అంగార పర్ణుని మాటలకు అర్జునుడేమన్నాడు?
అంగారపర్ణా! గొప్పలు మాట్లాడుతున్నావు. శక్తిహీనులు సంధ్యాకాలంలోను, అర్ధరాత్రి సమయంలోనూ సంచరించటానికి జంకుతారు. గంగానది నీది కాదు, ప్రజలందరిదీ. గంగ హిమవత్పర్వతంలో పుట్టింది. భూలోకంలో ప్రవహిస్తోంది, సముద్రంలో కలుస్తోంది.. అన్నాడు.
అర్జునుడు గంగానది గురించి ఏమన్నాడు?
గంగానది శివుని జటాజూటంలో పుట్టింది, ఆకాశంలో ప్రవహించేటప్పుడు మందాకిని. మూడులోకాలను పరిశుద్ధం చేస్తున్న గంగానది అందరికీ చెందినది. మేం ఇక్కడ స్నానం చేస్తాం.. అని ముందుకు సాగాడు.
అంగారపర్ల– అర్జునుల యుద్ధం ఎలా జరిగింది?
అంగారపర్ణుడు అర్జునుడి మీదకు బాణం విడిచాడు. అర్జునుడు కొరివితో బాణాలను కొట్టేశాడు. ద్రోణుడు ప్రసాదించిన ఆగ్రేయాస్త్రం ప్రయోగించాడు. అది అంగారపర్ణుని రథాన్ని కాల్చింది. భయభ్రాంతుడైన అంగారపర్ణుడు నేలకూలాడు.
అర్జునుడు ఏం చేశాడు?
నేలకూలిన అంగారపర్ణుని జుట్టు పట్టి ఈడ్చుకొచ్చి, ధర్మరాజు ముందు ఉంచాడు.
అంగారపర్ణుని భార్య ఎవరు, ఆమె ఏమంది?
అంగారపర్ణుని భార్య కుంభీనస ఉరికి వచ్చి, తన భర్తను రక్షించమని వేడుకుంది.
కుంభీనస మాటలకు ధర్మరాజు ఏమన్నాడు?
ధర్మరాజు అంగారపర్ణుని దీనత్వాన్ని చూశాడు. కుంభీనసను, ఆమె దుఃఖాన్ని చూసి, ‘అర్జునా! యుద్ధంలో ఓడినవానినీ, హీనుడినీ, శౌర్యం విడిచినవారినీ చంపకూడదు. వీడు నీ చేతిలో ఓడాడు. భయపడుతున్నాడు, విడిచిపెట్టు’ అన్నాడు.
ధర్మరాజు గురించి అర్జునుడు ఏమన్నాడు?
అంగారపర్ణా! ఇతడు నా అన్న ధర్మరాజు. కురువంశ ప్రభువు. దయ గలవాడు. శరణాగతవత్సలుడు. నిన్ను విడిచిపెట్టమని ఆజ్ఞాపించినందుకు విడిచిపెడుతున్నాను, భయం విడిచిపెట్టు’ అని పలికి, అంగారపర్ణుడిని విముక్తుడిని చేశాడు.
అర్జునుడి మాటలకు అంగారపర్ణుడు ఏ విధంగా స్పందించాడు?
అంగారపర్ణుడు ధైర్యం తెచ్చుకుని, ‘అర్జునా! నేను నీ చేతిలో ఓడిపోయాను కాబట్టి నా పేరు మార్చుకుంటాను. నేటి నుంచి నేను చిత్రరథుడిని, నీతో స్నేహం చేయదలిచాను అన్నాడు.
అంగారపర్ణుడు తన దగ్గర ఉన్న విద్య గురించి ఏమన్నాడు?
నా దగ్గర చాక్షుహు అనే విద్య ఉంది. దానితో ఏకకాలంలో మూడు లోకాలు చూడవచ్చు. ఈ విద్య నీకు ఇస్తున్నాను. ఇది ఫలించటానికి ఆరుమాసాలు వ్రత నియమాలు కలిగి ఉండాలి అన్నాడు.
పాండవులు ఐదుగురికి ఏమిస్తానన్నాడు? తనకు ఏమివ్వమని కోరాడు?
ఐదుగురికి కొంత ధనం, నూరేసి గుర్రాల చొప్పున గంధర్వజాతి గుర్రాలను ఇస్తాను, అందుకు బదులుగా ఆగ్రేయాస్త్రం ఇవ్వమని కోరాడు.
– నిర్వహణ:
డా. వైజయంతి పురాణపండ
Comments
Please login to add a commentAdd a comment