విరటుని పుత్రుడు ఉత్తర కుమారుడు బృహన్నల సారథ్యంలో యుద్ధభూమికి వచ్చాడు. అశేషమైన ఆ సేనని చూసి భయంతో పారిపోబోగా బృహన్నల అతన్ని వెనక్కి తీసుకుని వచ్చి ధైర్యం చెప్పాడు. శమీవృక్షంపై గల ఆయుధాల మూటను తీసుకు వస్తే తాను యుద్ధంలో సాయం చేస్తానన్నాడు. సరేనని ఉత్తరుడు చెట్టు వద్దకు వచ్చాడు. రథం నుండి దిగి శమీవృక్షాన్ని ఎక్కి ఆ మూటను కిందికి దించి, దానిపైనున్న బంధనాలను తొలగించాడు. చాలా పెద్దవైన బంగారపు విల్లులను, మెరుస్తున్న బాణాలను చూసి ఆశ్చర్యంతో ‘‘ఈ దివ్యాస్త్రాలు ఎవరెవరివి? ఇక్కడికి ఎలా వచ్చాయి?’’ అని అడిగాడు. ‘‘ఈ దివ్యాస్త్రాలు పాండవులవి. వీటిలో పెద్దదైన ఈ ధనుస్సు గాండీవం. దీనిని బ్రహ్మదేవుడు, ప్రజాపతి, ఇంద్రుడు, చంద్రుడు ధరించారు. ఆ తర్వాత అర్జునుడు దీనిని వాడుతున్నాడు. సర్పాల్లా కనిపించే ఈ బాణాలు అర్జునుడివే. అవిగాక మిగతా ఆయుధాలన్నీ ధర్మరాజ, భీమ, నకుల సహదేవులవి’’ అని చెబుతూ, ఎవరెవరివి ఏయే ఆయుధాలో చూపెట్టాడు బృహన్నల. ఉత్తరుడు మరింత ఆశ్చర్యంతో ‘‘పాండవులు ఇప్పుడెక్కడున్నారు? ఈ ఆయుధాల సంగతి నీకు ఇంత విపులంగా ఎలా తెలుసు?’’ అనడిగాడు.
బృహన్నల అతనితో ‘‘ఉత్తరకుమారా! నేను అర్జునుడను. మీ తండ్రిగారితో వీనులవిందుగా మాట్లాడుతూ ఆనందింపజేస్తున్న వ్యక్తి యుధిష్ఠిరుడు. మీ ఆస్థానంలోని పాకశాస్త్ర ప్రవీణుడు వలలుడే భీముడు. నకులుడు అశ్వపాలకుడు. సహదేవుడు గుర్రాలను రక్షించే నాయకుడు. సైరంధ్రియే ద్రౌపది.’’ అని చెప్పాడు. అదంతా విని ఉత్తరుడు విస్తుపోవడమేగాక పాండవులను చూడగలిగినందుకు ఎంతో సంతోషంతో బృహన్నలను ‘‘నీకున్న ప్రసిద్ధమైన పదిపేర్లను, వాటి కారణాలను చెప్పు’’ అనడిగాడు కుతూహలంతో. ‘‘ఉత్తరకుమారా! నేనొకప్పుడు రాజులందరినీ జయించి వారివద్దనుండి ధనాన్ని తీసుకొని దాని మధ్య కూర్చున్నాను. అందుచేత ధనంజయుడన్నారు. యుద్ధానికెప్పుడెళ్లినా జయించకుండా రాలేదు కనుక విజయుడన్నారు. నా రథానికి తెల్లటి గుర్రాలను కట్టడం వల్ల శ్వేతవాహనుడనే పేరొచ్చింది. ఉత్తర ఫల్గుణీ నక్షత్రాన పుట్టాను కాబట్టి ఫల్గుణుడన్నారు. రాక్షసులని జయించినందుకు దేవేంద్రుడు నా తలపై కిరీటాన్నుంచి గౌరవించాడు కనుక నన్ను కిరీటి అన్నారు. బీభత్సంగా యుద్ధం చేస్తాను కాబట్టి బీభత్సుడనే పేరొచ్చింది. రెండు చేతులతోనూ సమానవేగంగా బాణాలను వేయగలను కాబట్టి సవ్యసాచి అన్నారు. నా శరీరపు రంగు మట్టిరంగును పోలి విలక్షణంగా ఉండడం వల్ల పార్థుడని పేరొచ్చింది. గాండీవాన్ని ధరిస్తాను కాబట్టి గాండీవి అన్నారు’’ అని వివరించాడు. ఉత్తరుడికి మరోసారి ధైర్యవచనాలు చెప్పి, శత్రువులను జయించి, గోవులను కాపాడమని పలికి రథాన్ని కౌరవుల సమీపానికి నడిపించమన్నాడు. ఉత్తరుడు ధైర్యంతో ముందుకెళ్లాడు. సమయం వచ్చినప్పుడు కానీ, తమ స్థాయిని బయట పెట్టుకోరాదు. పాండవులు దానిని పాటించారు కాబట్టి విజయవంతంగా అజ్ఞాతవాసం చేయగలిగారు. అంతేకాదు, అర్జునుడికి ఉన్న పేర్లన్నీ ఆయనలోని విశేషగుణాలని బట్టి వచ్చినవే కానీ, తనంత తానుగా పెట్టుకున్నవి కాదు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకుని తీరవలసిన నీతి. నిజమైన వీరుడు చేతల్లో చూపిస్తాడు అర్జునుడిలా... అంతేగానీ ఉత్తముడిలా ప్రగల్భాలు పలుకడు.
– డి.వి.ఆర్. భాస్కర్
బృహన్నలార్జునీయం
Published Sun, Mar 10 2019 12:50 AM | Last Updated on Sun, Mar 10 2019 12:50 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment