
ప్రారంభించిన క్యారకల్–ఐకామ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రా (ఎంఈఐఎల్) గ్రూప్ సంస్థ ఐకామ్ టెలీ తాజాగా హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి చిన్న ఆయుధాల తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఇందుకోసం యూఏఈకి చెందిన చిన్న ఆయుధాల తయారీ సంస్థ, ఎడ్జ్ గ్రూప్‌లో భాగమైన క్యారకల్‌తో జట్టు కట్టింది. రెండు సంస్థల మధ్య కుదిరిన లైసెన్సింగ్ ఒప్పందం కింద క్యారకల్ సాంకేతిక సహకారాన్ని అందిస్తుంది. మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ నినాదం కింద ఈ ప్లాంటులో సీఏఆర్ 816 క్లోజ్–క్వార్టర్స్ అసాల్ట్ బ్యాటిల్ రైఫిల్, సీఏఆర్ 817 అసాల్ట్ రైఫిల్ మొదలైనవి ఉత్పత్తి చేస్తారు.
వీటిని భారత సాయుధ బలగాలు, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్‌లు, రాష్ట్రాల పోలీస్ ఫోర్స్‌లు, ఎస్‌పీజీ మొదలైన రక్షణ రంగ విభాగాలకు సరఫరా చేయడంతో పాటు వివిధ దేశాలకు ఎగుమతి కూడా చేస్తారు. రక్షణ బలగాల పట్ల తమ నిబద్ధతకు, ఆత్మ నిర్భర్ భారత్ విజన్‌పై నమ్మకానికి ఇది నిదర్శనంగా నిలుస్తుందని ఐకామ్ ఎండీ సుమంత్ పాతూరు తెలిపారు. ఇరు దేశాల మధ్య రక్షణ రంగ సహకారానికి సంబంధించి సాంకేతిక బదిలీ ఒప్పందం కీలక మైలురాయిలాంటిదని క్యారకల్ సీఈవో హమద్ అల్‌అమెరి పేర్కొన్నారు.