మంచి మాట
గృహస్థాశ్రమ ప్రవేశం చేయడానికి ఒక యువకుడికి, ఒక యువతికి ఉండవలసిన సాధారణ లక్షణాలు ఐదింటిని శ్రీరామాయణం నిర్దేశించింది. వాటిలో మొదటిది శీలం. అంటే స్వభావం. అది పుట్టుకతో వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. కొంతమందికి సంగీతం, కొంతమందికి ఆధ్యాత్మిక చింతన, మరికొందరికి చిత్రలేఖనం.... అలా అది వారికి బాగా ఇష్టమైన విషయంగా ఉంటుంది. పెళ్ళి సంబంధం చూసేటప్పుడు ఒకరికి ఇష్టమైన విషయం మరొకరికి కూడా ఇష్టమేనా, అయిష్టం లేదు కదా.. అని చూస్తారు. ఆ పరిశీలన పెద్దలు చేస్తారు.
తరువాత వయస్సు. ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్నది ఉండదు. రెండు కళ్ళల్లో ఏది మంచిదంటే ఏమని చెప్పగలం? బండి చక్రాలు రెండూ సమన్వయంతో పనిచేయాలి. జీవితం నుండి మొదట ఆయన నిష్క్రమిస్తే.. ఆవిడ పుణ్యకార్యం చేయదు. ఆమె వెళ్ళి΄ోతే...ఆయన తమ కడుపున పుట్టిన కూతురును కూడా కన్యాదానం చేయలేడు. ఆవిడ నిష్క్రమణతోనే ఆయనకు పుణ్యకార్యం చేసే అధికారం కూడా ΄ోతుంది. అందువల్ల ఇద్దరూ సమానమే. ఇద్దరూ కలిసి ఉంటేనే సౌభాగ్యం, సంతోషం. అంటే వాళ్ళ వయసులో ఎవరు పెద్దయితే గొప్ప అన్నదానికన్నా ప్రధానమైనది– ఒకరు నడిపించాలి, మరొకరు నడవాలి–అనేది. ఇక్కడ నడిపించేవారిది ఎక్కువ, నడిచేవారిది తక్కువ అనుకోకూడదు. అన్వయం జాగ్రత్తగా చేసుకోవాలి. వరుడి వయసు పెద్దదయి ఉండాలి–అన్నారు. వయస్సు అంటే కాలం. కాలం అనుభవానికి, అవగాహనకు గుర్తు. ఎవరు ముందు ప్రపంచంలోకి వచ్చారో.. వాళ్ళుఅనుభవాన్ని, అవగాహనను ఎక్కువ సాధిస్తారు. మనం ఎంత చదివాం అన్నదానికన్నా... దానికి అనుభవం ఎంత తోడయింది... అన్నది ప్రధానం. ఒక ఉద్యోగానికి వెడితే అనుభవం ఎంత అన్నదాని ప్రాధాన్యత ఇస్తారు. అలాగే వివాహం విషయంలో.. లోకజ్ఞానం, లోక ప్రవృత్తిని సరిగా అర్థం చేసుకుని భార్యకు అవగాహన కలిగించగలిగిన వాడయి ఉండాలి.
అనుభవం అన్నమాటలోనే అంతర్లీనంగా ఉండే విషయం– భార్యపట్ల పరమ ప్రేమతో మెలుగుతూ ఆమెకు రక్షకుడయి ఉండాలన్నది. ఆమె గుణాలు, ప్రతిభ ప్రకాశించడానికి ఆయన అవకాశం కల్పించగలగాలి. ఆమె బలహీనతలు... శారీరకం కావచ్చు, నడవడిరీత్యా కావచ్చు... వాటిని కప్పగలగడంతోపాటూ ఆమె గౌరవమర్యాదలు తగ్గకుండా చూడగలగాలి. సంసారాన్ని సాఫీగా నడపడంలో ఆమెకు ఆయన అనుక్షణం అండగా నిలవాలి. ఒక అమాయకురాలైన కూతురు తెలిసీ తెలియక చేసే తప్పులను తల్లిదండ్రులు ఎలా సరిదిద్దుతూ కాపాడుతుంటారో భార్యను అలా కాపాడుకోగలిగి ఉండాలి. అది భర్త లక్షణం. భార్యది – అంకిత భావం. పిచ్చి ప్రేమ. భర్త ప్రేమకు కారణం ఉంటుంది. భార్య ప్రేమకు కారణం ఉండదు. అనుగమించడం, అంకితభావంలో మసులు కోవడం ఆమె కర్తవ్యం. ఆమెకు ప్రేమను పంచడం, ప్రతి కష్టంలో ఆమెకు రక్షణగా నిలవడం ఆయన బాధ్యత. ఆమెది పాతివ్రత్యం. ఆయనది ఏకపత్నీవ్రతం. అందువల్ల ఎక్కువ తక్కువలను వారి మధ్య ΄ోల్చిచూడకూడదు. కామసంబంధమైన ప్రవత్తి కలిగినా ఆయన దృష్టిలో ఆమె వినా మరొకరికి స్థాన ఉండదు. ఆమెకు ఆయనే సర్వస్వం. ఇది దాంపత్యం. ఇదే గృహస్థాశ్రమం. ఇది సనాతన ధర్మ వైభవం.
-చాగంటి కోటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment