Jewelery store
-
నగల దుకాణంలో కట్టల కొద్దీ.. కోట్లాది నగదు!
మహారాష్ట్రలోని నాసిక్‌లో ఓ నగల దుకాణంలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు నిర్వహించిన దాడుల్లో కట్టల కొద్దీ కోట్లాది రూపాయల నగదు పట్టుబడింది. స్థానిక సురానా జ్యువెలర్స్ యజమాని అప్రకటిత లావాదేవీలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆదాయపు పన్ను శాఖ ఆదివారం దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో సుమారు రూ.26 కోట్ల నగదు, రూ.90 కోట్ల విలువైన లెక్కల్లో చూపని ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ శాఖ అధికారులు తెలిపారు.ఆదాయపు పన్ను శాఖ వివిధ బృందాలను ఏర్పాటు చేసి ఈ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. జ్యువెలర్స్ యజమాని కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా సోదాలు జరిగినట్లు సమాచారం. ఓ బులియన్ ట్రేడర్ వద్ద ఇంత పెద్ద మొత్తంలో నగదు, ఆస్తులు లభించడం చర్చలకు దారితీసింది. ప్రస్తుతం ఆ వ్యాపారి సంపద ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా ఆదాయపు పన్ను శాఖ గట్టి నిఘా పెట్టింది. ఇటీవల నాందేడ్ లో రూ.170 కోట్ల విలువైన లెక్కల్లోకి రాని ఆస్తులను సీజ్ చేసింది. తరువాత తాజాగా నాసిక్‌లో ఈ దాడులు నిర్వహించింది. ఆదాయపు పన్ను శాఖ తీసుకున్న ఈ చర్య మహారాష్ట్రలో కలకలం రేపింది. ఈ నోట్లను లెక్కించడానికి ఆదాయపు పన్ను శాఖకు చాలా గంటల సమయం పట్టింది. దీని కోసం పలు బృందాలను పిలిపించగా ఆ తర్వాత బయటకు వచ్చిన గణాంకాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. Income Tax Department launched a raid on Surana Jewellers in Nashik, in response to alleged undisclosed transactions by the proprietor. About Rs 26 crore in cash and documents of unaccounted wealth worth Rs 90 crore have been seized in raids carried out by the Income Tax… pic.twitter.com/XJ0wyuI8HQ— ANI (@ANI) May 26, 2024 -
అయోధ్యలో కళ్యాణ్ జువెల్లర్స్ స్టోర్
న్యూఢిల్లీ: ఆభరణాల విక్రయంలో ఉన్న కళ్యాణ్ జ్యువెలర్స్ 250వ షోరూమ్‌ను ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో మార్చిలోగా ప్రారంభించనున్నట్టు శుక్రవారం ప్రకటించింది. 2023–24 నాల్గవ త్రైమాసికంలో కొత్తగా భారత్‌లో 15 కళ్యాణ్ ఔట్లెట్లను ఏర్పాటు చేస్తోంది. మధ్యప్రాచ్య దేశాల్లో 2 కళ్యాణ్, 13 క్యాండీర్ స్టోర్లను తెరువనుంది. 2023 డిసెంబర్ 31 నాటికి సంస్థ ఖాతాలో మొత్తం 235 కేంద్రాలు ఉన్నాయి. అక్టోబర్–డిసెంబర్లో ప్రారంభించిన కంపెనీ యాజమాన్యంలోని కేంద్రాలను ఫ్రాంచైజీ ఓన్డ్ ఫ్రాంచైజీ ఆపరేటెడ్ (ఫోకో) విధానంలోకి మార్చనున్నట్టు కళ్యాణ్ జువెల్లర్స్ తెలిపింది. 2024–25లో కొత్తగా 80 ఔట్లెట్లు రానున్నాయి. ఇందుకు కావాల్సిన ఒప్పందాలు పూర్తి అయ్యాయి. ఎక్కువ దుకాణాలు ఫ్రాంచైజీ విధానంలో తెరుచుకోనున్నాయి. -
నగల షాపు పక్కనే గది అద్దెకు తీసుకుని..
సుజాతనగర్: జ్యూయిలరీ షాపు పక్కనే ఉన్న రూంలోకి అద్దెకి దిగి.. రాత్రి పూట షాపు, గదికి మధ్య ఉన్న గోడకు రంధ్రం చేసి లోనికి ప్రవేశించి బడా చోరీకి పాల్పడ్డ ఉదంతమిది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్లో ఆదివారం వెలుగు చూసిన ఈ ఘటన వివరాలిలా.. కొత్తగూడెంకు చెందిన అలువాల శంకర్ సుజాతనగర్‌లోని రవి కాంప్లెక్స్‌లో తొమ్మిదేళ్లుగా బంగారు నగల దుకాణం నిర్వహిస్తున్నాడు. సదరు దుకాణం ప్రక్కన ఓ గది ఖాళీగా ఉండడంతో ఇద్దరు వ్యక్తులకు గత నెల 26న కాంప్లెక్స్ యజమాని అద్దెకు ఇచ్చారు. ఈక్రమంలో గత నెల 31న శంకర్ వ్యక్తిగత పనులపై హైదరాబాద్‌కి వెళ్లాడు. దీంతో ఇదే అదనుగా భావించిన ఆ ఇద్దరు దుండగులు షాపు, గదికి మధ్య ఉన్న గోడకు రంధ్రం చేసి లోనికి ప్రవేశించారు. లోపల ఉన్న సీసీ కెమెరాల వైర్లు తొలగించి గ్యాస్ కట్టర్ సాయంతో లాకర్‌ను కట్ చేశారు. దాంట్లో ఉన్న 42 కిలోల వెండి, 1,242 గ్రాముల బంగారం.. మొత్తంగా రూ.87లక్షల విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం వచ్చిన దుకాణ యజమాని శంకర్ చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. చుంచుపల్లి సీఐ రమాకాంత్, క్లూస్ టీం బృందం చేరుకుని పరిశీలించగా మరో సీసీ కెమెరా ఉన్న విషయాన్ని గుర్తించారు. ఈ పుటేజీని పరిశీలించగా 1వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో చోరీ చేసి కారులో పారిపోయినట్లు తేలింది. నగదు దుకాణంలో చోరీ కోసమే దుండగులు గది అద్దెకు తీసుకున్నారని, కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
ఆయుధాలతో వచ్చి నగల దుకాణం చోరీ.. అంతా క్షణాల్లోనే..
వాషింగ్టన్: అమెరికా కాలిఫోర్నియాలోని సాన్ రేమన్లో జరిగిన ఓ దొంగతనం అధికారులను, స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. ఏడుగురు ఆగంతుకులు ఆయుధాలతో వెళ్లి సిటి సెంటర్ బిషాప్ రాంఛ్ షాపింగ్ సెంటర్ నగల దుకాణాన్ని దోచుకున్నారు. సెక్యూరిటీ గార్డు తలపై తుపాకీ గురిపెట్టి జ్యువెల్లరీ షాపులోకి చొరబడ్డారు. అందరు డోర్స్ లాక్ చేసుకోవాలని సిబ్బందిని బెదిరించారు. అనంతరం సుత్తెతో డిస్ప్లే కేస్ అద్దాలు పగలగొట్టి నగలన్నీ ఎత్తుకెళ్లారు. క్షణాల్లో చోరీని పూర్తి చేసి ఎంచక్కా రెండు కార్లలో పారిపోయారు. ఇలాంటి చోరీ ఘటనను జీవితంలో ఎప్పుడూ చూడలేదని ఓ ప్రత్యక్ష సాక్షి భయాందోళన వ్యక్తం చేశాడు. దొంగల దగ్గర తుపాకులు ఉన్నాయని, రెండు కార్లు ముందే పార్కు చేసుకుని చోరీ అనంతరం వాటిలో పారిపోయారని పేర్కొన్నాడు. గుంపుగా వచ్చి దుకాణంలోకి సెకన్లలో చొరబడ్డారని వివరించాడు. ఈ సమయంలో తాను పక్కనే రెస్టారెంట్లో ఉన్నానని, వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించినట్లు వివరించాడు. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. దొంగతనం జరగడంతో షాపును శనివారం మూసివేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరాలు పరిశీలించారు. చదవండి: ఈక్వెడార్‌లో భారీ భూకంపం.. 14 మంది మృతి.. -
కస్టమర్లా వచ్చి.. సిబ్బందితో మాట కలిపి..
సాక్షి,బంజారాహిల్స్(హైదరాబాద్): జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36లోని తనిష్క్ జువెలర్స్‌లో చోరీ జరిగింది. కస్టమర్లా వచ్చిన ఓ మహిళ బంగారు గాజును తస్కరించింది. వివరాలివీ... జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36లోని తనిష్క్ జువెలర్స్‌లో ఈ నెల 9న గుర్తు తెలియని మహిళ వచ్చింది. తాను బంగారు గాజులు కొనాలనుకుంటున్నట్లు సిబ్బందికి చెప్పింది. దీంతో కొన్ని రకాల డిజైన్లను చూపించారు. వివిధ గాజులను పరిశీలించిన ఆ మహిళ తనకు మరికొన్ని డిజైన్లు చూపించాలని కోరింది. ఆయా గాజుల ధరలను అడుగుతూ సిబ్బందితో మాట కలిపి దృష్టి మరల్చి ఒక బంగారు గాజును తస్కరించింది. తర్వాత తనకు డిజైన్లు నచ్చలేదని చెప్పి బయటకు వెళ్లిపోయింది. మరుసటిరోజు సిబ్బంది ఆభరణాలను లెక్కించే సమయంలో 18 గ్రాముల బరువైన బంగారు గాజు తగ్గినట్లు గుర్తించారు. సీసీ కెమెరా ఫుటేజీలను జల్లెడ పట్టగా గుర్తుతెలియని మహిళ చోరీ చేసినట్లు తేలింది. ఈ మేరకు శుక్రవారం తనిష్క్ ప్రతినిధి ప్రవీణ్‌కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలి కోసం గాలింపు చేపట్టారు. చదవండి: రూ.2లక్షల అప్పు.. భర్త స్నేహితుడితో వివాహేతర సంబంధం.. -
సినీ ఫక్కీలో డీబీ జ్యువెలర్స్ షాప్‌లో మోసం
-
మైసూరులో పట్టపగలే నగల దుకాణంలో దోపిడీ
మైసూరు: పర్యాటక రాజధాని నగరం మైసూరులో పట్టపగలు దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఒక నగల దుకాణంలోకి చొరబడి దోపిడీకి పాల్పడిన దుండగులు ఒకరిని కాల్చి చంపారు. సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో విద్యారణ్యపురలో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానిక అమృత్ జ్యువెల్లరీ షాపునకు రెండు బైకులపై సుమారు ముగ్గురు– నలుగురు వ్యక్తులు వచ్చారు. లోపలికి ప్రవేశించిన వెంటనే షట్టర్‌ను మూసేసి దుకాణం యజమాని ధర్మేంద్రను పిస్టల్‌తో బెదిరించి అతని కాళ్లు, చేతులు కట్టేసి నోట్లో బట్టలు కుక్కారు. బంగారు నగలను బ్యాగుల్లో నింపుకుంటుండగా, అటువైపుగా వచ్చిన ధర్మేంద్ర బంధువు శరత్ చంద్ర షాపు షట్టర్ మూసి ఉండడం చూసి అనుమానంతో తెరవాలని యత్నించాడు. లోపలి నుంచి దుండగులు అతన్ని తుపాకీతో బెదిరించగా గట్టిగా కేకలు వేశాడు. దొంగలు తుపాకీతో కాల్పులు జరపడంతో శరత్ చంద్ర తప్పించుకోగా అతని వెనుకే ఉన్న చంద్రు (23) అనే సమీప బంధువు తలకు తూటా తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. ఇంతలో దొంగలు బంగారం దోచుకుని తమ బైక్‌లపై పరారయ్యారు. కొంతసేపటి తర్వాత అక్కడికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ సాయంతో ముమ్మరంగా దర్యాప్తు ప్రారంభించారు. -
ప్రియురాలి కోసం మాస్టర్ ప్లాన్.. ఆన్లైన్లో బొమ్మ తుపాకీ కొని
శ్రీకాకుళం: ఇచ్ఛాపురం పట్టణంలో బొమ్మ తుపాకీ చూపించి నగలు ఎత్తుకుపోయిన కేసును పోలీసులు ఛేదించారు. కేసు దర్యాప్తులో ఈ చోరీ వెనుక ఉన్న ‘లవ్ స్టోరీ’ బయటపడింది. ప్రియురాలికి బహుమ తి ఇవ్వడానికే యువకుడు దొంగతనానికి పాల్పడినట్లు తెలిసి ఖాకీలు కూడా ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వివరాలను ఎస్పీ అమిత్ బర్దార్ మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరులకు వివరించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. ఒడిశా రాయగడ జిల్లా చలకంబ గ్రామానికి చెందిన సూరజ్ కుమార్ కద్రక ఒడిశాలోనే పదో తరగతి వరకు చదివాడు. అనంతరం భీమవరంలోని రొయ్యల ట్యాంకుల వద్ద, విశాఖపట్నంలోని ఒక హోటల్లో వెయిటర్‌గా పనిచేశాడు. 2020 డిసెంబర్ నెలలో తన చిన్నాన్నకు చికిత్స జరుగుతున్న సమ యంలో ఒడిశాలోని భువనేశ్వర్‌లోని ఓ ఆస్పత్రిలో ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. కోవిడ్ కాలంలో ఉపాధి కోల్పోయి ఇంటిలోనే ఉండిపోయాడు. అయితే ప్రియురాలి మెప్పు పొందడం కోసం బంగారు గొలుసు ఇద్దామనుకున్నాడు. చేయడానికి పనులు లేకపోవడంతో చోరీ చేసి బహుమతి ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు. సినిమాల్లో చూపించినట్టు బొమ్మ తుపాకీ చూపించి వ్యాపారిని బెదిరించి నగలు ఎత్తుకెళ్లాడు కూడా. కానీ పోలీసుల ముందు అతడి ఎత్తులు చెల్లలేదు. ఇలా దొరికిపోయాడు.. దొంగతనం చేద్దామని ప్లాన్ వేసిన సూరజ్‌కుమార్ రూ. 2వేలతో బొమ్మ పిస్టల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కొన్నా డు. 9వ తేదీన ఇచ్ఛాపురంలో జీకే జుయలరీ షాపు ను ఎంచుకుని తన ప్రణాళికను అమలు చేయాలని నిర్ణయించుకున్నాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో షాపు ఓనర్ ఒంటరిగా ఉండడంతో కస్టమర్ లాగా లోపల కు వెళ్లాడు. వివిధ డిజైన్లతో మూడు బంగారు గొలుసుల ను ఓనర్ చూపించగా.. వాటిని ఫొటో తీసి తన లవర్‌కు పంపించాడు. ఆ సమ యంలో దుకాణానికి ఎవరూ రా కపోవడం గమనించి పిస్టల్ తీసి ఓనర్ ను బెదిరించి దాదాపు రెండు తులాల బరు వు గల మూడు గొలుసులు తీసుకుని పారిపోయా డు. దీనిపై ఆ షాపు ఓనర్ పోలీసులకు సమాచారం అందించడంతో ఇచ్ఛాపురం రూరల్ పోలీస్ కానిస్టేబుల్, మరికొందరు నిందితుడిని వెంబడించారు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో బొమ్మ పిస్టల్ కిందపడిపోయింది. తర్వాత నిందితుడు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర గొలుసులతో సహా పోలీసులకు దొరికిపోయాడు. అతడిని ఇచ్ఛాపురం టౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. వ్యాపారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండా లని ఎస్పీ సూచించారు. కేసు ఛేదించడంలో ప్రతిభ కనబరచిన సీఐ వినోద్‌బాబు, ఎస్ఐ సత్యనారాయణ, కానిస్టేబుల్ బషీర్‌లను ఎస్పీ అభినందించారు. సమావేశంలో డీఎస్పీ ఎం.వీరకుమార్, సీఐ వినోద్‌బాబు, ఎస్ఐ సత్యనారాయణ పాల్గొన్నారు. -
జువెలరీ షోరూమ్‌లో స్వచ్చమైన బంగారాన్ని గుర్తించడం ఎలా..?
మీరు బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడానికి ఆభరణాల షోరూమ్‌లోకి వెళ్లినప్పుడు మీ మనస్సులో ఉన్న బడ్జెట్ గురించి ఆభరణాల వ్యాపారికి చెప్పిన వెంటనే, అతను మీ ముందు విభిన్న రకాల బంగారు ఆభరణాల సెట్ డిజైన్లను ఉంచుతారు. బంగారం ధర అనేది స్వచ్ఛత మీద ఆధారపడి ఉంటుంది. మీరు స్వచ్ఛమైన బంగారం కోసం ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది. కానీ, మీరు కొనుగోలు చేస్తున్న ఆభరణాలు స్వచ్ఛమైనవా? ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు కూడా కట్టుబడి ఉన్నాయని మీరు ఎలా ధృవీకరిస్తారు?. దీనికి సంబందించి ఆగ్మోంట్ డైరెక్టర్ కేతన్ కొఠారి బంగారం కొనుగోలు ప్రక్రియ, స్వచ్ఛమైన బంగారు ఆభరణాలు, దేశంలో కొత్త హాల్ మార్క్ నియమాలు, హాల్ మార్క్ చేయని మీ పాత బంగారు ఆభరణాల గురుంచి వివరణ ఇచ్చారు. కేతన్ కొఠారి తెలిపిన వివరాల ప్రకారం.. బంగారం వివిధ రకాల స్వచ్ఛత స్థాయిల్లో ఉంటుంది. బంగారం అనేది అతి తక్కువ స్వచ్ఛత కలిగిన 10 క్యారెట్ల బంగారం నుంచి అత్యధిక స్వచ్చత కలిగిన 24 క్యారెట్ల బంగారం వరకు లభిస్తుంది. 24 క్యారెట్ల బంగారాన్ని స్వచ్ఛమైన బంగారం అని ఎందుకు అంటారు అంటే? దీనిలో వేరే ఇతర లోహాలను కలపరు. ఇది మృదువుగా ఉంటుంది. దీనిని బంగారు కడ్డీలు, నాణేలు, విద్యుత్ పరికరాలు, వైద్య పరికరాల ఉత్పత్తిలో విస్తృతంగా ఉపయోగిస్తారు. వెండి, జింక్, నికెల్ వంటి ఇతర మిశ్రమలోహాలు బంగారం కలిగి ఉన్న వాటిని 23కె, 22కె, 22కె, 20కె, 18కె, 14కె, 10కె బంగారం అని అంటారు. ఈ ఇతర గ్రేడ్ల బంగారం మన్నికైనవి, దృఢమైనవి. మన భారత దేశంలో ఎక్కువగా ఆభరణాల తయారీ కోసం ఎక్కువగా 22 క్యారెట్ల బంగారం వాడుతారు. కొత్త హాల్ మార్క్ నిబంధనలు ఏమిటి? బంగారం కొనుగోలుదారుల ప్రయోజనాలు కాపాడేందుకు హాల్ మార్క్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీన్ని అమలుచేయడం ద్వారా కస్టమర్లు బంగారు ఆభరణాల విషయంలో మోసపోయే అవకాశం తక్కువగా ఉంటుంది. గోల్డ్ హాల్‌మార్కింగ్ అనేది బంగారం స్వచ్ఛతను ధృవీకరిస్తూ ఇచ్చే ప్రభుత్వ లోగో. హాల్‌మార్కింగ్ ఇవ్వడానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) కొన్ని ప్రమాణాలు పెట్టింది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వినియోగదారుడు మోసపోవద్దని ప్రభుత్వం బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్)ను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు బంగారం కొనుగోలు చేసే సమయంలో స్వచ్చమైన ఆభరణాలను గుర్తించడం కష్టమవుతోంది. స్వచ్చమైన బంగారం, నకిలీ బంగారం అనేది తెలియదు. కొందరు చూడగానే గుర్తిస్తారు మరికొందరు ఇబ్బంది పడతారు. అందుకే బంగారం నాణ్యతను గుర్తించేందుకు హాల్‌మార్కింగ్ విధానాన్ని కేంద్రం తీసుకోచింది. ప్రస్తుతం 256 జిల్లాల్లో మాత్రమే హాల్ మార్క్ నిబంధనలు అమలు చేస్తున్నారు. ఆభరణాల షోరూమ్ కు వెళ్లినప్పుడు హాల్ మార్క్ ఆభరణాలు గుర్తుంచడం ఎలా? గోల్డ్ హాల్ మార్క్ ఆంక్షలు దశలవారీగా అమలులోకి వస్తున్నాయి. ప్రస్తుతం 256 జిల్లాల్లో ఆభరణాల దుకాణాలు హాల్ మార్క్ లోగోను ముద్రిస్తున్నాయి. కొనుగోలుదారుడు షోరూమ్‌లోకి ప్రవేశించినప్పుడు జ్యూయలర్ బీఐఎస్ రిజిస్టర్ చేయబడిందా లేదా అని చెక్ చేయడం కొరకు బీఐఎస్ సర్టిఫికేషన్ మార్క్ అడగాలి. కొనుగోలుదారుడు స్వచ్ఛత కోసం నాలుగు సంకేతాలను పరిశీలించిన తరువాత మాత్రమే హాల్ మార్క్ చేయబడ్డ ఆభరణాలను కొనుగోలు చేయాలి. అలాగే కొన్న తర్వాత ఆభరణాల షోరూమ్ నుంచి బిల్లును తీసుకోవాలి. బంగారు ఆభరణాల స్వచ్ఛత తెలుసుకోవడం కోసం ఆ ఆభరణాలపై నాలుగు సంకేతాలు గల ముద్ర ఉంటుంది. ఆ ముద్ర కనిపించకపోతే 10ఎక్స్ భూతద్దం ఉపయోగించి దానిని మీకు ప్రదర్శించమని ఆభరణాల వ్యాపారిని అడగండి. బీఐఎస్ మార్గదర్శకాల ప్రకారం.. మీకు నగల వ్యాపారి నకిలీ ఆభరణాలు మీకు విక్రయిస్తే స్వచ్చత, బరువు కోసం మీరు చెల్లించిన టెస్టింగ్ ఛార్జీలతో వచ్చిన తేడాకు రెండు రెట్లు కొనుగోలుదారుడికి షాప్ ఓనర్ రీఎంబర్స్ మెంట్ చేయాలి. కొనుగోలుదారుడు గమనించాల్సిన సంకేతాలు ఏమిటి? ఆభరణాలపై నాలుగు ప్రధాన హాల్ మార్కింగ్ గుర్తులు ఉంటాయి. త్రిభుజం గుర్తు అనేది బీఐఎస్ మార్క్ సూచిస్తే, స్వచ్ఛతను 916 నెంబర్(22 క్యారెట్)తో సూచిస్తారు. తర్వాత ఉండేది ఆభరణాల వ్యాపారి గుర్తు, ఇక మిగిలనవి హాల్ గుర్తింపు పొందిన ఆస్సాయిగ్ సెంటర్ మార్క్, అది తయారు చేసిన సంవత్సరం. భారతదేశంలో 14, 18, 20, 22, 23, 24 క్యారెట్ల బంగారు ఆభరణాలను హాల్ మార్క్ చేయవచ్చు. పాత ఆభరణాల కొనుగోలు, అమ్మకాలు ఎలా? మీ పాత బంగారు ఆభరణాల విలువ గురించి ఆందోళన చెందవద్దు. ఎందుకంటే ఇది ఇప్పటికీ చట్టబద్ధం. బంగారు ఆభరణాలకు హాల్ మార్క్ లేనప్పటికీ, ఆభరణాల తయారీదారులు దానిని కస్టమర్ల నుంచి తిరిగి కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ ఆభరణాల వ్యాపారి దాని మీద హాల్ మార్క్ లోగో ముద్రన కోసం కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. హాల్ మార్క్ లేని ఆభరణాలను కొనుగోలుదారులకు విక్రయించవచ్చా? అలాంటి అవకాశం లేదు. బీఐఎస్ చట్టం, 2016లోని సెక్షన్ 29 ప్రకారం, హాల్ మార్క్ లేని ఆభరణాల విక్రయిస్తే నిబంధనల ప్రకారం ఎవరైనా ఒక సంవత్సరం జైలు శిక్ష లేదా లక్ష రూపాయలకు తక్కువ కాకుండా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని నివేదికల ప్రకారం ఇప్పటి వరకు భారత దేశ ప్రజల దగ్గర 1.5 ట్రిలియన్ డాలర్ల విలువైన బంగారం ఆభరణాలు ఉన్నాయి. -
భారీ చోరి..పది లక్షల బంగారు నగలు మాయం
సాక్షి, అసిఫాబాద్: కాగజ్ నగర్ మండలం ఈస్గాం మార్కెట్ లో భారీ చోరీ జరిగింది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం రాత్రి స్నేహ జ్యువెలరీ దుకాణంలో కొందరు దుండగులు షట్టర్ పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. కాగా దుకాణంలో సుమారు పది లక్షల విలువైన నగలు దోచుకెళ్లారిని పోలీసులు తెలిపారు. ఈ ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ బృందాలతో రంగంలోకి దిగిన అధికారలు దర్యాప్తు ముమ్మరం చేశారు. దోపిడీ జరిగిన ప్రాంతాన్ని ఎస్పీ సుదీంద్ర సందర్శించారు. ఈ సందర్బంగా దొంగలు దోపిడీ చేసిన తీరును స్థానిక పోలీసులను ఆయన అడిగి తెలుసుకున్నారు. పరిసరాల్లోని సీసీ కెమెరాల ద్వారా ఈ దొంగతనం రికార్డు కావడంతో ప్రస్తుతం అధికారులు ఆ వీడియోలను నిశితంగా పరిశీలిస్తున్నారు. అందులో ముగ్గురు వ్యక్తులు చోరిలో పాల్లొన్నట్టు కెమెరాలలో రికార్డైంది. సీసీ పుటేజీ ఆధారంగా దొంగలని పట్టుకోవడానికి పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
ధన్తేరస్ అమ్మకాలు జిగేల్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ధన్‌తేరస్‌కు జువెల్లరీ షాపులు తళుక్కుమన్నాయి. ఎనిమిది నెలల తర్వాత ఒక్కసారిగా కస్టమర్లతో దుకాణాలు కిటకిటలాడాయి. కోవిడ్–19 కారణంగా తీవ్ర ప్రభావం ఎదుర్కొన్న బంగారు, వెండి ఆభరణాల మార్కెట్ కోలుకుంటుందా అన్న ఆందోళన నెలకొన్న పరిస్థితుల్లో విక్రేతలు కాస్త ఉపశమనం పొందారు. గతేడాదితో పోలిస్తే విక్రయాలు 30–50% నమోదైనట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి. గతం కంటే అమ్మకాలు తగ్గినప్పటికీ, కోవిడ్ ప్రభావం నుంచి కాస్త కోలుకోవడం శుభపరిణామం అని విక్రేతలు అంటున్నారు. కొన్ని నెలలుగా వాయిదా వేసుకుంటూ వస్తున్న కస్టమర్లు ధన్‌తేరస్‌కు కొనుగోళ్లకు ఆసక్తి చూ పారు. ఏడాది మొత్తంలో ధన త్రయోదశికే దుకాణాలు కస్టమర్లతో సందడి చేస్తాయి. బంగారం కంటే వెండికే.. ఈసారి ధన్‌తేరస్‌కు పుత్తడి కంటే వెండివైపే కస్టమర్లు మొగ్గు చూపారు. మొత్తం అమ్మకాల్లో పసిడి వాటా 30 శాతమేనని విక్రేతలు అంటున్నారు. వెండి నాణేలు, దీపాల వంటి పూజా సామాగ్రి ఎక్కువగా అమ్ముడైంది. బంగారం విషయానికి వస్తే వినియోగదార్లు ఎక్కువగా కాయిన్స్ కొన్నారు. ప్రధానంగా 0.5 నుంచి 2 గ్రాముల వరకు బరువున్న లక్ష్మీ రూపు నాణేలను కస్టమర్లు అధికంగా దక్కించుకున్నారని సిరివర్ణిక జువెల్లర్స్ ఫౌండర్ ప్రియ మాధవి వడ్డేపల్లి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. డిసెంబర్ వరకు ఈ ట్రెండ్ సానుకూలంగా కొనసాగుతుందని అన్నారు. పెద్ద ఆభరణాలు కోరుకునేవారు బంగారం బదులు డైమండ్ జువెల్లరీ వైపు మొగ్గుచూపుతున్నారని ఎన్నారై రేణుక జొన్నలగడ్డ తెలిపారు. సోమవారంతో పోలిస్తే.. హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.52,600 పలికింది. సోమవారం ఈ ధర రూ.53,900 దాకా వెళ్లింది. ధర కాస్త తగ్గడం కస్టమర్లకు కలిసి వచ్చింది. వాస్తవానికి మార్చి నుంచి ఆగస్టు వరకు 10 శాతం లోపే అమ్మకాలు జరిగాయి. సెప్టెంబర్ నుంచి కాస్త సేల్స్‌లో కదలిక వచ్చింది. అయితే కస్టమర్లతో విక్రేతలకు ఉన్న అనుబంధాన్నిబట్టి ఒక్కో షాపు శుక్రవారం 30–50% సేల్స్ నమోదు చేసిందని నగల హోల్‌సేల్ వ్యాపారి గుల్లపూడి నాగ కిరణ్ తెలిపారు. గతేడాది ఈ సీజన్లో బంగారం ధర రూ.38,000 ఉందని గుర్తు చేశారు. ఇప్పుడు ధర పెరగడం, కరోనా భయాల తో మార్కెట్‌పై ప్రభావం పడిందన్నారు. ఇన్వెస్టర్ల చూపు పసిడిపై.. గతేడాది కంటే ఈ సీజన్లో బంగారం ధర వేగంగా పెరగడం ఇన్వెస్టర్లను ఎక్కువగా ఆకట్టుకునే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) వెల్లడించింది. కోవిడ్–19 భయాందోళనల నేపథ్యంలో వినియోగదార్లు డిజిటల్ వేదికలపై కాయిన్స్, బార్స్‌ను ఎక్కువగా కొనుగోలు చేశారని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎండీ సోమసుందరం పీఆర్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే 70% డిమాండ్ ఉండొచ్చని అంచనా వేస్తున్నట్టు ఆల్ ఇండియా జెమ్, జువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ అనంత పద్మనాభన్ తెలిపారు. గతేడాది రెండవ త్రైమాసికంలో దేశవ్యాప్తంగా 101.6 టన్నుల గోల్డ్ జువెల్లరీ అమ్ముడైంది. ఈ ఏడాది జూలై–సెపె్టంబర్లో ఇది 48% తగ్గి 52.8 టన్నులకు పరిమితమైందని సీఏఐటీ గోల్డ్, జువెల్లరీ కమిటీ చైర్మన్ పంకజ్ అరోరా వెల్లడించారు. బంగారం విషయం లో ప్రపంచంలో రెండవ అతిపెద్ద మార్కెట్‌గా భారత్ కొనసాగుతోంది. -
ఆ శత్రువు ఎవరు?
రాత్రి రెండు దాటింది. ‘కోహినూర్ జువెలరీ’ షాపుకి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న రాజు షాపు ముందు ఉన్న వరండాలో నిద్రపోతున్నాడు. మధ్యలో తీవ్రమైన తలనొప్పి అతడిని నిద్రపోనివ్వలేదు. దాంతో పెయిన్ కిల్లర్ వేసుకుని నిద్రపోయే ప్రయత్నం చేస్తున్నాడు. మగతనిద్రలోకి జారుకునే సమయంలో షాపులోపల నుంచి ఏదో కింద పడిన శబ్దం వచ్చింది. ఉలిక్కిపడి లేచిన రాజు.. అయోమయంగా చుట్టూ ప్రదేశాలను గమనించాడు.‘‘షాపులోకి ఏ ఎలకైనా వచ్చిందేమో అనుకుంటూనే... ఒకవేల దొంగలొస్తేనో..?’’ అనే ఆలోచన అతడ్ని కలవరపరిచింది. వెంటనే మంచం దిగి షాపు చూట్టూ తిరిగి చూశాడు. షాపు వెనక్కి వెళ్లిన రాజు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. షాపు వెనక వైపు ఉన్న బాత్రూమ్ కిటికిని ఎవరో ఊడబీకారు. అందులోంచి లోపలికి మనుషులు సునాయాసంగా వెళ్లొచ్చు. చప్పుడు చేయకుండా ఓ దిమ్మపైకి ఎక్కి అదే కిటికీలోంచి లోపలికి చూశాడు. ఎవరూ కనిపించలేదు. కాస్త ధైర్యం చేసి లోపలికి దిగాడు. అలికిడి లేకుండా అడుగులో అడుగు వేసుకుంటూ బాత్రూమ్లోంచి షోరూమ్‌లోకి తొంగి చూశాడు. అక్కడా ఎవరూ కనిపించలేదు. అయితే షోకేసుల్లో ఉండాల్సిన నగలన్నీ మాయమయ్యాయి. ఓ ఫ్లవర్‌వాజ్ మాత్రం కిందపడి ఉంది. ఆ ఫ్లవర్‌వాజ్ శబ్దానికే మెలికువ వచ్చిందని అర్థం చేసుకున్నాడు. అంటే అన్నీ తీసుకుని పారిపోతున్న హడావుడిలో ఈ ఫ్లవర్‌వాజ్ కింద పాడేసి ఉంటారు దొంగలు. ఎంతో సమయం అయ్యి ఉండదు. వెంటనే పోలీసులకు సమాచారం అందిద్దాం. అనుకుంటూ ఫోన్ అందుకుంటూ ఓ అడుగు ముందుకేశాడు రాజు. అంతే! కాళ్లకు ఏదో తాకింది. వంగి దాన్ని అందుకున్నాడు. అది ఓ వజ్రాల నగ. కళ్లు తలుక్కుమన్నాయి. బహుశా దొంగలు దోచుకునే సమయంలో ఇది కింద పడి ఉంటుంది అనుకుంటూ ఫోన్ కట్ చేసి.. ఆ నగను జేబులో వేసుకుంటూనే ఇంకా నగలు దొరికే అవకాశం ఉందేమో అన్నట్లు ఆ షోకేసులను వెతికాడు. వెంటనే వచ్చిన దారినే వెనుదిరిగి సైకిల్ తీసుకుని ఆ నగను ఇంట్లో పెట్టి, తిరిగి వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీస్ విచారణల్లో వేలుముద్రల ఆధారంగా... దొంగల ముఠాకు రాజే సహకరించాడని, దొంగతనానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా రాజే సహకరించాడని తేల్చారు. అదే సమయంలో ఓ అజ్ఞాత వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి డైమండ్ నగ రాజు వద్దే ఉందని చెప్పడం, ఆ వెంటనే పోలీసులు రాజు ఇంటిలో తనిఖీలు జరపడం వెంటవెంటనే జరిగిపోయాయి. పలు సాక్ష్యాల ఆధారంగా రాజు జైలు పాలయ్యాడు. మిగిలిన దొంగలను వెతికే పనిలో పడ్డారు పోలీసులు.జైల్లో ఉండగా రాజుకు ఓ రోజు తీవ్రమైన తలనొప్పి వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు. డాక్టర్లు అతడికి బ్రెయిన్‌ట్యూమర్ ఉందని తేల్చారు. వెంటనే ఆపరేషన్ చెయ్యకపోతే రాజు చనిపోతాడని చెప్పారు. రాజు ఖైదీ కావడంతో ఆపరేషన్ ఖర్చు అంతా ప్రభుత్వమే భరించింది. రాజు మెల్లగా కోలుకున్నాడు.కొద్దిరోజులకు కోహినూర్ షాపులో దొంగతనానికి పాల్పడిన దొంగలు దొరికారు.సెక్యూరిటీ గార్డ్ రాజుకి తమకు ఎలాంటి సంబంధం లేదని పోలీసు లకు చెప్పారు. దాంతో కోర్టు రాజును నిర్దోషిగా విడుదల చేసింది.దొంగలు దొరకడంతో కేసు క్లోజ్ అయ్యింది. అయితే ఈ కేసుని మొదటి నుంచి స్టడీ చేస్తూ వచ్చిన ఎస్సై రాఘురాం తల పట్టుకున్నాడు. అతడికి అర్థం కానీ విషయమేంటంటే... ‘వజ్రపు నగ సెక్యూరిటీ గార్డ్ రాజు దగ్గరే ఉంది’ అనే విషయాన్ని పోలీసులకు తెలియజేసిన అజ్ఞాత వ్యక్తి ఎవరా అని ఆలోచనలో పడ్డాడు. ఎంతైనా పోలీసు కదా! ఎప్పటికీ అంతుచిక్కకపోవడంతో సెక్యూరిటీ గార్డ్ ఇంటికి వెళ్లాడు రఘురాం.ఎస్సై రఘురామ్‌ని చూసిన రాజు కాస్త కంగారు పడ్డాడు. ‘‘కంగారు పడకులే! చిన్న డౌట్ అడుగుదామని వచ్చాను’’‘‘చెప్పండి సారు!’’‘‘ఏం లేదు..! నీకు శత్రువులెవరైనా ఉన్నారా?’’‘‘పేదోడిని నాకెవరు శత్రువులుంటారు సారు? ఎందుకలా అడుగుతున్నారు?’’‘‘ఏం లేదు రాజు..! ఈ దొంగతనం కేసులో నువ్వు నిర్దోషివని తేలింది. ఆ దొంగలే మొత్తమంతా చేశారని అర్థమవుతుంది కానీ.. దొంగలు వదిలిపెట్టిన ఆ వజ్రపు నగ నీ దగ్గరే ఉందని నాకు ఫోన్ చేసింది ఎవరైయుంటారు?’’‘‘ఫోన్ చేశారా? ఓ.. అందుకే మీరు మా ఇంటిని తనిఖీ చేశారా?’’ ఆశ్చర్యంగా అడిగాడు రాజు. ‘‘అవును రాజు! కేసు క్లోజ్ అయినా ఇదే ఆలోచన నన్ను కుదురుగా ఉండనీయట్లేదయ్యా! నీకైతే శత్రువులెవరూ లేరా?’’ మరో సారి ప్రశ్నించాడు ఎస్సై రఘురాం.‘‘నాకు తెలిసైతే శత్రువులెవరూ లేరు సారు!ఆ దొంగనాయాళ్లే ఫోన్ చేసి చెప్పుంటారు సారు. కేసును తప్పుదారి పట్టించేందుకు!’’‘‘లేదయ్యా! వాళ్లెవ్వరూ కాదు! ఆ విషయం వాళ్లని కూడా అడిగాను’’‘‘మీరు అంతగా అడుగుతుంటే నాకో విషయం యాదికొస్తోంది సారూ!’’‘‘ఏంటయ్యా అది?’’‘‘ఆ కోహినూర్ గోల్డ్ షాపులో నాతో పాటు రాములు అని మరో సెక్యూరిటీ గార్డ్ ఉండేవాడు సారు! వాడు రాత్రేల సరిగా డ్యూటీ చేయకుంటే.. రెండు మూడు సార్లు వానరు సారు చేత తిట్టించినా. గా తర్వాత మా వానరు సారుకు విసుగొచ్చి వాడ్ని జాబు నుంచి తీసేసినారు. వాడు గిట్లా ఏమైనా నాపై పగబట్టిండేమో సారూ!’’ అన్నాడు రాజు కాస్త గట్టిగా.‘‘హా.. అయ్యుండొచ్చు. అతడే ఎవరిచేతైనా ఫోన్ చెయ్యించుండొచ్చు. సరేలే నువ్వు జాగ్రత్తగా ఉండు!’’అంటూ విషయాన్ని పెద్దది చేయకుండా ఎస్సై అక్కడ నుంచి కదిలాడు.ఎస్సై అక్కడి నుంచి కదలగానే ఓ విజేతలా నవ్వాడు రాజు. ‘నాకు శత్రువులెవరుంటారు!? గా ఫోన్ చేసింది నేనే. నాకు బ్రెయిన్ ట్యూమర్ అని ముందే తెలుసు. నాకు షోరూమ్‌లో వజ్రపు నగ కాలికి దొరకగానే ఓ పాత హిందీ సినిమా గుర్తొచ్చింది. ఆ సినిమాలో హీరోకి ఏదో పెద్ద జబ్బు వస్తుంది. దాన్ని తగ్గించుకోవడానికి చేతిలో చిల్లిగవ్వ ఉండదు. అందుకే ఎవరో చేసిన నేరాన్ని తనపైన వేసుకుని జైలుకెళ్లి ప్రభుత్వ డబ్బుతో ఆపరేషన్ చేయించుకుంటాడు. పూర్తిగా బాగైన తర్వాత జైలు నుంచి పారిపోయి నేరం చేసిన వాడిని తీసుకొచ్చి పోలీసులకు అప్పగిస్తాడు. ఆ సినిమానే నేనూ ఫాలో అయ్యాను! లేకుంటే పేదవాడినైన నాకు ఎవడు సాయం చేస్తాడు?’ అనుకుంటూ తనలో తాను నవ్వుకుంటూనే ఉన్నాడు. - మహబూబ్ బాషా -
ఆభరణాల దుకాణంలో చోరీ
పాలకొండ, న్యూస్‌లైన్: పాలకొండ పోస్టాఫీస్ ఎదుట ఉన్న శ్రీసాయిగణేష్ జ్యూయలరీలో మంగళవారం తెల్లవారు జామున చోరీ జరిగింది. కొంతమేర బంగారంతో పాటు అరకేజీ వెండి అపహరణకు గురైందని దుకాణం యజమాని పొట్నూరు నాగేశ్వరరావు తెలిపారు. షాపు షట్టర్‌ను విరగ్గొట్టి..తాళాలను పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఘటనా స్థలిని డీఎస్పీ దేవానంద్‌శాంతో, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్.హెచ్.విజయానంద్, ఎస్సై ఎం.వినోద్‌బాబు సందర్శిం చారు. దొంగతనంపై ఆరా తీశారు. అయితే రాత్రిపూట గస్తీ తిరుగుతుండగా అనంతరావు అనే హోంగార్డు దృష్టిలో నలుగురు యువకులు పడ్డారని..వారిని వెంబడించినా..తప్పించుకున్నారన్న విషయాన్ని తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. క్లూస్ టీమ్ కూడా సందర్శించి వివరాలు సేకరించింది. కాగా నడిబొడ్డున పోస్టాఫీస్ రోడ్డులో ఆభరణాల దుకాణం చోరీకి గురవ్వడంతో వ్యాపార వర్గాల్లో అలజడి నెలకొంది.