కానుకలు సంతోషాన్నిస్తాయి. బంధాలను ఏర్పరుస్తాయి. దాచుకోవాలనిపిస్తాయి. కానీ బంధాన్ని తుంచుకోవడమే ఒక కానుకగా ఆ తల్లి భావిస్తే..? అది తల్లికి ఇవ్వాల్సిన కానుక అని పిల్లలు భావిస్తే..? ఆ తండ్రి ఎలాంటి వాడన్నట్టు? అతనితో విడిపోవడానికి ఏమిటి అడ్డు ఉన్నట్టు?
ఒక అక్కా, ఒక తమ్ముడు. అక్కకు ఇరవై సంవత్సరాలు. తమ్ముడికి పద్దెనిమిది. ఇద్దరూ ఆ తల్లికి రెండు కళ్లు. అక్క పుట్టిన రోజు వచ్చింది. తల్లి హడావిడి చేసింది. తమ్ముడు ఏర్పాట్లు చేశాడు. బయటి నుంచి ఫుడ్డు, స్వీట్లు, కేక్ తెప్పించాడు. కూతురు కేక్ కోసి ఒక ముక్క తల్లికి తినిపించింది. ముగ్గురూ సంతోషంగా ఉన్న క్షణాలు అవి. తల్లి ఎంతో సంతృప్తితో ‘నీకేం కావాలో గిఫ్ట్ అడుగమ్మా’ అంది తాను ఉద్యోగస్తురాలన్న సంగతిని గుర్తు చేసుకుంటూ. కూతురు తల్లి వైపు చూసింది. ‘ఏమీ వద్దమ్మా. నేనే నీకు గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నాను’ అంది. ‘ఏమిటది?’ ‘విడాకులు. నువ్వు విడాకులు తీసుకో చాలు’ అంది. ‘అవునమ్మా’ అన్నాడు కొడుకు. పిల్లలు ఆ తల్లికి ఇవ్వగల అతిపెద్ద గిఫ్ట్ అదే ప్రస్తుతానికి ఒక భార్య విడాకులు తీసుకోవడం ఈ దేశంలో కొంత సులువు కావచ్చు. కాని ఒక తల్లి విడాకులు తీసుకోవడమంటే ఎన్నో ఆలోచించాలి. ఇప్పుడామె చుట్టూ ఎన్నో ఆలోచనలు. పాతికేళ్లుగా అవే ఆలోచనలు. దాటలేని ఆలోచనలు. నర్మదకు పాతికేళ్ల క్రితం పెళ్లయ్యింది. అప్పటికే ఆమెకు బ్యాంకులో ఉద్యోగం ఉంది. మరో బ్యాంకు సంబంధమే చూసి పెళ్లి చేశారు. ఇద్దరూ బ్యాంకు ఉద్యోగులే ఇంకేమి అని వాళ్లు వీళ్లు అసూయపడ్డారు. కాని కాపురం అలా లేదు. కత్తితో పొడవడం కర్రతో కొట్టడం ఒక రకమైన హింస. భర్త శ్రీనివాస్ అలా చేయడు. గొంతుకు అడ్డంపడే ఉండలాగా ఉంటాడు. కక్కలేదు. మింగలేదు. అలాగని అక్కడే ఉంచుకోలేదు. ఊపిరాడని భావన.
శ్రీనివాస్ ఆమెను చెయ్యెత్తి ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు. కాని ఒళ్లంతా హూనం అయ్యేలా ప్రవర్తిస్తాడు. మాటలు అంటాడు. ‘బ్యాంకులో ఎవరితోనో చనువుగా మాట్లాడుతున్నావటగా. అవసరమా’‘బయటకు వెళ్లేప్పుడు బాగానే తయారవుతావ్. ఇంట్లో ఏం రోగం?’ ‘పిల్లలది నా పోలికేనంటావా?’ ‘చూడబోతే నీ మనసులో ఇంకెవడో ఉన్నట్టున్నాడు’ ఇవే మాటలు. ఇలాంటి మాటలే మాట్లాడుతూ ఉంటాడు. ‘సరే... మీకు అనుమానం ఉంటే చెప్పండి. ఉద్యోగం మానేసి ఇంట్లో కూచుంటాను’ అంటే ‘డబ్బు లేకపోతే అడుక్కు తినాల్సి వస్తుంది. నువ్వు ఉద్యోగం చేయాల్సిందే’ అంటాడు. అతనితో ఎలా వేగాలో ఆమెకు ఎప్పటికీ అర్థం కాలేదు. ఇప్పటికీ అర్థం కావడం లేదు. పెళ్లి చేసుకొని వచ్చిన స్త్రీతో, తాళి కట్టి తెచ్చుకున్న స్త్రీతో భర్త ఎలా వ్యవహరించాలో ఏ కాలేజీలోనూ చెప్పరు. అందుకు అవసరమైన కోర్సు ఏదీ లేదు. తల్లిదండ్రులు ఆ కోర్సు చదివించరు. స్పోకెన్ ఇంగ్లిష్ క్లాస్ కన్నా, కంప్యూటర్ క్లాస్ కన్నా భార్యతో మెలగడం ఎలా అనే క్లాస్ ముఖ్యమని చాలామంది తల్లిదండ్రులు గ్రహించరు. భర్త అనాల్సినవాడు, భార్య పడాల్సిన ప్రాణి అనే మైండ్‌సెట్ స్థిరపడి ఉంటుంది.
ఆ మైండ్ సెట్‌తో నరకం అనుభవిస్తోంది నర్మద. పిల్లలకు చిన్నప్పుడు ఇది తెలియదు. కాని పెరిగే కొద్ది తండ్రి దురుసుతనం, దుర్మార్గ తీరు వారికి అర్థమైంది. నలుగురూ కలిసి సంతోషంగా, ఒకరి పట్ల ఒకరు గౌరవం ప్రదర్శించుకుంటూ ఒక్కనాడూ ఉన్నది లేదు. ఒకచోటుకు వెళ్లింది లేదు. తల్లికి జరిగే అవమానం పిల్లలకూ జరిగే అవమానంగా చాలామంది తల్లిదండ్రులు భావించరు– పిల్లలు నోరు తెరిచి చెప్పినా చెప్పకపోయినా. నర్మద ఈ పెళ్లి నుంచి బయపడాలని చాలా రోజులుగా అనుకుంటోంది. కాని ఆమెకు అనేక సందేహాలు ఉన్నాయి.
1. అత్తగారి తరపువారు, పుట్టింటి వారు ఏమనుకుంటారో.
2. స్నేహితులు ఏమనుకుంటారో.
3. ఆఫీసులో ఏమనుకుంటారో.
4. అసలు భర్త ఏమనుకుంటాడో విడాకులు ఇస్తాడో ఇవ్వడో ఎటువంటి టెన్షన్ క్రియేట్ చేస్తాడో
5. పిల్లలకు తండ్రి ఎక్కడ మిస్సవుతాడో
6. విడాకులు తీసుకున్న తల్లి ఉందంటే పిల్లలకు సంబంధాలు వస్తాయో రావో
7. పిల్లలు రేపు పెద్దవాళ్లయ్యి చదువులకు వెళ్లిపోతే తానొక్కత్తే జీవితాన్ని నడిపించుకోగలదో లేదో.
ఇన్ని సందేహాల మధ్య ఆమె విడాకుల నిర్ణయాన్ని ఏళ్ల తరబడి వాయిదా వేస్తూ వస్తోంది. ఒక జీవి సంతోషంగా లేకపోతే ఆరోగ్యకరమైన మనసున్న సాటిజీవికి కష్టంగా ఉంటుంది. ఇప్పుడు తల్లి కష్టం చూసి పిల్లలకు చాలా కష్టంగా ఉంటోంది. వాళ్లే తల్లిని సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకు వచ్చారు. సైకియాట్రిస్ట్ ఆమె కథంతా వింది. ఈ సందేహాలకు ఎవరు మాత్రం సమాధానం చెప్పగలరు? స్త్రీ చుట్టూ భారతీయ సంప్రదాయ వ్యవస్థ బిగించిన భావపరమైన, భౌతిక పరమైన బంధనాలు ఇవి.
వీటిని ఛేదించడం సాధ్యమా? ‘చూడండీ... ఈ దేశంలో చాలామంది స్త్రీలు ఆర్థిక స్వాతంత్య్రం లేకపోయినా ధైర్యంగా విడాకులు తీసుకుంటున్నారు. మీకు ఉద్యోగం ఉంది. రిటైర్ అయితే పెన్షన్ కూడా వస్తుంది. అయినా మీరు భయపడుతున్నారు. మీరు పూర్తిగా మీ జీవితాన్ని సంఘం చేతుల్లో పెట్టారు. సంఘభయం మీకు ఎక్కువగా వుంది. సంఘ తీర్పులు ఎన్ని ఉన్నా అవి వ్యక్తిగత అనుభవాల ముందు, స్వేచ్ఛ ముందు, నిర్ణయం తీసుకునే శక్తి ముందు నిలబడవు. మీకు జ్వరంగా ఉందంటే ఈ సంఘం వచ్చి టాబ్లెట్ కొని పెట్టదు. వండుకునే ఓపిక లేదంటే స్విగ్గీలో ఆర్డరు పెట్టదు. మీ బాధలు మీరు పడుతున్నప్పుడు మీ నిర్ణయాలు మీరు తీసుకోవడానికి సంఘం అంగీకారం అక్కర్లేదు. మీరు విడాకులు తీసుకున్నారని తెలిశాక మీకు మిగిలే బంధువులే నిజమైన బంధువులు. మిగిలే స్నేహితులే నిజమైన స్నేహితులు. మిగిలే అనుబంధాలే నిజమైన అనుబంధాలు. మీ నిర్ణయాన్ని గౌరవించని తతిమావన్నీ అనవసరాలే. పైగా మీకు అన్నింటి కంటే బలంగా మీ పిల్లల మద్దతు ఉంది. వారు మీతోనే ఉంటామంటున్నారు. ఇక భర్త పెట్టే ఇబ్బందులు ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ సంగతి అంటారా? అలాంటి ఇబ్బంది ఉంటే చట్టం అండ మీకు ఎప్పుడూ ఉంటుంది. కనుక మీరు ధైర్యంగా విడాకులకు అప్లై చేయండి’ అని చెప్పింది సైకియాట్రిస్ట్. నర్మద ఆ తర్వాత రెండు మూడు సిట్టింగ్‌లకు వచ్చింది. ఐదో సిట్టింగ్ సమయంలో చెప్పింది.
‘డాక్టర్ నాకు కొంచెం ధైర్యం వచ్చింది. నాకిప్పుడు వాళ్లేమనుకుంటారో వీళ్లేమనుకుంటారో అనే భయం లేదు. నా జీవితం గురించి కూడా భయం లేదు. కాని ఒక్క పిల్లల విషయమే ఆలోచిస్తున్నాను. రేపు వాళ్లు యూనివర్సిటీలకో ఉద్యోగాలకో వెళ్లే వరకూ ఆగుతాను. అది జరిగాక ఆయనను కౌన్సెలింగ్‌కు తీసుకువస్తాను. మీరు చెప్పాల్సింది చెప్పండి. మారుతాడని అనుకుంటున్నాను. అప్పటికి కూడా మారకపోతే అప్పుడు విడాకుల సంగతి ఆలోచిస్తాను’ అందామె. సైకియాట్రిస్ట్‌కు ఇది ఎలా అర్థం చేసుకోవాలో తెలియలేదు. వివాహ వ్యవస్థ స్త్రీని మాత్రమే దుర్భరురాలిని చేసి పురుషుణ్ణి చాలా శక్తిమంతం చేస్తుండటం వల్లే స్త్రీకి ఇంత పెనుగులాట అనిపించింది. తన గర్భంలో నుంచి వచ్చిన పిల్లల పట్ల తల్లికి ఉండే సహజమైన పాశం కూడా పురుషుడి దృష్టిలో ఆమె బలహీనతగా కనిపించడం వల్లే ‘ఆ.. ఎక్కడికి పోతుందిలే’ అనే భావనతో ఆమెను చులకన చేయడం, హింసించడం చేస్తుంటాడు. నర్మద కోరినట్టుగా భర్త కౌన్సెలింగ్ వల్ల మారితే సంతోషం. మారకపోతే ఆమె కచ్చితంగా విడాకులు తీసుకునేలా ప్రోద్బలం అందించడం తన బాధ్యత అనుకుంది సైకియాట్రిస్ట్. ఆమె కథ ప్రస్తుతానికైతే అసంపూర్ణమే. ఇలాంటి అసంపూర్ణ దశలో ఈ దేశంలో ఎందరో స్త్రీలు ఉన్నారన్నది వాస్తవం.
– కథనం: సాక్షి ఫ్యామిలీ
ఇన్‌పుట్స్: డా. పద్మ పాల్వాయి, సైకియాట్రిస్ట్
Comments
Please login to add a commentAdd a comment