good friends
-
పుస్తక పఠనం ప్రాధాన్యం తెలుసా? ఇలా చదవడం ఎంతో మేలు
మనల్ని కాళ్ళు కదపనీయక, ఇల్లు కదలనీయక కొత్త ప్రపంచంలో విహరింపచేసి కొత్త కొత్త అనుభవాలను, అనుభూతులను మనకు పంచి మన పరిణతికి, మనోవికాసానికి దోహదం చేసే అద్భుత మార్గదర్శకాలు. మనకు సంతోషాన్నిచ్చి, మన బాధను పంచుకునే మన చక్కని నేస్తాలు పుస్తకాలు. ఇప్పుడైతే పుస్తకాలు విరివిగా అందరి చేతుల్లోకి వస్తున్నాయి. కొన్నేళ్ల కిందట, పుస్తకాలు అందరికీ అందుబాటులో ఉండేవి కావు. వార పత్రికలలో ధారా వాహికలను క్రమం తప్పకుండా చదివే అలవాటున్న వారు, నవలలు, కథలు చదివే అభిరుచి ఉన్నవారు, కొనుక్కోలేక గ్రంథాలయాలలో తెచ్చుకుని చదివేవారు. గృహిణులు, సరుకులు కట్టిన కాగితం పొట్లాలమీద ఉండే వార్తలు, కథలు కూడా వంటిల్లు సర్దుకుంటూ ఆసక్తిగా చదివేవారు. పఠ నాభిలాష అంత బాగా ఉండేది. రచయితలు గతించిపోవచ్చు. కాని, పుస్తకాలు నశించవు. శ్రీనాథ, పోతనాది కవులను మనమెవరం చూడలేదు. వాళ్ళ గ్రంథాలు వెలువడి శతాబ్దాలు గడిచేయి. అయినా మనం ఇప్పటికీ చదువుతూనే ఉన్నాం. ఆ గ్రంథాల నుంచి స్ఫూర్తిని పొందుతూనే వున్నాము. వాటిలోని సందేశాలను, నీతులను అనుసరిస్తూనే వున్నాము. శ్రవణం, భాషణం, పఠనం, లిఖితం అనే నాలుగు అభివ్యక్తి నైపుణ్యాలలో పఠన కళ ఒకటి. పుస్తకాలను చదవటం ఒక కళ. వేగంగా చదవాలి. అర్థం చేసుకుంటూ చదవాలి. ప్రారంభించి కొన్ని పేజీలు చదవగానే అది ఉపయోగపడేదేనా, కాలక్షేపానికా అన్నది గ్రహించగలగాలి. ఏవి చదవాలి, ఎలా చదవాలి, ఏవి చదవకూడదు అనేది తెలిసి వుండటం కూడా పఠన కళలో భాగమే! ఎన్ని పుస్తకాలు చదివాము అన్నది ముఖ్యం కాదు. ఎంత బాగా చదివాం, ఎంత లోతుగా చదివామన్నది ముఖ్యం. చదివిన ఒక వాక్యమైనా క్షుణ్ణంగా, లోతుగా చదవాలి. అపుడే మన మనస్సులో అవి నిలిచిపోతాయి. ‘కొన్ని పుస్తకాలను స్పృశించి వదిలేయాలి, కొన్ని జీర్ణించుకోవాలి, కొన్ని నెమరు వేసుకోవాలి’ అని అన్నాడు ప్రసిద్ధ ఆంగ్ల రచయిత బేకన్. పుస్తకాలు ఎలా చదవాలో మహాకవుల, మేధావుల జీవిత చరిత్రలు, డైరీల నుండి గ్రహించవచ్చు. చిరిగిన చొక్కానైనా తొడుక్కో, మంచి పుస్తకం కొనుక్కో’ అనే సూక్తి మనందరకు తెలుసు. కాని, నేటి యువత çపద్ధతి ఇందుకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. బాగా చదివే అలవాటున్నవారిని పుస్తకాల పురుగు అంటారు. అలాంటివారు నిజంగానే తమ డబ్బును బట్టలకు కాకుండా పుస్తకాలు కొనటానికే ఖర్చు చేస్తారు. పుస్తకాలు పాఠకుణ్ణి ఊహలోకంలో, అద్భుత జగత్తులో విహరింపజేస్తాయి. మనను తమతో ప్రయాణింప చేస్తాయి. సంఘటనలు ఆయా ప్రాంతాలకు తమతో తీసుకువెళ్లిపోతాయి. చదువుతున్న సన్నివేశానికి మనం దృశ్య రూపాన్ని కల్పించుకుంటాం. పుస్తకాలు చదవటం శ్వాస పీల్చటం లాంటిది. శ్వాస ఆడకపోతే ప్రాణం నిలవదు. పుస్తకాలు అంతే! ఒక పుస్తకం, ఒక కలం, ఒక ఉపాధ్యాయుడు... ఇవి ఈ ప్రపంచాన్నే మార్చగలవు. ఆస్తులు పోవచ్చు, భవనాలు కూలిపోవచ్చు, కాని పుస్తకాలు నశించవు. పుస్తకాలు లేని ఇల్లు ఆత్మ లేని శరీరం లాంటిది. అశాంతిమయ క్షణాల్లో, నిరాశా నిస్పృహలలో, ఒంటరి తనంలో పుస్తకమే నిజమైన నేస్తం. ప్రాణ స్నేహితులు కూడా ఒకొక్కసారి విభేదాలు వచ్చి మనతో విడిపోవచ్చు. కాని, పుస్తకాలు అనే స్నేహితులు మన సుఖ దుఃఖాలలో మనకు తోడు. ఎంతో వెన్నుదన్ను. ముఖ్యంగా మన బాధలో, మనని ఎప్పుడూ విడిచి పెట్టవు. మౌన మిత్రులు. మనలోని లోపాలను దిద్ది మంచి దారిలో పెడతాయి. మనలో మంచి ప్రవర్తనను ప్రోది చేసే అద్భుత సాధనాలు. శాశ్వతమైన స్నేహితులు. పుస్తకాలు జ్ఞానమనే నిధికి తాళాల్లాంటివి. సంతోషమనే ఇంటికి తలుపు లాంటివి. పుస్తకాలకు పెట్టిన ప్రతిపైసా మంచి పెట్టుబడే. పుస్తకాలు జీవితంలో కొత్తకోణాలను చూపిస్తాయి. ఎలా జీవించాలో మనకు నేర్పిస్తాయి. ఆశావహ దృక్పధాన్ని పెంచుతాయి. మెదడును వికసింప చేసి, స్వతంత్ర ఆలోచనా శక్తిని, విశ్లేషణా సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి. సత్యాన్ని శోధింప చేస్తాయి. మేధావి రచయితలు వారి రచనల ద్వారా ఎప్పుడూ జీవించే ఉంటారు. ప్రతి వారికి సొంతం గ్రంధాలయం ఉండాలి. ఇది విలాసం కోసం, ప్రదర్శన కోసం కాదు. జీవితంలో ఇదీ ఒక అవసరం. కొన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు, ఒక నిఘంటువు, ఒక విజ్ఞాన సర్వస్వం లేని ఇల్లు వెలుతురు రావటానికి కావలసిన కిటికీలు లేని ఇల్లు లాంటిది. ప్రపంచపు గొప్ప సాహిత్యాన్ని చదవటం వల్ల పద సంపద విస్తృతమవుతుంది. వేగంగా పెరిగిపోతున్న వయసులో ఒత్తిడుల నుంచి తప్పించుకోవటానికి గొప్ప ఆధారం పుస్తకాలు. ఎలా చదవాలి? ఒక పెన్సిల్ చేత్తో పట్టుకుని, ముఖ్యమైన వాక్యాల కింద గీత గీస్తూ, అర్థం చేసుకుంటూ చదవాలి. అప్పుడు ఆ పుస్తకంలో హృదయాన్ని వేగంగా సమీక్షించగలమని మేధావులు చెప్పారు. ప్రతిరోజూ ఎంతో కొంత చదవాలి. అది క్రమంగా ఓ అలవాటుగా మారిపోతుంది. రాత్రి పడుకునే ముందు మంచి పుస్తకం ఒక అరగంట చదివితే మనసు ప్రశాంతత పొందుతుంది. మంచి నిద్ర పడుతుంది. పుస్తక పఠనం అలసటలో, ఆవేదనలో, ఆర్తిలో, సుఖంలో, సంతోషంలో ఎప్పుడూ మనకు తోడుగా ఉంటుంది. పిల్లలకు బాల్యం నుంచే పుస్తకాలు చదవటం అలవాటు చేస్తే వాళ్ళ జీవితంలో అది స్థిర పడిపోతుంది. ♦ పుస్తకాలు చదవటం శ్వాస పీల్చటం లాంటిది. శ్వాస ఆడకపోతే ప్రాణం నిలవదు. పుస్తకాలు అంతే! ఒక పుస్తకం, ఒక కలం, ఒక ఉపాధ్యాయుడు... ఇవి ఈ ప్రపంచాన్నే మార్చగలవు . ♦ సూక్తి సుధ అవకాశాలు సూర్య కిరణాలు వంటివి. వాటిని వీలయినంత త్వరగా దొరక బుచ్చుకోవాలి. ఆలస్యం చేస్తే వాటిని కోల్పోక తప్పదు. – డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి -
పులి-మేక మంచి ఫ్రెండ్స్
మాస్కో: పులి, మేక కథలను ఎన్నో విన్నాం. ఒకదానికి మరోదానికి పడదు. పులిని చూస్తే మేక పారిపోతుంది. మేక కనిపిస్తే వెంటాడి, వేటాడి తినే వరకు వదిలిపెట్టదు పులి. కానీ రష్యాలోని స్కోటోవిస్కీ సఫారీ పార్కులో మాత్రం పులి, మేక మంచి మిత్రులై సహజీవనం సాగిస్తున్నాయి. ఉదయం వేళ పులి లేచి మరింత దట్టమైన అడవిలోకి ఆహారం కోసం వెళుతోంది. దారిచూపే నాయకత్వాన్ని పులికే వదిలేసి దాని వెనకాల వెళుతుంది మేక. రాత్రిపూట రారాజు మాత్రం మేకే. రోజు పులి పండుకునే గుహలాంటి చోట మేక పడుకుంటుంది. దగ్గరికొస్తే పులినే తంతోంది. మంచి అవగాహనకొచ్చిన పులి మేకకు కాపలాగా గుహ పైన నిద్రిస్తోంది. గత వారం రోజులుగా రోజు ఇదే తంతు జరిగుతోంది సఫారీ పార్కులో. స్నేహంలో ఉన్న సౌభ్రాతృత్వాన్ని అర్థం చేసుకున్న పులికి జైలు సిబ్బంది దానికి 'ఆముర్' అని ఇదివరకే పేరుపెట్టగా, ధైర్యంగా పులి చెంతనే సహజీవనం సాగిస్తున్న మేకకు 'తిమూర్' అని పేరు పెట్టారు. తిమూరు అంటే రష్యా భాషలో ఉక్కు. సరిగ్గా వారం క్రితం పులులుండే సఫారీలోకి మేక ప్రవేశించిందని, ఆ రోజు పులికి తామేమి ఆహారం పెట్టాల్సిన అవసరం కూడా లేదని భావించామని, అయితే అవి కలసి తిరగడాన్ని చూసి ఆశ్చర్యం వేసిందని సఫారి ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అప్పుడప్పుడు దారితప్పి సఫారిలోకి మేకలు రావడం, వాటిని వేటాడి పులులు, ముఖ్యంగా ఈ పులి తినడం సర్వ సాధారణమేనని, ఇది మాత్రమే వింతగా ఉందని ఆ అధికారి వ్యాఖ్యానించారు. సహనం కూడా లేని మానవులకు వింతగానే ఉంటుంది మరి. అటవి సిబ్బంది ఈ దృశ్యాలను వీడియో తీసి ఆన్లైన్ పోస్ట్ చేశారు. ఇప్పుడా వీడియో హల్చల్ చేస్తోంది. -
ఒకరు కళ్లు... మరొకరు చేతులు
బీజింగ్: వారిద్దరు ప్రాణ మిత్రులు. ఒకరికి ఒకరు తోడూ నీడ. వారిలో మొదటి వ్యక్తి రెండో వ్యక్తికి కళ్లు. రెండో వ్యక్తి మొదటి వ్యక్తికి చేతులు. ఎందుకంటే వారిలో ఒకరికి కళ్లు లేవు, మరొకరికి చేతులు లేవు. ఇద్దరు చేతులూ కళ్లు కలిపి మహా యజ్ఞాన్ని చేపట్టారు. కన్ను పొడుచుకున్న చె ట్టూ పుట్ట కనిపించని నై బారిన ఎనిమిది హెక్టార్ల నేలలో చెట్లు నాటి పచ్చదనం పరిచే మహత్తర యజ్ఞాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు ఎనిమిది హెక్టార్ల స్థలంలో పదివేల మొక్కలు నాటారు. పచ్చదనం చూసి పక్షులు రావడం ప్రారంభమైంది. వాటి కిలకిల...రావాలే ప్రోత్సాహంగా వారు తమ యజ్ఞాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. వారు ఈ యజ్ఞాన్ని ప్రారంభించి 13 ఏళ్లు. తాము చేపట్టిన యజ్ఞంలో ఇంకా సగంపైగా మిగిలే ఉందని, తుదిశ్వాస విడిచే వరకు తాము నిరంతరంగా ఈ పనిలోనే నిమగ్నమవుతామని వారు చెబుతున్నారు. తాము సైతం ప్రపంచ పర్యావరణానికి తోడై నిలుస్తున్నందుకు అమితానందంగా ఉందని ఓ ఇంగ్లీష్ టీవీ టాక్‌లో తెలిపారు. వారిద్దరు చైనాలోని యోలి అనే కుగ్రామానికి చెందిన వారు. వారిలో ఓ ఏదాది పెద్దవాడైన జియా హాగ్జియాకు 54 ఏళ్లు. రెండో వ్యక్తి 53 ఏళ్ల జియా వెంగీ. హాగ్జియాకి రెండు కళ్లు లేవు. చూపు మచ్చుకైనా కనిపించదు. పుట్టికతోనే ఓ కన్ను గుడ్డివాడైన హాగ్జియాకు ఫ్యాక్టరీలో పని చేస్తుండగా 2000 సంవత్సరంలో సంభవించిన ఓ ప్రమాదంలో రెందో కన్నుకూడా పోయింది. వెంగికి విద్యుత్ షాక్ వల్ల చిన్నప్పుడే రెండు చేతులు తీసేయాల్సి వచ్చింది. వారిద్దరు బాల్య మిత్రులు. ఇద్దరికి కుటుంబాలున్నాయి. సంపాదన పెద్దగా లేదు. ఇటు కుటుంబానికి, సమాజంలోని న లుగురికి ఉపయోగపడే పని చేయాలనుకున్నారు. వారి కుగ్రామం చుట్టుపక్కల కనుచూపు మేరలో వారికి ఎక్కడా ఓ చెట్టు కూడా కనిపించలేదు. మనిషికి తోడు నీడగా నిలిచే చెట్ల పెంపకం పట్ల ఎందుకు శ్రద్ధ చూపడం లేదని వారెళ్లి స్థానిక పంచాయతీని ప్రశ్నించారు. బంజరు భూముల్లో చెట్లేమి పెంచుతాం, అయినా అవి పెంచడానికి డబ్బులెక్కడి నుంచి వస్తాయని పంచాయతీ అధికారులు సమాధానం ఇచ్చారు. తమకు లీజుకు స్థలం ఇస్తే తాము పెంచుతామని ప్రాణ మిత్రులు ఒక్క మాటగా చెప్పారు. ఎనిమిది హెక్టార్ల బంజరు భూమిని గ్రామ పంచాయతీ అధికారులు వారికి నామమాత్రం రేటుపై లీజుకిచ్చారు. అంతే ఒకరు పార, ఒకరు గుణపం పట్టుకొని ఆ బంజరు భూమికి వెళ్లడం మొదలు పెట్టారు. మధ్యలో అడ్డంగా పారే ఓ కాల్వ వద్దకు వచ్చినప్పుడు చేతులు లేని వెంగీ కళ్లులేని హాగ్జియాను భుజానెత్తుకుని కాల్వ దాటిస్తాడు. ఆ తర్వాత కొన్నేళ్లుగా వారు పడుతున్న కష్టాన్ని చూసి పంచాయతీ అధికారులు, లీజు రుసుంను మాఫీ చేయడమే కాకుండా వారి శ్రమకు కూలికింద కొంత సొమ్ము చెల్లిస్తూ వచ్చారు. అలా వచ్చిన సొమ్మును ప్రాణ మిత్రులు వృధా చేయకుండా తొలుత మొక్కలు కొనేందుకు ఉపయోగించారు. వీరి కృషికి కదిలిపోయిన గ్రామస్థులు పట్టణంలోని మార్కెట్‌కు వెళ్లినప్పుడల్లా తమకు తోచిన మొక్కలు కొనుక్కొచ్చి ఇస్తున్నారు. దాంతో కూలి కింద తమకందుతున్న కొంత సొమ్మును తమ కుటుంబాలకే ఇస్తూ కుటుంబ పోషణకు కూడా తోడ్పడుతున్నారు. -
డేటింగ్‌కు ఫుల్స్టాప్!
బాలీవుడ్లో ఎవరు ఎందుకు కలుస్తారో... విడిపోతారో అర్థం కాదు. చాలా కాలంగా ఒకరికి ఒకరుగా తిరిగిన వర్ధమాన తారలు శ్రద్ధాకపూర్, ఆదిత్యారాయ్ కపూర్లు ఉన్నట్టుండి విడిపోయారు. ఇప్పటి వరకూ ఇరువురూ తమ రిలేషన్ గురించి పబ్లిక్‌లో ఎక్కడా చెప్పకపోయినా... అర్ధరాత్రుళ్లు కలసి తిరగుతూ, ప్రైవేటు పార్టీలకు అటెండవుతూ కనిపించారు. అయితే కొంత కాలంగా ఇద్దరి మధ్యా పొసగడం లేదనేది ఇండస్ట్రీ టాక్. ఇలాంటి పరిస్థితుల్లో కలిసుండి కొట్టుకోవడం కన్నా... విడిపోయి ‘గుడ్ ఫ్రెండ్స్’గా మిగిలిపోవడమే మంచిదని భావించినట్టు సమాచారం. ఇదిలావుంటే... ఎవరికి వారు సినిమాలతో బిజీగా ఉండటం వల్ల కెరీర్‌పై కాన్సన్ట్రేట్ చేయాలనే ఉద్దేశంతోనే దూరంగా ఉంటున్నారన్నది మరో కథనం. -
గర్భశోకం
వారు ముగ్గురు ప్రాణస్నేహితులు. రోజూ కలిసే కళాశాలకు వెళ్లి వస్తుంటారు. చదువులోనూ ముందంజలో ఉంటారు. ఏమైందో తెలియదు కానీ ముగ్గురూ కలిసే కృష్ణమ్మ ఒడిలో తనువు చాలించారు. తమపైనే ఆశలు పెట్టుకుని జీవిస్తున్న తల్లిదండ్రులకు తీరని గర్భశోకం మిగిల్చారు. తెల్లారితే రాఖీ పండుగ.. చిన్నారి చెల్లి పూజిత వచ్చి రాఖీ కడుతుందని అన్నయ్య ఎదురుచూస్తున్నాడు..పల్లవక్క వచ్చి రక్షాబంధనం కడుతుందని చిన్నారి తమ్ముడి నిరీక్షిస్తున్నాడు. కానీ వారి నిరీక్షణ ఫలించలేదు. పూజిత, పల్లవి.. ఇద్దరూ విగత జీవులై ఇంటికి రావటం ఆ అన్నదమ్ములతోపాటు కుటుంబ సభ్యులకూ అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ముగ్గురు విద్యార్థినుల అనుమానాస్పద మృతి కృష్ణానదిలో మృతదేహాలు లభ్యం సీతానగరం తీరంలో కలకలం కలిసే చదువుకున్నారు.. తనువూ చాలించారు.. పెనమలూరుకు చెందిన బిళ్ల పల్లవి(18), చోడవరానికి చెందిన సరిపూడి పూజిత(17), తాడిగడప సెంటర్ సమీపంలో నివసించే యలమంచిలి నాగలక్ష్మి బందరు రోడ్డులోని ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్మీడియెట్ ఎంపీసీ గ్రూపు ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. పూజిత, పల్లవి ఇద్దరు పదో తరగతి వరకు పెనమలూరులోని ఓ పాఠశాలలో కలిసే చదువుకున్నారు. శనివారం ఉదయం యథావిధిగా ఇంటి నుంచి బయలుదేరిన ఈ ముగ్గురు కళాశాలకు వెళ్లలేదు. దీంతో కళాశాల ప్రతినిధులు వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. పల్లవి తల్లిదండ్రులు కళాశాలకు వచ్చి ప్రిన్సిపాల్‌ను కలిసి వెళ్లారు. ఈ క్రమంలో ముగ్గురు విద్యార్థినులు శనివారం సాయంత్రం గుంటూరు జిల్లా సీతానగరం వద్ద కృష్ణానది ఇసుక తిన్నెలపైకి వెళ్లి అక్కడ కొద్దిసేపు తచ్చాడినట్లు స్థానికులు చెబుతున్నారు. కొద్దిసేపటి తర్వాత వారి బ్యాగులు మాత్రమే కనిపించగా, విద్యార్థినుల ఆచూకీ లభించలేదు. ఇసుక తిన్నెలపై బ్యాగులు స్వాధీనం చేసుకున్న పోలీసులకు ఆదివారం ఉదయం విద్యార్థినుల మృతదేహాలు లభించాయి. వారి తల్లిదండ్రులకు వెంటనే వారు సమాచారం అందించడంతో వారంతా హుటాహుటిన కృష్ణా నది ఒడ్డుకు చేరుకుని గుండెలవిసేలా రోదించారు. చిట్టీ తల్లీ! చీకటంటే భయం కదే! ‘ఎంత పని చేశావు బిడ్డా.. నాన్న, చెల్లి, నేను గుర్తుకురాలేదా? కాస్త దూరం నడిస్తే కాళ్లు నొప్పులమ్మా అంటూ ఏడ్చేదానివిగా, ఇంత దూరం నడుచుకుంటూ ఎలా వచ్చావమ్మా? నువ్వు చనిపోలేదు, నన్ను ఏడిపించేందుకే ఇలా చేస్తున్నావు, లేమ్మా.. నీకు చీకటి అంటే భయంగా కదా! కరెంటు పోతే కెవ్వుమని కేకేసేదానివి కదా! రాత్రి చీకటిలో నీళ్లలో తడుస్తూ ఎలా ఉన్నావమ్మా..* అంటూ నాగలక్ష్మి తల్లి మాధవి బోరున విలపించారు. చీర చెంగుతో బిడ్డ మొహం తుడుస్తూ లేపేందుకు ఆమె ప్రయత్నించటం అందరినీ కలచివేసింది. నాగలక్ష్మి తండ్రి శ్రీనివాసరావు విజయవాడ ఆటోనగర్‌లో పని చేస్తున్నారు. తల్లి మాధవి గృహిణి. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయి నాగలక్ష్మి బస్ ట్రబుల్ ఇచ్చిందంటూ 11 గంటలకే ఇంటికి వచ్చింది. 4.30 గంటలకు కూడా ఫోన్లో మాట్లాడింది. ఇంట్లోనే ఉన్నానంటూ హైదరాబాద్‌లోని మేనమామకు, తల్లికి చెప్పింది. తర్వాత బయటకెళ్లిన ఆమె చీకటిపడ్డా కనిపించకపోవడంతో కంగారుపడిన తండ్రి ఫోన్ చేసి చెప్పడంతో మాధవి ఫ్రెండ్స్, బంధువులకు ఫోన్ చేసి ఆరా తీశారు. సమాచారం దొరక్కపోవడంతో వెంటనే బయలుదేరి పెనమలూరు వచ్చారు. ఇంతలోనే పోలీసులు ఫోన్ చేసి విషయం చెప్పటంతో దిగ్భ్రాంతి చెందారు. తెల్లారాక ఫిర్యాదు చేద్దామనుకుంటే.. మృతుల్లో ఒకరైన సరిపూడి పూజితకు తండ్రి లేడు. ఏడేళ్ల క్రితమే మరణించారు. అమరావతి మండలం లింగాపురం సొంతూరు కాగా, పూజిత తండ్రి మరణించడంతో పిల్లలిద్దరిపైనే ఆశలు పెట్టుకున్న ఆ తల్లి, మంచి చదువులు చదివించాలనే తపనతో పెనమలూరు మండలం చోడవరంలోని బంధువుల దగ్గరకు వచ్చి ఉంటున్నారు. శనివారం పూజిత రాలేదని కాలేజి నుండి ఫోన్ రాగా తల్లి శివనాగలక్ష్మి కంగారు పడ్డారు. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లిందేమోనని సరిపెట్టుకున్నారు. చీకటిపడ్డా రాకపోవడంతో ఆందోళన చెంది బంధువులకు ఫోన్ చేశారు. తెల్లవారేదాకా చూసి పోలీసులకు ఫిర్యాదు ఇద్దామనుకున్నారు. ఇంతలోనే విషయం తెలియటంతో భోరున విలపించారు. పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదు.. మరో మృతురాలు బిళ్లా పల్లవిది విజయవాడ సమీపంలోని పెనుమలూరు. తండ్రి రాంబాబు ఎలక్ట్రీషియన్. ఇంటికి ఒక్కతే ఆడపిల్ల కావడంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. శనివారం కాలేజీకి రాలేదంటూ ఫోన్ రావడంతో కంగారు పడిన తండ్రి స్నేహితులు, బంధువులను ఎంక్వైరీ చేశారు. చీకటిపడ్డా రాకపోవడంతో స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా వారు ఫిర్యాదు తీసుకోలేదు. ఉదయం 10 గంటలకు అమ్మాయి ఫోటో తెస్తే ఎంక్వైరీ చేస్తామని పోలీసులు చెప్పారని పల్లవి తండ్రి రాంబాబు చెప్పారు. రాత్రంతా నిద్ర లేకుండా ఎప్పుడు తెల్లవారుతుందోనని ఆందోళనతో గడిపానని, తెల్లవారే సరికి బిడ్డ మరణవార్త వినాల్సి వచ్చిందని గొల్లుమన్నారు. విజయవాడలో పోస్టుమార్టం పోస్టుమార్టం కోసం మృతదేహాలను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ముగ్గురు విద్యార్థినుల మృతదేహాలకు వారి తల్లిదండ్రులు, బంధువుల సమక్షంలో మంగళగిరి సీఐ హరికృష్ణ, తాడేపల్లి ఎస్ఐ వినోద్‌కుమార్‌లు పంచనామా నిర్వహించారు. కాగా మరణించిన ముగ్గురు విద్యార్థినులు రెగ్యులర్‌గా కళాశాలకు వచ్చేవారని, చదువులో కూడా ముందుండేవారని కళాశాల ప్రిన్సిపాల్ చెప్పారు. -
మనయాత్రలో మంచి మిత్రులు..
టూర్ గైఢ్స్ ఎల్లలను చెరిపేసి అనుబంధాలకు వారిధిలా, కొత్త ప్రదేశాల సందర్శనకు సారధిలా, చారిత్రక నిర్మాణాల అవగాహనకు విజ్ఞాన గనిలా, సాంస్కృతిక వైభవాన్ని పర్యాటకులకు తెలిపే సంపదలా.. వీటన్నింటినీ మించి యాత్రలో మనకు దిశానిర్దేశం చేసే మంచి మిత్రులుగా విభిన్నరకాల పాత్రలను పోషిస్తున్నవారు టూర్ గైడ్స్! పర్యటనలో చిక్కులను తొలగించి మార్గాన్ని సుగమం చేస్తున్నారు. దక్షిణాఫ్రికాలోని డర్బన్ నుంచి ఒక కుటుంబం తమ మూలాలను వెతుక్కుంటూ మనదేశానికి వచ్చింది. వాళ్ల పూర్వీకులలో ఒకరు 1905లో అనకాపల్లికి 40 కి.మీ దూరంలో ఉన్న జంపన అనే కుగ్రామం నుంచి దక్షిణాఫ్రికా వెళ్లి, అక్కడే స్థిరపడ్డారట. తమ మూలాలు భారత్‌లో ఉన్నాయనే విషయం వందేళ్ల తర్వాత వారి మనమలకు ఒక పేపర్ కటింగ్ ద్వారా తెలిసి, జంపన అనే ఊరు తెలుసుకోవడానికి మనదేశం వచ్చారు. ఆ ఊళ్లోనూ, చుట్టుపక్కల ఊళ్లలోనూ వీరికి సంబంధించిన కుటుంబీకులను కలుసుకొని, ఆ ఉద్వేగంలో కన్నీటి పర్యంతమయ్యారు. ‘హృదయాన్ని కదలించిన ఆ సంఘటన నాకూ కంట నీరు తెప్పించింది’ అంటూ గుర్తుచేసుకున్నారు టూర్ గైడ్ సుబ్రహ్మణ్యం. ఇలాంటి అనుభవాలు ఉన్న గైడ్స్ మన దేశంలో 2,500 మంది అధికారికంగా ఉన్నారు. అయితే, తెలుగు రాష్ట్రాలలో వీరి సంఖ్య ఎనిమిదే! ఇరు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలకు చెందిన వీరు ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. నిరంతర పరిశోధన... ప్రభుత్వ ఉద్యోగంలో చేరగానే పనిలేకపోయినా నెలసరి జీతం వచ్చేస్తుంది అనుకునేవారికి నప్పనిది ఈ గైడ్ ప్రొఫెషన్. పర్యటనలో ఉన్నా, ఇంట్లో ఉన్నా.. వీరి ఆలోచనలెప్పుడూ పర్యాటకులకు చూపించబోయే సందర్శన స్థలాలమీదనే ఉంటుంది. చారిత్రక కట్టడాల చుట్టూతానే తిరుగుతుంటుంది. ఏ పర్యాటకుడు ఏ ప్రశ్న వేస్తాడో తెలియదు. దానికి తగిన సమాధానం ఇవ్వడానికి మాత్రం ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారు. ‘రోజులో కనీసం 5-6 గంటలు పుస్తకాలు చదువుతూ, విషయాలు శోధిస్తూనే ఉంటాం’ అన్నారు మధు. ఇదే విషయంపై అరవపల్లి శ్రీను మాట్లాడుతూ- ‘విదేశీ పర్యాటకలకు ప్రతిది తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ. వారిని గైడ్‌గా రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి వచ్చే ప్రశ్నల పరంపరకు సమాధానాలు చెబుతూనే ఉండాలి. అడిగిన ప్రశ్నలకు ఏ మాత్రం సరైన సమాధానాలు చెప్పకపోయినా వారు వెంటనే మరో గైడ్‌ను వెతుక్కుంటారు. అందుకే ఈ వృత్తి ఎప్పటికప్పుడు మాకు ఒక సవాల్‌గానే ఉంటుంది’ అని తెలిపారు. ‘ఒక విదేశీయుడు అంతరించిపోతున్న బట్టమేక పక్షి కోసం మన రాష్ట్రానికి వచ్చాడు. ఆ పక్షిని వెతకడానికి నాకు రెండు రోజులు పట్టింది. చివరకు నందికొట్కూరులో ఉందని తెలిసింది. అతన్ని తీసుకొని, ఆ పక్షి కోసం బయల్దేరాను. ముందుగా ఆ పక్షి గురించి వివరాలన్నీ తెలుసుకొని, అతనికి సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వగలిగాను’ అని తెలిపారు శ్రీనివాస్‌రెడ్డి. పనివేళలు ఉండవు... ఏ ఉద్యోగంలోనైనా పనివేళలు ఉంటా యి. కానీ రాత్రి పగలు, ఎండా వానలు ఏదీ పట్టని వృత్తి వీరిది. వచ్చిన సందర్శకులకు తమవంతు పరిజ్ఞానం అందించామా లేదా అనే విషయం ఒక్కటే మైండ్‌లో ఉంటుందని తెలిపిన ఈ యాత్రా మార్గదర్శకులు దాదాపు రెండు దశాబ్దాలుగా ఇదే వృత్తిలో ఉన్నారు. పదిహేనేళ్లు టూర్ గైడ్‌గా ఉన్న శ్రీను మాట్లాడుతూ-‘విదేశాల నుంచి ఫిషరీస్ అసోషియేషన్ గ్రూప్ ఒకటి సముద్ర జీవుల ఫొటోగ్రఫీ కోసం వచ్చింది. వారికి కాకినాడ నుంచి ఇచ్చాపురం వరకు కోస్తా తీర ప్రాంతంలోని ఫిషరీ పాయింట్స్ ఎన్ని ఉన్నాయో పది రోజులపాటు నిద్రాహారాలు మాని, ఆయా ప్రాంతాలలో రెక్కీ నిర్వహించి వివరాలన్నీ సేకరించాను. పదిరోజుల పాటు ఆ బృందం ఇక్కడే ఉండి, తిరిగి వెళ్లేవరకు అన్నివేళలా అప్రమత్తంగా ఉన్నాను. వెళ్లేముందు వారి అభినందనలు అందు కున్నాను’ అని తెలిపారు. ప్రయాణం తర్వాతా కొనసాగే బంధం... నిన్నటికి ఈ రోజుకే అనుబంధాలలో ఎన్నో తేడాలు వచ్చేస్తున్న రోజులివి. ఒకసారి కలిస్తే వెంటనే మర్చిపోయే తీరికలేని రోజులు కూడా! ఇరవై ఏళ్లుగా టూర్గైడ్గా ఉన్న వెంకటేశ్వర్లు మాట్లాడుతూ- ‘పర్యటనలలో యాత్రికులలో ఒకరిగా కలిసిపోతాం. వారు తమ ఇళ్లకు, దేశాలకు వెళ్లాక కూడా మెయిల్స్, ఫోన్లు, ఇంటర్నెట్ చాటింగ్‌ల ద్వారా పలకరిస్తూనే ఉంటారు. కొందరు పదేసిసార్లు మన దేశానికి వస్తుంటారు. అప్పు డు మా పేరు చెప్పి, మేమే గైడ్‌గా కావాలని కోరుకుంటూ ఉంటారు’ అని ఆనందంగా తెలిపారు. అబద్దం చెబితే అంతే..! విధి నిర్వహణలో అబద్ధాలు, పొరపాట్లు చాలా సాధారణమనే విషయం మనందరికీ తెలిసిందే! కానీ, ఈ వృత్తిలో ఉన్నవారు మాత్రం అబద్ధాలకు, పొరపాట్లకు ఆమడదూరంలో ఉండాలంటున్నారు వీరు. ‘పర్యాటకులు అడిగిన ప్రశ్నలకు సమాధానం తెలియకపోతే ‘తెలుసుకొని చెబుతాం’ అని చెప్పాలి. అంతే తప్ప, తప్పుడు సమాచారం ఇవ్వకూడదు. దాని వల్ల ఒక దేశ చరిత్ర ను విదేశీయుడు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అలాగే పంక్చువాలిటీనీ కచ్చితంగా పాటించాలి. ట్రావెల్ గ్రూప్‌లో ఉన్నవారిలో ఒకరో ఇద్దరో అసహనంగా ఉంటారు. ఏ చిన్న అసౌకర్యం కలిగినా కోపాన్ని ప్రదర్శిస్తుంటారు. అసౌకర్యం నుంచి పర్యాటకుడిని ఎలా తప్పించాలో తెలుసుండా లి’ అంటూ తమ విధిలో కలిగే సాదకబాధకాలను ఒకరొకరుగా వివరించారు. ఇంటికి దూరం... ఉద్యోగంలో ఎన్నో సాదకబాధకాలు ఉన్నా ఇంటికి చేరుకోగానే అన్నీ మర్చిపోతారు. అలసట నుంచి విశ్రాంతి పొందుతారు. కానీ వీరి జీవనశైలి అందుకు భిన్నంగా ఉంటుంది. సంవత్సరంలో ఏడు నెలల పాటు వీరికి ప్రయాణంలోనే రోజులు గడచిపోతాయి. ఇదే విషయం టూర్ గైడ్ కరుణానిధి చెబుతూ- ‘పండగలు, పర్వదినాల సమయంలోనే విదేశీ పర్యాటకులతో టూర్స్ ఉంటాయి. దాంతో పండగ పూట ఇంట్లో ఉండం. విధిలో భాగంగా ఎన్నో చోట్ల తిరుగుతుంటాం కాబట్టి, కుటుంబసభ్యులతో మళ్లీ టూర్లకు వెళ్లడం కష్టమే! భోజనానికి, నిద్రకు వేళపాళలు ఉండవు. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కొన్ని ఆనందాలను త్యాగం చేస్తే తప్ప ఈ వృత్తిలో విజయం సాధించలేం’ అని తెలిపిన వీరే ‘ఈ వృత్తిలో ఎంత రిస్క్ ఉంటుందో అంత ఆసక్తి ఉంటుంది. కొత్త విషయాలు, చూడదగిన ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు.. జ్ఞానసముపార్జనకు వేదికలు అవుతాయి’ అని వివరించారు. అరుదైన గౌరవం... ‘రెండేళ్ల క్రితం టెక్స్టైల్ టూర్ పేరిట ఇంటర్నేషనల్ ఎవియేట్ కంపెనీ వాళ్లు న్యూయార్క్ నుంచి మన రాష్ట్రానికి ఐదు రోజుల పర్యటనకు వచ్చారు. పోచంపల్లి, పెడన... ప్రదేశాలను చూపుతూ, మన దగ్గర ఉన్న వస్త్రపరిశ్రమకు సంబంధించి వారికి పూర్తి సమాచారం అందించాను. వారు చాలా ఇంప్రెస్ అయ్యారు. న్యూయార్క్ టెక్స్టైల్ మ్యూజియంలో నాకు మెంబర్షిప్ ఇచ్చారు’అని వెంకటేశ్వర్లు ఆనందంగా తెలిపారు. ఒక ప్రాంతంలోని సంస్కృతీ సంప్రదాయాలు, చారిత్రక కట్టడాలను చూసి రావడంతోనే పర్యటన పూర్తవదు. మనసుతో దర్శించాలి, మైండ్‌తో మూలాలను అన్వేషించాలి. నిరంతర అన్వేషకులకు నిరంతర పరిశోధనతో మార్గం చూపే రహదారులు ఈ టూర్గైడ్లు. - నిర్మలారెడ్డి గైడ్స్ నియామకం ఇలా ప్రాంతం, రాష్ట్రం, స్మారక కట్టడాలకు సంబంధించి విడివిడిగా గైడ్స్ ఉంటారు. వీరిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజమ్ అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ (ఐఐటిటిఎమ్) రాతపరీక్ష, ఇంటర్వ్యూ, శిక్షణ ఆధారంగా నియమిస్తుంది. ట్రావెల్ గైడ్ పరీక్షకు కనీస వయోపరిమితి 20 నుంచి 65 సంవత్సరాలు. ఏదైనా అంశంలో డిగ్రీ స్థాయిలో పట్టభద్రులై ఉండాలి. ప్రాంతీయ భాషతో పాటు ఆంగ్లం, ఇతర విదేశీ భాషలలో ప్రావీణ్యం ఉండటం అవసరం. ఐఐటిటిఎమ్ క్యాంపస్‌లు గ్వాలియర్, భువనేశ్వర్, గోవా, న్యూ ఢిల్లీ మరియు నెల్లూరులలో ఉన్నాయి. గైడ్స్ ఆవశ్యకతను బట్టి ఐఐటిటిఎమ్ ప్రవేశపరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. టూరిస్ట్ గైడ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గైడ్ ఫీ ప్రకారం పర్యటనల ఆధారంగా జీతభత్యాలు ఉంటాయి. మరిన్ని వివరాలకు guidesadmission@gmail.comకి మీ సందేహాలను తెలియజేసి, సమాధానాలను పొందవచ్చు. ఇండియా టూరిజమ్ పర్యాటక భవన్ వారి ఫోన్ నెం. 040-23409199 -
అందుకే పవన్‌కల్యాణ్, నేను మంచి ఫ్రెండ్స్ అయ్యాం!
ఇందపరంద ఇంద చాట... కాట్రవల్లీ... లచ్చిమీ లచ్చిమీ... బాగున్నారా బాగున్నారా... అంటూ తెరపై అలీ చేసే చిన్నెలు ఒకటా రెండా! నవ్వించడం కోసమే దేవుడు పుట్టించాడా? అన్నట్టుగా ఉంటుంది అలీ ఫేస్‌కట్. ఊహ తెలిసినప్పట్నుంచీ ఆయన నవ్విస్తూనే ఉన్నారు. సంతోషానికి సూచిక నవ్వు. చిన్నప్పట్నుంచీ ఆ నవ్వుతోనే తన సావాసం. ఇంతకంటే అదృష్టం ఏం కావాలి. 34 ఏళ్ల సుదీర్ఘ నట ప్రస్థానం.. వెయ్యికి పైగా సినిమాలు.. అందులో యాభై హీరోగా. బహుశా ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న కమెడియన్ ఎవరూ లేరేమో! నటన అలీలోని ఓ కోణం. తండ్రి పేరు మీద స్వచ్చందంగా సేవాకార్యక్రమాలు నిర్వహించడం అలీలోని రెండో కోణం. ఈ నెల 21న ఆయన కథానాయకునిగా నటించిన ‘అలీబాబా ఒక్కడే దొంగ’ సినిమా విడుదల కానుంది. ఈ సందర్బంగా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో విలేకరులతో ముచ్చటించారు అలీ. ఇదే ప్రదేశంలో... 1994లో ఇప్పుడు మనం కూర్చున్న ప్రదేశంలోనే (అన్నపూర్ణ స్టూడియో) ‘యమలీల’ ఓపెనింగ్ జరిగింది. ఆ ముహూర్తం వేళా విశేషమో ఏమో... యాభై సినిమాల్లో హీరోగా చేశాను. మళ్లీ అదే ప్రదేశంలో నా 50వ సినిమా ‘అలీబాబా ఒక్కడే దొంగ’ చిత్రీకరణ పూర్తయింది. సెంటిమెంట్ ప్రకారం తప్పకుండా ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని నా నమ్మకం. అలీబాబాతో అనుబంధం ఈనాటిది కాదు.. ఎప్పుడో చిన్నప్పుడు ‘అలీబాబా 40 దొంగలు’ సినిమా చూశాను. ఎన్టీఆర్‌గారిది. పెద్ద హిట్. తర్వాత మా గురువుగారు ఈవీవీ ‘అలీబాబా అరడజను దొంగలు’ చేశారు. అందులోని అరడజను దొంగల్లో నేనూ ఒకణ్ణి. ఇప్పుడు ‘అలీబాబా ఒక్కడే దొంగ’. ఈ టైటిల్ సూచించింది. మా నిర్మాత బొండేడ శివాజీ. టైటిల్ బాగుంది. సెంటిమెంటల్‌గా కూడా వర్కవుట్ అవుతుందనిపించి ‘ఓకే’ చేశాం. హీరోగా సక్సెస్‌లను ఒక్కసారి పరిశీలిస్తే.. వాటిలో కేవలం కామెడీ మాత్రమే కాకుండా, ఏదో బలమైన పాయింట్ ఉంటుంది. అలాగే ఇందులో కూడా ఉంది. అదే సిస్టర్ సెంటిమెంట్. ఏటీఎం చుట్టూ తిరిగే కథ ఇందులో నేను దొంగనా? కాదా? అనేది మీరు తెరపైనే చూడాలి. ఇక కథ విషయానికొస్తే... ఓ ఏటీఎం సెంటర్ చుట్టూ కథ తిరుగుతుంది. ఏటీఎం బాక్స్‌లో డబ్బును చేర్చే క్రమంలో ఉన్నట్టుండి డబ్బున్న పెట్టె మిస్ అవుతుంది. ఆ డబ్బు ఎలా మాయమైందనేది మిగిలిన కథ. ఇక నా పాత్ర విషయానికొస్తే... తెర తీయగానే.. పోలీస్ డ్రస్‌లో పవన్‌కల్యాణ్ కనిపిస్తాడు. తర్వాత అదే డ్రెస్‌లో మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్‌లు కనిపిస్తారు. పక్కన ఇంకో ప్లేస్ ఖాళీగా ఉంటుంది. అది నాదన్నమాట. పోలీస్ కావాలని సిటీ వస్తా. కానీ.. అనూహ్యమైన సమస్యల్లో ఇరుక్కుంటా. వంశీగారి సినిమాలకు పనిచేసిన అనుభవం దర్శకుడు ఫణిప్రకాష్కి బాగా కలిసొచ్చింది. ఇందులో ఆయన రాసిన డైలాగులన్నీ వంశీగారి సినిమా ఫక్కీలోనే ఉంటాయి. 300మంది జవాన్లు చుట్టుముట్టారు హిందీలో 30 సినిమాల్లో నటించా. ఇక తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో కూడా నటించా. నాకు తెలిసి ఇన్ని భాషల్లో నటించిన కమెడియన్ లేడు. ఓ విధంగా ఇది కూడా గిన్నిస్ రికార్డే. ఈ మధ్య జాతీయ చానళ్లు మన తెలుగు సినిమాలను డబ్ చేసేసి ప్రసారం చేస్తున్నాయి. దీని కారణంగా దేశం మారుమూల ప్రదేశాల్లోకెళ్లినా గుర్తు పట్టేస్తున్నారు. ఆ మధ్య ‘సాహసం’ షూటింగ్ పనిమీద లడక్ వెళ్లాను. అక్కడ మూడొందలమంది జవాన్లు చుట్టుముట్టేశారు. ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు. నిజంగా చాలా ఆనందం అనిపించింది. కోట బాబాయ్ భలే చెప్పాడు ఈ రోజుల్లో సినిమాలకు లాంగ్విటీ ఉండటం లేదు. ఓ సారి కోట శ్రీనివాసరావు బాబాయ్ అన్నారు. ‘ప్రస్తుత కాలంలో సినిమా మూడు వారాలు ఆడితే చాల్రా అబ్బాయ్’ అని. అదేంటి? అంటే... ‘మూడు వారాలంటే... శుక్రవారం, శనివారం, ఆదివారం. సోమవారం కూడా నిలబడ్డోడు మగాడు’ అన్నారు. ఆయన సరదాగా అన్నా అది నిజం. ‘అలీబాబా...’ నిలబడతాడనుకుంటున్నా. ఈ సినిమాకైతే ఇప్పటివరకూ రెమ్యునరేషన్ తీసుకోలా. సోమవారం కూడా సినిమా నిలబడ్డాక నిర్మాతను కలుస్తా (నవ్వుతూ). ఆ క్వాలిటీనే పవన్‌కి నచ్చి ఉంటుంది చిరంజీవిగారి ‘ముగ్గురుమొనగాళ్లు సినిమా సమయంలో నాకు పవన్‌కల్యాణ్ పరిచయమయ్యారు. అప్పుడు నేను మద్రాస్‌లో ఉండేవాణ్ణి. ఆయన తొలి, మలి సినిమాలు ‘అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి’, ‘గోకులంలో సీత’ల్లో నేను లేను. ‘సుస్వాగతం’ మేం కలిసి నటించిన తొలి సినిమా. ‘తొలిప్రేమ’లో మా ఇద్దరిపై సన్నివేశాలెక్కువ. అలా మా స్నేహం బలపడింది. ఇక అప్పట్నుంచి పవన్ చేసిన ప్రతి సినిమాలో నేనున్నా. మా ఇద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుందని చాలామంది అంటుంటారు. బంధాలకు, అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే మనిషి పవన్‌కల్యాణ్. అమ్మ, నాన్న. అన్న... ఇలా ప్రతి బంధాన్నీ ప్రేమిస్తాడు. దాదాపు నేనూ అంతే. నా కుటుంబాన్ని అమితంగా ప్రేమిస్తా. నాలోని ఆ క్వాలిటీనే పవన్‌కి నచ్చి ఉంటుంది. అందుకే మేమిద్దరం మిత్రులమయ్యాం. కొండంత సంతృప్తినిస్తున్నాయి మా నాన్నగారి పేరుతో మహ్మద్ బాషా చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశాను. ప్రతి ఏడాదీ ఆయన పుట్టినరోజుని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. వికలాంగులకు వీల్చైర్లు అందించడంతో పాటు కేన్సర్ రోగులకు మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నాను. అలాగే, మూగ, చెవిటి విద్యార్థుల కోసం మూడు లక్షలతో గత ఏడాది ఓ పరికరాన్ని కొనుగోలు చేశాను. దాని వల్ల కొందరు పిల్లలకు మాటలు రావడం కొండంత సంతృప్తినిచ్చింది. అలాగే పలు చోట్ల మంచినీటి కుళాయిలను కూడా ఏర్పాటు చేశా. మున్ముందూ ఇంకా చేస్తా. ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ.. ఎన్నికల్లో పోటీ చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నా. అయితే... గెలవడానికి సొంత డబ్బుని ఖర్చు చేయమంటే మాత్రం నేనొప్పుకోను. పోటీ చేసి, గెలిచేంత ఆర్థిక బలాన్ని పార్టీ అందిస్తే... ఎన్నికల్లో నిలబడటానికి నేను రెడీ. గతంలో జరిగిన కొన్ని అనుభవాల కారణంగా రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ప్రజాసేవ చేయడం అంటే నాకిష్టం. దానికి రాజకీయాలే వేదిక అయితే, ఇంకా ఆనందమే.