అందుకే పవన్‌కల్యాణ్, నేను మంచి ఫ్రెండ్స్ అయ్యాం! | I and Pawan kalyan good friends, says Ali | Sakshi
Sakshi News home page

అందుకే పవన్‌కల్యాణ్, నేను మంచి ఫ్రెండ్స్ అయ్యాం!

Published Tue, Feb 18 2014 11:51 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

అందుకే పవన్‌కల్యాణ్, నేను మంచి ఫ్రెండ్స్ అయ్యాం! - Sakshi

అందుకే పవన్‌కల్యాణ్, నేను మంచి ఫ్రెండ్స్ అయ్యాం!

 ఇందపరంద ఇంద చాట... కాట్రవల్లీ... లచ్చిమీ లచ్చిమీ... బాగున్నారా బాగున్నారా... అంటూ తెరపై అలీ చేసే చిన్నెలు ఒకటా రెండా! నవ్వించడం కోసమే దేవుడు పుట్టించాడా? అన్నట్టుగా ఉంటుంది అలీ ఫేస్‌కట్. ఊహ తెలిసినప్పట్నుంచీ ఆయన నవ్విస్తూనే ఉన్నారు. సంతోషానికి సూచిక నవ్వు. చిన్నప్పట్నుంచీ ఆ నవ్వుతోనే తన సావాసం. ఇంతకంటే అదృష్టం ఏం కావాలి. 34 ఏళ్ల సుదీర్ఘ నట ప్రస్థానం.. వెయ్యికి పైగా సినిమాలు.. అందులో యాభై హీరోగా. బహుశా ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న కమెడియన్ ఎవరూ లేరేమో! నటన అలీలోని ఓ కోణం. తండ్రి పేరు మీద స్వచ్చందంగా సేవాకార్యక్రమాలు నిర్వహించడం అలీలోని రెండో కోణం. ఈ నెల 21న ఆయన కథానాయకునిగా నటించిన ‘అలీబాబా ఒక్కడే దొంగ’ సినిమా విడుదల కానుంది. ఈ సందర్బంగా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో విలేకరులతో ముచ్చటించారు అలీ.

 
 ఇదే ప్రదేశంలో...

 1994లో ఇప్పుడు మనం కూర్చున్న ప్రదేశంలోనే (అన్నపూర్ణ స్టూడియో) ‘యమలీల’ ఓపెనింగ్ జరిగింది. ఆ ముహూర్తం వేళా విశేషమో ఏమో... యాభై సినిమాల్లో హీరోగా చేశాను. మళ్లీ అదే ప్రదేశంలో నా 50వ సినిమా ‘అలీబాబా ఒక్కడే దొంగ’ చిత్రీకరణ పూర్తయింది. సెంటిమెంట్ ప్రకారం తప్పకుండా ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని నా నమ్మకం.

 అలీబాబాతో అనుబంధం ఈనాటిది కాదు..

 ఎప్పుడో చిన్నప్పుడు ‘అలీబాబా 40 దొంగలు’ సినిమా చూశాను. ఎన్టీఆర్‌గారిది. పెద్ద హిట్. తర్వాత మా గురువుగారు ఈవీవీ ‘అలీబాబా అరడజను దొంగలు’ చేశారు. అందులోని అరడజను దొంగల్లో నేనూ ఒకణ్ణి. ఇప్పుడు ‘అలీబాబా ఒక్కడే దొంగ’. ఈ టైటిల్ సూచించింది. మా నిర్మాత బొండేడ శివాజీ. టైటిల్ బాగుంది. సెంటిమెంటల్‌గా కూడా వర్కవుట్ అవుతుందనిపించి ‘ఓకే’ చేశాం. హీరోగా సక్సెస్‌లను ఒక్కసారి పరిశీలిస్తే.. వాటిలో కేవలం కామెడీ మాత్రమే కాకుండా, ఏదో బలమైన పాయింట్ ఉంటుంది. అలాగే ఇందులో కూడా ఉంది. అదే సిస్టర్ సెంటిమెంట్.

 ఏటీఎం చుట్టూ తిరిగే కథ

 ఇందులో నేను దొంగనా? కాదా? అనేది మీరు తెరపైనే చూడాలి.
 ఇక కథ విషయానికొస్తే... ఓ ఏటీఎం సెంటర్ చుట్టూ కథ తిరుగుతుంది. ఏటీఎం బాక్స్‌లో డబ్బును చేర్చే క్రమంలో ఉన్నట్టుండి డబ్బున్న పెట్టె మిస్ అవుతుంది. ఆ డబ్బు ఎలా మాయమైందనేది మిగిలిన కథ. ఇక నా పాత్ర విషయానికొస్తే... తెర తీయగానే.. పోలీస్ డ్రస్‌లో పవన్‌కల్యాణ్ కనిపిస్తాడు. తర్వాత అదే డ్రెస్‌లో మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్‌లు కనిపిస్తారు. పక్కన ఇంకో ప్లేస్ ఖాళీగా ఉంటుంది. అది నాదన్నమాట. పోలీస్ కావాలని సిటీ వస్తా. కానీ.. అనూహ్యమైన సమస్యల్లో ఇరుక్కుంటా. వంశీగారి సినిమాలకు పనిచేసిన అనుభవం దర్శకుడు ఫణిప్రకాష్‌కి బాగా కలిసొచ్చింది. ఇందులో ఆయన రాసిన డైలాగులన్నీ వంశీగారి సినిమా ఫక్కీలోనే ఉంటాయి.

 300మంది జవాన్లు చుట్టుముట్టారు

 హిందీలో 30 సినిమాల్లో నటించా. ఇక తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో కూడా నటించా. నాకు తెలిసి ఇన్ని భాషల్లో నటించిన కమెడియన్ లేడు. ఓ విధంగా ఇది కూడా గిన్నిస్ రికార్డే. ఈ  మధ్య జాతీయ చానళ్లు మన తెలుగు సినిమాలను డబ్ చేసేసి ప్రసారం చేస్తున్నాయి. దీని కారణంగా దేశం మారుమూల ప్రదేశాల్లోకెళ్లినా గుర్తు పట్టేస్తున్నారు. ఆ మధ్య ‘సాహసం’ షూటింగ్ పనిమీద లడక్ వెళ్లాను. అక్కడ మూడొందలమంది జవాన్లు చుట్టుముట్టేశారు. ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు. నిజంగా చాలా ఆనందం అనిపించింది.

 కోట బాబాయ్ భలే చెప్పాడు

 ఈ రోజుల్లో సినిమాలకు లాంగ్విటీ ఉండటం లేదు. ఓ సారి కోట శ్రీనివాసరావు బాబాయ్ అన్నారు. ‘ప్రస్తుత  కాలంలో సినిమా మూడు వారాలు ఆడితే చాల్రా అబ్బాయ్’ అని. అదేంటి? అంటే... ‘మూడు వారాలంటే... శుక్రవారం, శనివారం, ఆదివారం. సోమవారం కూడా నిలబడ్డోడు మగాడు’ అన్నారు. ఆయన సరదాగా అన్నా అది నిజం. ‘అలీబాబా...’ నిలబడతాడనుకుంటున్నా. ఈ సినిమాకైతే ఇప్పటివరకూ రెమ్యునరేషన్ తీసుకోలా. సోమవారం కూడా సినిమా నిలబడ్డాక నిర్మాతను కలుస్తా (నవ్వుతూ).

 ఆ క్వాలిటీనే పవన్‌కి నచ్చి ఉంటుంది

 చిరంజీవిగారి ‘ముగ్గురుమొనగాళ్లు సినిమా సమయంలో నాకు పవన్‌కల్యాణ్ పరిచయమయ్యారు. అప్పుడు నేను మద్రాస్‌లో ఉండేవాణ్ణి. ఆయన తొలి, మలి సినిమాలు ‘అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి’, ‘గోకులంలో సీత’ల్లో నేను లేను. ‘సుస్వాగతం’ మేం కలిసి నటించిన తొలి సినిమా. ‘తొలిప్రేమ’లో మా ఇద్దరిపై సన్నివేశాలెక్కువ. అలా మా స్నేహం బలపడింది. ఇక అప్పట్నుంచి పవన్ చేసిన ప్రతి సినిమాలో నేనున్నా. మా ఇద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుందని చాలామంది అంటుంటారు. బంధాలకు, అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే మనిషి పవన్‌కల్యాణ్. అమ్మ, నాన్న. అన్న... ఇలా ప్రతి బంధాన్నీ ప్రేమిస్తాడు. దాదాపు నేనూ అంతే. నా కుటుంబాన్ని అమితంగా ప్రేమిస్తా. నాలోని ఆ క్వాలిటీనే పవన్‌కి నచ్చి ఉంటుంది. అందుకే మేమిద్దరం మిత్రులమయ్యాం.

 కొండంత సంతృప్తినిస్తున్నాయి

 మా నాన్నగారి పేరుతో మహ్మద్ బాషా చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశాను. ప్రతి ఏడాదీ ఆయన పుట్టినరోజుని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. వికలాంగులకు వీల్‌చైర్లు అందించడంతో పాటు కేన్సర్ రోగులకు మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నాను. అలాగే, మూగ, చెవిటి విద్యార్థుల కోసం మూడు లక్షలతో గత ఏడాది ఓ పరికరాన్ని కొనుగోలు చేశాను. దాని వల్ల కొందరు పిల్లలకు మాటలు రావడం కొండంత సంతృప్తినిచ్చింది. అలాగే పలు చోట్ల మంచినీటి కుళాయిలను కూడా ఏర్పాటు చేశా. మున్ముందూ ఇంకా చేస్తా.

 ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ..

 ఎన్నికల్లో పోటీ చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నా. అయితే... గెలవడానికి సొంత డబ్బుని ఖర్చు చేయమంటే మాత్రం నేనొప్పుకోను. పోటీ చేసి, గెలిచేంత ఆర్థిక బలాన్ని పార్టీ అందిస్తే... ఎన్నికల్లో నిలబడటానికి నేను రెడీ. గతంలో జరిగిన కొన్ని అనుభవాల కారణంగా రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ప్రజాసేవ చేయడం అంటే నాకిష్టం. దానికి రాజకీయాలే వేదిక అయితే, ఇంకా ఆనందమే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement