♦అర్జునుడు అంగారపర్ణునితో ఏమన్నాడు?
మిత్రమా! నువ్వు మమ్మల్ని విడిచిపెట్టావు. అప్పుడు మేం పాండవులమని నీకు తెలియదా? తెలిసే విడిచిపెట్టావా? అని ప్రశ్నించాడు.
♦అర్జునుని ప్రశ్నకు చిత్రరథుడు ఏమన్నాడు?
మిత్రమా! నీ శౌర్యప్రతాపాలను గురించి నారదాది మునులు, దేవతల వలన విన్నాను. అయినా విడిచిపెట్టడానికి రెండు కారణాలున్నాయి.. అన్నాడు.
♦రెండు కారణాల గురించి ఏమన్నాడు?
స్త్రీలు దగ్గరున్నప్పుడు మగవారు దురభిమానంతో ఉంటారు. మంచిచెడ్డల తారతమ్యం గ్రహించలేరు. ఎదుటివారి శక్తిని గుర్తించలేరు. తామే గొప్పవారం అనుకుంటారు. ఇక రెండవది... రాజులకు పురోహితుడు ఉండాలి. నాకు పురోహితుడు లేడు. ఇప్పుడు మంచి పురోహితుడిని ఏర్పరచుకుంటాను అని చెప్పాడు.
♦పురోహితుడికి ఉండవలసిన లక్షణాల గురించి ఏమన్నాడు?
పురోహితుడు వేదవేదాంగాలు చదివి ఉండాలి. జపహోమ యజ్ఞాలలో ప్రసిద్ధుడై ఉండాలి. శాంతచిత్తులు, సత్యవంతులు కావాలి. ధర్మార్థకామమోక్షాలు పొందటానికి సమర్థుడై ఉండాలి. అటువంటి పురోహితులు ఉన్న రాజులు ప్రకాశవంతులు అవుతారు అని పురోహితుడి గురించి వివరించాడు.
♦చిత్రరథుని మాటలు విన్న పాండవులు ఎలా ఆలోచించారు?
చిత్రరథుని మాటలు విన్న పాండవులు, వారు కూడా పురోహితుడిని ఏర్పరచుకోవాలనుకున్నారు. అటువంటి వానిని సూచించమని చిత్రరథుని కోరారు.
♦చిత్రరథుడు ఎటువంటి సూచన చేశాడు?
చిత్ర రథుడు ఆలోచించి, ఉత్కచమనే దివ్య క్షేత్రం ఉంది. అక్కడ ధౌమ్యుడు అనే ఉత్తముడు ఉన్నాడు, ఆయనను పురోహితునిగా చేసుకోమని చెప్పి, అక్కడ నుంచి భార్యాసహితుడై వెళ్లిపోయాడు.
♦పాండవులు ఎక్కడకు వెళ్లారు?
పాండవులు ఉత్కచం వెళ్లారు. ధౌమ్యుని చూశారు. అతడు శాంతచిత్తుడు. తపస్సు చేస్తున్నాడు. పాండవులు అతడిని పూజించారు. తనకు పురోహితునిగా ఉండవలసినదని ప్రార్థించారు. ధౌమ్యుడు అంగీకరించాడు.
– నిర్వహణ: వైజయంతి పురాణపండ
Comments
Please login to add a commentAdd a comment