Pandavas
-
ధౌమ్యుడు అతడి శిష్యులు
ధౌమ్యుడు పాండవులకు పురోహితుడు. ఆయన మహర్షి. ఆయన వద్ద ఉపమన్యుడు, ఆరుణి, బైదుడు అనే ముగ్గురు శిష్యులు విద్యాభ్యాసం చేస్తుండేవారు. ముగ్గురూ చాలా తెలివైన వారు. అంతకు మించి అమిత గురుభక్తి తత్పరులు. ఒకనాడు ధౌమ్యుడు తన శిష్యులలో ఆరుణిని పిలిచాడు. ‘మన పొలం దగ్గర కాలువ గట్టు తెగి, వరిచేనును ముంచేస్తోంది. నువ్వు వెళ్లి, ఆ కాలువకు అడ్డుకట్ట వేసి రా’ అని ఆజ్ఞాపించాడు. ఆరుణి పొలానికి వెళ్లి, గట్టు తెగిన కాలువకు అడ్డుకట్ట వేయడానికి రకరకాలుగా ప్రయత్నించాడు. కుప్పలు కుప్పలుగా మట్టి తెచ్చి, గట్టుకు అడ్డుగా వేశాడు. అయినా అది నిలువలేదు. ఇక ఏం చేయాలో తోచక కాలువ గట్టుకు అడ్డుగా తానే పడుకున్నాడు. అప్పుడు నీరు చేనులోకి చేరడం ఆగిపోయింది. రాత్రి అయినా ఆరుణి ఆశ్రమానికి రాలేదు. ధౌమ్యుడు మిగిలిన ఇద్దరు శిష్యులను వెంటబెట్టుకుని పొలానికి వెళ్లాడు. పొలంలో వెదుకుంతుండగా, కాలువ గట్టుకు అడ్డంగా పడుకుని ఉన్న ఆరుణి కనిపించాడు. ధౌమ్యుడు అతడిని లేవనెత్తి, ‘వత్సా! నీ గురుభక్తికి సంతోషించాను. నువ్వు త్వరలోనే విద్వాంసుడివి కాగలవు’ అని దీవించాడు. అతడికి అన్ని విద్యలూ నేర్పించి, విద్వాంసుడిగా తీర్చిదిద్దాడు.కొన్నాళ్లకు ధౌమ్యుడు తన శిష్యులలో ఉపమన్యుడిని పిలిచి, ‘పాఠాలు చదువుకోవడం పూర్తయ్యాక రోజూ ఆవులను మేపి వస్తూండు’ అని ఆజ్ఞాపించాడు. ఉపమన్యుడు గురువు చెప్పినట్లే చేయసాగాడు.ఒకవైపు ఆశ్రమంలో పనులు చేస్తూ, చదువుకుంటూ, మరోవైపు గోవులు కాసే పని చేస్తున్నా ఉపమన్యుడు పుష్టిగా ఉండేవాడు. ఒకరోజు ధౌమ్యుడు ఉపమన్యుడిని చూసి, ‘ఇన్ని పనులు చేస్తున్నా నువ్వు ఇంత పుష్టిగా ఎలా ఉన్నావు? ఇంట్లో కూర్చుని తింటున్నా నేను నీ అంత పుష్టిగా లేను సుమా’ అన్నాడు.‘ఆచార్యా! నేను భిక్షాటన చేసుకుని జీవిస్తున్నాను. నాకు రోజూ ఎన్నో వంటకాలు దొరుకుతుంటాయి. వాటిని ఆరగిస్తుండటం వల్లనే పుష్టిగా ఉన్నాను’ అని చెప్పాడు ఉపమన్యుడు.‘అలాగైతే, నువ్వు రోజూ సంపాదించే భిక్షను తీసుకొచ్చి నాకు ఇస్తూండు’ ఆదేశించాడు ధౌమ్యుడు.ఉపమన్యుడు ప్రతిరోజూ తాను సంపాదించే భిక్షను గురువుకు ఇస్తుండేవాడు. ఇలా రోజులు గడుస్తున్నా, ఉపమన్యుడు ఎప్పటిలాగానే పుష్టిగా ఉండేవాడు.కొన్నాళ్లకు ధౌమ్యుడు, ‘నువ్వు తెచ్చినదంతా నాకే ఇచ్చేస్తున్నావు కదా, అయినా పుష్టిగానే ఉంటున్నావు. అదెలా సాధ్యమవుతోంది?’ అని అడిగాడు. ‘ఆచార్యా! పగలు సంపాదించిన భిక్ష అంతా తమకు ఇచ్చి, రాత్రివేళ దొరికిన భిక్షను నేను తింటున్నాను’ బదులిచ్చాడు ఉపమన్యుడు. ‘ఇక నుంచి రాత్రివేళ భిక్ష కూడా నాకే ఇస్తూండు’ ఆజ్ఞాపించాడు ధౌమ్యుడు. ఉపమన్యుడు అలాగే చేయసాగాడు. ఇలా కొన్నాళ్లు గడిచినా, ఉపమన్యుడు యథాప్రకారమే కనిపించసాగాడు. ‘రెండు పూటల భిక్ష నాకే తెచ్చి ఇచ్చేస్తున్నావు కదా, అయినా నువ్వు ఇంకా పుష్టిగానే ఎలా ఉంటున్నావు?’ అడిగాడు ధౌమ్యుడు.‘ఆవుల పాలు తాగుతున్నాను ఆచార్యా!’ అని బదులిచ్చాడు ఉపమన్యుడు.‘పాలు లేక లేగదూడలు బక్కచిక్కిపోతున్నాయి. ఇకపై నువ్వు ఆవుపాలు తాగడం మనుకో’ ఆదేశించాడు ధౌమ్యుడు. ఉపమన్యుడు ఆవుపాలు తాగడం కూడా మానేశాడు. ఇలా రోజులు గడిచేకొద్ది కృశించసాగాడు.ఒకనాడు ఆవులను మేతకు తీసుకుపోతున్నప్పుడు ఆకలికి తాళలేకపోయాడు. దారిలో కనిపించిన జిల్లేడు మొక్కల ఆకులను తిన్నాడు. ఆకలి తీరిందో లేదో గాని, జిల్లేడు ఆకులు తిన్నందుకు ఉపమన్యుడికి గుడ్డితనం వచ్చింది. ఆవులను తిరిగి ఆశ్రమానికి తోలుకు వస్తుండగా, దారి గుర్తించలేక ఒక పాడుబడిన బావిలో పడిపోయాడు. ఆవులు అలవాటు కొద్ది ఆశ్రమానికి చేరుకున్నాయి గాని, వాటితో పాటు ఉపమన్యుడు రాలేదు.రాత్రి ఎంతసేపటికీ ఉపమన్యుడు రాకపోవడంతో ఆందోళన చెందిన ధౌమ్యుడు అతడిని వెదుకుతూ బయలుదేరాడు. కొంత దూరం వెళ్లాక, బావిలోంచి ఆర్తనాదాలు వినిపించాయి. ధౌమ్యుడు బావి వద్దకు వెళ్లి చూడగా, ఉపమన్యుడు కనిపించాడు. ధౌమ్యుడు అతడికి ధైర్యం చెప్పి, ఆశ్వనీ దేవతల మంత్రం ఉపదేశించాడు. మంత్ర ప్రభావంతో ఉపమన్యుడికి చూపు వచ్చింది. గురువు చేయి అందించడంతో సురక్షితంగా బావి నుంచి బయటపడ్డాడు. ధౌమ్యుడు అతడికి అన్ని విద్యలనూ నేర్పించి, తనంతటి విద్వాంసుడిగా తీర్చిదిద్దాడు. తర్వాత శిష్యులలో మూడోవాడైన బైదుడికి కూడా ఇలాగే కఠిన పరీక్షలు పెట్టి, వాటిని నెగ్గిన తర్వాత అతడికి కూడా అన్ని విద్యలనూ ఉపదేశించాడు.‘వత్సా! నీ గురుభక్తికి సంతోషించాను. నువ్వు త్వరలోనే విద్వాంసుడివి కాగలవు’ అని దీవించాడు. అతడికి అన్ని విద్యలూ నేర్పించి, విద్వాంసుడిగా తీర్చిదిద్దాడు. ∙సాంఖ్యాయన -
కర్ణుడు స్వతహాగా మంచివాడే...కానీ...!!!
మహాభారతంలో కర్ణుడి వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే.... ఆయన పుట్టుకతో చెడ్డవాడు కాడు. కుంతీదేవికి, సూర్యభగవానుడికి జన్మించిన వాడు. నిజానికి పాండవులు యుద్ధంలో గెలుస్తారని ముందే తెలిసున్నవాడు. కురుసభలో రాయబారం ముగించుకుని శ్రీ కృష్ణ పరమాత్మ తిరిగి వెడుతూ కర్ణుడిని రథం ఎక్కించుకుని మాట్లాడుతూ వెళ్ళాడు. అప్పుడు కర్ణుడు –‘‘ధర్మరాజు నిజంగా ధర్మం ఎరిగినవాడు. దాన్ని పాటించేవాడు. ధర్మం అంతా పాండవులవైపే ఉంది. అందుకే సాక్షాత్ భగవంతుడవయిన నువ్వు ఆ పక్షాన ఉన్నావు. వారు గెలిచి తీరుతారు. ధర్మరాజు పట్టాభిషిక్తుడవుతాడు. దుర్యోధనాదులందరూ కూడా యుద్ధభూమిలో మడిసిపోతారు. ఎవరూ మిగలరు. కానీ దుర్యోధనుడిని నమ్మి ఇంతకాలం ఉండి అతడిని విడిచిపెట్టి రాలేను. నాకు కూడా మరణమే శరణ్యం. నేను కూడా అక్కడ మరణించాల్సిందే’’ అన్నాడు. అంటే – పాండవుల పక్షాన ధర్మం ఉందనీ, వారు గెలుస్తారని, వారి చేతిలో కౌరవులు మరణిస్తారని, తాను కూడా అక్కడే చనిపోతానని కర్ణుడికి ముందే తెలుసు. ఇన్ని తెలిసిన యోధానుయోధుడయిన కర్ణుడు జీవితాంతం తప్పులు చేస్తూ, ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చింది !!! దుర్యోధనుడు పరమ క్రూరుడు. దుర్మార్గుడు. బద్దెనగారే మరొక పద్యంలో ‘‘తలనుండు విషము ఫణికిని, వెలయంగా తోకనుండు వశ్చికమునకున్ తలతోక యనకనుండును ఖలునకు నిలువెల్ల విషము..’’ అంటారు... ఖలుడు అంటే దుర్మార్గుడు. అటువంటి వాడికి మంచి ఆలోచనలు ఎలా వస్తాయి? అదే ధర్మరాజు పక్కన ఉంటే ...మంచి పనులు చేస్తూ ఉంటాడు.. అప్పడు ఆయన పక్కన ఉన్నవారికి కూడా అటువంటి మంచి పనులు చేయడానికి లేదా కలిసి పాలు పంచుకొనే అవకాశం దొరుకుతుంది. అలా చేస్తే ధర్మరాజు కూడా సంతోషిస్తూ ఉంటాడు. దుర్యోధనుడితో కలిసి ఉన్నందుకు అతని మెప్పుకోసం కర్ణుడు చేయకూడని పనులన్నీ చేస్తూ వెళ్ళాడు. చిట్టచివరకు ఏమయ్యాడు ...యుద్ధభూమిలో అర్జునుడి చేతిలో మరణాన్ని పొందాడు. అలాగే మనిషి ఎంత మంచివాడయినా, ఎంత చదువు చదువుకొన్నవాడయినా, ఎన్ని ఉత్తమ గుణాలు కలిగిఉన్నా... ఒక దుర్మార్గుడితో స్నేహం చేస్తే మాత్రం ఉన్న పేరుప్రతిష్ఠలు కూడా నశించిపోతాయి. సన్మార్గంలో ఉన్న వ్యక్తి దుర్మార్గులతో చేరితే... నల్లులు పట్టిన మంచం ఎలా దెబ్బలు తింటుందో అలాగే ఉంటుందని సుమతీ శతకకారుడు బద్దెనచెబుతూ ‘‘కొంచెపు నరు సంగతిచే /నంచితముగ గీడు వచ్చు నది యెట్లన్నన్ /గించిత్తు నల్లి కుట్టిన/ మంచమునకు జేటు వచ్చు మహిలో సుమతీ’’ అంటున్నారు. శవం మీద ఉన్న పూలదండనే కాదు, కింద జారిపడినా దాన్ని ఎవరూ తీసుకుని వాడుకోరు సరికదా... అసలు వేలితో ముట్టుకోరు. కర్రతో పక్కకు నెట్టేస్తారు. అదే దేవుడి మెడలో పడిన పూలదండ... మరుసటి రోజువరకు ఉన్నా, వాడిపోయినా.. కళ్ళకద్దుకుని తీసుకుని తలమీద పెట్టుకుంటారు, కొప్పుల్లో తురుముకుంటారు. పూలదండ తనంత తానుగా చేసిన మంచీ లేదు, చెడూ లేదు. శవంతో చేరితే గౌరవాన్ని పోగొట్టుకుంది, భగవంతుడి మెడను అలంకరిస్తే పవిత్ర ప్రసాదమయింది. ఎవరితో కలిసున్నామన్న దాన్నిబట్టి గౌరవమయినా, ఛీత్కారమయినా ఉంటుంది. ఇనుప ఊచ ఎంత గట్టిగా ఉంటుంది!!! అగ్నితో చేరితే మెత్తబడి ఇంటికి కిటీకీ ఊచవుతుంది, నీటితో చేరితే తుప్పుపట్టి నేలరాలిపోతుంది. అందుకే ఎప్పుడూ కూడా దుర్మార్గులతో స్నేహం చేయకూడదు. అలా చేస్తే మనం పాడయిపోవడమే కాదు, మనచుట్టూ ఉన్నవారిని కూడా భ్రష్టుపట్టించే ప్రమాదం ఉంటుందని తెలుసుకుని జీవితంలో ప్రతి క్షణం ఆచితూచి అడుగేస్తుండాలి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
చెంగనూరు చుట్టు ఆలయాల మెట్లు
మండలదీక్షను ఆచరించిన భక్తకోటి భక్తిశ్రద్ధలతో ఇరుముడి కట్టుకొని శబరి కొండకు ప్రయాణం అయే సమయం ఇది. దాదాపు నాలుగు కోట్ల మంది యాత్రికులు శబరిమలై యాత్ర చేస్తారని అంచనా. వీరిలో దాదాపు 75 శాతం మంది రైలు మార్గంలో శబరిమలై వెళుతుంటారు. అక్కడ పూజాదికాలు ముగించుకొని, తిరిగి చెంగనూరునుంచి వెనక్కి మళ్లుతారు. చెంగనూరును ఒక రైల్వే స్టేషన్గానే చూస్తుంటారు తప్పితే ఆ ప్రాంతం చుట్టుపక్కల ఉండే అరుదైన పుణ్యక్షేత్రాల గురించి తెలియకపోవడం వల్ల చెంగనూరు రైల్వే స్టేషన్కు చేరుకొని రైలు కోసం వేచి చూస్తూ కాలం గడుపుతుంటారు. చెంగనూరు రైల్వే స్టేషన్కు చాలా సమీపంలో కొలువై ఉన్న ఈ క్షేత్రాల గురించి తెలియనివారు ఇకనైనా దర్శించుకుని తరించగలరనే ఉద్దేశ్యంతో ఈ వ్యాసం. చెంగన్ అంటే ఎర్రటి నేల. ఈ విధమైన నేల కలిగిన ప్రాంతం కాబట్టి చెంగనూరు అనే పేరు ఏర్పడింది. ఇక్కడ కొలువైన పుణ్యక్షేత్రమే మహాదేవ ఆలయం లేదా భగవతి అమ్మగుడి. ఈ గుడిలో ముందు వైపున శివలింగం ఉంటే, వెనుకవైపున అమ్మవారి విగ్రహం ఉండటం ఆలయ ప్రత్యేకత. విశేషమేమిటంటే, ఇక్కడ 3, 4 నెలలకు ఒకసారి అమ్మవారి వస్త్రానికి రక్తపుమరకలు కనిపిస్తాయట. దీనిని త్రిప్పుట్టు అంటారు. ఆ సమయంలో మూడు రోజులపాటు దర్శనాలు నిలిపివేసి ఆలయాన్ని శుద్ధి చేశాక, దర్శనాలకు అనుమతిస్తారు. దేవాలయంలో ఈ సమయాన్ని ఆధారంగా చేసుకొని, ఏడాదికి మూడుసార్లు త్రిపుట్టు ఆరట్టు పేరుతో ఏనుగుల మీద ఉత్సవ విగ్రహాల్ని ఊరేగింపుగా తీసుకెళ్లి పంబానదిలో స్నానం చేయిస్తారు. మహిళలంతా దీపజ్యోతులు వెలిగించి ఊరేగింపుగా ఇందులో పాల్గొంటారు. ఈ సమయంలో పంచవాద్య మేళతాళాలతో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. ఇంతటి మహిమాన్వితమైన దేవాలయం చెంగనూరు పట్టణం నడిబొడ్డున రైల్వేస్టేషన్, బస్స్టేషన్లకు కేవలం కిలోమీటర్ దూరంలో ఉంటుంది. పంచ పాండవులు నిర్మించిన ఆలయాలు మహాభారత కాలంలో పంచపాండవులు చివరిసమయంలో పరీక్షిత్తుకి రాజ్యాన్ని అప్పగిస్తారు. తర్వాత పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ కేరళకు వస్తారు. ఇక్కడ ప్రకృతిని చూసి ముచ్చటపడి, పాండవులు వేర్వేరుగా అయిదు శ్రీకృష్ణదేవాలయాల్ని నిర్మించుకున్నారట. ఈ ఆలయాలన్నీ చెంగనూరు పట్టణం చుట్టూ నెలకొని ఉంటాయి. ధర్మరాజు ప్రతిష్టించిన తిరిచిట్టాట్ మహావిష్ణు దేవాలయం, భీమసేనుడు ప్రతిష్టించిన పులియూర్ మహావిష్ణు దేవాలయం, అర్జునుడు నెలకొల్పిన అరణ్ముల పార్థసారథి దేవాలయాలు పూర్తిగా చెంగనూర్కు ఆనుకొని ఉంటాయి. ఇక నకులుడు ప్రతిష్టించిన తిరువాన్ వండూర్ మహావిష్ణు దేవాలయం, సహదేవుడు ప్రతిష్టించిన తిరుకొడితనమ్ మహావిష్ణు దేవాలయాలు మాత్రం కొద్దిపాటి దూరంలో ఉన్నాయి. చెంగనూరు రైల్వేస్టేషన్ లేదా బస్ స్టేషన్ నుంచి ఒక ఆటో లేదా కారు మాట్లాడుకొని ఒక్క రోజులో ఈ అయిదు గుడులు దర్శించి రావచ్చు. నమ్మాళ్వార్ దివ్యదేశం గ్రంథంలో ప్రస్తావించిన 108 వైష్ణవదేవాలయాల్లోనూ ఈ అయిదింటి గురించిన వివరణ ఉన్నది. ట్రావన్కోర్ దేవస్థానమే ఈ గుడులను కూడా నిర్వహిస్తున్నది. తిరిచిట్టాట్ మహా విష్ణు దేవాలయం ఈ ఆలయం పూర్తిగా చెంగనూర్ పట్టణం మధ్యలోనే నెలకొని ఉన్నది. దీనిని ధర్మరాజు ప్రతిష్టించినట్లు చెబుతారు. శ్రీకృష్ణుడితోపాటు బలరాముడి విగ్రహాన్ని కూడా ఇక్కడ చూడవచ్చు. స్వామి పుష్కరిణి దగ్గర ప్రతీ ఏటా ఉత్సవాలు నిర్వహిస్తారు. తిరుపులియూర్ మహావిష్ణు దేవాలయం చెంగనూర్ పట్టణ శివారు ప్రాంతమే పులియూర్. హరిప్పాడ్ నాగక్షేత్రానికి వెళ్లే దారిలో ఇది అగుపిస్తుంది. పూర్వం ఇక్కడ సప్తరుషులు ఆసీనులై పూజలు అందుకొన్నట్లు స్థల పురాణం. అందుకే ఇక్కడ సప్తర్షుల దేవాలయాలున్నాయి. అరన్ముల పార్థసారథి ఆలయం పంచపాండవుల ఆలయాలలో ఇదే ముఖ్యమైన దేవాలయం. అరన్ముల అంటే ఆరు వెదురు స్తంభాలు అని అర్థం. ఆరుస్తంభాల కోవెలగా దీన్ని చెబుతారు. ప్రతి ఏటా మకరజ్యోతి సమయంలో అయ్యప్పకి అలంకరించే తిరువాభరణాలను ఊరేగింపుగా తీసుకొని వెళ్లేటప్పుడు ఈ గుడి దగ్గర ఆపి పూజలు నిర్వహిస్తారు. ఇది అర్జునుడు నిర్మించిన ఆలయం కావటంతో ఇక్కడ విశేషంగా నాట్యార్చనలు జరుగుతుంటాయి. దాదాపు ఆరడుగుల ఎత్తున కృష్ణపరమాత్మ విశ్వరూప దర్శనం కనిపిస్తుంది. దీంతోపాటు అయ్యప్ప, నాగరాజ, బలరామ మూర్తుల కోవెలలు ఉన్నాయి. దేవాలయానికి ఉత్తరం వైపున పంబనది దర్శనం ఇస్తుంది. మలయాళ ధనుర్మాసంలో ఇక్కడ ఖాండవ వన దహనం నిర్వహిస్తారు. తిరువాన్ వాండూర్ మహావిష్ణు దేవాలయం ఈ ఆలయాన్ని నకులుడు నిర్మించినట్లు చెబుతారు. చెంగనూరుకు సమీపంలోనే ఈ గ్రామం ఉంది. ఇది పంబనదికి ఆనుకొని ఉండటం వలన ఇక్కడ స్వామిని పంబనిచప్పన్ అనీ పిలుస్తారు. ఇక్కడ ప్రతి ఏటా నిర్వహించే గజ మేళా చెప్పుకోదగినది. తిరుకోడిత్తనమ్ మహావిష్ణుదేవాలయం ఇక్కడ శ్రీ కృష్ణావతారంతోపాటు నరసింహస్వామిని కూడా దర్శించుకోవచ్చు. సహదేవుడు నిర్మించిన ఆలయం ఇది. స్వామి నిల్చొన్న భంగిమలో దర్శనం ఇస్తాడు. ఆయన్ని అద్భుతనారాయణుడు అని, అమృత నారాయణుడు అని పిలుస్తుంటారు. ఇక్కడ ఉత్సవాలలో కూటక్కుట్టు నాట్యం విశిష్టమైనది. తిరువల – శ్రీ వల్లభ స్వామి ఆలయం ఇక్కడ శ్రీ వల్లభుని ఆలయం ఉంది. దాదాపుగా సంవత్సరం పొడవునా నాట్య ఉత్సవాలు నిర్వహిస్తారు. దేవాలయం మూసివేసిన తర్వాత రాత్రంతా ఇక్కడ శ్రీ కృష్ణుణ్ణి స్మరిస్తూ మోహిని అట్టం, కథాకళి రీతుల్లో నాట్య ప్రదర్శన జరుగుతుంది. అర్ధరాత్రి పూట సప్తర్షులు ఇక్కడకు వచ్చి అర్చనలు నిర్వహిస్తారని స్థానికుల నమ్మకం. దుర్వాసమహర్షి తపస్సు చేసిన ప్రాంతం అని, ఆయన విష్ణుమూర్తి పాదాలు కడిగిన కొలనుగా స్థానిక పుష్కరిణిని చెబుతారు. హరిప్పాడ్ సుబ్రహ్మణ్య క్షేత్రం చెంగనూరు రైల్వేస్టేషన్కు అతి సమీపంలో ఉండే మహిమాన్విత క్షేత్రమే హరిప్పాడ్. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది. పరశురాముడు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లుగా చెబుతారు. నాలుగు చేతులు కలిగిన మురుగన్ విగ్రహం దాదాపు ఎనిమిది అడుగుల ఎత్తులో కనిపిస్తుంది. ఇక్కడ నాగ పడగలు, నాగ ప్రతిమలు చాలా విశిష్టమైనవి. చెంగనూర్ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉండే బస్ స్టాండ్ నుంచి హరిప్పాడ్కు నేరుగా బస్సులున్నాయి. మావెలిక్కర భద్రకాళి దేవాలయం చెంగనూరు దాటాక తదుపరి రైల్వేస్టేషన్ మావెలిక్కర. ఇక్కడ అమ్మవారి గుడి చాలా పెద్దది. మొత్తం ట్రావెన్కోర్ దేవస్థానం ఆలయాల్లో శబరిమలై తర్వాత ఎక్కువ ఆదాయం వచ్చే ఆలయంగా దీన్ని చెబుతారు. ఇది తాంత్రికపూజలకు నెలవైన ఆలయం. దీన్ని చెట్టికుళంగర దేవాలయం అని పిలుస్తారు. ఇక్కడ అత్యద్భుతంగా నిర్వహించే కుంభ భరణి దీపోత్సవానికి భక్తులు విచ్చేస్తారు. ముక్కంటి క్షేత్రాలు చెంగనూర్, కొట్టాయంకు సమీపంలో వైకోమ్ మహాదేవాలయం, ఎట్టుమాన్నూర్ మహాదేవాలయం, కడతుర్తి మహాదేవాలయం పేరుతో మూడు సుప్రసిద్ధ శైవక్షేతాలున్నాయి. ఈ మూడు ఆలయాలు చాలా విశాలమైన ప్రాంగణంలో కొలువుదీరి ఉంటాయి. వీటిని ఒకేరోజున దర్శించుకొనే వీలుంది. ఇక్కడ రోజూ సాయంత్రం జరిపే ఊరేగింపు అత్యంత శోభాయమానం. -
కిరాతార్జునీయం
పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయమది. తమ వద్దకు వచ్చిన వ్యాసమునీంద్రుని పాండవులు అర్ఘ్య పాద్యాదులతో పూజించిన తరువాత ఆయనతో ‘కౌరవులు మమ్మల్ని మాయ జూదంలో ఓడించారు. మమ్మల్ని అరణ్యవాసానికి, అజ్ఞాతవాసానికీ పంపించారు. శత్రుంజయులుగా పేరొందిన మాకే ఇప్పుడు శత్రుభయం పట్టుకుంది. మాకు తగిన తరుణోపాయం చెప్పండి’’ అని అడిగారు. అపుడు వ్యాసభగవానుడు ‘‘మీకు ఎంతమంది శత్రువులున్నా వారిని గెలవాలంటే శివానుగ్రహం కలగాలి. కాబట్టి అర్జునుని శంకరుని గురించి తపస్సు చేయమనండి. శంకరుడు ప్రత్యక్షం అయినప్పుడు పాశుపతాస్త్రం అడగండి. శంకరుడు దానిని మీకు ఇచ్చి విజయీభవ అని ఆశీర్వదిస్తే ఇక మీ విజయానికి తిరుగులేదు’’ అని చెప్పి వ్యాసుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వ్యాసుడి సూచన మేరకు అర్జునుడు శివారాధన చేయడం మొదలుపెట్టాడు. కొంతకాలం తర్వాత శంకరుడు అర్జునుడి శక్తిని పరీక్షించాలనుకున్నాడు. ఒక అడవిపందిని సృష్టించి దానిని అర్జునుడు తపస్సు చేసుకుంటున్న పర్ణశాల వద్దకు పంపాడు. అది అక్కడికి వెళ్లి రొద చేస్తోంది. ఆ ధ్వనికి కళ్ళు తెరిచి చూశాడు అర్జునుడు. వెంటనే తన విల్లందుకున్నాడు. ఈలోగా శివుడు అర్జునుడి వెనుక నుంచి అడవిపంది మీదకి వేసిన బాణం దాని పృష్ట భాగంలోంచి శరీరంలోకి వెళ్లి దాని నోట్లోంచి బయటకు వచ్చి నేలమీద పడింది. సరిగ్గా అదే సమయంలో ఎక్కుపెట్టిన అర్జునుడి బాణం అడవి పంది నోట్లోంచి శరీరంలోకి వెళ్లి అక్కడనుంచి పృష్ఠభాగంలోంచి బయటకు వెళ్లి నేలమీద పడింది. శివుడు తన ప్రమథగణాలలో ఒకడిని పిలిచి తన బాణాన్ని తీసుకు రమ్మనమని చెప్పాడు. అతను వెళ్లి అర్జునునితో ‘ఈ బాణం మా నాయకుడిది. ఆయన గొప్ప వీరుడు. ఆయన బాణం తీశాడంటే ఎవరూ నిలబడలేరు. జాగ్రత్త’’ అన్నాడు కవ్వింపుగా.. ‘‘మీ నాయకుడు అంత మొనగాడయితే నాతో యుద్ధానికి రమ్మని చెప్పు’’ అన్నాడు అర్జునుడు. ఆ మాటకోసమే ఎదురు చూస్తున్నాడు కిరాతుడి రూపంలో ఉన్న శివుడు. కొండమీది నుంచి ఒక్క దూకు దూకి అర్జునుడి ముందు నిలబడి, ‘‘ఈ పందిని నువ్వు నీ బాణంతో కొట్టావా? ఏదీ ఇప్పుడు చూపు నీ విద్య’’ అన్నాడు. అర్జునుడు క్షణం ఆలస్యం చేయకుండా శివుని మీద బాణాలు ప్రయోగించడం ప్రారంభించాడు. శివుడు కూడా అర్జునుని మీదకు బాణాలు వేస్తున్నాడు. అర్జునుడు తన బలం అంతటినీ ఉపయోగించి శివుడిని పడగొట్టేందుకు యత్నిస్తున్నాడు. కానీ శివునికి ఏమీ అవడం లేదు. తర్వాత ఇద్దరూ మల్లయుద్ధం చేశారు. శంకరుడు అర్జునుని శరీరాన్ని తోసి అవతల పారేశాడు. అపుడు అర్జునుడు తిరిగి లేచి తన ధనుస్సుతో శంకరుని జటాజూటం మీద ఒక గట్టి ప్రహారం చేశాడు. అపుడు శంకరుడు ఇక యుద్ధాన్ని చాలించి చంద్రవంకతో, పట్టుపుట్టంతో, పార్వతీ సమేతంగా అర్జునుడికి ఎదురుగుండా నిలబడ్డాడు. మళ్ళీ కొడదామని గాండీవాన్ని ఎత్తిన అర్జునుడు తన ఎదుట సాక్షాత్కరించిన అర్ధనారీశ్వరుడి పాదాల మీద పడి శంకరుని ఏమి అడగాలో మర్చిపోయి కన్నుల వెంట నీరు కార్చుతూ ‘‘ఈశ్వరా, జగత్తుకే తండ్రివయిన నీపై అజ్ఞానినై బాణాలు వేశాను. నీ కారుణ్యంతో నా గుండె నిండిపోయింది’’ అని పరమేశ్వరుని పాదాల మీద పడిపోయాడు. అపుడు శంకరుడు ‘‘నీకు పాశుపతాస్త్రాన్ని ఇస్తున్నాను. మీకు ఎదురులేదు. రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో మీరే గెలిచి తీరుతారు. విజయీభవ!’’అని ఆశీర్వదించాడు. ఇందులో మనం గ్రహించవలసిన నీతి ఏమిటంటే... ఆపదలో ఉన్న సమయంలో తగిన ఉపాయం చూపిన వాడే మనకు హితుడనీ, భగవంతుడు తన భక్తులకు అనేక పరీక్షలు పెట్టి, వాటిలో ¯ð గ్గినప్పుడే వరాలను అనుగ్రహిస్తాడనీ, అంతవరకూ మనం కుంగిపోకుండా కాలం పెట్టిన పరీక్షలలో నిగ్గు తేలాలి. – డి.వి.ఆర్. భాస్కర్ -
బృహన్నలార్జునీయం
విరటుని పుత్రుడు ఉత్తర కుమారుడు బృహన్నల సారథ్యంలో యుద్ధభూమికి వచ్చాడు. అశేషమైన ఆ సేనని చూసి భయంతో పారిపోబోగా బృహన్నల అతన్ని వెనక్కి తీసుకుని వచ్చి ధైర్యం చెప్పాడు. శమీవృక్షంపై గల ఆయుధాల మూటను తీసుకు వస్తే తాను యుద్ధంలో సాయం చేస్తానన్నాడు. సరేనని ఉత్తరుడు చెట్టు వద్దకు వచ్చాడు. రథం నుండి దిగి శమీవృక్షాన్ని ఎక్కి ఆ మూటను కిందికి దించి, దానిపైనున్న బంధనాలను తొలగించాడు. చాలా పెద్దవైన బంగారపు విల్లులను, మెరుస్తున్న బాణాలను చూసి ఆశ్చర్యంతో ‘‘ఈ దివ్యాస్త్రాలు ఎవరెవరివి? ఇక్కడికి ఎలా వచ్చాయి?’’ అని అడిగాడు. ‘‘ఈ దివ్యాస్త్రాలు పాండవులవి. వీటిలో పెద్దదైన ఈ ధనుస్సు గాండీవం. దీనిని బ్రహ్మదేవుడు, ప్రజాపతి, ఇంద్రుడు, చంద్రుడు ధరించారు. ఆ తర్వాత అర్జునుడు దీనిని వాడుతున్నాడు. సర్పాల్లా కనిపించే ఈ బాణాలు అర్జునుడివే. అవిగాక మిగతా ఆయుధాలన్నీ ధర్మరాజ, భీమ, నకుల సహదేవులవి’’ అని చెబుతూ, ఎవరెవరివి ఏయే ఆయుధాలో చూపెట్టాడు బృహన్నల. ఉత్తరుడు మరింత ఆశ్చర్యంతో ‘‘పాండవులు ఇప్పుడెక్కడున్నారు? ఈ ఆయుధాల సంగతి నీకు ఇంత విపులంగా ఎలా తెలుసు?’’ అనడిగాడు. బృహన్నల అతనితో ‘‘ఉత్తరకుమారా! నేను అర్జునుడను. మీ తండ్రిగారితో వీనులవిందుగా మాట్లాడుతూ ఆనందింపజేస్తున్న వ్యక్తి యుధిష్ఠిరుడు. మీ ఆస్థానంలోని పాకశాస్త్ర ప్రవీణుడు వలలుడే భీముడు. నకులుడు అశ్వపాలకుడు. సహదేవుడు గుర్రాలను రక్షించే నాయకుడు. సైరంధ్రియే ద్రౌపది.’’ అని చెప్పాడు. అదంతా విని ఉత్తరుడు విస్తుపోవడమేగాక పాండవులను చూడగలిగినందుకు ఎంతో సంతోషంతో బృహన్నలను ‘‘నీకున్న ప్రసిద్ధమైన పదిపేర్లను, వాటి కారణాలను చెప్పు’’ అనడిగాడు కుతూహలంతో. ‘‘ఉత్తరకుమారా! నేనొకప్పుడు రాజులందరినీ జయించి వారివద్దనుండి ధనాన్ని తీసుకొని దాని మధ్య కూర్చున్నాను. అందుచేత ధనంజయుడన్నారు. యుద్ధానికెప్పుడెళ్లినా జయించకుండా రాలేదు కనుక విజయుడన్నారు. నా రథానికి తెల్లటి గుర్రాలను కట్టడం వల్ల శ్వేతవాహనుడనే పేరొచ్చింది. ఉత్తర ఫల్గుణీ నక్షత్రాన పుట్టాను కాబట్టి ఫల్గుణుడన్నారు. రాక్షసులని జయించినందుకు దేవేంద్రుడు నా తలపై కిరీటాన్నుంచి గౌరవించాడు కనుక నన్ను కిరీటి అన్నారు. బీభత్సంగా యుద్ధం చేస్తాను కాబట్టి బీభత్సుడనే పేరొచ్చింది. రెండు చేతులతోనూ సమానవేగంగా బాణాలను వేయగలను కాబట్టి సవ్యసాచి అన్నారు. నా శరీరపు రంగు మట్టిరంగును పోలి విలక్షణంగా ఉండడం వల్ల పార్థుడని పేరొచ్చింది. గాండీవాన్ని ధరిస్తాను కాబట్టి గాండీవి అన్నారు’’ అని వివరించాడు. ఉత్తరుడికి మరోసారి ధైర్యవచనాలు చెప్పి, శత్రువులను జయించి, గోవులను కాపాడమని పలికి రథాన్ని కౌరవుల సమీపానికి నడిపించమన్నాడు. ఉత్తరుడు ధైర్యంతో ముందుకెళ్లాడు. సమయం వచ్చినప్పుడు కానీ, తమ స్థాయిని బయట పెట్టుకోరాదు. పాండవులు దానిని పాటించారు కాబట్టి విజయవంతంగా అజ్ఞాతవాసం చేయగలిగారు. అంతేకాదు, అర్జునుడికి ఉన్న పేర్లన్నీ ఆయనలోని విశేషగుణాలని బట్టి వచ్చినవే కానీ, తనంత తానుగా పెట్టుకున్నవి కాదు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకుని తీరవలసిన నీతి. నిజమైన వీరుడు చేతల్లో చూపిస్తాడు అర్జునుడిలా... అంతేగానీ ఉత్తముడిలా ప్రగల్భాలు పలుకడు. – డి.వి.ఆర్. భాస్కర్ -
ఆ రాక్షసులను తరిమి కొట్టాలి
ఎప్పుడూ పాండవుల పక్షమే వహించి మాట్లాడే భీష్మ ద్రోణాదులకు కౌరవులు చేసేదంతా తప్పే అని స్పష్టంగా తెలుసు. కానీ దుర్యోధనుడి పక్షాన్నే వహించేవారు. అయితే భీష్మద్రోణాదుల ఈ ప్రవర్తనకు కారణం వారిలో చేరుకున్న అసురులు అనే విషయాన్ని మాత్రం ఎప్పటికీ మరువకూడదు. భీష్మాదుల లోపలికి చేరుకున్న దైత్యులు కురుక్షేత్రయుద్ధం వంటి ముఖ్యమైన సంఘటనలప్పుడు దుర్యోధనుడి పక్షాన్నే ఉండి మాట్లాడేటట్లు చేశారు. భీష్మాచార్యుడంతటి మహాజ్ఞాని సైతం దైత్యశక్తి పూనినప్పుడు దానికి లోబడి తన ధర్మనిష్టను, న్యాయమార్గాన్నీ పోగొట్టుకున్నాడు. మనిషిని చంపకుండా హింసించే పెద్ద శత్రువు దుర్బుద్ధి. మనిషి తన దుర్బుద్ధితో తన జీవితాన్నే పూర్తిగా పోగొట్టుకుంటాడు. ఇది అధర్మం అని తెలిసినా మనస్సు దానినే చేయమని ప్రేరేపిస్తుంది. మన మనస్సులో చెడు ఆలోచనలు వచ్చిన వెంటనే ‘ఇది నా సహజమైన గుణం కాదు. ఏదో దుష్టశక్తి ప్రభావంతో నేనిలా చేస్తున్నాను’ అని తెలుసుకొని, మనలో ఉన్న దురాలోచన అనే రాక్షసుణ్ణి బయటికి పంపాలి. అప్పుడు మనం మనంగానే ఉంటాం. -
ఆ మౌనానికి పరిహారం
అంపశయ్యమీద ఉండి భీష్ముడు విలపిస్తూ ఉన్నాడు. అది చూసి పాండవులు కృష్ణుడిని రహస్యంగా ‘‘కృష్ణా! ఇదేమి వింత! మహాజ్ఞాని, సర్వసంగ పరిత్యాగి అయిన భీష్మపితామహుడు, రాబోయే మృత్యువు గురించి ఆలోచించి ఎందుకు విలపిస్తున్నాడు?’’ అని అడిగారు. అందుకు శ్రీ కృష్ణుడు చిద్విలాసంగా నవ్వుతూ, ‘ఎందుకు విలపిస్తున్నాడో భీష్ముడినే అడగండి’ అన్నాడు. పాండవులు వెంటనే భీష్ముడి దగ్గరకు వెళ్లి, ‘తాతా! నువ్వు ఎందుకని విలపిస్తున్నావు? కారణం ఏమిటి ...?’ అని అడిగారు. అందుకు భీష్ముడు, ‘‘నాయనలారా! నాకు చావు వస్తుందని ముందే తెలుసు. ఎప్పుడు చావాలో కూడా నాకు తెలుసు. స్వచ్ఛంద మరణమనే వరమూ ఉంది. అయితే, నేను దిగులు పడేది, నాకు రాబోయే చావు గురించో, ఒళ్లంతా గుచ్చుకున్న బాణాల వల్ల సలుపుతున్న గాయాల గురించో కాదు. ‘‘భగవంతుని లీలలు వేటినీ తెలుసుకోలేక పోతున్నానే అని. అందుకోసమే నేను ఇంతగా విలపిస్తున్నాను. అంతేకాదు, సర్వాంతర్యామి అయిన శ్రీ కృష్ణుడు మీకు తోడునీడై ఉండి, మిమ్మల్ని అడుగడుగునా ఆపదలు నుండి కాపాడుతున్నాడు. అయినప్పటికీ మీ కష్టాలకు అంతే లేదు అని ఆలోచించి శోకిస్తున్నాను’’ అని సమాధానమిచ్చాడు. అయితే, ఆయన విలపించడానికి కారణం వేరే ఉంది. ప్రపంచంలో దేనికయినా ఆలంబనం ధర్మమే! భీష్ముడు ఒకసారి ధర్మం తప్పాడు. అది ఎప్పుడంటే, దుశ్శాసనుడు ద్రౌపదిని సభలోకి ఈడ్చుకు వచ్చి వలువలు ఊడదీశాడు. అలా ఊడదీస్తుంటే ఆమె ఒక ప్రశ్న వేసింది. ‘ఈ సభలో భీష్మ ద్రోణులు ఉన్నారు. వాళ్లకి ధర్మం తెలుసు. నన్నోడి తన్నోడెనా? తన్నోడి నన్నోడెనా? ధర్మం చెప్పవలసింది’ అని అడిగింది. అపుడు భీష్ముడు పెద్ద సంకటంలో పడ్డాడు. భీష్ముడు నోరు విప్పి మాట్లాడి ధర్మరాజు చేసినది దోషమే – ఓడిపోయిన రాజుకి ద్రౌపదిని ఒడ్డే అధికారం లేదు అని ఉంటే వెంటనే మహాపతివ్రత అయిన ద్రౌపదీ దేవి శపిస్తే, «ధృతరాష్ట్రుని సంతానం అంతా తన కళ్ళముందు నశించిపోతారు. పోనీ చెప్పకుండా ఉందామంటే ఎదురుగుండా ఒక మానవతికి ఒక మహా పతివ్రతకి వలువలు ఊడుస్తున్నారు. కాబట్టి ఏమి చెప్పాలో ఆయనకు అర్థం కాలేదు. తెలిసి చెప్పాడా, తెలియక చెప్పాడా అన్నది తెలియకుండా ఒక మాట అని ఊరుకున్నాడు. ‘ధర్మరాజు అంతటి వాడే నేను ఓడిపోయాను అని ఒక మాట అన్నాడు. ఈ స్థితిలో ఏది ధర్మమూ అన్నది చెప్పడం కొంచెం కష్టం ద్రౌపదీ’ అన్నాడు. అలా ధర్మం తెలిసి చెప్పకపోవడం కూడా ధర్మాచరణలో వైక్లబ్యమే! ఈ దోషానికే ఆయన అంపశయ్యమీద పడి ఉండవలసి వచ్చింది! అది తలచుకునే ఆయన విలపిస్తున్నది. ధర్మం తప్పటం, అసత్యం ఆడటం కొద్దిసార్లే చేసి ఉండవచ్చు. దాని పర్యవసానం వెంటనే ఒక్కోసారి వెంటనే అనుభవిం^è క పోవచ్చు. కానీ, ఒక్కోసారి జీవితంలో చివరి దశలో దాని ఫలితం అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ధర్మాచరణను ఎప్పుడూ ఉల్లంఘించరాదు. చిన్న అబద్ధమే కదా, చిన్న అధర్మమే కదా అనుకోవడానికి వీలు లేదు. – డి.వి.ఆర్. భాస్కర్ -
దుర్యోధనుడి గర్వభంగం
పురానీతి మాయాజూదంలో ఓటమి పాలైన పాండవులు వనవాసంలో నిరుపేదల్లా గడపసాగారు. హస్తినాపురంలో దుర్యోధనాది కౌరవులు అష్టైశ్వర్యాలతో తులతూగసాగారు. అడవులలో ఉన్న పాండవులను మరింత అవమానించాలని తలచాడు దుర్యోధనుడు. శకుని, కర్ణ, దుశ్శాసనులు అతడి ఆలోచనకు వంత పాడారు. వనవాసంలో ఉన్న పాండవుల వద్ద ఐశ్వర్య బలప్రదర్శన చేసి వారిని చిన్నబుచ్చాలని దుష్టచతుష్టయం నిశ్చయించుకున్నారు. వనవాసంలో పాండవులు ఆవాసం ఏర్పరచుకున్న ద్వైతవనంలో కౌరవుల గోవులు ఉండేవి. అందువల్ల పథకం ప్రకారం క్రూరమృగాల వల్ల గోవుల ప్రాణాలకు హాని కలుగుతోందని ధృతరాష్ట్రుడి ఎదుట కొందరు గోపాలకుల చేత సభలో చెప్పించారు. ఆ నెపంతో గోరక్షణ కోసం ద్వైతవనానికి వెళ్లేందుకు దృతరాష్ట్రుడి అనుమతి పొందారు. దుష్టచతుష్టయం సమస్త పరివారంతో, రాజ వైభవ లాంఛనాలతో అట్టహాసంగా ఘోషయాత్రకు బయలుదేరారు. ద్వైతవనానికి చేరువలో కమలాలతో నిండిన ఒక సుందర సరోవరం ఒడ్డున గుడారాలు నిర్మించుకుని విడిది చేశారు. అక్కడకు చేరువలోనే పాండవుల పర్ణశాల ఉంది. అద్భుతమైన సరోవర సౌందర్యానికి ముగ్ధులైన కౌరవులు అందులోకి దిగి యథేచ్ఛగా జలక్రీడలు ప్రారంభించారు. ఇంతలో కొందరు గంధర్వులు అక్కడకు పరుగు పరుగున చేరుకున్నారు. ‘ఇది మా ప్రభువు చిత్రసేనుడు నిర్మించుకున్న సరోవరం. ఇందులో అన్యులకు ప్రవేశం నిషిద్ధం. తక్షణమే ఇక్కడి నుంచి తొలగిపొండి’ అని హెచ్చరించారు. గంధర్వుల మాటలకు దుర్యోధనాది కౌరవులు వికటాట్టహాసాలు చేస్తూ ‘సాక్షాత్తు దేవేంద్రుడే వచ్చినా మేము ఇక్కడి నుంచి తొలగిపోయే ప్రసక్తే లేదు’ అని పలికి వారిని గెంటివేశారు. చేసేది లేక వారు తమ లోకానికి చేరుకుని జరిగినదంతా తమ ప్రభువైన చిత్రసేనుడికి విన్నవించారు. ఆగ్రహంతో రగిలిపోయిన చిత్రసేనుడు సేనలను తోడ్కొని వెళ్లి కౌరవులను ముట్టడించాడు. అప్పటికే సిద్ధంగా ఉన్న కౌరవ సేనలు గంధర్వులతో యుద్ధానికి తలపడ్డాయి. గంధర్వుల ధాటికి తాళలేని కౌరవ సేనలు ద్వైతవనంలోని పాండవుల పర్ణశాల వైపుగా పరుగులు ప్రారంభించాయి. గంధర్వుల దాడిలో కర్ణుడు క్షణాల్లోనే విరథుడై, నిరాయుధుడిగా మిగిలాడు. దుర్యోధనుడికి, అతడి సోదరులకు కూడా అదే గతి పట్టింది. చిత్రసేనుడు వారందరినీ బంధించి తీసుకుపోసాగాడు. ఈలోగా పారిపోయిన కౌరవ సైనికులు ధర్మరాజు వద్దకు చేరుకుని దుర్యోధనాదులు గంధర్వుల చేతికి బందీలుగా చిక్కారని, వారిని విడిపించాలని మొరపెట్టుకున్నారు. అక్కడే ఉన్న భీముడు వారి మాటలు విని... ‘అన్నయ్యా! కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారు. మనకు భారం తగ్గింది’ అన్నాడు. అప్పుడు ధర్మరాజు... ‘భీమసేనా! నువ్విలా అనరాదు. శరణార్థులైన వారు ఎలాంటి వారైనా వారిని కాపాడటమే ఉత్తమ వీరుల లక్షణం. పైగా, కౌరవులు మనకు స్వయానా దాయాదులు. వారికి సాయపడటం మన ధర్మం’ అని పలికాడు. అందువల్ల గంధర్వులను వారించి, కౌరవులను విడిపించమని భీమార్జునులను పురమాయించాడు. కౌరవులను విడిచిపెట్టమని అర్జునుడు నచ్చచెప్పగా గంధర్వులు వినిపించుకోకుండా, పాండు సోదరులపై ఆయుధాలు సంధించారు. ఇక అర్జునుడు గాండీవానికి పనిచెప్పాడు. తన శర పరంపరతో గంధర్వులను నిరాయుధులుగా చేశాడు. తన సేనలు చిక్కుల్లో పడ్డాయని తెలుసుకున్న చిత్రసేనుడు అక్కడకు వచ్చాడు. అతడు అర్జునుడికి అదివరకే మిత్రుడు. అర్జునుడిని చూడటమే తడవుగా యుద్ధాన్ని విరమించుకోమని తన సేనలను ఆదేశించాడు. అర్జునుడి మాటపై కౌరవులను విడిచిపెట్టాడు. సోదరులతో కలసి ద్వైతవనానికి తిరిగి వచ్చిన కౌరవులను ధర్మరాజు సాదరంగా ఆహ్వానించాడు. జరిగిన దానికి బాధపడవద్దని, అనవసరంగా ఇలాంటి దుస్సాహసాలకు పాల్పడవద్దని దుర్యోధనుడికి హితవు చెప్పి సాగనంపాడు. -
గంగాశాంతనులు
ఐదోవేదం: మహాభారత పాత్రలు మహాభారతమనే కథ, కౌరవ పాండవులకు మూడు తరాల కింద నుంచి మొదలవుతుంది. నిజానికి, కౌరవులనే మాట అందరికీ సమానమైనదే. అందరూ కురురాజ వంశం వాళ్లే. మరి కౌరవశబ్దం పాండవులకు ఎందుకని వాడరు? ఎందుకంటే ‘కురు’ అనే మాటను ‘పనిచెయ్యడం’ అనే అర్థంలో వాడతారు. పనులు జరిగే చోటేమో శరీరం. శరీరానికి అంకితమైనవాళ్లు కౌరవులు. పండా అంటే బుద్ధీ జ్ఞానమూ గనక, పాండవులు, వంశరీత్యా కురువంశంవాళ్లే అయినప్పటికీ, బుద్ధికీ జ్ఞానానికీ ప్రతీకలు. ధర్మానికి అంకితమైనవాళ్లు గనక, పాండవుల్ని కౌరవ శబ్దాన్నుంచి వేరు చేశారు. సరే, ఇప్పుడు ఆ ముందుతరాల వైపు తిరిగి దృష్టి సారిద్దాం. ప్రతీపుడనే ఒక రాజు ఉండేవాడు. ఆయనకు వయసు మీరినా పిల్లలు కలగకపోవడంతో భార్యతో కలసి పిల్లలకోసం తపస్సు చేశాడు. ఆ దంపతుల తపఃఫలంగా ఒక పిల్లవాడు కలిగాడు. వయసు బాగా పైబడిన తరువాత కామం బాగా శాంతించిన తరువాత పుట్టాడు గనక, ఆ పిల్లాడికి ‘శాంతనుడ’ని పేరుపెట్టారు. అంతకుముందు ఒకసారి ప్రతీపుడొక్కడే గంగ ఒడ్డున కూర్చొని ఉండగా, గంగానదే, ఒక అందమైన అమ్మాయి రూపాన్ని దాల్చి, అతని కుడి తొడమీద కూర్చుని ‘నన్ను పెళ్లి చేసుకో’మని కోరింది. శాస్త్రం ప్రకారం కుడి తొడ మీద కూర్చునేవాళ్లు కొడుకులూ కూతుళ్లూ కోడళ్లూ అవుతారు; ఎడమ తొడమీద కూర్చునేవాళ్లే భార్యలుగా కావడానికి తగినవాళ్లు. ప్రతీపుడు ఈ మాటనే చెప్పి, మా పిల్లాడికి నువ్వు పెళ్లానివి అవుదుగానిలే అని ఆవిడను ఒప్పించాడు. ప్రతీపుడికి పుట్టిన శాంతనుడు అంతకుముందు జన్మలో మహాభిషుడనే రాజు. అతను ఒకసారి బ్రహ్మసభకు వెళ్లినప్పుడు, అక్కడకు వచ్చిన గంగాదేవిని చూసి మోహంలో పడ్డాడు. బ్రహ్మ ఎదురుగుండానే అతను కామమోహితుడిగా కనిపించడం వల్ల, ‘నువ్వు మనుషుల్లో పుట్టి తిరిగి బ్రహ్మలోకానికి రాగలుగుతావు’ అని శపించాడు బ్రహ్మ. ‘గంగ అంటే మహామోహంలో పడ్డావు గనక, నువ్వు మనుషుల లోకంలో పుట్టినప్పుడు, ఆవిడే నీకు ప్రతికూలంగానూ, అప్రియంగానూ ప్రవర్తిస్తుంది’ అని శాపాంతమూ చెప్పాడు. బ్రహ్మ లోకం నుంచి తిరిగి వెళ్తూన్నప్పుడు గంగాదేవికి దిగాలు ముఖాలతో కాళ్లీడ్చుకుంటూ వెళ్తూన్న అష్టవసువులు అగుపడ్డారు. ఆ ఎనిమిది మంది వసువుల్లో ద్యుమంతుడనేవాడు (ఇతన్ని ప్రభాసుడని కూడా చెబుతూ ఉంటారు) భార్య మెప్పు కోసం వశిష్ఠ మహర్షి హోమధేనువును ఇతర వసువుల సాయంతో దొంగిలించుకొని వచ్చాడు. ఇంతట్లో వశిష్ఠుడు ఫలాలూ సమిధలూ తీసుకొని రానేవచ్చాడు. తన నందినీ ధేనువూ, దాని దూడా అక్కడ కనిపించలేదు. దివ్యదృష్టితో వసువుల నిర్వాకాన్ని కనిపెట్టి, వాళ్లందర్నీ మనుషులుగా పుట్టమని శపించాడాయన. మనుషుల్లో పుట్టడమంటే పనులు చేయడమూ వాటివల్ల వచ్చిపడే బంధనాల్లో చిక్కుకోవడమూ అనే వరస నిరంతరమూ జరుగుతూ ఉంటుంది. ఆ చిక్కుల నుంచి బయటపడాలంటే చాలా కష్టాలే పడాలి. శాపం గురించి విని, వాళ్లందరూ వచ్చి వశిష్ఠుణ్ని ప్రసన్నం చేసుకొందామని ఆయన్ను బతిమాలుకొన్నారు. ‘మీరందరూ ప్రతి సంవత్సరమూ ఒక్కొక్కళ్ల చొప్పున శాపమోక్షాన్ని పొందుతారు గానీ, ఈ ద్యుమంతుడు అసలైన నేరస్థుడు గనుక, ఇతను మాత్రం, తన కర్మ కారణంగా, చాలాకాలం పాటు మానుష లోకంలో ఉండవలసి వస్తుంది. ఇతనికి పిల్లలు కలగరు; తండ్రికి ప్రియాన్ని చేయడం కోసం స్త్రీ భోగాల్ని పూర్తిగా విడిచిపెడతాడు కూడాను. అయితే, ఇతను సర్వశాస్త్రాల్లోనూ విశారదుడవుతాడులే’ అని వశిష్ఠుడు వాళ్లకు చెప్పి పంపించాడు.దిగాలుపడి వస్తూన్న వసువులు గంగతో తమ శాప వృత్తాంతం చెప్పుకొని ‘ప్రతీపుడి కొడుకును మేము తండ్రిగా ఎన్నుకొంటాం. మమ్మల్ని నువ్వే మనుషుల లోకం నుంచి త్వరగా వెనక్కి తీసుకొని రావాలి’ అంటూ గంగను బతిమాలుకొన్నారు. ‘అయితే శాంతనుడితో నా సంగమం వమ్ము కాకుండా ఒక కొడుకైనా ఉండేలాగ ఏదో ఒక మార్గం చూడండి’ అని గంగ అడిగింది. ‘ఇదుగో ఈ ద్యుమంతుడు అతని దగ్గర ఉంటాడు. కానీ అపుత్రుడిగానే ఉంటాడు’ అని వసువులు గంగతో ఒప్పందం చేసుకొని ‘అమ్మయ్య’అని ఊపిరి పీల్చుకున్నారు. బ్రహ్మసభలో శాపాన్ని పొందిన మహాభిషుడే శాంతనుడిగా ప్రతీపుడికి పుట్టాడు. ప్రతీపుడు శాంతనుడికి పట్టంగట్టి అడవికి తపస్సు చేయడానికి వెళ్లాడు. పిల్లలకు ఏళ్లొచ్చి తమ పొల్లు తాము పోసుకొంటూ ఉన్నప్పుడు, పెద్దలు ఆస్తులన్నీ పంచిపెట్టి, మన అందరికీ మూలమైన మహాచైతన్యాన్ని వెదుక్కోవడానికి ఈ మాయాలోకం నుంచి దూరంగా వెళ్లి ప్రయత్నించాలి. అందుచేతనే బ్రహ్మచర్యమూ గృహస్థుగా ఉండటమూ ఆమీదట ఈ వానప్రస్థమూ, అంటే, ప్రతీపుడి మాదిరిగా వనానికి వెళ్లి తపస్సు చేయడమూ చివరికి సన్యాసమూ ఏర్పడ్డాయి. శాంతనుడు రాజయ్యాడు. వినోదం కోసం వేటకు వెళ్లడం రాజులకు ఒక అలవాటు. క్రూరమృగాల్ని చంపడమూ తిండికి పనికివచ్చే జంతువుల్ని మితంగా చంపడమూ ఈ వేటలో జరుగుతూ ఉంటుంది. దుప్పుల్నీ దున్నల్నీ చంపుతూ శాంతనుడు అక్కడున్న గంగానది ఒడ్డుకు సేదదీరడానికి వచ్చాడు. ఆ ఒడ్డుమీదకే గంగాదేవి ఊరకనే, ఏ ఉద్దేశమూ లేకుండానే, ఒక స్త్రీ రూపంలో వచ్చింది. ఇద్దరి కళ్లూ కలిశాయి; ప్రేమ పొటమరించింది. అయితే, గంగాదేవి పెళ్లికి ఒక షరతు పెట్టింది: ‘నేనేం చేసినా, అది శుభమైనది గానీ అశుభమైనదిగానీ నువ్వు అడ్డు చెప్పకూడదు. నాకు వ్యతిరేకంగా కానీ, అప్రియంగా గానీ నువ్వేమీ మాటలాడకూడదు. అడ్డు పడినా, అప్రియంగా మాట్లాడినా నేను నిన్ను విడిచివెళ్లిపోతాను. దీనికి తిరుగుండదు’ అని. ఆమె ఎవరో తెలియకపోయినా, ఆవిడగారి రూపవిమోహంలో పడ్డ శాంతనుడు ఏం జరగబోతోందో పిసరంతైనా ఆలోచించకుండా అన్నిటికీ ఒప్పేసుకొన్నాడు. అంతేమరి, మోహంలో పడ్డవాడికెవడికైనా ఇంగిత జ్ఞానం చక్కాపోతుంది. ప్రతి ఏడాదీ కన్న ప్రతి కొడుకునీ ‘ఇదుగో, నీకు చెప్పినట్టుగా నిన్ను శాపం నుంచి విముక్తుణ్ని చేస్తూ నిన్ను ప్రసన్నుణ్నిగా చేస్తున్నాను’ అంటూ గంగ నీళ్లల్లో ముంచుతూ ఉండేది. ఇలాగ ఏడుగురు కొడుకుల్ని పొట్టనబెట్టుకొన్నా, ఆవిడ ఎక్కడ విడిచివెళ్లిపోతుందోనన్న భయంతో శాంతనుడు పల్లెత్తు మాట కూడా అనలేదు. కానీ ఎనిమిదోవాణ్ని కూడా అలాగే కసాయిదానిలాగ తీసుకొనిపోతూ ఉంటే, శాంతనుడు ఉండబట్టలేక ‘వీణ్ని చంపకు. ముక్కుపచ్చలారని పిల్లల్ని ఇంత నిర్దయగా చంపే అసలు నువ్వెవత్తివి? ఎవరి పిల్లవి? నీ పిల్లల్ని నువ్వే నిర్దాక్షిణ్యంగా, కంట తడి కూడా పెట్టకుండా చంపుతున్నావేమిటి? పసిపిల్లల్ని చంపినందుకు నువ్వు చెప్పలేనన్ని ఏళ్లు నరకంలో ఉండవలసి వస్తుంది’ అని అంటూ ఆవిణ్ని అడ్డగించాడు. ‘నీకూ నాకు చెల్లిపోయింది గనకనే ఇలాగ అడ్డుపడ్డావు. ఈ పిల్లవాణ్ని చంపనులే. నేను మహర్షులందరూ శ్రద్ధగా సేవించే గంగానదిని. ఒక దేవకార్యాన్ని సిద్ధింపజేయడానికి నేను నీతో పాటు ఇన్నాళ్లున్నాను. ఈ గంగాదత్తుణ్ని నువ్వు ఉంచుకో’ అని చెబుతూ ఆవిడ నదీరూపంతో ఒకటైపోయింది. గంగ ఇచ్చిన ఆ గంగాదత్తుడే భీష్ముడు. ‘ఇతగాడికి పిల్లలుండరు; ఇతను పెళ్లిచేసుకోడు’అని చెప్పడానికి కారణంగానే వసువులు చేసిన దొంగతనం కథను చెప్పడం జరిగింది. శాంతనుడు పుట్టడానికి మూలకారణంగా బ్రహ్మసభలో జరిగిన కథను చెప్పారు. గంగాదేవి ఆవిడకుగా ఆవిడే, ఎవరి ప్రమేయమూ లేకుండానే బ్రహ్మసభకు వచ్చింది; ప్రతీపుడి కుడి తొడమీద కూర్చొంది; వేటాడి ఒడ్డున సేదదీరుతూన్న శాంతనుడి దగ్గరికీ వచ్చింది. ప్రతిదానికీ, మనకు తెలిసినా తెలియకపోయినా, మనం చేసిన ఏదో ఒక పనే కారణమవుతూ ఉంటుందని చెప్పడానికే ఈ రకంగా కథలో కథల్ని అల్లుతూ ఉంటాడు వ్యాసుడు. నిజానికి ఈ కథల వెనక ‘దేవకార్యం’ (సృష్టి) ఒకటి సిద్ధించడానికి పథకం అల్లడం జరిగింది. మహాభిషమంటే అన్నీ దేనిలో చివరికి విశ్రాంతిని పొందుతాయో ఆ పరమస్థానం. ‘బ్రహ్మ’ అనే పదానికి పెంపొందడమని అర్థం. అన్నిటికీ అంతమైన దివ్యవస్తువులో, సృష్టిని చేసి పెంపొందించాలన్న కోరిక పుట్టుకొని వచ్చింది. అక్కడికి ఒక కారణమంటూ ఏమీ లేకుండానే ఊరకనేగంగానది ఒక రూపాన్ని దాల్చి వచ్చింది. ‘గం’ అన్నా, ‘గా’ అన్నా వెళ్తూ ఉండటమని అర్థం. అంటే, ఎప్పుడూ ఆపుదల లేకుండా జరిగే సృష్టి ప్రవాహాన్ని నడిపే స్వచ్ఛమైన ప్రకృతి. అన్నిటికీ చివరి మజిలీ అయిన దివ్యుడికి సృష్టిగా, అంటే, చాలామందిగా పెంపొందాలనే కోరిక పుట్టడంతోనే, దానంతట అదే, అతనిలోంచే, అతని సొంత భావమనే ఆపరాని ప్రవాహం ఒకటి ఆకర్షించే ఒక గొప్ప రూపాన్ని ధరించి ‘ప్రకృతి’గా ఎదురు అవుపించింది. ‘ప్ర’ అంటే గొప్పది; ‘కృతి’ అంటే, తయారైన ఒక ఆకారం. అన్నిటికీ చివరి స్థానమైన దివ్యత్వం, లేక, చైతన్యం ఒకటిగా ఉండక ‘అనేకం’గా అవుదామని అనుకోవడమే ‘ప్రతీపత్వం’, వ్యతిరేకత్వం, తనకు తాను విరుద్ధంగా ప్రవర్తించడం. ఏకత్వానికి వ్యతిరేక భావమే అనేకత్వం. మహాచైతన్యానికి ఏ కొరతా ఉండదు. దానికి అనేకంగా కావాలని కోరిక పుట్టడమే అన్ని వికారాలూ శాంతించిన ‘శాంతన’ చైతన్యానికి ఎదురుగా గంగానది అనే ప్రకృతి రూపుగట్టడమూ, ఆ చైతన్యానికి జత కడదామని అనిపించడమూను. ఆ మహాచైతన్యం కొన్ని దివ్యశక్తుల ద్వారా ఈ అనేకత్వమనే సృష్టి నాటకాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఆ శక్తుల్లోవే వసువులు, సృష్టిని నివసింపజేసేవాళ్లు. ఈ ఎనిమిదింటిలో ఏడు ఎదురుగుండా అవుపించకుండానే పనిచేస్తూ ఉంటాయి. అవి కనిపించకుండానే పనిచేస్తూ ఉంటాయని చెప్పడానికే, గంగ తన ఏడుగురు కొడుకుల్నీ తన ప్రవాహంలో ముంచిందని చెప్పారు. పుట్టినదేదైనా నిలిచి ఉండాలంటే, దాంట్లో ‘నేనున్నాన’నే భావం ఉండాలి. ఆ భావమే ప్రకృతి మనకు ఇచ్చిన, మనలో మిగిల్చిన, అంటే, ‘గంగాదత్తమైన’ అహంభావం, ‘నేనున్నాన’నే భావం. ఈ ‘నేను’ అనే భావానికి మగా ఆడా అనే తేడా లేదు; అదే రెండూను. ఈ రెండూ సమంగా ఉంటే, పెళ్లి అవసరమే ఉండదు; అంచేత దానికింక పిల్లలు కలగరు. అహంకారం దానంతట అదే చావాలి; ఎవ్వరూ చంపలేరు. దాన్నే ‘స్వచ్ఛంద మరణమ’ని అంటారు. అదే భీష్ముడు తన తండ్రి నుంచి స్వచ్ఛంద మరణం పొందడమనే వరం వెనుక ఉన్న మర్మం. - డాక్టర్ ముంజులూరి నరసింహారావు -
కౌరవుల పేర్లన్నీ మీకు తెలుసా?
-
కౌరవుల పేర్లన్నీ మీకు తెలుసా?
మహాభారతం గురించి విన్నారు కదా.. టీవీలలో కూడా చాలామంది బీఆర్ చోప్రా తీసిన మహాభారతం సీరియల్ కూడా చూసే ఉంటారు. అందులో పాండవుల పేర్లు ఐదూ మీకు తెలుసు కదూ. మరి కౌరవుల పేర్లు తెలుసా? దుర్యోధనుడు, దుశ్శాసనుడు .. వీళ్లిద్దరి పేర్లు చాలామంది చెబుతారు. మహా అయితే మరికొందరు మాత్రం పాండవ పక్షపాతి అయిన వికర్ణుడి పేరు కూడా చెప్పగలరు. కానీ మొత్తం అందరి మంది పేర్లు చెప్పగలరా? పిల్లలే కాదు.. పెద్దవాళ్లలో కూడా నూటికి 99 మందికి ఆ పేర్లు తెలియకపోవచ్చు. అందుకే.. పిల్లలు, పెద్దవాళ్లు అందరికీ విజ్ఞానం పెంచేందుకు కల్చర్ మెషీన్, షిట్జెంజిగిల్స్ అనే గ్రూపు ఒక అద్భుతమైన వీడియోను రూపొందించింది. కరావోకే స్టైలులో కలిసి పాడేలా ఈ కౌరవుల పాటను వారు రూపొందించారు. ఈ పాటను చూస్తే మొత్తం కౌరవులందరి పేర్లూ ఇట్టే తెలిసిపోతాయి. సరదాగా ఈ పాట చూడండి.. మీరు కూడా కౌరవులందరి పేర్లు నేర్చుకోండి మరి!! -
'కౌరవులపై పాండవులు గెలిచినట్లు..'
అలనాటి మహాభారతంలో కౌరవులపై పాండవులు గెలిచినట్లు నేడు తెలంగాణ ప్రజలు గెలిచారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి. హరీశ్రావు అభివర్ణించారు. మంగళవారం ఆయన మెదక్లో విలేకర్లతో మాట్లాడుతూ... తమతో కలిసి ఉండేవారంతా తమవాళ్లే అని పునరుద్ఘాటించారు. అయితే దోపిడి పెత్తనాన్ని మాత్రం ఒప్పకోమన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ భాగం కావాలని తమ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. -
కౌరవులలో ధర్మరాజు..!
ధర్మానికి దర్పణం: వికర్ణుడికి దుర్యోధనుడి పాటి బలం లేకపోవచ్చు. రారాజు కాకపోవచ్చు. చిన్నవాడే కావచ్చు. ప్రతికూల పరిస్థితుల్లోనే ఉండవచ్చు. ఎలాంటి సందర్భమైనా, మరెలాంటి సమయమైనా ధర్మరక్షణకు నడుం బిగించాలన్న ఉదాత్త ఆశయానికి దర్పణమై కానవస్తాడు. కౌరవులనగానే దుర్మార్గానికి ప్రతీకగా నిలిచే ఒకానొక మూకగానే అందరికీ తెలుసు. అలాంటి సమూహంలో సైతం ధర్మకోవిదునిగా వెలిగిన మాననీయుడు వికర్ణుడి గురించి ఎందరికి తెలుసు? ద్రౌపదీ మానసంరక్షణకోసం అయిన వాళ్ళతోనే పోట్లాడాడు. మాటపడ్డాడు. అవమానభారాన్ని మోశాడు. శాపనార్థాలు తిన్నాడు. కాని, మంచిని మరువలేదు. మమతను వీడలేదు. మానవతను విస్మరించలేదు. తొంభై ఎనిమిది మంది తమ్ములు సుయోధనునికి మద్దతుగా నిలిచినా వికర్ణుడు మాత్రం మంచిని మంచిగా, చెడ్డను చెడ్డగా చెప్పి, పాలనూ నీళ్ళనూ వేరు చేయగల హంసలా వర్తన సాగించాడు. ఇందువల్లే కురుపక్షంలోనే విపక్షంగా మిగిలిపోయాడు. అయినా ఎన్నడూ చలించలేదు. పెద్దలెందరు దుర్బోధ చేసినా మంచిబాటను వదులుకోలేదు. జూదక్రీడ అంటే చెవి కోసుకునే ధర్మనందనుడు దుర్యోధనుని ఆహ్వానం మేరకు సతీ సోదర సమేతుడై హస్తిన చేరుకుంటాడు. ధృతరాష్ట్ర సభలో ఆట మొదలవుతుంది. శకుని మాయపాచికల కారణంగా తనకు చెందిన సకల ధన కనక వస్తువాహనాలనూ ఓడిపోతాడు ధర్మజుడు. తమ్ముళ్ళనూ పందెంలోకి పణంగా పెడతాడు. వారినీ దుర్యోధనుని వశం చేస్తాడు. చివరికి తనను, పట్టమహిషి ద్రౌపదినీ పందెంలో కోల్పోతాడు. ఎప్పుడైతే పాండవులు జూదంలో సర్వమూ కోల్పోయారో అప్పుడే రారాజులో పగ మరింతగా పెరిగిపోతుంది. పాతకోపాలన్నీ పరవళ్ళు తొక్కుతాయి. హృదయమంతా క్రోధాగ్నితో రగిలిపోతుంది. మయసభలో తనను చూసి నవ్విన పాంచాలి గుర్తుకువస్తుంది. ఆమెను అవమానించాలని నిర్ణయించుకుంటాడు. వెనువెంటనే పాంచాలిని నిండుసభకు తీసుకురావాలని ప్రాతికామిని ఆదేశిస్తాడు. ప్రభువు ఆదేశానుసారం ద్రౌపది విడిదికి వెళ్లి విషయమంతా చెప్పి ఆమెను సభకు రమ్మనమని పిలుస్తాడు ప్రాతికామి. ద్రౌపది విస్మయం పాలవుతుంది. ‘ద్యూతంలో తను ఓడటం ఏమిటి? తనను పందెంగా పెట్టడానికి కుంతీజ్యేష్టునికి ఉన్న అధికారమేమిటి?’ వంటి ప్రశ్నలు సంధిస్తుంది. తన్నోడి నన్నోడెనా..లేక నన్నోడి తనోడెనా... అనే ధర్మసందేహాన్ని ధర్మజునిపైకి విసురుతుంది. పైగా ఏకవస్త్రనైన తాను నిండుకొలువుకు రాలేనని స్పష్టం చేస్తుంది. ప్రాతికామి వెనుదిరుగుతాడు. విషయమంతా సభకు తెలియజేస్తాడు. సుయోధనుని ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ‘పంచభర్తృక అయిన ద్రౌపది సందేహపడితే లెక్కచేసేదెవరట..’ అంటూ రెచ్చిపోతాడు. ఏకవస్త్ర అయినా వివస్త్ర అయినా తన వద్దకు రావలసిందేనంటూ... ఆమెను ఈడ్చుకు రమ్మనమని అనుంగు సోదరుడయిన దుశ్శాసనుణ్ణి పురమాయిస్తాడు. ఉత్తరక్షణంలోనే సిగపాయ పట్టుకుని మరీ ద్రౌపదిని సభలోకి తెచ్చిపడేస్తాడు దుశ్శాసనుడు. పెద్దల కొలువులో ద్రౌపది తరపున ఒక్కడంటే ఒక్కడూ మాట్లాడలేని వేళ, సార్వభౌమునికి పదహారవ తమ్ముడయిన వికర్ణుడి కంఠం ప్రళయ ఝంఝా మారుతంలా కౌరవులను తాకుతుంది. నిండుసభలో ఆడకూతురిని అవమానించడం ఎంతటి సంస్కారమని ప్రశ్నిస్తాడు. తల్లిలాంటి వదినమ్మని చెరబడితే పుట్టగతులుండవని హెచ్చరిస్తాడు. ఇది దారుణమని దుర్యోధనాదులను నిలదీస్తాడు. దాంతో సభలో కలకలం రేగుతుంది. చిన్నవాడైనా పెద్దమనసుతో వ్యవహరించిన వికర్ణుని ముందు భీష్మాదులూ తీసికట్టుగానే మిగిలిపోతారు. వికర్ణుని ధర్మవర్తన చూసి పాండవులే ఆశ్చర్యపోతారు. తాము కూడా నోరుకట్టుకుని ఉన్న సమయంలో వికర్ణుడు చిన్నవాడయినా ధర్మం విషయంలో దృఢంగా నిలబడగలిగాడని సంతోషపడతారు. ధర్మాధర్మాల విచక్షణ వేళ మనిషన్నవాడు ఎలా మెలగాలో విస్పష్టంగా తెలియజేస్తాడు వికర్ణుడు. ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనూ ధర్మమార్గాన్ని వీడకూడదని చెప్పేందుకు వికర్ణుని జీవితమే నిదర్శనం. అందుకే నేటికీ కురువంశంలో ఏకైక ధర్మచరితునిగా మానవేతిహాసంలో మన్ననలు పొందుతున్నాడు. కాలం ఉన్నంతవరకూ వికర్ణుడూ ఉంటాడు అజేయంగా...అమేయంగా... - డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు