
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంట్లోకి దుండగుడు చొరబడేందుకు ప్రయత్నించాడు. ఆయుధాలతో కూడిన కారులో సీఎం ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కోల్‌కతా కాళీఘాట్‌లోని మమతా నివాసంలోకి ప్రవేశించేందుకు నిందితుడు యత్నించాడు.
పోలీస్ స్టిక్కర్‌తో కూడిన వాహనంతో వచ్చిన ఆ వ్యక్తిని నూర్ ఆలంగా పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో దీదీ తన నివాసంలోనే ఉన్నారు. నగరంలో ఓ ర్యాలీలో పాల్గొనేందుకు మమతా బెనర్జీ తన నివాసం నుంచి బయల్దేరడానికి కొద్ది గంటల ముందు ఈ ఘటన జరిగింది.
మమత ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలు చెప్పాడని కోల్‌కతా సీపీ వినీత్ గోయల్ తెలిపారు. నిందితుడి వద్ద ఒక చాకుతోపాటు వివిధ ఆయుధాలు, గంజాయి కూడా దొరికాయని వెల్లడించారు.
బీఎస్‌ఎఫ్ తదితర ఏజెన్సీలకు సంబంధించిన అనేక గుర్తింపు కార్డులు అతని వద్ద లభ్యమయ్యాయని సీపీ వినీత్ గోయల్ పేర్కొన్నారు. ఘటనకు పాల్పడిన నిందితుడి అసలు ఉద్దేశం కనుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: రద్దీ రోడ్డు.. ట్రాఫిక్ జామ్ కాకూడదని.. బస్ డ్రైవర్‌గా మారిన బెంగళూరు ఏసీపీ!