duryodhana
-
ఆపరేషన్ దుర్యోధన సినిమా గురించి హీరో శ్రీకాంత్..!
-
దూరం చేసే అహంకారం
అహంకారం... అయిన వాళ్ళనే కాదు, కానివాళ్లనూ దూరం చేస్తుంది. అందరితో వ్యతిరేకతను పెంచి, సమాజానికి దూరంగా బతికేలా చేస్తుంది. అహంకారం ఉన్న వ్యక్తులను ఏ సమాజమూ గుర్తించదు. ఏ మనిషీ గౌరవించడు. సరికదా, అవసరమయినపుడు ఆదుకునేవారు లేక అలాంటి వ్యక్తులు నానా ఇబ్బందులూ పడతారు. నిత్య జీవితంలో చాలామంది తమ గురించి, తమ ఆలోచనల గురించి గొప్పగా ఊహించుకుంటూ, తాము అందరికంటే ఉన్నతులమని, తమకంటే గొప్ప వారు మరొకరు లేరని భ్రమిస్తూంటారు. చేస్తున్న ప్రతిపనిలోనూ తమ గొప్పతనాన్ని చాటుకుంటూ, తాము ఇతరులకు భిన్నమని, ఇతరులకంటే తాము చాలా ఎక్కువమని భావిస్తూ వాస్తవానికి దూరంగా జీవిస్తారు. వారిలో ఏ విశేషమూ లేకపోయినా, ఎంతో విఖ్యాతులమని విర్రవీగుతారు. తమలోని వాపును కూడా మహాబలమని భ్రమిస్తారు. అణకువతో ఓ మెట్టు దిగుదామన్న విషయాన్ని అటుంచి దానిని అవమానంగా భావిస్తారు. ఇలా అంతర్యామికీ, అంతరాత్మకూ మధ్య ఉన్న ఆ అదృశ్య, అతి ప్రమాదకర అంతఃశత్రువే అహంకారం. దానినే మనం గర్వమని కూడా పిలుస్తుంటాం. వినమ్రతకు అహంకారం బద్ధ వ్యతిరేకం. గర్విష్టికి భగవంతుడు ఆమడదూరంలో ఉంటాడు. ముందు ‘నేను’ అనే మాయ నుంచి బయట పడితే, ఆ తరువాత తన దరికి చేర్చుకుంటానంటాడు. నిజానికి ఆధ్యాత్మిక సాధనల లక్ష్యం ఆత్మను పొందడం కాదు. అహంకారాన్ని పోగొట్టుకోవడమే. మనం తినే తిండిలో కారం ఎక్కువైతే శరీరంలోని రక్తం మలినమవుతుంది. అదే అహంకారం పాలు ఎక్కువైతే మానవత్వమే మంటకలసి పోతుంది. ఎవరిలో అహంకారం ప్రవేశిస్తుందో అలాంటి వారు అధోగతి పాలవుతారు. చెదపురుగు పట్టిన వస్తువు ఏ విధంగా పనికి రాకుండా పోతుందో, అదేవిధంగా అహంకారం అనే చెదపురుగు పడితే మానవవత్వం మృగ్యమైపోతుంది. మనిషికి బుర్ర నిండా వెర్రి ఆలోచనలు కలిగిస్తుంది. మానవత్వం నుంచి రాక్షసత్వంలోకి మనిషిని నెట్టేస్తుంది. గర్వం లేదా అహంకారం ఎవరిలో ప్రవేశిస్తుందో వారి గతి అధోగతే. మనిషిలో గర్వం, అహంకారం కొంచెం ఉన్నా అవి మనిషిని నిలువునా ముంచేస్తాయి. గర్వంతో కూడిన విజయం ఎల్లప్పుడూ శాశ్వతం కాదు. అలాంటి విజయం వలన తాత్కాలిక ఆనందం పొందినప్పటికీ, సమస్యలు వచ్చినప్పుడు మనకు తోడుగా ఎవరూ ఉండరని గుర్తుంచుకోవాలి. నాది, నేను అనే భావనలు మనిషిలో గర్వాన్ని, అహంకారాన్ని పెంచుతాయి. ఈ రెండు భావనలను మనసు నుంచి తుడిచేస్తే జీవితంలో ఎలాంటి విజయాన్నైనా సొంతం చేసుకోవచ్చు. దుర్యోధనుడి విపరీతమయిన అహంకారం వల్లే మహా భారత సంగ్రామం జరిగింది. గర్వితుడయిన దుర్యోధనుడి అహంకారం వల్ల పాండవులకు ధర్మంగా రావల్సిన రాజ్యం కూడా రాకుండా పోయింది. అంతేకాదు ద్రౌపది వస్త్రాపహరణానికి, కౌరవ సేనల అకృత్యాలకు, జూదంలో ధర్మరాజును మాయతో గెలిచిన తీరుకు... ఇలా అన్నింటికీ దుర్యోధరుని అహంకారమే కారణమయ్యింది. ఆ అహంకారం వల్లే సాక్షాత్తు శ్రీ కృష్ట భగవానుడు యుద్ధం వద్దని వారించడానికి వచ్చినా దుర్యోధనుడు వినలేదు.. కయ్యానికి కాలు దువ్వి , తాను నాశనమవడమే కాకుండా ఏకంగా కురు వంశం నాశనమవ్వడానికి కారణమయ్యాడు. ఇలా దుర్యోధనుడే కాదు మన పురాణాలలో అనేక మంది పురాణ పురుషులు అహంకారంతో తమ నాశనాన్ని తామే కోరి తెచ్చుకున్నారు. గర్వమనేది మనిషిని పూర్తిగా నిర్వీర్యుడ్ని చేసి, పతనానికి పునాది వేస్తుంది. కనుక ఎవరైనా ఒకరిపై గెలిచామనే గర్వంతో ఆనందిస్తున్నారంటే వారిలో మానసిక వైకల్యం ఉన్నట్టుగానే భావించాలి. గర్వం నాశనానికి తొలి మెట్టు. మనిషిలో గర్వం అనే అగ్నిని రాజేస్తే, ఆ తర్వాత అది దుఃఖానికి కారణమవుతుంది. మనషి బతికి ఉన్నప్పుడే నేను, నాది అనే భావనలు కలుగుతాయి. మరణించాక శ్మశానంలో రాజైనా,సేవకుడైనా,ధనికుడైనా, పేదవాడైనా ఒక్కటే. అందువల్ల ఈ భూమి మీద బతికున్నంత కాలం ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా జీవించడానికి కృషి చేయాలి. గర్వాన్ని ఎలాంటి పరిస్థితుల్లో దరి చేరనివ్వకుండా సచ్ఛీలతతో తమకున్నదానిలో ఇతరులకు సహాయం చేసేవాడే నిజమైన విజేత అవుతాడన్న వాస్తవాన్ని గుర్తెరగాలి. విధేయత, అణకువ లాంటి లక్షణాలు మనుషులను విజయతీరాలకు తీసుకువెళతాయి. అందువలన జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరినప్పటికీ గర్వం, తలకెక్కించు కోకుంటే అసలైన విజయం సొంతం అవుతుంది. గర్వం లేనివారు ఏ పని మొదలుపెట్టినా ఆ పనిలో తప్పక విజయం సాధిస్తారు. గర్వం లేనప్పుడు దురభిప్రాయం ఉండదు. ఎందుకంటే గర్వం, దురభిప్రాయం రెండూ వేరు వేరు కాదు. మనిషికి ఒకదాని పట్ల గర్వభావన ఉంటే వేరొక దాని పట్ల దురభిప్రాయం, అంటే చిన్న చూపు ఉన్నట్లే. కనుక గర్వం ఒక విధమైన దురభిప్రాయంలో నాటుకుపోయి ఉంటుంది. అహంకారం అనేది ఎక్కడో ఉండదు. అజ్ఞాతంగా మనలోనే ఉంటుంది. ఇది అనేక అనర్థాలకు మూలకారణమవుతుంది. ఉన్న పళంగా ఆకాశానికి ఎత్తేసి, ఆ ఆకాశం నుంచి ఒక్క ఉదుటన పాతాళంలోకి తోసేస్తుంది. అహంకారం ఉన్న వ్యక్తులెవరైనా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటారు. – దాసరి దుర్గా ప్రసాద్ -
కర్ణుడు స్వతహాగా మంచివాడే...కానీ...!!!
మహాభారతంలో కర్ణుడి వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే.... ఆయన పుట్టుకతో చెడ్డవాడు కాడు. కుంతీదేవికి, సూర్యభగవానుడికి జన్మించిన వాడు. నిజానికి పాండవులు యుద్ధంలో గెలుస్తారని ముందే తెలిసున్నవాడు. కురుసభలో రాయబారం ముగించుకుని శ్రీ కృష్ణ పరమాత్మ తిరిగి వెడుతూ కర్ణుడిని రథం ఎక్కించుకుని మాట్లాడుతూ వెళ్ళాడు. అప్పుడు కర్ణుడు –‘‘ధర్మరాజు నిజంగా ధర్మం ఎరిగినవాడు. దాన్ని పాటించేవాడు. ధర్మం అంతా పాండవులవైపే ఉంది. అందుకే సాక్షాత్ భగవంతుడవయిన నువ్వు ఆ పక్షాన ఉన్నావు. వారు గెలిచి తీరుతారు. ధర్మరాజు పట్టాభిషిక్తుడవుతాడు. దుర్యోధనాదులందరూ కూడా యుద్ధభూమిలో మడిసిపోతారు. ఎవరూ మిగలరు. కానీ దుర్యోధనుడిని నమ్మి ఇంతకాలం ఉండి అతడిని విడిచిపెట్టి రాలేను. నాకు కూడా మరణమే శరణ్యం. నేను కూడా అక్కడ మరణించాల్సిందే’’ అన్నాడు. అంటే – పాండవుల పక్షాన ధర్మం ఉందనీ, వారు గెలుస్తారని, వారి చేతిలో కౌరవులు మరణిస్తారని, తాను కూడా అక్కడే చనిపోతానని కర్ణుడికి ముందే తెలుసు. ఇన్ని తెలిసిన యోధానుయోధుడయిన కర్ణుడు జీవితాంతం తప్పులు చేస్తూ, ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చింది !!! దుర్యోధనుడు పరమ క్రూరుడు. దుర్మార్గుడు. బద్దెనగారే మరొక పద్యంలో ‘‘తలనుండు విషము ఫణికిని, వెలయంగా తోకనుండు వశ్చికమునకున్ తలతోక యనకనుండును ఖలునకు నిలువెల్ల విషము..’’ అంటారు... ఖలుడు అంటే దుర్మార్గుడు. అటువంటి వాడికి మంచి ఆలోచనలు ఎలా వస్తాయి? అదే ధర్మరాజు పక్కన ఉంటే ...మంచి పనులు చేస్తూ ఉంటాడు.. అప్పడు ఆయన పక్కన ఉన్నవారికి కూడా అటువంటి మంచి పనులు చేయడానికి లేదా కలిసి పాలు పంచుకొనే అవకాశం దొరుకుతుంది. అలా చేస్తే ధర్మరాజు కూడా సంతోషిస్తూ ఉంటాడు. దుర్యోధనుడితో కలిసి ఉన్నందుకు అతని మెప్పుకోసం కర్ణుడు చేయకూడని పనులన్నీ చేస్తూ వెళ్ళాడు. చిట్టచివరకు ఏమయ్యాడు ...యుద్ధభూమిలో అర్జునుడి చేతిలో మరణాన్ని పొందాడు. అలాగే మనిషి ఎంత మంచివాడయినా, ఎంత చదువు చదువుకొన్నవాడయినా, ఎన్ని ఉత్తమ గుణాలు కలిగిఉన్నా... ఒక దుర్మార్గుడితో స్నేహం చేస్తే మాత్రం ఉన్న పేరుప్రతిష్ఠలు కూడా నశించిపోతాయి. సన్మార్గంలో ఉన్న వ్యక్తి దుర్మార్గులతో చేరితే... నల్లులు పట్టిన మంచం ఎలా దెబ్బలు తింటుందో అలాగే ఉంటుందని సుమతీ శతకకారుడు బద్దెనచెబుతూ ‘‘కొంచెపు నరు సంగతిచే /నంచితముగ గీడు వచ్చు నది యెట్లన్నన్ /గించిత్తు నల్లి కుట్టిన/ మంచమునకు జేటు వచ్చు మహిలో సుమతీ’’ అంటున్నారు. శవం మీద ఉన్న పూలదండనే కాదు, కింద జారిపడినా దాన్ని ఎవరూ తీసుకుని వాడుకోరు సరికదా... అసలు వేలితో ముట్టుకోరు. కర్రతో పక్కకు నెట్టేస్తారు. అదే దేవుడి మెడలో పడిన పూలదండ... మరుసటి రోజువరకు ఉన్నా, వాడిపోయినా.. కళ్ళకద్దుకుని తీసుకుని తలమీద పెట్టుకుంటారు, కొప్పుల్లో తురుముకుంటారు. పూలదండ తనంత తానుగా చేసిన మంచీ లేదు, చెడూ లేదు. శవంతో చేరితే గౌరవాన్ని పోగొట్టుకుంది, భగవంతుడి మెడను అలంకరిస్తే పవిత్ర ప్రసాదమయింది. ఎవరితో కలిసున్నామన్న దాన్నిబట్టి గౌరవమయినా, ఛీత్కారమయినా ఉంటుంది. ఇనుప ఊచ ఎంత గట్టిగా ఉంటుంది!!! అగ్నితో చేరితే మెత్తబడి ఇంటికి కిటీకీ ఊచవుతుంది, నీటితో చేరితే తుప్పుపట్టి నేలరాలిపోతుంది. అందుకే ఎప్పుడూ కూడా దుర్మార్గులతో స్నేహం చేయకూడదు. అలా చేస్తే మనం పాడయిపోవడమే కాదు, మనచుట్టూ ఉన్నవారిని కూడా భ్రష్టుపట్టించే ప్రమాదం ఉంటుందని తెలుసుకుని జీవితంలో ప్రతి క్షణం ఆచితూచి అడుగేస్తుండాలి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ఈ కడుపుకోత ఇంకో తల్లికెందుకు!
కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. శిబిరాలు వేసి ఉన్నారు. ఉప పాండవులు యుద్ధభూమికి వెళ్ళలేదు. చిన్న పిల్లలు. గాఢనిద్రలో ఉన్నారు. అశ్వత్థామకు ఉన్మాదం కలిగింది. తొడలు విరిగిపోయి పడి ఉన్న దుర్యోధనుడి దగ్గరకు వెళ్ళి ‘నీ పగను నేను చల్లారుస్తా’ అన్నాడు. పాండవులమీదికి యుద్ధానికి వెళ్లడం ఎలా! రాత్రివేళ ఆలోచిస్తూ కూర్చున్నాడు. అకస్మాత్తుగా ఎక్కడినుంచో ఒక గుడ్లగూబ వచ్చి చెట్టుమీద ఉన్న ఒక పక్షి గూట్లో పెట్టిన పిల్లలను తన వాడి ముక్కుతో చీల్చి చెండాడేసింది. అది చూసిన అశ్వత్థామ పిచ్చెక్కిన వాడిలా అయిపోయాడు. శిబిరం మీద పడిపోయి నిద్రపోతున్న ధృష్టద్యుమ్నుడి కంఠాన్ని తుంచేసాడు. ఏనుగుల కుంభస్థలాలు బేధించాడు. గుర్రాల్ని చంపేసాడు. ఐదుగురు ఉపపాండవుల కుత్తుకలు కత్తిరించేసాడు. ఇన్నీ చేసాక అర్జునుడు గుర్తొచ్చాడు. ఐదుగురి కొడుకులను చంపానని తెలిస్తే నన్ను బతకనీయడనుకుని పారిపోయాడు. మరునాడు ద్రౌపదీ దేవి ఏడుస్తున్నది. పాండవులు తిరిగొచ్చారు. అంతకన్నా కష్టం లోకంలో మరొకటి ఉంటుందా ఏ స్త్రీకయినా! ముందు ఐదుగురి శవాలు పెట్టుకుని గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నది.. ‘నీ కొడుకులను తెగటార్చిన వాడిని పట్టి తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పారేస్తా, నీ ఇష్టమొచ్చినట్లు శిక్షించు’ అన్నాడు అర్జునుడు. అన్నట్లే అశ్వత్థామను పశువును కట్టినట్లు కట్టి తీసుకొచ్చి ద్రౌపది ముందు పడేసాడు. వీడే నీ పుత్రులను చంపినవాడు, నీ కాలుతో వీడి తల తన్ను– అన్నాడు. ద్రౌపదీదేవి అశ్వత్థామ దగ్గరకు వెళ్లి–అయ్యా! నా కొడుకులు యుద్ధభూమికి రాలేదు.కవచం కట్టుకోలేదు. ఏ అస్త్ర ప్రయోగం చేయలేదు. అటువంటి పిల్లలు నిద్రపోతున్న వేళ రాత్రికి రాత్రి కబళించేసావా? నీకు చేతులెలా ఆడాయి?’ అంది. ఐదుగురు భర్తలు నిలబడి ఉన్నారు. ఆవేశంతో ఊగిపోతున్నారు. ఊ.. అంటే చాలు భీమసేనుడు అశ్వత్థామ తలను వేయి వక్కలు చేసేస్తాడు. కానీ ఆ క్లిష్ట సమయంలో ఆవిడ ఏమన్నదో తెలుసా...‘కొడుకులు చచ్చిపోయి నేను ఏడుస్తున్నా. ద్రోణాచార్యుల వారితో కలిసి సహగమనం చేయకుండా ద్రోణుడి భార్య ఉన్న ఒక్క కొడుకు కోసమని ఇంటిదగ్గరుంది. ఆమె కొడుకు చచ్చిపోలేదు. నా ఐదుగురు బిడ్డల్ని చంపేసాడనే కోపంతో పాండవులు అశ్వత్థామను ఎక్కడ చిత్రవధ చేసేస్తారన్న భయంతో ఎంత ఏడుస్తోందో! గురుపత్ని ఏడుపు మన వృద్ధికి ప్రతిబంధకం కాకూడదు. వీడిని మనం చంపకూడదు. వీడు చేసిన తప్పు వీడినే కాల్చేస్తుంది. నేను పడుతున్న బాధ నాకు తెలుసు. వేరొక తల్లి ఎందుకు పడాలి. వదిలిపెట్టేయండి’’ అన్నది. అంత గొప్పగా మాట్లాడడం, ధర్మానికి కట్టుబడడం తెలిసిన మహాతల్లులు పుట్టిన జాతి ప్రపంచంలో ఎక్కడయినా ఉంటే–అది సనాతన ధర్మంలో మాత్రమే. -
ఆ రాక్షసులను తరిమి కొట్టాలి
ఎప్పుడూ పాండవుల పక్షమే వహించి మాట్లాడే భీష్మ ద్రోణాదులకు కౌరవులు చేసేదంతా తప్పే అని స్పష్టంగా తెలుసు. కానీ దుర్యోధనుడి పక్షాన్నే వహించేవారు. అయితే భీష్మద్రోణాదుల ఈ ప్రవర్తనకు కారణం వారిలో చేరుకున్న అసురులు అనే విషయాన్ని మాత్రం ఎప్పటికీ మరువకూడదు. భీష్మాదుల లోపలికి చేరుకున్న దైత్యులు కురుక్షేత్రయుద్ధం వంటి ముఖ్యమైన సంఘటనలప్పుడు దుర్యోధనుడి పక్షాన్నే ఉండి మాట్లాడేటట్లు చేశారు. భీష్మాచార్యుడంతటి మహాజ్ఞాని సైతం దైత్యశక్తి పూనినప్పుడు దానికి లోబడి తన ధర్మనిష్టను, న్యాయమార్గాన్నీ పోగొట్టుకున్నాడు. మనిషిని చంపకుండా హింసించే పెద్ద శత్రువు దుర్బుద్ధి. మనిషి తన దుర్బుద్ధితో తన జీవితాన్నే పూర్తిగా పోగొట్టుకుంటాడు. ఇది అధర్మం అని తెలిసినా మనస్సు దానినే చేయమని ప్రేరేపిస్తుంది. మన మనస్సులో చెడు ఆలోచనలు వచ్చిన వెంటనే ‘ఇది నా సహజమైన గుణం కాదు. ఏదో దుష్టశక్తి ప్రభావంతో నేనిలా చేస్తున్నాను’ అని తెలుసుకొని, మనలో ఉన్న దురాలోచన అనే రాక్షసుణ్ణి బయటికి పంపాలి. అప్పుడు మనం మనంగానే ఉంటాం. -
దేవుడే దోస్త్
పురాణాలలో స్నేహం గురించి, ఆదర్శ స్నేహితుల గురించి అనేక గాథలు ఉన్నాయి. కృష్ణుడు–కుచేలుడు, కర్ణుడు–దుర్యోధనుడు, రాముడు–సుగ్రీవుడు కథలు దాదాపుగా అందరికీ తెలిసినవే. పురాణాల్లో కొన్ని అరుదైన స్నేహ గాథలు కూడా ఉన్నాయి. అవి మాత్రమే కాదు, భగవంతుడినే తమ స్నేహితుడిగా తలచిన పరమ భాగవతోత్తముల పలు గాథలు పురాణాల్లోను, చరిత్రలోనూ ప్రసిద్ధి పొందాయి. లౌకికంగా కుదిరే స్నేహాలలో స్వార్థం, పరస్పర ప్రయోజనాలు ఉంటాయి. భగవంతుడితో కుదిరే స్నేహంలో అలాంటివేవీ ఉండవు. ఏమీ ఆశించని స్నేహం అది. ‘భగవంతుడే నా చెలికాడు’ అన్నాడు రామకృష్ణ పరమహంస. ఇలా భగవంతుడినే చెలికాడుగా తలచిన భాగవతోత్తములు భగవంతుడిని ఊరకే స్తోత్రాలతో ముంచెత్తడంతోనో, భగవంతుడిని గుడ్డిగా ఆరాధించడంతోనో సరిపెట్టుకోరు. బాల్యమిత్రులతో కలసి ఆటలాడినట్లుగానే భగవంతుడితో ఆటలాడతారు. ఆటల్లో అలిగినప్పుడు చెలికాళ్లతో తగవు పడ్డట్టే భగవంతుడితోనూ తగవుపడతారు. కోపం వచ్చినప్పుడు భగవంతుడిని తిట్టిపోయడానికి సైతం ఏమాత్రం మొహమాటపడరు. భగవంతుడినే చెలికాడిగా తలచే భక్తి భావాన్ని ‘సఖ్య భక్తి’ అంటారు. ‘సఖ్య భక్తి’ మార్గానికి ప్రాచుర్యం కల్పించిన గురువుల్లో చైతన్య మహాప్రభువు అగ్రగణ్యుడు. నవవిధ భక్తిమార్గాల్లో ఆత్మనివేదనం ఉత్తమోత్తమమైనదైతే, సఖ్యభక్తిని ఉత్తమమైన భక్తిమార్గంగా పరిగణిస్తారు ఆధ్యాత్మికవేత్తలు. ‘సఖ్యభక్తి’ మార్గంలో సాక్షాత్తు భగవంతునితోనే నెయ్యం నెరపిన కొందరు భాగవతోత్తముల గాథలు కొన్ని... శ్రీనివాసుడితో హాథీరామ్ బాబా పాచికలాట భగవంతుడు భక్తులను పరీక్షించడానికి వారి జీవితాలతో ఆటలాడతాడని విరక్తి చెందిన కొందరు భక్తులు ఆడిపోసుకుంటారు గాని, సాక్షాత్తు భగవంతుడితోనే పాచికలాడిన భక్తుడు హాథీరామ్ బావాజీ. సఖ్యభక్తికి నిలువెత్తు నిదర్శనం ఆయన. ఉత్తరాదికి చెందిన హాథీరామ్ బావాజీ బాల్యం నుంచి రామ భక్తుడు. దేశాటనం చేస్తూ తిరుమల వచ్చాడు. తన చెలికాడైన రాముడే ఇక్కడ వేంకటేశ్వరుడిగా వెలసినట్లు తలచి, తిరుమలలోనే ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని స్థిరపడ్డాడు. ప్రతిరోజూ దేవదేవుడైన శ్రీనివాసుడిని దర్శించుకునేవాడు. కష్టసుఖాల ముచ్చట్లు చెప్పుకొనేవాడు. పరాచికాలాడేవాడు. హాథీరామ్ బావాజీ భక్తికి ముగ్ధుడైన శ్రీనివాసుడు రోజూ రాత్రివేళ ఆలయం విడిచి అతడి ఆశ్రమానికి వచ్చేవాడు. అక్కడే కూర్చుని అతడితో కలసి పాచికలాడేవాడు. ఒకసారి పాచికలాట దాదాపు తెల్లవారు జాము వరకు కొనసాగింది. భక్తులు తనను దర్శించుకునే వేళ కావడంతో హడావుడిగా ఆటను ఆపేసిన శ్రీనివాసుడు ఆలయానికి చేరుకున్నాడు. వేళకు ఆలయానికి చేరుకోవాలనే ఆతృతలో శ్రీనివాసుడు తన కంఠహారాన్ని బావాజీ ఆశ్రమంలో మరచిపోయాడు. ఆలయం తలుపులు తెరిచి చూసిన పూజారులు శ్రీనివాసుడి మెడలో కంఠహారం లేకపోవడాన్ని గుర్తించారు. హారం తస్కరణకు గురైందంటూ రాజుకు ఫిర్యాదు చేశారు. మాయమైన హారాన్ని వెదికి తేవాలంటూ భటులను ఆదేశించాడు రాజు. శ్రీనివాసుడు తన ఆశ్రమంలో మరచిన హారాన్ని కాస్త ఆలస్యంగా గుర్తించిన బావాజీ, దానిని తిరిగి అప్పగించాలనుకున్నాడు. హారం తీసుకుని ఆయన బయటకు వచ్చేసరికే అక్కడకు చేరుకున్న భటులు ఆయనను పట్టుకుని, రాజు వద్దకు తీసుకుపోయారు. రాత్రి శ్రీనివాసుడు తనతో కలసి పాచికలాడాడని, పొరపాటు హారం మరచాడని, దానిని అప్పగించేందుకు తీసుకు వస్తుండగా తనను భటులు పట్టుకున్నారని రాజుతో చెప్పాడు బావాజీ. ఆయన చెప్పిన మాటలను రాజు నమ్మలేదు. ‘దేవదేవుడు ఒక మామూలు సన్యాసితో పాచికలాడటమా? రాజునైన నాతోనే పరాచికాలా?’ అంటూ ఆగ్రహించాడు. హాథీరామ్ బావాజీ తాను చెప్పినంతా నిజమేనని శ్రీనివాసుడు తన చెలికాడని నమ్మకంగా బదులిచ్చాడు. బావాజీ మాటలు నిజమో, కాదో తేల్చుకోవాలని తలచిన రాజు అతడిని పరీక్షించదలచాడు. బావాజీ ఆశ్రమ ప్రాంగణం నిండా చెరకుగడల గుట్ట వేయించాడు. రాత్రి తెల్లారేలోగా చెరకు పిప్పి అయినా మిగలకుండా ఖాళీ చేయాలని, అలా చేస్తేనే బావాజీ మాటలు నమ్ముతానని చెప్పాడు. ఆశ్రమంలోకి బయటి వారెవరూ వెళ్లడానికి వీలు లేకుండా భటులతో కాపలా ఏర్పాటు చేశాడు. హాథీరామ్ బావాజీ ఆశ్రమంలో చిద్విలాసంగా కీర్తనలు పాడుకుండా ఉన్నాడు. అర్ధరాత్రి వేళ భటులు కునికి పాట్లు పడుతున్న సమయంలో ఒక తెల్లని ఏనుగు వచ్చి, నిమిషాల్లో చెరకు గుట్టను ఖాళీ చేసేసి వెళ్లిపోయింది. ఉదయాన్నే ఆశ్రమానికి వచ్చి చూసిన రాజుకు అక్కడ చెరకు గుట్ట ఆనవాలే లేకుండా కనిపించడంతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. పరమ భాగవతోత్తముని పట్ల తన వల్ల అపరాధం జరిగినందుకు పశ్చాత్తాపం చెందాడు. నిజానికి హాథీరామ్ బావాజీ అసలు పేరు ఆశారామ్ బల్జోత్. అతడి ఆశ్రమానికి ఏనుగు రావడం వల్ల, బావాజీ తరచు రామనామ స్మరణ చేస్తూ ఉండటం వల్ల ఆయనకు హాథీరామ్ బావాజీ అనే పేరు స్థిరపడింది. ఆపదలో ఉన్న స్నేహితుడిని సాటి స్నేహితుడు కాపాడినట్లే బావాజీని సాక్షాత్తు భగవంతుడే దిగివచ్చి కాపాడాడు. సూరదాసు గానానికి రాధాకృష్ణుల పరవశం సూరదాసు పుట్టుక నుంచి అంధుడు. అంధుడైనందున కుటుంబ సభ్యులు అతడిని ఆదరించేవారు కాదు. సొంతవారి అనాదరణను భరించలేక అతడు ఆరేళ్ల వయసులోనే ఇల్లు వదిలిపెట్టాడు. యమునా నదీ తీరం వద్ద దిక్కుతోచని స్థితిలో ఉన్న అంధబాలకుడు సూరదాసును చూసిన వల్లభాచార్యులు అతడిని చేరదీసి, శిష్యునిగా స్వీకరిస్తారు. వల్లభాచార్యుల శిష్యరికంలో సూరదాసు సఖ్యభక్తి మార్గంలో రాధాకృష్ణులపై వేలాది కీర్తనలు రచించి, గానం చేశాడు. సూరదాసు కీర్తనలు గానం చేసేటప్పుడు రాధాకృష్ణులు స్వయంగా వచ్చి, అతడి గానానికి పరవశులయ్యేవారని ప్రతీతి. కృష్ణుడు ఒకసారి సూరదాసును ఆటపట్టించిన సంఘటనపై ప్రచారంలో ఉన్న గాథ ఇది...ఒకసారి సూరదాసు ఒక వనంలో కూర్చుని గానం చేస్తుండగా, రాధాకృష్ణులు అతడికి చేరువలోనే కూర్చుని పరవశులై వినసాగారు. సూరదాసుని కాసేపు ఆటపట్టించాలనుకున్నాడు శ్రీకృష్ణుడు. అతడి వద్ద తననొక్కడినే విడిచి పెట్టి కాస్త దూరంగా వెళ్లమని రాధకు సూచించడంతో ఆమె అక్కడి నుంచి లేచి వెళ్లబోయింది. తన ముందు నుంచి ఎవరో పారిపోతున్నట్లు అనిపించడంతో సూరదాసు పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అతడికి చేతికి రాధ కాలు తగిలింది. అతడి చేతికి చిక్కకుండా రాధ కాస్త దూరంగా వెళ్లింది. అక్కడే రాలి పడిన రాధ కాలి అందె సూరదాసు చేతికి దొరికింది. తన అందెను ఇవ్వాల్సిందిగా రాధ అతడిని కోరింది. ఎవరో చెబితేనే ఇస్తానన్నాడు సూరదాసు. తాను రాధనని, కాలి అందె తనదేనని బదులిచ్చింది ఆమె. అంధుడైన తాను అందె గల మనిషిని చూడలేదని, అందె నీదేనని, నీవే రాధవని నమ్మేదెలా? అని ప్రశ్నించాడు సూరదాసు. అప్పుడు కృష్ణుడు అతడికి చూపు ప్రసాదించాడు. కళ్లెదుట రాధాకృష్ణులు కనిపించడంతో సూరదాసు పరవశుడయ్యాడు. రాధా కృష్ణులను చూసిన తాను ఈ పాడు లోకాన్ని చూడలేనని, తిరిగి తన చూపును తీసుకుపోవాలని సూరదాసు పట్టుబట్టడంతో కృష్ణుడు అతడి కోరికకు సరేనన్నాడు. నిండు నూరేళ్లు జీవించిన సూరదాసు కృష్ణుడినే చెలికాడుగా భావిస్తూ రచించిన కీర్తనలు నేటికీ అజరామరంగా నిలిచి ఉన్నాయి. రాముడినే తిట్టిపోసిన భక్త రామదాసు ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అనే ఆర్యోక్తిని నమ్మే మన దేశంలో రామభక్తులుగా చెప్పుకొనే వారెవరూ రాముడిని పల్లెత్తు మాట అనరు. వారంతా రాముడిని దైవంగా మాత్రమే ఆరాధిస్తారు. భక్త రామదాసు అలాంటిలాంటి భక్తుడు కాదు, ఇక్కట్లలో ఉన్న తనను ఆదుకోని రాముడిపై అలిగి అనరాని మాటలన్నీ అంటూ తిట్టిపోస్తాడు. రామదాసు అసలు పేరు కంచర్ల గోపన్న. ఆయన మేనమామలు అక్కన్న మాదన్నలు గోల్కొండ తానీషా కొలువులో పాలనా వ్యవహారాలు చూసేవారు. వారి ప్రాపకంతో గోపన్న పాల్వంచ పరగణా తహశీల్దారుగా ఉద్యోగం సంపాదిస్తాడు. రాముడు వెలసిన భద్రాచలం ఈ పరగణాలోనిదే. ఒకసారి భద్రాచలంలో జరిగిన జాతరకు వెళ్లిన గోపన్న అక్కడి శ్రీరాముని ఆలయం ఆలనపాలన లేకుండా ఉండటం చూసి చలించిపోతాడు. అక్కడ తారసపడిన పోకల దమ్మక్క అనే భక్తురాలు ‘అయ్యా! ఎలాగైనా నీవే ఆలయాన్ని బాగుచేయాలి’ అని కోరడంతో గోపన్న ఆలయ జీర్ణోద్ధరణకు సంకల్పిస్తాడు. గ్రామస్తులకు తన ఉద్దేశం చెప్పడంతో వారు కూడా ముందుకొచ్చి విరాళాలు ఇస్తారు. సేకరించిన విరాళాల సొమ్ము జీర్ణోద్ధరణ కార్యక్రమానికి కాస్త తక్కువ కావడంతో అప్పటికే తాను వసూలు చేసిన పన్నుల్లోని కొంత మొత్తాన్ని కలిపి, ఆలయ జీర్ణోద్ధరణ పూర్తి చేస్తాడు. సీతారాములకు బంగారు అలంకారాలను తయారు చేయిస్తాడు. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల మొత్తాన్ని ఆలయం కోసం ఖర్చుపెట్టాడంటూ కొందరు అతడిపై ఫిర్యాదు చేయడంతో ఆగ్రహించిన తానీషా గోపన్నకు పన్నెండేళ్ల శిక్ష విధించి, గోల్కొండలోని చెరసాలలో బంధిస్తాడు. రాముడి ఆలయాన్ని పునరుద్ధరించిన పాపానికి తాను జైలు పాలవడాన్ని జీర్ణించుకోలేకపోతాడు. ఆపదలో ఉన్న తనను రాముడు ఆదుకోకపోతాడా అని ఎదురు చూస్తాడు. మొదట్లో ‘ఏ తీరుగ నను దయజూసెదవో ఇన వంశోత్తమ రామా’ అంటూ ప్రాధేయపడతాడు. ఫలితం లేకపోవడంతో కొంచెం చనువు తీసుకుని ‘సీతమ్మ తల్లీ చెప్పవే..’ అంటూ సీతమ్మవారితో సిఫారసు చేయించే ప్రయత్నం చేస్తాడు. అప్పటికీ ఉపయోగం లేకపోవడంతో రాముడిపై తిట్ల దండకాన్నే అందుకుంటాడు. ‘ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్రా..’ అంటూ నిలదీస్తాడు. ‘సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము..’ అంటూ ఏయే ఆభరణానికి ఎంతెంత ఖర్చు చేశాడో లెక్కలన్నీ పొల్లు పోకుండా ఏకరువు పెడతాడు. ఎంతైనా శిస్తులు వసూలు చేసే తహశీల్దారు కదా! తిట్టినవన్నీ నోరారా తిట్టేశాక ‘ఈ దెబ్బలకోర్వలేక తిట్టాను. ఏమీ అనుకోవద్దు’ అంటూ అనునయిస్తాడు. భక్తుడు అన్ని తిట్లు తిట్టిపోసి, అంత మర్యాదగా అనునయ వాక్యాలు పలుకుతుంటే ఇక రాముడే ఉండబట్టలేక రంగంలోకి దిగుతాడు. లక్ష్మణుడితో కలసి మారువేషంలో తానీషాను కలుసుకుంటాడు. తమ పేర్లు రామోజీ, లక్షో్మజీ అని, గోపన్న స్నేహితులమని పరిచయం చేసుకుంటారు. ఆలయం కోసం పన్నుల మొత్తం నుంచి రామదాసు ఖర్చు చేసిన సొమ్మును చెల్లిస్తారు. తానీషాకు సొమ్ము ముట్టడంతో గోపన్న బంధ విముక్తడవుతాడు. నాటి నుంచి రామదాసుగా ప్రఖ్యాతుడవుతాడు. తెలుగునాట తొలి వాగ్గేయకారుడు భక్తరామదాసుకు రాముడిపై ఉన్నది తిరుగులేని సఖ్యభక్తి. భక్త సాలబేగ్ కోసం ఆగిన జగన్నాథుని రథం సాలబేగ్ జగన్నాథస్వామికి పరమ భక్తుడు. ముస్లిం మతస్తుడు కావడంతో అతడికి ఆలయ ప్రవేశానికి అనుమతి ఉండేది కాదు. రథయాత్రలో బలభద్ర సుభద్రలతో కలసి జగన్నాథుడు పూరీ పురవీధుల్లోకి వచ్చినప్పుడు మాత్రమే కులమతాలకు అతీతంగా భక్తులందరికీ దర్శనం లభిస్తుంది. జగన్నాథుడిపై సఖ్యభక్తితో కీర్తనలు రచించిన సాలబేగ్‌కు రథయాత్రలో ఎలాగైనా జగన్నాథుడిని తనివితీరా చూడాలనే కోరిక ఉండేది. సాలబేగ్ తండ్రి మొఘల్ చక్రవర్తుల వద్ద సుబేదారుగా ఉండేవాడు. యువకుడైన సాలబేగ్ తండ్రితో కలసి మొగల్ సేనల తరఫున యుద్ధాల్లో పాల్గొనేవాడు. ఒకసారి యుద్ధంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఇక ప్రాణాలు దక్కవేమో అనే పరిస్థితి. జగన్నాథుడిని వేడుకుంటే అతడే అన్నీ చూసుకుంటాడని తన తల్లి చెప్పడంతో ఆమె మాటపై జగన్నాథుడిని స్మరిస్తూ ఆశువుగా కీర్తనలు అల్లుతాడు. కొద్దిరోజులకే ఆశ్చర్యకరంగా కోలుకుంటాడు. జగన్నాథుడిని రథయాత్ర రోజున చూడాలని అనుకున్న దశలో రథయాత్ర వేడుకకు కొద్దిరోజుల ముందే అనారోగ్యానికి లోనవుతాడు. బయటకు కదల్లేని పరిస్థితి. తాను వచ్చేంత వరకు ముందుకు సాగిపోవద్దని జగన్నాథుడిని మనసులోనే కోరుకుంటాడు. యథావిధిగా రథయాత్ర మొదలవుతుంది. సాలబేగ్ ఇంటి వద్దకు వచ్చేసరికి ఇక రథం ముందుకు సాగదు. ఎందరు భక్తులు ఎంతగా బలప్రయోగం చేసినా, రథం అంగుళమైనా కదలదు. సాలబేగ్ను అప్పటికే భక్తుడిగా ఎరిగి ఉండటంతో పూజారులు విషయం గ్రహిస్తారు. సాలబేగ్‌కు కబురు పెడతారు. నెమ్మదిగా అతడు గుమ్మం దాటి బయటకు వచ్చి, జగన్నాథుడిని తనివితీరా చూసిన తర్వాతే రథం ముందుకు కదులుతుంది. ఒక ఆప్తమిత్రుడి ఇంటికి వచ్చినట్లే జగన్నాథుడు సాలబేగ్ ఇంటి వద్దకు వచ్చి దర్శనం ఇవ్వడం పూజారులను సైతం ఆశ్చర్యచకితులను చేసింది. సాలబేగ్ వయసు మళ్లి కన్నుమూశాక అతడి సమాధిని పూరీలో జగన్నాథుడి ఆలయం ఉండే బొడొదండొకు చేరువలోనే నిర్మించారు. ఇప్పటికీ జగన్నాథుడిని దర్శించుకునే భక్తులు భాగవతోత్తముడైన సాలబేగ్ సమాధిని కూడా తప్పక దర్శించుకుంటారు. పురాణాదోస్త్ కృష్ణుడు–కుచేలుడు శ్రీకృష్ణుడికి కుచేలుడికి మధ్యనున్న స్నేహం పురాణ స్నేహాలన్నింటిలోకీ తలమానికమైనది. శ్రీకృష్ణ బలరాములు సాందీపని మహాముని గురుకులంలో విద్యాభ్యాసం చేసే కాలంలో కుచేలుడు వారి సహాధ్యాయి. కుచేలుడు నిరుపేద బ్రాహ్మణ బాలకుడు. కుచేలుడి అసలు పేరు సుదాముడు. నిరుపేద అయినందున నలిగిన దుస్తులతో ఉండేవాడు. అందువల్ల అతడికి కుచేలుడనే పేరు వచ్చింది. విద్యాభ్యాసం తర్వాత కృష్ణుడు ద్వారక వెళ్లి రాజ్యభారం స్వీకరిస్తాడు. అష్టమహిషులను పెళ్లాడతాడు. కుచేలుడు సుశీల అనే వనితను పెళ్లాడతాడు. గంపెడు సంతానం కలగడంతో సంసారం ఈదడం కష్టమవుతుంది. భార్య సలహాపై కృష్ణుడిని చూడటానికి వెళతాడు. ఉత్త చేతులతో వెళితే బాగుండదని ఇంట్లో ఉన్న కొద్దిపాటి అటుకులను మూటగట్టి తీసుకువెళతాడు. కృష్ణుడు అతడిని ఆదరించి, సత్కరిస్తాడు. కృష్ణుడికి ఏమీ అడగకుండానే కుచేలుడు తిరిగి వెళతాడు. ఇంటికి వచ్చి చూస్తే పూరిగుడిసె కాస్త కృష్ణలీలతో భవంతిగా మారుతుంది. నాటి నుంచి కుచేలుడికి ఏ లోటూ ఉండదు. రాముడు–సుగ్రీవుడు పురాణాల్లోని స్నేహగాథల్లో రాముడికి సుగ్రీవుడికి గల మైత్రి కూడా ప్రసిద్ధి పొందింది. వీరిద్దరి మైత్రికి హనుమంతుడు అనుసంధానకర్తగా వ్యవహరించాడు. కిష్కింధ రాజ్యం నుంచి అన్న వాలి తరిమేయడంతో సుగ్రీవుడు తన సహచరులైన వానర పరివారంతో కలసి రుష్యమూక పర్వతంపై తలదాచుకున్నాడు. సుగ్రీవుడిని వాలి రాజ్యం నుంచి తరిమేయడమే కాదు, సుగ్రీవుడి భార్య రుమను చెరబట్టాడు. అలాంటి పరిస్థితుల్లో రామ లక్ష్మణులు సీత కోసం వెదుకులాడుతూ రుష్యమూక పర్వత ప్రాంతానికి చేరుకున్నారు. ధనుర్బాణాలతో వస్తున్న వారిని చూసి సుగ్రీవుడు మొదట భయపడ్డాడు. హనుమంతుడు అతడికి ధైర్యం చెప్పి, రామలక్ష్మణుల వద్దకు వెళ్లి ఎవరో, ఏమిటో తెలుసుకుంటాడు. సుగ్రీవుని వద్దకు తీసుకుపోయి పరిచయం చేస్తాడు. అన్యాయం చేసిన వాలిని వధిస్తానని మాట ఇస్తాడు రాముడు. సీతాన్వేషణలో తన వానరసేన సాయం చేస్తుందని బాస చేస్తాడు సుగ్రీవుడు. అన్న మాట ప్రకారమే రాముడు వాలిని వధిస్తాడు. సుగ్రీవుడి ఆధ్వర్యంలో వానరసేన లంకపై దండెత్తి రామ రావణ యుద్ధంలో తనవంతు పాత్ర పోషిస్తుంది. సీత–త్రిజట సీతను అపహరించిన రావణుడు ఆమెను లంకలోని అశోకవనంలో బంధిస్తాడు. రాక్షస వనితలను ఆమెకు కాపలాగా పెడతాడు. రావణుడి సోదరుడైన విభీషణుడి కూతురైన త్రిజట కూడా సీతకు కాపలా ఉండే వారిలో ఉంటుంది. రాముడిని తలచుకుంటూ శోకించే సీతను చూసి ఆమెకు జాలి కలుగుతుంది. తన పెదతండ్రి రావణుడు సీత పట్ల చేసిన దుర్మార్గానికి బాధపడేది. సీతను ఓదార్చేది. ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న సీతను ఆ ప్రయత్నం నుంచి వారించింది. సీతకు కాపలాగా ఉంటూ కునుకు తీసిన త్రిజటకు ఒక కల వచ్చింది. తనకు వచ్చిన కలను ఆమె సీతకు చెబుతుంది. తన కల ప్రకారం రావణుడి అంతం తప్పదని, రామలక్ష్మణులు లంకను జయించి, సీతను తీసుకుపోతారని చెబుతుంది. త్రిజటకు ఆ కల వచ్చిన తర్వాతే హనుమంతుడు లంకలో అడుగుపెట్టి లంకాదహనం చేస్తాడు. రావణ సంహారం జరిగిన తర్వాత సీత తనతో పాటే త్రిజటను కూడా పుష్పకవిమానంలో అయోధ్యకు తీసుకుపోయి, ఆమెను ఘనంగా సత్కరిస్తుంది. కర్ణుడు–దుర్యోధనుడు కర్ణుడికి దుర్యోధనుడికి గల మైత్రి కూడా పురాణాల్లో ప్రధానంగా ప్రస్తావించే మరో స్నేహగాథ. వీరి గాథలో స్నేహధర్మానికి కట్టుబడ్డ నిబద్ధత కర్ణుడిదైతే, కర్ణుడి అండతో అర్జునుడిని ఎదుర్కోవాలనే స్వార్థం దుర్యోధనుడిది. కౌరవ పాండవుల విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ద్రోణుడి ఆధ్వర్యంలో క్షాత్ర పరీక్ష జరుగుతుంది. అందులో పాల్గొనడానికి వస్తాడు కర్ణుడు. ఇది క్షాత్ర పరీక్ష అని, ఇందులో క్షత్రియ పుత్రులు మాత్రమే పాల్గొనాలని, సూతపుత్రుడైన కర్ణుడికి అందులో పాల్గొనే అర్హత లేదని అభ్యంతరపెడతాడు ద్రోణుడు. అర్జునుడిని ఎదిరించడానికి తగిన వీరుడు కర్ణుడేనని తలచిన దుర్యోధనుడు గురువు మాటకు ఎదురు చెబుతాడు. ‘కర్ణుడికి రాజ్యాధికారం లేకపోవడమే మీ అభ్యంతరమైతే, ఇప్పుడే అతడికి రాజ్యాభిషిక్తుడిని చేస్తాను’ అని పలికిన దుర్యోధనుడు అప్పటికప్పుడే అతడికి అంగరాజ్యాన్ని ధారపోస్తాడు. నిండుసభలో శాస్త్రోక్తంగా అభిషేకం జరిపిస్తాడు. సభలో తనకు అవమానం ఎదురైనప్పుడు తనను ఆదరించి, రాజ్యాభిషిక్తుడిని చేసిన దుర్యోధనుడితో మైత్రీబంధాన్ని ఏనాటికీ వదులుకోనని బాస చేస్తాడు కర్ణుడు. అప్పటి నుంచి దుర్యోధనుడికి బాసటగా ఉంటూ, చివరకు కురుక్షేత్ర యుద్ధంలో తన ప్రాణాలు ధారబోస్తాడు. – పన్యాల జగన్నాథదాసు -
మనమంతా దుర్యోధనులం: రజనీకాంత్
మనమంతా దుర్యోధనులమని, ఆయనలాగే ఏం చేయకూడదు అనుకుంటామో అదే చేస్తామని సూపర్‌స్టార్ రజనీకాంత్ అన్నారు. అంతా అర్జునుడిలాగ మారితే మనిషి జీవితం భగవంతుడిని చేరుతుందని చెప్పారు. చెన్నైలోని రజనీకాంత్ కళ్యాణ మండపంలో పరమహంస యోగానంద రచించిన 'ది డివైన్ రొమాన్స్' తమిళ అనువాదం దైవీక కాదల్ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. తనను ఓ సినిమా స్టార్‌గా కంటే ఆధ్యాత్మికవాది అంటేనే ఇష్టపడతానని, తనకు సినిమాల కంటే ఆధ్యాత్మిక మార్గమే ఇష్టమని చెప్పారు. మనిషి జన్మ అనేది దేవుడి కృప అని, మానవత్వంతో జీవిస్తేనే ఆ జన్మకు సార్ధకత చేకూరుతుందని చెప్పారు. ఓ పరమ గురువుగా రామకృష్ణ పరమహంస నుంచి జీవితాన్ని నేర్చుకున్నానని, రమణ మహర్షి రాసిన'నేను ఎవరిని' అనే పుస్తకం నుంచి మనిషి జీవన గమనాన్ని గ్రహించానని రజనీ చెప్పారు. తాను స్వయంగా ఓ పుస్తకాన్ని విడుదల చేయటం ఇదే మొదటిసారని ఆయన అన్నారు. ఆధ్యాత్మిక మార్గంలో దైవాన్ని చూసిన మహోన్నత వ్యక్తులు మనకు అందించిన పుస్తకం కావడం వల్లే దీన్ని ఆవిష్కరించానన్నారు. అందరం జీవితాన్ని సార్ధకత చేసుకోవాలంటే అధ్యాత్మిక మార్గమే శరణ్యమని రజనీకాంత్ తెలిపారు. -
దుర్యోధనుడి గర్వభంగం
పురానీతి మాయాజూదంలో ఓటమి పాలైన పాండవులు వనవాసంలో నిరుపేదల్లా గడపసాగారు. హస్తినాపురంలో దుర్యోధనాది కౌరవులు అష్టైశ్వర్యాలతో తులతూగసాగారు. అడవులలో ఉన్న పాండవులను మరింత అవమానించాలని తలచాడు దుర్యోధనుడు. శకుని, కర్ణ, దుశ్శాసనులు అతడి ఆలోచనకు వంత పాడారు. వనవాసంలో ఉన్న పాండవుల వద్ద ఐశ్వర్య బలప్రదర్శన చేసి వారిని చిన్నబుచ్చాలని దుష్టచతుష్టయం నిశ్చయించుకున్నారు. వనవాసంలో పాండవులు ఆవాసం ఏర్పరచుకున్న ద్వైతవనంలో కౌరవుల గోవులు ఉండేవి. అందువల్ల పథకం ప్రకారం క్రూరమృగాల వల్ల గోవుల ప్రాణాలకు హాని కలుగుతోందని ధృతరాష్ట్రుడి ఎదుట కొందరు గోపాలకుల చేత సభలో చెప్పించారు. ఆ నెపంతో గోరక్షణ కోసం ద్వైతవనానికి వెళ్లేందుకు దృతరాష్ట్రుడి అనుమతి పొందారు. దుష్టచతుష్టయం సమస్త పరివారంతో, రాజ వైభవ లాంఛనాలతో అట్టహాసంగా ఘోషయాత్రకు బయలుదేరారు. ద్వైతవనానికి చేరువలో కమలాలతో నిండిన ఒక సుందర సరోవరం ఒడ్డున గుడారాలు నిర్మించుకుని విడిది చేశారు. అక్కడకు చేరువలోనే పాండవుల పర్ణశాల ఉంది. అద్భుతమైన సరోవర సౌందర్యానికి ముగ్ధులైన కౌరవులు అందులోకి దిగి యథేచ్ఛగా జలక్రీడలు ప్రారంభించారు. ఇంతలో కొందరు గంధర్వులు అక్కడకు పరుగు పరుగున చేరుకున్నారు. ‘ఇది మా ప్రభువు చిత్రసేనుడు నిర్మించుకున్న సరోవరం. ఇందులో అన్యులకు ప్రవేశం నిషిద్ధం. తక్షణమే ఇక్కడి నుంచి తొలగిపొండి’ అని హెచ్చరించారు. గంధర్వుల మాటలకు దుర్యోధనాది కౌరవులు వికటాట్టహాసాలు చేస్తూ ‘సాక్షాత్తు దేవేంద్రుడే వచ్చినా మేము ఇక్కడి నుంచి తొలగిపోయే ప్రసక్తే లేదు’ అని పలికి వారిని గెంటివేశారు. చేసేది లేక వారు తమ లోకానికి చేరుకుని జరిగినదంతా తమ ప్రభువైన చిత్రసేనుడికి విన్నవించారు. ఆగ్రహంతో రగిలిపోయిన చిత్రసేనుడు సేనలను తోడ్కొని వెళ్లి కౌరవులను ముట్టడించాడు. అప్పటికే సిద్ధంగా ఉన్న కౌరవ సేనలు గంధర్వులతో యుద్ధానికి తలపడ్డాయి. గంధర్వుల ధాటికి తాళలేని కౌరవ సేనలు ద్వైతవనంలోని పాండవుల పర్ణశాల వైపుగా పరుగులు ప్రారంభించాయి. గంధర్వుల దాడిలో కర్ణుడు క్షణాల్లోనే విరథుడై, నిరాయుధుడిగా మిగిలాడు. దుర్యోధనుడికి, అతడి సోదరులకు కూడా అదే గతి పట్టింది. చిత్రసేనుడు వారందరినీ బంధించి తీసుకుపోసాగాడు. ఈలోగా పారిపోయిన కౌరవ సైనికులు ధర్మరాజు వద్దకు చేరుకుని దుర్యోధనాదులు గంధర్వుల చేతికి బందీలుగా చిక్కారని, వారిని విడిపించాలని మొరపెట్టుకున్నారు. అక్కడే ఉన్న భీముడు వారి మాటలు విని... ‘అన్నయ్యా! కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారు. మనకు భారం తగ్గింది’ అన్నాడు. అప్పుడు ధర్మరాజు... ‘భీమసేనా! నువ్విలా అనరాదు. శరణార్థులైన వారు ఎలాంటి వారైనా వారిని కాపాడటమే ఉత్తమ వీరుల లక్షణం. పైగా, కౌరవులు మనకు స్వయానా దాయాదులు. వారికి సాయపడటం మన ధర్మం’ అని పలికాడు. అందువల్ల గంధర్వులను వారించి, కౌరవులను విడిపించమని భీమార్జునులను పురమాయించాడు. కౌరవులను విడిచిపెట్టమని అర్జునుడు నచ్చచెప్పగా గంధర్వులు వినిపించుకోకుండా, పాండు సోదరులపై ఆయుధాలు సంధించారు. ఇక అర్జునుడు గాండీవానికి పనిచెప్పాడు. తన శర పరంపరతో గంధర్వులను నిరాయుధులుగా చేశాడు. తన సేనలు చిక్కుల్లో పడ్డాయని తెలుసుకున్న చిత్రసేనుడు అక్కడకు వచ్చాడు. అతడు అర్జునుడికి అదివరకే మిత్రుడు. అర్జునుడిని చూడటమే తడవుగా యుద్ధాన్ని విరమించుకోమని తన సేనలను ఆదేశించాడు. అర్జునుడి మాటపై కౌరవులను విడిచిపెట్టాడు. సోదరులతో కలసి ద్వైతవనానికి తిరిగి వచ్చిన కౌరవులను ధర్మరాజు సాదరంగా ఆహ్వానించాడు. జరిగిన దానికి బాధపడవద్దని, అనవసరంగా ఇలాంటి దుస్సాహసాలకు పాల్పడవద్దని దుర్యోధనుడికి హితవు చెప్పి సాగనంపాడు. -
2016 ఆరు శత్రువులపై గెలుపు మొదలెట్టండి!
బాహ్యశత్రువులను జయించాలంటే అంగబలం, అర్థబలం ఉంటే చాలు. కానీ, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే అంతఃశత్రువులను జయించడం ఆషామాషీ కాదు. ఈ ఆరు అంతఃశత్రువుల ప్రభావంలో పడి పతనమైన ఆరుగురు పురాణ పురుషుల గురించి సోదాహరణంగా తెలుసుకుందాం... హిరణ్యకశిపుడు- క్రోధం సాక్షాత్తు శ్రీమహావిష్ణువు మీద ద్వేషంతో అనవసర క్రోధాన్ని పెంచుకున్న హిరణ్యకశిపుడు తన కొడుకు ప్రహ్లాదుడు నిరంతర హరినామ స్మరణలో మునిగి తేలుతూండటంతో అతడి క్రోధం అదుపు తప్పింది. కొడుకును ఎలాగైనా తన దారిలోకి తెచ్చుకోవాలనే పిచ్చికోపంతో ప్రహ్లాదుడికి క్రూరమైన శిక్షలు విధిస్తాడు. విష్ణువు అనుగ్రహం వల్ల ప్రహ్లాదుడికి ఆ శిక్షల వల్ల ఎలాంటి బాధ కలుగదు సరికదా, అతడి భక్తిపారవశ్యం రెట్టింపవుతుంది. ఇదంతా హిరణ్యకశిపుడికి మరింత క్రోధ కారణమవుతుంది. ‘ఎక్కడుంటాడురా నీ శ్రీహరి? ఈ స్తంభంలో ఉంటాడా..?’ అంటూ ఎదుటనే ఉన్న స్తంభాన్ని గదతో మోదుతాడు. స్తంభాన్ని చీల్చుకుని వచ్చిన నరసింహుడి చేతిలో అంతమైపోతాడు. దుర్యోధనుడు- లోభం అతి లోభం వల్ల నాశనమైన వాళ్లకు దుర్యోధనుడే పెద్ద ఉదాహరణ. రాజ్యమంతా తనకే దక్కాలనేది దురాశ. పాండవుల బలపరాక్రమాలు, కీర్తిప్రతిష్టలపై అమితంగా ఈర్ష్య చెందేవాడు. తమ్ముడు దుశ్శాసనుడు, మామ శకుని, మిత్రుడు కర్ణుడి అండతో అతడి లోభం పాండవులకు సూదిమొన మోపినంత నేలనైనా ఇవ్వబోనని తెగేసి చెప్పేటంతగా ముదిరి, యుద్ధానికి తెగిస్తాడు. యుద్ధంలో భీముడి చేతిలో దుర్యోధనుడి తొంభైతొమ్మిది మంది సోదరులూ నిహతులవుతారు. ప్రాణభీతితో మడుగులో దాగిన దుర్యోధనుడిని కవ్వించి, యుద్ధానికి పిలిచి భీముడితో తలపడేలా చేస్తాడు కృష్ణుడు. భీముడి గదాఘాతాలకు తొడలు విరిగి, నిస్సహాయంగా మరణిస్తాడు. ధృతరాష్ట్రుడు- మోహం కొడుకుల మీద మితిమీరిన మోహంతో ధృతరాష్ట్రుడు నాశనమయ్యాడు. దుర్యోధనుడు సహా తన వందమంది కొడుకుల మీద వల్లమాలిన వ్యామోహం ఆ గుడ్డిమహారాజుది. పాండవుల పట్ల తన కొడుకులు సాగించే అకృత్యాలను ఏనాడూ అతడు అరికట్టలేదు. దుర్యోధనుడిని ఎలాగైనా రాజ్యాభిషిక్తుడిని చేయాలనే కోరికతో కొడుకులను అదుపులో ఉంచే ప్రయత్నాలు చేయలేదు. కురుసభలో సాక్షాత్తు శ్రీకృష్ణుడు విశ్వరూప ప్రదర్శన చేసినా, ధోరణి మార్చుకోలేదు. పాండవుల సంధి ప్రతిపాదనను తన కొడుకు దుర్యోధనుడు తోసిపుచ్చినప్పుడు అడ్డుచెప్పలేదు. నిండుసభలో దుశ్శాసనుడు ద్రౌపదీ వస్త్రాపహరణానికి తెగబడితే మందలించకపోవడం కురుక్షేత్ర యుద్ధానికి కారణమైంది. కురుక్షేత్ర రణరంగంలోని యుద్ధ విశేషాలను సంజయుడి ద్వారా తెలుసుకుంటూ, తన కొడుకుల మరణ వార్తలు వింటూ వగచి వగచి కుములుతాడు మోహపీడితుడైన ధృతరాష్ట్రుడు. రావణుడు- మదం రావణుడు సకల వేదశాస్త్ర పారంగతుడు. అయితే, శివుడి వల్ల పొందిన వరాల బలం వల్ల పూర్తిగా మదాంధుడయ్యాడు. అనవసరపు మదాంధతతోనే సీతను అపహరించి తన లంకలోని అశోకవనంలో బంధిస్తాడు. సముద్రాన్ని లంఘించి, సీత జాడను కనుగొన్న హనుమంతుడు హితవు చెప్పబోతే, మదంతో అతడి తోకకు నిప్పంటిస్తాడు. రామభక్తుడైన హనుమ లంకాదహనం చేసి మరీ హెచ్చరించినా పెడచెవిన పెడతాడు. హితబోధ చేసిన తమ్ముడు విభీషణుడిని తరిమేస్తాడు. వానరసేనతో రామలక్ష్మణులు లంకను చుట్టుముట్టినా, బుద్ధితెచ్చుకోక యుద్ధానికి సిద్ధపడతాడు. చివరకు రామబాణానికి నేలకూలతాడు రావణ బ్రహ్మ. విశ్వామిత్రుడు- మాత్సర్యం బ్రహ్మర్షి అయిన వశిష్టుడి పట్ల ఎనలేని మాత్సర్యం విశ్వామిత్రుడిది. ఆ మాత్సర్యంతోనే అతడికి పోటీగా బ్రహ్మర్షి కావాలనే సంకల్పంతో తపోదీక్షలో ఉన్న విశ్వామిత్రుడి వద్దకు మేనకను పంపుతాడు ఇంద్రుడు. మేనకపై మోహంలో మునిగిపోవడంతో తపోభ్రష్టుడవుతాడు. విశ్వామిత్రుడు మళ్లీ తపస్సు మొదలుపెడతాడు. ఇంద్రుడు ఈసారి రంభను పంపుతాడు. తపోభంగానికి వచ్చిన రంభను చూసి విశ్వామిత్రుడు కోపం పట్టలేక వెయ్యేళ్లు రాయిగా పడి ఉండాలంటూ ఆమెను శపిస్తాడు. ఆగ్రహాన్ని అణచుకోలేకపోవడం వల్ల మళ్లీ తపోభ్రష్టుడవడంతో మరోసారి తపోదీక్ష పడతాడు. పరీక్షలన్నింటినీ తట్టుకుని తపస్సు కొనసాగిస్తాడు. చివరకు బ్రహ్మ స్వయంగా విశ్వామిత్రుడిని బ్రహ్మర్షిగా ప్రకటిస్తాడు. మాత్సర్యం వల్ల భంగపాటు ఎదుర్కొన్న విశ్వామిత్రుడు, ఆ అవలక్షణాన్ని విడనాడిన తర్వాతే తన లక్ష్యాన్ని సాధించగలిగాడు. కీచకుడు- కామం కామం వల్ల కీచకుడు నాశనాన్ని కొనితెచ్చుకున్నాడు. కీచకుడు విరాటరాజుకు బావమరిది. రాజ్యం విరాటరాజుదే అయినా, పెత్తనం మాత్రం సేనాధిపతి అయిన కీచకుడిదే. రాజుకు సైతం తనను నియంత్రించే శక్తి లేకపోవడంతో కీచకుడు సాగించిన అకృత్యాలకు, అరాచకాలకు అంతులేదు. కీచకుడి ఆగడాలు అలా కొనసాగుతుండగానే, కుంజరయూధం దోమ కుత్తుక జొచ్చినట్లుగా పంచపాండవులు ద్రౌపదీ సమేతంగా అజ్ఞాతవాసం కోసం విరాటరాజు కొలువులో వివిధ మారువేషాల్లో చేరుతారు. ద్రౌపది సైరంధ్రిగా అంతఃపురం చేరి, రాణి సుధేష్ణకు సేవలు చేస్తూ ఉండేది. కన్నూమిన్నూ కానని కామంతో కీచకుడు ద్రౌపదిని వేధిస్తాడు. చివరకు నిండు కొలువులోనే ఆమెను చెరబట్టేందుకు బరితెగిస్తాడు. ద్రౌపది తెలివిగా అతడిని నర్తనశాలకు రప్పిస్తుంది. కీచకుడు వచ్చేవేళకు అప్పటికే అక్కడ చీకటిలో కాచుకుని ఉన్న భీముడు అతడిని చప్పుడు కాకుండా మట్టుబెడతాడు. -
దుష్టచతుష్టయం
ఐదోవేదం: మహాభారత పాత్రలు - 22 దుష్టచతుష్టయమంటే నలుగురు చెడ్డవాళ్లు: దుర్యోధనుడూ దుశ్శాసనుడూ శకునీ కర్ణుడూను. దుర్యోధనుడంటే చురుకైన కోరిక; దుశ్శాసనుడేమో పట్టరాని కోపం; శకుని అంటే అత్యంతమైన మోహం; కర్ణుడంటే ఏది తనకిష్టమో, ఏది తనకు సుఖకరమో దాన్నే చేద్దామనుకొనే లోభమున్నవాడు. కోరికా కక్కుర్తీ అనేవి మూడూ నరకానికి తెరిచిన ద్వారాలని చెబుతారు. మనిషిలో కిందికి దిగివచ్చిన చైతన్యాన్ని దివ్య చైతన్యంగా లేవనెత్తడానికి మూలాధారంలో ఉన్న కుండలినీశక్తిని మెదడులో ఉన్న సహస్రారానికి నడపాలి. ఆ పనికి కామమూ క్రోధమూ లోభమూ మోహమూ అనే నాలుగు దుష్టశక్తులూ పెద్ద ఆటంకాలు. దుర్యోధనుణ్ని కలి అనీ శకునిని ద్వాపరుడనీ చెబుతారు. కలి అంటే కలహానికి మారు పేరు; ద్వాపర మంటే అనిశ్చితీ సందేహమూను. పాచికలాట మొదలుపెడితే చాలు ఎవరి బతుకైనా సందేహంలో పడిపోతుంది. రాజసూయ యాగ సమయంలో వచ్చిన రత్నసంచయాన్ని చూసి దుర్యోధనుడు వెర్రెత్తిపోయాడు. ఆ డబ్బంతా తనదై పోవాలనుకున్నాడు. ఆ పవిత్రయాగ ధూమంతో సుగంధిలమైన ద్రౌపది జుట్టును పట్టుకొని కోపంతో సభలోకి ఈడ్చుకొని వచ్చాడు దుశ్శాసనుడు. చాలామందికి భార్య గనక ఆవిణ్ని వేశ్య అంటూ, సభలోకి ఏకవస్త్రగా వచ్చినా వివస్త్రగా వచ్చినా ఫరవాలేదంటూ కర్ణుడు వస్త్రాపహరణానికి బీజం వేశాడు. కలిరూపమైన క్రియాశీలకమైన కోరికతో యుద్ధం చేయడం చాలా కష్టం. లోకంలో అవుపించే విషయాల్ని తలచు కుంటూ ఉంటే, వాటితో మనకు తగులు బాటు కలుగుతుంది. మాట వరసకు, ఓ పువ్వును చూశామనుకోండి. బావుందని అనుకోడంతోబాటు, అది త్వరలోనే వసి వాడిపోతుందని తెలిసినా, లోభంతో దాన్ని కోసుకొని మన దగ్గర పెట్టుకుందా మన్న కోరిక పుడుతుంది. అక్కడ పువ్వుల్ని కోయకూడదన్న ఆంక్ష ఉందనుకోండి. అది ఆ కోరికకు గొడ్డలిపెట్టులాగ ఉంటుంది. కోరికకు అడ్డంకి రాగానే చిరాకు పుడు తుంది. చిరాకు రాగానే ఏం చేస్తున్నామో తెలియని మూఢత్వం కమ్ముకుంటుంది. ‘నా అంతటివాడి మాటను ఖాతరు చేయవా’ అంటూ జుట్టు పట్టుకుంటాడు. ఆ భ్రాంతి మోసంలో పడేసి, తానెవరో మరచిపోయేలాగ చేస్తుంది. ఆవిడ వదిన, తల్లిలాంటిది అనే మాట గుర్తుకురాదు. మరపురాగానే వివేకం బొత్తిగా అడుగంటుతుంది. బుద్ధి పోగానే మంచి ప్రవర్తన మాసిపోతుంది. వదిన అన్న మాట విస్మరించి బట్టల్ని ఊడదీయడానికి సిద్ధమైపోతాడు. అది నిండుసభ అనే మాట కూడా గుర్తు ఉండదు. ఈ దుష్టచతుష్టయం పుట్టించే గందరగోళంలో మనిషిలోని కుండలినీ ప్రాణశక్తి దుర్వినియోగానికి గురి అయి, కలహాన్నీ అశాంతినీ కలిగిస్తుంది. నిండు కొలువులో ద్రౌపది అనే మహారాణి తన శీలాన్ని కాపాడుకోవడం కోసం అటూ ఇటూ పరుగులు పెట్టింది. ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడికి సరిపోయిన తండ్రి. దుర్యోధనుడు పైకే తన కుచ్చితాన్ని చూపిస్తాడు గానీ ధృత రాష్ట్రుడు లోపల అంత కుచ్చితంగానూ ఆలోచిస్తూ ఉంటాడు. పాండవుల ఉన్నతి చూసి, ధృతరాష్ట్రుడు అసూయపడుతూ ‘ఏం చేయాలి నేను?’ అంటూ కణికుడనే రాజనీతిజ్ఞుణ్ని పిలిచాడు. ‘అగ్నిహోత్రమూ యజ్ఞమూ చేస్తూ కాషాయబట్టల్ని కట్టుకొని జడలూ మృగచర్మమూ ధరించి ముందు అందరికీ విశ్వాసాన్ని కలగ జెయ్యాలి. ఆమీద తోడేలులాగ శత్రువుల మీదపడి నాశనం చేయాలి. శత్రువును ఈ విధంగా చంపలేకపోతే వాడున్న ఇంటికి నిప్పు పెట్టాలి’ అని పాఠం చెబుతూ ఒక గుంటనక్క కథను చెప్పాడు కణికుడు. స్వార్థపండితుడైన ఒక నక్క పులీ ఎలుకా తోడేలూ ముంగిసా అనే తన నేస్తాలతోబాటు ఒక అడవిలో ఉంది. ఒకరోజున అందరూ కలిసి లేళ్ల సర్దారును చూసి లొట్టలేశాయి. అయితే దాని వేగం ముందు వీళ్ల ప్రయత్నాలు ఎందుకూ కొరగాలేదు. అప్పుడు నక్క ఒక పథకాన్ని వేసింది. అది పడుకొన్నప్పుడు మన ఎలుక దాని పాదాల్ని కొరికినట్టయితే దాని వేగం తగ్గుతుంది. అప్పుడు పులి దాన్ని పట్టి చంపగలుగుతుంది. సరే అని అందరూ ఆ పన్నాగాన్ని అమలుపరిచారు. ‘మీరంతా స్నానాలు చేసి రండి. నేను ఈ మృగ దేహాన్ని కాపలా కాస్తూ ఉంటాను’ అని నక్క, వాళ్లందర్నీ పంపించింది. స్నానం చేసి మొదట పులి వచ్చింది. అయితే, నక్క ఏదో చింతలోపడ్డట్టు ముఖం పెట్టింది. ‘ఏమిటి సంగతి?’ అని పులి వాకబు చేస్తే, ‘ఎలక మీ గురించి అన్నమాటను విని నేను చింతలో పడ్డాను: నావల్లనే ఈ మృగం చచ్చింది. పులిరాజు బలం దీంట్లో ఎక్కడుంది? నా బాహుబలాన్ని ఆశ్ర యించుకొని అతను తన ఆకలిని తీర్చు కోనీ అంటూ ఈసడించుకుంటూ వెళ్లి పోయింద’ని నక్క చెప్పింది. ‘నా బలంతో సంపాయించుకొనే తింటానులే’ అంటూ పులి వెళ్లిపోయింది. ఇంతలో ఎలుక వచ్చింది. ‘ఎలుకా! ముంగిస ఏమందో తెలుసునా? నాకు ఈ మృగమాంసం గీంసం పడవు. నేను ఎలుకను తినడానికి ఇష్టపడతాను’ అని నక్క చెప్పడమే తడవు, అది తుర్రుమని పారిపోయింది. తరవాత తోడేలు వచ్చింది. దానితో, ‘పులి ఎందు కనో నువ్వంటే గుర్రుగా ఉంది. పెళ్లాన్ని తీసుకొని వస్తానని వెళ్లింది’ అని చెప్పే సరికి, అది ఠకీమని పారిపోయింది. చివరికి ముంగిస వచ్చింది. ‘నా సొంత బలంతో వాళ్లనందర్నీ జయించాను. నువ్వు కూడా నాతో యుద్ధం చేసి గెలిచి ఈ మాంసాన్ని తిను’ అనేసరికి అది తోక ముడుచుకొని పారిపోయింది. నక్కే ఆ మాంసమంతా కడుపునిండా ఆరగించింది. ఇలాగ తక్కువ చేసో బెదిరించో భయ పెట్టో బామాలో శత్రువును నిర్మూలించు కోవాలంటూ కణికుడు పాఠం చెప్పాడు. ఈ కణికనీతి ధృతరాష్ట్రుడికి బాగా ఒంటపట్టింది. ‘కానీ అలా చేస్తే బాగుం డదు; ఏదో ఒకటి చేయకపోతే నేను కుమిలిపోతున్నాను’ అంటూ ద్వైదీ భావంలో ఊగిసలాడడం మొదలు పెట్టాడు. సరిగ్గా అప్పుడే దుష్టచతుష్టయం పెద్ద పన్నాగాన్ని పన్నుతున్నారు. ఏదో విధంగా పాండవుల్ని దూరంగా పంపిం చకపోతే ‘నాకు రాజ్యం రానేరాదు. ప్రజ లందరూ ధర్మరాజునే రాజుగా కోరుకుం టున్నారు’ అని నాన్న లోపలి ఆలోచన అనే నిప్పుకు ఆజ్యం పోశాడు. ‘నాదీ అదే అభిప్రాయం. కానీ అది పాపపుటాలోచన అని నేను బయటపెట్టడం లేదు. భీష్ముడూ మొదలైన పెద్దలకు ఎలాగ నచ్చజెప్పాలి?’ అంటూ మనస్సులో మాట చెప్పాడు తండ్రి. ‘భీష్ముడు ఎప్పుడూ మధ్యస్థుడే; అశ్వత్థామ నా పక్షానే ఉంటాడు. కొడుకెక్క డుంటే ద్రోణుడు అక్కడే ఉంటాడు. కృపా చార్యుడేమో బావామేనల్లుళ్లు ఉన్నచోటే ఉంటాడు. ఒక్క విదురుడే ఎదురు. అతనొక్కడూ దీన్ని ఆపలేడు’ అని దుర్యో ధనుడు తాము నలుగురూ చేసిన లక్క ఇంటి ఆలోచనను బయటపెట్టాడు. ధృతరాష్ట్రుడు పాండవులతో వారణావత నగర రమ్యత్వం గురించి కొంతమంది చేత పదే పదే చెప్పించి, వాళ్లకు అక్కడికి వెళ్లాలనే కోరికను లేవదీశాడు. ఆ మీదట ‘మీరు వెళ్దామనుకుంటున్నారటగా! శుభం వెళ్లిరండి’ అని పాండవుల్ని వారణావతం పంపించాడు. కానీ ఆ ఒక్క విదురుడూ వీళ్ల పన్నాగాన్ని విఫలం చేసేశాడు. దుర్యోధనుడి కన్ను ధర్మరాజుకున్న ధన సంపదల మీద పడింది. అతగాడికి ఆ డబ్బంతా తనదిగా చేసేసుకోవాలన్న కోరిక ఉవ్వెత్తున లేచింది. దానికి తోడు మయసభలో తిరుగుతూ నేలను చూసి నీళ్లూ నీళ్లను చూసి నేలా అని భ్రాంతిపడ్డ అతన్ని చూసి, భీముడు కిసుక్కుమని నవ్వాడు. ఆ మీద ద్రౌపదితో సహా ఆడ వాళ్లందరూ గలగలా నవ్వారు. దుర్యో ధనుడికి ఒంటి నిండా తేళ్లూ జైలూ పాకినట్టయింది. ఇంటికొచ్చి, మనస్సులో గుచ్చుకొన్న ముల్లును తీయడానికి దార్లను వెదకడం మొదలుపెట్టాడు. శకుని మామ మోసానికి ప్రతిరూపం. అతని ఆయుధాలు పాచికలు. జూదపీఠమే రణరంగం. మోసమే అతని చతురంగ బలం. పాచికలాటే మాయాక్రీడ. అది చాలా రంజుగా ఉంటుంది. ఆ రంధిలో పడి మనిషి తన శరీర రాజ్యాన్ని, తన ఆత్మానందశక్తిని, మోసానికి ఒడిగడు తూన్న ఇంద్రియాల మాటల్లో పడి, పందెంగా ఒడ్డి పోగొట్టుకుంటాడు. తెలిసుండీ ధర్మరాజు, జూదం ఆటకు, సరదా జూదం అని చెప్పి పెదనాన్న పిలిస్తే వెళ్లాడు. దీనికి కారణం రాజసూయ యాగం తరవాత వచ్చే కలహానికీ నాశ నానికీ తాను కారణం కాకూడదనే. అతను రాజసూయంలోనూ దిగ్విజయంలోనూ వచ్చిన కప్పాల్నీ కట్నాల్నీ ఒడ్డి పోగొట్టు కున్నా, శకుని ‘నీకింకా నీ తమ్ముళ్లున్నారు గదా, నువ్వున్నావుగా, నీ భార్య ఉందిగా’ అని పురిగొలుపుతూ అమంగళప్పక్షిలాగే పనిచేశాడు. శకుని అంటే పక్షి అని అర్థం కూడా ఉంది. కొన్ని పక్షుల కూతలు నష్టాన్నీ హింసనీ కలిగిస్తాయి. తీతువుపిట్ట ఇటువంటిదే. శకుని అటువంటి అప శకునప్పక్షి. ధర్మరాజు జూదం మొదలు పెట్టక ముందు ‘జూదం ఒక రకంగా మోసమూ పాపమూను. దీనిలో క్షత్రి యుడికి తగిన పరాక్రమం చూపించడం ఉండదు; దీనికి ఒక నిశ్చితమైన నీతీ లేదు. ధర్మానికి అనుకూలమైన విజయం యుద్ధంలోనే దొరుకుతుంది. క్షత్రియులకు యుద్ధమే శ్రేష్ఠం, జూదం కాదు. కుటిల త్వమూ మోసమూ లేని సంగ్రామమే సత్పురుషుడు చేసే యుద్ధం. జూదగాళ్లకు మోసమన్నా, కపటత్వమన్నా వల్లమాలిన గౌరవం. మంచివాళ్లు జూదాన్ని పొగడరు. నువ్వు క్రూరుడిలాగ అనుచితమైన మార్గంలో మమ్మల్ని జయించాలని చూడకు’ అని అన్నాడు. శకుని దానికి జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు: ‘ఒక వేద విజ్ఞాని మరో వేద విద్వాంసుణ్ని ఓడించడానికి ఏదో మారుమూల విషయాన్ని ఉపయోగించి మోసంతోనే జయిస్తూ ఉంటాడు. తెలిసినవాడు తెలియనివాణ్ని ఓడిస్తే అది మోసం ఎలాగవుతుంది? పాచికలాట బాగా ఎరిగిన నాబోటిగాడు ఆ ఆటలో చెయ్యి తిరగనివాణ్ని ఓడించడం జరుగుతుంది. దాన్ని మోసమంటే, అస్త్రాల్ని వెయ్య గలిగినవాడు ఆ నేర్పులేని వాణ్ని జయిస్తే అదీ మోసమే అవుతుంది. బలవంతుడు బలహీనుణ్ని జయించడం ఒక రకమైన మోసమే గానీ దాన్నీ మోసమని అనరు. ఇది మోసం అనుకుంటే నువ్వు వెళ్లిపో వచ్చు’. ‘పిలిచిన తరవాత వెళ్లిపోవడం నా వ్రతానికి విరుద్ధం. నేను ఇక్కడ ఎవరితో ఆడాలి?’ అని యుధిష్ఠిరుడు అనగానే దానికి దుర్యోధనుడి జవాబే జరగ బోతూన్న మోసాన్ని ఎదురుగుండా చూపించింది: ‘నేను డబ్బు పెడతాను. నా తరఫున శకునిమామ ఆడతాడు’. ‘ఒకడి కోసం మరొకడు ఆడడం విషమం’ అని అంటూనే ధర్మరాజు జూదానికి దిగాడు. నలుగురు దుష్టులూ తమ రొట్టె విరిగి నేతిలో పడిందనే ఆనందించారు. వెనక సింహాసనం మీద కూర్చొన్న ధృతరాష్ట్రుడికీ అదే ఆనందం. - డా॥ముంజులూరి నరసింహారావు -
దుర్యోధనుడు
ఐదోవేదం: మహాభారత పాత్రలు - 11 ధృతరాష్ట్రుడి పిల్లల్లో ఆరోవంతు మంది పేర్లకు ముందు ‘దుః’ అనే మాట ఉంది. ‘దుః’ అంటే, కష్టమనే గాక, ‘చెడ్డ’ అనే అర్థం కూడా ఉంది. దుర్యోధనుడంటే ‘ఇతనితో యుద్ధం చేయడం అతికష్టం’ అనేగాక, ‘ఇతని యుద్ధం అతి చెడ్డది’, ‘ఇతను బహు చెడ్డ యోద్ధ’ అనే అర్థాలు కూడా వస్తాయి. మనందరికీ మినహాయింపేమీ లేకుండా ఎవరితో పోరాడటం కష్టం? ఎవరి పోరాటం చెడ్డది? అంటే ఒకే ఒక్క జవాబు వస్తుంది లోకంలో... ‘కోరిక’ అని. అందరితోనూ ఏదోవిధంగా దెబ్బలాడవచ్చునేమో గానీ కోరికతో కొట్లాడటం మాత్రం అతికష్టం. అది అందితే మెడకో అందకపోతే కాలికో మెలిక వేస్తూనే ఉంటుంది. ఒకటి పోతే మరో కోరిక దాని స్థానే ఎడతెగని ప్రవాహంలాగ వస్తూనే ఉంటుంది. కోరిక రజోగుణం నుంచి పుట్టింది; బాగా తిండిపోతు; అతి పాపిష్ఠిది. అది నిప్పులాంటిది. నిప్పులో ఎన్ని ఎండుపుల్లలేసినా, ఎంత నెయ్యి పోసినా అది కాదనదు; తింటూనే ఉంటుంది, మండుతూనే ఉంటుంది. నిప్పుకు ‘అనలం’ అనే పేరు అందుకనే వచ్చింది. ‘అలం’ అంటే ‘చాలు’ అని అర్థం. ‘అనలం’ అంటే చాలనే మాటను అననే అనదని అర్థం. కోరిక నిప్పు నార్పాలంటే, ఒకే ఒక్క దారి: వస్తువుల మీద ఉన్న ఆసక్తి అనే నేతినీ విషయాలతో పూసుకొని తిరగడమనే కట్టెపుల్లల్నీ వేయడం మానెయ్యాలి. ‘దుర్యోధనుణ్ని’ చంపడాని క్కూడా అదే దారి: విదురుడు ధృతరాష్ట్రుడికి పదే పదే చెప్పిన దారి: ‘వాణ్ణొక్కణ్ణీ వదిలిపెడితే మొత్తం శరీర రాష్ట్రానికీ మనస్సనే క్షేత్రానికీ క్షేమమూ శాంతీ వస్తాయి; లేకపోతే, జీవితం పొడుగునా ఉపద్రవమే ఉపద్రవం. మనం అందరం ధృతరాష్ట్రులం గనకనే అంతర్వాణి అయిన విదురుడు పదే పదే చెప్పే ఈ మాటను వినాలని అనుకోం. కోరికను పెద్దకొడుకన్నట్టుగా కావలించు కొని కూర్చుంటాం. వాడు కలిలాగ నెత్తికెక్కి కూర్చున్నాడని అనుకోం. కలి నెత్తికెక్కినప్పుడు పరీక్షిత్తులాంటి భాగవతుడు కూడా నిష్కారణంగా ఏ పాపమూ చేయని సాధువు భుజంమీద చచ్చిన పామును పడేసి చెప్పరానంత ముప్పును కొనితెచ్చుకొంటాడు. ‘కలేరంశస్తు సంజజ్ఞే భువి దుర్యోధనో నృపః! దుర్బుద్ధిర్దుర్మతిశ్చైవ కురూణామయశస్కరః!!’ (ఆదిపర్వం 67-87). కలి అంశమే దుర్యోధనుడు; దుర్బుద్ధీ దుర్మతీ అతని లక్షణాలు. పనిని కుశలంగా చేద్దామనుకొనే వంశానికి అపయశస్సును తెచ్చే మచ్చ ఇతను. కలి అంటే, తమోగుణం ఎక్కువగా ఉన్నవాడు. తమోగుణమంటే నిద్రా ఆలస్యమూ ప్రమాదమూ (అజాగర్తా) మొహమూ మొదలైనవి. ‘కలిః శయానో భవతి’ అని ఐతరేయ బ్రాహ్మణంలో చెబుతారు: కలి అంటే ‘నిద్ర’లో మునిగిన వాడని అర్థం. ‘నిద్ర’ అంటే, మనం మామూలుగా అనుకొనే నిద్రగాదు: ‘నిద్ర’ అంటే, జీవశక్తి అంతా ఇంద్రి యాల ద్వారానూ ఇతరమైన అవయవాల గుండానూ బయటికి పోతూ ఖర్చైపోవడం. మెలకువ తెచ్చు కోడమంటే, ఆ ప్రాణశక్తిని వెనక్కి మలిపి మెదడు దిక్కుగా పంపడమని అర్థం. కోరికకూ పైన చెప్పిన ‘నిద్ర’కూ అవినాభావ సంబంధం ఉంది. మనకు సినిమాలు దుర్యోధనుడంటే అభిమాన ధనుడని చెబుతాయి. సినిమాల్లో అతి గొప్పగా చెప్పడానికి కారణం, మనమం దరమూ కోరికను పగవాడిగా తెలుసు కోలేకపోవడం వల్లనే. కోరిక లేకుండా బతకడమెలాగ అని మనమంటాం. మనను మనం ఉద్ధరించుకోవాలనే కోరికను వద్దని ఎవడూ అనడు. కానీ మన కోరికలన్నీ ఇతరులని చూసి వాతపెట్టు కుందామన్న మూర్ఖత్వంతో ప్రబలినవే. దుర్యోధనుడు పుట్టినప్పుడు నక్కలాగ అమంగళంగా అరిచాడని సినిమాలు చెప్పవు. అతను భీముణ్ని ఎదిరించడం తెలియక విషం పెట్టాడు. అతనికి అధికారం లేకపోయినా కర్ణుడికి ‘అంగ’ రాజ్యాన్ని కట్టబెట్టి అర్జునుణ్ని ఎదిరించడానికి అతన్ని, తన ‘ఉప్పు’ తిన్నవాడిగా చేసు కొన్నాడు. ఎదురుగుండా ఎదిరించ డానికి దమ్ములేకపోవడం వల్లనే ఆకతాయిగా పాండవుల్ని వేరే ఊరు పంపించి, వాళ్లున్న ఇంటిని కాల్చడానికి ప్రయత్నించాడు. రాజసూయయాగంలో పాండవుల డబ్బును చూసి అతనికి కన్నుకుట్టింది. మయసభలో నేలా నీళ్ల మధ్య తేడా తెలుసుకోలేని మతి లేని వాడై, ‘నేల’లో మునిగి, ‘నీళ్ల’ మీద బొక్కబోర్లా పడి కముకు దెబ్బతిన్నాడు. మయుడి మాయే జూదమనే మాయకు తెర తీసేలాగ చేసింది. తనకు జూద మాడటం చేతగాకపోయినా బోళా ధర్మ రాజును ముగ్గులోకి దించి, తనకు బదులుగా శకుని మామ చేత ఆడించాడు. విదురుడి మాట విని, ద్రౌపదికి వరం ఇచ్చి ధృతరాష్ట్రుడు పాండవుల దాస్యాన్ని పోగొడితే, మళ్లీ ఇంతలోనే మరో ప్రణాళిక వేసి, పన్నెండేళ్ల వనవాసమూ ఓ ఏడాది అజ్ఞాతవాసమూ అనే విలక్షణమైన పందేన్ని వేయించే జూదాన్ని తిరిగి ఆడేలాగ నిర్బంధపెట్టాడు దుర్యోధనుడు. పదమూడేళ్లు రాజ్యానికి దూరంగా ఉంటే, ధర్మరాజంటే ఇష్టపడే ప్రజలందర్నీ తనవైపునకు తిప్పుకోవచ్చుననుకొన్నాడు. వనవాసం చేస్తున్నప్పుడు దూర్వాసుణ్ని పంపించి, అతని కోపానికి పాండవుల్ని గురిచేద్దామని పథకం వేశాడు. అక్షయ పాత్ర ఆ రోజు ఇవ్వవలసిన గ్రాసం ఇచ్చేసింది. ద్రౌపది కడిగేసిన పాత్రలో ఒక మెతుకు మిగిలి ఉందని వాళ్లకు తెలి యదు. దాన్ని నోట్లో వేసుకొని, సర్వ భూతాల కడుపుల్నీ ఒకే కాలంలో నిండి పోయేలాగ శ్రీకృష్ణుడు చేయడంతో, స్నానం చేయడానికి వెళ్లిన దూర్వాసుడూ అతని పదివేల మంది శిష్యులు అందరూ కడుపులు ఉబ్బరించి అక్కణ్నించే పారి పోయారు. ఈ పన్నాగం దెబ్బతినడంతో, పాండవుల్ని అవమానం పాలు చేద్దామన్న దుర్భుద్ధితో మందీమార్బలంతోనూ అతి పటాటోపంతోనూ దుర్యోధనుడు పాండ వుల పక్కనే గుడారాలు వేయించాడు. అక్కడ ఓ గంధర్వుడితో గిల్లికజ్జా పెట్టు కొని గొంతుమీదికి తెచ్చుకొన్నాడు. సమయానికి ధర్మరాజు భీమార్జునుల్ని పంపించకపోతే దుర్యోధనుడి పని అంతటితో సమాప్తమైపోయి ఉండేది. ఇలాగ ఎప్పుడూ తాను వేసిన రాయి తిరిగొచ్చి తన నెత్తిమీదనే పడుతున్నా కళ్లు తెరుచుకోవడాన్ని ఇతను ఎరుగడు. కీచకుడు చచ్చిపోయిన తీరు చూసి, మూడు వంతులు పాండవులు విరాట నగరంలో అజ్ఞాతవాసం చేస్తూ ఉండవచ్చు నని అంచనా వేశాడు దుర్యోధనుడు. కానీ ఇదంతా గడువైపోయింతరవాతనే. ఐదైదేళ్లకు రెణ్ణెలలు అధికంగా వస్తూ ఉంటాయి చాంద్రమానంలో. పదమూడేళ్లయ్యేసరికి అటువంటి ఐదు నెలలు గడిచిపోతాయని లెక్కవేసుకోలేదు ఈ ఆత్రగాడు. పసిగట్టి అజ్ఞాతవాసాన్ని భంగం చేసి, తిరిగి పన్నెండేళ్ల పాటు అడవిబసకు పంపిద్దామని వేసిన పథకం మళ్లీ పెద్ద అవమానాన్నే తెచ్చిపెట్టింది. విరాట నగరం దక్షిణాన ఉన్న గోసంపత్తిని పట్టుకోడానికి సుశర్మ మొదలైనవాళ్లను పంపి, కొంత ఎడంగా, ఇటు ఉత్తరాన ఉన్న గోధనాన్ని కొల్లగొట్టడానికి, తాను, భీష్ముడూ ద్రోణుడూ కర్ణుడూ మొదలైన హేమాహేమీలతో బయలుదేరాడు. అంచనా వేసినట్టుగానే విరాటరాజుతో సహా అందరూ దక్షిణానికి యుద్ధం చేయడానికి వెళ్లారు. ఉత్తర గోగ్రహణాన్ని ఆపడానికి బృహన్నలను తీసుకొని, కోటకు కాపుగా ఉండటానికి మిగిలిన ఉత్తరకుమారుడొక్కడే వచ్చాడు. బృహన్నల కాలం లెక్కపెట్టుకొనే వచ్చాడు. ఎదురుగుండా గాండీవాన్ని పట్టి అర్జునుడే వచ్చేసరికి రొట్టె విరిగి నేతిలో పడిందని సంబరపడిపోతూ ‘పాండవుల బండారం బయటపడింది’ అని గెంతు లెయ్యబోయాడు దుర్యోధనుడు. కానీ భీష్ముడు అధిక మాసాల లెక్కచెప్పి గాలి తీసేశాడు. మాద్రికి అన్నగారైన శల్యుడు పాండవుల వైపున పోరాడదామని వస్తూ ఉంటే, అతనికి తెలియకుండా, అతని దారి పొడుగునా సకల సౌకర్యాలనూ అందించి, చివరికి ‘ఎవరబ్బా ఇంత చేస్తున్నాడ’ని విస్తుపోయే సమయంలో ఎదుటపడి దణ్నం పెట్టి, అతనిచేత ‘నీకేం కావాలి?’ అనిపించుకొని, తనవైపు యుద్ధం చేసేలాగ వక్రంగానే వరాన్ని పొందాడు. ఇలాగ అన్నీ కుచ్చితమైన పనులనే చేశాడు దుర్యోధనుడు. ఒక గొప్ప యోద్ధ చేయవలసిన పని ఒక్కటీ చేయలేదు. రాయబారానికి వచ్చిన కృష్ణుణ్ని బంధిద్దామని వెర్రి ప్రయత్నం కూడా చేసిన మూర్ఖుడు ఇతను. అతిబలవంతుడైన వృత్రుడు కూడా. ఇలాగ ‘అయోద్ధ’లాగే ప్రవర్తించాడని ఋగ్వేద సూక్తమొకదానిలో (1-32-6) మనకు అవుపిస్తుంది. అసలు వృత్రుడంటే, మన జ్ఞాన సూర్యుడికి అడ్డుగా వచ్చే అవిద్య అనే మబ్బు. దుర్యోధనుడు ‘కోరిక’కు ప్రతి రూపంగనకనే అతనూ ‘అయోద్ధ’ లాగానే భారతం పొడుగునా ప్రవర్తించాడు. తనది కాని రాజ్యాన్ని కోరుకొన్నవాడు, ఎదుటపడి అమీ తుమీ తేల్చుకొనే యుద్ధం చేసి, విజయమో వీరస్వర్గమో వరించాలి. అతనెప్పుడూ శకునినీ భీష్ముణ్నీ ద్రోణుణ్నీ కృపాచార్యుణ్నీ అశ్వత్థామనీ జయద్రథుణ్నీ కర్ణుణ్నీ అడ్డుపెట్టుకొని వాళ్ల దన్నుతోనే యుద్ధం చేయడానికి చూశాడు. చిట్టచివరికి తన పాలు వచ్చేసరికి నీళ్లల్లోకి వెళ్లి దాక్కున్నాడు. బయటికి వచ్చి ‘గదా’ యుద్ధానికి భీముడితో తలపడ్డప్పుడు, అతను మొదట్నుంచీ చివరిదాకా చేసిన ‘దగా’నే ఎదుర్కోవలసివచ్చింది. దెబ్బతీద్దామని పెకైగిరినప్పుడు, భీముడి గద అతని తొడలను పగలగొట్టింది. ‘గద’ బుద్ధికి ప్రతీక. దుర్యోధనుడి ‘గద’ ఎప్పుడూ ‘దగా’ చేద్దామనే ప్రయత్నించింది. ఇతన్ని ‘సుయోధనుడ’ని కొన్నిసార్లు పిలుస్తూ ఉంటారు. ‘సు’ అంటే ఇటువంటిచోట ‘మంచి’ అని అర్థంగాదు. ‘అతి’ అని అర్థం. ‘సుదారాచారుడ’నే ఒక ప్రయోగం భగవద్గీతలో అవుపిస్తుంది: దాని అర్థం ‘అతిదురాచారుడ’ని. అలాగే, ‘సుయోధనుడ’న్నా అతియుద్ధం చేసేవాడని అర్థం. అంటే, యుద్ధ నియమాలను తుంగలోకి తొక్కి యుద్ధం చేసేవాడని. ఏదోవిధంగా గెలవాలనే యావ తప్ప, ‘కోరిక’ ఎప్పుడూ సజావుగా ప్రవర్తించదు. ఏదోలాగ కబ్జాచేసి, తన పబ్బం గడుపుకుందామని చూస్తుంది. అభిమానం కాదు ఇతని ధనం, మోసమూ దగాను. పెద్దవాళ్లంటే ఏ కోశానా భయమూ లేదు భక్తీ లేదు. పిన్నా పెద్దా గురువూ తాతా అందరూ ‘కోరిక’ మాట వినవలసినవాళ్లే; దాని బలిపీఠమ్మీద చావవలసినవాళ్లే. కోరికను గెలిచినవాడే నిజమైన యోద్ధ. నిజమైన శూరుడు. - డాక్టర్ ముంజులూరి నరసింహారావు -
భయం కూడా మంచిదే!
ప్రతి మనిషికీ ఎంతో కొంత భయం, పెద్దలయం దు, గురువులయందు భయభక్తులు ఉండితీరాలి. ఈ ‘భయం’ గౌరవంతో కూడినదై ఉండాలి. అలా ఉంటే తప్పు చేసి పెద్దల మనసు నొప్పించకూడదనే భావన ఏర్పడుతుంది. మనిషి మంచి మార్గంలో నడవడానికి భయం తప్పనిసరి. ‘తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు’ అనే భయం ఉంటే, మనిషి తప్పు చేయడు. పెద్దలను తూలనాడితే నరకానికి పోతామని, అక్కడ భయంకరమైన శిక్షలు పడతాయనే భయం ఉంటే తప్పు చేయడానికి జంకుతారు. పరుల సొమ్మును అపహరిస్తే తమ సొమ్మును పోగొట్టుకుంటారనే భయం ఉంటే ఆ పని చేయటానికి సాహ సించరు. తల్లిదండ్రులను వీధిపాలు చేసి జల్సాగా గడిపేవారు, ముందు ముందు వారి పిల్లలు కూడా వారికి ఈ గతే కలిగిస్తారనే భయంతో ఉంటే, వారు పెద్దలను జాగ్రత్తగా చూస్తారు. దేనికైనా భయం ఒక్కటే ఉంటే సరిపోదు. గౌరవం, భక్తి, దైవం, విశ్వాసం, ప్రేమ, ఆదరం... వంటివి ఉంటే, పాపం చేయడానికి సాహసించరని పురాణాలు చెబుతున్నాయి. ప్రహ్లాదుడిని హింసించిన హిరణ్యకశిపుడు ఏ విధంగా మరణించాడో తెలిసిందే. సీతను అపహరించిన రావణుడు తన బంధువర్గాన్ని పోగొట్టుకోవడమేకాక తాను సైతం నేలకూలాడు. కంసుడు, కీచకుడు, దుర్యోధనుడు... ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందలమంది ఉన్నారు. వీరందరికీ ఉన్న ఒకే ఒక్క దుర్గుణం, తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తామనే భయం లేకపోవడమే. అందుకే ‘మంచి భయం’ మనిషిని నిరంతరం కాపాడుతూ ఉంటుందని పెద్దల మాటను ఆచరించడానికి ప్రయత్నించాలి.