ఎంఓయూ అనంతరం మంత్రి కేటీఆర్‌తో డైఫుకు సంస్థ ప్రతినిధులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి మరో జపాన్ సంస్థ భారీ పెట్టుబడితో రానుంది. జపాన్‌కు చెందిన ఆటోమేటెడ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ టెక్నాలజీ, సొల్యూషన్స్ సంస్థ డైఫుకు (ఈఅఐఊ్ఖఓ్ఖ) తెలంగాణలో తమ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. రూ. 450 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయబోయే ఈ యూనిట్ మొదటి దశ విస్తరణకు రూ.250 కోట్లు పెట్టుబడిగా పెట్టేందుకు ఆ కంపెనీ ప్రణాళికలు రూపొందించింది.
రంగారెడ్డి జిల్లా చందనపల్లిలో ఏర్పాటు చేసే ఈ తయారీ యూనిట్‌ను 18 నెలల్లో ప్రారంభించనుంది. దీని ద్వారా సుమారు 800 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించే అవకాశముంది. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో డైఫుకు సంస్థ తరఫున భారతీయ అనుబంధ సంస్థ వేగా కన్వేయర్స్ అండ్ ఆటోమేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ శ్రీనివాస్ గరిమెళ్ల, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి ఎంవోయూపై సంతకాలు చేశారు.
కేటీఆర్ మాట్లాడుతూ భారత్‌లో విస్తృతమైన దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌కు అవసరమైన ఉత్పత్తులను తయారు చేసేందుకు అన్ని వనరులు సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తయారీ రంగానికి కేంద్రంగా ఉన్న చైనా అవతల తమ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు పలు అంతర్జాతీయ సంస్థలు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు.
ఈ తరుణంలో భారతదేశం ఈ అవకాశాన్ని జార విడవకుండా అందిపుచ్చుకోవాలని కోరారు. భారతదేశానికి చెందిన పెట్టుబడిదారులు సైతం ఇండియా కోసం మాత్రమే కాకుండా ప్రపంచానికి సరిపడా తమ ఉత్పత్తులను తయారు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కేవలం ప్రాథమికస్థాయి తయారీపైనే కాకుండా హైటెక్, స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లోనూ ముందుకు పోవాలని కేటీఆర్ సూచించారు. తెలంగాణలో తమ తయారీ సంస్థలను ఏర్పాటు చేసిన, చేయనున్న కంపెనీలు బాసర ట్రిపుల్ ఐటీ వంటి విద్యాసంస్థలతో భాగస్వాములవ్వాలని విజ్ఞప్తి చేశారు.
800 మందికిపైగా ప్రత్యక్ష ఉపాధి
డైఫుకు అనుబంధ భారతీయ సంస్థ వేగా కన్వేయర్స్ అండ్ ఆటోమేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ శ్రీనివాస్ గరిమెళ్ల మాట్లాడుతూ జపాన్ సాంకేతిక సహకారంతో భారత్‌లో తమ సంస్థ ఉత్పత్తులను తయారు చేయాలనే లక్ష్యంతో పరిశ్రమల యూనిట్ ఏర్పాటుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఈ కంపెనీ ఏర్పాటు వల్ల 800 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని, ఆటోమేటివ్ హ్యాండ్లింగ్ టెక్నాలజీ స్థానికంగా ఉత్పత్తి అయి వినియోగంలోకి వస్తుందని అన్నారు. కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, పలువురు పారిశ్రామిక వేత్తలు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment