రాజు, ప్రధాని మధ్య వెల్లివిరిసిన స్నేహబంధం
ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్, నాటి ప్రధాని ఫక్రుల్‌ముల్‌్క...
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఒక అందమైన నగరం. నాలుగు వందల ఏళ్ల చారిత్రక సోయగం. ప్రేమ పునాదులపై వెలసిన భాగ్యనగరం ఇది. విభిన్న మతాలు, భాషలు, సంస్కృతులు ఒకే పాదు నుంచి పూచిన పూలై వికసించాయి. వైవిధ్యభరితమైన స్నేహ సంబంధాలు వెల్లివిరిశాయి. హైదరాబాద్ అంటేనే ఆతీ్మయమైన నగరం. ఎంతోమంది గొప్ప స్నేహితులు ఈ నేలపైన పుట్టిపెరిగారు. చరిత్రను సృష్టించారు. ఆదర్శప్రాయమైన స్నేహితులుగా నిలిచారు.
నిజాం నవాబుల కాలంలో రాజులకు, ఉన్నతాధికారులకు మధ్య చక్కటి స్నేహ సంబంధాలు ఉండేవి. ఆధునిక హైదరాబాద్ నిర్మాణాన్ని, అభివృద్ధిని పరుగులు పెట్టించిన దార్శనికుడు ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్, ఆయన దగ్గర ప్రధానమంత్రిగా పనిచేసిన నవాబ్ ఫక్రుల్‌ముల్క్ బహదూర్. ఇద్దరూ గొప్ప స్నేహితులుగా చరిత్రలో నిలిచిపోయారు. హైదరాబాద్ అభివృద్ధికి వారిద్దరూ కలిసి ప్రణాళికలను రూపొందించారు. హైదరాబాద్ చరిత్రను మలుపు తిప్పారు. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆదర్శప్రాయమైన, అజరామరమైన వారి స్నేహంపైన ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇది.
అది స్వర్ణయుగం..
ఆ ఇద్దరి స్నేహం హైదరాబాద్ చరిత్రలో స్వర్ణ యుగం. మీర్ మహబూబ్ అలీఖాన్ ఆధునిక హైదరాబాద్ నగరానికి బాటలు పరిచిన గొప్ప పాలకుడు. ఆయన ఆశయాన్ని, ఆలోచనలను ఆచరణలో పెట్టిన పరిపాలనాదక్షుడు ఫక్రుల్‌ముల్‌్క. విధినిర్వహణ దృష్ట్యా ప్రధానమంత్రి. ఇద్దరి అభిరుచులు చాలా వరకూ ఒకేవిధంగా ఉండేవి. 1892 నుంచి 1901 ఫక్రుల్‌ముల్క్ ప్రధానిగా పనిచేశారు. ఇంచుమించు సమయసు్కలు కావడం వల్ల వారి మధ్య స్నేహం ఏర్పడింది. నాలుగు దశాబ్దాల పాటు ఆ స్నేహం కొనసాగింది.. బహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్ప ప్రతిభావంతుడైన ఫక్రుల్‌కు సంగీతం, సాహిత్యం అంటే ఎంతో ఇష్టం.
మహబూబ్ అలీఖాన్ కూడా గొప్ప సాహిత్యాభిరుచి కలిగిన వ్యక్తి. ఇద్దరూ కలిసి కవి సమ్మేళనాలు, ముషాయిరాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వేడుకల్లో పాల్గొనేవారు. ఉర్ధూ సాహిత్య వికాసం కోసం మహబూబ్ అలీ ఎంతో కృషి చేశారు. ఆధునిక విద్యకు శ్రీకారం చుట్టింది ఆయనే. ఎంతోమంది కవులను, కళాకారులను. పండితులను ప్రోత్సహించారు. ఇద్దరు థారి్మక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అండగా నిలిచారు. అనాథలు, నిస్సహాయులను ఆదుకొనేందుకు ఫక్రుల్ స్వచ్ఛంద సంస్థలకు ధారాళంగా విరాళాలు ఇచ్చేవారు. నిజాంకు అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా అనేక సమావేశాల్లో, విధానపరమైన అంశాల్లో కీలకంగా వ్యవహరించారు.
‘విజన్ హైదరాబాద్’ లక్ష్యంగా...
భావితరాల అవసరాలను, నగర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ‘విజన్ హైదరాబాద్’ లక్ష్యంగా ఇద్దరూ కలిసి అనేక నిర్మాణాలను కొనసాగించారు. రహదారులను నిర్మించారు. కొత్త భవనాలను కట్టించారు. నాటి సంపన్నులు, నవాబుల పిల్లల ఉన్నత చదువుల కోసం 1887లోనే నిజామ్స్ కళాశాలను నిర్మించారు. అనంతర కాలంలో అన్ని వర్గాలకూ చేరువైంది. బాలికల విద్య కోసం మహబూబియా కళాశాల, హైకోర్టు భవనం, అసెంబ్లీహాల్, రైల్వే నిర్మాణం, టెలిఫోన్, బ్యాంకింగ్ వ్యవస్థ, తాగునీటి వ్యవస్థ వంటి కార్యక్రమాలు మహబూబ్ అలీ హయాంలో చేపట్టినవే. స్కూళ్లు, కళాశాలలు కట్టించారు. ఈ నిర్మాణాలన్నింటిలోనూ నిజాంకు ఫక్రుల్ కుడిభుజంగా నిలిచారు.
ఎర్రమంజిల్ ఒక కళాఖండం..
ఆ ఇద్దరి అపురూపమైన, ఆదర్శప్రాయమైన స్నేహానికి చిహ్నంగా ఫక్రుల్ అద్భతమైన ఎర్రమంజిల్ ప్యాలెస్‌ను కట్టించాడు. ఇండో యూరోపియన్ శైలిలో నిర్మించిన ఈ రాజ మందిరం అద్భుతమైన మాన్యుమెంట్‌గా నిలిచింది. ఎత్తయిన ప్రదేశంలో ఈ అందమైన ప్యాలెస్‌ను కట్టించారు. 1890లో నిర్మాణ పనులు ప్రారంభించగా పదేళ్ల పాటు పనులు కొనసాగాయి. 1900లో ఈ భవన నిర్మాణం పూర్తయింది. దేశంలోని మొఘల్, కుతుబ్‌షాహీ వాస్తు శిల్పాన్ని, యురప్‌లోని విక్టోరియన్, గోథిక్ నిర్మాణ శైలిని మేళవించి ఈ చారిత్రక కట్టడాన్ని నిర్మాంచారు. ఫక్రుద్దీన్ నివాస మందిరం ఇది. సభలు, సమావేశాలు, వేడుకలు, విందులు, వినోదాలతో ఈ ప్యాలెస్ నిత్యం సందడిగా ఉండేది.
Comments
Please login to add a commentAdd a comment