గర్భశోకం | they are three female students good friends,krishna river in Suspicious death | Sakshi
Sakshi News home page

గర్భశోకం

Published Mon, Aug 11 2014 1:01 AM | Last Updated on Wed, Apr 3 2019 5:32 PM

గర్భశోకం - Sakshi

గర్భశోకం

వారు ముగ్గురు ప్రాణస్నేహితులు. రోజూ కలిసే కళాశాలకు వెళ్లి వస్తుంటారు. చదువులోనూ ముందంజలో ఉంటారు. ఏమైందో తెలియదు కానీ ముగ్గురూ కలిసే కృష్ణమ్మ ఒడిలో తనువు చాలించారు. తమపైనే ఆశలు పెట్టుకుని జీవిస్తున్న తల్లిదండ్రులకు తీరని గర్భశోకం మిగిల్చారు. తెల్లారితే రాఖీ పండుగ.. చిన్నారి చెల్లి పూజిత వచ్చి రాఖీ కడుతుందని అన్నయ్య ఎదురుచూస్తున్నాడు..పల్లవక్క వచ్చి రక్షాబంధనం కడుతుందని చిన్నారి తమ్ముడి నిరీక్షిస్తున్నాడు. కానీ వారి నిరీక్షణ ఫలించలేదు. పూజిత, పల్లవి.. ఇద్దరూ విగత జీవులై ఇంటికి రావటం ఆ అన్నదమ్ములతోపాటు కుటుంబ సభ్యులకూ అంతులేని విషాదాన్ని మిగిల్చింది.
 

  • ముగ్గురు విద్యార్థినుల అనుమానాస్పద మృతి
  • కృష్ణానదిలో మృతదేహాలు లభ్యం
  • సీతానగరం తీరంలో కలకలం
  • కలిసే చదువుకున్నారు.. తనువూ చాలించారు..

పెనమలూరుకు చెందిన బిళ్ల పల్లవి(18), చోడవరానికి చెందిన సరిపూడి పూజిత(17), తాడిగడప సెంటర్ సమీపంలో నివసించే యలమంచిలి నాగలక్ష్మి బందరు రోడ్డులోని ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్మీడియెట్ ఎంపీసీ గ్రూపు ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. పూజిత, పల్లవి ఇద్దరు పదో తరగతి వరకు పెనమలూరులోని ఓ పాఠశాలలో కలిసే చదువుకున్నారు. శనివారం ఉదయం యథావిధిగా ఇంటి నుంచి బయలుదేరిన ఈ ముగ్గురు కళాశాలకు వెళ్లలేదు. దీంతో కళాశాల ప్రతినిధులు వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.

పల్లవి తల్లిదండ్రులు కళాశాలకు వచ్చి ప్రిన్సిపాల్‌ను కలిసి వెళ్లారు. ఈ క్రమంలో ముగ్గురు విద్యార్థినులు శనివారం సాయంత్రం గుంటూరు జిల్లా సీతానగరం వద్ద కృష్ణానది ఇసుక తిన్నెలపైకి వెళ్లి అక్కడ కొద్దిసేపు తచ్చాడినట్లు స్థానికులు చెబుతున్నారు. కొద్దిసేపటి తర్వాత వారి బ్యాగులు మాత్రమే కనిపించగా, విద్యార్థినుల ఆచూకీ లభించలేదు. ఇసుక తిన్నెలపై బ్యాగులు స్వాధీనం చేసుకున్న పోలీసులకు ఆదివారం ఉదయం విద్యార్థినుల మృతదేహాలు లభించాయి. వారి తల్లిదండ్రులకు వెంటనే వారు సమాచారం అందించడంతో వారంతా హుటాహుటిన కృష్ణా నది ఒడ్డుకు చేరుకుని గుండెలవిసేలా రోదించారు.
 
చిట్టీ తల్లీ! చీకటంటే భయం కదే!
 ‘ఎంత పని చేశావు బిడ్డా.. నాన్న, చెల్లి, నేను గుర్తుకురాలేదా? కాస్త దూరం నడిస్తే కాళ్లు నొప్పులమ్మా అంటూ ఏడ్చేదానివిగా, ఇంత దూరం నడుచుకుంటూ ఎలా వచ్చావమ్మా? నువ్వు చనిపోలేదు, నన్ను ఏడిపించేందుకే ఇలా చేస్తున్నావు, లేమ్మా.. నీకు చీకటి అంటే భయంగా కదా! కరెంటు పోతే కెవ్వుమని కేకేసేదానివి కదా! రాత్రి చీకటిలో నీళ్లలో తడుస్తూ ఎలా ఉన్నావమ్మా..* అంటూ నాగలక్ష్మి తల్లి మాధవి బోరున విలపించారు. చీర చెంగుతో బిడ్డ మొహం తుడుస్తూ లేపేందుకు ఆమె ప్రయత్నించటం అందరినీ కలచివేసింది.

నాగలక్ష్మి తండ్రి శ్రీనివాసరావు విజయవాడ ఆటోనగర్‌లో పని చేస్తున్నారు. తల్లి మాధవి గృహిణి. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయి నాగలక్ష్మి బస్ ట్రబుల్ ఇచ్చిందంటూ 11 గంటలకే ఇంటికి వచ్చింది. 4.30 గంటలకు కూడా ఫోన్‌లో మాట్లాడింది. ఇంట్లోనే ఉన్నానంటూ హైదరాబాద్‌లోని మేనమామకు, తల్లికి చెప్పింది. తర్వాత బయటకెళ్లిన ఆమె చీకటిపడ్డా కనిపించకపోవడంతో కంగారుపడిన తండ్రి ఫోన్ చేసి చెప్పడంతో మాధవి ఫ్రెండ్స్, బంధువులకు ఫోన్ చేసి ఆరా తీశారు. సమాచారం దొరక్కపోవడంతో వెంటనే బయలుదేరి పెనమలూరు వచ్చారు. ఇంతలోనే పోలీసులు ఫోన్ చేసి విషయం చెప్పటంతో దిగ్భ్రాంతి చెందారు.
 
తెల్లారాక ఫిర్యాదు చేద్దామనుకుంటే..
మృతుల్లో ఒకరైన సరిపూడి పూజితకు తండ్రి లేడు. ఏడేళ్ల క్రితమే మరణించారు. అమరావతి మండలం లింగాపురం సొంతూరు కాగా, పూజిత తండ్రి మరణించడంతో పిల్లలిద్దరిపైనే ఆశలు పెట్టుకున్న ఆ తల్లి, మంచి చదువులు చదివించాలనే తపనతో పెనమలూరు మండలం చోడవరంలోని బంధువుల దగ్గరకు వచ్చి ఉంటున్నారు. శనివారం పూజిత రాలేదని కాలేజి నుండి ఫోన్ రాగా తల్లి శివనాగలక్ష్మి కంగారు పడ్డారు. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లిందేమోనని సరిపెట్టుకున్నారు. చీకటిపడ్డా రాకపోవడంతో ఆందోళన చెంది బంధువులకు ఫోన్ చేశారు. తెల్లవారేదాకా చూసి పోలీసులకు ఫిర్యాదు ఇద్దామనుకున్నారు. ఇంతలోనే విషయం తెలియటంతో భోరున విలపించారు.
 
పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదు..
మరో మృతురాలు బిళ్లా పల్లవిది విజయవాడ సమీపంలోని పెనుమలూరు. తండ్రి రాంబాబు ఎలక్ట్రీషియన్. ఇంటికి ఒక్కతే ఆడపిల్ల కావడంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. శనివారం కాలేజీకి రాలేదంటూ ఫోన్ రావడంతో కంగారు పడిన తండ్రి స్నేహితులు, బంధువులను ఎంక్వైరీ చేశారు. చీకటిపడ్డా రాకపోవడంతో స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా వారు ఫిర్యాదు తీసుకోలేదు. ఉదయం 10 గంటలకు అమ్మాయి ఫోటో తెస్తే ఎంక్వైరీ చేస్తామని పోలీసులు చెప్పారని పల్లవి తండ్రి రాంబాబు చెప్పారు. రాత్రంతా నిద్ర లేకుండా ఎప్పుడు తెల్లవారుతుందోనని ఆందోళనతో గడిపానని, తెల్లవారే సరికి బిడ్డ మరణవార్త వినాల్సి వచ్చిందని గొల్లుమన్నారు.
 
విజయవాడలో పోస్టుమార్టం
పోస్టుమార్టం కోసం మృతదేహాలను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ముగ్గురు విద్యార్థినుల మృతదేహాలకు వారి తల్లిదండ్రులు, బంధువుల సమక్షంలో మంగళగిరి సీఐ హరికృష్ణ, తాడేపల్లి ఎస్‌ఐ వినోద్‌కుమార్‌లు పంచనామా నిర్వహించారు. కాగా మరణించిన ముగ్గురు విద్యార్థినులు రెగ్యులర్‌గా కళాశాలకు వచ్చేవారని, చదువులో కూడా ముందుండేవారని కళాశాల ప్రిన్సిపాల్ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement