
ఎప్పుడూ పాండవుల పక్షమే వహించి మాట్లాడే భీష్మ ద్రోణాదులకు కౌరవులు చేసేదంతా తప్పే అని స్పష్టంగా తెలుసు. కానీ దుర్యోధనుడి పక్షాన్నే వహించేవారు. అయితే భీష్మద్రోణాదుల ఈ ప్రవర్తనకు కారణం వారిలో చేరుకున్న అసురులు అనే విషయాన్ని మాత్రం ఎప్పటికీ మరువకూడదు. భీష్మాదుల లోపలికి చేరుకున్న దైత్యులు కురుక్షేత్రయుద్ధం వంటి ముఖ్యమైన సంఘటనలప్పుడు దుర్యోధనుడి పక్షాన్నే ఉండి మాట్లాడేటట్లు చేశారు.
భీష్మాచార్యుడంతటి మహాజ్ఞాని సైతం దైత్యశక్తి పూనినప్పుడు దానికి లోబడి తన ధర్మనిష్టను, న్యాయమార్గాన్నీ పోగొట్టుకున్నాడు. మనిషిని చంపకుండా హింసించే పెద్ద శత్రువు దుర్బుద్ధి. మనిషి తన దుర్బుద్ధితో తన జీవితాన్నే పూర్తిగా పోగొట్టుకుంటాడు. ఇది అధర్మం అని తెలిసినా మనస్సు దానినే చేయమని ప్రేరేపిస్తుంది. మన మనస్సులో చెడు ఆలోచనలు వచ్చిన వెంటనే ‘ఇది నా సహజమైన గుణం కాదు. ఏదో దుష్టశక్తి ప్రభావంతో నేనిలా చేస్తున్నాను’ అని తెలుసుకొని, మనలో ఉన్న దురాలోచన అనే రాక్షసుణ్ణి బయటికి పంపాలి. అప్పుడు మనం మనంగానే ఉంటాం.
Comments
Please login to add a commentAdd a comment