నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్, సౌతాఫ్రికా జట్లు ఇవాళ (నవంబర్ 8) తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. డర్బన్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని యాక్యూవెదర్ పేర్కొంది. మ్యాచ్ జరిగే సమయంలో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని సమాచారం. మ్యాచ్ ప్రారంభ సమయానికి 46 శాతం వర్షం పడే సూచనలు ఉన్నట్లు యాక్యూవెదర్ తెలిపింది.
మ్యాచ్ జరిగే సమయంలో ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్‌గా ఉండనున్నట్లు తెలుస్తుంది. రాత్రి 9:30 గంటల ప్రాంతంలో వర్షం పడే అవకాశాలు 51 శాతానికి పెరుగుతాయని సమాచారం. ఇవాళ ఉదయం నుంచి డర్బన్‌లో ఆకాశం మేఘావృతమై ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తంగా చూస్తే నేటి మ్యాచ్‌కు వర్షం అంతరాయాలు తప్పేలా లేవు.
కాగా, భారత్-సౌతాఫ్రికా చివరి సారి టీ20 ప్రపంచకప్ ఫైనల్లో తలపడిన విషయం తెలిసిందే. నాటి ఫైనల్లో భారత్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి ఛాంపియన్‌గా అవతరించింది. పొట్టి ప్రపంచ కప్ అనంతరం భారత్ టీ20ల్లో తిరుగులేని జట్టుగా ఉంది. సూర్యకుమార్ నేతృత్వంలో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. శ్రీలంకను వారి సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. తాజాగా బంగ్లాదేశ్‌ను సైతం మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో క్లీన్ స్వీప్ చేసింది.
దక్షిణాఫ్రికా విషయానికొస్తే.. ప్రొటీస్ జట్టు పసికూన ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్ టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. జట్ల బలాబలాల ప్రకారం చూస్తే.. ఇరు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి. ఇరు జట్లలో స్టార్ హిట్లర్లు ఉన్నారు. దక్షిణాఫ్రికా జట్టులో క్లాసెన్, మిల్లర్, మార్క్రమ్ ఉండగా.. టీమిండియాలో సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా లాంటి భారీ హిట్టర్లు ఉన్నారు. ఐపీఎల్ మెగా వేలం నేపథ్యంలో ఈ సిరీస్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సిరీస్‌లో రాణించిన ఆటగాళ్లపై ఐపీఎల్ ఫ్రాంచైజీలు కన్నేసే అవకాశం ఉంది. కాబట్టి ఇరు జట్ల ఆటగాళ్లు పోటీపడి సత్తా చాటాలని భావిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment