హైదరాబాద్: తలకు తీవ్ర గాయమై రక్తపు మడుగులో మెడకు చున్నీ బిగించిన స్థితిలో ఓ మహిళ ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన నేరేడ్‌మెట్ ఠాణా పరిధిలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. జవహర్‌నగర్ ఠాణా పరిధి కౌకూర్ మల్లారెడ్డి కాలనీలో ఉంటున్న కృష్ణ, సుశీల దంపతుల కుమార్తె మాధవి(34) వివాహం బేగంపేట ప్రకాశ్‌నగర్‌కు చెందిన రాజుతో 2007లో జరిగింది. వారికి కుమారుడు పవన్(15), కుమార్తె శ్రీజ(13), కుమారుడు మున్నా(11) ఉన్నారు. రాజు అనారోగ్యంతో 2021లో మృతి చెందాడు. అనంతరం మాధవి తన ముగ్గురు సంతానాన్ని తల్లి ఇంట్లో ఉంచి చదివిస్తోంది. ఏఎస్‌రావునగర్‌లోని ఓ డెంటల్ క్లినిక్‌లో సహాయకురాలిగా పని చేస్తోంది.
సికింద్రాబాద్ అడ్డగుట్టకు చెందిన సాయితో పరిచయం ఏర్పడింది. సాయికి అప్పటికే వివాహమైంది. అయినా ఇద్దరు కలిసి ఉండాలని 8 నెలల క్రితం సఫిల్‌గూడ బలరాంనగర్‌లో ఓ గదిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు. సోమవారం ఉదయం 6:40కి సాయి.. మాధవి పెద్ద కుమారుడు పవన్‌కు ఫోన్ చేసి మీ అమ్మ ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. మాధవి తల్లిదండ్రులు, పిల్లలు, బంధువులు వెళ్లి చూడగా గదిలో తలకు గాయమై రక్తపు మడుగులో మృతి చెంది ఉంది. సీఐ సందీప్‌కుమార్, ఎస్సై రమేష్‌లు చేరుకుని ఆధారాల్ని సేకరించారు. మృతురాలి దగ్గర 2 చరవాణులు, రూ.20 వేల నగదు, ఒక ద్విచక్ర వాహనం ఉంది. అవి కనిపించలేదు. సాయి వాటిని తీసుకొని పరారయ్యాడని భావిస్తున్నారు. సాయి నడిపే ఆటో మాధవే కొన్నదని బంధువులు తెలిపారు. అతడు చిక్కితే అన్ని విషయాలు బయటకొస్తాయని పోలీసులంటున్నారు.
ఆదివారం రాత్రి తల్లి తనకు ఫోన్ చేసిందని పెద్ద కుమారుడు పవన్ పోలీసులకు చెప్పాడు. తన వద్ద రూ.20వేలు ఉన్నాయని.. వాటితోపాటు తన ఫోన్ నుంచి మరో 8వేలు బదిలీ చేసుకోవాలని చెప్పిందని పోలీసులకు వివరించాడు. తనకు ప్రాణభయం ఉందని మాధవికి ముందుగానే తెలుసా? లేక ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతో కొడుక్కి డబ్బులు అందజేయాలని అనుకొని ఫోన్ చేసిందా? ఆత్మహత్య అయితే మెడకు చున్నీతో ఉరి వేసుకొని ఉండాలి.. అలా కాకుండా రక్తపు మడుగులో కింద పడి ఉండడాన్ని గమనిస్తే.. హత్యగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవన్‌కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చి ఎందుకు పారిపోయాడనే కోణంలోనూ దర్యాప్తు జరిగే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment