Dr. Munjuluri Narasimharao
-
యుయుధానుడు
గుండె నుంచి అపనమ్మకాన్నీ సంశయాన్నీ నిరుత్సాహాన్నీ విడదీసుకోడానికి పోరాడుతూ తనను విశ్వచైతన్యం దిక్కుగా ఆకర్షించే గుణంతో కలుపుకొనే సాధకుడికి యుయుధానుడు ప్రతీక. ఐదోవేదం : మహాభారత పాత్రలు - 36 యాదవ కులంలో వృష్ణులూ అంధకులూ సాత్వతులూ దాశార్హులూ మాధవులూ మొదలైన తెగలు చాలానే ఉన్నాయి. యాదవ కృష్ణుణ్ని వార్ష్ణేయుడనీ సాత్వతుడనీ దాశార్హుడనీ మాధవుడనీ రకరకాలుగా పిలవడానికి కారణం ఈ తెగల పేర్లే. వృష్ణుల్లో అనిమిత్రుడనే అతనికి నిమ్నుడూ శినీ వృష్ణీ అని ముగ్గురు కొడుకులు పుట్టారు. నిమ్నుడి కొడుకు సత్రాజిత్తు. శినికి కొడుకు సత్యకుడు. ఈ సత్యకుడి కొడుకే సాత్యకి అని చెప్పుకొనే యుయుధానుడు. యుయుధానుడంటే యోద్ధాయోద్ధల కులానికి చెందినవాడని అర్థం. కులమంటే ఒక సమూహమని అర్థం. ‘యు’ అంటే, కలపడమూ విడదీయడమూ అనే రెండు వ్యతిరేక అర్థాలూ ఉన్నాయి. యుయు ధానుడంటే యోద్ధలతో తనను కలుపు కొని, అపనమ్మకాన్నీ పిరికితనాన్నీ తన నుంచి విడదీసుకొన్నవాడని అర్థం. గుండె నుంచి అపనమ్మకాన్నీ సంశయాన్నీ నిరుత్సాహాన్నీ విడదీసుకోడానికి పోరాడుతూ తనను విశ్వచైతన్యం దిక్కుగా ఆకర్షించే గుణంతో కలుపుకొనే సాధకుడికి యుయుధానుడు ప్రతీక. యుయుధానుడు శ్రీకృష్ణ బలరాము లతో సహా అభిమన్యుడి పెళ్లికి మత్స్య దేశానికి వెళ్లాడు. ఉత్తరాభిమన్యుల వివాహమైన తరవాత చుట్టపక్కాలందరూ ఎవరిళ్లకు వాళ్లు వెళ్లకుండా విరటుడి సభలో పాండవుల భవితవ్యం గురించి ఆలోచించారు. ద్రుపదుడి పక్కనే యుయు ధానుడు బలరాముడితో సహా కూర్చు న్నాడు. విరాటరాజు దగ్గరిగా కృష్ణుడూ యుధిష్ఠిరుడూ కూర్చొని ఉన్నారు. శ్రీకృష్ణుడు అందరినీ ఉద్దేశించి ‘పాండ వులు వాళ్ల రాజ్యాన్ని శకుని ద్వారా పోగొట్టుకొని, షరతుల ప్రకారం పన్నెండేళ్లు వనవాసమూ ఏడాది పాటు కష్టాతికష్టమైన అజ్ఞాతవాసాన్నీ విజయవంతంగా పూర్తిచేశారు. తిరిగి తమ పైతృక రాజ్యాన్ని పొందడానికి ఇప్పటి దాకా అజ్ఞాతవాసంలో ఇతరులకు సేవ చేస్తూ గడిపారు. ఇప్పుడింక ఏ తీరులో ఈ ధర్మపుత్రుడికీ ఆ దుర్యోధనుడికీ ఇద్దరికీ హితం జరిగేలాగ చేయడం సబబో మీరందరూ నిర్ణయించండి. చిన్న గ్రామానికి మహీపతిత్వమైనా సరే అది ధర్మార్థయుక్తమైతే చాలు యుధిష్ఠిరుడు సంతృప్తి చెందుతాడు. నిజానికి స్వయంగా పాండుపుత్రులే దిగ్విజయం ద్వారా చాలా మంది రాజుల్ని జయించి రాజ్యాన్ని సంపాయించారు. తాము సంపాయించు కొన్న రాజ్యాన్నే వాళ్లు న్యాయబద్ధంగా కోరుకొంటున్నారు. కానీ ఇప్పుడు ఆ కౌరవులకు, ఇన్నాళ్లూ అప్పనంగా రాజ్యాన్ని అనుభవించడంతో, లోభం పెరిగిపోయింది. కౌరవుల కక్కుర్తినీ యుధిష్ఠిరుడి ధర్మతత్పరతనీ దృష్టిలో పెట్టుకొని, ఏది చేస్తే సబబో మీరందరూ నిర్ణయించాలి. యుద్ధంలో ఆ కౌరవుల నందర్నీ చంపిమరీ రాజ్యాన్ని తీసుకో వలసివస్తుంది. వీళ్లు అల్ప సంఖ్యాకులు గదా వాళ్లమీద వీళ్లెలా గెలవగలరని మీరు అనుకోవచ్చు. తమ హితైషులతో కలిసి పాండవులు కౌరవుల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అయినా, దుర్యో ధనుడి ఉద్దేశమేమిటో అతనేం చేయ దలుచుకున్నాడో మనకు తెలియదు. అంచేత, ఇక్కణ్నించి ఒక దూతను పంపడం మంచిదని నాకు అనిపిస్తోంది’ అంటూ ముగించాడు. వెంటనే బలరాముడు దుర్యోధనుడి వకాల్తా తీసుకొన్నట్టుగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ మాటలకు ఉవ్వెత్తున మండిపడుతూ లేచాడు పక్కనే ఉన్న సాత్యకి: ‘మహాత్ముడైన ధర్మజుడికి జూద మాడడంలో నేర్పరితనం లేదు. అయినా సరే, జూదమాడడంలో బాగా చెయ్యి తిరిగినవాళ్లు ఇంటికి పిలిచి మరీ ఆడించి ఓడిస్తే, అది ధర్మపూర్వకమైన విజయం ఏవిధంగా అవుతుంది? ధర్మరాజు తన ఇంట్లోనే తమ్ముళ్లతో జూదం ఆడుతుంటే, అక్కడికి వచ్చి ఆడి ఓడిస్తే అది ధర్మమవు తుందని చెప్పవచ్చు. పిలిచి మరీ కపట మైన తీర్పులో ఓడించినవాళ్ల పనిని ఎవరైనా శుభమైన పని అని అనగలరా? ఇతనేమో షరతు ప్రకారం నియమాలను తూచా తప్పకుండా పాలించి వచ్చాడు. మరి ఎందుకని తలవంచి రాజ్యాన్ని అడుక్కోవాలో నాకు బోధపడటం లేదు. భీష్ముడూ ద్రోణుడూ విదురుడూ ఇలాగ ఎంతమంది అనునయించి చెప్పినా దుర్యోధనుడు రాజ్యాన్ని ఇద్దామని అనుకోవటం లేదు. నేను వాళ్లను వాడి వాడి బాణాలతో బలవంతంగా ఒప్పించి యుధిష్ఠిరుడి కాళ్లమీద పడేస్తాను. అలాగ చెయ్యకపోతే వాళ్లనందర్నీ యమలోకానికి అతిథులుగా చేసి తీరతాను. అందరూ నా ముందు నిలవడానికి సామర్థ్యం లేనివాళ్లే. ఆతతాయిలైన శత్రువుల్ని చంపితే అధర్మం కాదు. అటువంటి నికృష్టుల్ని యాచించ డమే సర్వథా అధర్మమూ అకీర్తికరమూను. రణరంగంలో అందరికందరు కౌరవులూ చావవలసిందే’ అంటూ ఉపన్యసించాడు. శ్రీకృష్ణుడు యుద్ధాన్ని ఆపుదామనే ఉద్దేశంతో కౌరవులకు నచ్చ చెప్పడానికి పాండవ రాయ బారిగా వచ్చినప్పుడు, దుర్యోధనుడు... దుశ్శాసన కర్ణ శకునుల సంగంతో మత్తెక్కి మదించి ‘మనం కృష్ణుణ్ని పట్టుకొని బందీగా చేద్దాం. కృష్ణుడు మన చెరలో ఉన్నాడని తెలియగానే కోరలు విరిగిన పాముల్లాగ నిర్వీర్యులైపోతారు పాండవులు’ అంటూ పరమ దుష్టాలోచనను చేశారు. ఈ దుష్ట ప్రణాళికను యుయుధానుడు కృష్ణుడి చెవిన ఈ వార్తను వేశాడు. కృష్ణుడు, ‘ఇదీ మంచిదే. ఈ రోజునే వీళ్లను చాప చుట్టినట్టు చుట్టబెట్టి పాండవులకు అప్ప గించేస్తాను. ఒక్కసారిగా తలనొప్పి వదిలి పోతుంది’ అన్నాడు. యుద్ధభూమిలో సాత్యకి పాండవులకు చివరిదాకా సాయపడ్డాడు. సైంధవుణ్ని వధించి ప్రతిజ్ఞను తీర్చుకోవ డానికి వెళ్తూ అర్జునుడు, తన శిష్యుడైన యుయుధానుణ్ని, ద్రోణుడి బారి నుంచి ధర్మారజన్నయ్యను కాపాడుతూ ఉండ మని మరీ మరీ చెప్పాడు. అయితే, ధర్మరాజుకు శ్రీకృష్ణార్జునులేమైపోతారో అని ఒకటే బెంగ. దానితో సాత్యకిని అర్జునుడికి సాయంగా వెళ్లమని ‘నీ గురువుకు గురువుగా నిన్ను ఆదేశిస్తున్నా’నని నిర్బంధపెడుతూ, గురువు మాటను జవదాటడం ఇష్టం లేకపోయినా అతన్ని బయలుదేరదీశాడు. మొదట ద్రోణకృత వర్మలతో యుద్ధం చేస్తూ వాళ్లను తప్పించుకొని కాంబోజుల సేన దగ్గరికి వచ్చాడు సాత్యకి. తిరిగి కృతవర్మ ఎదురొస్తే అతన్ని ఓడించి, త్రిగర్తుల గజసేనను సంహరించాడు. మహాగజంతో అడ్డుపడిన మాగధుడైన జలసంధుణ్ని ఆ ఏనుగుతోసహా తెగేసి ముందుకుపోయాడు. ద్రోణ కృతవర్మలతో యుద్ధం చేయవలసి వచ్చినప్పుడల్లా జయించి దూసుకుపోయాడు. ద్రోణుణ్నీ కృతవర్మనీ రెండు మూడు సార్లు జయించినా తన సారథితో ఏ గర్వమూ లేకుండా, ‘మనం ఇక్కడ నిమిత్త మాత్రులమే. నిజానికి కేశవ ఫాల్గుణులే మన శత్రువులను చంపుతున్నారు. అర్జు నుడు చంపినవాళ్లను మనం తిరిగి చంపు తున్నట్టున్నాం’ అంటూ, శ్రీకృష్ణుడు అర్జునుడికి తన విశ్వరూపాన్ని చూపిస్తూ, ‘నేను కాలుణ్ని. నేను చంపేసినవాళ్లను నువ్వు నిమిత్తమాత్రంగా చంపి కీర్తిని అనుభవించు’ అని చెప్పిన మాటల్నే ధ్వనింప జేశాడు యుయుధానుడనే గురుభక్తుడు. అలా అంటూన్నప్పుడే సుదర్శనుడనే రాజకుమారుడు తార సిల్లాడు. అతనితో పెద్ద పోరాటమే జరి గింది. చివరికి అతన్ని వధించి, కాంబో జయ వనసేనలను ఓడించి, దుర్యో ధనుణ్ని అతని తమ్ముళ్లతో సహా పలా యనం చిత్తగించేలాగ ఇబ్బందిపెట్టాడు. ఆ మీద అతిఘోరంగా రాళ్లతో యుద్ధం చేసే మ్లేచ్ఛుల సైన్యాన్నీ సంహరించి అక్కడే పక్కనున్న దుశ్శాసనుణ్ని, అతని సేనతో సహా తరిమి గొట్టాడు. అలంబుషు డనే రాజును వధించి వస్తూంటే కృష్ణుడు అర్జునుడికి సాత్యకి రాక గురించి చెప్పాడు. అర్జునుడు, ‘ఇతన్ని అన్నగారికి సాయంగా ఉండమని చెప్పి వచ్చాను. ద్రోణుడు అన్నగారిని పట్టుకుంటే, ఈ యుద్ధమంతా దండగే. తిరిగి మేము వనవాసానికి పోవలసివస్తుంది’ అంటూ నొచ్చుకున్నాడు. ఆ సమయంలోనే ఇంత యుద్ధమూ చేసి అలసిపోయి ఉన్న సాత్యకికి భూరిశ్రవసుడు ఎదురయ్యాడు. వాళ్లిద్దరి యుద్ధాన్ని చూస్తూ అర్జునుడు ‘ఇంత కౌరవ సాగరాన్నీ దాటివచ్చి ఇప్పుడు మన సాత్యకి తన అలుపు కార ణంగా, గోష్పాదమంత చిన్ని నీటికుంట లాంటి భూరిశ్రవుడి చేతిలో దెబ్బతినేసే లాగ ఉన్నాడు’ అంటూ వాపోయాడు. సోమదత్తుడికి వరప్రసాదంగా పుట్టిన భూరిశ్రవసుడు, శిని మనవడు సాత్యకి తలను నరకబోతూంటే అర్జునుడు భూరిశ్రవసుడి కుడిచేతిని ఎగరగొట్టాడు. అతను హతాశుడై మునిలాగ శరాసనం మీద కూర్చొని ఉండగా ఈ సాత్యకి, కృష్ణార్జునులు వద్దంటున్నా వినకుండా, అతని తలను ఖండించాడు. తరవాత ద్రోణుడు కూడా అశ్వత్థామ చనిపోయాడన్న మిథ్యావార్తను విని అస్త్రా లను విడిచిపెట్టి రథం మీదనే ధ్యాన మగ్నుడైనప్పుడు, అతన్ని చంపడానికే పుట్టిన ధృష్టద్యుమ్నుడు అతని తలను కోసేశాడు. అది చూసి సాత్యకి ధృష్ట ద్యుమ్నుణ్ని తిట్టాడు. గదతో మీదకు ఉరికి చంపుతానని బెదిరిస్తూన్న సాత్యకిని భీముడు ఆపాడు. పద్దెనిమిదో రోజున యుద్ధం చేస్తూన్న కౌరవ సైనికులతో ఉన్న సంజయుణ్ని సాత్యకి పట్టుకున్నాడు. అతన్ని చంపుదామనుకుంటూండగా వ్యాసమహర్షి తటాలున అవుపించి ‘ఇతను వధార్హుడు కాడు’ అని చెప్పి సంజ యుణ్ని విడిచిపెట్టేలాగ చేశాడు. - డా. ముంజులూరి నరసింహారావు -
అశ్వత్థామ
ఐదోవేదం: మహాభారత పాత్రలు - 19 అశ్వత్థామా బలిచక్రవర్తీ వ్యాసుడూ హనుమంతుడూ విభీషణుడూ కృపాచార్యుడూ పరశురాముడూ అనే ఏడుగుర్నీ చిరంజీవులని చెబుతారు. అశ్వత్థామ ద్రోణుడికీ కృపికీ పుట్టాడు. కర్ణుడు సహజమైన కవచకుండలాలతో పుట్టినట్టుగా, ఇతను తలమీద మణితో పుట్టాడు. ఈ మణి వల్లనే అతనికి శస్త్రాల వల్ల గానీ వ్యాధుల వల్ల గానీ ఆకలి వల్ల గానీ ఏ రకమైన భయమూ ఉండేది కాదు. అంచేత ముంద ర్నుంచీ దుందుడుకుగానూ చపలత్వంతో క్రూరుడిగానూ ఉండేవాడు. ఇతను పుడు తూనే గుర్రంలాగ గట్టిగా బలంగా (‘స్థామ’) నలుదిక్కుల్లోనూ ప్రతిధ్వనించే లాగ సకిలించాడు గనకనే ‘అశ్వత్థామ’ అయ్యాడని భారతంలో నిర్వచనం. దీనితో ఇతను చిరంజీవి ఎలాగయ్యాడన్నది మనకు అర్థంగాదు. ఇతని తండ్రి ద్రోణుడు సంస్కారానికీ అలవాటుకీ ప్రతీక. మేనమామ కృపుడు అవిద్యకు, అంటే, తప్పుగా అర్థం చేసుకోవడానికి ప్రతీక. తల్లి కృపి కూడా ఆవిడ అన్నగారిలాగే అవిద్యకే గుర్తు. ద్రోణుడు పోయిన తరువాత ఈవిడ అశ్వత్థామ కోసం బతికే ఉంది. అవిద్య నుంచే అహం కారం పుడుతుంది. ఆ అహం కారం నుంచి భోగించాలనే కోరిక పుడుతుంది. భోగించడానికి సాధనాలు ఇంద్రియాలు. కోరికతోనే ఇంద్రియాలు విషయాలతో కలుస్తాయి. ఈ కలయికే మంచీ చెడు పనులకు దారితీస్తుంది. ఆ పనుల ఫలితాలే అలవాట్లూ సంస్కారాలూను. అవి కొత్త కొత్త కోరికల్నీ వాటికి ఫలాలైన వాసనల్నీ పుట్టిస్తూ, ఎప్పటికీ పోకుండా ఒక జన్మ నుంచి మరోజన్మకు వాటిని రవాణా చేస్తూ, దానికిగా అదే నడవగలిగే ఒక చక్రాన్ని తయారుచేస్తాయి. స్వయంగా తనను తాను పోషించుకొనే ఈ చక్రమే మన లోపల దాక్కొని ఉండే కోరిక. దీన్నే గుప్తమైన కోరిక, కోరికల వల్ల పుట్టిన విత్తనమూ అంటారు. వాసనల వల్ల పుట్టిన ఈ గుప్తకామమనే ఆశయమే అశ్వత్థామ - లోపల శయనించి ఉండే కోరిక. ‘అశూజ్’ అనే క్రియకు ‘పోగు’ అనే అర్థం ఉంది. పోగై ఒకానొక ప్రత్యేక మైన స్థితిలో ఉండి (‘స్థా’) ఎడ తెరిపిలేకుండా కొనసాగే కోరికే అశ్వత్థామ. పోగై, మార్పులేకుండా ఉంటూ చావుతో కూడా చావకుండా జన్మజన్మాంతరాలకు కొనసాగుతూ, లోపల శయనించి ఉండే చిరంజీవమైన కోరిక బీజమే ఆశయమనే అశ్వత్థామతత్త్వం. ఇంతటి చిరంజీవి చనిపోయాడన్న పుకారు, ఇతని నాన్న ద్రోణుడు చనిపోవ డానికి కారణమైంది. అంటే, ఆశయం కాలిపోతే, వాసనలూ సంస్కారాలూ అస్త్రసన్యాసం చేసి వాటంతట అవే చచ్చి పోతాయన్నమాట. అప్పటికప్పుడు పుట్టే క్రియాశీలకమైన కోరికకు అవచేతనలో వేరులుండవు. ఇది మొదట పుట్టినప్పుడు అంత శక్తిమంతంగా ఉండదు గనుకనే దీన్ని ఇచ్ఛాశక్తితో అణచుకోవచ్చు. ప్రతి కోరికా, అది తీరినా తీరకపోయినా మరో కోరికను కంటూనే ఉంటుంది. ఎంత తీరినట్టనిపించినా కూడా కోరికలో ఎంతో కొంత తీరని శేషం ఉండనే ఉంటుంది. అహంకారం ప్రేరేపించే క్రియాశీలకమైన కోరికలనుంచే కోరికల విత్తులు పుడుతూ ఉంటాయి. తీరని ప్రతి కోరికా ప్రజ్ఞాన మనే అగ్నిలో వేగకపోతే, మనస్సులో అది ఒక కొత్త కోరిక విత్తును విత్తుతూనే ఉంటుంది. ఈ విత్తులు అప్పటికప్పుడు పుట్టే కొత్త కోరికలకన్నా ఎక్కువగా నిర్బంధిస్తూ ఉంటాయి. ఆశయాలు ఎప్పుడు బయటపడ తాయో చెప్పలేం. అవి బయటికి మొలిచినప్పుడు మనను బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. అశ్వత్థామశక్తి అలాగ ఆద్యంతమూ బాధించేదీ ప్రాణాంతకమైన దీను. అభిమన్యుణ్ణి అన్యాయంగా చంప డంలో ఇతని పాత్ర కూడా ఉంది. ద్రోణుణ్ణి దృష్టద్యుమ్నుడు చంపిన తరువాత, అశ్వత్థామ చెలరేగి యుద్ధం చేశాడు. మొత్తం పాండవసైన్యాన్ని ఒక్కసారిగా నాశనం చేద్దామని నారాయణాస్త్రం వేశాడు. ఆ అస్త్రం ఎన్నో బాణాల్నీ చక్రాల్నీ గదల్నీ ఒక్కసారిగా చుట్టుముట్టేలాగ చేస్తుంది. దానికి విరుగుడు, ఆయుధాల్ని విడిచిపెట్టి రథం నుంచి కిందికి దిగి లొంగి పోవడమే. శ్రీకృష్ణుడికి ఈ విషయం తెలుసు గనక, అందర్నీ రథాల నుంచి దిగి ఆయుధాల్నీ విల్లమ్ముల్నీ విడిచిపెట్టమని చెప్పాడు. భీముడు, అది తన వీరత్వానికి తగదనుకొన్నాడు. బాణాలు చుట్టుముడు తూన్నా యుద్ధం చేసి వాటిని పోగొట్టు కుందామనే ప్రయత్నిస్తూ తాత్సారం చేశాడు. అప్పుడు నరనారాయణులైన కృష్ణుడూ అర్జునుడూ వెళ్ళి, అతన్ని బలవంతంగా కిందికి దించి విల్లమ్ముల్ని కింద పడవేయించారు. అర్జునుడు ఆ అస్త్రానికి ఎదురు వేయొచ్చుగా అని మనకు అనిపిస్తుంది. కానీ నారాయణాస్త్రానికీ గోవులకీ బ్రాహ్మణులకీ ఎదురుగా బాణం వెయ్యకుండా గాండీవాన్ని కింద పెట్టేయాలన్నది అర్జునుడి వ్రతం. ఈవిధంగా నారాయణాస్త్ర ప్రయోగం విఫలమైన తరవాత, దుర్యోధనుడు అశ్వత్థామని దాన్ని తిరిగి ప్రయోగించమని ప్రోత్సహించాడు. అప్పుడు అశ్వత్థామ రెండోసారి ప్రయోగించరాదని చెప్పి, ఆ మీద ఆగ్నేయాస్త్రాన్ని వేశాడు. దాని మంటలకు చాలామందే ఆహుతైపోయారు. కృష్ణార్జు నులు కూడా మసి అయిపోయారని అశ్వత్థామ అనుకొన్నాడు. కానీ, వాళ్ళు చెక్కుచెదరకుండా బయటపడడం చూసి, హతాశుడైపోయాడు. ఆ సమయంలో వ్యాసుడు అవుపించి, యుద్ధదేవత అయిన రుద్రుణ్ణి పూజించడంలో శ్రీకృష్ణార్జునులకీ అశ్వత్థామకీ మధ్య తేడా చెప్పాడు: ‘నువ్వు రుద్రప్రతిమకు పూజచేస్తూ వచ్చావు; వాళ్ళేమో రుద్రలింగానికి పూజచేస్తూ ఉంటారు’. లింగం ఒక రూపం లేనిది గనక, సర్వరూపుణ్ణి కొలిచినట్టవుతుంది; ప్రతిమ అనేసరికల్లా ఒకే రూపం గనక, సర్వోపగతత్వానికి పూజచేసినట్టుగాదు. రుద్రుడన్నా అగ్ని అన్నా ఒకటే. వాస్తవ మైన రుద్రతత్త్వాన్ని కొలవడంవల్లనే వాళ్ళిద్దర్నీ అగ్ని ఏమీ చేయలేదు. దుర్యోధనుడు తొడలు విరిగి నేలమీద పడి ఉన్నప్పుడు, అశ్వత్థామా కృతవర్మా కృపాచార్యుడూ అతని దగ్గరికి వెళ్ళారు. అతను అశ్వత్థామ కసికి మెచ్చుకొంటూ అతన్ని సేనాపతిగా చేశాడు. ఆ ముగ్గురూ విజయోత్సాహంతో ఉన్న పాండవసేనకు అవుపడకుండా గడపాలని, ఆ రాత్రికి అడవిలోకి వెళ్ళారు. మర్రిచెట్టుకింద పెద్దవాళ్ళిద్దరూ నిద్రపో యినా, అశ్వత్థామకు మాత్రం కునుకు పట్టలేదు. ఆ చెట్టుమీదకి ఒక పెద్ద గుడ్ల గూబ వచ్చి, అక్కడి గూళ్ళల్లో నిద్రపో తూన్న కాకులదండుని చంపింది. ఈ మారణకాండను చూసిన అతనికి, తన తండ్రిని చంపిన ధృష్టద్యుమ్నుణ్ణీ ఇతర పాంచాల దేశస్థుల్నీ చంపుదామన్న క్రూరమైన ఆలోచన వచ్చింది. అంతే. ఆ ఇద్దర్నీ లేపి, తన నిశ్చయాన్ని చెప్పాడు. ఆదమరచి నిద్రపోయేవాళ్ళనూ నిరాయుధుల్నీ చంపడం న్యాయం కాదు గనక, ఆపని పొద్దున్న చేద్దామన్న మేనమామ మాట అతనికి నచ్చలేదు. అతను బయలు దేరితే, ఇక చేసేదిలేక, వాళ్ళిద్దరూ కూడా అతని వెంట వెళ్ళారు. అక్కడ పాంచాల శిబిరం దగ్గర అశ్వత్థామ మహాద్భుతుడైన ఒక పురుషుణ్ణి చూశాడు. భయపడకుండా అతనిమీద ఎన్నెన్నో శస్త్రాల్ని వేశాడు. కానీ అవన్నీ అతనిలో లీనమైపోయాయి. తన దగ్గరున్న అస్త్రశస్త్రాలన్నీ అయిపోయిన తర వాత అతనికి తన క్రూరమైన నిశ్చయాన్ని దండించడానికి మహాదేవుడే దిగి వచ్చా డని అనిపించింది. తక్షణమే రుద్రుణ్ణి స్తుతి చేయడం మొదలు పెట్టాడు. చివరికి తనను తాను రుద్రచరణాల్లో బలిగా అర్పించుకోడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు ఎదురుగా ఉన్న వేదిమీద అగ్ని మండుతూ అవుపించింది. అశ్వత్థామ వెనుదీయకుండా ఆ అగ్నిలోకి దూకి కూర్చున్నాడు. అప్పుడు మహాదేవుడు, ‘శ్రీకృష్ణుణ్ణి సమ్మానిస్తూ పాంచాలుల్ని ఇంతదాకా నేను రక్షిస్తూ వచ్చాను. కానీ ఇప్పుడు వాళ్ళ కాలం దగ్గరపడింది’ అని చెబుతూ, తానే అశ్వత్థామను ఆవేశించి, ఒక ఖడ్గాన్ని అందించాడు. శిబిర ద్వారం దగ్గర తతిమ్మా ఇద్దరూ ఎవరూ బయటికి పోకుండా కాపలా కాస్తూ నిలుచున్నారు. అశ్వత్థామ లోపలికి పోయి ముందస్తుగా నిద్రపోతున్న ధృష్టద్యుమ్నుణ్ణి జుట్టుపట్టు కొని లేవదీసి, పశువును చంపినట్టు చంపాడు. ఇంతలో మెలకువ వచ్చి మీదకు వచ్చిన ఇతర యోధుల్ని రుద్రా స్త్రంతో ఊచకోత కోశాడు. ఆ మీద నిద్రపో తూన్న ద్రౌపది కొడుకుల్ని ఒక్కొక్కడినీ నరికేశాడు. శిబిరం ఇవతలకు వచ్చి తాను చేసిన ఘనకార్యాన్ని మేనమామకూ కృతవర్మకూ గొప్పగా చెప్పాడు. తిరిగి ఆ ముగ్గురూ అడవికి వెళ్ళిపోయారు. ఇతని కసినీ ఆలోచన లేనితనాన్నీ ఎరిగినవాడు గనకనే తండ్రి ఇతనికి మనుషుల్లో ప్రయో గించకూడని బ్రహ్మశిరమనే అస్త్రాన్ని ఈయలేదు. అర్జునుడికి ఇచ్చాడని ఇతను కొంచెం మారాం చేస్తే ఉపసంహారాన్ని చెప్పకుండా ద్రోణుడు ‘నువ్వు దీన్ని చపలభావంతో వెయ్యకూడద’ని మరీ చెప్పి ఆ అస్త్రాన్నిచ్చాడు. ఒకసారి శ్రీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, నీ చక్రాన్ని నాకియ్య మంటూ తలబిరుసుతనాన్ని చూపించాడు. ‘తీసుకో’ అంటే, దాన్ని ఎత్తలేకపోయాడు. కొడుకుల్ని చంపాడనగానే భీముడు అశ్వత్థామ వెంటపడ్డాడు. భీముణ్ణి బ్రహ్మ శిరోనామకాస్త్రం నుంచి కాపాడాలని శ్రీకృష్ణుడు యుధిష్ఠిర అర్జునులతో సహా వెళ్ళాడు. అశ్వత్థామ బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని వేసేశాడు. శ్రీకృష్ణుడు చెప్పగా దానిమీదకు మళ్ళీ ఆ అస్త్రాన్నే అర్జునుడు వేశాడు. వ్యాసుడూ నారదుడూ ఆ ముప్పును ఆపడానికి వచ్చారు. ‘ఈ అస్త్రాన్ని మనుషుల మీద వెయ్యకూడదు. దాన్ని మరో అస్త్రంతో నాశనం చేద్దామని చూస్తే, ఆ ప్రదేశంలో 12 ఏళ్ళపాటు వర్షాల్లేక మనుషులు అల మటిస్తారు. కనక, మీరిద్దరూ వాటిని ఉప సంహరించండి’ అని వ్యాసుడు ఆదేశిం చాడు. అర్జునుడు ఆ పని చేశాడుగానీ, అశ్వత్థామకు అది చేతగాలేదు. వ్యాసుడు చెప్పగా తన మణిని తీసి ఇస్తూ, అపాండవం గావాలని విసిరిన ఇషీకాన్ని పాండవేయుల గర్భం మీదకు మళ్ళిం చాడు. అది విని శ్రీకృష్ణుడు ‘నువ్వు నా చక్రాన్ని అడిగినప్పుడే నీ క్రూరత్వం అర్థమైంది. ఉత్తరాగర్భంలో ఉన్న పరీ క్షిత్తును నీ అస్త్రం కాల్చినా నేను మళ్ళీ ప్రాణం పోస్తాను. అతను పాండవుల తరువాత పరిపాలిస్తాడు. నీ క్రూరత్వానికి ఫలాన్ని పొందు. మూడు వేల సంవత్స రాలు భూమ్మీద ఒంటరిగా నిర్జనవనాల్లో తిరుగు. నీ శరీరం నుంచి చీమూ నెత్తుర్ల వాసన వస్తూండగా కీకా రణ్యాల్లో నువ్వు ఉండవలసి వస్తుంది’ అంటూ శపించాడు. అశ్వత్థామ శక్తిహీనుడై నిర్జన ప్రదే శాల్లో ఉండడమంటే యోగపరంగా గొప్ప అర్థముంది. సాధకుడు ముక్తిని పొంది దివ్యచైతన్యంలో ప్రతిష్ఠితుడై ఉన్నప్పుడు అతని కోరికలు, పర మాత్మ తాలూకు ‘కోరికగాని కోరిక’లాగ అయి, అతన్ని లోబరుచుకోలేని స్థితిలో ఉంటాయి. అంటే, ఆశయాన్నుంచి విడివడి ఈశ్వర త్వాన్ని పొందుతాడు ఆ సాధకుడు. - డా॥ముంజులూరి నరసింహారావు -
దుర్యోధనుడు
ఐదోవేదం: మహాభారత పాత్రలు - 11 ధృతరాష్ట్రుడి పిల్లల్లో ఆరోవంతు మంది పేర్లకు ముందు ‘దుః’ అనే మాట ఉంది. ‘దుః’ అంటే, కష్టమనే గాక, ‘చెడ్డ’ అనే అర్థం కూడా ఉంది. దుర్యోధనుడంటే ‘ఇతనితో యుద్ధం చేయడం అతికష్టం’ అనేగాక, ‘ఇతని యుద్ధం అతి చెడ్డది’, ‘ఇతను బహు చెడ్డ యోద్ధ’ అనే అర్థాలు కూడా వస్తాయి. మనందరికీ మినహాయింపేమీ లేకుండా ఎవరితో పోరాడటం కష్టం? ఎవరి పోరాటం చెడ్డది? అంటే ఒకే ఒక్క జవాబు వస్తుంది లోకంలో... ‘కోరిక’ అని. అందరితోనూ ఏదోవిధంగా దెబ్బలాడవచ్చునేమో గానీ కోరికతో కొట్లాడటం మాత్రం అతికష్టం. అది అందితే మెడకో అందకపోతే కాలికో మెలిక వేస్తూనే ఉంటుంది. ఒకటి పోతే మరో కోరిక దాని స్థానే ఎడతెగని ప్రవాహంలాగ వస్తూనే ఉంటుంది. కోరిక రజోగుణం నుంచి పుట్టింది; బాగా తిండిపోతు; అతి పాపిష్ఠిది. అది నిప్పులాంటిది. నిప్పులో ఎన్ని ఎండుపుల్లలేసినా, ఎంత నెయ్యి పోసినా అది కాదనదు; తింటూనే ఉంటుంది, మండుతూనే ఉంటుంది. నిప్పుకు ‘అనలం’ అనే పేరు అందుకనే వచ్చింది. ‘అలం’ అంటే ‘చాలు’ అని అర్థం. ‘అనలం’ అంటే చాలనే మాటను అననే అనదని అర్థం. కోరిక నిప్పు నార్పాలంటే, ఒకే ఒక్క దారి: వస్తువుల మీద ఉన్న ఆసక్తి అనే నేతినీ విషయాలతో పూసుకొని తిరగడమనే కట్టెపుల్లల్నీ వేయడం మానెయ్యాలి. ‘దుర్యోధనుణ్ని’ చంపడాని క్కూడా అదే దారి: విదురుడు ధృతరాష్ట్రుడికి పదే పదే చెప్పిన దారి: ‘వాణ్ణొక్కణ్ణీ వదిలిపెడితే మొత్తం శరీర రాష్ట్రానికీ మనస్సనే క్షేత్రానికీ క్షేమమూ శాంతీ వస్తాయి; లేకపోతే, జీవితం పొడుగునా ఉపద్రవమే ఉపద్రవం. మనం అందరం ధృతరాష్ట్రులం గనకనే అంతర్వాణి అయిన విదురుడు పదే పదే చెప్పే ఈ మాటను వినాలని అనుకోం. కోరికను పెద్దకొడుకన్నట్టుగా కావలించు కొని కూర్చుంటాం. వాడు కలిలాగ నెత్తికెక్కి కూర్చున్నాడని అనుకోం. కలి నెత్తికెక్కినప్పుడు పరీక్షిత్తులాంటి భాగవతుడు కూడా నిష్కారణంగా ఏ పాపమూ చేయని సాధువు భుజంమీద చచ్చిన పామును పడేసి చెప్పరానంత ముప్పును కొనితెచ్చుకొంటాడు. ‘కలేరంశస్తు సంజజ్ఞే భువి దుర్యోధనో నృపః! దుర్బుద్ధిర్దుర్మతిశ్చైవ కురూణామయశస్కరః!!’ (ఆదిపర్వం 67-87). కలి అంశమే దుర్యోధనుడు; దుర్బుద్ధీ దుర్మతీ అతని లక్షణాలు. పనిని కుశలంగా చేద్దామనుకొనే వంశానికి అపయశస్సును తెచ్చే మచ్చ ఇతను. కలి అంటే, తమోగుణం ఎక్కువగా ఉన్నవాడు. తమోగుణమంటే నిద్రా ఆలస్యమూ ప్రమాదమూ (అజాగర్తా) మొహమూ మొదలైనవి. ‘కలిః శయానో భవతి’ అని ఐతరేయ బ్రాహ్మణంలో చెబుతారు: కలి అంటే ‘నిద్ర’లో మునిగిన వాడని అర్థం. ‘నిద్ర’ అంటే, మనం మామూలుగా అనుకొనే నిద్రగాదు: ‘నిద్ర’ అంటే, జీవశక్తి అంతా ఇంద్రి యాల ద్వారానూ ఇతరమైన అవయవాల గుండానూ బయటికి పోతూ ఖర్చైపోవడం. మెలకువ తెచ్చు కోడమంటే, ఆ ప్రాణశక్తిని వెనక్కి మలిపి మెదడు దిక్కుగా పంపడమని అర్థం. కోరికకూ పైన చెప్పిన ‘నిద్ర’కూ అవినాభావ సంబంధం ఉంది. మనకు సినిమాలు దుర్యోధనుడంటే అభిమాన ధనుడని చెబుతాయి. సినిమాల్లో అతి గొప్పగా చెప్పడానికి కారణం, మనమం దరమూ కోరికను పగవాడిగా తెలుసు కోలేకపోవడం వల్లనే. కోరిక లేకుండా బతకడమెలాగ అని మనమంటాం. మనను మనం ఉద్ధరించుకోవాలనే కోరికను వద్దని ఎవడూ అనడు. కానీ మన కోరికలన్నీ ఇతరులని చూసి వాతపెట్టు కుందామన్న మూర్ఖత్వంతో ప్రబలినవే. దుర్యోధనుడు పుట్టినప్పుడు నక్కలాగ అమంగళంగా అరిచాడని సినిమాలు చెప్పవు. అతను భీముణ్ని ఎదిరించడం తెలియక విషం పెట్టాడు. అతనికి అధికారం లేకపోయినా కర్ణుడికి ‘అంగ’ రాజ్యాన్ని కట్టబెట్టి అర్జునుణ్ని ఎదిరించడానికి అతన్ని, తన ‘ఉప్పు’ తిన్నవాడిగా చేసు కొన్నాడు. ఎదురుగుండా ఎదిరించ డానికి దమ్ములేకపోవడం వల్లనే ఆకతాయిగా పాండవుల్ని వేరే ఊరు పంపించి, వాళ్లున్న ఇంటిని కాల్చడానికి ప్రయత్నించాడు. రాజసూయయాగంలో పాండవుల డబ్బును చూసి అతనికి కన్నుకుట్టింది. మయసభలో నేలా నీళ్ల మధ్య తేడా తెలుసుకోలేని మతి లేని వాడై, ‘నేల’లో మునిగి, ‘నీళ్ల’ మీద బొక్కబోర్లా పడి కముకు దెబ్బతిన్నాడు. మయుడి మాయే జూదమనే మాయకు తెర తీసేలాగ చేసింది. తనకు జూద మాడటం చేతగాకపోయినా బోళా ధర్మ రాజును ముగ్గులోకి దించి, తనకు బదులుగా శకుని మామ చేత ఆడించాడు. విదురుడి మాట విని, ద్రౌపదికి వరం ఇచ్చి ధృతరాష్ట్రుడు పాండవుల దాస్యాన్ని పోగొడితే, మళ్లీ ఇంతలోనే మరో ప్రణాళిక వేసి, పన్నెండేళ్ల వనవాసమూ ఓ ఏడాది అజ్ఞాతవాసమూ అనే విలక్షణమైన పందేన్ని వేయించే జూదాన్ని తిరిగి ఆడేలాగ నిర్బంధపెట్టాడు దుర్యోధనుడు. పదమూడేళ్లు రాజ్యానికి దూరంగా ఉంటే, ధర్మరాజంటే ఇష్టపడే ప్రజలందర్నీ తనవైపునకు తిప్పుకోవచ్చుననుకొన్నాడు. వనవాసం చేస్తున్నప్పుడు దూర్వాసుణ్ని పంపించి, అతని కోపానికి పాండవుల్ని గురిచేద్దామని పథకం వేశాడు. అక్షయ పాత్ర ఆ రోజు ఇవ్వవలసిన గ్రాసం ఇచ్చేసింది. ద్రౌపది కడిగేసిన పాత్రలో ఒక మెతుకు మిగిలి ఉందని వాళ్లకు తెలి యదు. దాన్ని నోట్లో వేసుకొని, సర్వ భూతాల కడుపుల్నీ ఒకే కాలంలో నిండి పోయేలాగ శ్రీకృష్ణుడు చేయడంతో, స్నానం చేయడానికి వెళ్లిన దూర్వాసుడూ అతని పదివేల మంది శిష్యులు అందరూ కడుపులు ఉబ్బరించి అక్కణ్నించే పారి పోయారు. ఈ పన్నాగం దెబ్బతినడంతో, పాండవుల్ని అవమానం పాలు చేద్దామన్న దుర్భుద్ధితో మందీమార్బలంతోనూ అతి పటాటోపంతోనూ దుర్యోధనుడు పాండ వుల పక్కనే గుడారాలు వేయించాడు. అక్కడ ఓ గంధర్వుడితో గిల్లికజ్జా పెట్టు కొని గొంతుమీదికి తెచ్చుకొన్నాడు. సమయానికి ధర్మరాజు భీమార్జునుల్ని పంపించకపోతే దుర్యోధనుడి పని అంతటితో సమాప్తమైపోయి ఉండేది. ఇలాగ ఎప్పుడూ తాను వేసిన రాయి తిరిగొచ్చి తన నెత్తిమీదనే పడుతున్నా కళ్లు తెరుచుకోవడాన్ని ఇతను ఎరుగడు. కీచకుడు చచ్చిపోయిన తీరు చూసి, మూడు వంతులు పాండవులు విరాట నగరంలో అజ్ఞాతవాసం చేస్తూ ఉండవచ్చు నని అంచనా వేశాడు దుర్యోధనుడు. కానీ ఇదంతా గడువైపోయింతరవాతనే. ఐదైదేళ్లకు రెణ్ణెలలు అధికంగా వస్తూ ఉంటాయి చాంద్రమానంలో. పదమూడేళ్లయ్యేసరికి అటువంటి ఐదు నెలలు గడిచిపోతాయని లెక్కవేసుకోలేదు ఈ ఆత్రగాడు. పసిగట్టి అజ్ఞాతవాసాన్ని భంగం చేసి, తిరిగి పన్నెండేళ్ల పాటు అడవిబసకు పంపిద్దామని వేసిన పథకం మళ్లీ పెద్ద అవమానాన్నే తెచ్చిపెట్టింది. విరాట నగరం దక్షిణాన ఉన్న గోసంపత్తిని పట్టుకోడానికి సుశర్మ మొదలైనవాళ్లను పంపి, కొంత ఎడంగా, ఇటు ఉత్తరాన ఉన్న గోధనాన్ని కొల్లగొట్టడానికి, తాను, భీష్ముడూ ద్రోణుడూ కర్ణుడూ మొదలైన హేమాహేమీలతో బయలుదేరాడు. అంచనా వేసినట్టుగానే విరాటరాజుతో సహా అందరూ దక్షిణానికి యుద్ధం చేయడానికి వెళ్లారు. ఉత్తర గోగ్రహణాన్ని ఆపడానికి బృహన్నలను తీసుకొని, కోటకు కాపుగా ఉండటానికి మిగిలిన ఉత్తరకుమారుడొక్కడే వచ్చాడు. బృహన్నల కాలం లెక్కపెట్టుకొనే వచ్చాడు. ఎదురుగుండా గాండీవాన్ని పట్టి అర్జునుడే వచ్చేసరికి రొట్టె విరిగి నేతిలో పడిందని సంబరపడిపోతూ ‘పాండవుల బండారం బయటపడింది’ అని గెంతు లెయ్యబోయాడు దుర్యోధనుడు. కానీ భీష్ముడు అధిక మాసాల లెక్కచెప్పి గాలి తీసేశాడు. మాద్రికి అన్నగారైన శల్యుడు పాండవుల వైపున పోరాడదామని వస్తూ ఉంటే, అతనికి తెలియకుండా, అతని దారి పొడుగునా సకల సౌకర్యాలనూ అందించి, చివరికి ‘ఎవరబ్బా ఇంత చేస్తున్నాడ’ని విస్తుపోయే సమయంలో ఎదుటపడి దణ్నం పెట్టి, అతనిచేత ‘నీకేం కావాలి?’ అనిపించుకొని, తనవైపు యుద్ధం చేసేలాగ వక్రంగానే వరాన్ని పొందాడు. ఇలాగ అన్నీ కుచ్చితమైన పనులనే చేశాడు దుర్యోధనుడు. ఒక గొప్ప యోద్ధ చేయవలసిన పని ఒక్కటీ చేయలేదు. రాయబారానికి వచ్చిన కృష్ణుణ్ని బంధిద్దామని వెర్రి ప్రయత్నం కూడా చేసిన మూర్ఖుడు ఇతను. అతిబలవంతుడైన వృత్రుడు కూడా. ఇలాగ ‘అయోద్ధ’లాగే ప్రవర్తించాడని ఋగ్వేద సూక్తమొకదానిలో (1-32-6) మనకు అవుపిస్తుంది. అసలు వృత్రుడంటే, మన జ్ఞాన సూర్యుడికి అడ్డుగా వచ్చే అవిద్య అనే మబ్బు. దుర్యోధనుడు ‘కోరిక’కు ప్రతి రూపంగనకనే అతనూ ‘అయోద్ధ’ లాగానే భారతం పొడుగునా ప్రవర్తించాడు. తనది కాని రాజ్యాన్ని కోరుకొన్నవాడు, ఎదుటపడి అమీ తుమీ తేల్చుకొనే యుద్ధం చేసి, విజయమో వీరస్వర్గమో వరించాలి. అతనెప్పుడూ శకునినీ భీష్ముణ్నీ ద్రోణుణ్నీ కృపాచార్యుణ్నీ అశ్వత్థామనీ జయద్రథుణ్నీ కర్ణుణ్నీ అడ్డుపెట్టుకొని వాళ్ల దన్నుతోనే యుద్ధం చేయడానికి చూశాడు. చిట్టచివరికి తన పాలు వచ్చేసరికి నీళ్లల్లోకి వెళ్లి దాక్కున్నాడు. బయటికి వచ్చి ‘గదా’ యుద్ధానికి భీముడితో తలపడ్డప్పుడు, అతను మొదట్నుంచీ చివరిదాకా చేసిన ‘దగా’నే ఎదుర్కోవలసివచ్చింది. దెబ్బతీద్దామని పెకైగిరినప్పుడు, భీముడి గద అతని తొడలను పగలగొట్టింది. ‘గద’ బుద్ధికి ప్రతీక. దుర్యోధనుడి ‘గద’ ఎప్పుడూ ‘దగా’ చేద్దామనే ప్రయత్నించింది. ఇతన్ని ‘సుయోధనుడ’ని కొన్నిసార్లు పిలుస్తూ ఉంటారు. ‘సు’ అంటే ఇటువంటిచోట ‘మంచి’ అని అర్థంగాదు. ‘అతి’ అని అర్థం. ‘సుదారాచారుడ’నే ఒక ప్రయోగం భగవద్గీతలో అవుపిస్తుంది: దాని అర్థం ‘అతిదురాచారుడ’ని. అలాగే, ‘సుయోధనుడ’న్నా అతియుద్ధం చేసేవాడని అర్థం. అంటే, యుద్ధ నియమాలను తుంగలోకి తొక్కి యుద్ధం చేసేవాడని. ఏదోవిధంగా గెలవాలనే యావ తప్ప, ‘కోరిక’ ఎప్పుడూ సజావుగా ప్రవర్తించదు. ఏదోలాగ కబ్జాచేసి, తన పబ్బం గడుపుకుందామని చూస్తుంది. అభిమానం కాదు ఇతని ధనం, మోసమూ దగాను. పెద్దవాళ్లంటే ఏ కోశానా భయమూ లేదు భక్తీ లేదు. పిన్నా పెద్దా గురువూ తాతా అందరూ ‘కోరిక’ మాట వినవలసినవాళ్లే; దాని బలిపీఠమ్మీద చావవలసినవాళ్లే. కోరికను గెలిచినవాడే నిజమైన యోద్ధ. నిజమైన శూరుడు. - డాక్టర్ ముంజులూరి నరసింహారావు -
కుంతీదేవి
ఐదోవేదం: మహాభారత పాత్రలు - 8 శూరుడు శ్రీకృష్ణుడికి తాతగారు. ఆ యాదవ శ్రేష్ఠుడికి శ్రీకృష్ణుడి తండ్రి అయిన వసుదేవుడు పుట్టిన తరువాత, పృథ అనే అందమైన అమ్మాయి పుట్టింది. మిత్రుడూ మేనత్త కొడుకూ అయిన కుంతిభోజుడికి సంతానం లేకపోతే పృథను అతనికి దత్తతిచ్చాడు. చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడే, ఆమె తన పుట్టింటి చల్లని ఒడిని విడిచిపెట్టి, ఏ పిల్లజెల్లల సందడీ లేని కుంతిభోజుడి ఖాళీగృహాన్ని ఆనందంతో నింపింది గనకనే పృథాదేవి మూర్తీభవించిన వైరాగ్యమని చెబుతారు. కుంతిభోజుడామెకు ‘కుంతీదేవి’ అని పేరు పెట్టుకొన్నాడు. పెంపుడు తండ్రిగారింట్లో అతిథులు తరచుగా వస్తూండేవాళ్లు. వాళ్లను సేవించడానికి ఆయన కుంతిని నియోగించేవాడు. ఓసారి కోపానికి మారుపేరైన దూర్వాసుడు అతిథిగా వచ్చాడు. అతను ఉన్నన్నాళ్లూ కుంతి చాలా ఓర్పుగా, అతనికి ఏ రకమైన ఇబ్బందీ లేకుండా, కోపంతో కసిరినా చిరాకుపడకుండా శాయశక్తులా సేవించింది. దానికి సంతోషిస్తూ, ‘నీకు నీ జీవితంలో అవసరం అవుతుంది గనక దివ్యశక్తుల్ని వశంలో తెచ్చుకోగలిగే మంత్రం ఒకటి చెబుతాను. నువ్వు కాదనడానికి వీల్లేదు’ అంటూ దూర్వాసుడు ఆమెకు ఆ ఆభిచారిక మంత్రాన్ని ఉపదేశించాడు. ఈ కారణంగానే వైరాగ్యం ద్వారా దివ్యత్వాన్ని ఆహ్వానించగలిగే శక్తికి కుంతి ప్రతీక అయింది. ‘కుణ’ అనే క్రియకు పిలవడమని అర్థం. మంత్రాన్ని అందుకోగానే కౌమార చపలత్వం కొద్దీ కుంతి అది నిజమా కాదా అని పరీక్షిద్దామనుకొంది. అప్పుడు ఎదురుగా నింగిలో సూర్యుడు వెలుగుతూ పిలవడానికి నేనున్నానన్నట్టుగా అవుపించాడు. అతన్నే ఆ మంత్రంతో పిలిచింది. అంతే, సూర్యుడు ఒక యోగమూర్తిగా రానే వచ్చాడు. కన్నెపిల్ల కంగారుపడిపోయింది. ‘మంత్రాన్ని పరీక్షించడానికి మాత్రమే నిన్ను పిలిచాను. అంతే. నువ్వు వెళ్లిపోవచ్చు’ అని అన్నా, సూర్యుడు ఆమె మాటను కాదంటూ, ‘ఈ మంత్ర మహిమను మనం ఆపలేం. నీకు కొడుకొకడు కలుగుతాడు. అయినా నీ కన్నెతనానికేమీ ముప్పు రాదులే’ అని వరమిచ్చి వెళ్లిపోయాడు. బంగారు కవచ కుండలాల వసువుతో (ధనంతో) ఒక పిల్లాడు పుట్టాడు. కుంతి సమాజానికి భయపడి, ఆ పసికుర్రాణ్ని ఒక పెట్టెలో పెట్టి నదీజలాల్లో విడిచిపెట్టింది. ఆ పెట్టె నీళ్ల ప్రవాహంలో సాగుతూ పోయి రాధ భర్త అయిన అదిరథుడికి దొరికింది. అపరంజి కిరణాల సేనతో పుట్టాడు గనక, అతన్ని వసుషేణుడని పిలుచుకొన్నారు ఆ దంపతులు. తరవాత అతనే కర్ణుడయ్యాడు. బుద్ధికి ప్రతీక అయిన పాండురాజుతో ఇంకా సంబంధం కుదరని కాలంలో ఈ కర్ణుడు పుట్టాడు గనక, అతను భౌతికమైన ఇంద్రియాల మొగ్గుదలల ప్రభావంలో ఉంటూ అధర్మానికి మరో పేరైన దుర్యోధనుడివైపే జేరాడు. ఆ మీద కుంతిభోజుడు కుంతికి స్వయంవరం చాటించాడు. వచ్చిన రాజుల్లో పాండురాజును ఆవిడ వరించింది. శల్యుడి చెల్లెలు మాద్రి ఆవిడకు సవతి అయింది. భర్తతో వన విహారంలో కాలాన్ని సరదాగా గడుపుతూండగా, ఒకరోజున మృగరూపంలో ఉన్న ముని దంపతుల్ని చంపిన దోషానికి పాండురాజు స్త్రీ సుఖానికి దూరంగా ఉండవలసి వచ్చింది. సంతానం లేకపోవడం వల్ల స్వర్గద్వారాలు తెరిచి ఉండవని తెలుసుకున్న పాండురాజు మహర్షుల ప్రబోధం మేరకు తాను ఎలాగైతే తన నాన్నగారి క్షేత్రమైన అంబాలికకు వ్యాసమహర్షి వల్ల పుట్టడం జరిగిందో... అలాగే తానూ ప్రయత్నం చేయాలనుకొన్నాడు. కుంతితో ఆ విషయాన్నే ప్రస్తావించాడు. ఆవిడ తనకు దివ్యశక్తుల్ని పిలిచి యమధర్మరాజు ద్వారా యుధిష్ఠిరుణ్ని, వాయువు ద్వారా భీముణ్ని, ఇంద్రుడి ద్వారా అర్జునుణ్ని కని కుంతి, పాండురాజును సంతానవంతుడిగా చేసింది. అంతేకాదు, భర్త కోరిన మీదట మాద్రికి కూడా ఆ మంత్రాన్ని చెప్పి నకుల సహదేవులను కలిగేలాగ చేసింది. మాద్రితో సహా వనంలోకి వెళ్లిన పాండురాజు కామాంధుడై చావును కొని తెచ్చుకోవడంతోనూ మాద్రి అతనితో సహగమనం చేయడంతోనూ కుంతి ఐదుగురు పిల్లల్నీ వెంటబెట్టుకొని రుషుల సాయంతో హస్తినాపురానికి చేరుకొంది. అప్పటినుంచి కుంతికి ఇక కష్టాలే కష్టాలు. ధృతరాష్ట్రుడికి గుడ్డితనం వల్ల రాజ్యం రాకపోయినా పాండురాజు చనిపోవడంతో అతని చేతిలోనే రాజ్యం ఉండిపోయింది. అతని కొడుకుల్లో పెద్దవాడైన దుర్యోధనుడు మహా అసూయాపరుడు. భీముడి పొడ అసలు గిట్టేది కాదు. అతను తననూ తన తమ్ముళ్లనూ కుస్తీపట్లలోనూ ఇతరమైన ఆటల్లోనూ ఓడిస్తున్నాడని ఒకటే గుర్రు. భీముడికి వాళ్లు విషం పెట్టారు; గాఢనిద్రలో ఉన్నప్పుడు అతన్ని గంగలోకి విసిరేశారు. అయితే, భీముడి ప్రాణం చాలా గట్టిది. అతను వాటినన్నిటినీ దాటేశాడు. యుధిష్ఠిరుడు పెద్దాడు గనక ధృతరాష్ట్రుడు అతన్ని యువరాజుగా చేయడమైతే చేశాడు గానీ దుర్యోధనుడి పోరు మాత్రం ఇంతింతగాదు. కొడుకు మాటను నెగ్గించడానికి కుంతితోసహా పాండవుల్ని వారణావతానికి పంపించి, లక్క ఇంట్లో సజీవ దహనం చేద్దామన్న కుటిల ప్రయత్నం చేశాడు ధృతరాష్ట్రుడు. విదురుడి ఆలోచనల వల్ల ఆ కష్టం నుంచి బయటపడి, ఐదుగురు పిల్లల్నీ పెట్టుకొని అజ్ఞాతంగా కొన్నాళ్లు బతకవలసివచ్చింది కుంతి. ఏకచక్రపురంలో తమకు నివాసాన్ని కల్పించిన బ్రాహ్మణుడికి వచ్చిన కష్టాన్ని తీర్చడానికి భీముణ్నే బకాసురుడి దగ్గరికి పంపడానికి ముందుకొచ్చింది ఆవిడ. దీనికి కారణాలు రెండు అవుపిస్తాయి: తన కొడుకు బలం మీద ఆవిడకున్న నమ్మకం మొదటిది; తామెంత కష్టాల్లో ఉన్నాసరే, ఇతరుల కష్టాన్ని తీర్చడానికి తమను తాము సమర్పించుకోవాలన్న సేవాభావాన్ని పిల్లలకు నేర్పడం రెండోది. లేకపోతే, ఏ తల్లైనా తను కన్న పిల్లవాణ్ని వధ్యశిలకు పంపించడం జరుగుతుందా? అక్కణ్నించి దక్షిణ పాంచాల దేశానికి బ్రాహ్మణులతో సహా వెళ్లి, ఒక కుమ్మరివాని ఇంట్లో బస చేశారు. స్వయంవర మంటపానికి వెళ్లి, మత్స్యయంత్రాన్ని ఛేదించి, బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడు ద్రౌపదిని గెలుచుకొన్నాడు. కోలాహలం అవుతూంటే, ధర్మరాజు నకుల సహదేవులిద్దరితోనూ బసకు వచ్చేశాడు. అక్కడ రాజులందరూ భీమార్జునులను బ్రాహ్మణులనే తలపుతోనే అడ్డుకొన్నారు. భీమార్జునులు వాళ్లందర్నీ ఓడించి ద్రౌపదితో సహా బసకు వచ్చి, ‘భిక్షను తెచ్చామమ్మా!’ అని సరదాగానే అన్నారు. లోపలి గదిలో ఉన్న కుంతి వాళ్లను చూడకుండానే, రోజూ సాధారణంగా బిచ్చం తెచ్చుకొన్నప్పుడేమంటుందో అదే తరహాలో ‘మీ అందరూ కలసి దాన్ని పంచుకోండి’ అని యథాలాపంగా అంది. ఇంతలో ఇవతలకు వచ్చి ద్రౌపదిని చూసి నాలిక్కరుచుకొంది. ‘ఛ ఛ ఎంత అనుచితమైన మాటనన్నాను’ అని చాలా నొచ్చుకొంది. చాలామందికి ఒకత్తె భార్యగా ఉండటం అధర్మమనిపిస్తుంది. అయితే, గురువు చెప్పిన మాటనే ధర్మమని అంటారు. తల్లేమో గురువుల్లో కల్లా గురువు. అంచేత, ఆవిడన్నమాటనే ధర్మంగా తీసుకోవాలని యుధిష్ఠిరుడు నిర్ణయించాడు. ద్రౌపది క్రితం జన్మలో పెళ్లికాక, శివుణ్ని గురించి తపస్సు చేసి అతను ప్రత్యక్షమైనప్పుడు ‘నాకు పతి చేకూరేలాగ చెయ్యి’ అని ఐదుసార్లు అంది అని చెబుతూ, వ్యాసుడు కూడా దాన్నే సమర్థించాడు. అలాగ కుంతి వాక్శుద్ధి కొద్దీ పాండవులైదుగురికీ ద్రౌపది భార్య అయింది. దుర్యోధనుడి తరఫున శకుని ఆడిన మోసపు జూదంలో ఓడిపోయి, పన్నెండేళ్ల వనవాసమూ ఒక ఏడాది అజ్ఞాతవాసమూ చేయడానికి పాండవులు వెళ్లినప్పుడు, కుంతి ధృతరాష్ట్రుడి పంచనే ఉండి కష్టపడింది. ద్రౌపది పాండవులతో కలసి వనవాస కష్టాలూ అజ్ఞాతవాస కష్టాలూ పడి బయటపడ్డ తరవాత, తమ రాజ్యాన్ని తిరిగి ఇమ్మంటే, దుర్యోధనుడు ససేమిరా అన్నాడు. ఇక పోరు తప్పనిసరి అయింది. అప్పుడు తన మొట్టమొదటి కొడుకు కర్ణుడు అటువైపు ఉండటం కుంతికి మింగుడుపడలేదు. ఏకాంతంగా అతన్ని కలసి జరిగిన సంగతి చెప్పింది: ‘నువ్వు సూతకులంలో పుట్టినవాడివి కావు, నా కొడుకువి. క్షత్రియకులంలో పుట్టినవాడివి. నువ్వు పాండవులవైపుకు వచ్చి, యుధిష్ఠిరుడికి అన్నగారివై రాజ్యాన్ని పాలించు. కర్ణార్జునులకు బలరామకృష్ణులకుమల్లే అసాధ్యమేమీ ఉండదు’ అని. కుంతి మాటను సూర్యుడు బలపరుస్తున్నట్లుగా బిట్టుగా ప్రకాశించాడు. అయినా సరే, కర్ణుడు దానికి ఒప్పుకోలేదు. ‘నన్ను అన్నివిధాలా సత్కరిస్తూన్న దుర్యోధనుణ్ని వదిలిపెట్టలేను. అందులోనూ యుద్ధకాలంలో ఆ పని నేను చేయను. అతనికోసం నీ కొడుకులతో యుద్ధం చేస్తాను. అయితే, ఒక్క అర్జునుణ్ని తప్ప, మిగతా నలుగుర్నీ నేను చంపను’ అని కర్ణుడన్న మాటను విని నిరాశగా కుంతి వెనుదిరిగి వచ్చింది. కానీ ఆ పెద్దకొడుకు గురించి ఆమె చివరిదాకా లోలోపల కుమిలిపోతూనే ఉంది. ఇలాగ కుంతి జీవితం పొడుగునా కష్టాలు అనుభవిస్తూనే ఉంది. కానీ ఆవిడ వైరాగ్యానికి మరోపేరు గనక వాటన్నింటినీ చాలా ఓర్పుగా శ్రీకృష్ణుడి మీద భక్తితో సహిస్తూ వచ్చింది. ఆవిడ భక్తి చాలా గొప్పది. ఆమెకు శ్రీకృష్ణుడు మేనల్లుడే; కలసినప్పుడల్లా అతను ఆవిడ పాదాలకు మొక్కేవాడు. అయినా ఆవిడ అతన్ని దేవుడిగా ఎరిగి శరణాగతిని పొందింది. పాండురాజు పోయిన దగ్గర్నుంచీ ఆవిడకు అన్నీ కష్టాలే. అన్ని ఆపదల్లోనూ శ్రీకృష్ణుడు కాపాడుతూనే వచ్చాడు. అతని మహాదయను తలచుకొంటూ కుంతి చేసిన ప్రార్థన మన అందరికీ కనువిప్పు కావాలి: ‘విపదస్సన్తునః శశ్వత్తత్ర తత్ర జగద్గురో! భవతో దర్శనం యత్ స్యాదపునర్భవదర్శనమ్!!’ (భాగవతం 1-8-25): ‘ప్రభూ! మా జీవితంలో ఎప్పుడూ విపత్తులే వస్తూ ఉండనీ! ఎందుకంటే, విపత్తుల్లోనే కచ్చితంగా నీ గుర్తు వచ్చింది, నీ రూపం ఆ కన్నీళ్లలో ప్రతిబింబించి అవుపిస్తుంది. లోపల నీ దర్శనమైతే ఇంకేముంది? చావు పుట్టుకల చక్రం నుంచి బయటపడిపోవడం ఖాయమవుతుంది. యోగేశ్వరుడా! యాదవుల మీదా పాండవుల మీదా నాకున్న అతి మక్కువ అనే పాశాన్ని తెగ్గోసి, నిన్నే నేనెప్పుడూ తలచుకొంటూ ఉండేలాగ దీవించు!’ అనే ఆవిడ మాటలు మనమెప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి. -డాక్టర్ ముంజులూరి నరసింహారావు