పంచమవేదంగా ప్రణుతికెక్కిన మహాభారతంలో విలక్షణమైన వ్యక్తిత్వం ఉన్న స్త్రీ మూర్తిగా... కురుక్షేత్ర యుద్ధానికి మూల కారకురాలిగా ద్రౌపదికి పేరుంది. పంచకన్యలలోనే కాదు, ఆరుగురు మహాపతివ్రతలలోనూ ఆమె పేరు చోటు చేసుకున్నదంటేనే అర్థం చేసుకోవచ్చు ద్రౌపది ఎంత విశిష్టమైన వ్యక్తిత్వం గల స్త్రీనో. ద్రౌపది అయోనిజ. యఙ్ఞకుండం నుంచి ఉద్భవించిన కారణజన్మురాలు.
పూర్వ జన్మలలో ఆమె వేదవతి, ఆ తరువాత మౌద్గల్య ముని భార్య ఇంద్రసేన. ఆ తరువాతి జన్మలో ఆమె కాశీరాజు కుమార్తె అనామికగా జన్మించింది. పతికోసం ఘోరమైన తపస్సు చేసింది. పరమశివుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాడు. పతి అన్న పదాన్ని ఐదుసార్లు పలికింది ఆమె. ఐదుగురు పతులను అనుగ్రహించాడు శివుడు. నీకు ఐదుగురు పతులున్నా అది ధర్మవిరుద్ధమని ఎవరూ భావించరు అని, ఆమె కోరుకొన్న విధంగా ఐదుగురితో సుఖించటానికి తగ్గ యవ్వనం, వారిని సేవించేందుకు అవసరమైన శుశ్రూషాభావం, కన్యాత్వం, సౌభాగ్యం అనుగ్రహించాడు. ఫలితంగా మరుజన్మలో ఆమె సంతానం కోసం యజ్ఞం చేస్తున్న ద్రుపదుడికి అగ్నిగుండంలో లభించింది. నల్లగా ఉండటం వల్ల ఆమెకు కృష్ణ అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకున్నాడు ద్రుపదుడు. యుక్తవయసు రాగానే ఆమెకు స్వయంవరం ప్రకటించాడు.
ఆమెను స్వయంవరంలో గెలిచినవాడు బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడే. దాంతో ఆమె మీద ఆశలు పెట్టుకున్న క్షత్రియ వీరులందరూ అర్జునుడిపై కయ్యానికి కాలుదువ్వారు. వారందరినీ అర్జునుడు, అతని సోదరులు యుద్ధంలో కూడా గెలిచి, ద్రౌపదిని తమ తల్లి దగ్గరకు తీసుకువెళ్ళారు. అక్కడ వారి తల్లి అనాలోచితంగానో, ఆలోచితంగానో అన్న మాటకు కట్టుబడి ఆ అయిదుగురు సోదరులనూ పెళ్ళి చేసుకోవలసి వచ్చింది. ఐదుగురు పతులతోనూ ఆమె సుఖజీవనం ప్రారంభించింది. పాండవులు ప్రచ్ఛన్నవేషాలు వీడి ఇంద్రప్రస్థంలో జీవించటం మొదలుబెట్టాక చాలా విశేషాలు జరిగాయి. ద్రౌపదితో ఏకాంతోల్లంఘన లేకుండా ఒక్కొక్కరూ ఒక సంవత్సరం గడపాలని అన్నదమ్ములు చేసుకొన్న ఒప్పందాన్ని ఒకానొక సందర్భంలో ఉల్లంఘించవలసి వచ్చిన అర్జునుడు ఏడాది పాటు తీర్థయాత్రలకు వెళ్ళి మూడు వివాహాలు చేసుకొని, శ్రీ కృష్ణుడి చెల్లెలు సుభద్రను ఏకంగా ఇంద్రప్రస్థానికే తెచ్చాడు. పాండవులు రాజసూయం చేశారు.
వారి ఆధిపత్యాన్ని చూసి కన్నెర్ర జేసుకొన్న దుర్యోధనుడు, మాయాద్యూతంలో గెలిచి పాండవులనూ, ద్రౌపదినీ బానిసలుగా చేసుకొన్నాడు. అంతకుముందు ఏ మహారాణికీ జరగని అవమానాలు ద్రౌపదికి జరిగాయి. ఏకవస్త్ర ఐన ద్రౌపదిని నిండుసభకు జుట్టుపట్టుకుని ఈడ్చుకు వచ్చాడు దుశ్శాసనుడు. దుర్యోధనుడు ఆమెను కూర్చోమని తన తొడను చూపించాడు. ఆమె పతులముందే ఆమెను వివస్త్రను చేయబూనాడు. ఆ ప్రయత్నం విఫలమైన తర్వాత మరోసారి జూదమాడి పాండవులను అడవుల పాలు చేశాడు. ద్రౌపది పాండవులతో పాటు పన్నెండేళ్ళు వనవాసం చేయవలసి వచ్చింది. ఆ సమయంలోనే సైంధవుడు ద్రౌపదిని అపహరించడానికి ప్రయత్నించాడు. వనవాసం ముగిశాక అజ్ఞాతవాసం కోసం విరాటనగరం వెళ్ళినప్పుడు. ద్రౌపది విరాటరాజు పత్ని అయిన సుధేష్ణాదేవికి సైరంధ్రిగా ఉండవలసి వచ్చింది. కీచకుడు ఆమెను బలవంతంగా అనుభవించటానికి ప్రయత్నించి భీముని చేతిలో మరణించాడు. అది మామూలుగా జరగలేదు. ద్రౌపది ధర్మరాజాదులను పలువిధాలుగా రెచ్చగొట్టిన పిదపనే జరిగింది.
అజ్ఞాతవాసం తరువాత రాయబారాలు, సంధి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ద్రౌపది వాటిని వ్యతిరేకించింది. యుద్ధం జరిగి, తనను అవమానించినవారిని తన భర్తలు నిర్జించి తన పగ తీర్చాలని ఆమె కోరుకొంది. ఆ కోరిక నెరవేరే క్రమంలో తన పుత్రులను కోల్పోయి పెద్ద మూల్యమే చెల్లించుకోవలసి వచ్చింది. అదెలాగో చూద్దాం. ద్రౌపది పట్టమహిషి. ఆమెయందు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు కన్నబిడ్డలెవరో వారే సింహాసనానికి ఉత్తరాధికారులు. కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. శిబిరాలు వేసి ఉన్నారు. ఉప పాండవులు యుద్ధభూమికి వెళ్ళలేదు. చిన్న పిల్లలు. గాఢనిద్రలో ఉన్నారు.
అశ్వత్థామకు ఉన్మాదం కలిగింది. తొడలు విరిగిపోయి పడిఉన్న దుర్యోధనుడి దగ్గరకు వెళ్ళి ‘నీ పగను నేను చల్లారుస్తా’ అన్నాడు. పాండవులమీదికి యుద్ధానికి వెళ్లడం ఎలా! రాత్రివేళ ఆలోచిస్తూ కూర్చున్నాడు. అకస్మాత్తుగా ఎక్కడినుంచో ఒక గుడ్లగూబ వచ్చి చెట్టుమీద ఉన్న ఒక పక్షి గూట్లో పెట్టిన పిల్లలను తన వాడి ముక్కుతో చీల్చి చెండాడేసింది. ఆ ఇదీ నేను చేయవలసింది...అనుకున్నాడు. నిద్రలో ఉన్న ద్రౌపదీ దేవి ఐదుగురు పిల్లలను ఒక్క రాత్రిలోనే సంహరిస్తాను. పాండవులకు ఉత్తరాధికారులు లేకుండా చేస్తాననుకుంటూ పిచ్చెక్కిన వాడిలా అయిపోయాడు. శిబిరం మీద పడిపోయి నిద్రపోతున్న ధృష్టద్యుమ్నుడి కంఠాన్ని తుంచేశాడు. ఏనుగుల కుంభస్థలాలు ఛేదించాడు. గుర్రాల్ని చంపేశాడు. ఐదుగురు ఉపపాండవుల కుత్తుకలు కత్తిరించేశాడు. అది తెలిసిన అర్జునుడు వెతుక్కుంటూ వెళ్లి అశ్వత్థామ జాడ కనిపెట్టి, అతణ్ణి పశువును కట్టినట్లు కట్టి తీసుకొచ్చి ద్రౌపది ముందు పడేశాడు.
ఆమె ఐదుగురు భర్తలు ఆవేశంతో ఊగిపోతున్నారు. ఊ..అంటే చాలు భీమసేనుడు అశ్వత్థామ తలను వేయి వక్కలు చేసేస్తాడు. కానీ ఆ క్లిష్ట సమయంలో ద్రౌపది ఎంతో సంయమనం పాటించింది. కొడుకులు చచ్చిపోయి నేను ఏడుస్తున్నా. ద్రోణాచార్యుల వారితో కలిసి సహగమనం చేయకుండా ద్రోణుడి భార్య ఉన్న ఒక్క కొడుకు కోసమని ఇంటిదగ్గరుంది. ఆమె కొడుకు చచ్చిపోలేదు. నా ఐదుగురు బిడ్డల్ని చంపేశాడనే కోపంతో పాండవులు అశ్వత్థామను ఎక్కడ చిత్రవధ చేసేస్తారన్న భయంతో ఎంత ఏడుస్తోందో! గురుపత్ని ఏడుపు మన వృద్ధికి ప్రతిబంధకం కాకూడదు. వీడిని మనం చంపకూడదు. వీడు చేసిన తప్పు వీడినే కాల్చేస్తుంది. నేను పడుతున్న బాధ నాకు తెలుసు. వేరొక తల్లి ఎందుకు పడాలి. వదిలిపెట్టేయండి’’ అన్నది.
అంతగొప్పగా మాట్లాడడం, ధర్మానికి కట్టుబడడం తెలిసిన ద్రౌపది ధీరవనిత కాక మరేమిటి? ప్రతి పురుషుడి విజయం వెనకా ఒక స్త్రీ ఉంటుందన్న ఆధునిక కాలపు నానుడిని అనుసరించి మహాభారతపు కాలంలో కురుక్షేత్రంలో పాండవులు ఐదుగురు సాధించిన విజయంలో వారి ధర్మపత్ని ద్రౌపది పాత్ర ఎంతో కీలకమైనదని అందరూ గ్రహించి తీరాలి.
– డి.వి.ఆర్. భాస్కర్
Comments
Please login to add a commentAdd a comment