ఒకరు కళ్లు... మరొకరు చేతులు
బీజింగ్: వారిద్దరు ప్రాణ మిత్రులు. ఒకరికి ఒకరు తోడూ నీడ. వారిలో మొదటి వ్యక్తి రెండో వ్యక్తికి కళ్లు. రెండో వ్యక్తి మొదటి వ్యక్తికి చేతులు. ఎందుకంటే వారిలో ఒకరికి కళ్లు లేవు, మరొకరికి చేతులు లేవు. ఇద్దరు చేతులూ కళ్లు కలిపి మహా యజ్ఞాన్ని చేపట్టారు. కన్ను పొడుచుకున్న చె ట్టూ పుట్ట కనిపించని నై బారిన ఎనిమిది హెక్టార్ల నేలలో చెట్లు నాటి పచ్చదనం పరిచే మహత్తర యజ్ఞాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు ఎనిమిది హెక్టార్ల స్థలంలో పదివేల మొక్కలు నాటారు. పచ్చదనం చూసి పక్షులు రావడం ప్రారంభమైంది. వాటి కిలకిల...రావాలే ప్రోత్సాహంగా వారు తమ యజ్ఞాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. వారు ఈ యజ్ఞాన్ని ప్రారంభించి 13 ఏళ్లు. తాము చేపట్టిన యజ్ఞంలో ఇంకా సగంపైగా మిగిలే ఉందని, తుదిశ్వాస విడిచే వరకు తాము నిరంతరంగా ఈ పనిలోనే నిమగ్నమవుతామని వారు చెబుతున్నారు. తాము సైతం ప్రపంచ పర్యావరణానికి తోడై నిలుస్తున్నందుకు అమితానందంగా ఉందని ఓ ఇంగ్లీష్ టీవీ టాక్‌లో తెలిపారు.
వారిద్దరు చైనాలోని యోలి అనే కుగ్రామానికి చెందిన వారు. వారిలో ఓ ఏదాది పెద్దవాడైన జియా హాగ్జియాకు 54 ఏళ్లు. రెండో వ్యక్తి 53 ఏళ్ల జియా వెంగీ. హాగ్జియాకి రెండు కళ్లు లేవు. చూపు మచ్చుకైనా కనిపించదు. పుట్టికతోనే ఓ కన్ను గుడ్డివాడైన హాగ్జియాకు ఫ్యాక్టరీలో పని చేస్తుండగా 2000 సంవత్సరంలో సంభవించిన ఓ ప్రమాదంలో రెందో కన్నుకూడా పోయింది. వెంగికి విద్యుత్ షాక్ వల్ల చిన్నప్పుడే రెండు చేతులు తీసేయాల్సి వచ్చింది. వారిద్దరు బాల్య మిత్రులు. ఇద్దరికి కుటుంబాలున్నాయి. సంపాదన పెద్దగా లేదు. ఇటు కుటుంబానికి, సమాజంలోని న లుగురికి ఉపయోగపడే పని చేయాలనుకున్నారు. వారి కుగ్రామం చుట్టుపక్కల కనుచూపు మేరలో వారికి ఎక్కడా ఓ చెట్టు కూడా కనిపించలేదు. మనిషికి తోడు నీడగా నిలిచే చెట్ల పెంపకం పట్ల ఎందుకు శ్రద్ధ చూపడం లేదని వారెళ్లి స్థానిక పంచాయతీని ప్రశ్నించారు. బంజరు భూముల్లో చెట్లేమి పెంచుతాం, అయినా అవి పెంచడానికి డబ్బులెక్కడి నుంచి వస్తాయని పంచాయతీ అధికారులు సమాధానం ఇచ్చారు. తమకు లీజుకు స్థలం ఇస్తే తాము పెంచుతామని ప్రాణ మిత్రులు ఒక్క మాటగా చెప్పారు.
ఎనిమిది హెక్టార్ల బంజరు భూమిని గ్రామ పంచాయతీ అధికారులు వారికి నామమాత్రం రేటుపై లీజుకిచ్చారు. అంతే ఒకరు పార, ఒకరు గుణపం పట్టుకొని ఆ బంజరు భూమికి వెళ్లడం మొదలు పెట్టారు. మధ్యలో అడ్డంగా పారే ఓ కాల్వ వద్దకు వచ్చినప్పుడు చేతులు లేని వెంగీ కళ్లులేని హాగ్జియాను భుజానెత్తుకుని కాల్వ దాటిస్తాడు. ఆ తర్వాత కొన్నేళ్లుగా వారు పడుతున్న కష్టాన్ని చూసి పంచాయతీ అధికారులు, లీజు రుసుంను మాఫీ చేయడమే కాకుండా వారి శ్రమకు కూలికింద కొంత సొమ్ము చెల్లిస్తూ వచ్చారు. అలా వచ్చిన సొమ్మును ప్రాణ మిత్రులు వృధా చేయకుండా తొలుత మొక్కలు కొనేందుకు ఉపయోగించారు. వీరి కృషికి కదిలిపోయిన గ్రామస్థులు పట్టణంలోని మార్కెట్‌కు వెళ్లినప్పుడల్లా తమకు తోచిన మొక్కలు కొనుక్కొచ్చి ఇస్తున్నారు. దాంతో కూలి కింద తమకందుతున్న కొంత సొమ్మును తమ కుటుంబాలకే ఇస్తూ కుటుంబ పోషణకు కూడా తోడ్పడుతున్నారు.