సుజాతనగర్: జ్యూయిలరీ షాపు పక్కనే ఉన్న రూంలోకి అద్దెకి దిగి.. రాత్రి పూట షాపు, గదికి మధ్య ఉన్న గోడకు రంధ్రం చేసి లోనికి ప్రవేశించి బడా చోరీకి పాల్పడ్డ ఉదంతమిది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌లో ఆదివారం వెలుగు చూసిన ఈ ఘటన వివరాలిలా.. కొత్తగూడెంకు చెందిన అలువాల శంకర్ సుజాతనగర్‌లోని రవి కాంప్లెక్స్‌లో తొమ్మిదేళ్లుగా బంగారు నగల దుకాణం నిర్వహిస్తున్నాడు.
సదరు దుకాణం ప్రక్కన ఓ గది ఖాళీగా ఉండడంతో ఇద్దరు వ్యక్తులకు గత నెల 26న కాంప్లెక్స్ యజమాని అద్దెకు ఇచ్చారు. ఈక్రమంలో గత నెల 31న శంకర్ వ్యక్తిగత పనులపై హైదరాబాద్‌కి వెళ్లాడు. దీంతో ఇదే అదనుగా భావించిన ఆ ఇద్దరు దుండగులు షాపు, గదికి మధ్య ఉన్న గోడకు రంధ్రం చేసి లోనికి ప్రవేశించారు. లోపల ఉన్న సీసీ కెమెరాల వైర్లు తొలగించి గ్యాస్ కట్టర్ సాయంతో లాకర్‌ను కట్ చేశారు. దాంట్లో ఉన్న 42 కిలోల వెండి, 1,242 గ్రాముల బంగారం.. మొత్తంగా రూ.87లక్షల విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లారు.
ఆదివారం ఉదయం వచ్చిన దుకాణ యజమాని శంకర్ చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. చుంచుపల్లి సీఐ రమాకాంత్, క్లూస్ టీం బృందం చేరుకుని పరిశీలించగా మరో సీసీ కెమెరా ఉన్న విషయాన్ని గుర్తించారు. ఈ పుటేజీని పరిశీలించగా 1వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో చోరీ చేసి కారులో పారిపోయినట్లు తేలింది. నగదు దుకాణంలో చోరీ కోసమే దుండగులు గది అద్దెకు తీసుకున్నారని, కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment