ఈ కడుపుకోత ఇంకో తల్లికెందుకు! | Storys on Chaganti Koteshwara Rao Pravechanalu | Sakshi
Sakshi News home page

ఈ కడుపుకోత ఇంకో తల్లికెందుకు!

Published Sun, Nov 17 2019 5:34 AM | Last Updated on Sun, Nov 17 2019 5:34 AM

Storys on Chaganti Koteshwara Rao Pravechanalu - Sakshi

కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. శిబిరాలు వేసి ఉన్నారు. ఉప పాండవులు యుద్ధభూమికి వెళ్ళలేదు. చిన్న పిల్లలు. గాఢనిద్రలో ఉన్నారు. అశ్వత్థామకు ఉన్మాదం కలిగింది. తొడలు విరిగిపోయి పడి ఉన్న దుర్యోధనుడి దగ్గరకు వెళ్ళి ‘నీ పగను నేను చల్లారుస్తా’ అన్నాడు. పాండవులమీదికి యుద్ధానికి వెళ్లడం ఎలా! రాత్రివేళ ఆలోచిస్తూ కూర్చున్నాడు. అకస్మాత్తుగా ఎక్కడినుంచో ఒక గుడ్లగూబ వచ్చి చెట్టుమీద ఉన్న ఒక పక్షి గూట్లో పెట్టిన పిల్లలను తన వాడి ముక్కుతో చీల్చి చెండాడేసింది. అది చూసిన అశ్వత్థామ పిచ్చెక్కిన వాడిలా అయిపోయాడు. శిబిరం మీద పడిపోయి నిద్రపోతున్న ధృష్టద్యుమ్నుడి కంఠాన్ని తుంచేసాడు. ఏనుగుల కుంభస్థలాలు బేధించాడు. గుర్రాల్ని చంపేసాడు.

ఐదుగురు ఉపపాండవుల కుత్తుకలు కత్తిరించేసాడు. ఇన్నీ చేసాక అర్జునుడు గుర్తొచ్చాడు. ఐదుగురి కొడుకులను చంపానని తెలిస్తే నన్ను బతకనీయడనుకుని పారిపోయాడు. మరునాడు ద్రౌపదీ దేవి ఏడుస్తున్నది. పాండవులు తిరిగొచ్చారు. అంతకన్నా కష్టం లోకంలో మరొకటి ఉంటుందా ఏ స్త్రీకయినా! ముందు ఐదుగురి శవాలు పెట్టుకుని గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నది.. ‘నీ కొడుకులను తెగటార్చిన వాడిని పట్టి తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పారేస్తా, నీ ఇష్టమొచ్చినట్లు శిక్షించు’ అన్నాడు అర్జునుడు. అన్నట్లే అశ్వత్థామను పశువును కట్టినట్లు కట్టి తీసుకొచ్చి ద్రౌపది ముందు పడేసాడు.

వీడే నీ పుత్రులను చంపినవాడు, నీ కాలుతో వీడి తల తన్ను– అన్నాడు. ద్రౌపదీదేవి అశ్వత్థామ దగ్గరకు వెళ్లి–అయ్యా! నా కొడుకులు యుద్ధభూమికి రాలేదు.కవచం కట్టుకోలేదు. ఏ అస్త్ర ప్రయోగం చేయలేదు. అటువంటి పిల్లలు నిద్రపోతున్న వేళ రాత్రికి రాత్రి కబళించేసావా? నీకు చేతులెలా ఆడాయి?’ అంది. ఐదుగురు భర్తలు నిలబడి ఉన్నారు. ఆవేశంతో ఊగిపోతున్నారు. ఊ.. అంటే చాలు భీమసేనుడు అశ్వత్థామ తలను వేయి వక్కలు చేసేస్తాడు. కానీ ఆ క్లిష్ట సమయంలో ఆవిడ ఏమన్నదో తెలుసా...‘కొడుకులు చచ్చిపోయి నేను ఏడుస్తున్నా.

ద్రోణాచార్యుల వారితో కలిసి సహగమనం చేయకుండా ద్రోణుడి భార్య ఉన్న ఒక్క కొడుకు కోసమని ఇంటిదగ్గరుంది. ఆమె కొడుకు చచ్చిపోలేదు. నా ఐదుగురు బిడ్డల్ని చంపేసాడనే కోపంతో పాండవులు అశ్వత్థామను ఎక్కడ చిత్రవధ చేసేస్తారన్న భయంతో ఎంత ఏడుస్తోందో! గురుపత్ని ఏడుపు మన వృద్ధికి ప్రతిబంధకం కాకూడదు. వీడిని మనం చంపకూడదు. వీడు చేసిన తప్పు వీడినే కాల్చేస్తుంది. నేను పడుతున్న బాధ నాకు తెలుసు. వేరొక తల్లి ఎందుకు పడాలి. వదిలిపెట్టేయండి’’ అన్నది. అంత గొప్పగా మాట్లాడడం, ధర్మానికి కట్టుబడడం తెలిసిన మహాతల్లులు పుట్టిన జాతి ప్రపంచంలో ఎక్కడయినా ఉంటే–అది సనాతన ధర్మంలో మాత్రమే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement