జొహనెస్‌బర్గ్ వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య ఇవాళ (నవంబర్ 15) నాలుగో టీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు ప్రారంభంకానుంది. నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. నేటి మ్యాచ్‌లో భారత్ గెలిస్తే సరికొత్త చరిత్ర సృష్టించినట్లవుతుంది.
ఈ మ్యాచ్ గెలుపుతో భారత్ సిరీస్‌ను కైవసం చేసుకోవడంతో పాటు సౌతాఫ్రికాపై టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా రికార్డు నెలకొల్పుతుంది. ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా జట్లు సౌతాఫ్రికాపై తలో 17 విజయాలు సాధించాయి. ఆస్ట్రేలియా సౌతాఫ్రికాపై 25 మ్యాచ్‌ల్లో 17 విజయాలు సాధిస్తే.. భారత్ 30 మ్యాచ్‌ల్లో 17 విజయాలు సాధించింది.
టీ20ల్లో సౌతాఫ్రికాపై అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో ఆస్ట్రేలియా, భారత్ తర్వాత వెస్టిండీస్ (14), ఇంగ్లండ్ (12), పాకిస్తాన్ (12), శ్రీలంక (5), న్యూజిలాండ్ (4), ఐర్లాండ్ (1), నెదర్లాండ్స్ (1) జట్లు ఉన్నాయి.
కాగా, సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ ఒకటి, మూడు మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. సౌతాఫ్రికా రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. చివరిగా జరిగిన మూడో టీ20లో భారత్ సౌతాఫ్రికాపై 11 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. తిలక్ వర్మ (107 నాటౌట్) శతక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ (50) ఆడాడు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా గెలుపు కోసం చివరి వరకు పోరాడినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. సౌతాఫ్రికా లక్ష్యానికి 12 పరుగుల దూరంలో నిలిచిపోయింది. మార్కో జన్సెన్ (54), హెన్రిచ్ క్లాసెన్ (41) దక్షిణాఫ్రికాను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. అర్షదీప్ సింగ్ 3 కీలక వికెట్లు తీసి దక్షిణాఫ్రికా గెలుపుకు అడ్డుకట్ట వేశాడు.
Comments
Please login to add a commentAdd a comment