డాలస్ : మహర్నవమి పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 6న డాలస్‌లో సరసిజ థియేటర్స్ నిర్వహించిన ద్రౌపది నాటక ప్రదర్శన అక్కడి తెలుగువారిని ఉర్రూతలూగించింది. డాలస్‌లోని అర్వింగ్ ఆర్ట్స్ సెంటర్లోని కార్పెంటర్ థియేటర్‌లో దాదాపు రెండు గంటల పాటు నాటక ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనకు దాదాపు 700 మంది తెలుగు నాటకాభిమానులు హాజరయ్యారు. ఈ ద్రౌపది నాటకాన్ని నిర్వహించిన సరసిజ థియేటర్స్ 'హెల్పింగ్ హ్యాండ్స్ హ్యుమానిటీ' స్వచ్ఛంద సంస్థ ద్వారా అనాథ పిల్లలకు తోడ్పాటుగా నిధుల సేకరణను లక్ష్యంగా పెట్టుకున్నారు. నాటకాన్ని ద్రౌపది జననం నుంచి మొదలు పెట్టి, ద్రోణ-ద్రుపద వైరం, ద్రౌపది కళ్యాణం, రాజసూయ-మయసభ దృశ్యాలు, దుష్టచతుష్టయాల కుట్రలు, ద్రౌపది వస్త్రాపహరణం, కీచక వధ, శ్రీకృష్ణ నిర్యాణం- ద్రౌపది నిర్వేదం, ద్రౌపది శ్రీకృష్ణునిలో కలిసిపోవడం వరకు నాటకంలో ప్రదర్శించారు. కాగా, ద్రౌపది నాటకం ఆద్యంతం ముగ్ధ మనోహరమైన మాటలు, ఉద్వేగ భరితమైన సన్నివేశాలతో వీక్షకులకు ఒక దృశ్య కావ్యంలా కనిపించింది.
ఉదయగిరి రాజేశ్వరి గారు దర్శకత్వ బాధ్యతలు చేపట్టడమే గాక కీలకమైన ద్రౌపది పాత్రను పోషించారు. కార్యక్రమ ప్రణాళిక రచన,ఆర్థిక సేకరణలకు పోనంగి గోపాల్, రాయవరం విజయ భాస్కర్ సహకరించారు. శ్రీకృష్ణునిగా కర్రి బాల ముకుంద్, ద్రోణ-ధర్మరాజు పాత్రలలో శంకగిరి నారాయణ స్వామి, ద్రుపదుడిగా కరుణాకరం కృష్ణ, వేద వ్యాసునిగా గండికోట మధు, భీష్మునిగా చెరువు రామ్, విదురునిగా కస్తూరి గౌతం, ధృష్టద్యుమ్నగా కామరాసు రవి, దుర్యోధనునిగా కవుతారపు రవి, దుశ్శాసనునిగా ఆదిభట్ల మహేష్, శకునిగా మామిడెన్న సందీప్, కర్ణునిగా మన్యాల ఆనంద్, అర్జునుడిగా జోస్యుల ప్రసాద్, భీమునిగా రాయవరం విజయ భాస్కర్, నకుల-సహదేవులుగా కోట కార్తీక్, నట్టువ పవన్, కుంతీ మాతగా జొన్నలగడ్డ భవాని, కీచకునిగా జలసూత్రం చంద్ర, రాజగురువుగా బసాబత్తిన శ్రీనివాసులు నటించారు. అంజన, మానస, వంశీ, వెంకటేశ్, సాకేత్, యశస్విని, సంప్రీత్ బాల వంటి యువకళాకారులు నాటకంలో మిగతా పాత్రలను పోషించారు. ద్రౌపది నాటకాన్నిజయప్రదం అయ్యేలా సహకరించిన ప్రతీ ఒక్కరికి సరసిజ అధ్యక్షురాలు ఉదయగిరి రాజేశ్వరి ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment