Draupadi
-
పానీపూరీ గురించి నమ్మలేని నిజాలు.. ఇంత చరిత్ర ఉందా?
పానీపూరి.. ఈ పేరు వినగానే నోట్లో నీళ్లు ఊరుతాయి. పానీపూరీ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. మన దేశంలో ఎన్ని వెరైటీలు ఉన్నా ఇప్పటికీ పానీపూరీనే చాలామందికి ఫేవరెట్ స్ట్రీట్‌ఫుడ్. గోల్ గప్పా, గప్ చుప్ అని వివిధ పేర్లతో దీన్ని పిలుస్తుంటారు. సాయంత్రం అయిందంటే చాలు వీధి చివరన పానీపూరీ బండి వద్ద జనాలు గుమిగూడతారు. లొట్టలేసుకొని మరీ పానీపూరీని ఆరగిస్తుంటారు. ఎంతో ఇష్టంగా తినే పానీపూరీ వంటకం ఇప్పటిది కాదట. మహాభారత కాలం నుంచే ఉందట. మరి అప్పట్లో పానీపూరీని కనిపెట్టింది ఎవరు? ఏంటా స్టోరీ అన్నది ఇప్పుడు చూద్దాం. పురాణాల ప్రకారం.. పానీపూరీని ద్రౌపది తొలిసారిగా కనిపెట్టిందని అంటారు.పెళ్లయ్యాక అత్తగారింటికి వచ్చిన ద్రౌపదికి కుంతీదేవి ఓ టాస్క్ ఇచ్చిందట. మిగిలిపోయిన ఒక ఆలుగడ్డ, ఒక్క చనాతీకి మాత్రమే సరిపడా పిండిని అందించి తన ఐదుగురు కొడుకుల ఆకలిని తీర్చి భర్తల మెప్పు పొందాల్సిందిగా సవాల్ విసురుతుందట. అప్పుడు ద్రౌపది ఉన్న వస్తువులతోనే చిన్నచిన్న పూరీలు చేసి భర్తల ఆకలిని తీర్చిందట. ద్రౌపది తెలివికి మెచ్చుకున్న కుంతిదేవి ద్రౌపది కనిపెట్టిన పానీపూరీ శాశ్వతంగా ఉండిపోతుందని దీవించిందట. అప్పట్నుంచి పానీపూరీ ప్రజలకు పరిచయం అయ్యిందని అంటుంటారు. -
ద్రౌపది ముర్ము నివాసానికి ప్రధాని మోదీ
-
President Election 2022: ద్రౌపది ముర్ముకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
సాక్షి,న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు అభినందనలు వెల్లువెత్తున్నాయి. 15వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్న ఆమెకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. స్వయంగా ఆమె నివాసానికి వెళ్లి పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా మోదీతోపాటు ముర్ము నివాసానికి వెళ్లారు. కాసేపు ఆమెతో ముచ్చటించారు. Delhi | Prime Minister Narendra Modi greets and congratulates #DroupadiMurmu on being elected as the new President of the country. BJP national president JP Nadda is also present. Visuals from her residence. pic.twitter.com/5wrcpCXElC — ANI (@ANI) July 21, 2022 మోదీ, నడ్డాతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఇతర పార్టీల రాజకీయ నేతలు, ప్రముఖులు కూడా ముర్ముకు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. ద్రౌపది ముర్ము చేతిలో ఓడిపోయిన యశ్వంత్ సిన్హా కూడా ఆమెకు అభినందనలు తెలియజేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచి ఆ బాధ్యతలు చేపడుతున్న తొలి గిరిజన మహిళగా చరిత్ర సృష్టించారు ద్రౌపది ముర్ము. ఎన్డీఏ బలపరిచిన ఈమెకు బీజేడీ, వైఎస్ఆర్సీపీ, జేఎంఎం వంటి ప్రాంతీయ పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. దీంతో ఆమె ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై భారీ మెజార్టీతో గెలుపొందారు. ముర్ము విజయంతో ఒడిశాలోని ఆమె స్వగ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. చదవండి: కొత్త చరిత్ర.. భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము -
చిన్నయ్య గుట్ట: ఎంత గట్టిగా చప్పట్లు కొడితే.. అంత నీరు
లక్సెట్టిపేట: మంచిర్యాల జిల్లా, లక్సెట్టిపేట మండలంలోని హన్మంతుపల్లి గ్రామ పంచాయతి పరిదిలోగల చల్లంపేట గ్రామ శివారు అటవీ ప్రాంతంలో బాహ్య ప్రపంచానికి దూరంగా సుమారు 150 సంవత్సరాల క్రితం నుండి కొలువు పొందుతున్న గిరిజనుల ఆరాధ్య దేవుడు చిన్నయ్య దేవుడు. ఈ ప్రాంతంలో చిన్నయ్య దేవుడు ఎంతో ప్రసిద్ధి గాంచాడు. చారిత్రాత్మకంగా వెలిసిన చిన్నయ్య దేవుడు గిరిజనుల ఆరాధ్య దైవంగా ఇప్పటికి సేవలందుకుంటూనే ఉన్నాడు. ప్రాచీన కాలంలో పాండవులు ఇక్కడ వ్యవసాయం చేసేవార..ని ద్రౌపది స్నానం చేయడానికి కొల్లుగుంటలు, పరుపుబండపైన వ్యవసాయం చేసినట్లు నాగళి సాళ్ళు, గుడి లోపల దొనలో పట్టె మంచం దేవుని విగ్రహాలు ఉన్నట్లు ఇప్పటికి పూర్వీకులు చెబుతుంటారు. వర్షాకాలం ప్రారంభం సమయంలో సుదూర ప్రాంతాల నుంచి దర్శనానికి వస్తుంటారు. రైతులు వరదపాశం బోనాలు వండి దేవునికి తీర్ధ ప్రసాదాలు వడ్డిస్తారు. పంట పొలాలకు వ్యాధులు సంభవిస్తే ఇక్కడి తీర్ధపు నీరు పంటపొలాలపై చల్లితే రోగాలు పోతాయనే నానుడి ఇంకా కొనసాగుతూనే ఉన్నది. వెల్లడానికి దారి.... పట్టణంనుండి చందారం గ్రామం మీదుగ 10 కిలోమీటర్లు వాహనాలపై చల్లంపేట వరకు చేరుకుని అక్కడి నుండి అటవీ ప్రాంతం గుండా సుమారు 3 కిలో మీటర్లు కాలినడకన నడిచి వెల్తే చిన్నయ్య గుట్ట దేవుడి గుడిని చేరుకోవచ్చు. సమీప ప్రాంతంలో నీళ్ళ సదుపాయం చిన్నపాటి బుగ్గ వాగు లాంటిది ఉంటుంది అందులోని నీటిని త్రాగడానికి వాడుతారు. ఇప్పటికి అక్కడ గిరిజనులే పూజారులుగా కొనసాగుతుంటారు. ప్రతి ఆదివారం, గురువారం ఇక్కడ పూజలు పెద్ద మొత్తంగా నిర్వహిస్తారు. వివిద గ్రామాలనుండి మేకలు, కొళ్ళు లాంటివి తెచ్చుకుని దేవుడికి బోనం వండి మొక్కలు చెల్లించి కొంచెం దూరంగా వంటలు వండుకుని సహపంక్తి భోజనాలు చేస్తారు. చిన్నయ్య దేవుడి ప్రత్యేకత... చిన్నయ్య దేవుడి ప్రత్యేకత ముఖ్యంగా పంట పొలాలు దుక్కి దున్నేముందు దేవుడి దర్శనం చేసుకుని బండారు(పసుపు) తెచ్చుకుని ధాన్యం వేసేటప్పుడు అందులో కలిపి వ్యవసాయం సాగు చేస్తారు. మరల పంట చేతికి వచ్చిన తర్వాత దినుసును దేవుడికి అప్పజెప్పి మొక్కిన మొక్కును చెల్లించుకుంటారు. వేసవి కాలం ముగుస్తుందనే సమయంలో భక్తులతో కిటకిటలాడుతుంది చిన్నయ్య గుడి. అల్లుబండ.... గుడిలో అల్లుబండ ప్రత్యేక స్థానాన్ని కల్గిఉంది. అక్కడికి వచ్చిన భక్తులు మనసులో కొరికను కోరుకుని అల్లుబండ లేపితే సులభంగా లేచినట్లైతే కోరిక నెరవేరుతుందని అల్లుబండ బరువుగా ఉంటే కోరిక నేరవేరదనేది నమ్మకం. అల్లుబండ ప్రదేశం వద్ద భక్తులు వారి కొర్కెలను కోరుకుంటారు. చిన్నయ్య దేవుని గుడి వద్ద నుండి సుమారు మూడు కిలీమీటర్లు అటవీ ప్రాంతంలో నుండి నడుచుకుంటు వెల్లితే మంచు కొండలు దర్శనమిస్తాయి. అక్కడికి వెల్లిన భక్తులు ఎంత గట్టిగ చప్పట్లు, కేకలు, ఈళలు వేస్తే అంత నీరు కిందకు వస్తుంది. అక్కడి నీటిని భక్తులు తెచ్చుకుని పంటపొలాల్లో జల్లుకుంటే పంట దిగుబడి అధికంగా వస్తు చీడ, పీడలు రావని రైతుల నమ్మకం. పర్యాటక కేంద్రంగా తీర్చాలి.... పచ్చని అటవీ ప్రాంతం పక్షుల కిలకిల రావాలు, అడవి జంతువుల శబ్దాలు చూడడానికి వేసవి విడిదిగా అనిపించే చిన్నయ్య గుట్టను పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దాలని పలువురు కోరుతున్నారు. రహదారి మధ్యలో మత్తడి నీటిని నిల్వచేసి వాటికి అనుకూలంగా రహదారిని ఏర్పాటు చేస్తే పుణ్యక్షేత్రంగాను పర్యాటక కేంద్రంగాను ఏర్పడుతుందని పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. -
నేను పడుతున్న బాధ నాకు తెలుసు
పంచమవేదంగా ప్రణుతికెక్కిన మహాభారతంలో విలక్షణమైన వ్యక్తిత్వం ఉన్న స్త్రీ మూర్తిగా... కురుక్షేత్ర యుద్ధానికి మూల కారకురాలిగా ద్రౌపదికి పేరుంది. పంచకన్యలలోనే కాదు, ఆరుగురు మహాపతివ్రతలలోనూ ఆమె పేరు చోటు చేసుకున్నదంటేనే అర్థం చేసుకోవచ్చు ద్రౌపది ఎంత విశిష్టమైన వ్యక్తిత్వం గల స్త్రీనో. ద్రౌపది అయోనిజ. యఙ్ఞకుండం నుంచి ఉద్భవించిన కారణజన్మురాలు. పూర్వ జన్మలలో ఆమె వేదవతి, ఆ తరువాత మౌద్గల్య ముని భార్య ఇంద్రసేన. ఆ తరువాతి జన్మలో ఆమె కాశీరాజు కుమార్తె అనామికగా జన్మించింది. పతికోసం ఘోరమైన తపస్సు చేసింది. పరమశివుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాడు. పతి అన్న పదాన్ని ఐదుసార్లు పలికింది ఆమె. ఐదుగురు పతులను అనుగ్రహించాడు శివుడు. నీకు ఐదుగురు పతులున్నా అది ధర్మవిరుద్ధమని ఎవరూ భావించరు అని, ఆమె కోరుకొన్న విధంగా ఐదుగురితో సుఖించటానికి తగ్గ యవ్వనం, వారిని సేవించేందుకు అవసరమైన శుశ్రూషాభావం, కన్యాత్వం, సౌభాగ్యం అనుగ్రహించాడు. ఫలితంగా మరుజన్మలో ఆమె సంతానం కోసం యజ్ఞం చేస్తున్న ద్రుపదుడికి అగ్నిగుండంలో లభించింది. నల్లగా ఉండటం వల్ల ఆమెకు కృష్ణ అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకున్నాడు ద్రుపదుడు. యుక్తవయసు రాగానే ఆమెకు స్వయంవరం ప్రకటించాడు. ఆమెను స్వయంవరంలో గెలిచినవాడు బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడే. దాంతో ఆమె మీద ఆశలు పెట్టుకున్న క్షత్రియ వీరులందరూ అర్జునుడిపై కయ్యానికి కాలుదువ్వారు. వారందరినీ అర్జునుడు, అతని సోదరులు యుద్ధంలో కూడా గెలిచి, ద్రౌపదిని తమ తల్లి దగ్గరకు తీసుకువెళ్ళారు. అక్కడ వారి తల్లి అనాలోచితంగానో, ఆలోచితంగానో అన్న మాటకు కట్టుబడి ఆ అయిదుగురు సోదరులనూ పెళ్ళి చేసుకోవలసి వచ్చింది. ఐదుగురు పతులతోనూ ఆమె సుఖజీవనం ప్రారంభించింది. పాండవులు ప్రచ్ఛన్నవేషాలు వీడి ఇంద్రప్రస్థంలో జీవించటం మొదలుబెట్టాక చాలా విశేషాలు జరిగాయి. ద్రౌపదితో ఏకాంతోల్లంఘన లేకుండా ఒక్కొక్కరూ ఒక సంవత్సరం గడపాలని అన్నదమ్ములు చేసుకొన్న ఒప్పందాన్ని ఒకానొక సందర్భంలో ఉల్లంఘించవలసి వచ్చిన అర్జునుడు ఏడాది పాటు తీర్థయాత్రలకు వెళ్ళి మూడు వివాహాలు చేసుకొని, శ్రీ కృష్ణుడి చెల్లెలు సుభద్రను ఏకంగా ఇంద్రప్రస్థానికే తెచ్చాడు. పాండవులు రాజసూయం చేశారు. వారి ఆధిపత్యాన్ని చూసి కన్నెర్ర జేసుకొన్న దుర్యోధనుడు, మాయాద్యూతంలో గెలిచి పాండవులనూ, ద్రౌపదినీ బానిసలుగా చేసుకొన్నాడు. అంతకుముందు ఏ మహారాణికీ జరగని అవమానాలు ద్రౌపదికి జరిగాయి. ఏకవస్త్ర ఐన ద్రౌపదిని నిండుసభకు జుట్టుపట్టుకుని ఈడ్చుకు వచ్చాడు దుశ్శాసనుడు. దుర్యోధనుడు ఆమెను కూర్చోమని తన తొడను చూపించాడు. ఆమె పతులముందే ఆమెను వివస్త్రను చేయబూనాడు. ఆ ప్రయత్నం విఫలమైన తర్వాత మరోసారి జూదమాడి పాండవులను అడవుల పాలు చేశాడు. ద్రౌపది పాండవులతో పాటు పన్నెండేళ్ళు వనవాసం చేయవలసి వచ్చింది. ఆ సమయంలోనే సైంధవుడు ద్రౌపదిని అపహరించడానికి ప్రయత్నించాడు. వనవాసం ముగిశాక అజ్ఞాతవాసం కోసం విరాటనగరం వెళ్ళినప్పుడు. ద్రౌపది విరాటరాజు పత్ని అయిన సుధేష్ణాదేవికి సైరంధ్రిగా ఉండవలసి వచ్చింది. కీచకుడు ఆమెను బలవంతంగా అనుభవించటానికి ప్రయత్నించి భీముని చేతిలో మరణించాడు. అది మామూలుగా జరగలేదు. ద్రౌపది ధర్మరాజాదులను పలువిధాలుగా రెచ్చగొట్టిన పిదపనే జరిగింది. అజ్ఞాతవాసం తరువాత రాయబారాలు, సంధి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ద్రౌపది వాటిని వ్యతిరేకించింది. యుద్ధం జరిగి, తనను అవమానించినవారిని తన భర్తలు నిర్జించి తన పగ తీర్చాలని ఆమె కోరుకొంది. ఆ కోరిక నెరవేరే క్రమంలో తన పుత్రులను కోల్పోయి పెద్ద మూల్యమే చెల్లించుకోవలసి వచ్చింది. అదెలాగో చూద్దాం. ద్రౌపది పట్టమహిషి. ఆమెయందు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు కన్నబిడ్డలెవరో వారే సింహాసనానికి ఉత్తరాధికారులు. కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. శిబిరాలు వేసి ఉన్నారు. ఉప పాండవులు యుద్ధభూమికి వెళ్ళలేదు. చిన్న పిల్లలు. గాఢనిద్రలో ఉన్నారు. అశ్వత్థామకు ఉన్మాదం కలిగింది. తొడలు విరిగిపోయి పడిఉన్న దుర్యోధనుడి దగ్గరకు వెళ్ళి ‘నీ పగను నేను చల్లారుస్తా’ అన్నాడు. పాండవులమీదికి యుద్ధానికి వెళ్లడం ఎలా! రాత్రివేళ ఆలోచిస్తూ కూర్చున్నాడు. అకస్మాత్తుగా ఎక్కడినుంచో ఒక గుడ్లగూబ వచ్చి చెట్టుమీద ఉన్న ఒక పక్షి గూట్లో పెట్టిన పిల్లలను తన వాడి ముక్కుతో చీల్చి చెండాడేసింది. ఆ ఇదీ నేను చేయవలసింది...అనుకున్నాడు. నిద్రలో ఉన్న ద్రౌపదీ దేవి ఐదుగురు పిల్లలను ఒక్క రాత్రిలోనే సంహరిస్తాను. పాండవులకు ఉత్తరాధికారులు లేకుండా చేస్తాననుకుంటూ పిచ్చెక్కిన వాడిలా అయిపోయాడు. శిబిరం మీద పడిపోయి నిద్రపోతున్న ధృష్టద్యుమ్నుడి కంఠాన్ని తుంచేశాడు. ఏనుగుల కుంభస్థలాలు ఛేదించాడు. గుర్రాల్ని చంపేశాడు. ఐదుగురు ఉపపాండవుల కుత్తుకలు కత్తిరించేశాడు. అది తెలిసిన అర్జునుడు వెతుక్కుంటూ వెళ్లి అశ్వత్థామ జాడ కనిపెట్టి, అతణ్ణి పశువును కట్టినట్లు కట్టి తీసుకొచ్చి ద్రౌపది ముందు పడేశాడు. ఆమె ఐదుగురు భర్తలు ఆవేశంతో ఊగిపోతున్నారు. ఊ..అంటే చాలు భీమసేనుడు అశ్వత్థామ తలను వేయి వక్కలు చేసేస్తాడు. కానీ ఆ క్లిష్ట సమయంలో ద్రౌపది ఎంతో సంయమనం పాటించింది. కొడుకులు చచ్చిపోయి నేను ఏడుస్తున్నా. ద్రోణాచార్యుల వారితో కలిసి సహగమనం చేయకుండా ద్రోణుడి భార్య ఉన్న ఒక్క కొడుకు కోసమని ఇంటిదగ్గరుంది. ఆమె కొడుకు చచ్చిపోలేదు. నా ఐదుగురు బిడ్డల్ని చంపేశాడనే కోపంతో పాండవులు అశ్వత్థామను ఎక్కడ చిత్రవధ చేసేస్తారన్న భయంతో ఎంత ఏడుస్తోందో! గురుపత్ని ఏడుపు మన వృద్ధికి ప్రతిబంధకం కాకూడదు. వీడిని మనం చంపకూడదు. వీడు చేసిన తప్పు వీడినే కాల్చేస్తుంది. నేను పడుతున్న బాధ నాకు తెలుసు. వేరొక తల్లి ఎందుకు పడాలి. వదిలిపెట్టేయండి’’ అన్నది. అంతగొప్పగా మాట్లాడడం, ధర్మానికి కట్టుబడడం తెలిసిన ద్రౌపది ధీరవనిత కాక మరేమిటి? ప్రతి పురుషుడి విజయం వెనకా ఒక స్త్రీ ఉంటుందన్న ఆధునిక కాలపు నానుడిని అనుసరించి మహాభారతపు కాలంలో కురుక్షేత్రంలో పాండవులు ఐదుగురు సాధించిన విజయంలో వారి ధర్మపత్ని ద్రౌపది పాత్ర ఎంతో కీలకమైనదని అందరూ గ్రహించి తీరాలి. – డి.వి.ఆర్. భాస్కర్ -
ద్రుపదుడు ఏం చేయాలనుకున్నాడు?
♦ధౌమ్యుడు అంగీకరించగానే పాండవులు ఏమనుకున్నారు? ధౌమ్యుడు అంగీకరించినందుకు సంతోషించారు. సకల భూరాజ్యం పొందినంత ఆనందించారు. ఆయన దీవెనలు అందుకున్నారు. తమ వృత్తాంతమంతా తెలియపరిచారు. ♦ధౌమ్యుని అనుమతి పొంది ఏం చేశారు? పాంచాల రాజ్యానికి బయలుదేరారు. ♦మార్గ మధ్యంలో ఎవరు కనిపించారు? వేదవ్యాసుడు కనిపించాడు. రాను న్న శుభాల గురించి పాండవులకు చెప్పి, వెళ్లిపోయాడు. ♦పాండవులు ఎక్కడకు చేరుకున్నారు? కుంతి సహితంగా పాంచాల దేశానికి చేరారు. కాంపిల్య నగరంలో ప్రవేశించారు. కుమ్మరివాని ఇంట విడిది చేశారు. ఇతరులకు తెలియకుండా బ్రాహ్మణ వృత్తిలో జీవించసాగారు. ♦ద్రుపదుడు ఏం చేయాలనుకున్నాడు? తన కుమార్తెను అర్జునునికి ఇవ్వాలనుకుని, వెదికించాడు ♦అర్జునుడు కనిపించకపోవడంతో ద్రుపదుడు ఏం చేశాడు? అర్జునుడు కనిపించకపోవటంతో, స్వయంవరం ఏర్పాటుచేశాడు. ఆ స్వయంవరానికి కాశీ వస్త్రాలు, కవచాలు ధరించిన అనేక దేశాల రాజులు వచ్చారు. ♦స్వయంవర రంగస్థలాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? కాంపిల్య నగరానికి ఈశాన్య దిక్కున ఏర్పాటుచేశారు. రంగస్థలం చుట్టూ అగడ్త ఏర్పాటుచేశారు. ♦కాంపిల్యానికి వచ్చిన వారంతా ఎక్కడ కూర్చున్నారు? రాజులు రంగస్థలానికి చేరి, ఉచితాసనాలలో కూర్చున్నారు. పాండవులు బ్రాహ్మణులలో కూర్చున్నారు. ♦సభా మండపానికి వచ్చిన ద్రౌపది ఎలా ఉంది? తెల్లని రత్నభూషణాలు ధరించింది. తెల్లని గంధం అలముకుంది. చేతిలో తెల్లని పుష్పమాలను ధరించింది, మన్మధుని పూల బాణంలా ఉంది. ♦ధృష్టద్యుమ్నుడు ఏమన్నాడు? రాజకుమారులారా! ఈమె నా సోదరి కృష్ణ. ఈమె అయోనిజ. అగ్ని నుంచి పుట్టింది. ఇక్కడ ఉన్న అగ్నిహోత్రానికి సమీపంలో మహా ధనుర్బాణాలున్నాయి. వాటిలో ఐదు బాణాల చేత మత్స్యయంత్రాన్ని భేదింయిచ ద్రౌపదిని వరించాలి అన్నాడు. – నిర్వహణ: వైజయంతి పురాణపండ -
అర్జునుడు అంగారపర్ణునితో ఏమన్నాడు?
♦అర్జునుడు అంగారపర్ణునితో ఏమన్నాడు? మిత్రమా! నువ్వు మమ్మల్ని విడిచిపెట్టావు. అప్పుడు మేం పాండవులమని నీకు తెలియదా? తెలిసే విడిచిపెట్టావా? అని ప్రశ్నించాడు. ♦అర్జునుని ప్రశ్నకు చిత్రరథుడు ఏమన్నాడు? మిత్రమా! నీ శౌర్యప్రతాపాలను గురించి నారదాది మునులు, దేవతల వలన విన్నాను. అయినా విడిచిపెట్టడానికి రెండు కారణాలున్నాయి.. అన్నాడు. ♦రెండు కారణాల గురించి ఏమన్నాడు? స్త్రీలు దగ్గరున్నప్పుడు మగవారు దురభిమానంతో ఉంటారు. మంచిచెడ్డల తారతమ్యం గ్రహించలేరు. ఎదుటివారి శక్తిని గుర్తించలేరు. తామే గొప్పవారం అనుకుంటారు. ఇక రెండవది... రాజులకు పురోహితుడు ఉండాలి. నాకు పురోహితుడు లేడు. ఇప్పుడు మంచి పురోహితుడిని ఏర్పరచుకుంటాను అని చెప్పాడు. ♦పురోహితుడికి ఉండవలసిన లక్షణాల గురించి ఏమన్నాడు? పురోహితుడు వేదవేదాంగాలు చదివి ఉండాలి. జపహోమ యజ్ఞాలలో ప్రసిద్ధుడై ఉండాలి. శాంతచిత్తులు, సత్యవంతులు కావాలి. ధర్మార్థకామమోక్షాలు పొందటానికి సమర్థుడై ఉండాలి. అటువంటి పురోహితులు ఉన్న రాజులు ప్రకాశవంతులు అవుతారు అని పురోహితుడి గురించి వివరించాడు. ♦చిత్రరథుని మాటలు విన్న పాండవులు ఎలా ఆలోచించారు? చిత్రరథుని మాటలు విన్న పాండవులు, వారు కూడా పురోహితుడిని ఏర్పరచుకోవాలనుకున్నారు. అటువంటి వానిని సూచించమని చిత్రరథుని కోరారు. ♦చిత్రరథుడు ఎటువంటి సూచన చేశాడు? చిత్ర రథుడు ఆలోచించి, ఉత్కచమనే దివ్య క్షేత్రం ఉంది. అక్కడ ధౌమ్యుడు అనే ఉత్తముడు ఉన్నాడు, ఆయనను పురోహితునిగా చేసుకోమని చెప్పి, అక్కడ నుంచి భార్యాసహితుడై వెళ్లిపోయాడు. ♦పాండవులు ఎక్కడకు వెళ్లారు? పాండవులు ఉత్కచం వెళ్లారు. ధౌమ్యుని చూశారు. అతడు శాంతచిత్తుడు. తపస్సు చేస్తున్నాడు. పాండవులు అతడిని పూజించారు. తనకు పురోహితునిగా ఉండవలసినదని ప్రార్థించారు. ధౌమ్యుడు అంగీకరించాడు. – నిర్వహణ: వైజయంతి పురాణపండ -
అంగారపర్ణుని భార్య ఎవరు, ఆమె ఏమంది?
అంగార పర్ణుని మాటలకు అర్జునుడేమన్నాడు? అంగారపర్ణా! గొప్పలు మాట్లాడుతున్నావు. శక్తిహీనులు సంధ్యాకాలంలోను, అర్ధరాత్రి సమయంలోనూ సంచరించటానికి జంకుతారు. గంగానది నీది కాదు, ప్రజలందరిదీ. గంగ హిమవత్పర్వతంలో పుట్టింది. భూలోకంలో ప్రవహిస్తోంది, సముద్రంలో కలుస్తోంది.. అన్నాడు. అర్జునుడు గంగానది గురించి ఏమన్నాడు? గంగానది శివుని జటాజూటంలో పుట్టింది, ఆకాశంలో ప్రవహించేటప్పుడు మందాకిని. మూడులోకాలను పరిశుద్ధం చేస్తున్న గంగానది అందరికీ చెందినది. మేం ఇక్కడ స్నానం చేస్తాం.. అని ముందుకు సాగాడు. అంగారపర్ల– అర్జునుల యుద్ధం ఎలా జరిగింది? అంగారపర్ణుడు అర్జునుడి మీదకు బాణం విడిచాడు. అర్జునుడు కొరివితో బాణాలను కొట్టేశాడు. ద్రోణుడు ప్రసాదించిన ఆగ్రేయాస్త్రం ప్రయోగించాడు. అది అంగారపర్ణుని రథాన్ని కాల్చింది. భయభ్రాంతుడైన అంగారపర్ణుడు నేలకూలాడు. అర్జునుడు ఏం చేశాడు? నేలకూలిన అంగారపర్ణుని జుట్టు పట్టి ఈడ్చుకొచ్చి, ధర్మరాజు ముందు ఉంచాడు. అంగారపర్ణుని భార్య ఎవరు, ఆమె ఏమంది? అంగారపర్ణుని భార్య కుంభీనస ఉరికి వచ్చి, తన భర్తను రక్షించమని వేడుకుంది. కుంభీనస మాటలకు ధర్మరాజు ఏమన్నాడు? ధర్మరాజు అంగారపర్ణుని దీనత్వాన్ని చూశాడు. కుంభీనసను, ఆమె దుఃఖాన్ని చూసి, ‘అర్జునా! యుద్ధంలో ఓడినవానినీ, హీనుడినీ, శౌర్యం విడిచినవారినీ చంపకూడదు. వీడు నీ చేతిలో ఓడాడు. భయపడుతున్నాడు, విడిచిపెట్టు’ అన్నాడు. ధర్మరాజు గురించి అర్జునుడు ఏమన్నాడు? అంగారపర్ణా! ఇతడు నా అన్న ధర్మరాజు. కురువంశ ప్రభువు. దయ గలవాడు. శరణాగతవత్సలుడు. నిన్ను విడిచిపెట్టమని ఆజ్ఞాపించినందుకు విడిచిపెడుతున్నాను, భయం విడిచిపెట్టు’ అని పలికి, అంగారపర్ణుడిని విముక్తుడిని చేశాడు. అర్జునుడి మాటలకు అంగారపర్ణుడు ఏ విధంగా స్పందించాడు? అంగారపర్ణుడు ధైర్యం తెచ్చుకుని, ‘అర్జునా! నేను నీ చేతిలో ఓడిపోయాను కాబట్టి నా పేరు మార్చుకుంటాను. నేటి నుంచి నేను చిత్రరథుడిని, నీతో స్నేహం చేయదలిచాను అన్నాడు. అంగారపర్ణుడు తన దగ్గర ఉన్న విద్య గురించి ఏమన్నాడు? నా దగ్గర చాక్షుహు అనే విద్య ఉంది. దానితో ఏకకాలంలో మూడు లోకాలు చూడవచ్చు. ఈ విద్య నీకు ఇస్తున్నాను. ఇది ఫలించటానికి ఆరుమాసాలు వ్రత నియమాలు కలిగి ఉండాలి అన్నాడు. పాండవులు ఐదుగురికి ఏమిస్తానన్నాడు? తనకు ఏమివ్వమని కోరాడు? ఐదుగురికి కొంత ధనం, నూరేసి గుర్రాల చొప్పున గంధర్వజాతి గుర్రాలను ఇస్తాను, అందుకు బదులుగా ఆగ్రేయాస్త్రం ఇవ్వమని కోరాడు. – నిర్వహణ: డా. వైజయంతి పురాణపండ -
ఆ రోజు రాత్రి ఏం జరిగింది?
ప్రశ్న: పాండవులు ఏకచక్ర పురంలో ఉండగా ఏం జరిగింది? జవాబు: ఒకనాడు ద్రుపద రాజ్యం నుంచి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. ప్రశ్న:వచ్చిన బ్రాహ్మణుడు ఏమని చెప్పాడు? ద్రుపద మహారాజు తన కూతురుకి స్వయంవరం ప్రకటించాడని చెప్పాడు. ప్రశ్న:బ్రాహ్మణుని మాటలు విన్న కుంతి ఏమనుకుంది? ఇక్కడ ఎంతకాలం ఉన్నా ప్రయోజనం లేదు. పాంచాల దేశం లో అన్నీ సమద్ధిగా ఉన్నాయని విన్నాను. అక్కడికి వెళ దాం అని పాండవులతో పలికింది. ప్రశ్న:తల్లి మాటలు విన్న పాండవులు ఏం చేశారు? ఆమె మాటలకు సమ్మతించారు. వారు నివసిస్తున్న గహస్థు దగ్గర సెలవు తీసుకుని, పాంచాల దేశానికి పయనమయ్యారు. ప్రశ్న:వారి ప్రయాణం ఏ విధంగా సాగింది? సరస్సులు, నదులు దాటి, మహారణ్యాలు కూడా దాటారు. ప్రశ్న:దారిలో ఎవరు కనిపించారు? దారిలో వ్యాసుడు దర్శనమిచ్చాడు. పాండవులు వ్యాసునికి మ్రొక్కి, పూజించి, ఆయనకు ఆసనం చూపారు. వ్యాసుడు కూర్చున్నాడు. ప్రశ్న:వ్యాసుడు పాండవులకు ఏ వివరాలు చెప్పాడు? పూర్వం ఒక ముని కన్యకు భర్త లభించలేదు. ఆమె తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమై, వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆ ముని కన్య, భర్త కావాలి అని ఐదు సార్లు అంది. అందుకు శివుడు, ‘నీకు రాబోయే జన్మలో ఐదుగురు భర్తలు వస్తారు’ అని వరం ఇచ్చాడు. ఇప్పుడు ఆమె ద్రుపదుని కుమార్తెగా జన్మించింది., ద్రుపదులు ఆమె స్వయంవరం చాటించాడు. మీరు కాంపిల్య నగరానికి వెళ్లండి’ అని చెప్పి వ్యాసుడు అంతర్థానమయ్యాడు. ప్రశ్న:పాండవులు ఏమనుకున్నారు? పాండవులు వ్యాసుని మాట విన్నారు. తమకు మేలు జరుగుతుంది అనుకుని ప్రయాణం సాగించారు. ప్రశ్న: ఒకనాటి రాత్రి ఏం జరిగింది? ఒకనాటి రాత్రి వారు గంగానది ఒడ్డుకు చేరారు. గంగలో స్నానం చేయదలచారు. అర్జునుడు కొరివి తీసుకుని ముందు నడిచాడు. మిగిలినవారు అతడిని అనుసరించారు. ప్రశ్న:అంతుకు ముందే అక్కడకు ఎవరు వచ్చారు? అంగారపర్ణుడు అనే గంధర్వుడు భార్యాసహితంగా అక్కడికి వచ్చారు. అతడు పాండవుల అడుగుల చప్పుడు విన్నాడు. దూరం నుంచి హెచ్చరించాడు. వింటినారి ధ్వని చేశాడు. ప్రశ్న:ఆ గంధర్వుడు ఏమన్నాడు? ఎవరు వస్తున్నారు. ఆగండి. ఉభయ సంధ్యలు అర్ధరాత్రులు సకల భూత యక్ష రాక్షస గంధర్వాదులవి. అర్ధరాత్రులు మానవులు సంచరించటానికి భయపడతారు. మీరు ఎందుకు ప్రమాదం కోరి తెచ్చుకుంటున్నారు అన్నాడు. ప్రశ్న:అంగారపర్ణుడు తన గురించి ఏమని చెప్పుకున్నాడు? నేను అంగారపర్ణుడిని. గంధర్వుడిని. కుబేరుని మిత్రుడిని. ఈ గంగ నాది. ఇక్కడ గంగకు అంగారపర్ణ అని పేరు. ఈ గంగ నాది, ఈ వనం నాది. ఇక్కడికి ఎవరు వచ్చినా నేను అడ్డుకుంటాను.. అన్నాడు. – నిర్వహణ: డా. పురాణపండ వైజయంతి -
ఈ కడుపుకోత ఇంకో తల్లికెందుకు!
కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. శిబిరాలు వేసి ఉన్నారు. ఉప పాండవులు యుద్ధభూమికి వెళ్ళలేదు. చిన్న పిల్లలు. గాఢనిద్రలో ఉన్నారు. అశ్వత్థామకు ఉన్మాదం కలిగింది. తొడలు విరిగిపోయి పడి ఉన్న దుర్యోధనుడి దగ్గరకు వెళ్ళి ‘నీ పగను నేను చల్లారుస్తా’ అన్నాడు. పాండవులమీదికి యుద్ధానికి వెళ్లడం ఎలా! రాత్రివేళ ఆలోచిస్తూ కూర్చున్నాడు. అకస్మాత్తుగా ఎక్కడినుంచో ఒక గుడ్లగూబ వచ్చి చెట్టుమీద ఉన్న ఒక పక్షి గూట్లో పెట్టిన పిల్లలను తన వాడి ముక్కుతో చీల్చి చెండాడేసింది. అది చూసిన అశ్వత్థామ పిచ్చెక్కిన వాడిలా అయిపోయాడు. శిబిరం మీద పడిపోయి నిద్రపోతున్న ధృష్టద్యుమ్నుడి కంఠాన్ని తుంచేసాడు. ఏనుగుల కుంభస్థలాలు బేధించాడు. గుర్రాల్ని చంపేసాడు. ఐదుగురు ఉపపాండవుల కుత్తుకలు కత్తిరించేసాడు. ఇన్నీ చేసాక అర్జునుడు గుర్తొచ్చాడు. ఐదుగురి కొడుకులను చంపానని తెలిస్తే నన్ను బతకనీయడనుకుని పారిపోయాడు. మరునాడు ద్రౌపదీ దేవి ఏడుస్తున్నది. పాండవులు తిరిగొచ్చారు. అంతకన్నా కష్టం లోకంలో మరొకటి ఉంటుందా ఏ స్త్రీకయినా! ముందు ఐదుగురి శవాలు పెట్టుకుని గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నది.. ‘నీ కొడుకులను తెగటార్చిన వాడిని పట్టి తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పారేస్తా, నీ ఇష్టమొచ్చినట్లు శిక్షించు’ అన్నాడు అర్జునుడు. అన్నట్లే అశ్వత్థామను పశువును కట్టినట్లు కట్టి తీసుకొచ్చి ద్రౌపది ముందు పడేసాడు. వీడే నీ పుత్రులను చంపినవాడు, నీ కాలుతో వీడి తల తన్ను– అన్నాడు. ద్రౌపదీదేవి అశ్వత్థామ దగ్గరకు వెళ్లి–అయ్యా! నా కొడుకులు యుద్ధభూమికి రాలేదు.కవచం కట్టుకోలేదు. ఏ అస్త్ర ప్రయోగం చేయలేదు. అటువంటి పిల్లలు నిద్రపోతున్న వేళ రాత్రికి రాత్రి కబళించేసావా? నీకు చేతులెలా ఆడాయి?’ అంది. ఐదుగురు భర్తలు నిలబడి ఉన్నారు. ఆవేశంతో ఊగిపోతున్నారు. ఊ.. అంటే చాలు భీమసేనుడు అశ్వత్థామ తలను వేయి వక్కలు చేసేస్తాడు. కానీ ఆ క్లిష్ట సమయంలో ఆవిడ ఏమన్నదో తెలుసా...‘కొడుకులు చచ్చిపోయి నేను ఏడుస్తున్నా. ద్రోణాచార్యుల వారితో కలిసి సహగమనం చేయకుండా ద్రోణుడి భార్య ఉన్న ఒక్క కొడుకు కోసమని ఇంటిదగ్గరుంది. ఆమె కొడుకు చచ్చిపోలేదు. నా ఐదుగురు బిడ్డల్ని చంపేసాడనే కోపంతో పాండవులు అశ్వత్థామను ఎక్కడ చిత్రవధ చేసేస్తారన్న భయంతో ఎంత ఏడుస్తోందో! గురుపత్ని ఏడుపు మన వృద్ధికి ప్రతిబంధకం కాకూడదు. వీడిని మనం చంపకూడదు. వీడు చేసిన తప్పు వీడినే కాల్చేస్తుంది. నేను పడుతున్న బాధ నాకు తెలుసు. వేరొక తల్లి ఎందుకు పడాలి. వదిలిపెట్టేయండి’’ అన్నది. అంత గొప్పగా మాట్లాడడం, ధర్మానికి కట్టుబడడం తెలిసిన మహాతల్లులు పుట్టిన జాతి ప్రపంచంలో ఎక్కడయినా ఉంటే–అది సనాతన ధర్మంలో మాత్రమే. -
ద్రౌపదిగా దీపిక
‘మహాభారతం’ ఇతిహాసం ఆధారంగా ఇప్పటికే చాలా చిత్రాలు వచ్చాయి. తాజాగా బాలీవుడ్లో మరో చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలో ద్రౌపది పాత్రలో దీపికా పదుకోన్ నటించనున్నారు. ఈ సినిమాను మధు మంతెన, దీపికా పదుకోన్ నిర్మించనున్నారు. రెండు మూడు భాగాలుగా ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. తొలి పార్ట్‌ను 2021 దీపావళికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దీపిక. ‘‘ద్రౌపది పాత్రలో నటించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గౌరవంగా ఫీల్ అవుతున్నాను. నా జీవితాంతం గుర్తిండిపోయేలా ద్రౌపది పాత్ర వెండితెరపైకి వస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు దీపిక. ‘‘మహాభారతం గురించి, ఈ గ్రంథం ద్వారా వచ్చిన సినిమాల గురించి మనందరికీ తెలుసు. కానీ మా సినిమా ద్రౌపది దృష్టి కోణంలో సాగుతుంది. కొత్తగా, ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమాకి ఎవరు దర్శకత్వం వహిస్తారనే విషయాన్ని, ఇతర నటీనటుల వివరాలను త్వరలో చెబుతాం’’ అన్నారు మధు మంతెన. -
డాలస్‌లో వైభవంగా ద్రౌపది నాటక ప్రదర్శన
డాలస్ : మహర్నవమి పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 6న డాలస్‌లో సరసిజ థియేటర్స్ నిర్వహించిన ద్రౌపది నాటక ప్రదర్శన అక్కడి తెలుగువారిని ఉర్రూతలూగించింది. డాలస్‌లోని అర్వింగ్ ఆర్ట్స్ సెంటర్లోని కార్పెంటర్ థియేటర్లో దాదాపు రెండు గంటల పాటు నాటక ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనకు దాదాపు 700 మంది తెలుగు నాటకాభిమానులు హాజరయ్యారు. ఈ ద్రౌపది నాటకాన్ని నిర్వహించిన సరసిజ థియేటర్స్ 'హెల్పింగ్ హ్యాండ్స్ హ్యుమానిటీ' స్వచ్ఛంద సంస్థ ద్వారా అనాథ పిల్లలకు తోడ్పాటుగా నిధుల సేకరణను లక్ష్యంగా పెట్టుకున్నారు. నాటకాన్ని ద్రౌపది జననం నుంచి మొదలు పెట్టి, ద్రోణ-ద్రుపద వైరం, ద్రౌపది కళ్యాణం, రాజసూయ-మయసభ దృశ్యాలు, దుష్టచతుష్టయాల కుట్రలు, ద్రౌపది వస్త్రాపహరణం, కీచక వధ, శ్రీకృష్ణ నిర్యాణం- ద్రౌపది నిర్వేదం, ద్రౌపది శ్రీకృష్ణునిలో కలిసిపోవడం వరకు నాటకంలో ప్రదర్శించారు. కాగా, ద్రౌపది నాటకం ఆద్యంతం ముగ్ధ మనోహరమైన మాటలు, ఉద్వేగ భరితమైన సన్నివేశాలతో వీక్షకులకు ఒక దృశ్య కావ్యంలా కనిపించింది. ఉదయగిరి రాజేశ్వరి గారు దర్శకత్వ బాధ్యతలు చేపట్టడమే గాక కీలకమైన ద్రౌపది పాత్రను పోషించారు. కార్యక్రమ ప్రణాళిక రచన,ఆర్థిక సేకరణలకు పోనంగి గోపాల్, రాయవరం విజయ భాస్కర్ సహకరించారు. శ్రీకృష్ణునిగా కర్రి బాల ముకుంద్, ద్రోణ-ధర్మరాజు పాత్రలలో శంకగిరి నారాయణ స్వామి, ద్రుపదుడిగా కరుణాకరం కృష్ణ, వేద వ్యాసునిగా గండికోట మధు, భీష్మునిగా చెరువు రామ్, విదురునిగా కస్తూరి గౌతం, ధృష్టద్యుమ్నగా కామరాసు రవి, దుర్యోధనునిగా కవుతారపు రవి, దుశ్శాసనునిగా ఆదిభట్ల మహేష్, శకునిగా మామిడెన్న సందీప్, కర్ణునిగా మన్యాల ఆనంద్, అర్జునుడిగా జోస్యుల ప్రసాద్, భీమునిగా రాయవరం విజయ భాస్కర్, నకుల-సహదేవులుగా కోట కార్తీక్, నట్టువ పవన్, కుంతీ మాతగా జొన్నలగడ్డ భవాని, కీచకునిగా జలసూత్రం చంద్ర, రాజగురువుగా బసాబత్తిన శ్రీనివాసులు నటించారు. అంజన, మానస, వంశీ, వెంకటేశ్, సాకేత్, యశస్విని, సంప్రీత్ బాల వంటి యువకళాకారులు నాటకంలో మిగతా పాత్రలను పోషించారు. ద్రౌపది నాటకాన్నిజయప్రదం అయ్యేలా సహకరించిన ప్రతీ ఒక్కరికి సరసిజ అధ్యక్షురాలు ఉదయగిరి రాజేశ్వరి ధన్యవాదాలు తెలిపారు. -
సైరంధ్రి
అవి విశ్వనాథ బందరు హైస్కూల్లో ఫిఫ్త్ ఫారం (10వ తరగతి) చదువుతున్న రోజులు. వారికి తెలుగు పండితులు చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి. ఒకరోజు జిల్లా విద్యాధికారి పాఠశాల తనిఖీ నిమిత్తం వచ్చారు. తిక్కన భారతంలోని కీచకవధ ఘట్టం సాగుతోంది. ద్రౌపదీదేవి సైరంధ్రిగా ఉందని చెబుతుండగానే, సైరంధ్రికి వ్యుత్పత్తి ఏమిటని ప్రశ్నించారు విద్యాధికారి. విశ్వనాథ సహా విద్యార్థులంతా తెలీదన్నారు. అప్పుడు చెళ్లపిళ్లనే అడిగాడు విద్యాధికారి. ‘‘ఇతఃపూర్వం నేను పరిశీలించలేదు. ఇప్పుడు తెలియదు. ఇకముందు చూచే ఉద్దేశ్యం కూడా లేదు’’ అంటూ కటువుగా జవాబిచ్చారు. అందుకా విద్యాధికారి ‘‘నాకూ తెలీకే అడుగుతున్నా’’ అన్నారు. ‘‘తెలీకపోతే తూర్పుతిరిగి దణ్ణంపెట్టు’’ అని పెంకిగా జవాబిచ్చారు చెళ్లపిళ్ల. ఆ అధికారి బిక్కచచ్చి క్లాసులోంచి వెళ్లిపోయారు. ఆయనటు వెళ్లగానే, ‘‘స్వైరంధ్రియతి ఇతి సైరంధ్రీ – అనగా తనకు ఇష్టం వచ్చినట్లు ఉండగల స్త్రీ అని అర్థం’’ అంటూ చెప్పి, ‘‘ఇప్పుడు వచ్చిన ఈ అధికారి వున్నాడే– మన డ్రాయింగ్ మాస్టరును తీసివేయమని వ్రాశాడట. పాపం అతనికి ఆరుగురు సంతానం. పేదవాడు. ఈ ఉద్యోగమూ లేకుంటే ఎలా బ్రతుకుతాడు? అందుకే నాకు కోపం వచ్చింది. డ్రాయింగ్ మాస్టర్ని తీసివేయవలసివస్తే మా ఇద్దర్నీ తీసివేయమని చెప్పాను. నన్ను వదులుకోవడం ఇష్టం లేదు కాబట్టి ఆ డ్రాయింగ్ మాస్టర్నీ తీసివేయలేకపోయారు. ఒకరి పొట్టగొడితే నీకేమొస్తుందయ్యా! అన్నా వినడే! అందుకే అలా ప్రవర్తించవలసి వచ్చింది’’ అంటూ వివరించారు చెళ్లపిళ్ల. -డి.వి.ఎం.సత్యనారాయణ -
స్త్రీ పురుషుడు
కమలహాసన్ గతంలో ‘భామనే సత్యభామనే’ సినిమాలో బామ్మగా నటించడం గుర్తుండే ఉంటుంది. హిందీలో మళ్లీ అలాంటి ఛాయలున్న పాత్రనే ఆయుష్మాన్ ఖురానా చేస్తున్నాడు. ‘విక్కీ డోనర్’, ‘జోర్ లగాకే హైస్సా’, ‘అంధా ధున్’ సినిమాలతో బాలీవుడ్లో మంచి గిరాకీ ఉన్న నటుడుగా పేరు పడ్డ ఆయుష్మాన్ ఖురానా తాజాగా ‘డ్రీమ్ గర్ల్’ అనే హాస్య చిత్రానికి పని చేస్తున్నాడు. హిందీ టెలివిజన్‌లో ‘కామెడీ సర్కస్’, ‘కపిల్ శర్మ షో’ వంటి షోలకు వందలాది ఎపిసోడ్స్ రాసిన రాజ్ శాండిల్య తొలిసారిగా దర్శకుడిగా మారి ఈ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో ఆయుష్మాన్ ఆయా పరిస్థితులను బట్టి రామాయణంలో సీతలాగా, భారతంలో ద్రౌపదిలాగా, కృష్ణలీలలో రాధలాగా వ్యవహరిస్తాడట. అంటే ఈ పురుషుడు మూడు స్త్రీ పాత్రలను అనుసరించనున్నాడన్న మాట. ఉత్తర ప్రదేశ్‌లోని చిన్న టౌన్లో జరిగే ఈ కథకు అనుగుణంగా హిందీ, హరియాణా యాసలను నేర్చుకునే పనిలో ఉన్నాడట ఆయుష్మాన్ ఖురానా. కొత్త టాలెంట్ ఎక్కడున్నా గుర్తించి అవకాశం ఇచ్చే ఏక్తా కపూర్ ఈ సినిమాకు ఒక నిర్మాత. సినిమాలో ఈ ‘హీరో–యిన్’కు హీరోయిన్ ఉంది. నుస్రత్ బరూచా ఆ బాధ్యత నిర్వర్తించనుంది. -
ద్రౌపదిని తూలనాడటం తగునా?
అభిప్రాయం కురుక్షేత్ర యుద్ధానికి ద్రౌపదే కారణం అనడం నిరాధారం. దుర్మదాంధుడు దుర్యోధనుడే సూది మొన మోపిన భూమిని కూడా ఇవ్వనని యుద్ధానికి తెరతీశాడు. ద్రౌపదిని నన్నయ ప్రసన్నమూర్తిగా, పవిత్ర భామినిగా వర్ణించాడు. ఆమె ధర్మాచరణం, కర్తవ్యనిర్వహణం, అతిథి సత్కారం, క్షమాచిత్తం అనితర సాధ్యమన్నాడు. ఆమె పతుల మాటను అతిక్రమించి నట్టు ఎక్కడా లేదు. వ్యాసునికి ఆమె ‘బ్రహ్మవాదిని’, నన్నయ్యకు ‘తపస్విని’. ఆమెను అవమానించటం అంటే వ్యాçసుడిని, శ్రీకృష్ణుడిని, కవిత్రయ భారతాన్ని అవమానించినట్టే. తరతరాలుగా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలో స్త్రీలకు పెద్దపీట వేస్తు న్నామని చెబుతున్నా ఆచరణలో అది అంతగా కనిపించడం లేదు. మొత్తం సంస్కృతి అంతా స్త్రీ శీలం చుట్టే తిరుగుతూ ఒక రకమైన అణచివేతకు గురి చేశారు. ఎన్నో సంస్కరణల తర్వాత ఇప్పుడిప్పుడే స్త్రీలు కొంత ఊపిరి పీల్చుకుని అన్ని రంగాల్లో ముందుకు దూసుకువెళ్తున్నా, ఇప్పటికీ ఆమె పట్ల మగవారికున్న చులకన భావం తగ్గలేదు. తాజాగా గోవాలో బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రసంగిస్తూ ద్రౌపది పాత్ర మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయ డమే అందుకు ఉదాహరణ. ద్రౌపది మొదటి స్త్రీవాది అని, ఆమె పంచభర్తృక అని అన్నారు. ఇంతవరకు పెద్ద ఇబ్బందేమీ లేదు. తర్వాత ఆయన మాట్లాడిన మాటల్లో ద్రౌపది పట్ల ఆయనకు ఎంత వ్యతిరేక భావముందో అర్థమౌ తుంది. ఆమె అస్సలు భర్తల మాట వినేది కాదని, ఆమే యుద్ధాన్ని ప్రోత్స హించి 18 లక్షల మంది చనిపోవటానికి కారణమైందని, లేకపోతే పాండవులు ఐదు ఊళ్లతోనే సరిపెట్టుకునేవారంటూ... కేవలం ఆమె వల్లనే సర్వనా శనం జరిగినట్లు చెప్పుకొచ్చారు. ఆయన కూడా పాపం అందరి మొగాళ్లలా గానే ఆలోచించారు. ఏ తప్పయినా స్త్రీలే చేస్తారు తప్ప పురుషులు కాదని ఆయన భావం. చూడబోతే రాంమాధవ్ మహా భారతం సరిగ్గా చదవలేదనిపిస్తోంది. 18 అక్షౌహిణులు అంటే ఆయన దృష్టిలో 18 లక్షలని. పండితులను అడిగి ఆయన ఆ లెక్కను తెలుసుకుంటే బావుంటుంది. ఒక అక్షౌహిణి అంటేనే 20 లక్షలపైగా ఉంటుంది. ద్రౌపది తప్పేమిటి? ఇక ద్రౌపది యుద్ధాన్ని ప్రోత్సహించి లక్షలాది మందిని చంపించిందనే మాట... కేవలం స్త్రీలపట్ల తేలిక భావంతో అన్నదే. ఈ దేశానికి కావలసింది సీతాదమయంతులు కారు, ద్రౌపదిలా నిలదీసేవారు’ అన్నారు రామ్‌మనో హర్ లోహియా. ‘పైకి చూడటానికి మన దేశంలో స్త్రీల స్థానం గొప్పదిగానే కనిపించవచ్చు. కానీ సమాజంలో ఆమె స్థానం ఏమంత పెరిగినట్లు కనిపిం చదు. ఆమె వ్యక్తిత్వాన్ని పురుష సమాజం గౌరవించదు. ఇప్పటికీ ఆమె బందీ గానే ఉన్నది. స్త్రీపురుషులు భుజం భుజం కలిపి సాగినప్పుడే మానవ సంస్కృతి వికసిస్తుంది. దానికి భారత మహిళ చాలా దూరంలో ఉంది’ అన్నారాయన. ఉత్తర భారతంలోని కొన్ని దేవాలయాల్లో రాముడి పక్కన సీతామాత విగ్రహం పెట్టరు. వాళ్ల దృష్టిలో ఆమె దూషిత అట, రాముడి పక్కన ఆమెకు స్థానం లేదట! ఈ విపరీత భావజాలంలోనే హైందవ సంస్కృతి ఇంకా కొట్టుమిట్టాడుతుండటం దురదృష్టకరం. రాంమాధవ్ ద్రౌపది మీద చేసిన విమర్శలో అది చాలా స్పష్టంగా అర్థం అవుతున్నది. ఆ విమర్శలో ఎంత నిజముందో తెలుసుకోవడానికి ఒక్కసారి వ్యాస భారతం, కవిత్రయ భారతం ద్రౌపది పాత్రను ఎలా చిత్రించాయో చూడటం అవసరం. పెద్దల ఆదేశం మీద ఐదుగురిని పెండ్లాడి కూడా తన వ్యక్తిత్వాన్ని, స్త్రీ విలు వలను కాపాడుకున్న మహిళ ద్రౌపది. కురుక్షేత్ర యుద్ధం ప్రధానంగా భారతంలోని రాజవంశాలు, వారి సంబంధాలు, వ్యక్తిపరమైన సంఘర్షణల మధ్య నడచిన కథే. బాల్యం నుండి దాయాద ద్వేషంతో రగిలిపోయిన దుర్యోధనుని అహంకారానికి, నీచ వెన్ను పోటు రాజకీయానికి నిదర్శనమే ఈ యుద్ధం. ఏదో విధంగా దాన్ని ఆడవాళ్ల మీదకు తోసేయడం మాని వాస్తవాలు చదవండి– ద్రౌపదేమిటో అర్థమౌ తుంది. ఒక రకంగా చూస్తే ద్రౌపదిని పెండ్లాడే వరకు పాండవులు నిర్భా గ్యులు. చక్రవాకపురంలో బిచ్చమెత్తి బతుకుతున్నవాళ్లు. బలవంతులయినా నిస్సహాయులు, అనాథలు. దాయాదుల కుట్ర నుండి ఎలాగో బయటపడి మారువేషాలతో జీవిస్తున్న వాళ్లు. ద్రౌపదిని వివాహం చేసుకున్నాకే వాళ్ల వీరత్వమేమిటో లోకానికి తెల్సింది. ద్రౌపది పాంచాల దేశపు యువరాణి. తండ్రికి ప్రీతిపాత్రురాలు. అన్ని విద్యలు నేర్చుకున్న ధీశాలి. ఆనాటి బలమైన రాజ్యాల్లో ఒకటయిన పాంచాల దేశం ఆమె కనుసన్నల్లో నడిచింది. వ్యాసుడు, కవిత్రయం ఏం చెప్పారు? తనకు ఇష్టం లేకపోయినా వ్యాసుడు, కృష్ణుడు చెప్పిన మీదటే పాండవులు ఐదుగురిని పెళ్లాడవలసి వచ్చింది. చేసిన వాళ్లను, చేసుకున్నవాళ్లను వదిలేసి ఆమెనొక్క దాన్నే నిందించడం ఏం ధర్మం? ఆమెతో పాటు పాండవులకు అంతులేని ఐశ్వర్యం, అండ, పలుకుబడి పెరిగాయి. నిర్భయంగా మారు వేషాల నుండి బయటపడటమే కాకుండా హస్తిన రాజ్యంలో భాగం ఇమ్మని అడిగే ధైర్యం కూడా వచ్చింది. పాంచాలను చూసి భయపడిన దృతరాష్ట్రుడు పాండవులకు రాజ్యభాగం ఇవ్వక తప్పలేదు. ఆ తదుపరి చేసిన రాజసూయ యాగంతో పాండవులకు అనంతమైన సంపదలు సమకూరటంతో పాటూ అప్రతిహతమైన కీర్తిప్రతిష్టలు పెరిగాయి. చెప్పాలంటే అప్రతిష్టపాలై, అనా మకులై అగాధ సముద్రంలో కొట్టుమిట్టాడుతున్న పాండవులను ఒడ్డుకు చేర్చిన దేవత ద్రౌపది. తన సహనంతో అన్నదమ్ముల మధ్య కలతలు రాకుండా కాపాడుకుంటూ వచ్చిన ధర్మశీల. ధర్మరాజు వ్యసనానికి కౌరవ సభలో అవమానం పాలై కూడా ఆమె తన భర్తల దాస్యం పోగొట్టమని కోరుకుని వాళ్ల రాజ్యాన్ని తిరిగి ఇప్పించిన పతివ్రత. పురస్కాత్కరణీయం మేనకృతం కార్యముత్తరం / విహ్వలాస్మి కృతానేన కర్షతా బలినా బలాత్ / అభివాదం కరోమ్యేషాం కురూణాం కురుసంపది / నమేస్యాద పరాధో యం యదిదం న కృతం మయా ‘‘ అంటూ వ్యాసుడు మూల మహాభారతంలో ద్రౌపది సంస్కారాన్ని ప్రశం సించాడు. దుశ్శాసనుడు తనను బలవంతంగా సభకు లాక్కురాగా భయ విహ్వలంతో ఆమె సభకు నమస్కారం చెయ్యటం మర్చిపోయి, తప్పు తెల్సు కుని కురువృద్ధులందరిని క్షమాపణ అడిగి అభివాదం చేసిందట. దుర్భరమైన వేదనలో కూడా సభావందనం చేసిన గొప్ప సంస్కారవతి అని దీని అర్థం. ఇంతమంది కురువృద్ధులు, గురువృద్ధులున్న సభలో ఒక స్త్రీకి అవమానమా అని ప్రశ్నించి వారిని తలదించుకునేటట్లు చేసింది. ఆమె ప్రశ్న అన్ని తరాల దురహంకారులకు వర్తిస్తుంది. చట్టాలు–ప్రభుత్వాలు, సంస్కరణలు, పోలీసు వ్యవస్థ ఎన్నివున్నా అహంకారంతో మహిళా అధికారులను వేధిస్తున్న తీరు చూస్తేనే ఉన్నాం. భూకబ్జాలకు పాల్పడిన వారిని ప్రశ్నించినందుకు దళిత యువతి బట్టలూడదీసి కొట్టిన పాలకాహంకారాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్నాం. ఐదు వేల సంవత్సరాల క్రితమే ద్రౌపది ఇటువంటి అవమానాలు ఎదు ర్కొని కూడా చివరి వరకు ధర్మవిజిత లాగానే నిలబడింది తప్ప తన తండ్రిని దుర్యోధనుని మీదకు ఉసిగొల్పలేదు. భర్తలతోపాటు అడవులకు వెళ్లిందే కాని పుట్టింటికి వెళ్లలేదు. పాండవుల మిగతా భార్యలెవ్వరూ ఈ ధర్మాన్ని పాటిం చలేదేం? అరణ్యవాసంలో భర్తలను ఎంతో భక్తిగా సేవించింది. వచ్చిన అతి థులకు తనే స్వయంగా వండి వడ్డించింది. కంద మూలాలు తిన్నది. యజ్ఞాలు చేసింది. చివరకు అజ్ఞాతవాసంలో విరాట్ రాజ్యంలో అతని భార్యకు దాసిగా కూడా పనిచేసింది పాంచాల రాకుమారి. ధర్మరాజు అసమ ర్థతను కప్పిపుచ్చి అతని ధర్మనిరతిని పొగిడి పొగిడి చెప్పింది. ఇక 18 లక్షల సైన్యం ఆమె వల్లనే చనిపోయారనేది ఎంత అవాస్తవమో భారతం చదివితే అర్థమౌతుంది. సంధి ప్రయత్నంలో భాగంగా చివరకు ఐదుగురికి ఐదు ఊళ్లు ఇచ్చిన చాలని యుద్ధం వద్దని ధర్మరాజు శ్రీకృష్ణునికి చెప్పిన సందర్భంలో ఆమె అక్కడే ఉంది. మరి ఎందుకు వద్దని వారించలేదు. ఆమె వద్దంటే శ్రీకృష్ణుడు సంధి కోసం కౌరవసభలో రాయబారాన్ని సాగించే వాడా? అయినా దుర్మదాంధుడు, దురభిమాని అయిన దుర్యోధనుడు ఐదు ఊళ్లు కాదు కదా సూది మొన మోపిన భూమిని కూడా ఇవ్వనని చెప్పి యుద్ధా నికి తెర తీశాడు కదా. ఇందులో ద్రౌపది తప్పేమిటి? భారతంలో ఆమె పాత్రను ఎంతో హుందాగా, గొప్ప స్త్రీగా వర్ణించారు. ఆమె పుత్రులైన ఉపపాండువులను అశ్వత్థామ అన్యాయంగా చంపినప్పుడు, అంత దుఃఖంలో కూడా అతనికి ప్రాణభిక్ష పెట్టిన క్షమామూర్తి ద్రౌపది. అలాగే కౌరవుల సోదరి దుస్సల భర్తౖయెన సైంధవుడు తనను చెరచడానికి ప్రయత్నించినప్పుడు కూడా అతని ప్రాణాలు కాపాడి బంధుత్వ విలువలను రక్షించింది ద్రౌపది. ఇలా చెప్పుకుంటూ పోతే భారతమంతటా ఆమె గొప్పత నాన్ని కీర్తించడమే కనిపిస్తుంది. ఈ విమర్శలకు అర్థం వ్యాసుడిని అవమానించడమే! నన్నయ రచనలో ఆమె ప్రసన్నమూర్తిగా, పవిత్ర భామినిగా, స్వీయ నాయ కిగా, ముగ్ధ వధువుగా దర్శనమిస్తుంది. ఆమెకున్న ధర్మాచరణం, కర్తవ్య నిర్వహణం, అతిథి సత్కారం, క్షమాచిత్తం అనితర సాధ్యమని నన్నయ వర్ణి స్తాడు. ఆయన రచనలో ఆమె ఎన్నడూ పతుల మాటను అతిక్రమించడం కానీ, నిరసన వాక్యాలతో నిందించటం కానీ కనిపించదు. వ్యాసుని దృష్టిలో ‘బ్రహ్మవాదిని’. నన్నయ ఆమెను తపస్వినిగా చూపించాడు. ధీర గంభీర ఉదాత్తత కలిగిన ఆమె ధర్మాచరణం ఇతర స్త్రీలకు ఆదర్శం అని నన్నయ చెప్పిన ద్రౌపదిని ఏ ఆధారంతో ఈ బీజేపీ నాయకులు విమర్శించారో సమాధానం చెప్పాల్సి ఉంది. ఆమెను అవమానించటం అంటే వ్యాసుల వారిని, శ్రీకృష్ణుడిని, కవి త్రయ భారతాన్ని అవమానం చేసినట్టే అవుతుంది. దయచేసి అరకొర జ్ఞానంతో మహిళల త్యాగాల్ని అవమానించకండి. ఆమె లేకపోతే లోకమే లేదు, సమాజ అభివృద్ధి లేదు. వేదం కూడా హరీయో దేవీ – యుషసహం – యోచమానాసురీయః/ సీయోప్రానాభ్యేతు పశ్చాత్ అని చెబుతున్నది. లోకాన్నే వెలిగించే సూర్యుడు ఛాయాదేవిని అనుసరించి నడచినట్లు ఈ ప్రపంచం కూడా స్త్రీలను అనుసరించే నడుస్తున్నది అని అర్థం. తరుణి ద్రౌపది యిట్లు పాండవ దార్తరాష్ట్రులదైన భీ / కర పరస్పర కోపవేగముగ్రన్న బాచి విపత్తి సా / గర నిమగ్నుల నుద్ధరించె బ్రకాశకీర్తుల ధీరులం / బురుష సింహులనున్ నిజేశుల బూనితద్దయు బ్రీతితోన్ (భారతం : సభాపర్వం) అన్నీ కోల్పోయి అవమానంతో బాధపడుతున్న పాండవులను ద్రౌపది ఉద్ధరించిన తీరును చెప్పి, ఆ మహాదేవికి నీరాజనమిచ్చాడు నన్నయ. స్త్రీలను గురించి తెల్సుకోండి, స్త్రీ జాతిని అవమానించకండి. డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి వ్యాసకర్త సాహితీవేత్త, వైఎస్సార్సీపీ నాయకురాలు -
జ్ఞానమూర్తి... గీతాచార్య
సందర్భం శ్రీ మహావిష్ణువు దశావతారాలలో అత్యంత విలక్షణమైనదీ, జ్ఞానస్మృతి కలిగినదీ శ్రీ కృష్ణావతారం. సకల జీవులలో తానే ఉన్నానని తనను తాను స్వయంగా భగవానుడిగా ప్రకటించుకున్న మధుసూదనుడాయన. సమస్త భూమండలాలలో యదువంశ శిరోమణి అయిన శ్రీ కృష్ణభగవానుడు అందరినీ మించిన పూజార్హుడని వేదం చెబుతుంది. పిలవగానే పలికే దైవం శ్రీమన్నారాయణుడే అని అనడానికి కారణాలెన్నో ఉన్నాయి కానీ, వాటిలో ముఖ్యమైనవి కొన్ని... వాసుదేవుని ఎంతో ఆరాధించే పాండవులతోపాటు ద్రౌపదికి జరిగిన అవమానం ఇప్పుడు ప్రస్తావిస్తే.. నిస్సహాయులైన తన భర్తలను చూసి రోదిస్తూ నిండుసభలో ద్రౌపది పరాభవ సమయంలో త్వమేవ శరణం అని పిలవగానే వచ్చి తన శీలాన్ని కాపాడిన కృష్ణుడిని సోదర భావంతో ఆరాధించేది. ఎప్పుడు కష్టం కలిగినా, నేనున్నాను అని అన్నయ్య స్థానాన్ని తీసుకుని ద్రౌపదికి ఆపద్బాంధవుడయ్యాడు ఈ గోకుల నందనుడు. తనను ఆరాధించే వారికి తానున్నానంటూ అక్కున చేర్చుకునే దయాహృదయుడు వాసుదేవుడు. అర్జునుడికి ఒక ఇష్టసఖుడనే కాకుండా తనని ఎప్పుడూ మంచి స్నేహితునిగా చూసే శ్రీకృష్ణభగవానుడు, ధర్మక్షేత్రంగా పేరుగాంచిన కురుక్షేత్ర రణరంగంలో యోధానుయోధుల నడుమ నిలిచి శోకమోహాలలో మునిగిన అర్జునుడికి గురువై తత్వ దర్శనం కలిగించాడు. శకునికి మాయారూపిగా, విదురునికి ధర్మాత్మునిగా ఇలా అనేకులకు అనేకవిధాలుగా దర్శనం ఇవ్వడం శ్రీమన్నారాయణుడికే సాధ్యం. నీతిశాస్త్ర కోవిదుడు అయిన విదురుడు శ్రీకృష్ణభగవానుడి గురించి అనేక సందర్భాలలో మహారాజు ధృతరాష్ట్రునికి, సభికులందరికీ శ్రీకృష్ణుడి జీవితం ఒక ధర్మశాస్త్రం అని భగవానుడి నోటినుంచి వచ్చే అక్షర ధ్వని వేదప్రమాణం అని తెలిపేవాడు. మాయాజూదగాడయిన శకునికి ఎవరివద్దనైనా తన మాయ చెల్లుతుంది కానీ శ్రీకృష్ణుని వద్ద మాత్రం సాధ్యం కాదని తెలుసు. అందుకే కృష్ణ భగవానుడు శకునికి మాయారూపిగా దర్శనం ఇస్తుండేవాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మాధవ మేధస్సుకు అందని ఆ గోవిందుడి లీలలు అనేకం. భీష్ముడే శ్రీ కృష్ణుని జగద్గురువుగా కీర్తించాడు. పరమేశ్వరుడు కూడా శ్రీ మహావిష్ణువునే ఆరాధిస్తాడని వేదాలు ఘోషిస్తున్నాయి. జయ జయ కృష్ణ. – స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి, శారదాపీఠం, విశాఖపట్నం -
ద్రౌపది
ఐదోవేదం: మహాభారత పాత్రలు - 21 ద్రౌపది ద్రుపదుడి కూతురు. ద్రుపదు డంటే, అత్యంత వైరాగ్యంతో వేగంగా బ్రహ్మపథానికి పురోగమించేవాడని అర్థం. కనక, ద్రుపదుడైన సాధకుడి ఆతృత నుంచి పుట్టుకొచ్చిన దివ్యమైన ఉత్సా హంతో ప్రేరణ పొంది, బ్రహ్మపథానికి సాగే కుండలినీ శక్తే ఈ ద్రౌపది. ఆకాశంలో శక్తి చాలామటుకు కుండలినిగా, అంటే, చుట్టబెట్టుకొని సర్పిలంగా సంచరిస్తూ ఉంటుంది. పరమాణువుల కేంద్రకాల చుట్టూ ఉన్న కర్పరాల్లో తిరిగే ఎలక్ట్రాన్ల రాసనృత్యంలోనూ సూర్యుడూ నక్షత్ర చక్రాలూ ఆకాశంలో విష్ణునాభి అనే పరమ కేంద్రం చుట్టూ పరిభ్రమించడంలోనూ ఇదే కనిపిస్తుంది. జీవ మూలాణువైన డి.ఎన్.ఎ. కూడా సర్పిలాకారమైన నిచ్చెనగా నిర్మితమై, మెలికలు చుట్టుకొన్న రెండు పాములు నిలువుగా నిలుచున్న ట్టుండే సుబ్రహ్మణ్యేశ్వర రూపంగా ఉంటుంది. చాలా పాలపుంతలు సర్పిలా కారాలే. మానవ శరీరంలోని కుండలినీ శక్తి ఇటువంటి సర్పిలమైన తేజోరూపం. పామును గుప్తమూ శక్తిమంతమూ అయిన విషయానికి గుర్తుగా వాడతారు. అది నేల లోని కన్నాల్లో దాక్కొని ఉంటుంది. వెన్ను కాండం చివర ఉన్న భూమి స్పందనలుండే మూలాధారమనే చోట బయటికి ప్రసరిస్తూ ఉండే ఈ కుండలినీ జీవశక్తినే సర్పశక్తి అని పిలుస్తూ ఉంటారు. ఇది ఒక సర్పిలాకారమైన దారిగుండా లైంగిక నాడుల్లోకి వెళ్తుంది గనకనే దీన్ని కుండలినీ శక్తి అంటారు. దీన్నే ‘ఇలీబిశం’ అని వేదం వర్ణిస్తుంది: అంటే, ఇలాబిలంలో శయనించి ఉన్నదని అర్థం. ఇలా అంటే భూమి. మూలా ధారంలో ఉన్న సర్పిలాకార మైన దోవలో ఒదిగి ఈ ‘ఇలాబిలశాయి’ నలిగినట్టై ‘ఇలీబిశం’ అయింది. వైరాగ్యానికి నేను నేస్తాన్నంటే నేను నేస్తాన్నంటూ అలవాట్లు వెంటబడి వేధిస్తూ ఆధ్యాత్మిక జీవిత యుద్ధంలో చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. ద్రోణుడు ‘నేను నీ నేస్తాన్ని’ అంటూ ద్రుపదుడి దగ్గరికి వచ్చినప్పుడు ‘నువ్వు నాకు సమ ఉజ్జీ కావు’ అని ద్రుపదుడు నిరాకరించడానికి కారణం ఇదే. వైరాగ్యం తీవ్రదశలో ఉన్నప్పుడు, అలవాట్ల హడావిడి చాలా చికాకును తెప్పిస్తుంది. అంచేతనే ద్రుపదుడనే సాధకుడు ద్రోణుడనే సంస్కారాన్ని దూరంగా ఉంచడానికే ప్రయత్నిస్తాడు. సాధకుడు ప్రాణయజ్ఞాన్నే తన చతురంగ బలంగా చేసుకొని యజ్ఞసేనుడై, తన లోపలి నిబ్బరమైన కాంతితో ‘ధృష్టద్యుమ్నుడై’, అలవాట్ల తలను ఖండించడమే గాక, యుద్ధంలో గెలుపును రాసిచ్చే, తలదిక్కునున్న ‘అహిచ్ఛత్రానికి’, అంటే, అనంతత్వమనే శేషుడే గొడుగుగా ఉన్న ఆత్మ చైతన్య క్షేత్రానికి పురోగమించడం జరుగుతుంది. యజ్ఞసేన ప్రగతి వల్ల యాజ్ఞసేని అయిన కుండలినీ శక్తి మేలుకొని ‘అహిచ్ఛత్రానికి’, అంటే, సహస్రారానికి సాగుతుంది. కుండలిని అంటే చుట్టుముట్టుకొన్న పాము అని చెప్పుకొన్నాం. పాము శక్తికి గుర్తు. ఈ శక్తిని తప్పుగా ఉపయోగించినవాడు విషమెక్కి చచ్చిపోతాడు; దీన్ని సరిగ్గా ఉపయోగించినవాడు చైతన్య సామ్రాజ్యాన్ని ఏలతాడు. ఆడదాని జడను పాముతో పోలుస్తూ ఉంటారు. అది కొప్పుగా చుట్టుకొని తలమీద ఉన్నప్పుడు, ఒబ్బిడిగా అదుపులో ఉన్న శక్తికి ప్రతీక అవుతుంది. అది విరబోసుకొని ఉన్నప్పుడు, కట్టుబాటుకు దూరమై, బయటికి ప్రసరిస్తూ దుబారా అయిపోతూన్న ప్రాణశక్తికి ప్రతీక అవుతుంది. దుశ్శాసనుడు ద్రౌపది జుట్టు పట్టుకొని, ఈడ్చుకొని వస్తూ ఆవిడ జుట్టును విరబోసినట్టు చేశాడు. ఈ విధమైన పరిస్థితి అహంకారమనే రాజు పరిపాలనకు గుర్తు. ఈ పరిపాలనలో మూలాధారశక్తి ఎప్పుడూ కలవరపడుతూ ఉంటుంది; అది తప్పుడు వినియోగానికి గురి అయి, ఇంద్రియాల అదుపులేని కోరికలకు బలి అయి ఖర్చైపోతుంది. కోరిక రూపుడైన దుర్యోధనుడు అసహ్యంగా తన ఎడమ తొడమీది గుడ్డను తీసి వికటంగా చూడడం దీని పర్యవసానమే. ద్రుపదుడి రాజ్యాన్ని పాంచాలమని అంటారు. అర్జునుడి ద్వారా ఈ రాజ్యాన్ని జయించాడు ద్రోణుడు: దాంట్లోని ఉత్తర పాంచాలాన్ని తన దగ్గరబెట్టుకొని, దక్షిణ పాంచాలాన్ని మాత్రమే ద్రుపదుడి కిచ్చాడు. పాంచాలమంటే ‘పంచానాం అలం’ - ఐదుగురికి చక్కగా సరిపోయేది అని అర్థం. ఉత్తర పాంచాలమంటే యోగ భాషలో వెనుబాములోని పైచక్రాలు; దక్షిణ పాంచాలమంటే, కింది మూడు చక్రాలూను. పైకేంద్రాల్లో పనిచేసే ప్రాణశక్తీ చైతన్యాల సూక్ష్మబలగాలు వెనుబాములో చివర ఉండే మూలాధార కేంద్రం గుండానే భౌతిక రూపాల్ని దాలుస్తాయి. ఈ రూపాలు, మూలాధారమూ స్వాధిష్ఠానమూ మణిపూరమూ అనాహతమూ విశుద్ధమూ అనే ఐదు కేంద్రాల్లో పనిచేసే భూమీ నీరూ అగ్నీ వాయువూ ఆకాశమూ అయిన ఐదు మూలకాల స్పందనల వల్ల ఏర్పడతాయి. ప్రాణశక్తి మూలాధారం నుంచి బయటికి ప్రవహిస్తూ మాంస దేశాన్నీ ఎముకల ప్రదేశాన్నీ రక్తమార్గాల్నీ వగైరా వగైరా అన్ని భాగాల్నీ సృష్టిస్తూ పోషిస్తూ పదార్థం ఐదు రూపాల్లో అవుపిస్తుంది. ఆత్మరాజు పరిపాలనలో మూలాధారంలో ఉన్న కుండలినీ ప్రాణశక్తి ప్రశాంతంగానూ అదుపులోనూ ఉంటూ రాజ్యానికి ఆరోగ్యాన్నీ అందాన్నీ శాంతినీ ఇస్తాయి. గాఢమైన ధ్యానంలో ఈ శక్తి లోపలికి మళ్లి, పైచక్రాల వైపుకు వెళ్తూ ఆత్మరాజ్యాన్ని ప్రకాశింపజేస్తుంది. కుండలినీ శక్తి పైకి ఐదు పద్మాల, లేక, చక్రాల గుండా వెళ్లడమంటే, ద్రౌపదికి ఐదుగురు పాండవులతో పెళ్లి కావడమనీ ద్రౌపదేయులు పుట్టడమనీ అర్థం. ద్రౌపదేయులంటే ద్రౌపదికి పాండవుల వల్ల పుట్టిన పిల్లలు. వీళ్లు ప్రతి కేంద్రంలోనూ ఆయా కేంద్రాలకు లక్షణాలై అవుపించే రూపాలూ కాంతులూ ధ్వనులూను. ఈ కాంతుల మీదా ధ్వనుల మీదా తన దృష్టిని కేంద్రీకరించి యోగి, దివ్యమైన విచక్షణను పొంది, మనస్సు తోనూ దాని సంతానంతోనూ, అంటే కామమూ క్రోధమూ లోభమూ మోహమూ మదమూ మాత్సర్యమూ - అంటే, దుర్యోధనుడూ దుశ్శాసనుడూ కర్ణుడూ శకునీ శల్యుడూ కృతవర్మా - మొదలైన ఆవేశ రూపాలతో పోరాడగలిగే శక్తిని ప్రయోగించగలుగుతాడు. పాండవులు లక్కింటి నుంచి బయటపడి గూఢంగా ద్రుపదుడి నగరంలో స్వయం వరానికి వచ్చినప్పుడు, శ్రీకృష్ణుడు వాళ్లను గుర్తించడాన్ని వర్ణిస్తూ వ్యాసుడు ‘పంచాభి పద్మానివ వారణేంద్రాన్ భస్మావృతాం గానివ హవ్యవాహాన్’ (ఆదిపర్వం 186-9) అంటూ పాండవుల్ని ఐదు సూక్ష్మ పద్మాల్లాగా ఐదు అగ్నుల్లాగా చెప్పడం మనం పైన చెప్పుకొన్న వివరణానికి పాదుగా ఉంది. ఈవిధంగా ద్రౌపదికి ఐదుగురు పతులుండడాన్ని అర్థం చేసుకోవాలి. ఒక స్త్రీకి ఐదుగురు మొగుళ్లుండడాన్ని జీర్ణించుకోలేనివాళ్లు అప్పుడూ ఉన్నారు ఇప్పుడూ ఉన్నారు. ఆవిడ తండ్రికే అది ఎబ్బెట్టనిపించింది. దాన్ని పోగొట్టడానికి వ్యాసుడు అతనికి ద్రౌపది మునపటి జన్మకథను చెప్పాడు: ఒక తపోవనంలో అతిరూపవతి అయిన ఒక ఋషికన్యకు పతి లభించలేదు. ఆవిడ శివుణ్ని ఉద్దేశించి తపస్సు చేసింది. శివుడు ఎదురుగా అవుపించి, వరాన్ని కోరుకోమన్నాడు. ఆవిడ ‘నాకు సర్వగుణసంపన్నుడైన పతిని ప్రసాదించ’మంటూ ఐదుసార్లు అడిగింది. ‘మరో శరీరంలో నీకు ఐదుగురు పతులు లభిస్తారు’ అని చెప్పి శివుడు అంతర్ధాన మయ్యాడు. ద్రుపదుడు ఈ కథను విని ‘దేవో హి వేత్తా పరమం యదత్ర’ (ఆదిపర్వం 197-3) అంటూ దీనిలోని రహస్యం దేవుడే ఎరుగునంటూ విస్తు పోతూనే పెళ్లిచేశాడు. ఆ రహస్యం మనం పైన చెప్పుకొన్నదే. ద్రౌపదికి ‘కృష్ణా’ అనే పేరు ఉంది. అంటే, శ్యామల వర్ణం కలదని అర్థం. శ్రీకృష్ణుడు భూమిభారాన్ని తగ్గించడానికి వచ్చేటప్పుడు అర్జునుడితో పాటు ఈ‘కృష్ణ’ను తనకు సాయం చేసే చెల్లెలిగా తెచ్చుకొన్నాడు. ఈవిడ వల్లనే పద్దెనిమిది అక్షౌహిణులు ఒకచోటికి చేరి నాశనమై పోయి భూమికి పట్టిన అధర్మభారాన్నీ అయోగభారాన్నీ తీర్చగలిగాయి. అగ్నివేది నుంచి పుట్టింది గనక, ఆ ‘కృష్ణవర్త్ముడి’, అంటే, అగ్ని మాదిరిగానే తనవైపుకు గుంజి కాల్చే శక్తిగలిగిన అగ్నిరూపమే ఈవిడ. సభలోకి తనను రమ్మనమని పిలవడానికి ప్రాతికామి వచ్చినప్పుడు, ద్రౌపది వేసిన చిక్కు ప్రశ్నకు జవాబు చెప్పడం ఎవరిచేతా గాలేదు: ‘తన్నోడి నన్నోడెనా, నన్నోడి తన్నోడెనా’ అనే ఈ ప్రశ్నకున్న సమాధానమే ఆవిడ దాసి కాలేదని నిరూపించింది. భీష్ముడంతటి మహాధర్మవేత్తే దీనికి జవాబు చెప్పడం చాలా కష్టమంటూ చేతులెత్తేశాడు: అంటే, అంతటి కురువృద్ధుడు కూడా రాజుగారి మాటకు ఎదురు చెబితే ఏమవుతుందో నన్న భయాన్ని కనబరిచాడన్నమాట. వికర్ణుడు ధృతరాష్ట్రుడి కొడుకే అయినా ఈ ప్రశ్నకు జవాబు చెప్పకపోతే సభలో ఉన్నవాళ్లందరూ నరకానికి వెళ్ల వలసివస్తుందని హెచ్చరిస్తూ ‘ధర్మరాజు జూదం మైకంలో పడి ధూర్తులైన జూద గాళ్లు పురిగొల్పడంతో ఒళ్లుమరిచిపోయి, ద్రౌపదిని పందెంగా కాశాడు. ఆమె పాండవులైదుగురికీ సమానం. ఒక్క ధర్మరాజుకే భార్య కాదు ఆవిడ. అదీగాక, తనను ముందు పణంగా పెట్టి ఓడి పోయిన తరవాతనే శకుని మాటల్లోపడి, ద్రౌపదిని ఒడ్డాడు ధర్మరాజు. ఈ విషయాల్ని పరిశీలిస్తే, ద్రౌపదిని గెలుచు కున్నామనడం తప్పే’ అని నిగ్గుదేల్చాడు. విదురుడు ఆమీద ఇలాగే తన నిష్కర్షని కరాఖండీగా చెప్పాడు: ‘తన శరీరాన్ని మొదటే ఓడాడు గనక, ఆమీద ద్రౌపదిని పణంగా పెట్ట డానికి అతనికి హక్కెక్కడిది? అధికారి కానివాడు పందెంగా పెట్టినదాన్ని గెలవడం గానీ ఓడడం గానీ కలలో డబ్బు గెలవడంతో గానీ ఓడడంతో గానీ సమానం’. అప్పుడు ధృతరాష్ట్రుడి అగ్ని శాలలో నక్కలు చొరబడి ఊళలు కూశాయి; గాడిదలు దూరి ఓండ్ర పెట్టాయి. ఈ అపశకునాల్ని చూసి గాంధారీ విదురుడు చెప్పగా, అంతదాకా ‘ఏమేమి గెలిచార’ంటూ ఆత్రుతను చూపించిన ధృతరాష్ట్రుడు మొదటికే మోసం వచ్చేలాగ ఉందని, ద్రౌపదిని పిలిచి వరాలనిచ్చి పాండవులను దాస్యం నుంచి విముక్తపరిచాడు. చెయ్యకూడని పనుల్ని చేశారు గనకనే కౌరవులు మూకుమ్మడిగా మూల్యం చెల్లించవలసివచ్చింది. దుర్యోధనుడు కండకావరం కొద్దీ ఏకవస్త్ర అయిన వదినను సభలోకి తీసుకొని రమ్మనడమూ ఆమెను తన తొడమీద కూర్చోడానికి నిస్సిగ్గుగా పిలవడమూ కర్ణుడు ప్రేరేపిం చగా దుశ్శాసనుడు ఆమె బట్టల్ని ఊడ దీయడానికి ప్రయత్నించడమూ సైంధ వుడు, వనంలో ఈవిడ ఒక్కతే ఉన్నప్పుడు కామించి ఎత్తుకొని పోవడమూ - మొదలైనవన్నీ తక్కువ తప్పులేమీగావు. అవి మూలాధారంలోని శక్తిని ఉద్వేగపరిచి అశాంతిని కలగజేస్తాయి. సింహబలుడని పేరున్న కీచకుడికీ ద్రౌపది వల్ల పరాభ వాన్ని చవిచూడడమే కాదు నికృష్టమైన చావును కూడా కౌగిలించుకోవలసి వచ్చింది. చెడ్డపని దానికదే పరిహారాన్ని చెల్లించమని ఎదురొచ్చి అడుగుతుంది. పాపిష్ఠులు వాళ్లకు వాళ్లే తమను శిక్షించు కుంటారు. ఆ శిక్షే భీమసేనుడి నోట భీకరమైన శపథంగా రూపొందింది. - డా॥ముంజులూరి నరసింహారావు -
విన్నారా..?ద్రౌపదిగా నటిస్తా!
ద్రౌపదిగా మల్లికా శెరావత్ నటిస్తే చూడాలని ఉందా...? ఎప్పుడు... ఏంటి అని మాత్రం అడగకండి. ఇది ఆమె మనసులోని కోరిక. గ్లామర్ పాత్రలతో కుర్రకారును అలరించిన మల్లిక ప్రస్తుతం బాలీవుడ్లో నడుస్తున్న ట్రెండ్ చూసి తాను అలాంటి చిత్రంలో నటించాలని ఫిక్స్ అయిపోయారు. ఏ పాత్రలో నటించాలని ఉంది అని అడిగితే ఆమె టక్కున ద్రౌపది పాత్రలో చేయాలనుందని సమాధానమిచ్చారు. దర్శక, నిర్మాతలు ఈ మాట విన్నారా? మల్లిక వెయిటింగ్ ఫలిస్తుందా?