new places
-
ఆర్నెల్లలో అందుబాటులోకి రానున్న ప్రాజెక్టులు
-
విహారం సురక్షితం...
ట్రావెల్ టిప్స్ ఊళ్లు, కొత్త ప్రదేశాలకు వెళ్లేటప్పుడు ఇంటి రక్షణ కోసమే కాదు తమ గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ప్రయాణానికి ముందుగానే ప్రణాళిక అవసరం. వెళ్లిన చోట ఉండబోయే వసతి సదుపాయాలన్నీ ముందుగా బుక్ చేసుకొని, ఆ వివరాలన్నీ బుక్‌లో పొందుపరుచుకోవాలి. ఆ బుక్ కూడా ప్రయాణంలో మీతో పాటే ఉండాలి. రాత్రిళ్లు ప్రయాణం సుఖం అని చాలా మంది అనుకుంటారు. కానీ, అదంత క్షేమదాయకం కాదు. ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువ కాబట్టి, పగటి ప్రయాణాలను ఏవిధంగా ఆనందించాలి అనే విషయాల పట్ల అవగాహన పెంచుకోవాలి. మీరు దిగిన హోటల్లో మేనేజర్ని సంప్రదించి, స్థానికంగా ఏవి సురక్షితమైన ప్రదేశాలో కనుక్కొని వెళ్లడం క్షేమం. నగర శివార్లకు పిల్లలు, మహిళలు వెళ్లేటప్పుడు ఈ జాగ్రత్త మరింత అవసరం.మీ పాస్పోర్ట్సైజ్ ఫోటోతో సహా అన్ని డాక్యుమెంట్లు ప్రయాణంలో మీతో పాటు సురక్షితంగా ఉంచుకోవాలి. ఏదైనా అనుకోని ప్రమాదం వాటిల్లినప్పుడు పనులు వేగవంతం అవడానికి సహాయకారిగా ఉంటాయి. అత్యంత రద్దీగా ఉండే ఉండే ప్రదేశాలకు వెళ్లడం మానుకోవడమే సముచితం. -
మహిళా విహారం!
ట్రావెల్ గ్రూప్ అమ్మలు, అమ్మమ్మలు, నాయనమ్మలు కొత్త ప్రదేశాలు చుట్టిరావాలని, ప్రపంచ అద్భుతాలను కళ్లారా చూడాలని తపిస్తే... వయసుతో పనిలేకుండా వారితో అమ్మాయిలూ పోటీ పడితే.. నలభై మంది.. అంతా మహిళలే కలిసి ప్రపంచాన్ని చుట్టి రావాలనుకుంటే సాధ్యమయ్యే పనేనా? అంటే ‘సాధ్యమే’ అంటూ ఘంటాపథంగా చెబుతున్నారు ‘ఫన్ ట్రావెల్ గ్రూప్’లోని మహిళలంతా! హైదరాబాద్‌కు చెందిన నలభై మంది మహిళలు పన్నెండేళ్లుగా కొత్త ప్రదేశాలు చూసి రావడానికి ఎంచుకున్న మార్గం ఇలా మీ ముందు... చైనా, జపాన్, కాంబోడియా, టర్కీ, దక్షిణాఫ్రికా, రష్యా, అమెరికా... ఇలా ఇప్పటికే ప్రపంచపటంలోని 15 దేశాలను చుట్టొచ్చారు ఈ మహిళలంతా! ‘‘బాధ్యతలు అన్నీ తీరిపోయాయి. ఉన్న జీవితాన్ని ఆనందంగా మలచుకోవాలని కోరుకునేది ఈ వయసులోనే! కావల్సినంత తీరిక, కొత్త కొత్త ఆలోచనలు.. అన్నింటినీ పంచుకోవడానికి మాతో పాటు మరో ముప్పై మంది. లోకంలోని ఆనందాలను తనివితీరా చూసేందుకు ఒకరి నుంచి ఒకరం సిద్ధమై పోయాం. యేటి కేడాది ఈ సంఖ్య పెరుగు తూనే ఉంది. అభిరుచుల మేరకు, ఆరోగ్యాల తీరుకు ఒక్కోసారి తగ్గుతూ ఉంది.’’ అంటూ మొదలుపెట్టారు 80 ఏళ్ల వయసున్న శ్రీలతాదేవి. ముందు పది మందే... ఇల్లు, పిల్లలు, బాధ్యతలు.. వీటి నడుమే స్త్రీ జీవితం నడుస్తూ ఉంటుంది. ఇక దేశాలు చుట్టిరావడం అంటే అయ్యే పనికాదు. మరి వీరి వల్ల ఎలా సాధ్యమైంది? ఇదే విషయాన్ని ట్రావెల్ గ్రూప్ సభ్యులను అడిగితే- ‘‘ ఇప్పటి వరకు మా గ్రూప్‌కి ఒక పేరు అంటూ పెట్టుకోలేదు. కొత్త ప్రదేశాలను చూసొస్తే కొత్త శక్తి వస్తుంది. కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. స్త్రీల జీవితం అంటే ఎప్పుడూ ఇంటికే పరిమితమా? అని పన్నెండేళ్ల క్రితం పది మందితో మొదలుపెట్టాం’’ అంటూ తమ ప్రయాణ విశేషాలను వివరించడానికి ముందుకు వచ్చారు అనూరాధా రెడ్డి. హైదరాబాద్ ఇన్టాక్ కన్వీనర్‌గా ఉన్న అనూరాధారెడ్డి ఆసక్తితో మొదలుపెట్టిన ఈ లేడీస్ ట్రావెల్ ఇప్పుడు ప్రతియేటా కొత్త ఆనందాలను నింపుకోవడానికి సిద్ధపడుతోంది. అంతా బంధు, మిత్రులే! కొత్తగా పరిచయం అయినవారు తామూ వస్తామని ముందుకు వస్తున్నవారే! అలా ఇప్పటికి నలభై మంది అయ్యారు. అయితే వెళుతున్న ప్రాంతం, వారి వారి పరిస్థితులను బట్టి కొంతమంది డ్రాప్ అవుతుంటారు. కొంతమంది కొత్తవారు వచ్చి చేరుతుంటారు. అలా ఒక్కోసారి ట్రిప్‌కి పది మందే ఉండొచ్చు. కానీ ఏడాదికి ఒక దేశం అనే నియమం.. ముందే అంతా అనుకున్నాక నిర్ణయం అయిపోతుంది. ‘‘గెట్ టు గెదర్స్, వివాహ వేడుకలు, క్లబ్స్.. ఇలా ఏదో ప్లేస్‌లో అంతా కలుస్తూనే ఉంటాం. ఫోన్లు ఎలాగూ ఉన్నాయి. మాలో ఒకరికి వచ్చిన ఆలోచన ముందు అనూరాధ దగ్గరకే వెళుతుంది. తనకైతే చారిత్రక ప్రదేశాల పట్ల, ప్రపంచ దేశాల గురించి ఒక అవగాహన ఉంది. అందుకే అక్కడి పరిస్థితులు, చూడదగిన ప్రదేశాలు అన్నీ వాకబు చేశాక మాకు మెయిల్స్ ద్వారా సందేశం వస్తుంది. వాటిని బట్టి ఆసక్తి గల వారు ముందుకువస్తారు’’ అని వివరించారు సాధన విదరే. ఈ మహిళలలో ఎక్కువ శాతం గృహిణులే! కొంతమంది ఉద్యోగాలు చేసి, రిటైర్ అయిన వారూ ఉన్నారు. కాలేజీ చదువులు చదువుకుంటున్న ఒకరిద్దరు అమ్మాయిలూ ఉన్నారు. పక్కాగా ప్లానింగ్... ‘‘ట్రావెల్ టికెట్స్ ఇక్కడే కొనుగోలు చేస్తాం. వెళ్లబోయే చోట స్థానిక ట్రావెల్ ఏజెన్సీవారితో మాట్లాడం, అరేంజ్మెంట్స్ అన్నీ ముందుగా చేసుకుంటాం. అందుకే వెళ్లిన చోట సమస్యలేవీ ఎదురు కాలేదు’’ అంటారు వసంత జిన్నారెడ్డి. ‘‘దేశం కాని దేశం, ప్రాంతం కాని ప్రాంతం... అక్కడి వాతావరణానికి తగ్గట్టు ముందస్తు ప్రణాళిక ఉండాలి. దుస్తులతో పాటు స్వెటర్, శాలువా, గ్లౌజులతో అదనంగా తీసుకువెళతాం. ముందుగా ట్రావెల్ ఇన్సూరెన్స్‌లు చేయించుకుంటాం. ఈ కాలంలో ముప్పై ఏళ్లు దాటుతూనే బి.పిలు, షుగర్లు సాధారణమై పోయాయి. అందుకని ఆ మందులు, డాక్టర్ ముందస్తుగా సూచించిన తలనొప్పి, కడుపునొప్పికి సంబంధించిన మందులు ప్యాక్ చేసుకుంటాం. దీంతో పాటు డాక్టర్ రాసిచ్చిన చీటీ కూడా వెంటే ఉంచుకుంటాం. ఒకసారి ‘పెరూ’ దేశం వెళ్లాం. ఆ దేశంలో మేం వెళ్లిన ఒక చారిత్రక ప్రదేశం సముద్రమట్టానికి చాలా ఎత్తులో ఉంటుంది. ఆ వాతావరణం సరిపడక కనీసం మాలో నలుగురు మహిళలు జబ్బు పడ్డారు. అదంతా అటవీ ప్రాంతం. ఒకే ఒక చిన్న క్లినిక్ ఉంది. ఆ విషయం మాకు ముందుగానే తెలుసు. అందుకే మా జాగ్రత్తలో మేమున్నాం. కాబట్టి ఆ సమస్య నుంచి త్వరగానే బయటపడ్డాం’’ అన్నారు అనూరాధా రెడ్డి. ‘‘ఈ ఏడాది ఉజ్బెకిస్తాన్ వెళ్లినప్పుడు అక్కడ ఒక అటవీ ప్రాంతంలో తిరుగుతున్నాం. అక్కడి విశేషాలు తెలుసుకుంటూ నడుస్తున్నాం. అందులో ఒకామె కిందపడి చెయ్యి ఫ్రాక్చర్ అయ్యింది. చూస్తే ఒకే ఒక చిన్న క్లినిక్ ఉంది అక్కడ. అక్కడ చికిత్స తీసుకొని మేముండే చోటుకి వచ్చేసరికి అక్కడ డాక్టర్ రెడీగా ఉన్నాడు. మేం ఆశ్చర్యపోయాం. ఆ చిన్న క్లినిక్ నుంచి మా సమాచారం తెలుసుకొని, పట్టణంలో ఉన్న హోటల్వారికి తెలియజేసి, వెంటనే వైద్యసదుపాయం కల్పించారట. ఇలా ఏ దేశానికి వెళ్లినా అతిథుల (పర్యాటకులు)ను చాలా బాగా ఆదరించడం, ఎంతో గౌరవంగా చూడటం మేం చూశాం’’ అన్నారు మధ్యవయస్కురాలైన వసంత. విలువైన వస్తువులు తక్కువ... ‘‘బర్మాలో అన్‌కట్ రూబీస్ విరివిగా లభిస్తాయి. ఇక్కడితో పోల్చితే ధర కూడా తక్కువ. కొంత మందిమి వాటిని కొని తెచ్చుకున్నాం. దాదాపుగా బంగారు, వజ్రాలు.. ఇలా విలువైన అలంకరణ వస్తువులను వెంట తీసుకెళ్లం. కొనుక్కురాము కూడా! తక్కువ లగేజీ, అదీ మాకు అన్ని విధాల ఉపయుక్తంగా ఉండేలా చూసుకుంటాం. మా ప్రయాణ ఉద్దేశం ఏడాదిలో 10 నుంచి నెల రోజుల లోపు కొత్త కొత్త ప్రాంతాలను సందర్శించడం, ఆనందించడం... అందుకే మాకు మేం ‘ఫన్గ్రూప్’గా పిలుచుకుంటాం’’ అంటూ తెలిపారు సప్తలవిద్రా. వయసు తేడా లేని గ్రూప్... మా గ్రూప్‌లో 16 నుంచి 80 ఏళ్ల వయసు వారి వరకు ఉన్నారు. ఇదే విషయం గురించి శ్రీలతా దేవి చెబుతూ ‘‘నా వయసు 80. మనమలు, మనమరాళ్లూ ఉన్నారు. కొత్త ప్రాంతాల్లో ఎలా ఉంటానో అని ఇంట్లో వారు కంగారు పడతారు. కానీ, కొత్త దేశంలో పదహారేళ్ల అమ్మాయి కూడా నాతో పోటీ పడలేదు. అంత వేగంగా నడుస్తాను’’ అన్నారు శ్రీలతాదేవి. ‘‘అక్కడి వాతావరణానికి మేమంత త్వరగా సర్దుబాటు కాలేం. కానీ శ్రీలతాదేవి హుషారును చూసి, మాకూ కొత్త శక్తి వచ్చినట్టనిపిస్తుంది. ఫొటోలు, పోజులు, రీసెర్చ్.. కొత్త కొత్త వంటకాల రుచులు.. అసలు అనుకున్న పది-పదిహేను రోజులు కొన్ని గంటల్లా గడచిపోతాయి. మా గ్రూప్ సభ్యులంతా ఎక్కడికెళ్లినా శాకాహారాన్నే తీసుకుంటాం. బయటి దేశాల్లో ఎక్కడ చూసినా మాంసాహారమే సులువుగా లభిస్తుంది. అయితే, మాంసాహారం లేకుండా ప్రత్యేకంగా తయారుచేయించుకోవచ్చు. పండ్లు, డ్రై ఫ్రూట్స్, నట్స్ వంటివి వెంట తీసుకెళతాం. బయటకు వెళ్లినప్పుడు ఆహారం విషయంలో కచ్చితమైన నియమాలు పాటించాలి. అప్పుడే ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు తలెత్తవు’’ అని సలహా ఇచ్చారు సప్తలవిద్రా. ‘‘మేం వెళ్లిన వాటిలో ‘కివా’ ఒకటే ఎడారి ప్రాంతం. అక్కడ వాతావరణం ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం రకరకాలుగా మారుతుంటుంది. ఏ దేశానికెళ్లినా అక్కడి చారిత్రక కట్టడాలు, మాన్యుమెంట్స్ చుట్టూ గట్టి కంచె ఏర్పాటు చేసినవి చూశాం. భద్రత విషయంలో వారు మనకంటే చాలా ముందున్నారు’’ అని తమ అనుభవాలను వివరించారు ట్రావెల్ గ్రూప్ సభ్యులు. అంతా మహిళలమే అయినా రక్షణ విషయంలో ఎక్కడా ఏ చిన్న తేడా రాలేదని వివరించిన ఈ ఫన్ ట్రావెల్ గ్రూప్ చిన్న చిన్న సమస్యలనూ అధిగమించిన తీరునూ వివరించింది. కొత్త ప్రపంచాన్ని తెలుసుకోవడానికి వయసు తేడా లేకుండా ఆసక్తి కనబరిచే మహిళలకు వీరు ఓ మార్గం వేస్తున్నారనిపించింది.తెలుగు రాష్ట్రాలలో ఎన్నో అద్భుత ప్రాచీన కట్ట డాలు, సుందర సందర్శన స్థలాలు ఉన్నాయి. వాటి విశేషాలను మీరూ తెలియజేయాలనుకుంటే... మా చిరునామా... విహారి, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారా హిల్స్, హైదరాబాద్ -34. ్ఛఝ్చజీ: sakshivihari@gmail.com -
మనయాత్రలో మంచి మిత్రులు..
టూర్ గైఢ్స్ ఎల్లలను చెరిపేసి అనుబంధాలకు వారిధిలా, కొత్త ప్రదేశాల సందర్శనకు సారధిలా, చారిత్రక నిర్మాణాల అవగాహనకు విజ్ఞాన గనిలా, సాంస్కృతిక వైభవాన్ని పర్యాటకులకు తెలిపే సంపదలా.. వీటన్నింటినీ మించి యాత్రలో మనకు దిశానిర్దేశం చేసే మంచి మిత్రులుగా విభిన్నరకాల పాత్రలను పోషిస్తున్నవారు టూర్ గైడ్స్! పర్యటనలో చిక్కులను తొలగించి మార్గాన్ని సుగమం చేస్తున్నారు. దక్షిణాఫ్రికాలోని డర్బన్ నుంచి ఒక కుటుంబం తమ మూలాలను వెతుక్కుంటూ మనదేశానికి వచ్చింది. వాళ్ల పూర్వీకులలో ఒకరు 1905లో అనకాపల్లికి 40 కి.మీ దూరంలో ఉన్న జంపన అనే కుగ్రామం నుంచి దక్షిణాఫ్రికా వెళ్లి, అక్కడే స్థిరపడ్డారట. తమ మూలాలు భారత్‌లో ఉన్నాయనే విషయం వందేళ్ల తర్వాత వారి మనమలకు ఒక పేపర్ కటింగ్ ద్వారా తెలిసి, జంపన అనే ఊరు తెలుసుకోవడానికి మనదేశం వచ్చారు. ఆ ఊళ్లోనూ, చుట్టుపక్కల ఊళ్లలోనూ వీరికి సంబంధించిన కుటుంబీకులను కలుసుకొని, ఆ ఉద్వేగంలో కన్నీటి పర్యంతమయ్యారు. ‘హృదయాన్ని కదలించిన ఆ సంఘటన నాకూ కంట నీరు తెప్పించింది’ అంటూ గుర్తుచేసుకున్నారు టూర్ గైడ్ సుబ్రహ్మణ్యం. ఇలాంటి అనుభవాలు ఉన్న గైడ్స్ మన దేశంలో 2,500 మంది అధికారికంగా ఉన్నారు. అయితే, తెలుగు రాష్ట్రాలలో వీరి సంఖ్య ఎనిమిదే! ఇరు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలకు చెందిన వీరు ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. నిరంతర పరిశోధన... ప్రభుత్వ ఉద్యోగంలో చేరగానే పనిలేకపోయినా నెలసరి జీతం వచ్చేస్తుంది అనుకునేవారికి నప్పనిది ఈ గైడ్ ప్రొఫెషన్. పర్యటనలో ఉన్నా, ఇంట్లో ఉన్నా.. వీరి ఆలోచనలెప్పుడూ పర్యాటకులకు చూపించబోయే సందర్శన స్థలాలమీదనే ఉంటుంది. చారిత్రక కట్టడాల చుట్టూతానే తిరుగుతుంటుంది. ఏ పర్యాటకుడు ఏ ప్రశ్న వేస్తాడో తెలియదు. దానికి తగిన సమాధానం ఇవ్వడానికి మాత్రం ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారు. ‘రోజులో కనీసం 5-6 గంటలు పుస్తకాలు చదువుతూ, విషయాలు శోధిస్తూనే ఉంటాం’ అన్నారు మధు. ఇదే విషయంపై అరవపల్లి శ్రీను మాట్లాడుతూ- ‘విదేశీ పర్యాటకలకు ప్రతిది తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ. వారిని గైడ్‌గా రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి వచ్చే ప్రశ్నల పరంపరకు సమాధానాలు చెబుతూనే ఉండాలి. అడిగిన ప్రశ్నలకు ఏ మాత్రం సరైన సమాధానాలు చెప్పకపోయినా వారు వెంటనే మరో గైడ్‌ను వెతుక్కుంటారు. అందుకే ఈ వృత్తి ఎప్పటికప్పుడు మాకు ఒక సవాల్‌గానే ఉంటుంది’ అని తెలిపారు. ‘ఒక విదేశీయుడు అంతరించిపోతున్న బట్టమేక పక్షి కోసం మన రాష్ట్రానికి వచ్చాడు. ఆ పక్షిని వెతకడానికి నాకు రెండు రోజులు పట్టింది. చివరకు నందికొట్కూరులో ఉందని తెలిసింది. అతన్ని తీసుకొని, ఆ పక్షి కోసం బయల్దేరాను. ముందుగా ఆ పక్షి గురించి వివరాలన్నీ తెలుసుకొని, అతనికి సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వగలిగాను’ అని తెలిపారు శ్రీనివాస్‌రెడ్డి. పనివేళలు ఉండవు... ఏ ఉద్యోగంలోనైనా పనివేళలు ఉంటా యి. కానీ రాత్రి పగలు, ఎండా వానలు ఏదీ పట్టని వృత్తి వీరిది. వచ్చిన సందర్శకులకు తమవంతు పరిజ్ఞానం అందించామా లేదా అనే విషయం ఒక్కటే మైండ్‌లో ఉంటుందని తెలిపిన ఈ యాత్రా మార్గదర్శకులు దాదాపు రెండు దశాబ్దాలుగా ఇదే వృత్తిలో ఉన్నారు. పదిహేనేళ్లు టూర్ గైడ్‌గా ఉన్న శ్రీను మాట్లాడుతూ-‘విదేశాల నుంచి ఫిషరీస్ అసోషియేషన్ గ్రూప్ ఒకటి సముద్ర జీవుల ఫొటోగ్రఫీ కోసం వచ్చింది. వారికి కాకినాడ నుంచి ఇచ్చాపురం వరకు కోస్తా తీర ప్రాంతంలోని ఫిషరీ పాయింట్స్ ఎన్ని ఉన్నాయో పది రోజులపాటు నిద్రాహారాలు మాని, ఆయా ప్రాంతాలలో రెక్కీ నిర్వహించి వివరాలన్నీ సేకరించాను. పదిరోజుల పాటు ఆ బృందం ఇక్కడే ఉండి, తిరిగి వెళ్లేవరకు అన్నివేళలా అప్రమత్తంగా ఉన్నాను. వెళ్లేముందు వారి అభినందనలు అందు కున్నాను’ అని తెలిపారు. ప్రయాణం తర్వాతా కొనసాగే బంధం... నిన్నటికి ఈ రోజుకే అనుబంధాలలో ఎన్నో తేడాలు వచ్చేస్తున్న రోజులివి. ఒకసారి కలిస్తే వెంటనే మర్చిపోయే తీరికలేని రోజులు కూడా! ఇరవై ఏళ్లుగా టూర్గైడ్గా ఉన్న వెంకటేశ్వర్లు మాట్లాడుతూ- ‘పర్యటనలలో యాత్రికులలో ఒకరిగా కలిసిపోతాం. వారు తమ ఇళ్లకు, దేశాలకు వెళ్లాక కూడా మెయిల్స్, ఫోన్లు, ఇంటర్నెట్ చాటింగ్‌ల ద్వారా పలకరిస్తూనే ఉంటారు. కొందరు పదేసిసార్లు మన దేశానికి వస్తుంటారు. అప్పు డు మా పేరు చెప్పి, మేమే గైడ్‌గా కావాలని కోరుకుంటూ ఉంటారు’ అని ఆనందంగా తెలిపారు. అబద్దం చెబితే అంతే..! విధి నిర్వహణలో అబద్ధాలు, పొరపాట్లు చాలా సాధారణమనే విషయం మనందరికీ తెలిసిందే! కానీ, ఈ వృత్తిలో ఉన్నవారు మాత్రం అబద్ధాలకు, పొరపాట్లకు ఆమడదూరంలో ఉండాలంటున్నారు వీరు. ‘పర్యాటకులు అడిగిన ప్రశ్నలకు సమాధానం తెలియకపోతే ‘తెలుసుకొని చెబుతాం’ అని చెప్పాలి. అంతే తప్ప, తప్పుడు సమాచారం ఇవ్వకూడదు. దాని వల్ల ఒక దేశ చరిత్ర ను విదేశీయుడు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అలాగే పంక్చువాలిటీనీ కచ్చితంగా పాటించాలి. ట్రావెల్ గ్రూప్‌లో ఉన్నవారిలో ఒకరో ఇద్దరో అసహనంగా ఉంటారు. ఏ చిన్న అసౌకర్యం కలిగినా కోపాన్ని ప్రదర్శిస్తుంటారు. అసౌకర్యం నుంచి పర్యాటకుడిని ఎలా తప్పించాలో తెలుసుండా లి’ అంటూ తమ విధిలో కలిగే సాదకబాధకాలను ఒకరొకరుగా వివరించారు. ఇంటికి దూరం... ఉద్యోగంలో ఎన్నో సాదకబాధకాలు ఉన్నా ఇంటికి చేరుకోగానే అన్నీ మర్చిపోతారు. అలసట నుంచి విశ్రాంతి పొందుతారు. కానీ వీరి జీవనశైలి అందుకు భిన్నంగా ఉంటుంది. సంవత్సరంలో ఏడు నెలల పాటు వీరికి ప్రయాణంలోనే రోజులు గడచిపోతాయి. ఇదే విషయం టూర్ గైడ్ కరుణానిధి చెబుతూ- ‘పండగలు, పర్వదినాల సమయంలోనే విదేశీ పర్యాటకులతో టూర్స్ ఉంటాయి. దాంతో పండగ పూట ఇంట్లో ఉండం. విధిలో భాగంగా ఎన్నో చోట్ల తిరుగుతుంటాం కాబట్టి, కుటుంబసభ్యులతో మళ్లీ టూర్లకు వెళ్లడం కష్టమే! భోజనానికి, నిద్రకు వేళపాళలు ఉండవు. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కొన్ని ఆనందాలను త్యాగం చేస్తే తప్ప ఈ వృత్తిలో విజయం సాధించలేం’ అని తెలిపిన వీరే ‘ఈ వృత్తిలో ఎంత రిస్క్ ఉంటుందో అంత ఆసక్తి ఉంటుంది. కొత్త విషయాలు, చూడదగిన ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు.. జ్ఞానసముపార్జనకు వేదికలు అవుతాయి’ అని వివరించారు. అరుదైన గౌరవం... ‘రెండేళ్ల క్రితం టెక్స్టైల్ టూర్ పేరిట ఇంటర్నేషనల్ ఎవియేట్ కంపెనీ వాళ్లు న్యూయార్క్ నుంచి మన రాష్ట్రానికి ఐదు రోజుల పర్యటనకు వచ్చారు. పోచంపల్లి, పెడన... ప్రదేశాలను చూపుతూ, మన దగ్గర ఉన్న వస్త్రపరిశ్రమకు సంబంధించి వారికి పూర్తి సమాచారం అందించాను. వారు చాలా ఇంప్రెస్ అయ్యారు. న్యూయార్క్ టెక్స్టైల్ మ్యూజియంలో నాకు మెంబర్షిప్ ఇచ్చారు’అని వెంకటేశ్వర్లు ఆనందంగా తెలిపారు. ఒక ప్రాంతంలోని సంస్కృతీ సంప్రదాయాలు, చారిత్రక కట్టడాలను చూసి రావడంతోనే పర్యటన పూర్తవదు. మనసుతో దర్శించాలి, మైండ్‌తో మూలాలను అన్వేషించాలి. నిరంతర అన్వేషకులకు నిరంతర పరిశోధనతో మార్గం చూపే రహదారులు ఈ టూర్గైడ్లు. - నిర్మలారెడ్డి గైడ్స్ నియామకం ఇలా ప్రాంతం, రాష్ట్రం, స్మారక కట్టడాలకు సంబంధించి విడివిడిగా గైడ్స్ ఉంటారు. వీరిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజమ్ అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ (ఐఐటిటిఎమ్) రాతపరీక్ష, ఇంటర్వ్యూ, శిక్షణ ఆధారంగా నియమిస్తుంది. ట్రావెల్ గైడ్ పరీక్షకు కనీస వయోపరిమితి 20 నుంచి 65 సంవత్సరాలు. ఏదైనా అంశంలో డిగ్రీ స్థాయిలో పట్టభద్రులై ఉండాలి. ప్రాంతీయ భాషతో పాటు ఆంగ్లం, ఇతర విదేశీ భాషలలో ప్రావీణ్యం ఉండటం అవసరం. ఐఐటిటిఎమ్ క్యాంపస్‌లు గ్వాలియర్, భువనేశ్వర్, గోవా, న్యూ ఢిల్లీ మరియు నెల్లూరులలో ఉన్నాయి. గైడ్స్ ఆవశ్యకతను బట్టి ఐఐటిటిఎమ్ ప్రవేశపరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. టూరిస్ట్ గైడ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గైడ్ ఫీ ప్రకారం పర్యటనల ఆధారంగా జీతభత్యాలు ఉంటాయి. మరిన్ని వివరాలకు guidesadmission@gmail.comకి మీ సందేహాలను తెలియజేసి, సమాధానాలను పొందవచ్చు. ఇండియా టూరిజమ్ పర్యాటక భవన్ వారి ఫోన్ నెం. 040-23409199