అమెరికాలోని కాలిఫోర్నియా పరిధిలోగల ఫుల్లెర్టన్‌లో ఉంటున్న భారత సంతతికి చెందిన డాక్టర్ విజయ్ వాలి, డాక్టర్ జ్యోతిక వాలి దంపతులపై వారి ఇంటి సమీపంలోనే దాడి జరిగింది. ఇద్దరు దుండగులు వారి నుంచి విలువైన బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ఈ ఉదంతమంతా వారి ఇంటి వద్ద నున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ దోపిడీకి సంబంధించిన వివరాలను వారి కుమార్తె ఫేస్‌బుక్ పోస్ట్‌లో షేర్ చేశారు.
సీసీటీవీ ఫుటేజ్‌లో.. ఒక ఆగంతకునికి డాక్టర్ విజయ్‌కు మధ్య వాగ్వాదం జరగడం.. అతను డాక్టర్ విజయ్‌ని బలవంతంగా నెట్టడం కనిపిస్తుంది. మీడియాకు అందిన వివరాల ప్రకారం విజయ్, అతని భార్య తమ ఇంటి ప్రాంగణంలోకి వచ్చాక, అతని భార్య జ్యోతిక కారులో నుంచి విలువైన వస్తువులను బయటకు తీశారు. ఇంతలో అక్కడికి వచ్చిన దుండుగుల్లో ఒకడు డాక్టర్ విజయ్‌పై దాడి చేయబోతుండగా, విజయ్ తన భర్యతో ఆ వస్తువులను దాచాలంటూ గట్టిగా అరిచి చెప్పాడు.
భర్త మాటలు విన్నంతనే జ్యోతిక తన భర్తకు సహాయం చేయడానికి ప్రయత్నించగా, ఆమెపై కూడా ఆ ఇద్దరు దుండగులు దాడి చేసి, ఆమె వద్ద నుంచి విలువైన వస్తువులను దోచుకున్నారు. తనకు ఎదురైన అనుభవం గురించి జ్యోతిక మీడియాకు తెలియజేస్తూ తాను తన భర్తను కాపాడేందుకు ప్రయత్నిస్తుండగా ఒక ఆగంతకుడు తనపై దాడి చేసి, తన దగ్గరున్న పర్సు లాక్కున్నాడని తెలిపారు. తాను సహాయం కోసం పెద్దగా అరిచానని జ్యోతిక పేర్కొన్నారు.
తన తల్లి నుంచి పర్సును లాక్కోవాలని ఓ దొంగ స్పానిష్‌లో తన సహచరుడికి సూచించాడని ఆ దంపతుల కుమార్తె డాక్టర్ ప్రియాంక వలీ ఫేస్‌బుక్ పోస్ట్‌లో వివరించారు. ఈ దోపిడీకి ముందు దొంగలు 25 కిలోమీటర్ల దూరం వరకు తమ తల్లిదండ్రుల కారును అనుసరించారని ప్రియాంక పేర్కొన్నారు. చోరీకి గురైన వస్తువులలో తమ కుటుంబ వారసత్వ నగలు ఉన్నాయని ఆమె తెలిపారు. వాటిని తమ పూర్వీకుల గుర్తుగా చూసుకుంటున్నామని ప్రియాంక పేర్కొన్నారు. కాగా బాధితుల పిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఫుల్లెర్టన్ పోలీసు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: గ్రహశకలాలకు ‘గాలం’!
Comments
Please login to add a commentAdd a comment