పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయమది. తమ వద్దకు వచ్చిన వ్యాసమునీంద్రుని పాండవులు అర్ఘ్య పాద్యాదులతో పూజించిన తరువాత ఆయనతో ‘కౌరవులు మమ్మల్ని మాయ జూదంలో ఓడించారు. మమ్మల్ని అరణ్యవాసానికి, అజ్ఞాతవాసానికీ పంపించారు. శత్రుంజయులుగా పేరొందిన మాకే ఇప్పుడు శత్రుభయం పట్టుకుంది. మాకు తగిన తరుణోపాయం చెప్పండి’’ అని అడిగారు.
అపుడు వ్యాసభగవానుడు ‘‘మీకు ఎంతమంది శత్రువులున్నా వారిని గెలవాలంటే శివానుగ్రహం కలగాలి. కాబట్టి అర్జునుని శంకరుని గురించి తపస్సు చేయమనండి. శంకరుడు ప్రత్యక్షం అయినప్పుడు పాశుపతాస్త్రం అడగండి. శంకరుడు దానిని మీకు ఇచ్చి విజయీభవ అని ఆశీర్వదిస్తే ఇక మీ విజయానికి తిరుగులేదు’’ అని చెప్పి వ్యాసుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
వ్యాసుడి సూచన మేరకు అర్జునుడు శివారాధన చేయడం మొదలుపెట్టాడు. కొంతకాలం తర్వాత శంకరుడు అర్జునుడి శక్తిని పరీక్షించాలనుకున్నాడు. ఒక అడవిపందిని సృష్టించి దానిని అర్జునుడు తపస్సు చేసుకుంటున్న పర్ణశాల వద్దకు పంపాడు. అది అక్కడికి వెళ్లి రొద చేస్తోంది. ఆ ధ్వనికి కళ్ళు తెరిచి చూశాడు అర్జునుడు. వెంటనే తన విల్లందుకున్నాడు. ఈలోగా శివుడు అర్జునుడి వెనుక నుంచి అడవిపంది మీదకి వేసిన బాణం దాని పృష్ట భాగంలోంచి శరీరంలోకి వెళ్లి దాని నోట్లోంచి బయటకు వచ్చి నేలమీద పడింది. సరిగ్గా అదే సమయంలో ఎక్కుపెట్టిన అర్జునుడి బాణం అడవి పంది నోట్లోంచి శరీరంలోకి వెళ్లి అక్కడనుంచి పృష్ఠభాగంలోంచి బయటకు వెళ్లి నేలమీద పడింది. శివుడు తన ప్రమథగణాలలో ఒకడిని పిలిచి తన బాణాన్ని తీసుకు రమ్మనమని చెప్పాడు. అతను వెళ్లి అర్జునునితో ‘ఈ బాణం మా నాయకుడిది. ఆయన గొప్ప వీరుడు. ఆయన బాణం తీశాడంటే ఎవరూ నిలబడలేరు. జాగ్రత్త’’ అన్నాడు కవ్వింపుగా..
‘‘మీ నాయకుడు అంత మొనగాడయితే నాతో యుద్ధానికి రమ్మని చెప్పు’’ అన్నాడు అర్జునుడు. ఆ మాటకోసమే ఎదురు చూస్తున్నాడు కిరాతుడి రూపంలో ఉన్న శివుడు. కొండమీది నుంచి ఒక్క దూకు దూకి అర్జునుడి ముందు నిలబడి, ‘‘ఈ పందిని నువ్వు నీ బాణంతో కొట్టావా? ఏదీ ఇప్పుడు చూపు నీ విద్య’’ అన్నాడు.
అర్జునుడు క్షణం ఆలస్యం చేయకుండా శివుని మీద బాణాలు ప్రయోగించడం ప్రారంభించాడు. శివుడు కూడా అర్జునుని మీదకు బాణాలు వేస్తున్నాడు. అర్జునుడు తన బలం అంతటినీ ఉపయోగించి శివుడిని పడగొట్టేందుకు యత్నిస్తున్నాడు. కానీ శివునికి ఏమీ అవడం లేదు. తర్వాత ఇద్దరూ మల్లయుద్ధం చేశారు. శంకరుడు అర్జునుని శరీరాన్ని తోసి అవతల పారేశాడు. అపుడు అర్జునుడు తిరిగి లేచి తన ధనుస్సుతో శంకరుని జటాజూటం మీద ఒక గట్టి ప్రహారం చేశాడు. అపుడు శంకరుడు ఇక యుద్ధాన్ని చాలించి చంద్రవంకతో, పట్టుపుట్టంతో, పార్వతీ సమేతంగా అర్జునుడికి ఎదురుగుండా నిలబడ్డాడు.
మళ్ళీ కొడదామని గాండీవాన్ని ఎత్తిన అర్జునుడు తన ఎదుట సాక్షాత్కరించిన అర్ధనారీశ్వరుడి పాదాల మీద పడి శంకరుని ఏమి అడగాలో మర్చిపోయి కన్నుల వెంట నీరు కార్చుతూ ‘‘ఈశ్వరా, జగత్తుకే తండ్రివయిన నీపై అజ్ఞానినై బాణాలు వేశాను. నీ కారుణ్యంతో నా గుండె నిండిపోయింది’’ అని పరమేశ్వరుని పాదాల మీద పడిపోయాడు. అపుడు శంకరుడు ‘‘నీకు పాశుపతాస్త్రాన్ని ఇస్తున్నాను. మీకు ఎదురులేదు. రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో మీరే గెలిచి తీరుతారు. విజయీభవ!’’అని ఆశీర్వదించాడు.
ఇందులో మనం గ్రహించవలసిన నీతి ఏమిటంటే... ఆపదలో ఉన్న సమయంలో తగిన ఉపాయం చూపిన వాడే మనకు హితుడనీ, భగవంతుడు తన భక్తులకు అనేక పరీక్షలు పెట్టి, వాటిలో ¯ð గ్గినప్పుడే వరాలను అనుగ్రహిస్తాడనీ, అంతవరకూ మనం కుంగిపోకుండా కాలం పెట్టిన పరీక్షలలో నిగ్గు తేలాలి.
– డి.వి.ఆర్. భాస్కర్
Comments
Please login to add a commentAdd a comment