పురాణాలలో స్నేహం గురించి, ఆదర్శ స్నేహితుల గురించి అనేక గాథలు ఉన్నాయి. కృష్ణుడు–కుచేలుడు, కర్ణుడు–దుర్యోధనుడు, రాముడు–సుగ్రీవుడు కథలు దాదాపుగా అందరికీ తెలిసినవే. పురాణాల్లో కొన్ని అరుదైన స్నేహ గాథలు కూడా ఉన్నాయి. అవి మాత్రమే కాదు, భగవంతుడినే తమ స్నేహితుడిగా తలచిన పరమ భాగవతోత్తముల పలు గాథలు పురాణాల్లోను, చరిత్రలోనూ ప్రసిద్ధి పొందాయి. లౌకికంగా కుదిరే స్నేహాలలో స్వార్థం, పరస్పర ప్రయోజనాలు ఉంటాయి. భగవంతుడితో కుదిరే స్నేహంలో అలాంటివేవీ ఉండవు. ఏమీ ఆశించని స్నేహం అది. ‘భగవంతుడే నా చెలికాడు’ అన్నాడు రామకృష్ణ పరమహంస. ఇలా భగవంతుడినే చెలికాడుగా తలచిన భాగవతోత్తములు భగవంతుడిని ఊరకే స్తోత్రాలతో ముంచెత్తడంతోనో, భగవంతుడిని గుడ్డిగా ఆరాధించడంతోనో సరిపెట్టుకోరు. బాల్యమిత్రులతో కలసి ఆటలాడినట్లుగానే భగవంతుడితో ఆటలాడతారు. ఆటల్లో అలిగినప్పుడు చెలికాళ్లతో తగవు పడ్డట్టే భగవంతుడితోనూ తగవుపడతారు. కోపం వచ్చినప్పుడు భగవంతుడిని తిట్టిపోయడానికి సైతం ఏమాత్రం మొహమాటపడరు. భగవంతుడినే చెలికాడిగా తలచే భక్తి భావాన్ని ‘సఖ్య భక్తి’ అంటారు. ‘సఖ్య భక్తి’ మార్గానికి ప్రాచుర్యం కల్పించిన గురువుల్లో చైతన్య మహాప్రభువు అగ్రగణ్యుడు. నవవిధ భక్తిమార్గాల్లో ఆత్మనివేదనం ఉత్తమోత్తమమైనదైతే, సఖ్యభక్తిని ఉత్తమమైన భక్తిమార్గంగా పరిగణిస్తారు ఆధ్యాత్మికవేత్తలు. ‘సఖ్యభక్తి’ మార్గంలో సాక్షాత్తు భగవంతునితోనే నెయ్యం నెరపిన కొందరు
భాగవతోత్తముల గాథలు కొన్ని...
శ్రీనివాసుడితో హాథీరామ్ బాబా పాచికలాట
భగవంతుడు భక్తులను పరీక్షించడానికి వారి జీవితాలతో ఆటలాడతాడని విరక్తి చెందిన కొందరు భక్తులు ఆడిపోసుకుంటారు గాని, సాక్షాత్తు భగవంతుడితోనే పాచికలాడిన భక్తుడు హాథీరామ్ బావాజీ. సఖ్యభక్తికి నిలువెత్తు నిదర్శనం ఆయన. ఉత్తరాదికి చెందిన హాథీరామ్ బావాజీ బాల్యం నుంచి రామ భక్తుడు. దేశాటనం చేస్తూ తిరుమల వచ్చాడు. తన చెలికాడైన రాముడే ఇక్కడ వేంకటేశ్వరుడిగా వెలసినట్లు తలచి, తిరుమలలోనే ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని స్థిరపడ్డాడు. ప్రతిరోజూ దేవదేవుడైన శ్రీనివాసుడిని దర్శించుకునేవాడు. కష్టసుఖాల ముచ్చట్లు చెప్పుకొనేవాడు. పరాచికాలాడేవాడు. హాథీరామ్ బావాజీ భక్తికి ముగ్ధుడైన శ్రీనివాసుడు రోజూ రాత్రివేళ ఆలయం విడిచి అతడి ఆశ్రమానికి వచ్చేవాడు. అక్కడే కూర్చుని అతడితో కలసి పాచికలాడేవాడు. ఒకసారి పాచికలాట దాదాపు తెల్లవారు జాము వరకు కొనసాగింది. భక్తులు తనను దర్శించుకునే వేళ కావడంతో హడావుడిగా ఆటను ఆపేసిన శ్రీనివాసుడు ఆలయానికి చేరుకున్నాడు. వేళకు ఆలయానికి చేరుకోవాలనే ఆతృతలో శ్రీనివాసుడు తన కంఠహారాన్ని బావాజీ ఆశ్రమంలో మరచిపోయాడు. ఆలయం తలుపులు తెరిచి చూసిన పూజారులు శ్రీనివాసుడి మెడలో కంఠహారం లేకపోవడాన్ని గుర్తించారు. హారం తస్కరణకు గురైందంటూ రాజుకు ఫిర్యాదు చేశారు. మాయమైన హారాన్ని వెదికి తేవాలంటూ భటులను ఆదేశించాడు రాజు.
శ్రీనివాసుడు తన ఆశ్రమంలో మరచిన హారాన్ని కాస్త ఆలస్యంగా గుర్తించిన బావాజీ, దానిని తిరిగి అప్పగించాలనుకున్నాడు. హారం తీసుకుని ఆయన బయటకు వచ్చేసరికే అక్కడకు చేరుకున్న భటులు ఆయనను పట్టుకుని, రాజు వద్దకు తీసుకుపోయారు. రాత్రి శ్రీనివాసుడు తనతో కలసి పాచికలాడాడని, పొరపాటు హారం మరచాడని, దానిని అప్పగించేందుకు తీసుకు వస్తుండగా తనను భటులు పట్టుకున్నారని రాజుతో చెప్పాడు బావాజీ. ఆయన చెప్పిన మాటలను రాజు నమ్మలేదు. ‘దేవదేవుడు ఒక మామూలు సన్యాసితో పాచికలాడటమా? రాజునైన నాతోనే పరాచికాలా?’ అంటూ ఆగ్రహించాడు. హాథీరామ్ బావాజీ తాను చెప్పినంతా నిజమేనని శ్రీనివాసుడు తన చెలికాడని నమ్మకంగా బదులిచ్చాడు. బావాజీ మాటలు నిజమో, కాదో తేల్చుకోవాలని తలచిన రాజు అతడిని పరీక్షించదలచాడు. బావాజీ ఆశ్రమ ప్రాంగణం నిండా చెరకుగడల గుట్ట వేయించాడు. రాత్రి తెల్లారేలోగా చెరకు పిప్పి అయినా మిగలకుండా ఖాళీ చేయాలని, అలా చేస్తేనే బావాజీ మాటలు నమ్ముతానని చెప్పాడు. ఆశ్రమంలోకి బయటి వారెవరూ వెళ్లడానికి వీలు లేకుండా భటులతో కాపలా ఏర్పాటు చేశాడు. హాథీరామ్ బావాజీ ఆశ్రమంలో చిద్విలాసంగా కీర్తనలు పాడుకుండా ఉన్నాడు. అర్ధరాత్రి వేళ భటులు కునికి పాట్లు పడుతున్న సమయంలో ఒక తెల్లని ఏనుగు వచ్చి, నిమిషాల్లో చెరకు గుట్టను ఖాళీ చేసేసి వెళ్లిపోయింది. ఉదయాన్నే ఆశ్రమానికి వచ్చి చూసిన రాజుకు అక్కడ చెరకు గుట్ట ఆనవాలే లేకుండా కనిపించడంతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. పరమ భాగవతోత్తముని పట్ల తన వల్ల అపరాధం జరిగినందుకు పశ్చాత్తాపం చెందాడు. నిజానికి హాథీరామ్ బావాజీ అసలు పేరు ఆశారామ్ బల్జోత్. అతడి ఆశ్రమానికి ఏనుగు రావడం వల్ల, బావాజీ తరచు రామనామ స్మరణ చేస్తూ ఉండటం వల్ల ఆయనకు హాథీరామ్ బావాజీ అనే పేరు స్థిరపడింది. ఆపదలో ఉన్న స్నేహితుడిని సాటి స్నేహితుడు కాపాడినట్లే బావాజీని సాక్షాత్తు భగవంతుడే దిగివచ్చి కాపాడాడు.
సూరదాసు గానానికి రాధాకృష్ణుల పరవశం
సూరదాసు పుట్టుక నుంచి అంధుడు. అంధుడైనందున కుటుంబ సభ్యులు అతడిని ఆదరించేవారు కాదు. సొంతవారి అనాదరణను భరించలేక అతడు ఆరేళ్ల వయసులోనే ఇల్లు వదిలిపెట్టాడు. యమునా నదీ తీరం వద్ద దిక్కుతోచని స్థితిలో ఉన్న అంధబాలకుడు సూరదాసును చూసిన వల్లభాచార్యులు అతడిని చేరదీసి, శిష్యునిగా స్వీకరిస్తారు. వల్లభాచార్యుల శిష్యరికంలో సూరదాసు సఖ్యభక్తి మార్గంలో రాధాకృష్ణులపై వేలాది కీర్తనలు రచించి, గానం చేశాడు. సూరదాసు కీర్తనలు గానం చేసేటప్పుడు రాధాకృష్ణులు స్వయంగా వచ్చి, అతడి గానానికి పరవశులయ్యేవారని ప్రతీతి. కృష్ణుడు ఒకసారి సూరదాసును
ఆటపట్టించిన సంఘటనపై ప్రచారంలో ఉన్న గాథ ఇది...ఒకసారి సూరదాసు ఒక వనంలో కూర్చుని గానం చేస్తుండగా, రాధాకృష్ణులు అతడికి చేరువలోనే కూర్చుని పరవశులై వినసాగారు. సూరదాసుని కాసేపు ఆటపట్టించాలనుకున్నాడు శ్రీకృష్ణుడు. అతడి వద్ద తననొక్కడినే విడిచి పెట్టి కాస్త దూరంగా వెళ్లమని రాధకు సూచించడంతో ఆమె అక్కడి నుంచి లేచి వెళ్లబోయింది. తన ముందు నుంచి ఎవరో పారిపోతున్నట్లు అనిపించడంతో సూరదాసు పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అతడికి చేతికి రాధ కాలు తగిలింది. అతడి చేతికి చిక్కకుండా రాధ కాస్త దూరంగా వెళ్లింది. అక్కడే రాలి పడిన రాధ కాలి అందె సూరదాసు చేతికి దొరికింది. తన అందెను ఇవ్వాల్సిందిగా రాధ అతడిని కోరింది. ఎవరో చెబితేనే ఇస్తానన్నాడు సూరదాసు. తాను రాధనని, కాలి అందె తనదేనని బదులిచ్చింది ఆమె. అంధుడైన తాను అందె గల మనిషిని చూడలేదని, అందె నీదేనని, నీవే రాధవని నమ్మేదెలా? అని ప్రశ్నించాడు సూరదాసు. అప్పుడు కృష్ణుడు అతడికి చూపు ప్రసాదించాడు. కళ్లెదుట రాధాకృష్ణులు కనిపించడంతో సూరదాసు పరవశుడయ్యాడు. రాధా కృష్ణులను చూసిన తాను ఈ పాడు లోకాన్ని చూడలేనని, తిరిగి తన చూపును తీసుకుపోవాలని సూరదాసు పట్టుబట్టడంతో కృష్ణుడు అతడి కోరికకు సరేనన్నాడు. నిండు నూరేళ్లు జీవించిన సూరదాసు కృష్ణుడినే చెలికాడుగా భావిస్తూ రచించిన కీర్తనలు నేటికీ అజరామరంగా నిలిచి ఉన్నాయి.
రాముడినే తిట్టిపోసిన భక్త రామదాసు
‘రామో విగ్రహవాన్ ధర్మః’ అనే ఆర్యోక్తిని నమ్మే మన దేశంలో రామభక్తులుగా చెప్పుకొనే వారెవరూ రాముడిని పల్లెత్తు మాట అనరు. వారంతా రాముడిని దైవంగా మాత్రమే ఆరాధిస్తారు. భక్త రామదాసు అలాంటిలాంటి భక్తుడు కాదు, ఇక్కట్లలో ఉన్న తనను ఆదుకోని రాముడిపై అలిగి అనరాని మాటలన్నీ అంటూ తిట్టిపోస్తాడు. రామదాసు అసలు పేరు కంచర్ల గోపన్న. ఆయన మేనమామలు అక్కన్న మాదన్నలు గోల్కొండ తానీషా కొలువులో పాలనా వ్యవహారాలు చూసేవారు. వారి ప్రాపకంతో గోపన్న పాల్వంచ పరగణా తహశీల్దారుగా ఉద్యోగం సంపాదిస్తాడు. రాముడు వెలసిన భద్రాచలం ఈ పరగణాలోనిదే. ఒకసారి భద్రాచలంలో జరిగిన జాతరకు వెళ్లిన గోపన్న అక్కడి శ్రీరాముని ఆలయం ఆలనపాలన లేకుండా ఉండటం చూసి చలించిపోతాడు. అక్కడ తారసపడిన పోకల దమ్మక్క అనే భక్తురాలు ‘అయ్యా! ఎలాగైనా నీవే ఆలయాన్ని బాగుచేయాలి’ అని కోరడంతో గోపన్న ఆలయ జీర్ణోద్ధరణకు సంకల్పిస్తాడు. గ్రామస్తులకు తన ఉద్దేశం చెప్పడంతో వారు కూడా ముందుకొచ్చి విరాళాలు ఇస్తారు. సేకరించిన విరాళాల సొమ్ము జీర్ణోద్ధరణ కార్యక్రమానికి కాస్త తక్కువ కావడంతో అప్పటికే తాను వసూలు చేసిన పన్నుల్లోని కొంత మొత్తాన్ని కలిపి, ఆలయ జీర్ణోద్ధరణ పూర్తి చేస్తాడు. సీతారాములకు బంగారు అలంకారాలను తయారు చేయిస్తాడు. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల మొత్తాన్ని ఆలయం కోసం ఖర్చుపెట్టాడంటూ కొందరు అతడిపై ఫిర్యాదు చేయడంతో ఆగ్రహించిన తానీషా గోపన్నకు పన్నెండేళ్ల శిక్ష విధించి, గోల్కొండలోని చెరసాలలో బంధిస్తాడు.
రాముడి ఆలయాన్ని పునరుద్ధరించిన పాపానికి తాను జైలు పాలవడాన్ని జీర్ణించుకోలేకపోతాడు. ఆపదలో ఉన్న తనను రాముడు ఆదుకోకపోతాడా అని ఎదురు చూస్తాడు. మొదట్లో ‘ఏ తీరుగ నను దయజూసెదవో ఇన వంశోత్తమ రామా’ అంటూ ప్రాధేయపడతాడు. ఫలితం లేకపోవడంతో కొంచెం చనువు తీసుకుని ‘సీతమ్మ తల్లీ చెప్పవే..’ అంటూ సీతమ్మవారితో సిఫారసు చేయించే ప్రయత్నం చేస్తాడు. అప్పటికీ ఉపయోగం లేకపోవడంతో రాముడిపై తిట్ల దండకాన్నే అందుకుంటాడు. ‘ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్రా..’ అంటూ నిలదీస్తాడు. ‘సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము..’ అంటూ ఏయే ఆభరణానికి ఎంతెంత ఖర్చు చేశాడో లెక్కలన్నీ పొల్లు పోకుండా ఏకరువు పెడతాడు. ఎంతైనా శిస్తులు వసూలు చేసే తహశీల్దారు కదా! తిట్టినవన్నీ నోరారా తిట్టేశాక ‘ఈ దెబ్బలకోర్వలేక తిట్టాను. ఏమీ అనుకోవద్దు’ అంటూ అనునయిస్తాడు.
భక్తుడు అన్ని తిట్లు తిట్టిపోసి, అంత మర్యాదగా అనునయ వాక్యాలు పలుకుతుంటే ఇక రాముడే ఉండబట్టలేక రంగంలోకి దిగుతాడు. లక్ష్మణుడితో కలసి మారువేషంలో తానీషాను కలుసుకుంటాడు. తమ పేర్లు రామోజీ, లక్షో్మజీ అని, గోపన్న స్నేహితులమని పరిచయం చేసుకుంటారు. ఆలయం కోసం పన్నుల మొత్తం నుంచి రామదాసు ఖర్చు చేసిన సొమ్మును చెల్లిస్తారు. తానీషాకు సొమ్ము ముట్టడంతో గోపన్న బంధ విముక్తడవుతాడు. నాటి నుంచి రామదాసుగా ప్రఖ్యాతుడవుతాడు. తెలుగునాట తొలి వాగ్గేయకారుడు భక్తరామదాసుకు రాముడిపై ఉన్నది తిరుగులేని సఖ్యభక్తి.
భక్త సాలబేగ్ కోసం ఆగిన జగన్నాథుని రథం
సాలబేగ్ జగన్నాథస్వామికి పరమ భక్తుడు. ముస్లిం మతస్తుడు కావడంతో అతడికి ఆలయ ప్రవేశానికి అనుమతి ఉండేది కాదు. రథయాత్రలో బలభద్ర సుభద్రలతో కలసి జగన్నాథుడు పూరీ పురవీధుల్లోకి వచ్చినప్పుడు మాత్రమే కులమతాలకు అతీతంగా భక్తులందరికీ దర్శనం లభిస్తుంది. జగన్నాథుడిపై సఖ్యభక్తితో కీర్తనలు రచించిన సాలబేగ్‌కు రథయాత్రలో ఎలాగైనా జగన్నాథుడిని తనివితీరా చూడాలనే కోరిక ఉండేది. సాలబేగ్ తండ్రి మొఘల్ చక్రవర్తుల వద్ద సుబేదారుగా ఉండేవాడు. యువకుడైన సాలబేగ్ తండ్రితో కలసి మొగల్ సేనల తరఫున యుద్ధాల్లో పాల్గొనేవాడు. ఒకసారి యుద్ధంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఇక ప్రాణాలు దక్కవేమో అనే పరిస్థితి. జగన్నాథుడిని వేడుకుంటే అతడే అన్నీ చూసుకుంటాడని తన తల్లి చెప్పడంతో ఆమె మాటపై జగన్నాథుడిని స్మరిస్తూ ఆశువుగా కీర్తనలు అల్లుతాడు. కొద్దిరోజులకే ఆశ్చర్యకరంగా కోలుకుంటాడు. జగన్నాథుడిని రథయాత్ర రోజున చూడాలని అనుకున్న దశలో రథయాత్ర వేడుకకు కొద్దిరోజుల ముందే అనారోగ్యానికి లోనవుతాడు. బయటకు కదల్లేని పరిస్థితి. తాను వచ్చేంత వరకు ముందుకు సాగిపోవద్దని జగన్నాథుడిని మనసులోనే కోరుకుంటాడు. యథావిధిగా రథయాత్ర మొదలవుతుంది. సాలబేగ్ ఇంటి వద్దకు వచ్చేసరికి ఇక రథం ముందుకు సాగదు. ఎందరు భక్తులు ఎంతగా బలప్రయోగం చేసినా, రథం అంగుళమైనా కదలదు. సాలబేగ్‌ను అప్పటికే భక్తుడిగా ఎరిగి ఉండటంతో పూజారులు విషయం గ్రహిస్తారు. సాలబేగ్‌కు కబురు పెడతారు. నెమ్మదిగా అతడు గుమ్మం దాటి బయటకు వచ్చి, జగన్నాథుడిని తనివితీరా చూసిన తర్వాతే రథం ముందుకు కదులుతుంది. ఒక ఆప్తమిత్రుడి ఇంటికి వచ్చినట్లే జగన్నాథుడు సాలబేగ్ ఇంటి వద్దకు వచ్చి దర్శనం ఇవ్వడం పూజారులను సైతం ఆశ్చర్యచకితులను చేసింది. సాలబేగ్ వయసు మళ్లి కన్నుమూశాక అతడి సమాధిని పూరీలో జగన్నాథుడి ఆలయం ఉండే బొడొదండొకు చేరువలోనే నిర్మించారు. ఇప్పటికీ జగన్నాథుడిని దర్శించుకునే భక్తులు భాగవతోత్తముడైన సాలబేగ్ సమాధిని కూడా తప్పక దర్శించుకుంటారు.
పురాణాదోస్త్ కృష్ణుడు–కుచేలుడు
శ్రీకృష్ణుడికి కుచేలుడికి మధ్యనున్న స్నేహం పురాణ స్నేహాలన్నింటిలోకీ తలమానికమైనది. శ్రీకృష్ణ బలరాములు సాందీపని మహాముని గురుకులంలో విద్యాభ్యాసం చేసే కాలంలో కుచేలుడు వారి సహాధ్యాయి. కుచేలుడు నిరుపేద బ్రాహ్మణ బాలకుడు. కుచేలుడి అసలు పేరు సుదాముడు. నిరుపేద అయినందున నలిగిన దుస్తులతో ఉండేవాడు. అందువల్ల అతడికి కుచేలుడనే పేరు వచ్చింది. విద్యాభ్యాసం తర్వాత కృష్ణుడు ద్వారక వెళ్లి రాజ్యభారం స్వీకరిస్తాడు. అష్టమహిషులను పెళ్లాడతాడు. కుచేలుడు సుశీల అనే వనితను పెళ్లాడతాడు. గంపెడు సంతానం కలగడంతో సంసారం ఈదడం కష్టమవుతుంది. భార్య సలహాపై కృష్ణుడిని చూడటానికి వెళతాడు. ఉత్త చేతులతో వెళితే బాగుండదని ఇంట్లో ఉన్న కొద్దిపాటి అటుకులను మూటగట్టి తీసుకువెళతాడు. కృష్ణుడు అతడిని ఆదరించి, సత్కరిస్తాడు. కృష్ణుడికి ఏమీ అడగకుండానే కుచేలుడు తిరిగి వెళతాడు. ఇంటికి వచ్చి చూస్తే పూరిగుడిసె కాస్త కృష్ణలీలతో భవంతిగా మారుతుంది. నాటి నుంచి కుచేలుడికి ఏ లోటూ ఉండదు.
రాముడు–సుగ్రీవుడు
పురాణాల్లోని స్నేహగాథల్లో రాముడికి సుగ్రీవుడికి గల మైత్రి కూడా ప్రసిద్ధి పొందింది. వీరిద్దరి మైత్రికి హనుమంతుడు అనుసంధానకర్తగా వ్యవహరించాడు. కిష్కింధ రాజ్యం నుంచి అన్న వాలి తరిమేయడంతో సుగ్రీవుడు తన సహచరులైన వానర పరివారంతో కలసి రుష్యమూక పర్వతంపై తలదాచుకున్నాడు. సుగ్రీవుడిని వాలి రాజ్యం నుంచి తరిమేయడమే కాదు, సుగ్రీవుడి భార్య రుమను చెరబట్టాడు. అలాంటి పరిస్థితుల్లో రామ లక్ష్మణులు సీత కోసం వెదుకులాడుతూ రుష్యమూక పర్వత ప్రాంతానికి చేరుకున్నారు. ధనుర్బాణాలతో వస్తున్న వారిని చూసి సుగ్రీవుడు మొదట భయపడ్డాడు. హనుమంతుడు అతడికి ధైర్యం చెప్పి, రామలక్ష్మణుల వద్దకు వెళ్లి ఎవరో, ఏమిటో తెలుసుకుంటాడు. సుగ్రీవుని వద్దకు తీసుకుపోయి పరిచయం చేస్తాడు. అన్యాయం చేసిన వాలిని వధిస్తానని మాట ఇస్తాడు రాముడు. సీతాన్వేషణలో తన వానరసేన సాయం చేస్తుందని బాస చేస్తాడు సుగ్రీవుడు. అన్న మాట ప్రకారమే రాముడు వాలిని వధిస్తాడు. సుగ్రీవుడి ఆధ్వర్యంలో వానరసేన లంకపై దండెత్తి రామ రావణ యుద్ధంలో తనవంతు పాత్ర పోషిస్తుంది.
సీత–త్రిజట
సీతను అపహరించిన రావణుడు ఆమెను లంకలోని అశోకవనంలో బంధిస్తాడు. రాక్షస వనితలను ఆమెకు కాపలాగా పెడతాడు. రావణుడి సోదరుడైన విభీషణుడి కూతురైన త్రిజట కూడా సీతకు కాపలా ఉండే వారిలో ఉంటుంది. రాముడిని తలచుకుంటూ శోకించే సీతను చూసి ఆమెకు జాలి కలుగుతుంది. తన పెదతండ్రి రావణుడు సీత పట్ల చేసిన దుర్మార్గానికి బాధపడేది. సీతను ఓదార్చేది. ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న సీతను ఆ ప్రయత్నం నుంచి వారించింది. సీతకు కాపలాగా ఉంటూ కునుకు తీసిన త్రిజటకు ఒక కల వచ్చింది. తనకు వచ్చిన కలను ఆమె సీతకు చెబుతుంది. తన కల ప్రకారం రావణుడి అంతం తప్పదని, రామలక్ష్మణులు లంకను జయించి, సీతను తీసుకుపోతారని చెబుతుంది. త్రిజటకు ఆ కల వచ్చిన తర్వాతే హనుమంతుడు లంకలో అడుగుపెట్టి లంకాదహనం చేస్తాడు. రావణ సంహారం జరిగిన తర్వాత సీత తనతో పాటే త్రిజటను కూడా పుష్పకవిమానంలో అయోధ్యకు తీసుకుపోయి, ఆమెను ఘనంగా సత్కరిస్తుంది.
కర్ణుడు–దుర్యోధనుడు
కర్ణుడికి దుర్యోధనుడికి గల మైత్రి కూడా పురాణాల్లో ప్రధానంగా ప్రస్తావించే మరో స్నేహగాథ. వీరి గాథలో స్నేహధర్మానికి కట్టుబడ్డ నిబద్ధత కర్ణుడిదైతే, కర్ణుడి అండతో అర్జునుడిని ఎదుర్కోవాలనే స్వార్థం దుర్యోధనుడిది. కౌరవ పాండవుల విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ద్రోణుడి ఆధ్వర్యంలో క్షాత్ర పరీక్ష జరుగుతుంది. అందులో పాల్గొనడానికి వస్తాడు కర్ణుడు. ఇది క్షాత్ర పరీక్ష అని, ఇందులో క్షత్రియ పుత్రులు మాత్రమే పాల్గొనాలని, సూతపుత్రుడైన కర్ణుడికి అందులో పాల్గొనే అర్హత లేదని అభ్యంతరపెడతాడు ద్రోణుడు. అర్జునుడిని ఎదిరించడానికి తగిన వీరుడు కర్ణుడేనని తలచిన దుర్యోధనుడు గురువు మాటకు ఎదురు చెబుతాడు. ‘కర్ణుడికి రాజ్యాధికారం లేకపోవడమే మీ అభ్యంతరమైతే, ఇప్పుడే అతడికి రాజ్యాభిషిక్తుడిని చేస్తాను’ అని పలికిన దుర్యోధనుడు అప్పటికప్పుడే అతడికి అంగరాజ్యాన్ని ధారపోస్తాడు. నిండుసభలో శాస్త్రోక్తంగా అభిషేకం జరిపిస్తాడు. సభలో తనకు అవమానం ఎదురైనప్పుడు తనను ఆదరించి, రాజ్యాభిషిక్తుడిని చేసిన దుర్యోధనుడితో మైత్రీబంధాన్ని ఏనాటికీ వదులుకోనని బాస చేస్తాడు కర్ణుడు. అప్పటి నుంచి దుర్యోధనుడికి బాసటగా ఉంటూ, చివరకు కురుక్షేత్ర యుద్ధంలో తన ప్రాణాలు ధారబోస్తాడు.
– పన్యాల జగన్నాథదాసు
Comments
Please login to add a commentAdd a comment