మనయాత్రలో మంచి మిత్రులు.. | Manayatra good friends .. | Sakshi
Sakshi News home page

మనయాత్రలో మంచి మిత్రులు..

Published Thu, Jul 31 2014 11:53 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

మనయాత్రలో మంచి మిత్రులు.. - Sakshi

మనయాత్రలో మంచి మిత్రులు..

టూర్ గైఢ్స్
 
ఎల్లలను చెరిపేసి అనుబంధాలకు వారిధిలా, కొత్త ప్రదేశాల సందర్శనకు సారధిలా, చారిత్రక నిర్మాణాల అవగాహనకు విజ్ఞాన గనిలా, సాంస్కృతిక వైభవాన్ని పర్యాటకులకు తెలిపే సంపదలా.. వీటన్నింటినీ మించి యాత్రలో మనకు దిశానిర్దేశం చేసే మంచి మిత్రులుగా విభిన్నరకాల పాత్రలను పోషిస్తున్నవారు టూర్ గైడ్స్! పర్యటనలో చిక్కులను తొలగించి మార్గాన్ని సుగమం చేస్తున్నారు.
 
దక్షిణాఫ్రికాలోని డర్బన్ నుంచి ఒక కుటుంబం తమ మూలాలను వెతుక్కుంటూ మనదేశానికి వచ్చింది. వాళ్ల పూర్వీకులలో ఒకరు 1905లో అనకాపల్లికి 40 కి.మీ దూరంలో ఉన్న జంపన అనే కుగ్రామం నుంచి దక్షిణాఫ్రికా వెళ్లి, అక్కడే స్థిరపడ్డారట. తమ మూలాలు భారత్‌లో ఉన్నాయనే విషయం వందేళ్ల తర్వాత వారి మనమలకు ఒక పేపర్ కటింగ్ ద్వారా తెలిసి, జంపన అనే ఊరు తెలుసుకోవడానికి మనదేశం వచ్చారు. ఆ ఊళ్లోనూ, చుట్టుపక్కల ఊళ్లలోనూ వీరికి సంబంధించిన కుటుంబీకులను కలుసుకొని, ఆ ఉద్వేగంలో కన్నీటి పర్యంతమయ్యారు. ‘హృదయాన్ని కదలించిన ఆ సంఘటన నాకూ కంట నీరు తెప్పించింది’ అంటూ గుర్తుచేసుకున్నారు టూర్ గైడ్ సుబ్రహ్మణ్యం. ఇలాంటి అనుభవాలు ఉన్న గైడ్స్ మన దేశంలో 2,500 మంది అధికారికంగా ఉన్నారు. అయితే, తెలుగు రాష్ట్రాలలో వీరి సంఖ్య ఎనిమిదే! ఇరు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలకు చెందిన వీరు ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్నారు.
 
నిరంతర పరిశోధన...
 
ప్రభుత్వ ఉద్యోగంలో చేరగానే పనిలేకపోయినా నెలసరి జీతం వచ్చేస్తుంది అనుకునేవారికి నప్పనిది ఈ గైడ్ ప్రొఫెషన్. పర్యటనలో ఉన్నా, ఇంట్లో ఉన్నా.. వీరి ఆలోచనలెప్పుడూ పర్యాటకులకు చూపించబోయే సందర్శన స్థలాలమీదనే ఉంటుంది. చారిత్రక కట్టడాల చుట్టూతానే తిరుగుతుంటుంది. ఏ పర్యాటకుడు ఏ ప్రశ్న వేస్తాడో తెలియదు. దానికి తగిన సమాధానం ఇవ్వడానికి మాత్రం ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారు. ‘రోజులో కనీసం 5-6 గంటలు పుస్తకాలు చదువుతూ, విషయాలు శోధిస్తూనే ఉంటాం’ అన్నారు మధు. ఇదే విషయంపై అరవపల్లి శ్రీను మాట్లాడుతూ- ‘విదేశీ పర్యాటకలకు ప్రతిది తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ. వారిని గైడ్‌గా రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి వచ్చే ప్రశ్నల పరంపరకు సమాధానాలు చెబుతూనే ఉండాలి. అడిగిన ప్రశ్నలకు  ఏ మాత్రం  సరైన సమాధానాలు చెప్పకపోయినా వారు వెంటనే మరో గైడ్‌ను వెతుక్కుంటారు. అందుకే ఈ వృత్తి ఎప్పటికప్పుడు మాకు ఒక సవాల్‌గానే ఉంటుంది’ అని తెలిపారు. ‘ఒక విదేశీయుడు అంతరించిపోతున్న బట్టమేక పక్షి కోసం మన రాష్ట్రానికి వచ్చాడు. ఆ పక్షిని వెతకడానికి నాకు రెండు రోజులు పట్టింది. చివరకు నందికొట్కూరులో ఉందని తెలిసింది. అతన్ని తీసుకొని, ఆ పక్షి కోసం బయల్దేరాను. ముందుగా ఆ పక్షి గురించి వివరాలన్నీ తెలుసుకొని, అతనికి సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వగలిగాను’ అని తెలిపారు శ్రీనివాస్‌రెడ్డి.
 
పనివేళలు ఉండవు...
 
ఏ ఉద్యోగంలోనైనా పనివేళలు ఉంటా యి. కానీ రాత్రి పగలు, ఎండా వానలు ఏదీ పట్టని వృత్తి వీరిది. వచ్చిన సందర్శకులకు తమవంతు పరిజ్ఞానం అందించామా లేదా అనే విషయం ఒక్కటే మైండ్‌లో ఉంటుందని తెలిపిన ఈ యాత్రా మార్గదర్శకులు దాదాపు రెండు దశాబ్దాలుగా ఇదే వృత్తిలో ఉన్నారు. పదిహేనేళ్లు టూర్ గైడ్‌గా ఉన్న శ్రీను మాట్లాడుతూ-‘విదేశాల నుంచి ఫిషరీస్ అసోషియేషన్ గ్రూప్ ఒకటి సముద్ర జీవుల ఫొటోగ్రఫీ కోసం వచ్చింది. వారికి కాకినాడ నుంచి ఇచ్చాపురం వరకు కోస్తా తీర ప్రాంతంలోని ఫిషరీ పాయింట్స్ ఎన్ని ఉన్నాయో పది రోజులపాటు నిద్రాహారాలు మాని, ఆయా ప్రాంతాలలో రెక్కీ నిర్వహించి వివరాలన్నీ సేకరించాను. పదిరోజుల పాటు ఆ బృందం ఇక్కడే ఉండి, తిరిగి వెళ్లేవరకు అన్నివేళలా అప్రమత్తంగా ఉన్నాను. వెళ్లేముందు వారి అభినందనలు అందు కున్నాను’ అని తెలిపారు.
 
ప్రయాణం తర్వాతా కొనసాగే బంధం...
 
నిన్నటికి ఈ రోజుకే అనుబంధాలలో ఎన్నో తేడాలు వచ్చేస్తున్న రోజులివి. ఒకసారి కలిస్తే వెంటనే మర్చిపోయే తీరికలేని రోజులు కూడా! ఇరవై ఏళ్లుగా టూర్‌గైడ్‌గా ఉన్న వెంకటేశ్వర్లు మాట్లాడుతూ- ‘పర్యటనలలో యాత్రికులలో ఒకరిగా కలిసిపోతాం. వారు తమ ఇళ్లకు, దేశాలకు వెళ్లాక కూడా మెయిల్స్, ఫోన్లు, ఇంటర్‌నెట్ చాటింగ్‌ల ద్వారా పలకరిస్తూనే ఉంటారు. కొందరు పదేసిసార్లు మన దేశానికి వస్తుంటారు. అప్పు డు మా పేరు చెప్పి, మేమే గైడ్‌గా కావాలని కోరుకుంటూ ఉంటారు’ అని ఆనందంగా తెలిపారు.
 
అబద్దం చెబితే అంతే..!
 
విధి నిర్వహణలో అబద్ధాలు, పొరపాట్లు చాలా సాధారణమనే విషయం మనందరికీ తెలిసిందే! కానీ, ఈ వృత్తిలో ఉన్నవారు మాత్రం అబద్ధాలకు, పొరపాట్లకు ఆమడదూరంలో ఉండాలంటున్నారు వీరు. ‘పర్యాటకులు అడిగిన ప్రశ్నలకు సమాధానం తెలియకపోతే ‘తెలుసుకొని చెబుతాం’ అని చెప్పాలి. అంతే తప్ప, తప్పుడు సమాచారం ఇవ్వకూడదు. దాని వల్ల ఒక దేశ చరిత్ర ను విదేశీయుడు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అలాగే పంక్చువాలిటీనీ కచ్చితంగా పాటించాలి. ట్రావెల్ గ్రూప్‌లో ఉన్నవారిలో ఒకరో ఇద్దరో అసహనంగా ఉంటారు. ఏ చిన్న అసౌకర్యం కలిగినా కోపాన్ని ప్రదర్శిస్తుంటారు. అసౌకర్యం నుంచి పర్యాటకుడిని ఎలా తప్పించాలో తెలుసుండా లి’ అంటూ తమ విధిలో కలిగే సాదకబాధకాలను ఒకరొకరుగా వివరించారు.
 
ఇంటికి దూరం...
 
ఉద్యోగంలో ఎన్నో సాదకబాధకాలు ఉన్నా ఇంటికి చేరుకోగానే అన్నీ మర్చిపోతారు. అలసట నుంచి విశ్రాంతి పొందుతారు. కానీ వీరి జీవనశైలి అందుకు భిన్నంగా ఉంటుంది. సంవత్సరంలో ఏడు నెలల పాటు వీరికి ప్రయాణంలోనే రోజులు గడచిపోతాయి. ఇదే విషయం టూర్ గైడ్ కరుణానిధి చెబుతూ- ‘పండగలు, పర్వదినాల సమయంలోనే విదేశీ పర్యాటకులతో టూర్స్ ఉంటాయి. దాంతో పండగ పూట ఇంట్లో ఉండం. విధిలో భాగంగా ఎన్నో చోట్ల తిరుగుతుంటాం కాబట్టి, కుటుంబసభ్యులతో మళ్లీ టూర్లకు వెళ్లడం కష్టమే! భోజనానికి, నిద్రకు వేళపాళలు ఉండవు. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కొన్ని ఆనందాలను త్యాగం చేస్తే తప్ప ఈ వృత్తిలో విజయం సాధించలేం’ అని తెలిపిన వీరే ‘ఈ వృత్తిలో ఎంత రిస్క్ ఉంటుందో అంత ఆసక్తి ఉంటుంది. కొత్త విషయాలు, చూడదగిన ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు.. జ్ఞానసముపార్జనకు వేదికలు అవుతాయి’ అని వివరించారు.
 
అరుదైన గౌరవం...
 
‘రెండేళ్ల క్రితం టెక్స్‌టైల్ టూర్ పేరిట ఇంటర్నేషనల్ ఎవియేట్ కంపెనీ వాళ్లు న్యూయార్క్ నుంచి మన రాష్ట్రానికి ఐదు రోజుల పర్యటనకు వచ్చారు. పోచంపల్లి, పెడన... ప్రదేశాలను చూపుతూ, మన దగ్గర ఉన్న వస్త్రపరిశ్రమకు సంబంధించి వారికి పూర్తి సమాచారం అందించాను. వారు చాలా ఇంప్రెస్ అయ్యారు. న్యూయార్క్ టెక్స్‌టైల్ మ్యూజియంలో నాకు మెంబర్‌షిప్ ఇచ్చారు’అని వెంకటేశ్వర్లు ఆనందంగా తెలిపారు. ఒక ప్రాంతంలోని సంస్కృతీ సంప్రదాయాలు, చారిత్రక కట్టడాలను చూసి రావడంతోనే పర్యటన పూర్తవదు. మనసుతో దర్శించాలి, మైండ్‌తో మూలాలను అన్వేషించాలి. నిరంతర అన్వేషకులకు నిరంతర పరిశోధనతో మార్గం చూపే రహదారులు ఈ టూర్‌గైడ్‌లు.
 
- నిర్మలారెడ్డి
 
 గైడ్స్ నియామకం ఇలా
ప్రాంతం, రాష్ట్రం, స్మారక కట్టడాలకు సంబంధించి విడివిడిగా గైడ్స్ ఉంటారు.
 
వీరిని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజమ్ అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్ (ఐఐటిటిఎమ్) రాతపరీక్ష, ఇంటర్వ్యూ, శిక్షణ ఆధారంగా నియమిస్తుంది.
 
 ట్రావెల్ గైడ్ పరీక్షకు కనీస వయోపరిమితి 20 నుంచి 65 సంవత్సరాలు. ఏదైనా అంశంలో డిగ్రీ స్థాయిలో పట్టభద్రులై ఉండాలి. ప్రాంతీయ భాషతో పాటు ఆంగ్లం, ఇతర విదేశీ భాషలలో ప్రావీణ్యం ఉండటం అవసరం.  
 
 ఐఐటిటిఎమ్ క్యాంపస్‌లు గ్వాలియర్, భువనేశ్వర్, గోవా, న్యూ ఢిల్లీ మరియు నెల్లూరులలో ఉన్నాయి.
 
 గైడ్స్ ఆవశ్యకతను బట్టి ఐఐటిటిఎమ్ ప్రవేశపరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
 
 టూరిస్ట్ గైడ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గైడ్ ఫీ ప్రకారం పర్యటనల ఆధారంగా జీతభత్యాలు ఉంటాయి.  
 
మరిన్ని వివరాలకు guidesadmission@gmail.comకి మీ సందేహాలను తెలియజేసి, సమాధానాలను పొందవచ్చు. ఇండియా టూరిజమ్ పర్యాటక భవన్ వారి ఫోన్ నెం. 040-23409199
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement