arms
-
ఆయుధ పరిశ్రమ ఆదాయం రూ.53 లక్షల కోట్లు
స్టాక్‌హోం: యుద్ధాలు, ప్రాంతీయ ఘర్షణల నేపథ్యంలో ప్రపంచ ఆయుధ పరిశ్రమ ఆదాయం 2023లో 632 బిలియన్ డాలర్లకు (రూ.53 లక్షల కోట్లు) పెరిగింది. 2022తో పోలిస్తే ఇది 4.2 శాతం అధికం. ఆయుధ రంగంలో అమెరికా ఆధిపత్యం కొనసాగుతోంది. లాక్‌హీడ్ మార్టిన్, రేథియోన్ వంటి యూఎస్ ఆయుధ కంపెనీలే అధికాదాయం పొందాయి. స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సిప్రి) నివేదిక ప్రకారం టాప్ 100 కంపెనీల్లో 41 కంపెనీలు 317 బిలియన్ డాలర్ల ఆదాయం పొందాయి. ఇది గతేడాది కంటే 2.5 శాతం ఎక్కువ. ఆయుధ పరిశ్రమలో రెండో అతి పెద్ద దేశమైన చైనా టాప్ 100 జాబితాలోని తొమ్మిది కంపెనీల నుంచి 103 బిలియన్ డాలర్లను ఆర్జించింది. అయితే ఆర్థిక పరిమితులు, ఇతర సవాళ్లతో దాని వృద్ధి 0.7 శాతం తగ్గింది. స్వావలంబన దిశగా భారత్ భారత ఆయుధ పరిశ్రమకు 2023లో 6.7 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది. 2022తో పోలిస్తే ఇది 5.8 శాతం ఎక్కువ. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, భారత్ ఎల్రక్టానిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ప్రయోజనం పొందాయి. చైనాతో సరిహద్దు ప్రతిష్టంభన, విదేశీ ఆయుధ సరఫరాదారులపై ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరం స్వయం సమృద్ధికి ఆజ్యం పోశాయి. భారత్, తుర్కియే దేశీయ ఆయుధోత్పత్తిని విస్తరించి స్వావలంబనపై దృష్టి సారించాయి. ఘర్షణల నేపథ్యంలో పెరిగిన ఉత్పత్తి రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ ఆయుధ ఉత్పత్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషించింది. డిమాండ్‌కు అనుగుణంగా యూరప్, అమెరికా, తుర్కియేలోని రక్షణ సంస్థలు ఆయుధ తయారీని పెంచాయి. పలు దేశాల రక్షణ సంస్థల్లో ఆయుధాల అమ్మకాలు పెరిగాయి. తుర్కియే రక్షణ సంస్థ బేకర్ ఆదాయం 25 శాతం పెరిగి 1.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది ఎక్కువగా డ్రోన్లను ఎగుమతి చేసింది. చైనాతో ఉద్రిక్తతల మధ్య తైవాన్ రక్షణ వ్యయాన్ని పెంచడంతో ఆ దేశ ఎన్సీఎస్ఐఎస్టీ ఆదాయం 27 శాతం పెరిగి 3.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. యూకే సంస్థ అయిన అటా మిక్ వెపన్స్ ఎస్టాబ్లి‹Ùమెంట్ ఆదాయం 16 శాతం పెరిగి 2.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఆయుధ ఆదాయాన్ని ఎలా నడిపిస్తున్నాయో సిప్రి నివేదిక ఎత్తిచూపింది. -
అరెస్ట్ వారెంట్ జారీ, త్వరలో జైలుకి మాజీ సీఎం ‘లాలూ’?
పాట్నా : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఎదురు దెబ్బ తగిలింది. మధ్య ప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ నగర ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో ఆయన మరోసారి జైలు శిక్షను అనుభవించనున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్వాలియర్‌లోని కోర్టులో కొనసాగుతున్న అక్రమ ఆయుధాల కొనుగోలుకు సంబంధించిన కేసు నిందితుల్లో లాలూ ప్రసాద్ యాదవ్ ఒకరు. ఆయుధ చట్టం కింద 30 ఏళ్ల నాటి కేసుకు సంబంధించి గ్వాలియర్ ప్రత్యేక కోర్టు ఈ అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు చట్టపరమైన చిక్కుల్ని ఎదుర్కోనున్నారు. 30 ఏళ్ల నాటి కేసు 1997లో మధ్యప్రదేశ్ పోలీసులు అక్రమ ఆయుధాల కేసును నమోదు చేశారు. ఇందులో నిందితులుగా 22 మందిని చేర్చారు. అయితే, ఆ నిందితులు గ్వాలియర్‌లోని మూడు వేర్వేరు సంస్థల నుంచి ఆయుధాలను కొనుగోలు చేసి 1995 నుంచి 1997 మధ్య కాలంలో బీహార్‌లో విక్రయించినట్లు అభియోగాలు మోపారు పోలీసులు. అందుకు తగ్గ ఆధారాల్ని కోర్టు ముందుంచారు. అప్పటి నుంచి గ్వాలియర్ ప్రత్యేక కోర్టులో విచారణ కొనసాగుతుంది. నిందితుల్లో లాలూ ఒకరు మొత్తం 22 మంది నిందితుల్లో 14 మంది పరారీలో ఉండగా, ఆరుగురు విచారణలో ఉండగా, ఇద్దరు చనిపోయారు. ఈ కేసులో అభియోగాలు మోపబడి పరారీలో ఉన్న 14 మందిలో ఒకరే లాలూ ప్రసాద్ యాదవ్. తాజాగా, గ్వాలియర్‌లోని ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు అక్రమ ఆయుధాల కేసుపై విచారణ చేపట్టింది. విచారణ అనంతరం కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. -
ఈశాన్య సరిహద్దుల్లో మత్తు మహమ్మారి
ఇండియా–మయన్మార్ సరిహద్దులను కంచెతో మూసేస్తామని ఇటీవల కేంద్ర హోంమంత్రి ప్రకటించారు. ఇరుదేశాల మధ్య ఉన్న 1,643 కిలోమీటర్ల సరిహద్దు గుండా ఈశాన్య రాష్ట్రాల్లోకి మత్తు పదార్థాలు, ఆయుధాలు సరఫరా అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అఫ్గానిస్తాన్‌ను దాటి మయన్మార్ ప్రపంచంలో అత్యధిక నల్లమందు ఉత్పత్తిదారుగా అవతరించిందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. ఆ సాగుకు కావాల్సిన నీరు, ఎరువులు, మూలధన పెట్టుబడులు, కొనుగోలుదారులు, మార్కెటింగ్, హవాలా లాంటి కార్యకలాపాలన్నీ ఒక వ్యవస్థీకృత నెట్‌వర్క్‌గా ఏర్పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవడంతో పాటుగా, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా సమాజాన్ని జాగృతం చేస్తే తప్ప ఈ ప్రమాదాన్ని అరికట్టలేం. కాలాడాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ ట్రాన్స్ పోర్ట్ ప్రాజెక్ట్‌లో భాగంగా మయన్మార్‌లోని సీత్త్వే పోర్ట్‌ను మిజోరం రాజధాని ఐజ్వాల్‌తో కలిపే ప్రణాళికలో ముఖ్యమైన పాలేత్వా పట్టణాన్ని సాయుధ తిరుగుబాటు గెరిల్లా గ్రూపు ఆరగాన్ ఆర్మీ స్వాధీనం చేసుకుందన్న వార్తలు... ఇండియా –మయన్మార్ సరిహద్దులను కంచెతో మూసేస్తాం అన్న కేంద్ర హోంమంత్రి ప్రకటన... ఈ రెండు కూడా భారతదేశ భద్రతతో ముడిపడిన అంశాలు. అలాగే ఇటీవల మణిపుర్లో చెలరేగిన జాతుల మధ్య ఘర్షణతో కూడా కొంత సంబంధం ఉన్న విషయాలు. 2003 డిసెంబర్లో వెలువడిన ‘యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్’ నివేదిక ప్రకారం, అఫ్గానిస్తాన్‌ను దాటి మయన్మార్ ప్రపంచంలో అత్యధిక నల్లమందు ఉత్పత్తిదారుగా అవతరించింది. అఫ్గానిస్తాన్‌లో నల్లమందు సాగుపై తాలిబన్ ప్రభుత్వం తీసుకొంటున్న కఠిన చర్యల ఫలితంగా అక్కడి ఉత్పత్తిలో గణనీయమైన తరుగుదల కనిపిస్తుండగా, మయన్మార్‌లో పెరుగుతోందన్న వార్తలు సరిహద్దు పంచుకుంటున్న భారత్ లాంటి దేశాలకు కలవరం కలిగించేదే. దశాబ్దాలపాటు మయాన్మార్లో నెలకొన్న రాజకీయ అస్థిరత, సాయుధ తిరుగుబాటు... నల్లమందు (ఓపియం) ఉత్పత్తి పెరగడా నికి కారణమయ్యాయి. పేదరికంతో బాధపడుతున్న రైతులకు నల్ల మందు సాగు పరిస్థితులు మెరుగుపరుచుకునేందుకు ఒకే ఒకమార్గంగా అవతరించింది. కిలోకు సుమారు 23 వేల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఒక కోటి పదిలక్షల హెక్టార్ల సాగు చేయదగిన భూమి ఉన్న మయన్మార్‌లో దాదాపు 47,000 హెక్టార్లు అంటే 0.5 శాతం భూమిలో నల్లమందు పండుతోంది. దీనివల్ల గతేడాది 1080 మెట్రిక్ టన్నుల నల్లమందు ప్రపంచ మార్కెట్లోకి విడుదలైంది. ఇది 2022లో ఆ దేశం ఉత్పత్తి చేసిన నల్లమందు కన్నా సుమారు 36 శాతంఅధికం. ఇదే సమయంలో ఎకరానికి సగటు ఉత్పత్తి 19 నుండి 22 కిలోలకు పెరిగింది. సాగులో అధునాతన పద్ధతులు అవలంబిస్తున్నా రనీ, ఆయా ప్రాంతాలను నియంత్రిస్తున్నవారి సహాయం లేకుండా ఇది సాధ్యపడదనీ మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మొత్తం వ్యాపారం విలువ సుమారు రెండు బిలియన్ డాలర్లు. ఈ నల్లమందు ద్వారా ఉత్పత్పయ్యే హెరాయిన్, మార్ఫీన్, కోడెయిన్ వంటి మత్తు పదార్థాల ద్వారా సుమారు పది బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. ఇది మయన్మార్ స్థూల జాతీయోత్పత్తిలో 2–4 శాతం. మయన్మార్‌లో ముఖ్యంగా మూడు రాష్ట్రాలైన షాన్, చిన్, కాచి న్లలో నల్లమందు సాగు నిరాటంకంగా జరుగుతోంది. థాయిలాండ్, లావోస్ దేశాలను ఆనుకుని ఉండే షాన్‌లో 1750ల లోనే నల్లమందు సాగు మొదలైంది. క్రమంగా ఆ ప్రాంతం మొత్తం విస్తరించి, ఇర వయ్యో శతాబ్దం నాటికి గోల్డెన్ ట్రయాంగిల్ రూపంలో అవతరించడమే గాక, ప్రపంచంలో సగం నల్లమందు ఆధారిత మత్తుపదార్థాలు ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగింది. ఈ ఒక్క రాష్ట్రంలోనే సుమారు 80 శాతం ఉత్పత్తి జరుగుతుంటే, భారత్‌ను ఆనుకొని ఉండే చిన్, కాచిన్ రాష్ట్రాలు మిగిలిన ఇరవై శాతం ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ రాష్ట్రాలలోని టాహం, ఫాలం, తుఎంసెంగ్ ప్రాంతాల మీదుగా మయన్మార్‌తో సుమారు 510 కిలోమీటర్ల కంచె లేని సరిహద్దు కలిగి వున్న మిజోరంలోని ఛాంఫై, మణిపుర్‌లోని మొరెహ్, టాము ప్రాంతాల ద్వారా నల్లమందు భారత్‌లోకి చేరుతోంది. మయన్మార్‌తో సుమారు 1,600 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్న భారత్‌పై, ముఖ్యంగా మిజోరం, మణిపుర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలపై దీని ప్రభావం పడుతుందనడంలో సందేహం లేదు. వివిధ జాతులకు చెందిన సాయుధ పోరాట సంస్థలతో పాటు కొన్ని మిలిటరీ విభాగాలు, రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం, ఆయుధాల కొనుగోలు కోసం ఈ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో భాగం పంచుకుంటున్నారు. కాచిన్ ప్రాంతంలోని కాచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీ, ఆరగాన్ ఆర్మీ, యునైటెడ్ వా స్టేట్ ఆర్మీ వాటిలో కొన్ని మాత్రమే. అలాగే చిన్ రాష్ట్రం నుండి కార్యకలాపాలు సాగిస్తున్న చిన్ నేషనల్ ఆర్మీ, చిన్ నేషనల్ డెమోక్రాటిక్ ఫోర్స్, చిన్ ల్యాండ్ డిఫెన్స్ ఫోర్స్ లాంటి కొన్ని సాయుధ సంస్థలతో పాటు, సరిహ ద్దులకు ఇరువైపులా కార్యకలాపాలు సాగిస్తున్న కుకీ నేషనల్ ఆర్మీ కూడా ఈ వ్యవహారాల్లో భాగం కావడం ఆందోళన కలిగించేదే. సరి హద్దు దేశాలపై తిరుగుబాటు దారులకు వ్యతిరేకంగా ఒత్తిడి తేవ డానికి మయన్మార్ మిలిటరీ జుంటా కూడా ఈ నల్లమందు అక్రమ రవాణాలో భాగం పంచుకుంటోందని ఆ దేశానికి చెందిన ‘నేషనల్ యూనిటీ కన్సల్టేటివ్ కౌన్సిల్’ సభ్యుడు యు మయూన్గ్ మయూన్స్ ఆరోపిస్తున్నారు. ఈ నెట్‌వర్క్‌లో చైనీస్ డ్రగ్ కార్టెల్స్ పాత్ర చెప్పుకో దగినది. డ్రగ్స్‌ను అటు ఆగ్నేయాసియా మార్కెట్లలోకి తరలిస్తూ, ఇటు థాయిలాండ్ నుంచి మయన్మార్, బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్ మీదుగా ఈశాన్య రాష్ట్రాల్లోకి ఆయుధాల్ని సరఫరా చేస్తున్నాయి. ఈశాన్య ప్రాంతానికి చెందిన సాయుధ వేర్పాటు దళాలుఇంతకు ముందు నిధుల సేకరణకు బ్యాంకు దోపిడీలు, టీ గార్డెన్లు, వ్యాపార సముదాయాల నుండి అక్రమ వసూళ్లు, ప్రజల వద్ద పన్నులు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకుల నుండి డబ్బు గుంజడాలు లాంటివి చేస్తుండేవి. ఈ నిధులను మయన్మార్‌లోని కాచిన్ వేర్పాటు వాద వర్గాల నుండి ఆయుధాలు కొనుగోలు కోసం వెచ్చిస్తుండేవి. అవి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో పాలుపంచుకునేవి కాదు. కానీ గత కొన్నేళ్లుగా ఈ ధోరణిలో మార్పువస్తోంది. ఈ వ్యవహారాలను పరిశీలిస్తే, నాలుగు విషయాలు గోచరిస్తాయి. ఈశాన్య రాష్ట్రాల్లోని కొండ, మారుమూల ప్రాంతాల్లో నల్లమందు, గంజాయి సాగు పెరుగుతోంది. హెరాయిన్, యాంఫేట మిన్ లాంటి మత్తు పదార్థాలు చిన్న పరిమాణాల్లో ఈశాన్య రాష్ట్రాలకు వస్తున్నాయి. కొన్ని రకాల ఫార్మాస్యూటికల్స్ ఈశాన్య రాష్ట్రాల నుండి మయన్మార్‌లోకి రవాణా అవుతున్నాయి. యాంఫేటమిన్ లాంటి మత్తు పదార్థాలు ఉత్పత్తి చేయడానికి కావాల్సిన ఫెడ్రిన్, సూడోపె డ్రిన్ లాంటివి మయన్మార్‌కు ఈశాన్య రాష్ట్రాల నుండి వెళ్తున్నాయి. అంటే సరిహద్దులకు ఇరు వైపులా సాగుతున్న వ్యవహారం ఇది! పశ్చిమాన అఫ్గానిస్తాన్, వాయవ్య పాకిస్తాన్, మధ్య ఆసియాతో కూడిన ‘గోల్డెన్ క్రెసెంట్’కూ... తూర్పున మయన్మార్, థాయిలాండ్, లావోస్‌లతో కూడిన ‘గోల్డెన్ ట్రయాంగిల్’కూ మధ్యలో ఉన్న భారత్ మాదక ద్రవ్యాలకు అతిపెద్ద ఆకర్షణీయమైన మార్కెట్. మత్తు పదా ర్థాలను ఏమాత్రం సహించని(జీరో టోలెరెన్స్) విధానాన్ని కేంద్ర ప్రభుత్వ స్వీకరించింది. దీనిలో భాగంగా 2016లో నార్కో కోఆర్డి నేషన్ సెంటర్, కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం2019లో జాయింట్ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటైనాయి. ‘నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్’ చట్టం 1985లో భాగంగా బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ, అస్సాం రైఫిల్స్‌కు డ్రగ్స్ వ్యతిరేక చర్యలు తీసుకోవడానికి అధికారం కల్పించారు. ఇప్పటివరకూ సుమారు ఒకటిన్నర లక్షల కిలోల మత్తు మందులను స్వాధీనం చేసుకొని ధ్వంసం చేస్తే, అందులో నలభై వేల కిలోలు ఒక్క ఈశాన్య రాష్ట్రాల్లోవే. ప్రభుత్వాలే కాకుండా వివిధ రంగాల ప్రజలు కూడా సమాజాన్ని జాగృతం చేస్తేనే మత్తు మహమ్మారిని అరికట్టగలం. కొన్ని సినిమాల్లో చూపిస్తున్న విధంగా డ్రగ్స్ సేవించడం, సైకోల్లా ప్రవర్తించడమే హీరోయిజంగా యువత భావిస్తే మనం కేవలం నిట్టూర్పు విడవాల్సి వస్తుంది. - వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్, దక్షిణాసియా వ్యవహారాల అధ్యయన విభాగం, జేఎన్‌యూ ‘ 79089 33741 - డాక్టర్ గద్దె ఓంప్రసాద్ -
రష్యాకు ఉత్తర కొరియా ఆయుధాల పంపిణీ.. అమెరికా ఆందోళన
న్యూయార్క్: రష్యా, ఉత్తర కొరియా మధ్య ఆయుధాల ఒప్పందం గురించి అమెరికా ఇప్పటికే పలు నివేదికలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఉత్తర కొరియా రష్యాకు ఆయుధాల రవాణాను సరఫరా చేసినట్లు వైట్ హౌస్ శనివారం ఆరోపించింది. ఇందుకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను కూడా విడుదల చేసింది. అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ మాట్లాడుతూ.. ఉత్తర కొరియా ఇటీవలి వారాల్లో రష్యాకు 1,000 కంటే ఎక్కువ సైనిక పరికరాలు, ఆయుధాల కంటైనర్లను పంపిణీ చేసినట్లు అమెరికాకు సమాచారం ఉందని చెప్పారు. రష్యా, ఉత్తరకొరియా మధ్య సైనిక సంబంధాలు ఆందోళన కలిగించే అంశమని అమెరికా ఉన్నతాధికారులు అన్నారు. సెప్టెంబర్ 7 నుంచి అక్టోబర్ 1 మధ్య ఆయుధాల రవాణా జరిగిందని అధికారులు తెలిపారు. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు ఆయుధ సహకారాన్ని అందిస్తున్న ఉత్తర కొరియా చర్యలను తాము ఖండిస్తున్నట్లు అమెరికా స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు ఆయుధ సామగ్రిని సమకూర్చిన దేశాలపై అమెరికా ఇప్పటికే ఆంక్షలు విధించిన విషయం కూడా తెలిసిందే. దక్షిణ కోరియాకు అమెరికా యుద్ధ నౌక రావడంపై వైట్‌హౌజ్‌ను ఉత్తరకొరియా హెచ్చరించిన మరుసటి రోజే ఈ ప్రకటనలు రావడం గమనార్హం. ఇదీ చదవండి: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. భారత్ వ్యూహాత్మక వైఖరి -
మాస్కోకు నార్త్ కొరియా కిమ్, రహస్య భేటీ?
సియోల్: ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ దూకుడుగా ఉన్నారు. పశ్చిమ దేశాల హెచ్చరికలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. మిత్ర దేశాలతో ఆయుధ ఒప్పందాలకు సిద్ధపడుతున్నారు. యుద్ధసామాగ్రి సరఫరా అంశంపై ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, పుతిన్ త్వరలో భేటీ కానున్నారు. కొత్త ఆయుధ సామగ్రితో మరింత విధ్వంసానికి ప్రణాళికలు చేస్తున్నారని అమెరికా ఆరోపిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధంలో మాస్కోకు ఆయుధాలు అందించడంపై చర్చించేందుకు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలవనున్నారని అమెరికా తెలిపింది. ఆయుధాలు, యుద్ధ సామాగ్రిని కొనుగోలు చేయడానికి కిమ్‌తో రష్యా రహస్యంగా చర్చలు జరుపుతోందని వైట్ హౌస్ గత వారం హెచ్చరించింది. ఆ తర్వాత తాజాగా ఈ ప్రకటన చేసింది. కిమ్ సాధారణంగా ఉత్తర కొరియా దాటి బయటికి వెళ్లరు. కానీ పుతిన్‌తో ఈ నెలాఖరున రష్యాలోని వ్లాడివోస్టాక్‌కు వెళ్లి పుతిన్‌ను కలుసుకునే అవకాశం ఉందని న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. మాస్కోకు కూడా కిమ్ పర్యటించే అవకాశం ఉందని వెల్లడించింది. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో గతేడాది రష్యాకు ఉత్తరకొరియా రాకెట్లను, మిస్సైల్లను సరఫరా చేసిన విషయం తెలిసిందే. ఆయుధ సరఫరా ఒప్పందంపై రష్యా రక్షణ మంత్రి సెర్గీ సోయిగు గత నెలలో ఉత్తర కొరియాలో పర్యటించారని అమెరికా జాతీయ భద్రతా మండలి (ఎన్ఎస్సీ) ప్రతినిధి అడ్రియన్ వాట్సన్ తెలిపారు. రష్యాతో ఆయుధ ఒప్పందాలు రద్దు చేసుకుని, అంతర్జాతీయ ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని ఉత్తరకొరియాను కోరారు. ఉత్తర కొరియా, రష్యా మధ్య ఆయుధ ఒప్పందాలు భద్రతా మండలి నిర్ణయాలకు వ్యతిరేకమని అమెరికా, బ్రిటన్, దక్షిణ కొరియా, జపాన్‌లు గత వారం సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఇదీ చదవండి: రక్షణ మంత్రిని తొలగించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ -
సీఎం నివాసంలోకి చొరబాటుకు దుండగుడి యత్నం.. మారణాయుధాలతో..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంట్లోకి దుండగుడు చొరబడేందుకు ప్రయత్నించాడు. ఆయుధాలతో కూడిన కారులో సీఎం ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కోల్‌కతా కాళీఘాట్‌లోని మమతా నివాసంలోకి ప్రవేశించేందుకు నిందితుడు యత్నించాడు. పోలీస్ స్టిక్కర్‌తో కూడిన వాహనంతో వచ్చిన ఆ వ్యక్తిని నూర్ ఆలంగా పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో దీదీ తన నివాసంలోనే ఉన్నారు. నగరంలో ఓ ర్యాలీలో పాల్గొనేందుకు మమతా బెనర్జీ తన నివాసం నుంచి బయల్దేరడానికి కొద్ది గంటల ముందు ఈ ఘటన జరిగింది. మమత ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలు చెప్పాడని కోల్‌కతా సీపీ వినీత్ గోయల్ తెలిపారు. నిందితుడి వద్ద ఒక చాకుతోపాటు వివిధ ఆయుధాలు, గంజాయి కూడా దొరికాయని వెల్లడించారు. బీఎస్ఎఫ్ తదితర ఏజెన్సీలకు సంబంధించిన అనేక గుర్తింపు కార్డులు అతని వద్ద లభ్యమయ్యాయని సీపీ వినీత్ గోయల్ పేర్కొన్నారు. ఘటనకు పాల్పడిన నిందితుడి అసలు ఉద్దేశం కనుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: రద్దీ రోడ్డు.. ట్రాఫిక్ జామ్ కాకూడదని.. బస్ డ్రైవర్‌గా మారిన బెంగళూరు ఏసీపీ! -
ఆయుధాలతో వచ్చి నగల దుకాణం చోరీ.. అంతా క్షణాల్లోనే..
వాషింగ్టన్: అమెరికా కాలిఫోర్నియాలోని సాన్ రేమన్లో జరిగిన ఓ దొంగతనం అధికారులను, స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. ఏడుగురు ఆగంతుకులు ఆయుధాలతో వెళ్లి సిటి సెంటర్ బిషాప్ రాంఛ్ షాపింగ్ సెంటర్ నగల దుకాణాన్ని దోచుకున్నారు. సెక్యూరిటీ గార్డు తలపై తుపాకీ గురిపెట్టి జ్యువెల్లరీ షాపులోకి చొరబడ్డారు. అందరు డోర్స్ లాక్ చేసుకోవాలని సిబ్బందిని బెదిరించారు. అనంతరం సుత్తెతో డిస్ప్లే కేస్ అద్దాలు పగలగొట్టి నగలన్నీ ఎత్తుకెళ్లారు. క్షణాల్లో చోరీని పూర్తి చేసి ఎంచక్కా రెండు కార్లలో పారిపోయారు. ఇలాంటి చోరీ ఘటనను జీవితంలో ఎప్పుడూ చూడలేదని ఓ ప్రత్యక్ష సాక్షి భయాందోళన వ్యక్తం చేశాడు. దొంగల దగ్గర తుపాకులు ఉన్నాయని, రెండు కార్లు ముందే పార్కు చేసుకుని చోరీ అనంతరం వాటిలో పారిపోయారని పేర్కొన్నాడు. గుంపుగా వచ్చి దుకాణంలోకి సెకన్లలో చొరబడ్డారని వివరించాడు. ఈ సమయంలో తాను పక్కనే రెస్టారెంట్లో ఉన్నానని, వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించినట్లు వివరించాడు. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. దొంగతనం జరగడంతో షాపును శనివారం మూసివేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరాలు పరిశీలించారు. చదవండి: ఈక్వెడార్‌లో భారీ భూకంపం.. 14 మంది మృతి.. -
ఐకామ్ ప్లాంటులో కారకల్ ఆయుధాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అధునాతన ఆయుధాల తయారీ, సరఫరాలో ప్రపంచస్థాయి దిగ్గజం కారకల్ ఇంటర్నేషనల్‌తో హైదరాబాద్‌కు చెందిన ఐకామ్ టెలీ సాంకేతిక బదిలీ ఒప్పందం కుదుర్చుకుంది. యూఏఈలోని అబుదాబిలో ప్రపంచంలోనే అతిపెద్ద ట్రై-సర్వీస్ డిఫెన్స్ ఎగ్జిబిషన్లలో ఒకటైన ఐడీఈఎక్స్ 2023 కార్యక్రమంలో మంగళవారం ఇరు సంస్థల మధ్య డీల్ కుదిరింది. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) గ్రూప్ కంపెనీ అయిన ఐకామ్.. భారత రక్షణ రంగానికి అవసరమైన ఆయుధాల తయారీలో భాగస్వామిగా ఉంది. తాజా డీల్ ప్రకారం హైదరాబాద్ ప్లాంటులో కారకల్ టెక్నాలజీతో చిన్న పాటి ఆయుధాలను తయారు చేస్తామని ఐకామ్ టెలి ఎండీ పి.సుమంత్ తెలిపారు. క్షిపణులు, కమ్యూనికేషన్స్, ఈడబ్ల్యూ సిస్టమ్స్, రాడార్లు, ఎలక్ట్రో-ఆప్టిక్స్, మందుగుండు, షెల్టర్లు, డ్రోన్, కౌంటర్–డ్రోన్ సిస్టమ్స్‌ను ఐకామ్ ఇప్పటికే తయారు చేస్తోంది. 1989లో ప్రారంభమైన ఐకామ్‌కు హైదరాబాద్ శివారులో 110 ఎకరాల్లో ప్లాంటు ఉంది. -
విజయవాడ : ఆయుధం.. అదరహో (ఫొటోలు)
-
చిన్న ఆయుధాల తయారీలోకి ఐకామ్, దుబాయ్ కంపెనీతో డీల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిఫెన్స్, ఏరోస్పేస్, టెలికం రంగాలకు సమగ్ర సేవలు అందిస్తున్న ఐకామ్ తాజాగా యూఏఈ కంపెనీ ఎడ్జ్ గ్రూప్‌నకు చెందిన కారకల్‌తో చేతులు కలిపింది. మౌలిక రంగ దిగ్గజం మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) అనుబంధ కంపెనీ అయిన ఐకామ్.. అధునాతన సాంకేతికత, రక్షణ ఆయుధాల తయారీలో ఉన్న కారకల్‌తో కలిసి సైన్యానికి ఉపయోగపడే ఉత్పతులను తయారు చేయనుంది. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరుగుతున్న డిఫెన్స్ ఎక్స్పో–2022 సందర్భంగా ఇరు సంస్థలు ఈ ఒప్పందంపై గురువారం సంతకం చేశాయి. కారకల్ సహకారంతో హైదరాబాద్‌లోని ప్రపంచ స్థాయి డిజైన్, అభివృద్ధి, తయారీ కేంద్రంలో పూర్తి చిన్న ఆయుధాలను ఉత్పత్తి చేస్తామని ఐకామ్ ఎండీ పి.సుమంత్ తెలిపారు. -
బ్రిటన్ రాజు బాడీగార్డులకు నకిలీ చేతులు! నెటిజన్ల అయోమయం
లండన్: బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ బాడీగార్డులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు బాడీగార్డులు కృత్రిమ చేతులు ఉపయోగిస్తున్నారా? అనే అయోమయానికి గురౌతున్నారు. వాళ్ల అసలు చేతులను కోటు లోపల దాచుకుని ఫేక్ చేతులను బయటకు ప్రదర్శిస్తున్నారా? అని చర్చ జరుగుతోంది. ప్రముఖులకు భద్రత కల్పించే బాడీగార్డులు క్షణం ఏమరపాటుగా ఉన్నా దాడులు జరిగే ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే వారు కూడా కొన్ని టెక్నిక్స్ పాటిస్తూ తమ యజమానుల కోసం ప్రాణాలను పణంగా పెట్టి రక్షణ కల్పిస్తుంటారు. ఇలాంటి టెక్నిక్స్‌లో ఫేక్ చేతులు ధరించడం కూడా ఒకటి కావడం గమనార్హం. అయితే ఫేక్ చేతుల విషయం కొత్తదేమీ కాదు. 2017లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సీక్రెట్ సర్వీస్ బాడీగార్డు తన చిటికెన వేలుని వింతగా పట్టుకున్నప్పుడే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అది కృత్రిమ చేతి అయి ఉంటుందని అంతా అనుమానించారు. బాడీగార్డులు ఇలా కృత్రిమ చేతులు ధరించినప్పుడు కోట్ లోపల అసలు చేతులతో ఆటోమేటిక్ గన్ పట్టుకుని సిద్ధంగా ఉంటారని చెబుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఎఫ్ఎన్-పీ90 గన్ను ఊపయోగిస్తారట. ఎవరికీ అనుమానం రాకుండా కోటు లోపల పెట్టుకుని భద్రత కల్పించేందుకు ఇది అనువుగా ఉంటుందట. క్లారీటీ లేదు.. అయితే బ్రిటన్‌లో బాడీగార్డులు ఆయుధాలు కలిగిఉండటానికి వీల్లేదు. అందుకే కింగ్ చార్లెస్ బాడీగార్డులు కోటు లోపల చేతులతో గన్స్ పట్టుకునే అవకాశం లేదు. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు మాత్రం నెటిజన్లను అయోమయానికి గురి చేస్తున్నాయి. అసలు బాడీగార్డులు కృత్రిమ చేతులు నిజంగానే ధరించారా? అనే విషయంపై స్పష్టత రావడంలేదు. కొందరేమో కింగ్ చార్లెస్ బాడీగార్డులు కచ్చితంగా కృత్రిమ చేతులు ధరించారు అంటుంటే.. మరికొందరేమే ఇవి ఫేక్ చేతుల్లా లేవని అంటున్నారు. అయితే ఈ విషయంపై బాడీగార్డులు కూడా నిజాన్ని చెప్పే అవకాశం లేదు. అసలు విషయం తెలిస్తే కింగ్ చార్లెస్ భద్రతకు ముప్పు ఉంటుందని వారు భావిస్తారు. చదవండి: చైనాలో ఘోర ప్రమాదం.. బస్సు బోల్తాపడి 27మంది దుర్మరణం -
కదులుతున్న రైలులో మొబైల్ చోరీకి యత్నం.. పాపం వాడి పనైపోయింది!
దొంగతనం.. చట్టరీత్యా నేరం అయినా నిత్యం ఈ పదం వింటూనే ఉన్నాం. ఇంటికి తాళం కనిపిస్తే చాలు ఇల్లు గుల్ల అవ్వాల్సిందే. ఒక ఇంట్లోని వస్తువులేనా.. ఇంటి ముందు పార్క్ చేసిన వాహనాలు, విలువైన వస్తువులు సైతం కొట్టేస్తుంటారు. ఇక రైలు, బస్సుల్లో వంటి రద్దీగా ఉండే ప్రదేశాల్లోనూ దొంగలు తమ చేతి వాటాన్ని చూపిస్తూనే ఉంటారు. ఎంత తెలివిగా తప్పించుకున్నా కొన్నిసార్లు దొంగ దొరికిపోతుంటాడు. తాజాగా ఓ దొంగ రైల్వే స్టేషన్ నుంచి కదులుతున్న రైలులో మొబైల్ ఫోన్ చోరీకి ప్రయత్నించి చివరికి ఊహించని విధంగా విఫలమయ్యాడు. ఈ ఘటన సెప్టెంబర్ 14న బిహార్‌లో చోటుచేసుకుంది. బెగుసరాయ్ నుంచి ఖగారియాకు వెళ్తున్న రైలులో కిటికీలోంచి ప్రయాణికుడి మొబైల్‌ను కొట్టేసేందుకు ఓ దొంగ ప్రయత్నించాడు. రైలు సాహెబ్‌పూర్ కమల్ స్టేషన్ దగ్గరకు రాగానే దొంగ మొబైల్ దొంగిలించేందుకు వ్యక్తి చేతిని పట్టుకున్నాడు. కానీ అక్కడే అతని ప్లాన్ బెడిసి కొట్టింది. మొబైల్ తీసుకుంటుండగా అప్రమత్తమైన ప్యాసింజర్ దొంగ చేతులను కిటికీలోంచే గట్టిగా పట్టుకున్నాడు. రైలు కదలడం ప్రారంభమవ్వడంతో దొంగ క్షమాపణలు కోరుతూ, చేతులు వదిలేయమని వేడుకున్నాడు. అప్పటికే రైలు వేగం పెరగడంతో ఏం చేయాలో తోచని దొంగ తన రెండో చేతిని కూడా కిటికీ ద్వారా లోపలికి అందించాడు. ప్రయాణికుడు దొంగ రెండు చేతులను గట్టిగా పట్టుకున్నాడు. దాదాపు 10 కిలోమీటర్లు దొంగ అలాగే కిటికీకి వేలాడుతూ ప్రయాణం చేశాడు. చివరికి రైలు ఖగారియా దగ్గరకు రాగానే ప్రయాణికుడు స్నాచర్ చేయి వదలడంతో అతడు పారిపోయాడు. దీనిని తోటి ప్రయాణికులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. చదవండి: చిన్న కారులో 29 మంది.. ‘ఇంకెంత మందిని ఎక్కించేస్తార్రా బాబు’ Though #unverified yet chilling. A mobile snatcher caught in a moving train when his failed attempt probably led to his worst day of life. The thief was hung by a window in a moving train from Begusarai to Khagaria. The passengers handed him over to GRP. IS this act justified? pic.twitter.com/o3ja5qWggi — Kumar Saurabh Singh Rathore (@JournoKSSR) September 15, 2022 -
కలిచివేసే ఘటన: వైద్యుడి కోసం పడిగాపులు...చివరికి తల్లి ఒడిలోనే ఆ చిన్నారి...
భోపాల్: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల చిన్నారి మృతి చెందాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఈ మేరకు మధ్యప్రదేశ్‌లోని సంజయ్ పాండ్రే కుటుంబం తమ ఐదేళ్ల రిషి అనే చిన్నారిని స్థానిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు. ఐతే వారు ఆస్పత్రి వెలుపలే గంటలతరబడి వేచి ఉన్నా వైద్యాధికారి అందుబాటులో లేకపోవడంతో ఆ చిన్నారికి సకాలంలో వైద్యం అందలేదు. దీంతో ఆ చిన్నారి తల్లి ఒడిలోనే విగతజీవిగా మారాడు. ఆ ఆరోగ్య కేంద్రంలో ఒక్క వైద్యడు కూడా సమయానికి చికిత్స అందించకపోవడంతో తల్లిదండ్రుల సమక్షంలోనే ఆ చిన్నారి నిస్సహాయంగా మృతి చెందాడు. ఆఖరికి ఆ చిన్నారి మరణించిన కొన్ని గంటల తర్వాత కూడా ఆరోగ్య కేంద్రంలో వైద్యులు అందుబాటులో లేరని ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఐతే డ్యూటిలో ఉండాల్సిన వైద్యాధికారి ఆలస్యంగా రావడానికి గల కారణాన్ని వివరించమనగా...తన భార్య ముందు రోజు ఉపవాసం ఉందని అందువల్ల మెడికల్ సెంటర్‌కి రావడం ఆలస్యం అయ్యిందని చెప్పినట్లు సమాచారం. (చదవండి: గర్భిణి మృతి... దెబ్బకు రాజీనామా చేసిన ఆరోగ్యమంత్రి) -
దొడ్డ మనస్సులు వారిని నడిపిస్తున్నాయ్
విధి వారి జీవితాల్లో విషాదం నింపింది. దొడ్డ మనస్సులు వారిని నడిపిస్తున్నాయి. ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితుల్లో కాళ్లు కోల్పోయి వీల్ చైర్లకు.. పాకడానికి పరిమితమైన వారిని కృత్రిమ కాళ్లు నడిపిస్తున్నాయి. జిల్లా రెడ్‌క్రాస్ సంస్థ ఎంతో మంది నిర్భాగ్యులకు జైపూర్ కృత్రిమ కాళ్లు, చేతులు అందిస్తోంది. మూడు రోజులుగా దివ్యాంగులు కృత్రిమ అవయవాల కోసం కొలతలు ఇచ్చేందుకు తరలివచ్చారు. తమ జీవితాల్లో కొత్త వెలుగులు రాబోతున్నాయని ఆనంద పరవశులు అవుతున్నారు. నెల్లూరు (అర్బన్): సేవకు ప్రతి రూపం పేరును సార్థకం చేస్తూ జిల్లా రెడ్‌క్రాస్ సంస్థ తమ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. దివ్యాంగులకు నాలుగైదేళ్లకోసారి జైపూర్ కృత్రిమ కాలు, చేతులు అందిస్తోంది. కోవిడ్ నేపథ్యంలో రెండేళ్లకు పైగా కృత్రిమ అవయవాలు పొందేందుకు దివ్యాంగులకు బ్రేక్ పడింది. దెబ్బతిన్న కృత్రిమ అవయవాలను మార్చుకోవాలనుకునే అభాగ్యులు, కొత్తగా ప్రమాదాలు, జబ్బుల కారణంగా కాలు, చేయి పోగొట్టుకున్న వారు కృత్రిమ అవయవాల కోసం ఎదురు చూస్తున్నారు. రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి సారథ్యంలో కలెక్టర్ చక్రధర్‌బాబు సహకారంతో ఒకరికి కాదు.. ఇద్దరికి కాదు సుమారు 600 మందికి పైగా దివ్యాంగులకు జైపూర్ కృత్రిమ కాలు, చేయి ఏర్పాటు చేసేందుకు పూనుకోవడం రెడ్‌క్రాస్ తొలిసారిగా ఈ బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టి చరిత్ర సృష్టించింది. దివ్యాంగుల జీవితాల్లో కొంత మేరకైనా వెలుగులు ప్రసాదించేందుకు పూనుకుంది. ఈ శిబిరాన్ని కలెక్టర్ చక్రధర్‌బాబు ప్రారంభించి అభినందించారు. సుమారు 600 మందికి ఉపకరణాలు అనేక మంది దివ్యాంగులు కృత్రిమ అవయవాలను కావాలని అడుగుతుండడంతో రెడ్‌క్రాస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి కమిటీ సభ్యులతో చర్చించారు. ఈ విషయాన్ని కలెక్టర్ చక్రధర్‌బాబు వద్దకు తీసుకెళ్లి 200 మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు ఏర్పాటు చేయిస్తామన్నారు. దీనిపై స్పందించిన కలెక్టర్ 200 మంది కాదు కనీసం 500 మందికైనా కృత్రిమ అవయవాలు ఇవ్వండి.. అంటూ ప్రోత్సహించారు. ఈ క్రమంలో 500 మందికి కృత్రిమ కాలు, చేతులను ఏర్పాటు చేసేందుకు ఈ నెల 23 నుంచి స్థానిక మద్రాస్ బస్టాండ్ వద్ద ఉన్న రెడ్‌క్రాస్ కార్యాలయంలో మూడు రోజుల పాటు కొలతలు తీసుకునేందుకు ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అయితే తొలి రోజే 540 మంది తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సుమారు 600 మించివచ్చని రెడ్‌క్రాస్ నిర్వాహకులు పేర్కొంటున్నారు. సంస్థల సహకారం భేష్ రెడ్‌క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి రాయచూరుకు చెందిన రాజ్మల్ కేమ్ భండారి ఫౌండేషన్, జైపూరుకు చెందిన భగవాన్ మహావీర్ వికలాంగుల సహాయతా సమితి తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాయి. తాము 1000 మందికైనా కృత్రిమ కాలు, చేయి అమర్చేందుకు సాయం చేస్తామంటూ ముందుకువచ్చాయి. వీరి సేవా నిరతికి దివ్యాంగులు తమ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. రూ 1.50 కోట్ల ఖర్చు రెడ్‌క్రాస్ సంస్థ భోజనం, ఇతర వసతుల కోసం చేసే ఖర్చుతో పాటు ఫౌండేషన్ సంస్థలు అందించే కృత్రిమ కాలు, చేతుల ఏర్పాటుకయ్యే ఖర్చును పరిశీలిస్తే సుమారు రూ 1.50 కోట్లు ఖర్చు కానుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఊహించిన వారి కన్నా ఎక్కువ మంది వస్తుండటంతో ఖర్చు కూడా పెరిగే అవకాశముందని పేర్కొంటున్నారు. రెడ్‌క్రాస్ సంస్థకు రుణపడి ఉంటా నేను నెల్‌కాస్ట్ కంపెనీలో కార్మికుడిని. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో 5 నెలల క్రితం నా కాలును డాక్టర్లు తొలగించారు. దీంతో ఇంటికే పరిమితమయ్యాను. జైపూర్ కాలు గురించి వినడమే తప్ప ఎవరి వద్దకు వెళ్లి ఏర్పాటు చేయించుకోవాలో తెలియలేదు. రెడ్‌క్రాస్ నా విషయం తెలుసుకుని కృత్రిమ కాలు ఏర్పాటు శిబిరానికి రావాలని నా ఫోన్‌కు మెసేజ్ పంపించారు. ఇప్పుడు వచ్చి కొలతలు ఇచ్చాను. నన్ను పిలిపించి కృత్రిమ కాలు ఏర్పాటు చేయిస్తున్న రెడ్‌క్రాస్ వారికి రుణపడి ఉంటా. – కాకాణి రామకృష్ణ, బత్తలాపురం, ఓజిలి మండలం ఏడు నెలల క్రితమే ప్రణాళిక కొంత మంది తమకు కృత్రిమ చేయి, కాలు ఏర్పాటు చేయమని కోరారు. అవయవాలు కోల్పోయిన దివ్యాంగులకు జైపూర్ కాలు చేయి ఏర్పాటు చేయించాలని 7 నెలల క్రితమే అనుకున్నాం. తమ పాలకవర్గ సభ్యులతో చర్చించాను. అందరి సహకారంతో కలెక్టర్‌కు తెలిపాం. కలెక్టర్ వెన్నుతట్టి ప్రోత్సహించారు. రాజ్మల్ కేమ్ భండారి ఫౌండేషన్, భగవాన్ మహావీర్ వికలాంగుల సహాయతా సమితి సహకారంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయించాం. – పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ నాలాంటి పేదకు వరం కృత్రిమ కాలు నేను లారీ క్లీనర్‌ను. నాకు జరిగిన ప్రమాదంలో 2014లో ఆపరేషన్ చేసి డాక్టర్లు కాలు తీసేశారు. తర్వాత కొంత మంది దాతలు లోకల్‌గా తయారైన కాలును అమర్చారు. అయితే అది సెట్ కాలేదు. స్టీలు రాడ్ కూడా ఇచ్చారు. సెట్ కాలేదు. విధిలేని పరిస్థితుల్లో ఇంటికే పరిమితమయ్యాను. అయితే ఇప్పుడు రెడ్‌క్రాస్ ఖరీదైన, క్వాలిటీ ఉన్న జైపూర్ కాలును ఏర్పాటు చేసేందుకు కొలతలు తీసుకున్నారు. నాలాంటి పేదకు కృత్రిమ కాలు వరం. – ఎస్కే సందాని, వెంకటేశ్వరపురం, నెల్లూరు కందుకూరు రామమ్మ.. వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరుకు చెందిన ఈమె కూలి పని చేసుకునే నిరుపేదరాలు. దురదృష్టవశాత్తు ఆమెకు డయాబెటీస్ మిల్లిటస్ (షుగర్) వ్యాధికి గురైంది. షుగర్ కంట్రోల్ తప్పింది. కాలుకు గాయమై రక్త సరఫరా తగ్గిపోయింది. దీంతో రక్తసరఫరా తగ్గిన వరకు కాలును తీసేయాలని లేదంటే మిగతా కాలు కూడా పనికి రాదని డాక్టర్లు తెలిపారు. బాధాకరమైనప్పటికీ ఆమెకు డాక్టర్లు ఆపరేషన్ చేసి ఒక కాలును తొలగించారు. ఇది జరిగి రెండేళ్లు మించి పోయింది. అప్పటి నుంచి ఇంటికే పరిమితమైంది. నడిచేందుకు వీలులేకుండా పోయింది. రెడ్‌క్రాస్ ఏర్పాటు చేసిన కృత్రిమ అవయవాల శిబిరం గురించి ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు ప్రాంతం వెందోడుకు చెందిన రామమ్మ చెల్లెలు కుమార్తె పావనికి తెలిసింది. దీంతో పావని తమ పిన్నిని నెల్లూరు రెడ్‌క్రాస్ కార్యాలయానికి తీసుకువచ్చింది. కృత్రిమ కాలు ఏర్పాటుకు కొలతలు ఇచ్చింది. ఈ సంద్భంగా ఆమె మాట్లాడుతూ తనకు కృత్రిమ కాలు కాలు ఏర్పాటు చేస్తే నడుస్తానని ఆనందంగా చెప్పింది. -
భారత్‌లోకి పాకిస్థాన్ ఆయుధాలు, డ్రగ్స్... వయా శ్రీలంక!
చెన్నై: శ్రీలంక నుంచి భారత్‌లోకి భారీగా ఆయుధాలు, మత్తు పదార్థాలు సరఫరా జరుగుతోందన్న సమాచారం మేరకు తమిళనాడులో సోదాలు నిర్వహించింది జాతీయ దర్యాప్తు (ఎన్ఐఏ). ఈనెల 19వ తేదీన 22 ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టింది. పాకిస్థాన్‌కు చెందిన హాజీ సలీమ్ సహకారంతో.. సీ గునశేఖరన్, పుష్పరాజన్‌లు నిర్వహిస్తున్న శ్రీలంక డ్రగ్స్ మాఫియా అక్రమాల కేసులో భాగంగా ఈ సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ డ్రగ్స్, ఆయుధాల మాఫియా భారత్, శ్రీలంకల్లో సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. లిబర టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(ఎల్టీటీఈ)ని పునరుద్ధరించటం, హింసాత్మక కార్యక్రమాలను పెంచటమే వారి లక్ష్యమని తెలిపారు. చెన్నై, తిరుపుర్, చెంగళ్పట్టు, తిరుచిరపల్లి జిల్లాల్లోని పలువురు నిందితుల ఇళ్లు, పరిసరాల్లో సోదాలు చేపట్టారు అధికారులు. ఆయుధాలు, మత్తు పదార్థాల సరఫరాపై సుమోటోగా తీసుకున్న ఎన్ఐఏ జులై 8న వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఈ సోదాల్లో డిజిటల్ సర్వీసెస్, నేరాలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఎల్టీటీఈని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారనే వార్తల నేపథ్యంలో ఆందోళన నెలకొంది. శ్రీలంక సైన్యం, ఎల్టీటీఈ మధ్య మూడు దశాబ్దాల పోరాటం 2009, మేలో ముగిసింది. ఆ సమయంలో శ్రీలంక ప్రభుత్వానికి భారత్ మద్దతు తెలిపింది. సామాన్య ప్రజలపై ఎల్టీటీఈ సాగించిన మారణకాండపై విచారం వ్యక్తం చేసింది. శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం తలెత్తిన ఈ సమయంలో ఆయుధాల సరఫరాపై ఎన్ఐఏ సోదాలు నిర్వహించటం ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఆ చిన్నారికి నాలుగు చేతులు, నాలుగు కాళ్లు: వీడియో వైరల్
ఇంతవరకు అవిభక్త కవలల్లా జన్మించిన వాళ్లను చూశాం. చాలా మంది పిల్లలు జన్యులోపం కారణంగానో లేక మరేఇతర కారణాల వల్లనో శరీరంలో ఏదో ఒక అవయవం గానీ లేదా నడుం భాగం నుంచి అతుక్కుని పుట్టిన వాళ్లని చూశాం. కానీ ఇక్కడో అమ్మాయి మాత్రం చాలా విచిత్రంగా జన్మించింది. ఆ చిన్నారికి ఏకంగా నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో జన్మించింది. వివరాల్లోకెళ్తే....బిహార్‌లోని నెవాడా జిల్లాకు చెందిన రెండున్నరేళ్ల చిన్నారి నాలుగు కాళ్లు, చేతులతో జన్మించింది. ఆ చిన్నారి కుటుంబం వైద్యం చేయించే స్థోమతలేని పేద కుటుంబం. ఐతే ఆ చిన్నారికి చేతులు కాళ్లు ఆమె పొట్టభాగానికి అనుసంధానమై ఉన్నాయి. ఈ మేరకు ఆ చిన్నారికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవ్వడంతో బాలీవుడ్ ప్రముఖ నటుడు సోను సూద్ ఆ చిన్నారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అంతేకాదు ఆ చిన్నారికి వైద్యం అందుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే కాకుండా ఆ చిన్నారి త్వరగా నయమవ్వాలని ప్రార్థించండి అని ట్వీట్ చేశారు. टेन्शन मत लीजिए इलाज शुरू करवा दिया है। बस दुआ करिएगा। https://t.co/gndrRhuNQJ pic.twitter.com/YoCTRoqoir — sonu sood (@SonuSood) May 28, 2022 बिहार : नवादा जिले में एक ढाई साल की बच्ची के जन्म से ही चार हाथ और पैर ◆बच्ची की माता-पिता ने इलाज के लिए SDO कार्यालय पहुंचकर मदद की गुहार लगाई pic.twitter.com/2AYHCwINfm — News24 (@news24tvchannel) May 27, 2022 (చదవండి: వీడియో: అందర్నీ ఆశ్చర్యపరిచేలా వధువు ఎంట్రీ!.. వరుడు షాక్) -
దారుణం: కాళ్లు,చేతులు నరికిన భర్త
చక్రాయపేట(వైఎస్సార్ జిల్లా): నిద్రపోతున్న భార్య కాళ్లు,చేతులను భర్త నరికిన సంఘటన చక్రాయపేట మండలంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు ఇస్లావత్ ఈశ్వరమ్మ (48), భర్త నాగానాయక్ (63)తో కలిసి కే. ఎర్రగుడి గ్రామం బీఎన్ తాండాలో నివసిస్తోంది. వీరికి ఇద్దరు కుమారులు. వారికి వివాహాలయ్యాయి.అయితే భార్యభర్తల మధ్య మూడేళ్లుగా గొడవలు జరుగుతుండేవి. దీంతో ఈశ్వరమ్మను కుమారులు వారి వద్దకు తీసుకెళ్లారు. (చదవండి: భార్యపై అనుమానం.. చివరికి ఏం చేశాడంటే..?) గ్రామస్తులు ఆమెకు, కుమారులకు నచ్చచెప్పి మళ్లీ భర్త దగ్గర వదిలేసేవారు. వినాయక చవితి పండుగరోజు కూడా భార్యాభర్తలు గొడవపడినట్లు గ్రామస్తులు తెలిపారు. బుధవారం రాత్రి ఏమి జరిగిందో ఏమో కానీ ఆమె నిద్రిస్తుండగా నాగానాయక్ కొడవలితో కాళ్లు, చేతులు నరికేశాడు.ఈశ్వరమ్మ కేకలు విని ఇరురు పొరుగువారు రావడంతో నాగానాయక్ పారిపోయాడు.రక్తపు మడుగులో ఉన్న ఈశ్వరమ్మను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ మల్లికార్జునరెడ్డి వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈశ్వరమ్మను చికిత్స నిమిత్తం కడపకు తరలించారు. పారిపోయిన నాగానాయక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. చదవండి: టికెట్ తీసి సాధారణ ప్రయాణికుడిలా.. -
భుజంపైనే టీకాలు ఎందుకు?
ఇండియానాపొలిస్(అమెరికా): దేశం మొత్తమ్మీద కోవిడ్–19 నిరోధక టీకాలు తీసుకున్న వారి సంఖ్య 20 కోట్లకు చేరువ అవుతోంది. తొలి డోసు ఎడమ భుజంపై, రెండో డోసు ఇంకో భుజంపై తీసుకోవడం మనలో చాలామంది గమనించే ఉంటారు. పోలియో, రోటా వైరస్ వంటి వ్యాధుల నిరోధానికి ఉపయోగించే వ్యాక్సిన్లను నోటిద్వారా, మరికొన్ని టీకాలను చర్మం కింద ఇస్తూంటే.. కోవిడ్ టీకాలను ఇంట్రామస్క్యులర్ అంటే భుజం కండరాల ద్వారా మాత్రమే ఎందుకిస్తున్నారు? ఆసక్తికరమైన ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే... భుజం పైభాగంలో ఉండే డెల్టాయిడ్ కండరాల్లో రోగనిరోధక వ్యవస్థ తాలూకూ ముఖ్యమైన కణాలు ఉంటాయి. వైరస్ తాలూకూ అవశేషాలను అంటే యాంటిజెన్లను ఇవే గుర్తిస్తాయి. టీకాలను.. వైరస్‌ను నిర్వీర్యం చేయడం ద్వారా లేదా అందులోని భాగాలతో తయారు చేస్తారన్నది ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. ఈ యాంటిజెన్లను గుర్తించే కణాలు ఉండే డెల్టాయిడ్ కండరం వద్ద టీకా ఇస్తే రోగ నిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేయడం, తద్వారా యాంటీబాడీల సృష్టి వేగంగా జరుగుతుందన్నమాట. కొన్ని రకాల కోవిడ్ టీకాల్లో యాంటిజెన్లు ప్రత్యక్షంగా లేకపోయినా వాటిని తయారు చేసే ప్రణాళిక ఉంటుంది. కండరాల్లోని రోగనిరోధక వ్యవస్థ కణాలు వీటికీ తేలికగానే స్పందిస్తాయి. టీకాను రోగ నిరోధక వ్యవస్థ కణాలు గుర్తించగానే యాంటిజెన్ల వివరాలను వినాళ గ్రంథులకు అందజేస్తాయి. ఈ వినాళ గ్రంథుల్లో మరిన్ని రోగ నిరోధక వ్యవస్థ కణాలు యాంటిజెన్లను గుర్తించి యాంటీబాడీలను తయారు చేసే ప్రక్రియ మొదలయ్యేలా చేస్తాయి. వినాళ గ్రంథులకు దగ్గరగా ఉండటం భుజంపై టీకా ఇవ్వడానికి ఇంకో కారణం. బాహు మూలాల్లో ఈ వినాళ గ్రంధులు ఉంటాయి. యాంటిజెన్లతోపాటు టీకాలో ఉండే ఇతర పదార్థాలు రోగ నిరోధక వ్యవస్థను ఉత్తేజితం చేసేందుకు ఉపయోగపడతాయి. స్థానికంగా కట్టడి... వ్యాక్సిన్ వేసుకున్నాక శరీరంపై దద్దుర్లు, ఎర్రటి మచ్చలు రావొచ్చు. భుజం కండరాల్లో వ్యాక్సిన్ ఇస్తే... ఇలాంటి వాటిని స్థానికంగా కట్టడి చేసే శక్తి డెల్టాయిడ్ కండరాలకు ఉంటుంది. అంతేకాకుండా కొవ్వు పేరుకుపోయే చోట ఉండే కండరాలకు ఇస్తే శరీరమంతటా దద్దుర్లు, ర్యాష్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే కొవ్వు పట్టిన చోట కండరాలకు రక్త సరఫరా సరిగా ఉండదు. ఫలితంగా వ్యాక్సిన్లను సరిగా సంగ్రహించలేవు. వీటితో పాటు భుజంపై టీకా తీసుకోవడానికి ఎవరికీ అభ్యంతరాలుండవు. టీకాను భుజంపైనే ఇవ్వడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. -
చైనా కుట్రతో పాక్ కుతంత్రం..
జమ్మూ కశ్మీర్: భారత్-చైనా సరిహద్దు ప్రతిష్టంభన కొనసాతున్న నేపథ్యంలో డ్రాగన్ దేశం దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. లద్దాఖ్ సరిహద్దు వద్ద భారత వ్యకతిరేక కార్యకాలాపాలు, అశాంతిని రెచ్చగొట్టడానికి పాకిస్తాన్‌తో పన్నాగం పన్నుతున్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. జమ్మూ కశ్మీర్లో పెద్ద ఎత్తును ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పెలుడు పదార్థాలను మోహరించాలని చైనా పాకిస్తాన్‌కి ఆదేశించినట్లు తెలిపారు. జమ్మూకు పెద్ద ఎత్తును ఆయుధాలు తరలించాలనే ప్రణాళికను అమలు చేయాలని డ్రాగన్ దేశం పాక్‌కి సూచించిందని భారత ప్రభుత్వానికి ఇంటలిజెన్స్ వర్గాలు నివేదికలు అందించాయి. ఇటీవల భద్రతా ధళాలు స్వాధీనం చేసుకున్న ఆయుధాల ద్వారా భారత్‌లో హింస, ఆశాంతిని పెంచడానికి చైనా పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ ఆయుధాలపై చైనా దేశానికి సంబంధించిన గుర్తులు ఉన్నట్లు గుర్తించారు. (దక్షిణ కొరియాకు సారీ చెప్పిన కిమ్) భారత భద్రతా దళాలు ఏర్పాటు చేసిన చొరబాటు నిరోధక గ్రిడ్ కారణంగా కశ్మీర్ లోయలో పాకిస్తాన్ ఉగ్రవాదులు, ఆయుధాల మోహరింపు తగ్గిందని తెలిపారు. ఇంటలిజెన్స్ నివేదికలు వెలువడిన నేపథ్యంలో భారత భద్రతా దళాలు నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు నిరోధక గ్రిడ్‌ను మరింత బలోపేతం చేశాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చీఫ్ రాకేశ్ అస్థానా, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ చీఫ్ ఏపీ మహేశ్వరి, భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్లో పర్యటించి గత పది రోజుల నుంచి చోటుచేసున్న పరిస్థితులను సమీక్షించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఆర్మీ చీఫ్ ఎంఎం నారావణే ఆదేశించారు. (భారత్‌కు భయపడుతున్న చైనా జవాన్లు!) రెండు రోజుల క్రితం జమ్మూ నుంచి దక్షిణ కాశ్మీర్‌కు కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అనుమానితులను భద్రతా దళాలు అరెస్టు చేశారు. వారి వద్ద చైనా గుర్తులు ఉన్న నోరిన్కో / ఈఎంఇఐ టైప్ 97 ఎన్ఎస్ఆర్ రైఫిల్, 190 రౌండ్లతో నాలుగు మ్యాగజైన్స్, 21 ఎ రౌండ్లు, మూడు గ్రెనేడ్లతో నాలుగు మ్యాగజైన్స్ కలిగిన ఏకే 47 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో భారత భద్రతా బలగాలు సరిహద్దు వద్ద అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. -
ఆయుధ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఓకే
న్యూఢిల్లీ: ఆయుధ సవరణ బిల్లు-2019కు మంగళవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును సోమవారం లోక్‌సభ ఆమోదించింది. ఒక వ్యక్తి ఇప్పటివరకు అత్యధికంగా మూడు తుపాకులు, లేదా సంబంధిత ఆయుధాలను కలిగి ఉండే అవకాశం ఉండగా, ఇకపై అత్యధికంగా రెండు మాత్రమే కలిగి ఉండే ప్రతిపాదనను బిల్లులో చేర్చారు. వారసత్వంగా వచ్చిన ప్రాచీన ఆయుధాలను నిరుపయోగం చేసి, ఎన్నైనా భద్రపరుచుకోవచ్చని హోంశాఖ సహాయమంత్రి జి. కిషన్ రెడ్డి రాజ్యసభకు తెలిపారు. నిర్లక్ష్యంగా, మనుషులకు ప్రాణహాని కలిగేలా ఆయుధాన్ని ఉపయోగిస్తే రెండేళ్ల జైలు, లక్ష జరిమానా ప్రతిపాదన బిల్లులో ఉంది. అక్రమంగా ఆయుధాలు తయారు చేసినా, కలిగివున్నా గరిష్టంగా జీవితఖైదు విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. -
బృహన్నలార్జునీయం
విరటుని పుత్రుడు ఉత్తర కుమారుడు బృహన్నల సారథ్యంలో యుద్ధభూమికి వచ్చాడు. అశేషమైన ఆ సేనని చూసి భయంతో పారిపోబోగా బృహన్నల అతన్ని వెనక్కి తీసుకుని వచ్చి ధైర్యం చెప్పాడు. శమీవృక్షంపై గల ఆయుధాల మూటను తీసుకు వస్తే తాను యుద్ధంలో సాయం చేస్తానన్నాడు. సరేనని ఉత్తరుడు చెట్టు వద్దకు వచ్చాడు. రథం నుండి దిగి శమీవృక్షాన్ని ఎక్కి ఆ మూటను కిందికి దించి, దానిపైనున్న బంధనాలను తొలగించాడు. చాలా పెద్దవైన బంగారపు విల్లులను, మెరుస్తున్న బాణాలను చూసి ఆశ్చర్యంతో ‘‘ఈ దివ్యాస్త్రాలు ఎవరెవరివి? ఇక్కడికి ఎలా వచ్చాయి?’’ అని అడిగాడు. ‘‘ఈ దివ్యాస్త్రాలు పాండవులవి. వీటిలో పెద్దదైన ఈ ధనుస్సు గాండీవం. దీనిని బ్రహ్మదేవుడు, ప్రజాపతి, ఇంద్రుడు, చంద్రుడు ధరించారు. ఆ తర్వాత అర్జునుడు దీనిని వాడుతున్నాడు. సర్పాల్లా కనిపించే ఈ బాణాలు అర్జునుడివే. అవిగాక మిగతా ఆయుధాలన్నీ ధర్మరాజ, భీమ, నకుల సహదేవులవి’’ అని చెబుతూ, ఎవరెవరివి ఏయే ఆయుధాలో చూపెట్టాడు బృహన్నల. ఉత్తరుడు మరింత ఆశ్చర్యంతో ‘‘పాండవులు ఇప్పుడెక్కడున్నారు? ఈ ఆయుధాల సంగతి నీకు ఇంత విపులంగా ఎలా తెలుసు?’’ అనడిగాడు. బృహన్నల అతనితో ‘‘ఉత్తరకుమారా! నేను అర్జునుడను. మీ తండ్రిగారితో వీనులవిందుగా మాట్లాడుతూ ఆనందింపజేస్తున్న వ్యక్తి యుధిష్ఠిరుడు. మీ ఆస్థానంలోని పాకశాస్త్ర ప్రవీణుడు వలలుడే భీముడు. నకులుడు అశ్వపాలకుడు. సహదేవుడు గుర్రాలను రక్షించే నాయకుడు. సైరంధ్రియే ద్రౌపది.’’ అని చెప్పాడు. అదంతా విని ఉత్తరుడు విస్తుపోవడమేగాక పాండవులను చూడగలిగినందుకు ఎంతో సంతోషంతో బృహన్నలను ‘‘నీకున్న ప్రసిద్ధమైన పదిపేర్లను, వాటి కారణాలను చెప్పు’’ అనడిగాడు కుతూహలంతో. ‘‘ఉత్తరకుమారా! నేనొకప్పుడు రాజులందరినీ జయించి వారివద్దనుండి ధనాన్ని తీసుకొని దాని మధ్య కూర్చున్నాను. అందుచేత ధనంజయుడన్నారు. యుద్ధానికెప్పుడెళ్లినా జయించకుండా రాలేదు కనుక విజయుడన్నారు. నా రథానికి తెల్లటి గుర్రాలను కట్టడం వల్ల శ్వేతవాహనుడనే పేరొచ్చింది. ఉత్తర ఫల్గుణీ నక్షత్రాన పుట్టాను కాబట్టి ఫల్గుణుడన్నారు. రాక్షసులని జయించినందుకు దేవేంద్రుడు నా తలపై కిరీటాన్నుంచి గౌరవించాడు కనుక నన్ను కిరీటి అన్నారు. బీభత్సంగా యుద్ధం చేస్తాను కాబట్టి బీభత్సుడనే పేరొచ్చింది. రెండు చేతులతోనూ సమానవేగంగా బాణాలను వేయగలను కాబట్టి సవ్యసాచి అన్నారు. నా శరీరపు రంగు మట్టిరంగును పోలి విలక్షణంగా ఉండడం వల్ల పార్థుడని పేరొచ్చింది. గాండీవాన్ని ధరిస్తాను కాబట్టి గాండీవి అన్నారు’’ అని వివరించాడు. ఉత్తరుడికి మరోసారి ధైర్యవచనాలు చెప్పి, శత్రువులను జయించి, గోవులను కాపాడమని పలికి రథాన్ని కౌరవుల సమీపానికి నడిపించమన్నాడు. ఉత్తరుడు ధైర్యంతో ముందుకెళ్లాడు. సమయం వచ్చినప్పుడు కానీ, తమ స్థాయిని బయట పెట్టుకోరాదు. పాండవులు దానిని పాటించారు కాబట్టి విజయవంతంగా అజ్ఞాతవాసం చేయగలిగారు. అంతేకాదు, అర్జునుడికి ఉన్న పేర్లన్నీ ఆయనలోని విశేషగుణాలని బట్టి వచ్చినవే కానీ, తనంత తానుగా పెట్టుకున్నవి కాదు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకుని తీరవలసిన నీతి. నిజమైన వీరుడు చేతల్లో చూపిస్తాడు అర్జునుడిలా... అంతేగానీ ఉత్తముడిలా ప్రగల్భాలు పలుకడు. – డి.వి.ఆర్. భాస్కర్ -
ఆయుధాల అమ్మకాల్లో అమెరికానే ఫస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా ఆయుధాల అమ్మకాలు 1985 సంవత్సరం నుంచి తగ్గుతూరాగా, 2000 సంవత్సరం నుంచి అమ్మకాలు మళ్లీ ఊపందుకొని 2017 సంవత్సరం వరకు కొనసాగినట్లు స్టాక్‌హోమ్ పీస్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్ సిప్రీ ఓ నివేదికలో వెల్లడించింది. 2013 నుంచి 2017 మధ్య కొనసాగిన ప్రధాన ఆయుధాల అమ్మకాలను పరిశీలిస్తే అంతకుముందు ఐదేళ్ల అమ్మకాల కన్నా పది శాతం అమ్మకాలు పెరిగాయి. 2013 నుంచి 2017 సంవత్సరాల మధ్య ప్రపంచవ్యాప్తంగా 67 దేశాలు ప్రధాన ఆయుధాలను విక్రయించగా వాటిలో అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, చైనా దేశాలు ముందున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 67 దేశాలు విక్రయించిన ఆయుధాల్లో 74 శాతం ఈ అయిదు దేశాలే విక్రయించడం గమనార్హం. 34 శాతంతో అమెరికా మొదటి స్థానంలో నిలవగా, 22 శాతంతో రష్యా రెండో స్థానంలో నిలిచింది. 2008 నుంచి 2012, 2013 నుంచి 2017 మధ్య ఆయుధాలు ఎక్కువగా ఆసియా, ఓసియానియా, మధ్య ప్రాచ్యానికి వెళ్లాయి. ఆఫ్రికా, అమెరికా, యూరప్‌లకు గణనీయంగా తగ్గాయి. అమెరికా తన ఆయుధాలను 98 దేశాలకు విక్రయించగా వాటిలో 49 శాతం ఆయుధాలను మధ్యప్రాచ్యానికే విక్రయించింది. 34 శాతం ఆయుధాల అమ్మకాలతో ప్రపంచంలోనే అగ్రభాగాన నిల్చిన అమెరికా గత ఐదేళ్ల కాలంతో పోలిస్తే తన అమ్మకాలను 25 శాతం పెంచుకుంది. 1990వ దశకంతో పోల్చుకుంటే ఒబామా హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాల కారణంగానే అమెరికా ఎక్కువ శాతం ఆయుధాలను అమ్మకలిగిందని సిప్రీ ఆమ్స్ అండ్ మిలిటరీ ఎక్స్పెండీచర్ ప్రోగామ్ డైరెక్టర్ డాక్టర్ ఔడ్ ఫ్లూరంట్ తెలిపారు. రానున్న సంవత్సరాల్లో కూడా ప్రపంచంలోకెల్లా అమెరికా నుంచి ఆయుధాల అమ్మకాలు ఎక్కువ జరుగుతాయని, 2017లో అమెరికా కుదుర్చుకున్న పలు ఒప్పందాలు ఈ విషయాన్ని సూచిస్తున్నాయని ఆయన తెలిపారు. 2008 నుంచి 2012, 2013 నుంచి 2017 సంవత్సరాల మధ్య సాగిన అమ్మకాలను పరిశీలిస్తే రష్యా అమ్మకాలు 7. 1 శాతం పడిపోయాయి. ఫ్రాన్స్ అమ్మకాలు ఏకంగా 27 శాతం పెరిగాయి. ఆయుధాల అమ్మకాల్లో నాలుగవ పెద్ద దేశమైన జర్మనీలో కూడా 14 శాతం పడిపోయాయి. ఇదే కాలానికి చైనా అమ్మకాలు కూడా 19 శాతం పడిపోయాయి. చైనా నుంచి ఒక్క మయన్మార్ దేశమే 68 శాతం ఆయుధాలను దిగుమతి చేసుకోగా రష్యా 15 శాతం ఆయుధాలను దిగుమతి చేసుకుంది. -
కృత్రిమ కాళ్లు, చేతుల కోసం దరఖాస్తుల ఆహ్వానం
గుంతకల్లు టౌన్: భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేయనున్న కృత్రిమ కాళ్లు, చేతులు, కాలిపర్స్ కోసం దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాలని అమృత వర్షిణి బాల కళ్యాణ ఆశ్రమం (అనాథ శరణాలయం) కార్యదర్శి కె.లింగప్ప, క్యాంప్ ఆర్గనైజర్లు ఇల్లూరు లక్ష్మినారాయణ, డాక్టర్ రామ్మూర్తి కోరారు. శరణాలయంలో గురువారం వారు విలేకరులతో మాట్లాడారు. జైపూర్ కంపెనీ కంటే నాణ్యమైన కృత్రిమ కాళ్లు, చేతులు, కాలిపర్స్‌ను ఉచితంగా అందజేస్తామన్నారు. అవసరమైన వారు ఈ నెల 25 మధ్యాహ్నం 3 గంటలకు శరణాలయంలో హాజరైతే కొలతలు తీసుకుంటారని చెప్పారు. జనవరి 12న కృత్రిమ అవయవాలను అందజేస్తామన్నారు. ఇతర వివరాల కోసం తిలక్‌నగర్‌లోని అనాథ శరణాలయం లేదా ఇల్లూరు లక్ష్మినారాయణ భవన్లో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. శరణాలయం కమిటీ సహాయ కార్యదర్శి గిరిధర్ రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు. -
ఆయుధ ప్రదర్శనకు పోటెత్తిన విద్యార్థులు
కర్నూలు: పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయం ఏపీఎస్పీ రెండవ పటాలంలో బుధవారం కూడా ఆయుధాల ప్రదర్శన కొనసాగింది. నగరంలోని వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన విద్యార్థులు పోటెత్తారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్, ఫొటో ఎగ్జిబిషన్, డాగ్ స్క్వాడ్ బృందాల విన్యాసాలను ఎస్పీ ఆకే రవికృష్ణ విద్యార్థులతో కలసి తిలకించారు. ప్రదర్శనల్లో ఉంచిన వివిధ రకాల ఆయుధాలను, వాటి పనితీరును విద్యార్థులకు ఎస్పీ స్వయంగా తెలియజేశారు. విద్యార్థులు అడిగిన వివిధ రకాల సందేహాలను నివృత్తి చేశారు. వాసన పసిగట్టి నిందితులను గుర్తించే విధానం, పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసే విధానంపై పోలీసు జాగిలాలు నిర్వహించిన విన్యాసాలను విద్యార్థులతో కలసి ఎస్పీ తిలకించారు. పోలీసు అమరవీరుల త్యాగాల గురించి ఎస్పీ విద్యార్థులకు వెల్లడించారు. పోలీసుల సాదకబాధకాలను తెలుసుకోవడానికి ఆయుధ ప్రదర్శన, ఫొటో ఎగ్జిబిషన్, డాగ్ స్క్వాడ్ బృందాలను తిలకించడానికి గురువారం చివరి రోజు అయినందున జిల్లా ప్రజలు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు చంద్రశేఖర్‌రెడ్డి, ఐ.వెంకటేష్, ఆర్ఐలు రంగముని, జార్జి, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు. -
డీపీఓలో ఆయుధాల ప్రదర్శన
కర్నూలు: పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఆదివారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలోని పెరేడ్ మైదానంలో ఆయుధాల ప్రదర్శనను కుటుంబ సమేతంగా ఎస్పీ ఆకె రవికృష్ణ ప్రారంభించారు. పోలీసులు వినియోగించే ఆయుధాలు కార్బన్, పిస్టల్స్, ఏకె–47, 9 ఎంఎ పిస్టల్, ఎల్ఎంజీ, బాంబ్ డిస్పోజబుల్ పరికరాలు, గ్రెనైడ్, గ్యాస్ గన్ను తదితర ఆయుధాయులను ఎస్పీ పరిశీలించారు. ఆయుధాల పనితీరు గురించి పాఠశాల విద్యార్థులకు ఎస్పీ తెలియజేశారు. వజ్ర, ల్యాండ్ మైన్ ఫ్రూవ్ వాహనాలు ప్రదర్శనలో ఉంచారు. ఈ సందర్భఃగా వీక్షకులను ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ.. దేశభద్రత, సమాజ రక్షణ కోసం పోలీసులు వినియోగించే ఆయుధాల గురించి విద్యార్థులు తెలుసుకోవాలన్నారు. పోలీసు కుటుంబాలు, వారి పిల్లలు ఓపెన్‌హౌస్ ఎగ్జిబిషన్లో విధిగా పాల్గొనాలని సూచించారు. ఈ ప్రదర్శణమరో నాలుగు రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని వెల్లడించారు. సామాన్య ప్రజలు, విద్యార్థుల్లో పోలీసులపై భయాన్ని పోగొట్టి స్నేహ భావాన్ని పెంపొందించేందుకే ఈ ప్రదర్శణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు డీవీ రమణమూర్తి, బాబుప్రసాద్, సీఐలు డేగల ప్రభాకర్, మధుసూదన్‌రావు, మహేశ్వరరెడ్డి, కృష్ణయ్య, శ్రీనివాసులు, రామాంజనేయులు, ఆర్ఐలు రంగముని, జార్జ్, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.