![Burglars Fleeing Gold Shop In Mysore - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/24/amrut.jpg.webp?itok=4AXHNlbU)
మైసూరు: పర్యాటక రాజధాని నగరం మైసూరులో పట్టపగలు దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఒక నగల దుకాణంలోకి చొరబడి దోపిడీకి పాల్పడిన దుండగులు ఒకరిని కాల్చి చంపారు. సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో విద్యారణ్యపురలో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానిక అమృత్ జ్యువెల్లరీ షాపునకు రెండు బైకులపై సుమారు ముగ్గురు– నలుగురు వ్యక్తులు వచ్చారు. లోపలికి ప్రవేశించిన వెంటనే షట్టర్‌ను మూసేసి దుకాణం యజమాని ధర్మేంద్రను పిస్టల్‌తో బెదిరించి అతని కాళ్లు, చేతులు కట్టేసి నోట్లో బట్టలు కుక్కారు.
బంగారు నగలను బ్యాగుల్లో నింపుకుంటుండగా, అటువైపుగా వచ్చిన ధర్మేంద్ర బంధువు శరత్ చంద్ర షాపు షట్టర్ మూసి ఉండడం చూసి అనుమానంతో తెరవాలని యత్నించాడు. లోపలి నుంచి దుండగులు అతన్ని తుపాకీతో బెదిరించగా గట్టిగా కేకలు వేశాడు. దొంగలు తుపాకీతో కాల్పులు జరపడంతో శరత్ చంద్ర తప్పించుకోగా అతని వెనుకే ఉన్న చంద్రు (23) అనే సమీప బంధువు తలకు తూటా తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. ఇంతలో దొంగలు బంగారం దోచుకుని తమ బైక్‌లపై పరారయ్యారు. కొంతసేపటి తర్వాత అక్కడికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ సాయంతో ముమ్మరంగా దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment