జొహనెస్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా అతి భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. సంజూ శాంసన్, తిలక్ వర్మ విధ్వంసకర శతకాలతో శివాలెత్తిపోయారు.
సంజూ 55 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేయగా.. తిలక్ 41 బంతుల్లోనే 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో శతక్కొట్టాడు. తిలక్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ కాగా.. సంజూకు ఈ సిరీస్‌లో ఇది రెండో సెంచరీ. తొలి టీ20లో సెంచరీ అనంతరం సంజూ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌటయ్యాడు.
ఈ మ్యాచ్‌లో మొత్తం 56 బంతులు ఎదుర్కొన్న సంజూ 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేసి అజేయంగా నిలువగా.. తిలక్ 47 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 120 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ సైతం మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ 18 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 36 పరుగులు చేశాడు. సౌతాఫ్రికా బౌలర్లలో సిపామ్లాకు అభిషేక్ శర్మ వికెట్ దక్కింది. కాగా, నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.
తుది జట్లు...
భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(వికెట్‌కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్రమ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్‌కీపర్), డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, ఆండిల్ సైమ్‌లేన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, లూథో సిపమ్లా
Comments
Please login to add a commentAdd a comment