పిందె.. పండు...వైరాగ్యం | Grihasthashram Importance chaganti koteswararao Special Article | Sakshi
Sakshi News home page

పిందె.. పండు...వైరాగ్యం

Published Mon, Sep 2 2024 10:33 AM | Last Updated on Mon, Sep 2 2024 10:33 AM

Grihasthashram  Importance chaganti koteswararao Special Article

గృహస్థాశ్రమ వైశిష్ట్యం 

రుషిరుణం, పితృరుణం, దేవరుణం... ఈ మూడు రుణాలు తీరాలంటే ధర్మపత్ని సహకారం ఉండి తీరాలి. అంటే నీవు గృహస్థాశ్రమ ప్రవేశం చేస్తున్నావు. అప్పుడు నీవు ఏమి చేసినా అవి ధర్మంతో కట్టుబడి ఉంటాయి. చేయవలసినవి చేస్తూ తరించి΄ోతుంటావు. కారణం– అడుగున ధర్మం ప్రవహిస్తూ ఉంటుంది. అందువల్ల నీ కర్మలన్నీ   శాపాలను విప్పేస్తుంటాయి. అందుకే ఈ తేలిక మార్గాన్ని నిర్దేశించారు. అది లేక΄ోతే ఇంద్రియాలు అకస్మాత్తుగా కాటువేసే అవకాశం ఉంది. అంటే ధర్మచట్రంలో ఉన్న అర్ధకామాలు దేనినయినా అనుభవించు... క్రమ క్రమంగా ఒక వయసు వచ్చేసిన తరువాత ధర్మానుష్ఠాన బలం వైరాగ్య సుఖాన్నిస్తుంది. క్రమేణా ఒక నిరాసక్తత, ఒక అనుభవం బయల్దేరుతుంది లోపల. అంటే బలవంతంగా అంటించుకున్నది కాదు, అది ఈశ్వర కృపతో వచ్చేది. 

వైరాగ్యమంటే.. ఈ సుఖాలన్నీ ఒక సుఖాలా... అనిపించడం... ఏమీ పట్టించుకోకుండా అని కాదు. గాలి తన పని తాను చేసుకు΄ోతుంటుంది. జాజి పందిరి మీదినుంచి ΄ోతే పరిమళభరితం అవుతుంది..అప్పుడు గాలిని అభినందిస్తే ΄÷ంగి΄ోదు. ఒక కళేబరం మీది నుంచి΄ోయినప్పుడు దుర్గంధాన్ని వ్యాపింపచేస్తుందని అభిశంసిస్తే అది కృంగి΄ోదు. దాని పని అది చేసుకుంటూ ΄ోతుంది. అలా ΄÷ంగి΄ోవడాలు, కుంగి΄ోవడాలు లేకుండా... నీ కర్తవ్యం నీవు చెయ్యాలి. నీ నిజాయితీ నీ అంతరాత్మకు, ఈశ్వరుడికి తెలిస్తే చాలు..‘‘లోకుల్‌ నన్గని మెచ్చనీ యలగనీ లోలోన నిందించనీ/ చీకాకున్‌ బడనీ మహాత్ముడననీ../ మూకీభావమునన్‌ తిట్టనీ త్రోయనీ / నీ కారుణ్యము కల్గి ఉండినను అంతేచాలు నోశంకరా!’’ అంటారు శంకరాచార్యులు. నీ స్వచ్ఛత ఈశ్వరుడికి తెలిసినంత కాలం నీవు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఆయన ముందు కూడా నీవు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తే... పూజామందిరంలోకి వెళ్ళు.. లెంపలేసుకుని క్షమాపణలడుగు.‘ఈశ్వరా! నా వల్ల ఇటువంటి అపరాధం మళ్ళీ జరగకుండు గాక!’ అని శరణువేడుకో. చాలు.

ఎవరయితే ద్వంద్వాలకు అతీతులయిపోతున్నారో వారు నాకు దగ్గరవుతున్నట్లు.. అంటాడు గీతాచార్యుడు. వైరాగ్యం క్రమంగా సత్యాన్ని అంగీకరించే స్థాయికి తీసుకువెడుతుంది. సూర్యోదయ సూర్యాస్తమయాల్లో ఆయుర్దాయం కరిగిపోతున్నది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. ఈ శరీరం ఉండగానే నీవు చేయవలసిన కర్తవ్యాలు నెరవేర్చు. సద్వినియోగం చేసుకో. అంటే మంచి విషయాల్లోనే అనురక్తి ఉంటుంది తప్ప లౌకిక విషయాలపట్ల నిరాసక్తత పెరగడమే వైరాగ్యం. ‘కోటిమంది వైద్యులు కూడి వచ్చినకాని మరణమన్న వ్యాధి మాన్పలేరు’. అంటే ఈ వైరాగ్యం ఎప్పుడు వస్తుంది..?. పిందెకూ పండుకూ తేడా తెలుసుకుంటే ఈ ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. పిందె పట్టుకుని ఉండాలి. పండు తనంతటతాను విడి΄ోయి పడి΄ోవడానికి సిద్ధంగా ఉండాలి. అంటే పట్టుకోవాల్సిన వయసులో అన్నీ పట్టుకో... ధర్మబద్ధంగా. విడవాల్సి వచ్చినప్పుడు నిస్సంకోచంగా విడిచేసెయ్‌. కొబ్బరికన్నా పెంకును గట్టిగా పట్టుకునే వాళ్ళు ఎవరుంటారు... నీళ్ళు లోపలికి ఎప్పుడు ఎలా వెళ్ళాయో తెలియదు, ఎలా ఆవిరయ్యాయో తెలియదు. లోపల గురుగుడుమంటూ ఉంది... అంటే విడిపోయింది. పూర్ణాహుతికి పనికొస్తుంది. అంటే ఈ శరీరం నేను కాదు...ఆత్మ అని అనుభవంలోకి రావడమే వైరాగ్యం. దీనికి ఈశ్వరకృప ప్రధానమయినా, నీ కర్మాచరణ లేకుండా ఈశ్వర కృప ఉండదు.

 


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement