సాక్షి, మైసూరు: ఆ ఇంటికి వస్తూ పోతూ నమ్మకంగా వ్యవహరించారు.. తరచూ వ్యాపార విషయంగా మాట్లాడేవారు. అదును చూసి అదే ఇంటికి కన్నం వేసి మొత్తం ఊడ్చుకుని పోయిన సంఘటన మైసూరులోని బన్ని మంటప లేఔట్‌లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 23 లక్షల నగదు, రూ.6 లక్షల విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం రియాజ్ షరీఫ్, ఫయాజ్ షరీఫ్‌లు తండ్రి కొడుకులు. స్థానికంగా ఉండే మండి మోహల్లా పట్టెంగావ్ వీధిలో నివాసముంటున్న ఓ వ్యాపారితో తరచూ రియాజ్, ఫయాజ్‌లు వ్యాపారం పేరుతో కలుస్తూ ఉండేవారు.
నమ్మకంగా నటిస్తూ ఆ ఇంట్లో ఎవరికి అనుమానం రాకుండా వ్యవహరించేవారు. ఈ క్రమంలో గత నెల 31న సదరు వ్యాపారి కుటుంబం మొత్తం పని నిమిత్తం మేలుకోటే వెళ్లారు. అదే సమయంలో తండ్రీకొడుకులు వ్యాపారి ఇంటి వద్దకు వచ్చి చూడగా తాళం వేసి ఉంది. ఇదే అదునునగా భావించిన వారు 31 అర్థరాత్రి ఇంటి తాళం పగులగొట్టి లాకర్‌లో ఉన్న రూ. 23 లక్షలు, రూ. 6 లక్షల విలువైన నగలు ఎత్తుకెళ్లారు. మరుసటి రోజు వచ్చిన వ్యాపారి కుటుంబం చోరి విషయం గుర్తించి పోలీసులుకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన విచారణ చేపట్టి సోమవారం నిందితులను అరెస్టు చేశారు. చోరీ చేసిన నగదును స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment