
జ్ఞానమూర్తి... గీతాచార్య
సందర్భం
శ్రీ మహావిష్ణువు దశావతారాలలో అత్యంత విలక్షణమైనదీ, జ్ఞానస్మృతి కలిగినదీ శ్రీ కృష్ణావతారం. సకల జీవులలో తానే ఉన్నానని తనను తాను స్వయంగా భగవానుడిగా ప్రకటించుకున్న మధుసూదనుడాయన. సమస్త భూమండలాలలో యదువంశ శిరోమణి అయిన శ్రీ కృష్ణభగవానుడు అందరినీ మించిన పూజార్హుడని వేదం చెబుతుంది. పిలవగానే పలికే దైవం శ్రీమన్నారాయణుడే అని అనడానికి కారణాలెన్నో ఉన్నాయి కానీ, వాటిలో ముఖ్యమైనవి కొన్ని... వాసుదేవుని ఎంతో ఆరాధించే పాండవులతోపాటు ద్రౌపదికి జరిగిన అవమానం ఇప్పుడు ప్రస్తావిస్తే.. నిస్సహాయులైన తన భర్తలను చూసి రోదిస్తూ నిండుసభలో ద్రౌపది పరాభవ సమయంలో త్వమేవ శరణం అని పిలవగానే వచ్చి తన శీలాన్ని కాపాడిన కృష్ణుడిని సోదర భావంతో ఆరాధించేది. ఎప్పుడు కష్టం కలిగినా, నేనున్నాను అని అన్నయ్య స్థానాన్ని తీసుకుని ద్రౌపదికి ఆపద్బాంధవుడయ్యాడు ఈ గోకుల నందనుడు. తనను ఆరాధించే వారికి తానున్నానంటూ అక్కున చేర్చుకునే దయాహృదయుడు వాసుదేవుడు.
అర్జునుడికి ఒక ఇష్టసఖుడనే కాకుండా తనని ఎప్పుడూ మంచి స్నేహితునిగా చూసే శ్రీకృష్ణభగవానుడు, ధర్మక్షేత్రంగా పేరుగాంచిన కురుక్షేత్ర రణరంగంలో యోధానుయోధుల నడుమ నిలిచి శోకమోహాలలో మునిగిన అర్జునుడికి గురువై తత్వ దర్శనం కలిగించాడు.
శకునికి మాయారూపిగా, విదురునికి ధర్మాత్మునిగా ఇలా అనేకులకు అనేకవిధాలుగా దర్శనం ఇవ్వడం శ్రీమన్నారాయణుడికే సాధ్యం. నీతిశాస్త్ర కోవిదుడు అయిన విదురుడు శ్రీకృష్ణభగవానుడి గురించి అనేక సందర్భాలలో మహారాజు ధృతరాష్ట్రునికి, సభికులందరికీ శ్రీకృష్ణుడి జీవితం ఒక ధర్మశాస్త్రం అని భగవానుడి నోటినుంచి వచ్చే అక్షర ధ్వని వేదప్రమాణం అని తెలిపేవాడు.
మాయాజూదగాడయిన శకునికి ఎవరివద్దనైనా తన మాయ చెల్లుతుంది కానీ శ్రీకృష్ణుని వద్ద మాత్రం సాధ్యం కాదని తెలుసు. అందుకే కృష్ణ భగవానుడు శకునికి మాయారూపిగా దర్శనం ఇస్తుండేవాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మాధవ మేధస్సుకు అందని ఆ గోవిందుడి లీలలు అనేకం. భీష్ముడే శ్రీ కృష్ణుని జగద్గురువుగా కీర్తించాడు. పరమేశ్వరుడు కూడా శ్రీ మహావిష్ణువునే ఆరాధిస్తాడని వేదాలు ఘోషిస్తున్నాయి. జయ జయ కృష్ణ.
– స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి, శారదాపీఠం, విశాఖపట్నం