారింది. పైగా వాళ్లు ఎక్కడున్నారో కూడా తెలియదు. కానీ, చిన్నవయసులోనే ఆ తల్లి అనుభవించిన క్షోభను పోలీసులు అర్థం చేసుకున్నారు. ఎస్సై ధర్మేంద్ర కుమార్ గుప్తా దగ్గరుండి విచారణ చేశారు. నిందితులు ఇద్దరూ అదే నగరంలో హద్దాఫ్ ప్రాంతంలో ఉంటున్నారని గుర్తించారు. ► అయితే విచారణ కోసం వెళ్లిన పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది. బాధితురాలెవరో తమకు తెలియదని ఆ అన్నదమ్ములు బుకాయించారు. దీంతో కోర్టు ఆదేశాలతో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. జులై 2021న శాంపిల్స్‌ను ల్యాబ్‌లకు పంపించారు. కానీ, ఫలితం రావడానికి ‘9 నెలల’ టైం పట్టింది. అందులో మొహమ్మద్ రాజీ ఆ బిడ్డకు తండ్రిగా తేలాడు. దీంతో పోలీసులు అరెస్ట్ వారెంట్‌తో నిందితుల ఇళ్లకు వెళ్లారు. అయితే.. ► అప్పటికే తమ బండారం బయటపడుతుందని భావించి.. నిందితులిద్దరూ పరారయ్యారు. పోలీసులు ఊరుకుంటారా?.. బృందాలను ఏర్పాటు చేయించి వాళ్లిద్దరి కోసం గాలింపు చేపట్టారు. సర్వేయిలెన్స్ టీం ఈ కేసులో కీలకంగా వ్యవహరించింది. ఎట్టకేలకు రాజీని హైదరాబాద్‌లో కనిపెట్టి.. మంగళవారం నాడు అరెస్ట్ చేసింది. అసలు ఆ ఉదంతం మళ్లీ తన ముందుకు వస్తుందని తాను ఊహించలేదని నిందితుడు చెప్తున్నాడు. మరో నిందితుడు ఒడిశాలో ఉన్నట్లు భావిస్తున్న పోలీసులు.. అక్కడికి బృందాలను పంపారు. తల్లిని వెతుక్కుంటూ వెళ్లడమే కాదు.. ఆమెకు జరిగినదానికి ఆలస్యమైనా న్యాయం జరిగింది. A case that will increase respect for @Uppolice Accused was hiding in Hyderabad since his DNA sample was taken.. UP: Born out of rape, son finds mother after 27 years, helps nab accused https://t.co/qm2lRK4eeG pic.twitter.com/wuD8zbSLNr — Kanwardeep singh (@KanwardeepsTOI) August 4, 2022 -
వీరమాత
మహా భారతంలో కుంతి పాత్ర ఎంతో వైవిధ్యమైనది. విలక్షణ మైనది. భర్త పాండురాజు మరణించిన నాటి నుండి తన పిల్లలని, మాద్రి పిల్లలని కంటికి రెప్పలా కాపాడుకుంటూ, వారికి విద్యాబుద్ధులు నేర్పించి, గొప్ప వీరులుగా తీర్చిదిద్దింది. ఏక చక్రపురంలో ప్రజలు బకా సురుని బారినపడి ప్రాణాలు కోల్పోతున్నప్పుడు భీముణ్ణి వానికి ఆహా రంగా పంపుతుంది. ఆమె అలా పంపటంలో ఆంతర్యాన్ని ప్రశ్నించిన ధర్మజునికి ఇచ్చిన సమాధానం ఆమె విజ్ఞతను, ఆశ్రయమిచ్చిన యజ మాని పట్ల చూపవలసిన కృతజ్ఞతను, మాద్రి పిల్లలలో ఒకరిని కాక తన పిల్లలలో ఒకర్ని పంపడంలో గల నిస్వార్థ చింతనను, ధర్మసూక్ష్మతా శక్తిని విశ దపరుస్తాయి. తన బిడ్డల బలాన్ని, బలగాన్ని పెంచేటందుకు హిడిం బను కోడలిగా స్వీకరించింది. కురు, పాండవుల మధ్య పోరు తప్పదని ఊహిం చిన ప్రజ్ఞాశాలి ఈమె. పాండవుల మధ్య ఐక్యత సాధించేటందుకు ద్రౌపదిని ఐదుగురు భార్యగా భావించాలని ఆదేశమిచ్చింది. కుంతి, కృష్ణుడు హస్తి నకు రాయబారిగా వచ్చినప్పుడు ధర్మజుని ‘ఐదూళ్లు చాలన్న’ మాట విని కోపించింది. యుద్ధం చేయమని ధర్మజునికి హితవు చెప్పమని కృష్ణునితో అంటుంది. ఇక్కడ కుంతి వీరమాతగానే కాక నిజమైన రాజమాతగా కూడా కనిపిస్తుంది. వ్యాసుడు, విదురుడు, భీష్ముడు, మేనల్లుడైన కృష్ణుడి అండదండ లతో, సహాయ సహకారాలతో పాండవులని పెంచి పెద్ద చేసి, వారిని అసహాయ శూరులను చేసింది. వారి శక్తి సామర్థ్యాలను జగద్విదితం చేసింది. ఓ ఉదాత్తమైన మాతృమూర్తిగా నిలిచింది. యుద్ధానంతరం, తన శేష జీవితాన్ని అడవులలో ఆశ్రమాలలో గడపటానికి వెళుతున్న కుంతిని భీముడు ఇందుకోసమా మమ్మల్ని యుద్ధం చేయమని ప్రేరే పించింది అని ఆక్రోశంతో ప్రశ్నిస్తాడు. కుంతి ఇదంతా వారి సుఖం కోసమని, హక్కుగా రావలసిన రాజ్యాధికారం కోసమని, గౌరవ జీవితం కోసమని చెబుతుంది. ఒక మాతృమూర్తిగా తన పిల్లల నుండి గౌరవ మర్యాదలను విరివిగా పొందిన ధీర వనిత కుంతి. వ్యాస భగ వానుని అద్భుత సృష్టి. – డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి -
ఈ జీవితానికి ఈ కష్టాలు చాలు
కుంతీదేవి పడిన కష్టాలు అటువంటి ఇటువంటివి కావు. ఇన్ని ఉత్థాన పతనాలు చూసినా ఎన్నడూ ధర్మం వదిలి పెట్టలేదు. అయినా పరిస్థితులు ఆమెకు ఎప్పుడూ అగ్నిపరీక్ష పెడుతూనే వచ్చాయి. ఒక ఆసనంలో ధృతరాష్ట్రుడు కూర్చున్నాడు. ఒక ఆసనంలో ధర్మరాజు కూర్చున్నాడు. చనిపోయిన వీరుల పేర్లు చదువుతూ నువ్వులు, నీళ్ళు వదులుతున్నారు. ఫలానా వీరుడి పేరు చదవగానే ధర్మరాజు ‘నాకు చెందిన వాడు’ అని ధర్మోదకాలు వదిలాడు. మరొక వీరుడి పేరు చెప్పగానే ‘నాకు చెందిన వాడు’ అని ధృతరాష్ట్రుడు నీళ్ళు నువ్వులు వదిలాడు... కార్యక్రమం ఇలా నడుస్తుండగా... కర్ణుడి పేరు చదివారు. ‘నాకు చెందిన వాడు కాడు’ అని ధర్మరాజు అన్నాడు. ధృతరాష్ట్రుడు అలాగే అన్నాడు. అక్కడే ఉన్న కుంతీదేవి అది విని తట్టుకోలేక పోయింది. యుద్ధ సమయంలో ఆమె శిబిరంలో ఉన్న కర్ణుడి దగ్గరకు వెళ్ళి ప్రాధేయపడితే..‘‘అర్జునుడు తప్ప మిగిలిన పాండవుల జోలికి రాను... ఎటుచూసినా నీకు పాండవులు ఎప్పుడూ ఉంటారు’ అని చెప్పాడు. అటువంటి ఔదార్యమున్నవాడిని... తన కుమారుడేనని, కన్యా సంతానమని ఎప్పుడూ చెప్పుకోలేక పోయింది. ఇప్పుడు చిట్టచివరన కనీసం నువ్వులు–నీళ్ళు కూడా దక్కడం లేదు. తల్లడిల్లిపోయింది. భోరున ఏడుస్తూ చెప్పేసింది. నాకు కొడుకు, నీకు సోదరుడు – అంది. ధర్మరాజన్నాడు కదా...‘‘ఎంత తప్పు చేసావమ్మా! కర్ణుడు పెద్దవాడు. పట్టాభిషేకం చేసుకోవాలి. నీవు ఈ రహస్యాన్ని దాచి అన్నను చంపించావు. కాబట్టి ఆడదాని నోట నువ్వు గింజ నానినంత సేపు కూడ నిజం దాగకుండు గాక!’’ అని శాపమిచ్చాడు తల్లికి. ఎవరికోసం అష్టకష్టాలు పడిందో ఆ బిడ్డల వలన శాపం పొంది తలదించుకుంది. మహా ఔన్నత్యం కల ఇల్లాలని భీష్మ పితామహుడి ప్రశంసలు కూడా పొందిన కుంతీదేవి చివరకు వైరాగ్యం పొంది, కృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ... ‘‘చాలు కృష్ణా, ఉత్థానపతనాలు జీవితంలో ఎన్నో చూశా. ఒక్కొక్కసారి సంతోషించా... ఒక్కొక్కసారి లోయల్లోకి జారిపోయా. ఎన్ని కష్టాలు పడ్డానో, యాదవులందు నువ్వున్నావని, నా మేనల్లుడివనీ, నేను మేనత్తననీ మమకారం వద్దు. కడుపున పుట్టిన బిడ్డలని మమకారం వద్దు. ఈ మమకారమనే పాశాలు కోసెయ్యవా కష్ణా! ఆ గంగ ఎక్కడ పుట్టిందో చివరకు సముద్రంలో చేరిపోయినట్లుగా ఇక నా జీవితం ఎప్పుడూ నిన్నే స్మరిస్తూ నీలోనే ఐక్యమయిపోయేటట్లుగా నువ్వు తప్ప నా మనసులో ఇంకొక ఆలోచన రాకుండా నన్ను అనుగ్రహించవయ్యా!’’ అని ప్రార్థన చేసింది. కలిసొచ్చినన్నాళ్ళు ధర్మం పట్టుకోవడం చాలా తేలికే. కాలం కలిసిరానప్పుడు, కాల ప్రవాహానికి ఎదురీదాల్సి వచ్చినప్పుడు చూపిన ధైర్యం, తెగువ, నిబ్బరం చెప్పనలవి కాదు. ద్రౌపదీ దేవి ఎంత గొప్ప స్త్రీ, సింహాసనానికి ఉత్తరాధికారులు కావలసిన ఉపపాండవులను రాత్రికి రాత్రి నిద్రలో అశ్వత్థామ చంపితే... అప్పుడు చూడాలి ఆమె ఆంతరంగంలోని లోతులు, ఆమె ప్రదర్శించిన ఔన్నత్యం ! -
కుంతీదేవి ధర్మ నిరతి
అజ్ఞాతవాసం నిమిత్తం పాండవులు జింక చర్మాలు, నార చీరలు ధరించి బ్రాహ్మణ వేషాలలో ఏకచక్రపురం అనే అగ్రహారం చేరారు. అక్కడ ఒక బ్రాహ్మణుని ఇంట్లో నివాసం ఏర్పరచుకుని, రోజూ భిక్ష స్వీకరించి తల్లికి తెచ్చి ఇచ్చేవారు. ఒకరోజు భీముడు ఇంట్లో ఉన్నాడు. మిగిలిన వారు భిక్ష స్వీకరించటానికి వెళ్ళారు. ఆ సమయంలో ఆ ఇంటిలో రోదనలు వినపడ్డాయి. కుంతీదేవి భీమునితో ‘భీమసేనా! ఈ ఇంటి వారికి ఏదో కష్టం కలిగినట్లుంది. నేను వారికి ఏమి కష్టం వచ్చిందో తెలుసుకుని వచ్చి నీకు చెబుతాను. వారికి చేయగలిగిన సాయం చేయడం పుణ్యప్రదం’ అంది. అందుకు భీముడు ‘అమ్మా! నీవు తెలుసుకుని నాకు చెప్పావంటే నేను వారికి ప్రత్యుపకారం చేస్తాను’ అన్నాడు. ఎందుకని విలపిస్తున్నారని అడిగిన కుంతీదేవితో ఆ ఇంటి యజమాని ‘అమ్మా జననం మరణం సంయోగం వియోగం సహజమే అయినా వేదోక్తంగా వివాహం చేకున్న భార్యను కాని, కన్యాదానం చేసి అత్త వారింటికి పంపవలసిన కూతురుని కాని, నాకూ నా పితరులకు పిండోదకాలు ఇవ్వవలసిన నా కుమారుని కానీ రాక్షసునికి ఆహారంగా పంపలేక నేనే ఆహారంగా వెళతానని చెప్పాను అందుకు వీరు సమ్మతించక విలపిస్తున్నారు’ అన్నాడు. ‘రాక్షసుడు ఎవరు? మీరు అతడికి ఆహారంగా ఎందుకు వెళ్ళాలి?’ ఆశ్చర్యంతో అడిగింది కుంతి. అందుకు సమాధానంగా బ్రాహ్మణుడు ‘అమ్మా! ఇక్కడకు ఆమడ దూరంలో యమునా నదీ తీరాన బకాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు. అతడు గ్రామం మీద పడి అందరినీ తినసాగాడు. అందువలన మేమంతా అతడితో రోజూ ఒక బండి ఆహారం, రెండు దున్నపోతులు, ఒక మనిషి ఆతడికి ఆహారంగా పంపేలా ఒప్పందం కుదుర్చుకున్నాము. ఈ రోజు ఈ ఇంటి నుండి అతడికి ఆహారంగా వెళ్ళాల్సిన వంతు వచ్చింది’. అన్నాడు. అందుకు కుంతీదేవి ‘అయ్యా! చింతించవద్దు. మీకు ఒక్కడే కుమారుడు. నాకు ఐదుగురు ఉన్నారు. నా కుమారులలో ఒకడిని పంపుతాను’ అన్నది. ఆ బ్రాహ్మణుడు కుంతీదేవితో ‘అమ్మా! అతిథిని పంప తగదు. అందునా బ్రాహ్మణ హత్య మహాపాపం’ అన్నాడు. కుంతీదేవి ‘అయ్యా! ఆలోచించవద్దు. నా కుమారుడు మహా బలవంతుడు. తప్పక బకుని చంపి వస్తాడు’ అన్నది. ఆమె భీమునితో జరిగినదంతా చెప్పిం ది. అందుకు భీముడు సంతోషంగా అంగీకరించాడు. అంతలో ధర్మరాజాదులు అక్కడికి వచ్చారు. కుంతీదేవి జరిగినది ధర్మరాజుకు చెప్పింది. ధర్మరాజు కలత చెంది ‘అమ్మా! పరాయి వారికోసం నీ కన్నకొడుకును బలి ఇస్తావా?’ అన్నాడు. కుంతీదేవి ‘నాయనా ధర్మరాజా! కలత చెంద వలదు. భీముని బలం నీకు తెలియదు. అతడు వజ్రకాయుడు. అతడు పుట్టిన పదవరోజునే ఒక బండ రాయి మీద పడగా అది పొడి పొడి అయ్యింది. భీముడు రాక్షసుని చంపి ఈ ఆగ్రహారానికి రాక్షస పీడ వదిలిస్తాడు. ఆపదలో ఉన్నవారిని రక్షించడం క్షత్రియ ధర్మం. మనకు ఉపకారం చేసిన ఈ బ్రాహ్మణుని రక్షించడం మనధర్మం’ అని చెప్పింది. తల్లి చెప్పిన మాటలకు సమాధాన పడ్డ ధర్మరాజాదులు అందుకు సమ్మతించారు. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏమిటంటే, తమకు ఆశ్రయం ఇచ్చిన వారు రోదిస్తుంటే కుంతీదేవి చూస్తూ ఊరుకోలేదు. కారణం తెలుసుకుంది. బ్రాహ్మణునికి మారుగా తన కుమారుడిని రాక్షసునికి ఆహారంగా పంపేందుకు సిద్ధపడింది. అడ్డుపడబోయిన ధర్మరాజుకు కూడా ధర్మసూక్ష్మాలు చెప్పింది. అన్నింటినీ మించి తన కుమారుని బలం, శక్తి సామర్థ్యాల మీద సంపూర్ణమైన నమ్మకం పెట్టుకుంది ఆ తల్లి. పక్కవాడు ఏమైపోతున్నా పట్టించుకోని నేటి రోజులలో తమకు ఆశ్రయం ఇచ్చిన వారికోసం తన కొడుకు ప్రాణాలను కూడా ఫణంగా పెట్టింది ఆ తల్లి. అమ్మ మాటను ఆ కొడుకు కూడా జవదాటలేదు. ఆమె నమ్మకాన్ని వమ్ము చేయలేదు. – డి.వి.ఆర్. భాస్కర్ -
తార్నాకలో చైన్ స్నాచింగ్ కలకలం
హైదరాబాద్: తార్నకలో చైన్ స్నాచింగ్ కలకలం సృష్టించింది. రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని దుండగులు 10 తులాల బంగారు ఆభరణాలను దుండగులు లాక్కెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగిని కుంతిదేవి నాగర్జున నగర్ వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న కుంతిదేవిని గమనించిన స్నాచర్లు బ్లాక్ పల్సర్ వాహనంపై వచ్చి ఆమె మెడలోని నల్లపూసల గొలుసు, తాళిబొట్టుతో పాటు మరో ఆభరణాన్ని లాక్కెళ్లారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. -
కుంతీదేవి
ఐదోవేదం: మహాభారత పాత్రలు - 8 శూరుడు శ్రీకృష్ణుడికి తాతగారు. ఆ యాదవ శ్రేష్ఠుడికి శ్రీకృష్ణుడి తండ్రి అయిన వసుదేవుడు పుట్టిన తరువాత, పృథ అనే అందమైన అమ్మాయి పుట్టింది. మిత్రుడూ మేనత్త కొడుకూ అయిన కుంతిభోజుడికి సంతానం లేకపోతే పృథను అతనికి దత్తతిచ్చాడు. చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడే, ఆమె తన పుట్టింటి చల్లని ఒడిని విడిచిపెట్టి, ఏ పిల్లజెల్లల సందడీ లేని కుంతిభోజుడి ఖాళీగృహాన్ని ఆనందంతో నింపింది గనకనే పృథాదేవి మూర్తీభవించిన వైరాగ్యమని చెబుతారు. కుంతిభోజుడామెకు ‘కుంతీదేవి’ అని పేరు పెట్టుకొన్నాడు. పెంపుడు తండ్రిగారింట్లో అతిథులు తరచుగా వస్తూండేవాళ్లు. వాళ్లను సేవించడానికి ఆయన కుంతిని నియోగించేవాడు. ఓసారి కోపానికి మారుపేరైన దూర్వాసుడు అతిథిగా వచ్చాడు. అతను ఉన్నన్నాళ్లూ కుంతి చాలా ఓర్పుగా, అతనికి ఏ రకమైన ఇబ్బందీ లేకుండా, కోపంతో కసిరినా చిరాకుపడకుండా శాయశక్తులా సేవించింది. దానికి సంతోషిస్తూ, ‘నీకు నీ జీవితంలో అవసరం అవుతుంది గనక దివ్యశక్తుల్ని వశంలో తెచ్చుకోగలిగే మంత్రం ఒకటి చెబుతాను. నువ్వు కాదనడానికి వీల్లేదు’ అంటూ దూర్వాసుడు ఆమెకు ఆ ఆభిచారిక మంత్రాన్ని ఉపదేశించాడు. ఈ కారణంగానే వైరాగ్యం ద్వారా దివ్యత్వాన్ని ఆహ్వానించగలిగే శక్తికి కుంతి ప్రతీక అయింది. ‘కుణ’ అనే క్రియకు పిలవడమని అర్థం. మంత్రాన్ని అందుకోగానే కౌమార చపలత్వం కొద్దీ కుంతి అది నిజమా కాదా అని పరీక్షిద్దామనుకొంది. అప్పుడు ఎదురుగా నింగిలో సూర్యుడు వెలుగుతూ పిలవడానికి నేనున్నానన్నట్టుగా అవుపించాడు. అతన్నే ఆ మంత్రంతో పిలిచింది. అంతే, సూర్యుడు ఒక యోగమూర్తిగా రానే వచ్చాడు. కన్నెపిల్ల కంగారుపడిపోయింది. ‘మంత్రాన్ని పరీక్షించడానికి మాత్రమే నిన్ను పిలిచాను. అంతే. నువ్వు వెళ్లిపోవచ్చు’ అని అన్నా, సూర్యుడు ఆమె మాటను కాదంటూ, ‘ఈ మంత్ర మహిమను మనం ఆపలేం. నీకు కొడుకొకడు కలుగుతాడు. అయినా నీ కన్నెతనానికేమీ ముప్పు రాదులే’ అని వరమిచ్చి వెళ్లిపోయాడు. బంగారు కవచ కుండలాల వసువుతో (ధనంతో) ఒక పిల్లాడు పుట్టాడు. కుంతి సమాజానికి భయపడి, ఆ పసికుర్రాణ్ని ఒక పెట్టెలో పెట్టి నదీజలాల్లో విడిచిపెట్టింది. ఆ పెట్టె నీళ్ల ప్రవాహంలో సాగుతూ పోయి రాధ భర్త అయిన అదిరథుడికి దొరికింది. అపరంజి కిరణాల సేనతో పుట్టాడు గనక, అతన్ని వసుషేణుడని పిలుచుకొన్నారు ఆ దంపతులు. తరవాత అతనే కర్ణుడయ్యాడు. బుద్ధికి ప్రతీక అయిన పాండురాజుతో ఇంకా సంబంధం కుదరని కాలంలో ఈ కర్ణుడు పుట్టాడు గనక, అతను భౌతికమైన ఇంద్రియాల మొగ్గుదలల ప్రభావంలో ఉంటూ అధర్మానికి మరో పేరైన దుర్యోధనుడివైపే జేరాడు. ఆ మీద కుంతిభోజుడు కుంతికి స్వయంవరం చాటించాడు. వచ్చిన రాజుల్లో పాండురాజును ఆవిడ వరించింది. శల్యుడి చెల్లెలు మాద్రి ఆవిడకు సవతి అయింది. భర్తతో వన విహారంలో కాలాన్ని సరదాగా గడుపుతూండగా, ఒకరోజున మృగరూపంలో ఉన్న ముని దంపతుల్ని చంపిన దోషానికి పాండురాజు స్త్రీ సుఖానికి దూరంగా ఉండవలసి వచ్చింది. సంతానం లేకపోవడం వల్ల స్వర్గద్వారాలు తెరిచి ఉండవని తెలుసుకున్న పాండురాజు మహర్షుల ప్రబోధం మేరకు తాను ఎలాగైతే తన నాన్నగారి క్షేత్రమైన అంబాలికకు వ్యాసమహర్షి వల్ల పుట్టడం జరిగిందో... అలాగే తానూ ప్రయత్నం చేయాలనుకొన్నాడు. కుంతితో ఆ విషయాన్నే ప్రస్తావించాడు. ఆవిడ తనకు దివ్యశక్తుల్ని పిలిచి యమధర్మరాజు ద్వారా యుధిష్ఠిరుణ్ని, వాయువు ద్వారా భీముణ్ని, ఇంద్రుడి ద్వారా అర్జునుణ్ని కని కుంతి, పాండురాజును సంతానవంతుడిగా చేసింది. అంతేకాదు, భర్త కోరిన మీదట మాద్రికి కూడా ఆ మంత్రాన్ని చెప్పి నకుల సహదేవులను కలిగేలాగ చేసింది. మాద్రితో సహా వనంలోకి వెళ్లిన పాండురాజు కామాంధుడై చావును కొని తెచ్చుకోవడంతోనూ మాద్రి అతనితో సహగమనం చేయడంతోనూ కుంతి ఐదుగురు పిల్లల్నీ వెంటబెట్టుకొని రుషుల సాయంతో హస్తినాపురానికి చేరుకొంది. అప్పటినుంచి కుంతికి ఇక కష్టాలే కష్టాలు. ధృతరాష్ట్రుడికి గుడ్డితనం వల్ల రాజ్యం రాకపోయినా పాండురాజు చనిపోవడంతో అతని చేతిలోనే రాజ్యం ఉండిపోయింది. అతని కొడుకుల్లో పెద్దవాడైన దుర్యోధనుడు మహా అసూయాపరుడు. భీముడి పొడ అసలు గిట్టేది కాదు. అతను తననూ తన తమ్ముళ్లనూ కుస్తీపట్లలోనూ ఇతరమైన ఆటల్లోనూ ఓడిస్తున్నాడని ఒకటే గుర్రు. భీముడికి వాళ్లు విషం పెట్టారు; గాఢనిద్రలో ఉన్నప్పుడు అతన్ని గంగలోకి విసిరేశారు. అయితే, భీముడి ప్రాణం చాలా గట్టిది. అతను వాటినన్నిటినీ దాటేశాడు. యుధిష్ఠిరుడు పెద్దాడు గనక ధృతరాష్ట్రుడు అతన్ని యువరాజుగా చేయడమైతే చేశాడు గానీ దుర్యోధనుడి పోరు మాత్రం ఇంతింతగాదు. కొడుకు మాటను నెగ్గించడానికి కుంతితోసహా పాండవుల్ని వారణావతానికి పంపించి, లక్క ఇంట్లో సజీవ దహనం చేద్దామన్న కుటిల ప్రయత్నం చేశాడు ధృతరాష్ట్రుడు. విదురుడి ఆలోచనల వల్ల ఆ కష్టం నుంచి బయటపడి, ఐదుగురు పిల్లల్నీ పెట్టుకొని అజ్ఞాతంగా కొన్నాళ్లు బతకవలసివచ్చింది కుంతి. ఏకచక్రపురంలో తమకు నివాసాన్ని కల్పించిన బ్రాహ్మణుడికి వచ్చిన కష్టాన్ని తీర్చడానికి భీముణ్నే బకాసురుడి దగ్గరికి పంపడానికి ముందుకొచ్చింది ఆవిడ. దీనికి కారణాలు రెండు అవుపిస్తాయి: తన కొడుకు బలం మీద ఆవిడకున్న నమ్మకం మొదటిది; తామెంత కష్టాల్లో ఉన్నాసరే, ఇతరుల కష్టాన్ని తీర్చడానికి తమను తాము సమర్పించుకోవాలన్న సేవాభావాన్ని పిల్లలకు నేర్పడం రెండోది. లేకపోతే, ఏ తల్లైనా తను కన్న పిల్లవాణ్ని వధ్యశిలకు పంపించడం జరుగుతుందా? అక్కణ్నించి దక్షిణ పాంచాల దేశానికి బ్రాహ్మణులతో సహా వెళ్లి, ఒక కుమ్మరివాని ఇంట్లో బస చేశారు. స్వయంవర మంటపానికి వెళ్లి, మత్స్యయంత్రాన్ని ఛేదించి, బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడు ద్రౌపదిని గెలుచుకొన్నాడు. కోలాహలం అవుతూంటే, ధర్మరాజు నకుల సహదేవులిద్దరితోనూ బసకు వచ్చేశాడు. అక్కడ రాజులందరూ భీమార్జునులను బ్రాహ్మణులనే తలపుతోనే అడ్డుకొన్నారు. భీమార్జునులు వాళ్లందర్నీ ఓడించి ద్రౌపదితో సహా బసకు వచ్చి, ‘భిక్షను తెచ్చామమ్మా!’ అని సరదాగానే అన్నారు. లోపలి గదిలో ఉన్న కుంతి వాళ్లను చూడకుండానే, రోజూ సాధారణంగా బిచ్చం తెచ్చుకొన్నప్పుడేమంటుందో అదే తరహాలో ‘మీ అందరూ కలసి దాన్ని పంచుకోండి’ అని యథాలాపంగా అంది. ఇంతలో ఇవతలకు వచ్చి ద్రౌపదిని చూసి నాలిక్కరుచుకొంది. ‘ఛ ఛ ఎంత అనుచితమైన మాటనన్నాను’ అని చాలా నొచ్చుకొంది. చాలామందికి ఒకత్తె భార్యగా ఉండటం అధర్మమనిపిస్తుంది. అయితే, గురువు చెప్పిన మాటనే ధర్మమని అంటారు. తల్లేమో గురువుల్లో కల్లా గురువు. అంచేత, ఆవిడన్నమాటనే ధర్మంగా తీసుకోవాలని యుధిష్ఠిరుడు నిర్ణయించాడు. ద్రౌపది క్రితం జన్మలో పెళ్లికాక, శివుణ్ని గురించి తపస్సు చేసి అతను ప్రత్యక్షమైనప్పుడు ‘నాకు పతి చేకూరేలాగ చెయ్యి’ అని ఐదుసార్లు అంది అని చెబుతూ, వ్యాసుడు కూడా దాన్నే సమర్థించాడు. అలాగ కుంతి వాక్శుద్ధి కొద్దీ పాండవులైదుగురికీ ద్రౌపది భార్య అయింది. దుర్యోధనుడి తరఫున శకుని ఆడిన మోసపు జూదంలో ఓడిపోయి, పన్నెండేళ్ల వనవాసమూ ఒక ఏడాది అజ్ఞాతవాసమూ చేయడానికి పాండవులు వెళ్లినప్పుడు, కుంతి ధృతరాష్ట్రుడి పంచనే ఉండి కష్టపడింది. ద్రౌపది పాండవులతో కలసి వనవాస కష్టాలూ అజ్ఞాతవాస కష్టాలూ పడి బయటపడ్డ తరవాత, తమ రాజ్యాన్ని తిరిగి ఇమ్మంటే, దుర్యోధనుడు ససేమిరా అన్నాడు. ఇక పోరు తప్పనిసరి అయింది. అప్పుడు తన మొట్టమొదటి కొడుకు కర్ణుడు అటువైపు ఉండటం కుంతికి మింగుడుపడలేదు. ఏకాంతంగా అతన్ని కలసి జరిగిన సంగతి చెప్పింది: ‘నువ్వు సూతకులంలో పుట్టినవాడివి కావు, నా కొడుకువి. క్షత్రియకులంలో పుట్టినవాడివి. నువ్వు పాండవులవైపుకు వచ్చి, యుధిష్ఠిరుడికి అన్నగారివై రాజ్యాన్ని పాలించు. కర్ణార్జునులకు బలరామకృష్ణులకుమల్లే అసాధ్యమేమీ ఉండదు’ అని. కుంతి మాటను సూర్యుడు బలపరుస్తున్నట్లుగా బిట్టుగా ప్రకాశించాడు. అయినా సరే, కర్ణుడు దానికి ఒప్పుకోలేదు. ‘నన్ను అన్నివిధాలా సత్కరిస్తూన్న దుర్యోధనుణ్ని వదిలిపెట్టలేను. అందులోనూ యుద్ధకాలంలో ఆ పని నేను చేయను. అతనికోసం నీ కొడుకులతో యుద్ధం చేస్తాను. అయితే, ఒక్క అర్జునుణ్ని తప్ప, మిగతా నలుగుర్నీ నేను చంపను’ అని కర్ణుడన్న మాటను విని నిరాశగా కుంతి వెనుదిరిగి వచ్చింది. కానీ ఆ పెద్దకొడుకు గురించి ఆమె చివరిదాకా లోలోపల కుమిలిపోతూనే ఉంది. ఇలాగ కుంతి జీవితం పొడుగునా కష్టాలు అనుభవిస్తూనే ఉంది. కానీ ఆవిడ వైరాగ్యానికి మరోపేరు గనక వాటన్నింటినీ చాలా ఓర్పుగా శ్రీకృష్ణుడి మీద భక్తితో సహిస్తూ వచ్చింది. ఆవిడ భక్తి చాలా గొప్పది. ఆమెకు శ్రీకృష్ణుడు మేనల్లుడే; కలసినప్పుడల్లా అతను ఆవిడ పాదాలకు మొక్కేవాడు. అయినా ఆవిడ అతన్ని దేవుడిగా ఎరిగి శరణాగతిని పొందింది. పాండురాజు పోయిన దగ్గర్నుంచీ ఆవిడకు అన్నీ కష్టాలే. అన్ని ఆపదల్లోనూ శ్రీకృష్ణుడు కాపాడుతూనే వచ్చాడు. అతని మహాదయను తలచుకొంటూ కుంతి చేసిన ప్రార్థన మన అందరికీ కనువిప్పు కావాలి: ‘విపదస్సన్తునః శశ్వత్తత్ర తత్ర జగద్గురో! భవతో దర్శనం యత్ స్యాదపునర్భవదర్శనమ్!!’ (భాగవతం 1-8-25): ‘ప్రభూ! మా జీవితంలో ఎప్పుడూ విపత్తులే వస్తూ ఉండనీ! ఎందుకంటే, విపత్తుల్లోనే కచ్చితంగా నీ గుర్తు వచ్చింది, నీ రూపం ఆ కన్నీళ్లలో ప్రతిబింబించి అవుపిస్తుంది. లోపల నీ దర్శనమైతే ఇంకేముంది? చావు పుట్టుకల చక్రం నుంచి బయటపడిపోవడం ఖాయమవుతుంది. యోగేశ్వరుడా! యాదవుల మీదా పాండవుల మీదా నాకున్న అతి మక్కువ అనే పాశాన్ని తెగ్గోసి, నిన్నే నేనెప్పుడూ తలచుకొంటూ ఉండేలాగ దీవించు!’ అనే ఆవిడ మాటలు మనమెప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి. -డాక్టర్ ముంజులూరి నరసింహారావు