గృహస్థాశ్రమవైశిష్ట్యం
ధర్మచక్రం
గృహస్థాశ్రమంలో నిత్యం జరిగే పంచ మహా యజ్ఞాలలో మూడవది – హోమోదైవో.. దేవ యజ్ఞం. వేదమంత్రాల పఠనంతో భగవంతుడిని ఉద్దేశించి హోమం చేస్తూ నైవేద్యాలను సమర్పించాలి – హుతో హోమః... అంటే యజ్ఞయాగాది క్రతువులు. మహాభారతంలో శాంతిపర్వంలో అంపశయ్యమీద పడుకుని భీష్మాచార్యుల వారంటారు..‘‘అసలు ధర్మానికంతటికీ ఇరుసువంటివాడు గృహస్థు... ఓ ధర్మరాజా! గృహస్థులేని నాడు ఈ సృష్టే లేదు. గృహస్థులేని నాడు ఈ ధర్మచక్రం తిరగనే తిరగదు.’’ అని. అగ్ని ద్వారా దేవతలకు హవిస్సును గృహస్థే ఇస్తాడు. ఇతర ఆశ్రమాల వాళ్ళు ఇవ్వరు. గృహస్థు ఇచ్చిన హవిస్సును దేవతలు తిని సంతుష్ఠులై వర్షం కురిపిస్తారు... ఎక్కడ..? గృహస్థు ఇంట్లోకాదు, ఆ ్ర΄ాంతమంతా కురిపిస్తారు. ‘‘అన్నద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః/ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మసముద్భవః... ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః/ అఘాయురింద్రియారామో మోఘం పార్థ స జీవతి’’... అంటే ఇది ఒక చక్రం. తిరుగుతోంది. ప్రాణులు పుట్టాలి అంటే అన్నం (ఆహారం) తినాలి. అన్నసారం స్త్రీలో శోణితంగా, పురుషునిలో శుక్రంగా మారి రెండూ కలిసి సృష్టి జరగాలి. బిడ్డలు పుట్టాలి. దీనికంతటికీ మూలమైన అన్నం పుట్టాలంటే పంటలు పండాలి.. అంటే వర్షం పడాలి... వర్షం పడాలంటే... యజ్ఞం జరగాలి.
అన్నం, నీరు ఎంత కాలం దొరుకుతాయో అంతకాలమే ధర్మం ఉంటుంది. వాటిలో మొదట నీరు. ఇవి దొరకనప్పుడు ఎన్ని ధర్మాలు, నీతులు, ప్రవచనాలు చెప్పినా వినేవారు కానీ, ΄ాటించేవారు కానీ లోకంలో ఉండరు. ధర్మం తప్పి΄ోతుంది. ‘ఆ΄ోవా ఇదగుం సర్వం...అమృతం వా ఆపః...’’ నీరు అమృతం. ్ర΄ాణులన్నీ ఆ నీటి మీదే ఆధారపడి ఉన్నాయి. అన్నం, నీరు కావాలంటే వర్షం పడాలి... అలా పడాలంటే యజ్ఞం చేయాలి. యజ్ఞ కర్మ సముద్భవమ్... కర్మ చేస్తే వస్తుంది. అదెవరు చేయాలి?... ఒక్క గృహస్థు మాత్రమే.. పక్కన ధర్మపత్నితో కూడుకుని ఉన్నవాడు మాత్రమే యజ్ఞాన్ని చేస్తాడు. అప్పుడు ఈ సృష్టి ఏర్పడుతుంది, నిలబడుతుంది, లయమవుతుంది. ప్రశాంతత కలుగుతుంది. అందరూ నిర్వర్తించాల్సిన ధర్మాన్ని అందరూ నిర్వర్తిస్తున్నారు. కాబట్టి ధర్మచక్రం సవ్యంగా తిరుగుతుంది.
ఎంత సంపన్న కుటుంబంలో పుట్టిన వాడయినా తల్లిపా లమీద ఆధారపడాల్సిందే. తల్లి లేకపోతే సృష్టి లేదు. అలాగే గృహస్థాశ్రమం మిగిలిన అన్ని ఆశ్రమాలకు తల్లిలాంటిది. ఆ గృహస్థులేని నాడు మిగిలిన ఆశ్రమాల వాళ్ళకు భిక్ష లేనే లేదు... ఈ మాటలు నావి కావు.. మహాభారతంలో శాంతిపర్వంలో భీష్ముడు చెప్పినవి. రామాయణంలో అయోధ్యకాండలో భరతుడు కూడా ఇదే అంటాడు..‘‘అన్నయ్యా ! నీకు తెలుసు కదా! గార్హస్థ్యం శ్రేష్టమాశ్రమం... నాలుగు ఆశ్రమాలలో గృహస్థాశ్రమమే గొప్పది.’’
‘హోమో దైవో బలిర్భౌతో...’’ హవిస్సు ద్వారా దేవతలకు అన్నం పెట్టిన గృహస్థుకు సమస్త భూతములు, ప్రాణులను కూడా పోషించే కర్తవ్యం ఉంది. భీష్ముడు మరో మాట కూడా చెప్పాడు... గృహస్థాశ్రమంలో ఉన్నవారు ఎప్పడూ సంసార లంపటంలో పడి ఉంటారు, వారు అగాధంలో పడి΄ోయారని అనుకుంటున్నావేమో ... గృహస్థుకు మోక్షం లేదని ఎవరన్నారు !!! దేవతలకు అన్నం పెడుతున్న గృహస్థుకు కూడా మోక్షం లభిస్తుంది.
-చాగంటి కోటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment