గృహస్థాశ్రమ వైశిష్ట్యం
అతిథిని పూజించేవాడు ఒక్క గృహస్థు మాత్రమే. అలా గౌరవించడంలో ఎంత లీనమయి ఉంటారంటే అసలు భగవంతుడే స్వయంగా వచ్చినా ఏమరుపాటు పొందుతారు. సీతారాముల విగ్రహాలను అలంకరించడానికి తులసీదాసు గంధం తీస్తుంటాడు. రామలక్ష్మణులు స్వయంగా అతిథులుగా వస్తారు. వచ్చి ఆ గంధం తమకు పూయమంటారు. ఇది సీతారాములకే మీకు కాదు వెళ్ళండంటాడు. వారు వెళ్ళబోతుంటే.. హనుమ చిలకరూపంలో వచ్చి అసలు విషయం చెబుతాడు. రాజకుమారుల రూపంలో ఉన్న వారిని అప్పుడు చందనాదులతో సేవించి దర్శనం పొందుతాడు తులసీదాసు.
ఇక్కడ నీకున్నదేదో ఇక్కడ శరీరం వదిలిపెట్టేయడంతోనే సరి. కానీ ఈ శరీరంతో ఉండగా నలుగురికి పనికివచ్చే మంచి పని చేసినప్పుడు అది మాత్రమే పుణ్యంగా నీ వెంట వస్తుంది. మనం ఈ శరీరాన్నిగానీ, ద్రవ్యాన్నిగానీ, శక్తినిగానీ దేనిని వాడకుండా దాచుకోవడం సాధ్యమయ్యేది కాదు. అది కాలంతో వెళ్ళి΄ోవలసిందే. మెరుపు ఎలా వచ్చిపోతుంటుందో అలా భోగాలు వచ్చి పోతుంటాయి తప్ప వాటి వలన ఏ ఫలితమూ ఉండదంటారు శంకరాచార్యుల వారు. సూర్యోదయాలు, చంద్రోదయాలు వస్తుంటాయి, పోతుంటాయి.. ఆయుర్దాయం కరిగిపోతుంటుంది. ఆయువు ఉన్న కాలంలో ఎవరు తమ జీవితాన్ని పండించుకుంటారో వారు గట్టెక్కుతారు. ఆ అదృష్టం అతిథిపూజ చేసిన గృహస్థుకు సులభంగా దక్కుతుంది. అతిథి కూడా ఏ అవసరం వచ్చినా గృహస్థుదగ్గరకే ΄ోతాడు తప్ప ఇతర ఆశ్రమాలవారిని ఆశ్రయించడు. మన దేశ ద్రవ్యం మన దేశంలోనే చెల్లుబాటవుతుంది కదా. ఇతర దేశాలకు ΄ోవాలంటే విదేశీమారక ద్రవ్యం అవసరం. అలాగే ఇక్కడ చేసిన మంచిపని .. మారక ద్రవ్యంలాగా శరీరం విడిచిపెట్టినా పుణ్యం రూపంలో నీ వెంట వస్తుంది.
గృహస్థాశ్రమంలో మరో విశేషం ఉంది. దంపతుల మనసు ఏకీకృతమయితే పరమ సంతోషంగా, పరమ ప్రశాంతంగా జీవితం హాయిగా గడుస్తుంది. సాధారణంగా ఇద్దరున్నప్పుడు ఒకరు మరొకరితో ముఖాముఖి మాట్లాడితే తప్ప ఒకరి భావాలు మరొకరికి అర్థం కావు. కానీ దాంపత్యంలో అది పండిందని గుర్తు ఏమిటంటే – ఆయన ఆమెతో, ఆమె ఆయనతో నోరు విప్పి మాట్లాడనక్కరలేదు. అలా చూపులు చాలు భావ ప్రసరణకు,. ఆ స్థాయికి చేరుకోవడం అంటే రెండు మనసులు ఒకటి కావడం.
సీతమ్య ఏ పని చేసినా దీనివలన మా ఆయన కీర్తినిలబడుతుంది గదా అని ఆలోచిస్తుందట. రాముడు ఏ పని చేసినా దీనివల్ల సీత సంతోషిస్తుంది గదా! అని ఆలోచిస్తుంటాడట. కొంతకాలం గడిచాక ఒకరికి ఏ అవసరం వచ్చినా మరొకరు అడగాల్సిన పనిలేకుండానే దానిని నెరవేరుస్తారు.
పట్టాభిషేక ఘట్టం. అందరికీ అన్నీ ఇచ్చేసారు. చిట్టచివర సీతమ్మ తన మెడలోంచి హారం తీసి పట్టుకున్నది. నీ ప్రశాంతతకు, మన దాంపత్యానికి, మన కలయికకు కారుకులయిన వారికి దానిని అనుగ్రహించు అన్నాడు రాముడు. వెంటనే సీతమ్మ దానిని హనుమకు ఇచ్చేసింది. రాముడు ఫలానా అని పేరు చెప్పక΄ోయినా ఆమె గ్రహించేసింది. దాంపత్యం పండినప్పుడు ఆయన మనసు ఆవిడ దగ్గర, ఆవిడ మనసు ఆయన దగ్గర ఉంటాయి. కారణం – రెండంటూ ఉంటే కదూ.. ఉన్నది ఒకటే అయిపోతుంది.
- చాగంటి కోటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment