కౌరవులలో ధర్మరాజు..!
ధర్మానికి దర్పణం: వికర్ణుడికి దుర్యోధనుడి పాటి బలం లేకపోవచ్చు. రారాజు కాకపోవచ్చు. చిన్నవాడే కావచ్చు. ప్రతికూల పరిస్థితుల్లోనే ఉండవచ్చు. ఎలాంటి సందర్భమైనా, మరెలాంటి సమయమైనా ధర్మరక్షణకు నడుం బిగించాలన్న ఉదాత్త ఆశయానికి దర్పణమై కానవస్తాడు.
కౌరవులనగానే దుర్మార్గానికి ప్రతీకగా నిలిచే ఒకానొక మూకగానే అందరికీ తెలుసు. అలాంటి సమూహంలో సైతం ధర్మకోవిదునిగా వెలిగిన మాననీయుడు వికర్ణుడి గురించి ఎందరికి తెలుసు? ద్రౌపదీ మానసంరక్షణకోసం అయిన వాళ్ళతోనే పోట్లాడాడు. మాటపడ్డాడు. అవమానభారాన్ని మోశాడు. శాపనార్థాలు తిన్నాడు. కాని, మంచిని మరువలేదు. మమతను వీడలేదు. మానవతను విస్మరించలేదు. తొంభై ఎనిమిది మంది తమ్ములు సుయోధనునికి మద్దతుగా నిలిచినా వికర్ణుడు మాత్రం మంచిని మంచిగా, చెడ్డను చెడ్డగా చెప్పి, పాలనూ నీళ్ళనూ వేరు చేయగల హంసలా వర్తన సాగించాడు. ఇందువల్లే కురుపక్షంలోనే విపక్షంగా మిగిలిపోయాడు. అయినా ఎన్నడూ చలించలేదు. పెద్దలెందరు దుర్బోధ చేసినా మంచిబాటను వదులుకోలేదు.
జూదక్రీడ అంటే చెవి కోసుకునే ధర్మనందనుడు దుర్యోధనుని ఆహ్వానం మేరకు సతీ సోదర సమేతుడై హస్తిన చేరుకుంటాడు. ధృతరాష్ట్ర సభలో ఆట మొదలవుతుంది. శకుని మాయపాచికల కారణంగా తనకు చెందిన సకల ధన కనక వస్తువాహనాలనూ ఓడిపోతాడు ధర్మజుడు. తమ్ముళ్ళనూ పందెంలోకి పణంగా పెడతాడు. వారినీ దుర్యోధనుని వశం చేస్తాడు. చివరికి తనను, పట్టమహిషి ద్రౌపదినీ పందెంలో కోల్పోతాడు.
ఎప్పుడైతే పాండవులు జూదంలో సర్వమూ కోల్పోయారో అప్పుడే రారాజులో పగ మరింతగా పెరిగిపోతుంది. పాతకోపాలన్నీ పరవళ్ళు తొక్కుతాయి. హృదయమంతా క్రోధాగ్నితో రగిలిపోతుంది. మయసభలో తనను చూసి నవ్విన పాంచాలి గుర్తుకువస్తుంది. ఆమెను అవమానించాలని నిర్ణయించుకుంటాడు. వెనువెంటనే పాంచాలిని నిండుసభకు తీసుకురావాలని ప్రాతికామిని ఆదేశిస్తాడు. ప్రభువు ఆదేశానుసారం ద్రౌపది విడిదికి వెళ్లి విషయమంతా చెప్పి ఆమెను సభకు రమ్మనమని పిలుస్తాడు ప్రాతికామి. ద్రౌపది విస్మయం పాలవుతుంది.
‘ద్యూతంలో తను ఓడటం ఏమిటి? తనను పందెంగా పెట్టడానికి కుంతీజ్యేష్టునికి ఉన్న అధికారమేమిటి?’ వంటి ప్రశ్నలు సంధిస్తుంది. తన్నోడి నన్నోడెనా..లేక నన్నోడి తనోడెనా... అనే ధర్మసందేహాన్ని ధర్మజునిపైకి విసురుతుంది. పైగా ఏకవస్త్రనైన తాను నిండుకొలువుకు రాలేనని స్పష్టం చేస్తుంది. ప్రాతికామి వెనుదిరుగుతాడు. విషయమంతా సభకు తెలియజేస్తాడు. సుయోధనుని ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ‘పంచభర్తృక అయిన ద్రౌపది సందేహపడితే లెక్కచేసేదెవరట..’ అంటూ రెచ్చిపోతాడు. ఏకవస్త్ర అయినా వివస్త్ర అయినా తన వద్దకు రావలసిందేనంటూ... ఆమెను ఈడ్చుకు రమ్మనమని అనుంగు సోదరుడయిన దుశ్శాసనుణ్ణి పురమాయిస్తాడు.
ఉత్తరక్షణంలోనే సిగపాయ పట్టుకుని మరీ ద్రౌపదిని సభలోకి తెచ్చిపడేస్తాడు దుశ్శాసనుడు. పెద్దల కొలువులో ద్రౌపది తరపున ఒక్కడంటే ఒక్కడూ మాట్లాడలేని వేళ, సార్వభౌమునికి పదహారవ తమ్ముడయిన వికర్ణుడి కంఠం ప్రళయ ఝంఝా మారుతంలా కౌరవులను తాకుతుంది. నిండుసభలో ఆడకూతురిని అవమానించడం ఎంతటి సంస్కారమని ప్రశ్నిస్తాడు. తల్లిలాంటి వదినమ్మని చెరబడితే పుట్టగతులుండవని హెచ్చరిస్తాడు. ఇది దారుణమని దుర్యోధనాదులను నిలదీస్తాడు. దాంతో సభలో కలకలం రేగుతుంది. చిన్నవాడైనా పెద్దమనసుతో వ్యవహరించిన వికర్ణుని ముందు భీష్మాదులూ తీసికట్టుగానే మిగిలిపోతారు.
వికర్ణుని ధర్మవర్తన చూసి పాండవులే ఆశ్చర్యపోతారు. తాము కూడా నోరుకట్టుకుని ఉన్న సమయంలో వికర్ణుడు చిన్నవాడయినా ధర్మం విషయంలో దృఢంగా నిలబడగలిగాడని సంతోషపడతారు. ధర్మాధర్మాల విచక్షణ వేళ మనిషన్నవాడు ఎలా మెలగాలో విస్పష్టంగా తెలియజేస్తాడు వికర్ణుడు. ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనూ ధర్మమార్గాన్ని వీడకూడదని చెప్పేందుకు వికర్ణుని జీవితమే నిదర్శనం. అందుకే నేటికీ కురువంశంలో ఏకైక ధర్మచరితునిగా మానవేతిహాసంలో మన్ననలు పొందుతున్నాడు. కాలం ఉన్నంతవరకూ వికర్ణుడూ ఉంటాడు అజేయంగా...అమేయంగా...
- డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు