ధౌమ్యుడు పాండవులకు పురోహితుడు. ఆయన మహర్షి. ఆయన వద్ద ఉపమన్యుడు, ఆరుణి, బైదుడు అనే ముగ్గురు శిష్యులు విద్యాభ్యాసం చేస్తుండేవారు. ముగ్గురూ చాలా తెలివైన వారు. అంతకు మించి అమిత గురుభక్తి తత్పరులు. ఒకనాడు ధౌమ్యుడు తన శిష్యులలో ఆరుణిని పిలిచాడు. ‘మన పొలం దగ్గర కాలువ గట్టు తెగి, వరిచేనును ముంచేస్తోంది. నువ్వు వెళ్లి, ఆ కాలువకు అడ్డుకట్ట వేసి రా’ అని ఆజ్ఞాపించాడు. ఆరుణి పొలానికి వెళ్లి, గట్టు తెగిన కాలువకు అడ్డుకట్ట వేయడానికి రకరకాలుగా ప్రయత్నించాడు. కుప్పలు కుప్పలుగా మట్టి తెచ్చి, గట్టుకు అడ్డుగా వేశాడు. అయినా అది నిలువలేదు. ఇక ఏం చేయాలో తోచక కాలువ గట్టుకు అడ్డుగా తానే పడుకున్నాడు. అప్పుడు నీరు చేనులోకి చేరడం ఆగిపోయింది. రాత్రి అయినా ఆరుణి ఆశ్రమానికి రాలేదు.
ధౌమ్యుడు మిగిలిన ఇద్దరు శిష్యులను వెంటబెట్టుకుని పొలానికి వెళ్లాడు. పొలంలో వెదుకుంతుండగా, కాలువ గట్టుకు అడ్డంగా పడుకుని ఉన్న ఆరుణి కనిపించాడు. ధౌమ్యుడు అతడిని లేవనెత్తి, ‘వత్సా! నీ గురుభక్తికి సంతోషించాను. నువ్వు త్వరలోనే విద్వాంసుడివి కాగలవు’ అని దీవించాడు. అతడికి అన్ని విద్యలూ నేర్పించి, విద్వాంసుడిగా తీర్చిదిద్దాడు.కొన్నాళ్లకు ధౌమ్యుడు తన శిష్యులలో ఉపమన్యుడిని పిలిచి, ‘పాఠాలు చదువుకోవడం పూర్తయ్యాక రోజూ ఆవులను మేపి వస్తూండు’ అని ఆజ్ఞాపించాడు. ఉపమన్యుడు గురువు చెప్పినట్లే చేయసాగాడు.
ఒకవైపు ఆశ్రమంలో పనులు చేస్తూ, చదువుకుంటూ, మరోవైపు గోవులు కాసే పని చేస్తున్నా ఉపమన్యుడు పుష్టిగా ఉండేవాడు. ఒకరోజు ధౌమ్యుడు ఉపమన్యుడిని చూసి, ‘ఇన్ని పనులు చేస్తున్నా నువ్వు ఇంత పుష్టిగా ఎలా ఉన్నావు? ఇంట్లో కూర్చుని తింటున్నా నేను నీ అంత పుష్టిగా లేను సుమా’ అన్నాడు.‘ఆచార్యా! నేను భిక్షాటన చేసుకుని జీవిస్తున్నాను. నాకు రోజూ ఎన్నో వంటకాలు దొరుకుతుంటాయి. వాటిని ఆరగిస్తుండటం వల్లనే పుష్టిగా ఉన్నాను’ అని చెప్పాడు ఉపమన్యుడు.‘అలాగైతే, నువ్వు రోజూ సంపాదించే భిక్షను తీసుకొచ్చి నాకు ఇస్తూండు’ ఆదేశించాడు ధౌమ్యుడు.ఉపమన్యుడు ప్రతిరోజూ తాను సంపాదించే భిక్షను గురువుకు ఇస్తుండేవాడు. ఇలా రోజులు గడుస్తున్నా, ఉపమన్యుడు ఎప్పటిలాగానే పుష్టిగా ఉండేవాడు.
కొన్నాళ్లకు ధౌమ్యుడు, ‘నువ్వు తెచ్చినదంతా నాకే ఇచ్చేస్తున్నావు కదా, అయినా పుష్టిగానే ఉంటున్నావు. అదెలా సాధ్యమవుతోంది?’ అని అడిగాడు. ‘ఆచార్యా! పగలు సంపాదించిన భిక్ష అంతా తమకు ఇచ్చి, రాత్రివేళ దొరికిన భిక్షను నేను తింటున్నాను’ బదులిచ్చాడు ఉపమన్యుడు. ‘ఇక నుంచి రాత్రివేళ భిక్ష కూడా నాకే ఇస్తూండు’ ఆజ్ఞాపించాడు ధౌమ్యుడు. ఉపమన్యుడు అలాగే చేయసాగాడు. ఇలా కొన్నాళ్లు గడిచినా, ఉపమన్యుడు యథాప్రకారమే కనిపించసాగాడు. ‘రెండు పూటల భిక్ష నాకే తెచ్చి ఇచ్చేస్తున్నావు కదా, అయినా నువ్వు ఇంకా పుష్టిగానే ఎలా ఉంటున్నావు?’ అడిగాడు ధౌమ్యుడు.
‘ఆవుల పాలు తాగుతున్నాను ఆచార్యా!’ అని బదులిచ్చాడు ఉపమన్యుడు.‘పాలు లేక లేగదూడలు బక్కచిక్కిపోతున్నాయి. ఇకపై నువ్వు ఆవుపాలు తాగడం మనుకో’ ఆదేశించాడు ధౌమ్యుడు. ఉపమన్యుడు ఆవుపాలు తాగడం కూడా మానేశాడు. ఇలా రోజులు గడిచేకొద్ది కృశించసాగాడు.ఒకనాడు ఆవులను మేతకు తీసుకుపోతున్నప్పుడు ఆకలికి తాళలేకపోయాడు. దారిలో కనిపించిన జిల్లేడు మొక్కల ఆకులను తిన్నాడు. ఆకలి తీరిందో లేదో గాని, జిల్లేడు ఆకులు తిన్నందుకు ఉపమన్యుడికి గుడ్డితనం వచ్చింది. ఆవులను తిరిగి ఆశ్రమానికి తోలుకు వస్తుండగా, దారి గుర్తించలేక ఒక పాడుబడిన బావిలో పడిపోయాడు. ఆవులు అలవాటు కొద్ది ఆశ్రమానికి చేరుకున్నాయి గాని, వాటితో పాటు ఉపమన్యుడు రాలేదు.
రాత్రి ఎంతసేపటికీ ఉపమన్యుడు రాకపోవడంతో ఆందోళన చెందిన ధౌమ్యుడు అతడిని వెదుకుతూ బయలుదేరాడు. కొంత దూరం వెళ్లాక, బావిలోంచి ఆర్తనాదాలు వినిపించాయి. ధౌమ్యుడు బావి వద్దకు వెళ్లి చూడగా, ఉపమన్యుడు కనిపించాడు. ధౌమ్యుడు అతడికి ధైర్యం చెప్పి, ఆశ్వనీ దేవతల మంత్రం ఉపదేశించాడు. మంత్ర ప్రభావంతో ఉపమన్యుడికి చూపు వచ్చింది. గురువు చేయి అందించడంతో సురక్షితంగా బావి నుంచి బయటపడ్డాడు. ధౌమ్యుడు అతడికి అన్ని విద్యలనూ నేర్పించి, తనంతటి విద్వాంసుడిగా తీర్చిదిద్దాడు. తర్వాత శిష్యులలో మూడోవాడైన బైదుడికి కూడా ఇలాగే కఠిన పరీక్షలు పెట్టి, వాటిని నెగ్గిన తర్వాత అతడికి కూడా అన్ని విద్యలనూ ఉపదేశించాడు.
‘వత్సా! నీ గురుభక్తికి సంతోషించాను. నువ్వు త్వరలోనే విద్వాంసుడివి కాగలవు’ అని దీవించాడు. అతడికి అన్ని విద్యలూ నేర్పించి, విద్వాంసుడిగా తీర్చిదిద్దాడు.
∙సాంఖ్యాయన
Comments
Please login to add a commentAdd a comment