వాషింగ్టన్: అమెరికా కాలిఫోర్నియాలోని సాన్ రేమన్‌లో జరిగిన ఓ దొంగతనం అధికారులను, స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. ఏడుగురు ఆగంతుకులు ఆయుధాలతో వెళ్లి సిటి సెంటర్ బిషాప్ రాంఛ్ షాపింగ్ సెంటర్ నగల దుకాణాన్ని దోచుకున్నారు. సెక్యూరిటీ గార్డు తలపై తుపాకీ గురిపెట్టి జ్యువెల్లరీ షాపులోకి చొరబడ్డారు. అందరు డోర్స్ లాక్ చేసుకోవాలని సిబ్బందిని బెదిరించారు. అనంతరం సుత్తెతో డిస్‌ప్లే కేస్ అద్దాలు పగలగొట్టి నగలన్నీ ఎత్తుకెళ్లారు.
క్షణాల్లో చోరీని పూర్తి చేసి ఎంచక్కా రెండు కార్లలో పారిపోయారు. ఇలాంటి చోరీ ఘటనను జీవితంలో ఎప్పుడూ చూడలేదని ఓ ప్రత్యక్ష సాక్షి భయాందోళన వ్యక్తం చేశాడు. దొంగల దగ్గర తుపాకులు ఉన్నాయని, రెండు కార్లు ముందే పార్కు చేసుకుని చోరీ అనంతరం వాటిలో పారిపోయారని పేర్కొన్నాడు. గుంపుగా వచ్చి దుకాణంలోకి సెకన్లలో చొరబడ్డారని వివరించాడు. ఈ సమయంలో తాను పక్కనే రెస్టారెంట్‌లో ఉన్నానని, వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించినట్లు వివరించాడు.
శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. దొంగతనం జరగడంతో షాపును శనివారం మూసివేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరాలు పరిశీలించారు.
చదవండి: ఈక్వెడార్‌లో భారీ భూకంపం.. 14 మంది మృతి..
Comments
Please login to add a commentAdd a comment