Uttar Pradesh: Rape Born Son Fight For Mother Won Justice - Sakshi
Sakshi News home page

కుంతీపుత్రుడు: 27 ఏళ్ల తర్వాత కన్నతల్లిని చేరుకుని, న్యాయం కోసం..

Published Thu, Aug 4 2022 6:32 PM | Last Updated on Thu, Aug 4 2022 7:12 PM

Uttar Pradesh: Rape Born Son Fight For Mother Won Justice - Sakshi

తన తప్పు లేకుండా జన్మించిన బిడ్డను నీట వదిలేసింది ఆనాటి కుంతీ. కామాంధుడి దాహార్తికి పుట్టిన బిడ్డను విధివశాత్తూ వదిలించుకుంది ఈనాటి కుంతీ. కానీ, ఆనాటి కర్ణుడిలా ఈ అభివన కర్ణుడు ఊరుకోలేదు. 27 ఏళ్ల తర్వాత తన తల్లి ఆచూకీ వెతుక్కుంటూ వెళ్లాడు. ఆ తర్వాత ఏం చేశాడో ఈ వాస్తవ గాథ చదివితే తెలుస్తుంది. 

సుమారు 27 ఏళ్ల కిందట.. ఉత్తర ప్రదేశ్‌ బరేలీలో ఘోరం జరిగింది.  తన సోదరి ఇంట్లో ఉంటున్న మైనర్‌ను.. బలవంతంగా ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు అన్నదమ్ములు. అది ఒక్కసారి కాదు.. పలుమార్లు. నిందితులిద్దరూ ఆమె కుటుంబానికి పరిచయస్తులే. పైగా బయటకు విషయం చెబితే చంపుతామని బెదిరించారు కూడా. ఈలోగా ఆ మైనర్‌ గర్భం దాల్చడం.. ప్రాణంమీదకు రావడంతో ఆమె బిడ్డను కనడం జరిగిపోయాయి. దత్తత మీద ఆమె కుటుంబం బిడ్డను వదిలించుకుని.. రాంపూర్‌కు వలస వెళ్లింది. అప్పుడామె వయసు 12 ఏళ్లు.  కొన్నేళ్లకు ఆమెకు వివాహం కాగా.. ఆమె అత్యాచారానికి గురైందన్న విషయం తెలిసి పదేళ్ల తర్వాత ఆ భర్త ఆమెకు విడాకులు ఇచ్చాడు. దీంతో.. ఆ మానని గాయంతో అలా ఒంటరిగానే మిగిలిపోయింది. 

► కాలం గిర్రున తిరిగింది. ఆ దత్తపుత్రుడికి తాను ఉన్నచోటు తనది కాదని తెలిసింది. తన కన్నతల్లి కోసం వెతుకులాట ప్రారంభించాడు. 2021 మొదట్లో.. ఎట్టకేలకు ఆ బిడ్డ తన తల్లిని కలుసుకున్నాడు. తన తండ్రి ఎవరో చెప్పాలని నిలదీశాడు. ఆమె తెలిసీతెలియని వయసులో తనకు జరిగిన అన్యాయం గురించి కొడుకు వద్ద ఏకరువు పెట్టుకుంది. దీంతో రగిలిపోయిన ఆ కొడుకు.. పోరాటానికి ఆమెను సిద్ధం చేశాడు. షాహ్‌జహాన్‌పూర్‌ పీఎస్‌కు వెళ్లి 1994లో తన తల్లిపై జరిగిన అఘాయిత్యం గురించి ఫిర్యాదు చేశాడు. మూడు దశాబ్డాల కిందటి ఘటన కావడంతో పోలీసులు షాక్‌ తిన్నారు. ఫిర్యాదు తీసుకోవడానికి తటపటాయించారు. అయితే.. కోర్టు జోక్యంతో ఎట్టకేలకు కేసు నమోదు అయ్యింది.  

► 2021, మార్చ్‌ 4వ తేదీన ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయ్యింది. ఈ లోపు బాధితురాలి న్యాయం చేసేందుకు ప్రత్యేక బృందం ఈ కేసు విచారణ చేపట్టింది. చాలా ఏళ్ల కిందటి కేసు కావడం.. నిందితుల పేర్లూ పూర్తిగా తెలియకపోవడంతో దర్యాప్తునకు ఆటంకంగా మారింది. పైగా వాళ్లు ఎక్కడున్నారో కూడా తెలియదు. కానీ, చిన్నవయసులోనే ఆ తల్లి అనుభవించిన క్షోభను పోలీసులు అర్థం చేసుకున్నారు. ఎస్సై ధర్మేంద్ర కుమార్‌ గుప్తా దగ్గరుండి విచారణ చేశారు. నిందితులు ఇద్దరూ అదే నగరంలో హద్దాఫ్‌ ప్రాంతంలో ఉంటున్నారని గుర్తించారు. 

► అయితే విచారణ కోసం వెళ్లిన పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది. బాధితురాలెవరో తమకు తెలియదని ఆ అన్నదమ్ములు బుకాయించారు. దీంతో కోర్టు ఆదేశాలతో డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించారు. జులై 2021న శాంపిల్స్‌ను ల్యాబ్‌లకు పంపించారు. కానీ, ఫలితం రావడానికి ‘9 నెలల’ టైం పట్టింది. అందులో మొహమ్మద్‌ రాజీ ఆ బిడ్డకు తండ్రిగా తేలాడు. దీంతో పోలీసులు అరెస్ట్‌ వారెంట్‌తో నిందితుల ఇళ్లకు వెళ్లారు. అయితే.. 

► అప్పటికే తమ బండారం బయటపడుతుందని భావించి.. నిందితులిద్దరూ పరారయ్యారు. పోలీసులు ఊరుకుంటారా?.. బృందాలను ఏర్పాటు చేయించి వాళ్లిద్దరి కోసం గాలింపు చేపట్టారు. సర్వేయిలెన్స్‌ టీం ఈ కేసులో కీలకంగా వ్యవహరించింది. ఎట్టకేలకు రాజీని హైదరాబాద్‌లో కనిపెట్టి.. మంగళవారం నాడు అరెస్ట్‌ చేసింది. అసలు ఆ ఉదంతం మళ్లీ తన ముందుకు వస్తుందని తాను ఊహించలేదని నిందితుడు చెప్తున్నాడు. మరో నిందితుడు ఒడిశాలో ఉన్నట్లు భావిస్తున్న పోలీసులు.. అక్కడికి బృందాలను పంపారు. తల్లిని వెతుక్కుంటూ వెళ్లడమే కాదు.. ఆమెకు జరిగినదానికి ఆలస్యమైనా న్యాయం జరిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement