పులి-మేక మంచి ఫ్రెండ్స్
మాస్కో: పులి, మేక కథలను ఎన్నో విన్నాం. ఒకదానికి మరోదానికి పడదు. పులిని చూస్తే మేక పారిపోతుంది. మేక కనిపిస్తే వెంటాడి, వేటాడి తినే వరకు వదిలిపెట్టదు పులి. కానీ రష్యాలోని స్కోటోవిస్కీ సఫారీ పార్కులో మాత్రం పులి, మేక మంచి మిత్రులై సహజీవనం సాగిస్తున్నాయి. ఉదయం వేళ పులి లేచి మరింత దట్టమైన అడవిలోకి ఆహారం కోసం వెళుతోంది. దారిచూపే నాయకత్వాన్ని పులికే వదిలేసి దాని వెనకాల వెళుతుంది మేక. రాత్రిపూట రారాజు మాత్రం మేకే. రోజు పులి పండుకునే గుహలాంటి చోట మేక పడుకుంటుంది. దగ్గరికొస్తే పులినే తంతోంది. మంచి అవగాహనకొచ్చిన పులి మేకకు కాపలాగా గుహ పైన నిద్రిస్తోంది.
గత వారం రోజులుగా రోజు ఇదే తంతు జరిగుతోంది సఫారీ పార్కులో. స్నేహంలో ఉన్న సౌభ్రాతృత్వాన్ని అర్థం చేసుకున్న పులికి జైలు సిబ్బంది దానికి 'ఆముర్' అని ఇదివరకే పేరుపెట్టగా, ధైర్యంగా పులి చెంతనే సహజీవనం సాగిస్తున్న మేకకు 'తిమూర్' అని పేరు పెట్టారు. తిమూరు అంటే రష్యా భాషలో ఉక్కు. సరిగ్గా వారం క్రితం పులులుండే సఫారీలోకి మేక ప్రవేశించిందని, ఆ రోజు పులికి తామేమి ఆహారం పెట్టాల్సిన అవసరం కూడా లేదని భావించామని, అయితే అవి కలసి తిరగడాన్ని చూసి ఆశ్చర్యం వేసిందని సఫారి ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
అప్పుడప్పుడు దారితప్పి సఫారిలోకి మేకలు రావడం, వాటిని వేటాడి పులులు, ముఖ్యంగా ఈ పులి తినడం సర్వ సాధారణమేనని, ఇది మాత్రమే వింతగా ఉందని ఆ అధికారి వ్యాఖ్యానించారు. సహనం కూడా లేని మానవులకు వింతగానే ఉంటుంది మరి. అటవి సిబ్బంది ఈ దృశ్యాలను వీడియో తీసి ఆన్‌లైన్ పోస్ట్ చేశారు. ఇప్పుడా వీడియో హల్‌చల్ చేస్తోంది.